27, మే 2011, శుక్రవారం

ముఖ్యమైన అతి కొన్ని, ముఖ్యము కాని మిగతా అన్ని = మీకు తెలుసా?


సృష్టిలో ముఖ్యం కానిదేదీ లేదు.

ప్రపంచంలో ఉన్నవన్నీ ముఖ్యమే. జరిగేవన్నీ ముఖ్యమే. 

అణువు  నుండి గాలెక్సీ వరకు - ఎంత చిన్న వైనా సరే, ఎంత పెద్ద వైనా సరే - వాటి వాటి ప్రాముఖ్యత వాటి వాటి కుంది.

బ్రహ్మాండంలో జరిగే చర్యలే - అణువు లోనూ జరుగుతున్నాయి. రెండూ ముఖ్యమే.

అయితే, మనిషి జీవితంలో - అన్నిటికీ , యిటువంటి, సమమైన ప్రాముఖ్యత లేదు. కొన్నిటికి చాలా ప్రాముఖ్యత వుంటుంది. కొన్నిటికి చాలా తక్కువ ప్రాముఖ్యత వుంటుంది. .

మీ జీవితంలో - మీకు చాల ముఖ్యమైన సంఘటనలనో, సంభాషణలనో, వ్యక్తులనో - గురింఛి చెప్పమంటే, మీరు చాలా కొద్ది సంఘటనలను, చాలా  కొద్ది సంభాషణలను, చాలా తక్కువ మంది వ్యక్తులను గురించి వుదాహరిస్తారు.
మీరే కాదు. మనుషులు ఎవరైనా అంతే.

మిగతావి - మీకు అస్సలు గుర్తుండకుండా వుండచ్చు కూడా. 

దీన్ని గురించి అధ్యయనం చేసిన డాక్టర్ జోసెఫ్ యమ్ జూరాన్ అనే ఆయన "ముఖ్యమైన అతి  కొన్ని, ముఖ్యము కాని మిగతా అన్ని - అని వొక సూత్రాన్ని ప్రతి పాదించాడు.   దీన్ని మరింత అధ్యయనం చేసి - ఆయన - మరొక సుప్రసిద్ధ ఆర్ధిక శాస్త్ర వేత్త , విల్ఫ్రెడ్ పెరే టో , పేరు మీద, 80 : 20  అనే వొక సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు.

ఏ విషయం లో నైనా - మొత్తము వంద శాతం అనుకుం టే - అందులో మఖ్యమైనవి యిరవై శాతం; ముఖ్యం కానివి ఎనభై శాతం అని ప్రతిపాదించాడు. 

ఈ యిరవై ; ఎనభై శాతాలు కాస్త రెండు, మూడు, పది శాతాలు కూడా -   అటూ ఇటూ మారినా -    మొత్తం  పైన, ఈ సిద్దాంతం ప్రభావం చాలా విషయాలలో వుందనేది మాత్రం - బాగా తెలుస్తూ వుంది.మౌలికమైన ఈ సిద్దాంతం వొక ప్రక్క నుంచితే -  అనేకానేక రంగాలలో - "ముఖ్యమైనవి కొన్ని - ముఖ్యము కానివి మిగతా అన్నీ" - అనేది మాత్రం మన జీవితాలలో కూడా మనం చూడొచ్చు.

ఈ క్రిందివి బాగా గమనించండి :

1 .  మీరు  చేసే పనులలో, 20 శాతం పనులు - మీకు  వచ్చే ఫలితాలలో - ఎనభై శాతం వరకు తెచ్చి పెడతాయి. మిగతా పనులు - చాలా తక్కువ ఫలితాలనిస్తాయి. ఇది - మీ జీవితంలో మీరే బాగా గమనించాల్సిన విషయం.

అంటే - ఏ యిరవై శాతం పనులు, మీకు ఎక్కువ ఫలితాలనిస్తాయో -  మీ  దృష్టి, వాటిపై ఎక్కువ కేంద్రీకరించాలన్న మాట.అప్పుడు - మీకు వచ్చే ఫలితాలు  మరి కాస్త పెరిగే అవకాశమూ వుంది. మీ  పని సామర్థ్యం, ఫలితాల శ్రేష్టత   రెండూ కూడా బాగా పెరుగుతుంది.

మరి - యిప్పుడు కూడా, యిరవై : ఎనభై సిద్దాంతం  పనికొస్తుందా? తప్పకుండా.  పెరిగిన శ్రేణి లేదా శ్రేష్టత తరువాత -  ఈ శాతాలు, క్రొత్త పనులు, ఫలితాలపై మళ్ళీ తమ ప్రభావం చూపుతుంది. అయితే, యిప్పుడు, తక్కువ ఫలితాల నిచ్చే ఎనభై  శాతం పనులు కూడా - ముందటి ఎనభై  శాతం కంటే ఉన్నతం గా వుంటాయి. 

అదే మాదిరి - ముందు  - ఎక్కువ ఫలితాలనిస్తోన్న - యిరవై శాతం పనులు కూడా - యిప్పుడు, యింకా ఎక్కువ ఫలితాలనిస్తుంది. మొత్తంమీద, మీకు ముఖ్యమైన యిరవై  శాతం పనులు , నైపుణ్యాల మీద, మీరు శ్రద్ధ వహిస్తే - మీకు వచ్చే ఫలితాలు చాలా ఎక్కువ అయ్యే ఆవకాశం వుంది. 

ఉదాహరణకు - మీ ఆరోగ్యం - ముఖ్యమైన  యిరవై శాతంలో  కూడా - మొట్ట మొదట వస్తుంది. దీన్ని మీరు తప్పక గమనించాలి.  మీ కేదైనా, గొప్ప లక్ష్యము వుందనుకోండి . అది - మే ఆరోగ్యం తరువాత ముఖ్యమైనది గా మీరు అనుకోవచ్చు.  దీని తరువాత - మీ కుటుంబ సౌఖ్యము, మీ ఆర్ధిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, మీరు పెంచుకోవలసిన  నిపుణతలు (స్కిల్ సెట్) - యివన్నీ వస్తాయి. ఇలా, మనం, మన ముఖ్యమైన యిరవై శాతం పనులను జాగ్రత్తగా ఎన్నుకుంటే - జీవితంలో - ఆరోగ్యంగానూ వుంటాము. మన లక్ష్యాలనూ  సాధిస్తాము. కుటుంబాన్నీ బాగా చూసుకుంటాము. ఆనందంగా వుంఢగలము.

మనకు ముఖ్యమైన దేదో మనకు తెలిసి వుండడం - మన జీవితంలో - చాలా, చాలా ముఖ్యమైన అంశం. 

పరీక్షల సమయంలో - ఎక్కువగా సినిమాలు చూసేవారికీ, జీవితమంతా, త్రాగడంలో గడిపేవారికీ, ఇటువంటి చాలా మందికి  -   ఇది తెలియదన్నది తెలుస్తూనే వున్నది కదా.  



2 . మీకు తెలిసిన వారిలో - యిరవై, లేదా అంత కంటే తక్కువ శాతం మంది మాత్రమే - మీకు ముఖ్యమైన వారు. మీ జీవితం పైన తమ ప్రభావం కలిగిన వారు.మీరు, మీ సంబంధ బాంధవ్యాల శ్రేష్టతను మెరుగు పరుచుకోవలిసింది ముఖ్యంగా వీరి తోనే. 

మీరు ప్రతి ముఖ్యమైన దినంలోనూ - అభినందనలు, శుభాకాంక్షలు  (గ్రీటింగ్స్) ముఖ్యంగా, మరిచి పోకుండా చెప్పవలసింది వీరికే. 

మళ్ళీ - వీరిలో కూడా - మీరు యిరవై శాతం - అతి ముఖ్యమైన వారిని  గుర్తుంచుకుని - వారి విషయంలో - చాలా శ్రద్ధ తీసుకోవాలి. 

మీ - యిటువంటి పనులే - మీ జీవితంలో, మీకు  ఎనభై శాతం సత్ఫలితాలనిస్తాయి. 

ఉదాహరణకు - మీ భార్య/ భర్త పుట్టిన రోజు, మీ పెళ్లి   రోజు, మీ  తల్లిదండ్రుల, పుట్టిన రోజులు, వారి పెళ్లి రోజులు, మీ సంతతి, మీ చాలా, చాలా దగ్గరి స్నేహితులు, బంధువులు -  వీళ్ళకు ముఖ్యమైన రోజులు - యివి - మీరు మరిచి పోకూడదు. వారికి మీరు చెప్పే శుభాకాంక్షలలో -   క్రొత్తదనం, వైవిధ్యం, శ్రద్ధ అన్నీ కనిపించాలి.

మన జీవితంలో - మనకు - ఎవరు నిజంగా ముఖ్యమైన వారు - అన్న ప్రశ్న వొక్కొక్క సారి మనం చెప్పలేకపోతాము.

దీనికి - చిన్న నిబంధనలు  మనమే పెట్టుకుందాము.
(అ  ) మొదట - మీకు కష్ట సమయంలో స్వచ్చందంగా ఆదుకునే వారు, ఆదుకున్న వారు (వీరిని మీరెప్పుడూ మరిచి పోకూడదు)   

(ఆ ) మిమ్మల్ని అభిమానించేవారు, ప్రేమించేవారు, వాత్సల్యంగా చూసేవారు. 
మీరు ప్రేమించే / అభిమానించే వారి కంటే - మిమ్మల్ని ప్రేమించే/అభిమానించే వారే - మీ జీవితానికి ముఖ్యం - అని మీ జీవితంలో అడుగడుగునా మీకు తెలుస్తుంది.

(ఇ ) మీరు అభిమానించే వారు; ప్రేమించేవారు; వాత్సల్యంతో చూసే వారు. 
వీరూ ముఖ్యమే. కారణం లేకుండా, మీరు ప్రేమించరు; అభిమానించరు. కానీ - యిక్కడ, అవతలి వారి మనస్సులో, మీ పట్ల-, మీకు వారి పట్ల ఉన్నంత గాఢత, తీవ్రత, లోతు  లేదు / లేక పోవచ్చు. యిది - మీరు గమనించడం లేదు. మీకు నిజంగా ఎవరు ముఖ్యమో మీకు తెలియడం లేదు. 
భార్య/ భర్త కంటే - సినీమా హీరో, హీరోయిన్ల వెనుకో , మరెవరి వెనుకో పిచ్చిగా తిరిగే వారు, ఇది ముఖ్యంగా గమనించాలి.  
గురువు పట్ల, గొప్ప వారి పట్ల అభిమానం మీకు వుండచ్చు - కాని - రెండవ శ్రేణి వారిని , అంటే, మిమ్మల్ని అభిమానించే వారిని - మీకు అడుగడుగునా సహాయ పడే వారిని, మీరు మరిచిపోకూడదు. 

ఉదాహరణకు - మీ భార్య/ భర్త ఆరోగ్యం బాగా లేదు. మీరు వారిని, డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలి. కాని, ఈ రోజు మీ గురువుగారి ప్రసంగం వొకటి వుంది. లేదా, మీకు యిష్టమైన వారి పుట్టిన రోజు పండుగ వుంది. మీరేం చేస్తారు? 

మీకు - ముఖ్యమైన వారిలో - అతి ముఖ్యమైన వారు మీ భార్య / భర్త. మీరు వారి ముఖ్యావసరాలనే మొదట గమనించాలి. మరెవరైనా - వారి (ముఖ్యావసరాల)తరువాతే.   యిది మరిచి పోయిన వారు - జీవితంలో - తప్పకుండా, తప్పటడుగులు వేస్తారు. వాటి దుష్ఫలితాలనూ  అనుభవిస్తారు.

భర్త కంటే - తమ తల్లిదండ్రులకో  , అక్క చెల్లెళ్లకో ప్రాధాన్యత నిచ్చే భార్యలూ వున్నారు. భార్య కంటే - మిగతా వారికి ప్రాధాన్యత నిచ్చే  భర్తలూ వున్నారు. వీళ్ళు జీవితం నరకప్రాయంగా అవుతున్నా - తమ తప్పు - చాలా చాలా ఆలస్యంగానే తెలుసుకుంటున్నారు. 

మీ జీవితంలో - ఎవరు మీకు అతి ముఖ్యం అనేది మీరు (భార్యాభర్తలిద్దరూ)  గుర్తుంచుకోవాలి. యిది వొక ఉదాహరణ మాత్రమే.మీ, మీ జీవితాలలో శ్రద్ధగా వెతుక్కుంటే - మీకు నిజంగా ముఖ్యమైన వారిని వదిలి - ముఖ్యం కాని వారికి, మీరు ముఖ్యత్వము నివ్వడం మీకే తెలుస్తుంది. యిది మార్చుకోవాల్సిన అవసరం వుంది.

(ఈ ) పై మూడు రకాల వారి క్రింద - మీ వ్యాపారాలకు, ఉద్యోగాలకు మీకు ముఖ్యమైన వారిని చేర్చండి.  వారినెలా గమనించాలో - అలా గమనించండి. 

ముఖ్యమైన యిరవై శాతం మనుషులెవరో మీకు గుర్తుండాలి. మీరు వారిపై - తగినంత శ్రద్ధ చూపించాలి. 
మిగతా  వారిపై చూపించే శ్రద్ధకూ , ముఖ్యమైన వారిపై చూపించే శ్రద్ధకూ -  తారతమ్యం  తప్పక వుండాలి.

(3 ) మీకు, మీ లక్ష్య సాధనలో  విజయాన్ని చేకూర్చే పనులు - మీ మొత్తం పనులలో - యిరవై శాతం మాత్రమే. ఇది కూడా, పైలాగే, గమనించి, ఏం చెయ్యాలో, నిర్ణయించుకోండి . 

(4 ) మీకు - బాగా ఉపయోగ పడుతున్న కాలం, మీ మొత్తం కాలములో - యిరవై శాతం మాత్రమే. ఏ కాలం మీకు బాగా ఉపయోగ పడ గలదో - ఆ కాలాన్ని, మీ లక్ష్య సాధనకు కేటాయించండి. 

(5 ) మీరు చదువుకొన్న దానిలో, మీకు తెలిసిన దానిలో - యిరవై శాతం మాత్రమే - మీకు బాగా ఉపయోగ పడుతున్నది. దాన్ని మరింత బాగా పెంచుకోండి. ఆ యిరవై శాతం పెరిగేకొద్దీ - మీ ప్రయత్నాలు, మరింత విజయ వంతం అవుతాయి.

(6 ) మీరు ఖర్చు పెట్టె డబ్బులో - మీకు బాగా ఆనందం చేకూర్చేది, ఉపయోగ పడేది - యిరవియా శాతం మాత్రమే. వెతి ఖర్చు మీకు బాగా ఆనందం యిస్తోం దో - అది గమనిస్తే - మీ డబ్బును, మరింత సార్థకంగా ఉపయోగించ వచ్చు.

(7 )   మీ దగ్గరున్న - మరొక గొప్ప ఆస్తి - మీ "మాట" . 

మీరు మాట్లాడే మాటలలో, మీకు మీ వారికీ, మీ చుట్టూ వున్నా వారికీ, బాగా ఆనందం చేకూర్చేది - యిరవై  కాదు కదా. పది శాతం కూడా వుండదు. మరో పది శాతం మాటలు - వున్న ఆనందాన్ని తీసేస్తూ కూడా వుంటాయి. దీన్ని   మీరు బాగా గమనించాలి. అధ్యయనం చేయాలి. 

మీ భార్య / భర్త కు - నిజంగా ఆనందాన్నిచ్చే మాటలు మీరు మాట్లాడి - ఎన్ని నాళ్ళు అయ్యిందో    - చెప్పగలరా? మీ కొడుకునో, కూతురినో - మీరు పొగిడి ఎన్ని నాళ్ళు అయ్యిందో? మీ అమ్మ, నాన్నలతో - ప్రేమ పూర్వకంగా మాట్లాడిం ది ఎప్పుడు?  అలా - మీకు దగ్గరైన వారిని గూర్చి - మీ మాటలను గూర్చి యోచన చేసి చూడండి? మీరు చేయనివి, మాట్లాడని, సంతోషం కలిగించే మీ మాటలు - వెంటనే మాట్లాడేసేయంది. ఆలస్యం వద్దు. యిక ముందు, ఈ మాటలను - కాస్త పెంచండి.

అలాగే - వీరికి (యితరులకు కూడా) బాధ కలిగించిన మాటలేవైనా మీరు మాట్లాడి వుంటే -  వీరిని మరి కాస్త సంతోష పెట్టె మాటలు వెంటనే, ఆలస్యం చెయ్య కుండా, చెప్పండి. యికపై - బాధ కలిగిం చే మాటలేవీ - మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకొండి. 
యిలా - మీ జీవితానికి - ముఖ్యమైన కొన్నిటిని - మీరు బాగా చూసుకుంటే,  ముఖ్యం కాని వాటి ప్రాముఖ్యత తగ్గించుకుం టే -  మీ జీవితం ఆనంద మాయమౌతుంది. సఫలమౌతుంది. 

=  మీ


వుప్పలధడియం విజయమోహన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి