30, మే 2011, సోమవారం

దేవుడి అంగడి


దేవుడి అంగడి కి  - మనం రోజూ వెడుతుంటాము. 

దేవుడి అంగడి మొబైల్ షాప్ లాంటిది. మీరు అనుకోగానే - మీ ముందుకు వచ్చేస్తుంది. 
దేవుడి అంగడిలో చాలా వున్నాయి.

చాలా వస్తువులు,  యిప్పుడు తీసుకెళ్ళి తరువాత , తీరికగా, యివ్వాల్సిన మూల్యం చెల్లించవచ్చు.

జీవితంలో వొక సారి (సాధారణంగా వొక్క సారే)  - వొక భార్యనో , భర్తనో కొనుక్కోవచ్చు.  దీనికి - మూల్యం దేవుడికి చెల్లిం చక్కర్లేదు. కొనుక్కున్న భార్యకో, భర్తకో, మీరే తప్పక చెల్లిస్తారు.

ఈ వొక్క వస్తువు (భార్య లేదా భర్త) కు మాత్రం - మీరు వొకటి కొనుక్కుంటే - మరో వొకటో , రెండో అదనపు వస్తువులు (పిల్లల రూపంలో ) - దేవుడే మీకు  ఇస్తాడు. వాటికీ - మీరు మూల్యం దేవుడికి  చెల్లించవలసిన అవసరం లేదు. ఆ పిల్లలకే మీరు చెల్లిస్తారు.

దేవుడి షాపు లో సంతోషం వుంది. అది అడిగారనుకోండి. దేవుడు మీలో నుండే తీసి, మీకే యిస్తాడు. 
దుహ్ఖం - మీకెంత కావాలంటే అంత మీరు కొనుకోవచ్చు.   అది ఫ్రీ. దానికి మూల్యం అదే.

మీరు ఏది తీసుకున్నా - దానితో బాటు - ఫ్రీ గా వచ్చే వస్తువులు చాలా వున్నాయి - దేవుడి అంగడిలో.

సంతోషం తీసుకుం టే ఆరోగ్యం వస్తుంది. 

దుహ్ఖం తీసుకుంటే రోగం వస్తుంది.

భార్య / భర్త సరిగ్గా ఎంపిక చెసుకుం టే - మీరూ వారికి సరిగ్గా వుం టే - మీకు - మహా సంతోషం , మహా ఆరోగ్యం  వస్తుంది.

సరిగ్గా ఎంపిక చేయకుంటే - లేదా, మీరు వారికి సరిగ్గా లేకుంటే - మీకు సకల దుహ్ఖ  , రోగ ప్రాప్తి రస్తు!!

పని - తీసుకుంటే -  వృద్ధి వస్తుంది. 
సోమరితనం తీసుకుంటే - కష్టాలు, దుహ్ఖాలు  , రోగాలు, తిట్లు - అన్నీ వస్తాయి.

బుద్ధి తీసుకుం టే - ఆనందం వస్తుంది. ఆత్రం తీసుకుంటే - కష్టం వస్తుంది.

భయం తీసుకుంటే - శత్రువులు, రోగాలు ;

ధైర్యం తీసుకుంటే - మిత్రులు, సుఖాలు 
  
కామం తీసుకుంటే - అపఖ్యాతి

క్రోధం తీసుకుంటే - శత్రువులు, అపఖ్యాతి, రోగాలు - లాంటివి చాలా, చాలా, 
లోభం తీసుకుంటే  - డబ్భున్నా - అనుభవించలేని - దురదృష్టం 
మోహం తీసుకుంటే - బుద్ధి నాశనం

మదం తీసుకుంటే - వొంటరితనం, ఎప్పుడూ సంతోషం    లేని తనం 
మాత్సర్యం తీసుకుంటే - శత్రువులు 

ప్రేమ తీసుకుంటే  - దేవుడే అదనపు వస్తువు గా మనతో వచ్చేస్తాడు.

ఆదరణ , వాత్సల్యము  తీసుకుంటే - మనుషులంతా- మన తోనే 

చెట్లు తీసుకుంటే - ఆక్సిజను, పండ్లు, పూలు ఆరోగ్యము...

యిలా - ఎన్నో, ఎన్నెన్నో..

దేవుడి  అంగడిలో - 

ఆకాశపు అందం ఫ్రీ. ఇంద్ర ధనుస్సు రంగుల  అద్భుతం ఫ్రీ. సముద్రము అలలు ఫ్రీ.

నదీ తీరాలు ఫ్రీ. చెట్లలో పూలు ఫ్రీ. 

సంతోషం ఫ్రీ. ఆనందం ఫ్రీ. అవి చూడగలిగే మనస్సు ఫ్రీ. 

మీరు ఫ్రీగా వుంటే.  .  .  .  .  . 

= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

పిచ్చి కుక్క కరిచిందంటే

పిచ్చి కుక్క కరిచిందంటే  - వీధి కుక్కైనా, మరే కుక్కైనా కరచిందంటే  - రాబీస్ రాకుండా ఏం చెయ్యాలి?

ఈ మధ్య కుక్క కాటును గురించి తరచు వింటున్నాము . పిచ్చి  కుక్క ఊర్లోని - పది మందినో, పధ్నాలుగు మందినో -   కరిచిందని, ఊర్లోని డాక్టర్ల దగ్గర, ఆస్పత్రిలో కూడా - "ఆంటీ రాబీస్ వాక్సీన్" లేదని - చాలా వార్తలు వస్తున్నాయి.  ముఖ్యంగా - ఆంధ్ర ప్రదేశ్ గురించి   మరీ - ఎక్కువగా వస్తున్నాయి. మీరు ఎన్నిటికో ధార్నాలు లాంటివి చేస్తున్నారు. మీకు ఆంధ్రా  వచ్చినా , తెలంగాణా వచ్చినా మీ వూళ్ళో - పిచ్చికుక్కలుంటే  మాత్రం  - మీకు నరకమే!! 

మొదట - మీ వూళ్ళో  - ప్రతి  ప్రభుత్వ  ఆస్పత్రిలోనూ, ప్రతి డాక్టరు దగ్గరా - సరిఅయిన పద్ధతిలో (ఫ్రీజర్)  లో ఉంచబడిన, అంటి-రాబీస్ వాక్సీను వుండేటట్టు చూసుకోండి. దానికోసం మీరేమేం చెయ్యాలో  - అవన్నీ చెయ్యండి. 

సరే. మన రాష్ట్రంలో - నకిలీ మందుల అమ్మకం ఎక్కువేనని - అడపా దడపా వార్తలు వస్తూనే వున్నాయి. నకిలీ వాక్సీను వేసుకున్నా వొకటే, వేసుకోక పోయినా వొకటే.

మన రాజకీయ నాయకులకు - ప్రజలకు - నిజంగా ముఖ్యమైన యిటువంటి సమస్యలేవీ పట్టవు. యివి సులభంగా - చేయగలిగేవి. యివి మీరైనా చెయ్యాలి. మీ నాయకుల చేతైనా చేయించాలి.   మీ వూళ్ళో - వెంటనే నకిలీ మందుల అమ్మకాలు పూర్తిగా - నిలిచిపోయేటట్టు చేయండి. మనకు పనికి రాని రాజకీయాలు చేసే రాజకీయ సంఘాలు ఎన్నో వున్నాయి. కాని, మనిషి నిత్య జీవితాన్ని గురించి పట్టించుకునే - సంఘాలు చాలా తక్కువ.

నిజంగా రాబీస్ చాలా ప్రమాద కరమైన వ్యాధి. దాని వాక్సీను మీ వూర్లో లేదంటే - అది ప్రభుత్వం యొక్క వైఫల్యం గానే భావించాలి. సంబంధిత వైద్య అధికారుల వైఫల్యం గానే భావించాలి. కాబట్టి - ఈ వాక్సీను మీ వూరికి వెంటనే వచ్చే ఏర్పాట్లేవో చూడండి. 

ముఖ్యమైనది  - మీ వూళ్ళో - కనీసం వీధి  కుక్కల - ముఖ్యంగా పిచ్చి కుక్కల - భయం లేకుండా, ముందు జాగ్రత్త వహించండి.  వీధి కుక్కలు తినే లాంటి పదార్థాలు - మీ వీధిలో లేకుండా చూసుకోండి.

ఈ కుక్క కాటును గురించి -సమగ్రమైన సమాచారాన్ని, నా మరో బ్లాగ్ లో , ఆంగ్లంలో రాయడం జరిగింది. 

చదువరులు - దీన్ని - యు ఆర్ యల్  :  "http://wiselivingideas.blogspot.com/2010/09/fear-of-dog-bites-prevention-firsat-aid.html"    లో చదవొచ్చు. 

మీ యింట్లోనే - కుక్కను పెంచుతూ వుంటే - దానికి - సమయం తప్పకుండా వాక్సీను వేయించండి . యిది కుక్కకూ ముఖ్యమే. మీకూ ముఖ్యమే. దానికైనా, మీకైనా, రాబీస్ వస్తే - యిప్పటి వరకు సరైన మందులేవీ లేదు. రాకుండా మాత్రం - సులభంగానే చేసుకోవచ్చు. కుక్కను పెంచే వారు - తప్పకుండా కుక్కకు వాక్సీను సమయం ప్రకారం వేయించండి. అప్పుడే మీరూ సురక్షితంగా వుంటారు. మీ కుక్కా బాగుంటుంది.

మీ యింటి కుక్కకైనా- పిచ్చి పట్టొచ్చు. కాబట్టి - గోటితో పోయే దానికి, గొడ్డలి వరకు తెచ్చుకోకండి. 
 
మీరు యింటి కుక్క చేత కరవబడినా కూడా - కుక్కనూ గమనించాలి - మిమ్మల్నీ గమనించాలని (పది రోజుల పాటైనా) చెబుతారు. యింటి కుక్క , ఎవరినైనా వొక సారి కరిస్తే - కరవ బడిన వారిని, కుక్కకు  దూరంగా వుంచండి.   అంటే - కుక్కను దూరంగా వుంచండి. కుక్కను - వెంటనే గొలుసుతో కట్టేయండి. దాన్ని బాగా గమనించండి. పిచ్చి పట్టిన, పట్టబోతున్న కుక్కకు - కరవాలనే ఆకాంక్ష చాలా ఎక్కువగా వుంటుంది. యిదే మనకు పెద్ద గుర్తు. 

వూరికే పోతున్న వారిని కుక్క కరిచిందంటే - ఆ కుక్కకు , పిచ్చి పట్టే (లేదా పట్టిన) అవకాశాలు ఎక్కువని మనం అర్థం చేసుకోవచ్చు.

వీధి కుక్కలకు వాక్సీను వేసే వారెవరూ లేరు. ఎండా, వానలకు పూర్తిగా బయటే వుంటుంది - యితర కుక్కలతో ఎల్లప్పుడూ కొట్లాడుతూ, కరుస్తూ, కరిపించుకుంటూ  వుంటుంది. కాబట్టి - వాటికి పిచ్చి పట్టే అవకాశాలు చాలా ఎక్కువ. పిచ్చి పట్టిన కుక్కలను - మీరు చేతులతో తాకడమో - రాళ్ళు విసరడమో చేస్తే - అది తప్పక కరుస్తుంది. మిమ్మల్ని కాకుంటే - మరొకరిని.  కాబట్టి -  అది "ఎవరినీ" కరవకుండా" చేయడమే - మంచిపద్ధతి. 

మునిసిపాలిటి వాళ్ళను  పిలిచి - మీ ప్రాంతంలో వీధి కుక్కలు లేకుండా చేయమని చెప్పండి. వారికి - మీ లిఖిత డిమాండు కూడా యివ్వండి. అందులో - ప్రతి వొక్కరు - మీ సంతకం తప్పకుండా  చెయ్యండి. 
కుక్క కరిచిందంటే - అది కరిచిన (మన) దేహభాగాన్ని - మెత్తటి  గుడ్డతో తుడిచి దాని నోటి వుమ్మిని పూర్తిగా తీసేయ్యాలి. ఆ వుమ్మిలో - రాబీస్ సూక్ష్మ జీవులు వుంటాయి. తరువాత, ఆ భాగాన్ని వెంటనే, నీటితో, వీలైతే  పైపు నీటితో, - అం టే పారే నీటితో  , మంచి అంటీ బాక్టీరియాల్   సోపుతో శుద్ధి చేస్తూ కడగాలి.  ఈ   విధంగా దేహంలో ప్రవేశించబోతున్న  బాక్టీరియా ను వీలైనంతగా బయటినుండే తీసేయ్యాలి.  యిదంతా - కరచిన "వెంటనే" చేసెయ్యాలి. 

తరువాత - వెంటనే - డాక్టరీ దగ్గర, "అంటీ - రాబీస్ - వాక్సీను" వేసుకోవాలి. 

యిది కుక్క కరచిన 1,3,7,14 and 28  దినాలలో (మొత్తం 5 ఇంజెక్షన్లు) తప్పకుండా - దినాలు తప్ప కుండా - తప్పక - వేసుకోవాలి.  ఆ దినాలలో, మీరు ప్రయాణాలు పెట్టుకుని, లేదా మీటింగులు లాంటివి పెట్టుకుని, వాక్సీను  వేసుకోవడం విడవకండి. యివి, క్రమం తప్పకుండా వేసుకుంటే - రాబీస్ వచ్చే ప్రమాదం లేదనే చెప్పొచ్చు. వేసుకోకంతే - మాత్రం - రాబీసు ప్రమాదం వుండనే వుంది.   వాక్సీను వేసుకోని వారికి - కుక్క కరిచిన తరువాత - రాబీసు ఎప్పుడైనా రావచ్చు. మూడు నాలుగు నెలల తరువాత కూడా రావచ్చు.  కాబట్టి, అశ్రద్ధ చేయకండి.

కుక్క కరచిన వెంటనే  - శుద్ధి (యింట్లోనే) చేసేసుకుని - వొక గంటలోగానే వాక్సీను వేసేసుకోవడం చాలా మంచిది. ఎంత త్వరగా వేసుకుంటే  అంత మంచిది. పైన చెప్పిన - రోజులలో - క్రమం తప్పకుండా వేసేసుకుని - భయం లేకుండా వుండండి.

యింటి కుక్క లాగా మనిషిపై విశ్యాసము, ప్రేమ  వుండే  జంతువులు లేదు. కాని, పిచ్చి పట్టిన కుక్క లాంటి ప్రమాదకరమైన జంతువులూ  లేవు. రాబీస్ లాంటి ప్రమాదకరమైన వ్యాధీలేదు.

కానీ - పై జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే ప్రమాదమూ లేదు.

= మీ

వుప్పలధడియం విజయమోహన్  

29, మే 2011, ఆదివారం

సృష్టి కర్త మీరే = విధ్వంస కర్త మీరే.


నిన్నటికీ , ఈ రోజుకీ మధ్య - మీలో ఏదో జరిగింది. మీరు మారి పోయారు. చాలా రకాలుగా మారారు.

అసలేం జరిగింది?

మీలో సంతోషం  పెరిగిందా ? తరిగిందా  ? 

మీ ఆరోగ్యం పెరిగిందా? తరిగిందా? 

మీ భార్యాభర్తల మధ్య అనుబంధం గట్టిపడిందా  ? సడలిందా ?

మీ పిల్లలకూ, మీకూ మధ్య - నిన్నటి కంటే - ఎక్కువ ప్రేమానుబంధాలు వచ్చాయా, లేదా? 

మీలో శక్తి పెరిగిందా? తరిగిందా? 

మీరేదైనా కొత్త విషయం, విద్య, నైపుణ్యత  నేర్చుకున్నారా ? లేదా?

సంఘంలో - మీ ప్రాముఖ్యం పెరిగిందా? తరిగిందా?
యివన్నీ పెరిగిందంటే  - మీరు నిన్నటి రోజు - సార్థకంగా గడిపారన్న మాట.

ఇవేవీ పెరగలేదంటే  - నిన్నటి రోజు - మీరేమీ చేయలేధనేగా!

యివి తరిగింటే - మీరు చేయ వలసిన పనులు చేయక, చేయకూడని పనులు - చేసినట్టేగా!  


మరి - ఈ రోజు  ఏం చేయబోతున్నారు?

వొక్కటి మాత్రం తప్పక జరుగుతుంది. 

మీ ఆయుర్దాయం వొక్క రోజు తరుగుతుంది. మీ వయసు వొక్క రోజు పెరుగుతుంది.

కానీ - మీ శక్తి పెరుగుతుందా లేదా? అది మీరు చేసే  పనుల పై ఆధారపడి వుంటుంది.

మీలో - లక్షల కొద్దీ జీవ కణాలు చని పోతాయి.

మళ్ళీ పెరుగుతాయా  లేదా?  - అది మీరు చేసే పనులపై ఆధార పడి వుంది. 

మీరు కొన్ని విషయాలు తప్పక మరిచిపోతారు. కొత్త విషయాలు నేర్చుకోవడం మీపై ఆధారపడి వుంది.
కొన్ని ప్రేమపూరితమైన మాటలు మాట్లాడితే - మీ సంబంధాలు - గట్టిపడతాయి.  కొన్ని, ద్వేష పూరితమైన మాటలు మాట్లాడితే - వున్న సంబంధాలు  సడలి పోతాయి. 

మీ ఆదాయాలు, ఆస్తులు తరిగించేది మీరే.  పెరిగించ గలిగేది మీరే.

మీ జీవితానికి - సృష్టి కర్త మీరే. విధ్వంస కర్త మీరే. 

మీరేం కావాలనుకుంటున్నారు  ? మీ...రు ...   ఏమి... కా..వా..ల..ను..కుం..టు..న్నా..రు..???




= మీ 


వుప్పలధడియం విజయమోహన్ 

27, మే 2011, శుక్రవారం

ముఖ్యమైన అతి కొన్ని, ముఖ్యము కాని మిగతా అన్ని = మీకు తెలుసా?


సృష్టిలో ముఖ్యం కానిదేదీ లేదు.

ప్రపంచంలో ఉన్నవన్నీ ముఖ్యమే. జరిగేవన్నీ ముఖ్యమే. 

అణువు  నుండి గాలెక్సీ వరకు - ఎంత చిన్న వైనా సరే, ఎంత పెద్ద వైనా సరే - వాటి వాటి ప్రాముఖ్యత వాటి వాటి కుంది.

బ్రహ్మాండంలో జరిగే చర్యలే - అణువు లోనూ జరుగుతున్నాయి. రెండూ ముఖ్యమే.

అయితే, మనిషి జీవితంలో - అన్నిటికీ , యిటువంటి, సమమైన ప్రాముఖ్యత లేదు. కొన్నిటికి చాలా ప్రాముఖ్యత వుంటుంది. కొన్నిటికి చాలా తక్కువ ప్రాముఖ్యత వుంటుంది. .

మీ జీవితంలో - మీకు చాల ముఖ్యమైన సంఘటనలనో, సంభాషణలనో, వ్యక్తులనో - గురింఛి చెప్పమంటే, మీరు చాలా కొద్ది సంఘటనలను, చాలా  కొద్ది సంభాషణలను, చాలా తక్కువ మంది వ్యక్తులను గురించి వుదాహరిస్తారు.
మీరే కాదు. మనుషులు ఎవరైనా అంతే.

మిగతావి - మీకు అస్సలు గుర్తుండకుండా వుండచ్చు కూడా. 

దీన్ని గురించి అధ్యయనం చేసిన డాక్టర్ జోసెఫ్ యమ్ జూరాన్ అనే ఆయన "ముఖ్యమైన అతి  కొన్ని, ముఖ్యము కాని మిగతా అన్ని - అని వొక సూత్రాన్ని ప్రతి పాదించాడు.   దీన్ని మరింత అధ్యయనం చేసి - ఆయన - మరొక సుప్రసిద్ధ ఆర్ధిక శాస్త్ర వేత్త , విల్ఫ్రెడ్ పెరే టో , పేరు మీద, 80 : 20  అనే వొక సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు.

ఏ విషయం లో నైనా - మొత్తము వంద శాతం అనుకుం టే - అందులో మఖ్యమైనవి యిరవై శాతం; ముఖ్యం కానివి ఎనభై శాతం అని ప్రతిపాదించాడు. 

ఈ యిరవై ; ఎనభై శాతాలు కాస్త రెండు, మూడు, పది శాతాలు కూడా -   అటూ ఇటూ మారినా -    మొత్తం  పైన, ఈ సిద్దాంతం ప్రభావం చాలా విషయాలలో వుందనేది మాత్రం - బాగా తెలుస్తూ వుంది.మౌలికమైన ఈ సిద్దాంతం వొక ప్రక్క నుంచితే -  అనేకానేక రంగాలలో - "ముఖ్యమైనవి కొన్ని - ముఖ్యము కానివి మిగతా అన్నీ" - అనేది మాత్రం మన జీవితాలలో కూడా మనం చూడొచ్చు.

ఈ క్రిందివి బాగా గమనించండి :

1 .  మీరు  చేసే పనులలో, 20 శాతం పనులు - మీకు  వచ్చే ఫలితాలలో - ఎనభై శాతం వరకు తెచ్చి పెడతాయి. మిగతా పనులు - చాలా తక్కువ ఫలితాలనిస్తాయి. ఇది - మీ జీవితంలో మీరే బాగా గమనించాల్సిన విషయం.

అంటే - ఏ యిరవై శాతం పనులు, మీకు ఎక్కువ ఫలితాలనిస్తాయో -  మీ  దృష్టి, వాటిపై ఎక్కువ కేంద్రీకరించాలన్న మాట.అప్పుడు - మీకు వచ్చే ఫలితాలు  మరి కాస్త పెరిగే అవకాశమూ వుంది. మీ  పని సామర్థ్యం, ఫలితాల శ్రేష్టత   రెండూ కూడా బాగా పెరుగుతుంది.

మరి - యిప్పుడు కూడా, యిరవై : ఎనభై సిద్దాంతం  పనికొస్తుందా? తప్పకుండా.  పెరిగిన శ్రేణి లేదా శ్రేష్టత తరువాత -  ఈ శాతాలు, క్రొత్త పనులు, ఫలితాలపై మళ్ళీ తమ ప్రభావం చూపుతుంది. అయితే, యిప్పుడు, తక్కువ ఫలితాల నిచ్చే ఎనభై  శాతం పనులు కూడా - ముందటి ఎనభై  శాతం కంటే ఉన్నతం గా వుంటాయి. 

అదే మాదిరి - ముందు  - ఎక్కువ ఫలితాలనిస్తోన్న - యిరవై శాతం పనులు కూడా - యిప్పుడు, యింకా ఎక్కువ ఫలితాలనిస్తుంది. మొత్తంమీద, మీకు ముఖ్యమైన యిరవై  శాతం పనులు , నైపుణ్యాల మీద, మీరు శ్రద్ధ వహిస్తే - మీకు వచ్చే ఫలితాలు చాలా ఎక్కువ అయ్యే ఆవకాశం వుంది. 

ఉదాహరణకు - మీ ఆరోగ్యం - ముఖ్యమైన  యిరవై శాతంలో  కూడా - మొట్ట మొదట వస్తుంది. దీన్ని మీరు తప్పక గమనించాలి.  మీ కేదైనా, గొప్ప లక్ష్యము వుందనుకోండి . అది - మే ఆరోగ్యం తరువాత ముఖ్యమైనది గా మీరు అనుకోవచ్చు.  దీని తరువాత - మీ కుటుంబ సౌఖ్యము, మీ ఆర్ధిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, మీరు పెంచుకోవలసిన  నిపుణతలు (స్కిల్ సెట్) - యివన్నీ వస్తాయి. ఇలా, మనం, మన ముఖ్యమైన యిరవై శాతం పనులను జాగ్రత్తగా ఎన్నుకుంటే - జీవితంలో - ఆరోగ్యంగానూ వుంటాము. మన లక్ష్యాలనూ  సాధిస్తాము. కుటుంబాన్నీ బాగా చూసుకుంటాము. ఆనందంగా వుంఢగలము.

మనకు ముఖ్యమైన దేదో మనకు తెలిసి వుండడం - మన జీవితంలో - చాలా, చాలా ముఖ్యమైన అంశం. 

పరీక్షల సమయంలో - ఎక్కువగా సినిమాలు చూసేవారికీ, జీవితమంతా, త్రాగడంలో గడిపేవారికీ, ఇటువంటి చాలా మందికి  -   ఇది తెలియదన్నది తెలుస్తూనే వున్నది కదా.  



2 . మీకు తెలిసిన వారిలో - యిరవై, లేదా అంత కంటే తక్కువ శాతం మంది మాత్రమే - మీకు ముఖ్యమైన వారు. మీ జీవితం పైన తమ ప్రభావం కలిగిన వారు.మీరు, మీ సంబంధ బాంధవ్యాల శ్రేష్టతను మెరుగు పరుచుకోవలిసింది ముఖ్యంగా వీరి తోనే. 

మీరు ప్రతి ముఖ్యమైన దినంలోనూ - అభినందనలు, శుభాకాంక్షలు  (గ్రీటింగ్స్) ముఖ్యంగా, మరిచి పోకుండా చెప్పవలసింది వీరికే. 

మళ్ళీ - వీరిలో కూడా - మీరు యిరవై శాతం - అతి ముఖ్యమైన వారిని  గుర్తుంచుకుని - వారి విషయంలో - చాలా శ్రద్ధ తీసుకోవాలి. 

మీ - యిటువంటి పనులే - మీ జీవితంలో, మీకు  ఎనభై శాతం సత్ఫలితాలనిస్తాయి. 

ఉదాహరణకు - మీ భార్య/ భర్త పుట్టిన రోజు, మీ పెళ్లి   రోజు, మీ  తల్లిదండ్రుల, పుట్టిన రోజులు, వారి పెళ్లి రోజులు, మీ సంతతి, మీ చాలా, చాలా దగ్గరి స్నేహితులు, బంధువులు -  వీళ్ళకు ముఖ్యమైన రోజులు - యివి - మీరు మరిచి పోకూడదు. వారికి మీరు చెప్పే శుభాకాంక్షలలో -   క్రొత్తదనం, వైవిధ్యం, శ్రద్ధ అన్నీ కనిపించాలి.

మన జీవితంలో - మనకు - ఎవరు నిజంగా ముఖ్యమైన వారు - అన్న ప్రశ్న వొక్కొక్క సారి మనం చెప్పలేకపోతాము.

దీనికి - చిన్న నిబంధనలు  మనమే పెట్టుకుందాము.
(అ  ) మొదట - మీకు కష్ట సమయంలో స్వచ్చందంగా ఆదుకునే వారు, ఆదుకున్న వారు (వీరిని మీరెప్పుడూ మరిచి పోకూడదు)   

(ఆ ) మిమ్మల్ని అభిమానించేవారు, ప్రేమించేవారు, వాత్సల్యంగా చూసేవారు. 
మీరు ప్రేమించే / అభిమానించే వారి కంటే - మిమ్మల్ని ప్రేమించే/అభిమానించే వారే - మీ జీవితానికి ముఖ్యం - అని మీ జీవితంలో అడుగడుగునా మీకు తెలుస్తుంది.

(ఇ ) మీరు అభిమానించే వారు; ప్రేమించేవారు; వాత్సల్యంతో చూసే వారు. 
వీరూ ముఖ్యమే. కారణం లేకుండా, మీరు ప్రేమించరు; అభిమానించరు. కానీ - యిక్కడ, అవతలి వారి మనస్సులో, మీ పట్ల-, మీకు వారి పట్ల ఉన్నంత గాఢత, తీవ్రత, లోతు  లేదు / లేక పోవచ్చు. యిది - మీరు గమనించడం లేదు. మీకు నిజంగా ఎవరు ముఖ్యమో మీకు తెలియడం లేదు. 
భార్య/ భర్త కంటే - సినీమా హీరో, హీరోయిన్ల వెనుకో , మరెవరి వెనుకో పిచ్చిగా తిరిగే వారు, ఇది ముఖ్యంగా గమనించాలి.  
గురువు పట్ల, గొప్ప వారి పట్ల అభిమానం మీకు వుండచ్చు - కాని - రెండవ శ్రేణి వారిని , అంటే, మిమ్మల్ని అభిమానించే వారిని - మీకు అడుగడుగునా సహాయ పడే వారిని, మీరు మరిచిపోకూడదు. 

ఉదాహరణకు - మీ భార్య/ భర్త ఆరోగ్యం బాగా లేదు. మీరు వారిని, డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలి. కాని, ఈ రోజు మీ గురువుగారి ప్రసంగం వొకటి వుంది. లేదా, మీకు యిష్టమైన వారి పుట్టిన రోజు పండుగ వుంది. మీరేం చేస్తారు? 

మీకు - ముఖ్యమైన వారిలో - అతి ముఖ్యమైన వారు మీ భార్య / భర్త. మీరు వారి ముఖ్యావసరాలనే మొదట గమనించాలి. మరెవరైనా - వారి (ముఖ్యావసరాల)తరువాతే.   యిది మరిచి పోయిన వారు - జీవితంలో - తప్పకుండా, తప్పటడుగులు వేస్తారు. వాటి దుష్ఫలితాలనూ  అనుభవిస్తారు.

భర్త కంటే - తమ తల్లిదండ్రులకో  , అక్క చెల్లెళ్లకో ప్రాధాన్యత నిచ్చే భార్యలూ వున్నారు. భార్య కంటే - మిగతా వారికి ప్రాధాన్యత నిచ్చే  భర్తలూ వున్నారు. వీళ్ళు జీవితం నరకప్రాయంగా అవుతున్నా - తమ తప్పు - చాలా చాలా ఆలస్యంగానే తెలుసుకుంటున్నారు. 

మీ జీవితంలో - ఎవరు మీకు అతి ముఖ్యం అనేది మీరు (భార్యాభర్తలిద్దరూ)  గుర్తుంచుకోవాలి. యిది వొక ఉదాహరణ మాత్రమే.మీ, మీ జీవితాలలో శ్రద్ధగా వెతుక్కుంటే - మీకు నిజంగా ముఖ్యమైన వారిని వదిలి - ముఖ్యం కాని వారికి, మీరు ముఖ్యత్వము నివ్వడం మీకే తెలుస్తుంది. యిది మార్చుకోవాల్సిన అవసరం వుంది.

(ఈ ) పై మూడు రకాల వారి క్రింద - మీ వ్యాపారాలకు, ఉద్యోగాలకు మీకు ముఖ్యమైన వారిని చేర్చండి.  వారినెలా గమనించాలో - అలా గమనించండి. 

ముఖ్యమైన యిరవై శాతం మనుషులెవరో మీకు గుర్తుండాలి. మీరు వారిపై - తగినంత శ్రద్ధ చూపించాలి. 
మిగతా  వారిపై చూపించే శ్రద్ధకూ , ముఖ్యమైన వారిపై చూపించే శ్రద్ధకూ -  తారతమ్యం  తప్పక వుండాలి.

(3 ) మీకు, మీ లక్ష్య సాధనలో  విజయాన్ని చేకూర్చే పనులు - మీ మొత్తం పనులలో - యిరవై శాతం మాత్రమే. ఇది కూడా, పైలాగే, గమనించి, ఏం చెయ్యాలో, నిర్ణయించుకోండి . 

(4 ) మీకు - బాగా ఉపయోగ పడుతున్న కాలం, మీ మొత్తం కాలములో - యిరవై శాతం మాత్రమే. ఏ కాలం మీకు బాగా ఉపయోగ పడ గలదో - ఆ కాలాన్ని, మీ లక్ష్య సాధనకు కేటాయించండి. 

(5 ) మీరు చదువుకొన్న దానిలో, మీకు తెలిసిన దానిలో - యిరవై శాతం మాత్రమే - మీకు బాగా ఉపయోగ పడుతున్నది. దాన్ని మరింత బాగా పెంచుకోండి. ఆ యిరవై శాతం పెరిగేకొద్దీ - మీ ప్రయత్నాలు, మరింత విజయ వంతం అవుతాయి.

(6 ) మీరు ఖర్చు పెట్టె డబ్బులో - మీకు బాగా ఆనందం చేకూర్చేది, ఉపయోగ పడేది - యిరవియా శాతం మాత్రమే. వెతి ఖర్చు మీకు బాగా ఆనందం యిస్తోం దో - అది గమనిస్తే - మీ డబ్బును, మరింత సార్థకంగా ఉపయోగించ వచ్చు.

(7 )   మీ దగ్గరున్న - మరొక గొప్ప ఆస్తి - మీ "మాట" . 

మీరు మాట్లాడే మాటలలో, మీకు మీ వారికీ, మీ చుట్టూ వున్నా వారికీ, బాగా ఆనందం చేకూర్చేది - యిరవై  కాదు కదా. పది శాతం కూడా వుండదు. మరో పది శాతం మాటలు - వున్న ఆనందాన్ని తీసేస్తూ కూడా వుంటాయి. దీన్ని   మీరు బాగా గమనించాలి. అధ్యయనం చేయాలి. 

మీ భార్య / భర్త కు - నిజంగా ఆనందాన్నిచ్చే మాటలు మీరు మాట్లాడి - ఎన్ని నాళ్ళు అయ్యిందో    - చెప్పగలరా? మీ కొడుకునో, కూతురినో - మీరు పొగిడి ఎన్ని నాళ్ళు అయ్యిందో? మీ అమ్మ, నాన్నలతో - ప్రేమ పూర్వకంగా మాట్లాడిం ది ఎప్పుడు?  అలా - మీకు దగ్గరైన వారిని గూర్చి - మీ మాటలను గూర్చి యోచన చేసి చూడండి? మీరు చేయనివి, మాట్లాడని, సంతోషం కలిగించే మీ మాటలు - వెంటనే మాట్లాడేసేయంది. ఆలస్యం వద్దు. యిక ముందు, ఈ మాటలను - కాస్త పెంచండి.

అలాగే - వీరికి (యితరులకు కూడా) బాధ కలిగించిన మాటలేవైనా మీరు మాట్లాడి వుంటే -  వీరిని మరి కాస్త సంతోష పెట్టె మాటలు వెంటనే, ఆలస్యం చెయ్య కుండా, చెప్పండి. యికపై - బాధ కలిగిం చే మాటలేవీ - మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకొండి. 
యిలా - మీ జీవితానికి - ముఖ్యమైన కొన్నిటిని - మీరు బాగా చూసుకుంటే,  ముఖ్యం కాని వాటి ప్రాముఖ్యత తగ్గించుకుం టే -  మీ జీవితం ఆనంద మాయమౌతుంది. సఫలమౌతుంది. 

=  మీ


వుప్పలధడియం విజయమోహన్

కాస్ - అండ్ - ఎఫెక్ట్ థియరీ = స్థిత ప్రజ్ఞత్వం

'కారణము'  - అంటే,  'ఆంగ్లం'  లో  'కాస్' అంటారు.

'కార్యం' - అంటే - ఆంగ్లం లో  'ఎఫెక్ట్' అంటారు. తెలుగులో - దీన్ని' ఫలితం' అని సాధారణంగా అంటూ వుంటాము. ఏ ఫలితమైనా - 'కారణము' వలన జరిగిన 'కార్యమే'.

తెలుగులోను , సంస్కృతము లోను -  'కారణ-కార్య సంబంధము'  అనేది ఆంగ్లం లో 'కాస్ - అండ్ - ఎఫెక్ట్ థియరీ'    అంటారు.

కారణము  (1 ) మీరే కావచ్చు. లేదా (2 ) మరెవరైనా కావచ్చు; లేదా ప్రకృతి శక్తులూ కావచ్చు.

(1 ) 'కారణం' మీరే అయితే  - మీరు చేసే పని, ఏదైనా వొక  లక్ష్య సిద్ధి కోసం అయినపుడు -  మిమ్మల్ని 'సాధకుడు' అని, మీరు చేసే పనిని 'సాధన' (ఎఫర్ట్)అని, మీ లక్ష్యాన్ని "సాధ్యము' అని అంటారు. 

మీరు మీ లక్ష్యాన్ని , మీ సాధన ద్వారా - పొందితే - మీ లక్ష్య సాధనను లక్ష్య 'సిద్ధి' అని, మిమ్మల్ను  లక్ష్య 'సిద్ధుడు' అని అంటారు. మీరు ఏ గొప్ప పని చేయాలన్నా - మీ ప్రయత్నం మాత్రమే చాలదు. ప్రకృతి శక్తుల తోడ్పాటు కూడా కావాలి. అందుకే, మన వారు - ఏ పని చేయాలన్నా ముందు ప్రకృతి శక్తులును పూజించి వాటి తోడ్పాటు కోరేవారు.ప్రతి గొప్ప పనికీ - సరైన సమయము, సందర్భము, మరి కొందరి (సంబంధించిన )  వ్యక్తుల , జంతువుల తోడ్పాటు అవసరం అయితే - అదీ తీసుకోవాలి.

శ్రీకృష్ణుడు - యోగః కర్మసు కౌశలం - అంటాడు భగవద్ గీతలో. యోగానికి ఇది కూడా  కృష్ణుడిచే యివ్వబడిన గొప్ప నిర్వచనము (డెఫనిషన్).   

అంటే - మీరు ఏ పని చేసినా - అందులో - మీ నైపుణ్యాన్ని పూర్తిగా వాడండి. ఆ పనిని ఎంత బాగా చేయ గలరో - అంత బాగా చేయండి - అంటాడు శ్రీకృష్ణుడు.  చేయాల్సిన యుద్ధంలో (పనిలో) - వెనుకంజ వేయబోయిన  అర్జునునికి - భగవద్ గీతనే ఉపదేశించి - యుద్ధం చేయమని ప్రబోధిస్తాడు. 

పని చెయ్యడం నీ వంతు - ఫలితాన్నివ్వడం నా వంతు - అంటాడు, ప్రకృతి శక్తులకే అధిపతి ఐన శ్రీ కృష్ణుడు.

పని చెయ్యకుండా ఫలితం లేనే లేదు. కారణం నువ్వు కావాలి. సాధన నువ్వే చేయాలి. లక్ష్యం నీదే.  కానీ - నీకు 'సిద్ధి' లేదా ఫలితం - లభిస్తుందా, లేదా  - ఎప్పుడు, ఎలా, అన్నది నా వంతు అంటాడు. 

ప్రతి సారీ - నువ్వు అనుకున్నది, అనుకున్నట్టు  జరగదు. 

చాలా విషయాల్లో, మీ పనుల వలన , జరిగేది  - మీరు అనుకున్న దానికంటే - భిన్నంగా జరగొచ్చు. మీరు అనుకున్న ఫలితం కంటే , ఎక్కువ రావచ్చు; తక్కువ రావచ్చు. అసలేమీ రాకపోవచ్చు. అంతే కాదు. మీరు అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగానో , అనూహ్యమైన ఫలితం గానో కూడా రావచ్చు.  

ఎందుకు  ?

దీనికి - రెండు కారణాలు చెప్పచ్చు.

ఒకటి మీ ప్రారబ్ధ కర్మ.  ఇది కూడా  'కారణ-కార్య సంబంధము'  అంటే - 'కాస్ - అండ్ - ఎఫెక్ట్ థియరీ'  యొక్క జన్మాంతర పరిణామమే. మీ కర్మల (పనుల) ఫలితం వొక జన్మలో తీరిపోదు. ఎంతో కొంత మిగులు వుండనే వుంటుంది . ఆ మిగులు ఫలితం - మీ యిప్పటి పనుల ఫలితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.  

మీ ప్రారబ్ధ కర్మ ఖాతా లో పుణ్యం ఎక్కువ వుందనుకోండి.  మీరు యిప్పుడు చేసే ప్రతి పనికి - మీరు అనుకున్న దానికంటే - ఎక్కువ మంచి ఫలితం రావచ్చు. పాపం  ఎక్కువుందనుకోండి. మీరు అనుకోని, ఎదురుచూడని  దుష్ఫలితాలు సంభవించ వచ్చు 

రెండవది - యితరుల, మరియు ప్రకృతి శక్తుల ప్రభావం.

ఈ ప్రపంచం లో , ఏ పని అయినా - ఏకంగా, (ఐసొలేటెడ్ గా) మిగతా వాటితో సంబంధమే లేకుండా జరగనే జరగదు.

మీ పని పైన, సూర్య, చంద్ర, ఆకాశ, మేఘ, భూమి,వాయు, అగ్ని లాంటి ప్రతి శక్తి యొక్క ప్రభావం  వుండనే వుంటుంది. 

ఉదాహరణకు - మీరు పిక్నిక్ కు పోవచ్చు. పోయిన చోట (అమెరికా అయితే)  టార్నడో  రావచ్చు. (ఇండియా  అయితే) బందులు,  రోడ్డు  రోకోలు,   కరెంటు పోవడాలు - ఎన్నో రావచ్చు.  ఆక్సిడెంటులూ  కావచ్చు. 

లేదా - చాలా బాగా కూడా జరగవచ్చు. 

మీ పని ఈ 'ప్రపంచం' లోనే జరుగుతూ వుంది. అయితే -  ప్రక్కనే - ఇదే ప్రపంచంలోనే - మరెన్నో పనులు ఇతరులూ చేస్తున్నారు, ప్రకృతీ చేస్తూ వుంది. మీ పని   ఫలితం వీటన్నిటి సమన్వయ ఫలం పైన ఆధార పడి వుంటుంది. ఏ పని కైనా - మీకు వచ్చేది, మీ పని పైన అన్ని యితర పనుల ప్రభావాలతో కూడిన సమన్వయ ఫలమే

దీనికీ మించి  - ప్రారబ్ధ కర్మ ఫల శేషము కూడా వుంటుంది.  కాబట్టే - అర్జునా - కర్మ (పని) నువ్వు చేయాల్సిందే. కానీ, ఫలితాన్ని ఇచ్చేది నేను - ఏ ఫలితాన్ని, ఎప్పుడు, ఎలా ఇస్తానన్నది - నా ప్రకారం జరుగుతుంది - అంటాడు కర్మ ఫల దాత ఐన శ్రీకృష్ణుడు. 


మీరు పిక్నిక్ వెళ్లారు - అనుకోండి . వర్షం వచ్చింది. అంటే  ఈ పిక్నిక్ పనిని మీరు సరిగ్గా  అనుకోలేదు, చేయ లేదు. -దానికీ, ప్రారబ్ధ ఫలానికీ సంబంధము లేక పోవచ్చు.

అయితే - మీరు పిక్నిక్ కు వెళ్ళారు. కానీ- ఎదురు చూడలేని -సంఘటన జరిగిందనుకోండి. అది ప్రారబ్ధ ఫలంగా కూడా వుండచ్చు  . దీన్నే - "అదృష్ట ఫలం" అని కూడా అంటారు.  యిలా ఎందుకు జరిగింది అని యోచన చేస్తే - జవాబు దొరకని ఫలితాలు ఈ కోవ లోకి వస్తాయి.

సరే. మీరొక మంచి పని చేసారనుకోండి. యిప్పుడు మీకు వచ్చిన ఫలం - చాలా చెడ్డది గా వుందనుకోండి. ఇది మొట్ట మొదట మీ + సర్వ శక్తుల పనుల సమన్వయ ఫలంగా చూడాలి. దాన్లోనే మీకు సమాధానం దొరకొచ్చు. దాన్లో సమాధానం దొరకలేదంటే , తరువాత ప్రారబ్ధ ఫలంగా కూడా చూడాలి. 

మరి - మంచి పనికి (పుణ్య కార్యానికి) మంచి ఫలితం వుందా, లేదా?  తప్పకుండా వుంది. అది మీకే వస్తుంది. కానీ - అది, మీకు  ఎప్పుడు, ఎలా ఇవ్వాలో, నిర్ణయించేవాడు - వేరే వున్నాడు.

మన కర్తవ్యం ఏమిటి? 

చాల సింపుల్ . కామన్ సెన్స్ ; మామూలు విజ్ఞత.

సకాలంలో పంటలు పండించాలి. 

సకాలంలో, తిన వలసినవి, తినవలసిన విధంగా, తిన వలసినంత మాత్రం తినాలి.

సకాలంలో మేల్కొనడము , నిద్రించడము, చదవడము, శరీర పరిశ్రమ చేయడము, లాంటివి చేయాలి.

మనసులో మంచి ఆలోచనలే పెట్టుకోవాలి. పది మందికి పనికొచ్చే పనులు చేయాలి. పది మందితో కలిసి వుండాలి. హాయిగా వుండాలి.

మీకు తెలుసా - సకాలము, సరి ఐన పనులు, సరి ఐన ఆలోచనలు, పాటిస్తే -  వీటికన్నిటికి - మీకు  రావలసిన - సత్ఫలితం మీకు వచ్చే తీరుతుంది. దీన్నే శ్రీకృష్ణుడు, పతంజలి మహర్షి  యిద్దరూ   -  యోగం అన్నారు. 

అంతే కాదు. మీ యిప్పటి ఆస్తులు, సంబంధాలేవీ - మీతో జన్మాంతరానికి రావు. మీతో తప్పకుండా వచ్చేవి - మీ పుణ్య పాపాలే. 

అంటే -  'కాస్ - అండ్ - ఎఫెక్ట్ థియరీ'  ఈ జన్మతో సరిపోయిందనుకుంటే  - చాలా తప్పు.
మీరు చేసిన హత్యలు, రేపులు, గూండాఇజం   మేమ్మల్నేం చేయలేదనుకుంటే  అది పెద్ద పొరపాటే. కాస్ వున్న చోట ఎఫెక్ట్ ఉండి తీరుతుంది. ఎఫెక్ట్ వచ్చేంత వరకు కాస్ మీ నెత్తినే, మీరు చేసిన పాపంగా వుంటుంది. మీరు అనుకోని సమయంలో, అనుకోని విధంగా వస్తుంది. 


అదే విధంగా - మీరు చేసిన పుణ్య ఫలం - మీతో బాటే వస్తుంది. 

ఉదాహరణకు - బిల్ గేట్స్ గారితో బాటు (నిండు నూరేళ్ళ తరువాత!) వెళ్ళేవి  మైక్రోసాఫ్ట్ లోని వారి ప్రస్తుత ఆస్తులు కాదు. అవి వారి ఈ జన్మ  కృషి ఫలం జన్మాంతర ప్రారబ్ధ కర్మ ఫలం. రెండూ. కాని  వారు  వివిధ రోగుల కొరకు చేసిన, చేస్తున్న  సహాయం వారి వెనుకనే ఎల్లప్పుడూ వుంటుంది. మంచి ఫలితాన్నీ ఇస్తుంది.

మీకైనా, నాకైనా అంతే. 

ఎందుకిలా జరిగింది? 
అని మనలను - వేధించే  అన్ని ప్రశ్నలకు ఈ 'కాస్ - అండ్ - ఎఫెక్ట్ థియరీ' చక్కటి సమాధానం.

అయితే - లాభమొచ్చినా, నష్టమొచ్చినా, కష్టమొచ్చినా, ఏమొచ్చినా - నేను సంతోషంగానే వుంటాను - అనే స్థిత ప్రజ్ఞుడికి  - ఈ పుణ్య పాప ఫలాల ప్రభావం అంటదు. ఎందుకంటే - కర్మ ఫల దాత యిచ్చేవన్నీ కూడా- బాహ్య ప్రభావాలే.  

అయితే -   మనకొక స్వతంత్రం పెట్టనే పెట్టాడు ఆయన . అది మనిషి ఈ 'కాస్ - అండ్ - ఎఫెక్ట్ థియరీ' ని దాటి, దైవత్వాన్నే అనుభవించగల శక్తి. దాని పేరే 'స్థిత ప్రజ్ఞత్వం'.

25, మే 2011, బుధవారం

జీవితము - అడ్డంకులతో కూడిన ఆట - ధైర్యే, సాహసే లక్ష్మీ -


మనిషి  జీవితము   -  అడ్డంకులతో కూడిన ఆట (హర్డిల్స్ రేసు) లాంటిది. 

సాఫీ గా, అడ్డంకులు లేకుండా పది రోజులు జరిగితే - ఎక్కడినుండో - వొక అడ్డంకి ఊడి పడుతుంది. యిక మీరు  అ అడ్డంకిని వదుల్చు కుంటే  గాని -  మళ్ళీ జీవితం ముందుకు జరగదు. 

ఎవరో  వొక అదృశ్య వ్యక్తి - లేదా అదృశ్య శక్తి  - మీ మీద కక్షతో , పిల్లి ఎలుకతో ఆడుకున్నట్టు,   అడుగడుక్కూ మీ ముందు, ఏదో వొక అవరోధాన్ని ఎంపిక చేసి వుంచుతున్నట్టే  వుంటుంది. మీరు  దాన్ని దాటి వెళ్ళాలి. తప్పదు. అది దాటండి. మరోటి సిద్ధమవుతుంది.  జీవితమంతా యిలాగే సాగుతుంది. 

కథల్లోనూ, సినిమాల్లోనూ, టి వి సీరియల్సు లోను - "వాళ్ళు ఆ తరువాత హాయిగా జీవితం గడిపారు" - అని చెప్పచ్చు - కాని, నిజ జీవితంలో - అది తుది శ్వాస వరకు కుదరదు. 

అవరోధాలు, అడ్డంకులు, కష్టాలు, నష్టాలు, రోగాలు, శోకాలు, బాధలు ఏవీ లేని జీవితం  సృష్ట్యాది నుండి యిప్పటి వరకు లేదు. వీటన్నిటినీ చేర్చి "సమస్యలు" అని కూడా చెప్పుకోవచ్చు.

క్రీస్తు కూ తప్ప లేదు. బుద్ధుడికీ తప్పలేదు. కృష్ణుడికీ తప్ప లేదు. శివుడికీ  తప్ప లేదు. మహా విష్ణువుకూ  తప్ప లేదు - ఈ సమస్యలు. 

కాబట్టి - జీవితానికి సమస్యలు, అవరోధాలు వస్తాయని, వుంటాయని - "ఎదురుచూడలేనివి కూడా, ఎదురుపడతాయని  మనం ఎదురు చూడడమే" తార్కికమైన దృష్టి.

ప్రపంచ యుద్ధాలు వస్తాయని, వాటికి వొక్క సంవత్సరం  ముందైనా - ఎవరూ ఎదురు చూడలేదు. కానీ వచ్చాయి.

యు యస్ యస్ ఆర్  ఇన్ని చిన్న చిన్న దేశాలుగా విడి పోతుందని  - ఎవరు కల గన్నారు?  అయినా - అది జరిగిపోయింది. అమెరికా వారి సి ఐ ఏ. యొక్క ప్రముఖ వైఫల్యాల్లో ఈ విభజనను అణుమాత్రం కూడా పసిగట్ట లేక పోవడం, వొకటిగా చెప్పుకుంటారు. .

జపాన్ లో జరిగిన ప్రకృతి విపరీతాన్ని గాని, అమెరికాలో వచ్చే  టార్నేడో లను గాని, 9 /11 లనుగాని -  దేన్ని మనం ఎదురుచూడగలిగాం? అయినా, అవన్నీ వచ్చాయి. మరెన్నో రాబోతున్నాయి. రేపేం వస్తుందో - మనకు తెలీదు , కానీ ఏదో వస్తుంది. అంత మాత్రం తెలుసు.

 ఎందుకంటే - ఘటనాఘటన పూరితమయిందే   జీవితం. అవి లేనిది జీవితమే లేదు. కాబట్టి, ఎదురుచూడలేనివి, ఏవేవో  ఎదురు వస్తాయని - తప్పకుండా ఎదురు చూడండి.

మీ  యింట్లో కూడా వస్తాయి.మీ  వొంట్లో కూడా వస్తాయి.
ఈ 2011 సంవత్సరంలో -యిక మిగిలిన 7 నెలల్లో -మనకే సంఘటనలు ఎదురౌతాయో , మన పిల్లల ఆరోగ్యాలు, చదువులు, పెద్దల ఆరోగ్యాలు, మనము, మన భార్య (/భర్త) కు ఏమేం ఎదురౌతాయో, మనం చెప్పలేం కదా. 

కానీ ఏదో, ఏదేదో వస్తాయని మాత్రం ఎదురు చూడాలి. చేసుకోగలిగిన ముందు జాగ్రత్తలూ  చేసుకోవాలి.  
యిది ముఖ్యం. చేసుకోగల ముందు జాగ్రత్తలు చేసుకోవాలి

మానవ జీవితాన్ని శాసించే - ముఖ్య ధర్మాలలో వొకటి - ఈ సమస్యలూ, కష్టాలూ, రోగాలూ, ఎగుడుదిగుడులూ - వస్తూనే వుంటాయి. తగినంత ముందు జాగ్రత్తలు తీసుకుంటే  - వచ్చే  కష్టాలూ, రోగాలూ, పోతూనూ వుంటాయి.

ముందు జాగ్రత్తలు - దీర్ఘ దర్శి లక్షణం. 

సమస్యలు (అంటే - కష్టాలు, రోగాలూ,   ఎగుడుదిగుడులూ లాంటివన్నీ )-వస్తూనే వుంటాయి - అన్నాము.

ప్రతి కష్టంలోనూ - నిజంగా - రెండు కష్టాలు దాగి వున్నాయి.

(1 ) వొకటి - మనకు, బయటివారికి, అందరికీ కనిపించే కష్టం. ఉదాహరణకు - మీది లక్ష రూపాయలు ఎవడో దొంగ ఎత్తు కెళ్ళాడనుకోండి . అది మీకు  ఏ పెళ్ళికో, అవసరంగా కావాల్సి వుంది. యిది మీకూ, అందరికీ తెలిసే, అర్థమయ్యే కష్టం. 

(2 ) అయితే - దీనికి - మీ మనసులో, మీరు ఎటువంటి బాధ పడతారో (లేదా పడరో) - అది మీకు మాత్రం  తెలిసిన కష్టం.  కొంత  మందికి హార్ట్ అట్టాక్ రావచ్చు. కొంత మంది ఈగ వాలినంత కూడా కష్ట పడక పోవచ్చు. యిది - కేవలం డబ్బు ఎక్కువ వుండడం, తక్కువ వుండడం పైన మాత్రం ఆధార పడి వుండదు. 

ముఖ్యంగా - మీ మనస్తత్వం పైన ఆధార పడి వుంటుంది. నేనిది మళ్ళీ సంపాదించుకోగలను, పెద్ద విషయం కాదు - అని అనుకోవచ్చు. పెండ్లి జరక్క పోతే - పెద్ద మునిగిపోయిందేమీ లేదు -అని అనుకోవచ్చు. అవతలి వారికి సర్ది చెప్పొచ్చు-అని మన మనసులో ధైర్యం గా అనుకోవచ్చు.

యిట్లా ,. ఎన్నో రకాల మానసిక ప్రతిచర్యలు, ప్రతిక్రియలు - మన మనోబలాన్ని బట్టి మనలో జరుగుతాయి. 

లక్ష రూపాయలకే కొంప మునిగిపోయిందనుకుంటే, జీవితమే అంధకారమయిపోయిందనుకుం టే    -    ఆత్మ హత్య చేసుకునే వారూ వున్నారు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే వారున్నారు.పెద్ద పెద్ద రోగాలు  తెచ్చుకునే వారూ వున్నారు . 
ఏదో వొకటి చేసి, ఈ సమస్యలో నుండి , ఈ కష్టంలో నుండి బయటికి రావాలి - అని  క్రియాశీలతకు ప్రాముఖ్యమిచ్చే వాళ్ళూ  వున్నారు. 

ఏది జరిగినా, జరక్క పోయినా - నాకేం పోయింది - ఎవరో యింట్లో కష్టపడి  , ఏదో చేస్తారులే, అని  నిమ్మకు నీరెత్తినట్లు వుండే వాళ్ళూ వున్నారు. 

అంటే - ప్రతి కష్టం లోనూ - మన మానసిక చర్యే మొదట జరుగుతుంది. తరువాత బాహ్య (శారీరక) చర్య  అందరికీ తెలిసేటట్లు జరుగుతుంది. 

కష్టాన్ని - నేను ధైర్యం గా ఎదుర్కొంటాను - అనే మనస్తత్వం మీ మానసిక బలానికి ప్రతీక.
కష్టానికి భయపడి పారిపోతాను లేదా, జీవితం నుండే పారిపోతాను  - అనే మనస్తత్వం మీ మానసిక దుర్బలత్వానికి  చిహ్నం.

ఈ రెండు మనస్తత్వాల మధ్య -  ఎన్నో రకాల మానసిక ప్రవృత్తులుంటాయి .

మానసిక దుర్బలత్వం వలన - వెంటనే - మానసిక వొత్తిడి పెరిగి పోతుంది.  

మన సమస్యను, కష్టాన్ని చూడడానికే భయపడతాము. దానికి ప్రత్యామ్నాయాలు వెదకడానికే    సాహసించము. 

అదే కాకుండా  - వున్న సమస్యను  అనేక రకాలుగా జటిలం చేసుకుంటాము. 

(1 ) దాన్ని భూతద్దంలో చూసినట్లు,  వున్న దానికంటే పలు రెట్లు పెద్దదిగా చూస్తాము. 
(2 ) సమస్య పరిష్కారానికి  మనలో వున్న శక్తులు, నైపుణ్యాలు, ప్రవీణతలు అన్నీ     మర్చి పోతాము. 
(3 ) మనతో వున్న బంధు మిత్ర వర్గాల సహకారాన్ని మరిచి పోతాము. 
(4 ) అనవసర సందేహాలు, భయాలు ఎక్కువ చేసుకుంటాము. 
(5 )   దీని వలన, మానసిక వొత్తిడి అస్సలు అవసరమే లేకున్నా, మనమే పెంచుకుని రోగాల పాలవడం, చిన్న సమస్య మరీ జటిలం కావడం జరుగుతుంది. 

రోడ్డు దాటాలంటే - అప్పుడే ఏ లారీ క్రిందనో  వారు  పడిపోయినట్లు, ముచ్చెమటలు  పోసుకునే వారెందరో వున్నారు.  అదే విధంగా - లారీలు పైకి వచ్చేస్తుంటే - ఏమీ పట్టనట్టు - తమ చేయి అడ్డు చూపిస్తూ (వారే ట్రాఫిక్ పోలీసు మాదిరి) హాయిగా మాట్లాడుకుంటూ రోడ్డు దాటే  వారూ వున్నారు. రెండో వారి నిర్లక్ష్యం అక్కర లేకున్నా - మొదటి వారి భయాలు అస్సలు వుండకూడదు!

నిజానికి - భయాలకు, సందేహాలకు - మనలను, వాటికనుగుణమైన   విపత్కర పరిస్థితి లోకి తీసుకెళ్ళే  సామర్థ్యం వుంది. జీవితంలో భయపడే వాడు, ఏదీ సాధించ లేడు. 

ధైర్యే, సాహసే లక్ష్మీ - అన్నారు పెద్దలు. ధైర్యం వుండాలి. పిరికితనం అస్సలు వుండకూడదు. 

భగవద్గీతలో, శ్రీకృష్ణుడు - "క్షుద్రం  హృదయ దౌర్బల్యం"   అని - అర్జునున్ని   తిడతాడు. ధైర్యం లేని వాడు ఎందుకూ పనికి రాడు. వాడికి  మొదట కావాల్సిన వైద్యం - ధైర్యమే. 
ధైర్యం వున్న చోట - మానసిక వొత్తిడి వుండనే వుండదు. రోగాలు రావడం చాలా తక్కువ. వచ్చినా వాటి వలన బాధ పడడమూ తక్కువే. 

ధైర్యం ఎలా వస్తుంది ?  చాలా, చాలా  సులభం. మనసులో మీరొక చిన్న  నిర్ణయం తీసుకోవాలి - నేనిక భయ పడను - అని. అంతే. 

ఆ చిన్న నిర్ణయం తీసుకోవాలంటే - మీరేం చెయ్య నక్కర లేదు. ఆ  చిన్న నిర్ణయం తీసేసుకోవడమే చెయ్యాలి.
మరి వెంటనే - ధైర్యం వచ్చేస్తుందా? అది మీకున్న భయాల్ని బట్టి వుంటుంది.

మీకు - పామును చూస్తే భయం అనుకోండి. డిస్కవరీ చానెల్ లాంటి వాటిలో - పని గట్టుకుని - మరీ పాములను చూడండి. వాటితో - ఎలా ఆడుతారో చూడండి. స్క్రీను లోని పాములు మిమ్మల్నేమీ చేయదని మీకూ తెలుసు కదా. స్నేక్ పార్క్ లాంటివి వుంటే - అక్కడికెళ్ళి - పాముల్ని బాగా చూడండి.  ఎక్కడైనా పాములు చచ్చి పడి వుంటే-  వాటిని అలా కాస్సేపు చూడండి. మెల్ల మెల్లగా - మీలో, పాములను గురించిన భయం పోతుంది.  అలాగని, విషపూరిత పాములతో మీరూ ఆట్లాడమని  నేను చెప్పడం లేదు.  ధైర్యం వేరు. జాగ్రత్తలు వేరు. రెండూ కావాలి మనకు.  వొక వేళ - ఏదైనా పాము మీ యింట్లోకి రావడమో, మీరు వెళ్ళే దారిలో, మీ వైపు రావడమో జరిగిం డనుకోండి  . - అప్పుడు జాగ్రత్తగా, ధైర్యంగా, సమయస్ఫూర్తితో వాటిని ఎదుర్కొనడమే. దీన్ని (పాముల్ని)  గురింఛి - నా మరో బ్లాగు - వైస్ లివింగ్ ఐడియాస్  లో మీరు చూడొచ్చు.

చావడమంటూ వస్తే - అదే చావాలి, మనం కాదు.  అక్కడే ధైర్యమూ కావాలి. జాగ్రత్తా కావాలి.  రౌడీలకు మనకు సంబంధం లేదు. కానీ - వారిని - ఎదుర్కొనవలసిన పరిస్థితి వచ్చినా - అంతే. మొదట ధైర్యం. దాని వెనుక జాగ్రత్తలు.  శ్రీకృష్ణుడు చెప్పిన  - "క్షుద్రం  హృదయ దౌర్బల్యం" గుర్తుం చుకోండి. 

అన్ని రోగాలలోకి - అతి పెద్ద రోగం హృదయ దౌర్బల్యం - అంటే భయం . 

భయ పడేవాడు - తనకు తానే అతి పెద్ద శత్రువు గా వుంటాడు. భయం విడిచిపెట్టిన వాడు -తనకు తానే అతి పెద్ద మిత్రుడుగా వుంటాడు.

జీవితంలో - మీకు రాగలిగే సాధారణ కష్టాలకు, రోగాలకు, తగిన ముందు జాగ్రత్తలూ తీసుకోండి. ధైర్యం  వున్న చోట, జాగ్రత్తలూ, నైపుణ్యాలూ చేరితే -  విజయం మీ పక్కనే. 

మీరు మూడు నిజాలు మానసికంగా, పూర్తిగా స్వీకరించాలి.

(1 )  సమస్యలు ( అంటే - కష్టాలు, రోగాలు లాంటివి) జీవితంలో - విడదీయలేని అంతర్భాగం. అవి - ప్రతి వొక్కరి జీవితంలోనూ తప్పకుండా వుంటాయి. ప్రెసిడెంట్ వొబామా జీవితం లోనూ వుంటాయి. ప్రై మినిస్టర్ మన్మోహన్ సింగ్ జీవితంలోనూ వుంటాయి. మీ జీవితంలోనూ వుంటాయి.  వస్తాయి; యిది మీరు పూర్తి మనసుతో వొప్పుకోవాలి.
(2 )  కష్టాలను  మీకిచ్చిన వాడు - ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి కూడా మీకిచ్చాడనే నమ్మకం మీకుండాలి. కష్టాలు వస్తే  రానీ - నేను వాటికి భయపడను - అనే మానసిక బలం మీలో వుండాలి.యిది కూడా మీరు పూర్తి మనసుతో వొప్పుకోవాలి.
(3 )  ఎటువంటి సమస్యకూ సమాధానం వుంది. దేన్ని చూసీ భయపడనవసరం లేదు. ముఖ్యంగా - చావుకు భయపడవలసిన అవసరం అసలే లేదు. పుట్టుక కానీ, చావు కానీ - కష్టం లేని సంఘటనలు. రోగాలలో నొప్పి వుండొచ్చు - కానీ చావులో, ఏ బాధా లేదని ఈ మధ్య జరిగిన శాస్త్రీయ పరిశోధనలలో కూడా తెలిసిన సత్యం. వేదాంతం లో కూడా చెప్ప బడిన సత్యం. 

మీకు తెలుసా - మోక్షానికి వొక అర్థం - సకల భయ విమోచనం అని. మీ భయాలు మిమ్మల్ని వదిలిపోతూ వుంటే , మీరు అత్యానంద దాయకమైన మోక్షానికి,  చేరువౌతూ వుంటారు. వొక్కొక్క భయం మిమ్మల్ని విడిచిపెట్టినపుడు - మీలో ఆనందం  పెరుగుతూ పోతుంది.  ఇది కూడా మీరు పూర్తి మనసుతో వొప్పుకొవాల్సిన నిజం.

  ఈ మూడు నిజాల్ని వొప్పుకోండి. మీలో వున్న భయాల్ని వొక్కొక్కటి గానో , అన్నిటినీ వొక్క సారో - వదిలి పెట్టండి. 
ఆనంద మయమైన జీవితం మీకే స్వంతమవుతుంది.  

=  మీ 
వుప్పలధడియం విజయమోహన్

24, మే 2011, మంగళవారం

మాటే మం త్రము = మీకు వొక వ్రతం = మాటల్లో ఆడ - మగ తేడా



మాటే మం త్రము   !

మరే ప్రాణికీ యివ్వక - మనిషికి మాత్రమే దేవుడిచ్చిన అతి గొప్ప వరం మాట.

దేవుడు శబ్ద బ్రహ్మ రూపంలో వున్నాడు- అని శబ్ద రూపకమైన  వేదాలు ఘోషిస్తూ వున్నాయి.. శబ్దం ద్వారా, మాట ద్వారా, మనం, ప్రతి మనిషి లోనూ  ఆ బ్రహ్మాన్ని దర్శించ వచ్చు.    శబ్దమే (మాటే)   దేవుడని బైబిల్ కూడా చెబుతూ వుంది  . 

మనిషిని, దేవుడితో కలపగలిగే శక్తి    వొక్క మాటకే వుంది. 

మనసు లోతుల్లో నుండీ వచ్చే మాటే,  దేవుడికి యిష్టమైన - మంత్రముగా మారిపోతుంది. 

అటువంటి మంత్రానికి -   ప్రకృతినంతటినీ శాసించ గల అపారమైన శక్తీ వుంది.  మన మనో,వాక్, కాయ, కర్మలనన్నిటినీ ఏకీకరించి,  పిలిస్తే - ఆ ఆమంత్ర శక్తికి - సూర్య, చంద్రాది ప్రక్రుతి శక్తులు కూడా - సంతోషించి మనల్ని, అనుగ్రహిస్తారని, అనుగ్రహించకుండా వుండలేరనీ - అన్ని పురాణాలూ ఘోషిస్తున్నాయి. అంతటి మహిమాన్వితమైనది - మంత్రము లాంటి మాట.

వారధి వేసినా, గోడ కట్టినా..

మనిషికీ మనిషికీ మధ్య వారధి వేసేది మాట.  మనిషికీ, మనిషికీ  మధ్య గోడ కట్టేది  కూడా మాటే. . 

మనుషుల్ని కలిపేదీ మాటే. విడదీసేదీ మాటే. 


  ఏది వివేకము    - ఏది అవివేకము

మనం మాట్లాడే మాటలకు చాలా శక్తి వుంది.అయితే - ఎక్కుపెట్టివిదిచిన  అంబు, నోటి నుండి  బయటికి వెళ్ళిన మాటా - తిరిగి  రావు.కాబట్టి  - మాట్లాడే ప్రతి మాటా జాగ్రత్తగా మాట్లాడాలి.

మాట్లాడవలసిన సమయం లో, మాట్లాడ వలసిన మాటలను, మాట్లాడ వలసిన విధంగా మాట్లాడే వాడే సమయోచిత ప్రజ్ఞుడు; వివేకి.  

మాట్లాడకూడని సమయంలో, మాట్లాడ కూడని  మాటలను, మాట్లాడ కూడని  విధంగా  మాట్లాడే వాడు - అవివేకి.
"ప్లేటో" గారంటారు - "జ్ఞానులు  (బుద్ధిమం తులు) చెప్పదగిన మాటలు వున్నాయి కాబట్టి (ఆ చెప్పదగిన మాటలే) మాట్లాడుతారు.   అవివేకి - ఏదో    వొకటి చెప్పాలనుకుంటాడు కాబట్టి (ఏదో వొకటి) మాట్లాడుతాడు.". 

వివేకి మాటలు మనుషులను కలుపుతాయి. అవివేకి మాటలు మనుషుల మధ్య ఉన్న సంబంధాలను   చెడుపుతాయి.

వీటన్నిటిని గుర్తులో పెట్టుకుని -   మాటల వుపయోగాల్ని గురించి యిలా అంటారు-

మాటల ఉపయోగాలు - మూడు రకాలు

మాటలు, మనసులోని ఆలోచనలను (భావాల్ని) వ్యక్తీకరించడానికి,ప్పి పెట్టడానికి, రెండింటికీ  ఉపయోగపడతాయి., . అలాగే - మనసులో - ఆలోచనల స్థానాన్ని - మాటలు పూర్తిగా ఆక్రమించనూ గలవు. బయటికి వెళ్ళే మాటలు తప్ప - లోపల ఆలోచనంటూ వుండదు కొందరి తలల్లో. .

యిలా మూడు ప్రయోజనాలు ( "నిష్-ప్రయోజనాలు" తో సహా ) మాటల వల్ల  కలుగుతాయి.  .


మాటల్లో రకాలు 

మనం వినే మాటలను - స్థూలంగా మూడు రకాలుగా మనం విభజించుకోవచ్చు : (1 ) సాధారణమైన మాటలు    (2 ) సంతోష పెట్టే  మాటలు    (3 )  బాధ పెట్టే  మాటలు 

ఇవి కాక, మనుషులను, ఉత్తేజ పరిచే మాటలు, మనుషుల్లో, కోపాన్నో, లోభాన్నో, ఈర్ష్యనో ,భయాన్నో పెంచే మాటలు - ఇలాంటివీ వున్నాయి.

సాధారణమైన మాటలు

ఇవి మనం చాల త్వరగా మర్చి పోతాము. వాటిలో - ఏదైనా ముఖ్య  సమాచారాలుంటే - అవి జ్ఞాపకం పెట్టుకోవాలని కృషి చేస్తాము.   అవి ముఖ్యమే అయినా, మనకి సంతోషమో, బాధనో, కలిగించేవి కావు. మనం మాట్లాడే మాటలలో ఎనభై శాతం మిం చి  సాధారణమైన మాటలే వుంటాయి.

సంతోషం కలిగించే మాటలు 

మనం కొన్ని మాటలను  విం టే - కొద్ది గానో, ఎక్కువగానో, మనలో సంతోషం కలగడం మనకు తెలుసు.

మీరు చాలా మంచి  వారు. మీరు చూడడానికి చాలా బాగున్నారు, మీ పని తీరు చాలా  అద్భుతం, మా అబ్బాయి / అమ్మాయి  ఎంత మంచి పేరు తెచ్చుకున్నారండీ. మీ వంట చాలా చాలా రుచిగా, చాలా బాగుంది.... యిటువంటి మాటలు - ఎదుటి వారు వాడితే  - మనమెవరైనా సంతోష పడతాము.  అలాగే, మనం వాడితే - ఎదుటివారెవరైనా సంతోష పడతారు.

చిన్న పాపల నుండి, పండు ముదుసలుల వరకు; బికారి నుండి చక్రవర్తుల వరకు, ఆడా, మగా తేడా లేకుండా , ప్రతి వొక్కరికీ -  తమను గురించి  పది మంచి మాటలు వినడం అంటే, చాలా ఆనందంగా వుంటుంది. ఇది మన మానసిక ధర్మం. ప్రతి వొక్కరూ - గుర్తుం చుకోవలసిన విషయం.

అంటే - మిమ్మల్ని సంతోష పెట్ట గలిగే వొక గొప్ప సమ్మోహనాస్త్రం,  నాదగ్గరుంది. నన్ను సంతోష పెట్ట గలిగే గొప్ప అస్త్రం మీ దగ్గరుంది.

ఈ అస్త్రాన్ని సమయోచితంగా వాడే వాళ్ళు సమాజం లోని, చాలా మంది వ్యక్తులను - వొక్క పైసా ఖర్చు లేకుండా, సంతోష పరచగలరు.

మీరు సంతోష పెట్టే మనుషుల మనసులలో - మీరు పదిలమైన స్థానం సంపాదించుకుంటారు. వారు కూడా, మిమ్మల్ని గురించి పది మంది దగ్గర ఉన్నతంగా మాట్లాడుతారు. మీరు మాట్లాడిన ప్రతి వొక మంచి మాటకూ -  మీకు పది మంచి మాటలు , పది మంది దగ్గరి నుండి  వినిపిస్తాయి. మీరిచ్చే ఆనందానికి పది రెట్లు ఎక్కువ ఆనందం మీకూ వస్తుంది.

కానీ - ఈ ప్రతి ఫలాన్ని ఎదురు చూసి  మీ మాటలు, పొగడ్తలు వాడకండి. నిజాయితీగా - హృదయపూర్వకంగా - నిజంగా పొగడ వలసిన వాళ్ళను, నిజంగా పొగడవలసిన విషయాలకే  పొగడండి.

ఒక దొంగను పొగిడారంటే - వాడు, మీ యింటికే  కన్నం వెయ్యగలడు. ఒక అవినీతి పరుడిని పొగిడారంటే -  వాడి  అవినీతి మన అందరినీ కాటు వేస్తుంది సుమా.

మంచి వాడిని, మంచి పనిని - పని గట్టుకుని, మరీ పది మంది ముందు పొగడండి. సమాజంలో మంచితనం పెరుగుతుంది.

ఇవి కాక - మనసుకు "ఊరట" నిచ్చే మాటలున్నాయి. ఎవరికి - ఏ వ్యాధి వున్నా- "మీకు తప్పకుండా నయమవుతుంది"  అన్న వొక్క వాక్యం , వైద్యుడు తప్పక చెప్పాలి. వూరికే మందులిస్తే చాలదు.

తుది శ్వాస వరకు, ప్రతి  వొక్కరికి, ఈ విశ్వాసం, ధైర్యం వుండేట్టు చేయాల్సిన అవసరం ఎంతో వుంది. మనలో  ఎవరైనా కూడా - యిటువంటి ఆత్మ విశ్వాసం, ధైర్యం వచ్చే మాటలు,  రోగ గ్రస్తులతోను, మరే  యితర బాధలలో వున్న వారితోను,  తప్పక చెప్పాలి.

వైద్యం తో నయము గాని వ్యాధులు కూడా, ధైర్యం  యిచ్చే ఇటువంటి మాటలతో నయమయిన సందర్భాలు అనేకం వున్నాయి.మన  మనసులలోను, శరీరాల్లోని  ప్రతి అణువు లోను  ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నింప గలిగింది మాటే.

పరీక్షలు రాసే వారికి, రాసిన వారికి, ఫెయిలయిన వారికీ,  జీవితంలో, రక రకాల కష్టాల్లో ఉన్న వారికి - పనిగట్టుకుని వెళ్లి, ఇలాంటి సాంత్వన వాక్యాలు చెప్పాలి.


యితరులకు  సంతోషం  కలిగించే  మాటలను  ప్రతి రోజూ -  కనీసం వొక్కరికైనా - ఏ వొక్కరికైనా - చెప్పాలని -  మీరు వొక వ్రతం లాగా  పెట్టుకుం టే  మీకే  చాలా మంచిది.   మీ జీవితంలో సంతోషం, ఆనందం  చాలా పెరుగుతుంది.

ఇలా చేసే వారు చాలా మంది ఇప్పటికే వున్నారు. కాని - ఇది ప్రతి వొక్కరూ చేస్తే కాని సమాజంలోని దుర్బలత్వం, నిరాశ, నిస్పృహ పోదు.


సరే.    ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు  పెద్దలు.

కాబట్టి - కనీసం మూడు రోజులకు వొక్క సారైనా - మీ భర్తను ( / భార్యను) తప్పకుండా, ఏదో వొక (నిజమైన) విషయానికి - మీరు (పని గట్టుకుని) అభినందించాలి; లేదా  ధైర్యం  చెప్పాలి; లేదా ఊరట కలిగించాలి.  యిది వారికి - ఆహారం ఎంత ముఖ్యమో, అంతకంటే ముఖ్యం.   అదే లాగ, మీ పిల్లలకు, మీ చిన్న జీవన ప్రపంచం లోని మిగతా ముఖ్య సభ్యులందరికీ యిది ముఖ్యమే. ఇది - ఆ కుటుంబ సభ్యుడిగా  - మీ బాధ్యత.

మనం మాట్లాడే మాటలలో - పరులను (మన వారిని కూడా) సంతోష పరిచే మాటలు  కనీసం పది శాతమైనా వుండాలి. ఇది మన జీవితంలో చాలా గొప్ప విజయంగా వుంటుంది. మనం చేసే ప్రతి పని లోను, విజయం సాధించడంలో దీని పాత్ర ప్రముఖంగా వుంటుంది.   

 
మనసును బాధ పెట్టే  మాటలు

  • మనం చాలా సార్లు అనాలోచితంగా, అనవసరంగా, ఎదుటివారిని మన మాటలతో బాధ పెడతాము. ఇది మనం బాగా గమనించాలి. ఏ మాటలు మనల్ని బాధ పెడతాయో ఆటువంటివి ఇతరులపై ఎప్పుడూ వాడకుం  డా  - బాగా జాగ్రత్త పడాలి. 
  • కొన్ని మాటలు బాధ పెడతాయనే విషయం కూడా మనకర్థం కాదు. ఒక తల్లి తోనో, తండ్రి తోనో,  వారి పిల్లల్ని పోల్చి చెప్పేటప్పుడు, అ పిల్లల్ని, మీరు ఎన్ని రకాలు గానో పొగుడుతూ  చెప్ప వచ్చు. చెప్పాలి.   అలా కాకుండా, మీ పిల్ల  మీ  స్టాంప్ అని  మీ కంటే బాగా రంగు తక్కువగా వున్న వారితో మీరు అంటే -  వారు చిన్న బుచ్చుకోవచ్చు.  "అప్రియమైనది"  సత్యమైనా వూరుకూరికే చెప్పాల్సిన పని లేదని,  అటువంటి సత్యం పనికి రాదని - మరో వ్యాసంలో ఇదివరకే చదివాము. 
  • అదే విధంగా - అశ్లీల పదాలు - చాల మందిని బాధిస్తాయి. వారెవరినీ బాధించే హక్కు మీకు లేదు. అవి వాడకండి. 
  • జాతి, మత, వర్గ, కుల, లింగ భేదాల కారణంగా - మీరు కాని, మీకు చెందని జాతి, మత, వర్గ, కుల, లింగము ల వారిని - ఎప్పుడూ ఆ ప్రాతిపదిక పైన తిట్టకండి. మీ, నా, వారి జన్మలేవీ - మన చేతుల్లో లేవు. వారి చేతుల్లో లేని విషయానికి - వారిని దూషించకండి. మన సంస్కృతి - "సర్వే జనాః  సుఖినో భవంతు"  అనే అంటుంది.   ఎవరి న్యాయమైన ఆనందాన్నీ  మన మాటలతో తగ్గించే  అధికారం మనకు లేదు. ఈ రోజు ప్రపంచంలో జరిగే కలహాలకన్నిటికీ ముఖ్య కారణం ఇదే.
  • కొంత మంది - కావాలనే , పని గట్టుకుని, యితరుల మనసులను గాయ పరిచే కార్యక్రమాలలో మునిగి వుంటారు. ఇటువంటి దైనందిన జీవిత విలన్లకు - వారి మందే వారికి  ప్రతి వొక్కరూ తినిపిస్తే గాని బుద్ధి రాదు. ఇటువంటి వారు చాలా మంది వున్నారు. వారికి - వారి బలహీనతను గురించి - కరుకు గానే, స్పష్టంగానే  చెప్పాలి.లేకుంటే - ఎంతో మంది, అమాయకుల, నోరులేని వారి,  సంతోషాలు, వీరి మాటలకు బలి ఐపోతూ వుంటుంది. వీరు కూడా సమాజంలో - వొక రకమైన నేరస్తులే - ఎన్ని నేరాలు చేసినా శిక్ష పడని నేరస్తులు వీరు. వీరిని అందరూ చేరే మార్చాలి.   

నిజానికి మనసును బాధ పెట్టే  మాటలు - చెప్పిన వారు త్వరగా మర్చిపోతారు. కాని, విన్న వారికి  చాలా కాలం గుర్తుంటాయి.  కొన్ని మాటలు జీవితాంతమూ  గుర్తుంటాయి. ఆ మాటలు చెప్పిన వారినీ, ఆ మాటలనూ - మర్చి పోవడం చాలా కష్టం.నోటితో మాట్లాడిన ఇలాంటి మాటలు మనస్సు పైన హత్తుకుపోయి వూడి రావడం చాలా కష్టమై పోతుంది.


మరి - ఇటువంటి మాటల శాతం ఎంత వుండాలి?  సున్నా శాతం!! మాటల విలన్లను సరి దిద్దడానికి  తప్ప  యింకెక్కడా  - యిటువంటి మాటలు వాడనే వాడ రాదు.


మాటల్లో ఆడ - మగ తేడా
 
మాట్లాడే విషయం లో - మగ వాళ్ళకూ, ఆడ వాళ్ళకూ మధ్య తేడాలున్నాయి.

సగటు మగవాడి కంటే - సగటు ఆడది మూడు రెట్లు ఎక్కువ మాటలూ మాట్లాడుతుంది; ఆ మాటలను, ఎదుటి వారికి బాగా తెలిసేటట్లు చెప్పడానికి శారీరక హావ భావాలను కూడా చాలా  ఎక్కువగా వాడుతుంది.

ఈ  విషయంలో,  ఆడవాళ్ళతో పోలిస్తే,  మగవాళ్ళు మాటలతో బాటు, శారీరక హావ భావాలను వాడటం చాలా తక్కువ. ఏ దేశాని కెళ్ళినా - యిది సర్వ సాధారణంగా, పుట్టుకతో వచ్చిన ప్రవృత్తి లాగా, మనకు తెలుస్తుంది. అందుకనే - చాల సంస్థలలో - కస్టమర్లకు, యితరులకు, సందేహ నివృత్తికి, సంస్థాగత విషయాలను చెప్పడానికి - ఆడవాళ్ళను ఎక్కువగా వాడతారు.

మగ వాడు ఏ చలనం  లేకుండా  "ఆరో కౌంటర్" అని నోటితో అనడానికీ, ఆడది నోటితో "ఆరో కౌంటర్" అని, తల (దాదాపు శరీరమంతా) ఆరో కౌంటర్ వైపు త్రిప్పి, చేయి ఆరోకౌంటర్ వైపు  చూపడానికి -  ఎంతో తేడా వుంది కదా!  
అయితే - యిది 'సగటు' ఆడ, మగ వారి స్వభావము. 

చాలా మంది మగ వారు కూడా - కొంత హావ భావాలను వాడడమూ, మనం చూడవచ్చు. 

అదే మాదిరి - కొన్ని సంస్థలలో, ఆడ వారు కూడా, శరీరం, తల, చేతులు ఏవీ కదల్చకుండా - "ఆరో కౌంటర్" అనడమూ మనం చూడవచ్చు.అంటే మగ వారిని అనుకరిస్తున్నారన్న మాట. యిందులో - ఏది సరి ఐనదో - తేట తెల్లమే కదా!

మగ వాళ్ళు, హావ భావాలు, మరీ ఎక్కువ వాడితే - బాగుండదు. కాని కొంతైనా వాడాలి.

అదే మాదిరి, ఆడ వాళ్ళు కూడా, తమ సహజ సిద్ధమైన హావ భావాలను, మృదువైన కంఠధ్వనిని (మగ వారిని, వారి స్వరాన్ని  అనుకరించ కుండా)  బాగా వాడితేనే బాగుంటుంది. నెలల పసి పాపతో మాట్లాడ  గలిగే నేర్పు, వోర్పు దేవుడి వరం. అది పోగొట్టుకో కూడదు.

ముందు చెప్పినట్లు - మనో, వాక్, కాయ, కర్మలన్నిటినీ మిళితం చేసి వాడితే - మాటే మంత్రము.

మంత్రానికి - మామిడికాయలూ రాలుతాయి. మనుషుల మనుషులూ మీ ముందు వాలుతాయి.

యిక - దేవుడిచ్చిన - ఈ గొప్ప వరాన్ని ఎలా వాడుతారో - మీ జీవితాన్ని  ఎంతగా ఆనందమయం చేసుకుంటారో - మీ యిష్టమే!!

= మీ

వుప్పలధడియం విజయమోహన్    


16, మే 2011, సోమవారం

ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు? వై మీ ?

యిలా నాకే ఎందుకు జరిగింది?

ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు?

ఈ రోగాలన్నీ  నాకే  ఎందుకు?

నాకే ఎందుకు ? వై మీ  ?


ఈ ప్రశ్నలు దాదాపు ప్రతి వొక్కరి మనస్సులో - ఎప్పుడో వొకప్పుడు - తలెత్తు తూనే వుంటాయి. 

కానీ - జరిగిన మంచివన్నీ - "యివన్నీ, నాకే ఎందుకు జరిగిందని" - అనుకోము; అడగము; బాధ పడము.

ఏ చిన్న కష్టం వచ్చినా, రోగం వచ్చినా, నష్టం వచ్చినా - "నాకే ఎందుకు" - అని అనుకుంటాము; అడుగుతాము; బాధ పడతాము.

యిది సగటు మనిషి మనస్తత్వము.

గోడంతా తెల్లగా మెరిసిపోతున్నా - దాన్ని గమనించక, గోడమీద వున్న చిన్న నల్ల చుక్క ను, చూస్తూ కూర్చునే మనస్తత్వం  మనది.

మీకున్న, మీకు వస్తున్న, మీ సుఖాలను, మీ ఆరోగ్యాన్ని, మీ ఆస్తి పాస్తులను, మీ  కుటుంబం యొక్క బలాన్ని, అది మీకిస్తున్న రక్షణను  - యిటువంటి,  మీకున్న, మీరు సంతోష పడ దగిన ఎన్నో అంశాలు - మీ మనసులో వుండనే వుండవు.  మనలో చాలా మంది అంతే.   గోడను చూడలేరు. నల్లచుక్కను మాత్రమే చూస్తారు.

ఇది మారాలి.

రోగాలనుండి ,నష్టాల నుండి ,  కష్టాల నుండి, చావు నుండి, తప్పించుకున్న వ్యక్తి ఈ రోజు వరకు ఎవరూ లేరు. ఏ దేశం లోనూ లేరు.

 "నేను" మాత్రం రోగాలు, కష్టాలు రాని వ్యక్తి గా  వుండ గలనా?  కాదు కదా!

చాలా, చాలా అభివృద్ధి చెందిన (అమెరికా లాంటి ) దేశాలలో కూడా - ప్రతి రోగానికీ - మందుల అమ్మకం, మన దేశం కంటే చాలా ఎక్కువ .మన ఫార్మా కంపెనీల లాభాలలో ఎక్కువ శాతం లాభం అమెరికా నుండి రావాలని - .   మన కంపెనీలు ప్రయత్నం చేస్తాయి. 

కష్టాలు, నష్టాలు, రోగాలు, అన్నీ - అక్కడా ఎక్కువే.

రోగాలు, కష్టాలు - డబ్బుండే  వాడికీ  ఎక్కువే;  పదవి వుండే వాడికీ ఎక్కువే;  బలం వుండే వాడికీ ఎక్కువే.

 అయితే - ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా - చలించని వ్యక్తులు ,సంతోషాన్ని  పోగొట్టు కోని  వ్యక్తులు మన దేశంలో,  చాలా, చాలా మంది వున్నారు తెలుసా. 

ఏదొచ్చినా ఏడిచే వాళ్ళూ వున్నారు. ఏదొచ్చినా ఏడవని వాళ్ళూ వున్నారు మన దేశంలో.

అయితే - ఎప్పుడూ, సంతోషంగా ఉండగలిగే వారిలో -కనీసం    అలా వుండాలని ప్రయత్నించే వారిలో - నాలుగు రకాల తేడాలను మనం చూడొచ్చు.


1 . కొంతమంది జ్ఞానులున్నారు.  వీరిని గురించి శ్రీ కృష్ణుడు, సాంఖ్య యోగం లో చెబుతాడు. ఉపనిషత్తులలో వుండే దంతా  - వీరిని గురించే. 

"ఈ  దేహం నేను కాదు; ఈ దేహం నా ది   కాదు.  ఈ  మనస్సు నేను కాదు; ఈ మనసు నాది కాదు" - అని ,

నిస్సందేహంగా తెలుసుకున్న వారిని జ్ఞానులంటారు. 

కష్టాలు, రోగాలు, బాధలు - మనసుకో, దేహానికో గదా. నేను కాని దానికి, నాది కాని దానికి, వచ్చే వాటికి - నేనెందుకు బాధ పడాలి? యిదీ వీరి తత్వం. నేను ఆనంద స్వరూపుడిని - నాకేం కష్టాలు - అంటారు వీరు. 

రమణ మహర్షి ఇటీవలి కాలం లో పుట్టి పెరిగి, చని పోయిన మహా జ్ఞాని. ఆ మార్గానికి ముఖ్యమైన మెట్టు  - "నేనెవరు?" అన్న ప్రశ్నకు నిస్సంశయంగా  బదులు తెలుసుకోవడమే.  తెలుసుకున్న వారికి - ఏ కష్టాలూ లేవు. 


2 . రెండవది కర్మ యోగ మార్గం


మీకే  కష్టమొచ్చినా, సుఖమొచ్చినా, రోగాలొచ్చినా, ఆనందమొచ్చినా , ఆరోగ్య మొచ్చినా, అన్నిటికీ కారణం - మీరు చేసిన పనుల (కర్మల) ఫలితమే. 


అయితే - ఈ క్షణం నుండి - సత్-కర్మలు చేయడం ద్వారా - వీటి బాధల నుండి, భవిష్యతు లో  తప్పించుకోవచ్చు. 

మనం - మన పనులను, వాటి ఫలాలైన కష్టాలను, రోగాలను, సుఖాలను  ఎలా తీసుకోవాలని కూడా - కర్మ యోగం మనకు చెబుతుంది.  

పనులను (కర్మలను), దేవుడికి (కర్మఫలదాతకు) "అర్పణ" భావంతో చెయ్యాలి. అంటే - ఈ పనులను నా వెనుకనుండి, చేయిస్తున్నది - నీవే - అన్న భావం తో - చేయాలి.  


గీతలో - కృష్ణుడు - అర్జునునితో - వీళ్ళందరినీ  చంపే వాడిని నేను. విల్లు నీవు సంధిస్తే చాలు అంటాడు! కర్మ లో భగవదార్పణం వుండాలి  - వుంటే - అది మామూలు కర్మ(పని) నుండి - కర్మ యోగం గా మారిపోతుంది. అంటాడు కృష్ణుడు.

కర్మ చేయడంలో మన భావం యిలా వుంటే - కర్మ ఫలం వచ్చేటప్ఫుడు, మన పనికి ఫలితం వచ్చేటప్ఫుడు,  మనలో  ఎలాంటి  భావం వుండాలి?

అన్నీ కర్మ ఫల దాత ఇచ్చే ప్రసాదమే. అందువలన, ఫలితం ఏదైనా - నువ్విచ్చే ప్రసాదమే గనుక -  నీ ప్రసాదాన్ని సంతోషంగా స్వీకరిస్తాను, అనే భావన వుండాలి. 

లాభమైనా, నష్టమైనా - ఆరోగ్యమైనా, రోగమైనా - ఏదైనా -  నీ ప్రసాదంగా స్వీకరిష్టాను - అని,  అన గలగాలి. కర్మలో "అర్పణ భావం" , కర్మఫల స్వీకరణలో - "ప్రసాద భావం" వున్న వాడు కర్మ యోగి. కర్మ యోగిని, ఎటువంటి కష్టాలూ, నష్టాలూ అంటవు.

3 . . మూడవది భక్తి  మార్గం. ఎక్కడ చూసినా దేవుడే, ఏదిచ్చినా దేవుడే; మన దగ్గరున్నదంతా - దేవుడికే - యిలా, తనను తాను, పూర్తిగా భగవదార్పణం కావించుకోగలవారు  - భక్తులు. 

ఏదొచ్చినా- దేవుడే తమను పరీక్షిస్తున్నాడని, తద్వారా, దేవుడు తమకు ధగ్గరౌతున్నాడని నమ్మగలిగే వారు. ఏ కష్టాన్నీ, లెక్క చేయరు.


4 . నాలుగవ మార్గం ధ్యాన మార్గం.  


పతంజలి దీన్ని - క్రియా యోగం అని కూడా అంటారు. ధ్యానము, సమాధి లాంటి ప్రక్రియల ద్వారా, వీరు తమ నిజమైన "స్వ" రూపాన్ని తాము తెలుసుకొన్న వారు అవుతారు. తమ మనస్సులపై పూర్తి ఆధిపత్యం సంపాదించ గలుగుతారు. 

ఈ ఆధిపత్యాన్ని (చిత్త వృత్తి నిరోధాన్ని)   - యోగము, క్రియా యోగం, ధ్యాన యోగం అని వెవ్వేరు పేర్లతో పిలుస్తారు. మనస్సు పై, పూర్తి ఆధిపత్యం సంపాదించిన యిటువంటి వారికి -  కష్టాలు, రోగాలొస్తే  అస్సలు లెక్క లేదు. చాలా వరకు - రానే రావు.

మన మనసుల్లో వచ్చే - "నాకే ఈ కష్టాలెందుకు, రోగాలెందుకు", "అయ్యో దేవుడా, యివి ఎలా భరించేది?"  -లాంటి ప్రశ్నలు  - పైన చెప్పిన నలుగురికీ రావు. 

యిందులో - ఈ కాలపు వాళ్లకు - కాస్త సులభ మార్గము అని చెప్పాలంటే - కర్మ యోగాన్ని  చెప్పచ్చు.

నాకే ఎందుకు - అన్న ప్రశ్నకి - నేను చేసాను కాబట్టి, ఫలితం నాకే వచ్చింది, నాకే వస్తుంది -  అన్నది, కర్మ యోగం సమాధానం.

ఈ రోజు చేసే పనికి - రేపో, మాపో, ఎప్పుడో  ఫలితం వస్తుంది - మీకే వస్తుంది.

కాబట్టి,  ఈ రోజు ఎలాంటి పని చేయాలో, దానిపై దృష్టి సారించండి. రేపటి మీ భవిష్యత్తు బాగుంటుంది.

యిప్పుడు - వచ్చిందానికి  నేనేమి చేయడం? 

"ఏదొచ్చినా - అన్నీ నీ ప్రసాదమే - సంతోషంగా స్వీకరిస్తాననే, ప్రసాద భావం మనసులో పెట్టుకోవడమే.  

ఏదొచ్చినా- ఏదీ- మనతో, ఎప్పుడూ వుండి పోదు.  ఈ కష్టమూ పోతుంది. ఈ రోగమూ పోతుంది. వున్నా దాన్ని నేను ఖాతరు చెయ్యను. -అని అనుకోగలగడం గొప్ప వరం.

దీన్ని మించి - మనం చేయాల్సింది మరొకటుంది.

దేవుడు - కష్టాలు మాత్రం ఈలేదు. సుఖాలనూ ఇచ్చాడు. ఆ లిస్టు చాలా పెద్దది.  మీరు రాయరు. కానీ, రాసే వారు, మహా సంతోష పడతారు. 

దేవుడు రోగాలను మాత్రం యివ్వ లేదు. ఆరోగ్యం కూడా యిచ్చాడు. కానీ - ఆరోగ్యంగా వున్న రోజులు, హాయిగా వున్న రోజులు - ఎంత ఎక్కువగా వున్నా - మీరు అవి జ్ఞాపకం పెట్టుకోరు.

తెల్ల గోడ పైన తెలుపు చూడరు. నల్ల మచ్చను మాత్రము చూస్తారు.
  .

అందుకే మన వాళ్ళు, ప్రతి రోజూ,  తెల్ల వారి లేచిన వెంటనే - దేవుడికి - దేవుడు తమకిచ్చిన వరాలన్నిటికీ  చేర్చి - మొట్ట మొదట కృతజ్ఞత తెలిపేవారు. యిన్ని వరాలిచ్చిన దేవుడు - ఏదో చిన్న కష్టం, లేదా రోగం యిస్తే - అదీ ప్రసాధమే అన్న భావన వెంటనే వస్తుంది. 

అప్పుడు రోగం కూడా త్వరగా పోతుంది. ఈ  నాటి - పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్  - యింత కంటే - గొప్పదేమీ  కాదు. వైద్యుడిదగ్గరికి పోవద్దని కాదు. నమ్మకం తో వెళ్ళండి. మీ వైద్యుడికీ ఇలాంటి నమ్మకమే వుండాలి. ఏ రోగమైనా పోతుంది.


యిప్పుడు చెప్పండి!

కష్టాలు - మీకు మాత్రమే -  వస్తున్నాయా?
మీకు - కష్టాలు మాత్రమే -  వస్తున్నాయా?

                     సుఖాలు కూడా వస్తున్నాయా, లేదా?

రోగాలు - మీకు మాత్రమే -  వస్తున్నాయా?
మీకు - రోగాలు  మాత్రమే -  వస్తున్నాయా?

                       మీకు ఆరోగ్యమూ, వుంది కదా?

మీ కష్టాలూ, మీ రోగాలు - యిచ్చిన వాడు, యిచ్చినట్టే - తీసుకెళ్ళుతాడు. యిది నమ్మండి.

ఈ క్షణంలో - సంతోషంగా వుండండి. 

= మీ

వుప్పలధడియం విజయమోహన్

15, మే 2011, ఆదివారం

విజయానికి మార్గాలు = అంతా మీలో వుంది



మీ ఏ విజయానికైనా - మీరు, దానికి, తీసుకున్న బాధ్యతలే మఖ్య కారణం. 

బాధ్యత  తీసుకోకుండా ఏ విజయమూ రాదు.

మరి - మీ బాధ్యతలేమిటి?

విజయం మొదట మీ బుద్ధిలో పుడుతుంది.  పుట్టాలి.

మీకు ఏదో కావాలి. కావాలి అనిపించడం - అది బలంగా మనసులో నాటుకొవడం -   మీ మొదటి విజయం.


 
దీనికి కారణం - మీ "యిచ్చా శక్తి". 

కావలసిన వస్తువు, చేర వలసిన  గమ్యము - ఎలా పొందాలి, ఎలా చేరాలి, అన్న తీవ్ర ఆలోచన మీ మనసులో రావాలి.      ఇది మీ "జ్ఞాన శక్తి."  


మీకూ , మీ గమ్యానికీ మధ్య  - మార్గం - మీరు వేసేదే.

మరో మార్గం లేదు.  మీరు వేసేదే మార్గం.


మీ మనసులో వుండే భావ తీవ్రతకు - ప్రకృతి శక్తులూ, తలూపుతాయి. మీ గమ్యం - మరెవరికీ బాధాకరం కానిదయితే, అవీ మీకు  చేయూతనిస్తాయి. 

మీ గమ్యం, పదిమందికి   ఉపయోగ కరమైన దైతే - ప్రకృతి  శక్తులు కూడా -  మిమ్మల్ని  గమ్యం వైపు తీసుకెడతాయి; గమ్యాన్ని కూడా , మీవైపూ తీసుకొస్తాయి.

నిస్స్వార్థ గమ్యానికి - మీతో బాటు - అవీ రావడానికి, ఎంతో యిష్ట పడతాయి. 

అయితే  - బాధ్యత మీదే. గమ్యం చేరే వరకు - మీరు చేయవలసిన పనులు మీరు చేయాల్సిందే..
ఇది మీ  "క్రియా శక్తి". 

మీ ఇచ్చా శక్తి, మీ జ్ఞాన శక్తి, మీ క్రియా శక్తి - మీరు సరి ఐన గమ్యం కోసం వాడండి.

ప్రకృతి శక్తులు మీకు తోడుంటాయి.


గమ్యమే లేని వాడికి - ఎవరు తోడుండగలరు?  కాబట్టి - మీకు గమ్యం వుండాలి. గమ్యం చేరడమే విజయం. మీ మొట్ట మొదటి బాధ్యత, మీ  గమ్యం స్థిరపరచడమే.

స్వంత ఆలోచనే ఉపయోగించని వానికి - ఎవరు - ఆలోచన నీయ గలరు? కాబట్టి - మీ రెండవ బాధ్యత - మీ గమ్యానికి సరి ఐన బాట మీరు వేయాలి.

తన బాధ్యత తాను తీసుకొని వానికి - ఎవరు సహాయ పడ గలరు? మీ మూడవ  బాధ్యత - మీరు వేసిన బాటలో - మీరు ప్రయాణం చేయాలి - గమ్యం వరకూ.



మరో సారి చూడండి :


మీ విజయానికి మొదటి మెట్టు - మీ ఇచ్చా శక్తి. దీనితో - మీ గమ్యాన్ని స్థిరం చేయండి.

రెండవ మెట్టు - మీ జ్ఞాన శక్తి. దీనితో మీ మార్గాన్ని స్థిరం    చేయండి. 

మూడవ మెట్టు - మీ క్రియా శక్తి - మీ మార్గంలో, మీ గమ్యం వైపు, ప్రయాణం మొదలు పెట్టండి. మీరు గమ్యం వైపు, గమ్యం మీ వైపు రావడం గమనించండి.

గమ్యం వచ్చే వరకు నిలవకండి; నిలపకండి.

విజయం మీదే.

- మీ

వుప్పలధడియం విజయమోహన్

వొక్క క్షణం ఆగండి = ఆగి దారి మళ్లించండి



వొక్క క్షణం ఆగండి. మీకీ కథ చెప్పాలి. మీరిది వినాలి.
యిది ఎక్కడో  చదివాను - కానీ,  యిది కొంత వరకు  ప్రసిద్ధమైన  సంఘటనే.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో -యిద్దరు పాపలు - వొక అక్క, వొక తమ్ముడు ఖైదీలుగా  , నాజీ ల దగ్గర పట్టుబడి విడిపోతారు. 

నాజీ ల చేత విడ గొట్ట బడటానికి ముందు - తమ్ముడు, రైలు పట్టాల మీద ఆడుకుంటూ తన షూ / సాక్స్ ను పోగొట్టుకుంటాడు. అప్పుడు వాడి అక్క, వాడిని బాగా తిట్టేస్తుంది . వచ్చేది చలి కాలము, యిప్పుడు సాక్సులను పోగొట్టుకున్నావే, మూర్ఖుడా, అంటూ, రక,రకాలుగా, అక్క తమ్ముడిని తిడుతూ వుండగానే -  వారిద్దరూ విడగొట్ట బడతారు.చెరొక రైలులో - చెరొక ఖైదీల  కాంపుకు  తీసుకుని  వెళ్ల బడతారు. 

తరువాత, ఎప్పుడూ, అక్కా, తమ్ముడూ - కలవలేదు.

కొంత కాలం తరువాత, అక్క విడుదలవుతుంది. తమ్ముడు మరో కాంపులో చనిపోయినాడన్న  వార్త వింటుంది.
భోరుమని ఏడుస్తుంది.

విడిపోవడానికి ముందు , తమ్ముడిని తానన్న కరుకైన తిట్లు తలుచుకుని చాలా, చాలా బాధ పడు తుంది.  

ఆ కొన్ని క్షణాలను  - మరెంతగా, తమ్ముడికి ధైర్యం చెప్పడానికో, సంతోషంగా వుండడానికో - వుపయోగించి   వుంటే - ఎంత బాగుండేది? కనీసం మనం ఎలా కలవగలం, నువ్వెలా వుండాలి - అని చెప్పి వుంటే - ఎంత బాగుండేది - అని రక రకాలుగా, చాలా బాధ పడింది.

యిప్పటికి, కొన్ని క్షణాల తరువాత - ఏం జరుగుతుందో - మనకు తెలీదు.

కాని, మన వాళ్ళు, మనతో వున్న ఈ క్షణాలను మనం ఎంతో వ్యర్థం చేసుకుంటున్నాము. వొకరితో వొకరు కొట్లాడుకో వడానికి , వాదించడానికి, వైరం పెంచుకోవడానికి, ముభావంగా కూర్చోవడానికి - ఇలాంటి పనులకే ఎక్కువగా ఉపయోగిస్తున్నాము.

అమూల్యమైన ఈ క్షణాలను -వ్యర్థం చేసుకుంటున్నాము.

(i ) పిల్లలు అల్లరి చేస్తే మనం కోప్పడతాము. కొడతాము. తిడతాము. తప్పని చెప్పను.  కానీ- వొక్క సారి -యోచన చేసి చూడండి  - 

పిల్లలు లేనివారు, చెట్ల చుట్టూ, రాళ్ల చుట్టూ, డాక్టర్ల చుట్టూ, మీ పిల్లల వంటి పిల్లలు తమకు పుట్టాలని  తిరుగుతున్నారు. అటువంటి అల్లరి కోసమే - వాళ్ళ మనసులు తహతహలాడుతున్నాయి. మరి వున్న దాని విలువ మనకెందుకు తెలియడం లేదు?  తెలుసు. అయినా వోర్పు లేని తనంతో - పిల్లలకు, మనకు మధ్య, మాటలతో, చేతలతో అంతరం మనమే కల్పించుకుంటాము. 

అనే మాటలు, చేసే, చేతలలో - మరింత ప్రేమ నింపి అదే మాటలే అన్నా, అదే చేతలే చేసినా - మీ క్షణాలు వృథా కావు. మీ క్షణాలు మధుర క్షణాలు కావచ్చు. మీ పిల్లలతో - మీ సంబంధం ఎంతో మెరుగుగా వుంటుంది.


(ii )  మీకు తెలుసా?  మీ పిల్లలు, మీకు దేవుడిచ్చిన వరమని!  ఎంతో  మందికి, ఎందుకో గానీ, దేవుడు, మీకిచ్చిన గొప్ప వరం ఇవ్వలేదు.  దేవుడిచ్చిన ఆ వరాన్ని  - మీరు ఎలా చూసుకోవాలి?   వరం లాగానా, శాపం లాగానా? తప్పులు చెయ్యని పిల్లలు లేరు, యిప్పటి వరకు పుట్టలేదు. తప్పులను మీరు సరిదిద్దాలి. చెప్పొచ్చు. కొట్టొచ్చు కూడా. కాని - అన్నిటిలో - అమితమైన ప్రేమ వుండాలి. అది - ఆ పిల్లలకు తెలియాలి. ఆ పిల్లలే లేక పోతే - మీ జీవితం నిస్సారమని కూడా తెలుసుకోండి. 

(iii ) మీకు తెలుసా?  మీ భర్త / మీ భార్య , మీకు దేవుడిచ్చిన వరమని!  దేవుడిచ్చిన ఈ  వరాన్ని  - మీరు ఎలా చూసుకోవాలి?   వరం లాగానా, శాపం లాగానా?

లక్ష రూపాయలను మీకిస్తే - మీరెంత భద్రం గా చూసుకుంటారు?
కోటి రూపాయలిస్తే - అంత కంటే - భద్రంగా చూసుకుంటారా - లేదా? 

మీ భర్త / మీ భార్య - మీకు దేవుడిచ్చిన  ఎంతో, ఎంతో  అమూల్యమైన కానుక.  ఆ కానుక విలువ చాలా కుటుంబాలలో, ఇద్దరికీ తెలియడం లేదు - సుమా!

వొక 45  రోజులు - " తను ఏం చేసినా, ఎలా వున్నా - నా భార్య లేదా భర్త తో నేను మాత్రం మృదువుగానే, ప్రేమ గానే, మాట్లాడుతాను" - అని వొట్టే సుకోండి. దేవుడి ముందు ప్రమాణం చేయండి. పాటించండి; చూద్దాం.

రేపు ఎవరుంటారో వుండరో - రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో - ఆ అక్కకూ - తెలియలేదు.    మనకూ తెలియడం లేదు. ఈ రోజు, మనం తిడుతున్న / కొట్లాడుతున్న  -   ఈ  భార్య / భర్త - రేపు లేక పోతే? రేపు లేయక పోతే? అప్పుడు పశ్చాత్తాప పడి  ప్రయోజనం ఏమిటి? 

అందుకని - మీ ప్రతి మాటలోనూ, చేతల్లోనూ - ప్రేమ నింపండి. తిట్లలో కూడా. 

వారికి - మీరు ఏమేం చేయగలరో - అవన్నీ  చేయండి. యిది జన్మ జన్మల అనుబంధమనే - భావన వారిలో మీరు కలుగ జేయాలి.  మీ కంటే మంచి భర్త లేదా భార్య మరొకరు దొరకరనే భావన వారిలో కలగాలి.

అప్పుడు - వారిలోనూ, అనూహ్యమైన మార్పు వస్తుంది.  కొందరిలో, వొక వారంలోనే మార్పు రావచ్చు. కొందరిలో - 45 రోజులూ పట్ట వచ్చు. కొందరిలో - మరో 45 రోజులూ కావచ్చు.  కాని మార్పు తప్పకుండా వస్తుంది.  మీ లోని మార్పు - రాయిని కూడా కరిగించ గల శక్తి కలది.

(v )  మీ అమ్మ, నాన్న - మీకు ఎన్నో చేశారు. వారు, - దేవుడు మీకిచ్చిన అతి గొప్ప వరం.  మీ వయసెంతయినా  ఫరవాలేదు. (యిది మీరు తప్పకుండా చేసి వుండరు). మీ అమ్మ వొళ్ళో; మీ నాన్న వొళ్ళో, తల వాల్చి పడుకుని - "మీరు నాకెంతో చేశారు, మీరంటే నాకెంతో యిష్టం" అని చెప్పి చూడండి. అదీ - ఏదైనా, మంచి రోజు నాడు, చేయండి.  మీరు ఎన్ని తప్పులు చేసివున్నా - వాళ్ళు , యిట్టే- క్షమించేస్తారు. వారిలో, పొంగి పొరలే సంతోషాన్ని, తృప్తినీ చూడండి.

రేపటి ప్రయాణంలో - మనతో బాటు నడిచే వారెవరో మనకు   తెలీదు.  ఈ రోజు, ఈ క్షణాలనెలా గడపాలన్నదే - మనముందున్నది. మనం చేయగలిగేది.

(vi ) యాభై సంవత్సరాల క్రితం వరకూ - మన దేశంలో - పెద్ద పెద్ద కుటుంబాలు కలిసే వుండేవి. అప్పట్లో, చిన్న చిన్న రచ్చలు వచ్చినా- అందరికీ - ఆ కుటుంబాలలో వున్న  సౌభాగ్యం, సౌలభ్యం తెలిసి వుండేది. "కలసి వుంటే, కలదు సుఖం" లాంటి సినిమాలు వచ్చేవి - ఆ రోజుల్లో.  

కాని - తరువాత రోజుల్లో, ఈ పెద్ద కుటుంబాలు వద్దు - అనుకునే వారు ఎక్కువయినారు. పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలు కావడము, చిన్న కుటుంబాలు, మరీ  చిన్న కుటుంబాలు కావడము జరుగాయి. యిప్పుడు - తల్లితండ్రులు - కొడుకు, కోడళ్ళతో వుండడానికే  యిష్టం చూపడం లేదు. కోడళ్ళు, అత్త, మామలతో వుండడానికి యిష్టం చూపడం లేదు. వొక్కొక్క సారి - కొడుకులు కూడా, తల్లి తండ్రులను తమతో చూసుకోవడానికి యిష్టం చూపడం లేదు. ఎన్నో కారణాలు.

స్వార్థం చాలా ముఖ్యమైన కారణం. కనీసపు  ముందు చూపు లేకపోవడం రెండవ కారణం. వొకరితో, వొకరు సర్దుకుని పోయే స్వభావం లేక పోవడం మరొక కారణం. 

ఇప్పుడున్న  పరిస్థితి - తల్లిదండ్రులు వేరే కుటుంబం. లేదా, వృద్ధాశ్రమాలలో  వుండడం . కొడుకు కోడళ్ళు వేరే కుటుంబం.   పిల్లలు - హాస్టళ్ళలో. 

వస్తున్న పరిస్థితి - భార్య, భర్త కూడా, వొకటిగా, వొక చోట వుండటానికి యిష్టం చూపక పోవడం!!
పెళ్ళే వద్దు. ఏ బంధమూ వద్దు -  ఏ బాదర బందీ వద్దు - అనుకునే పరిస్థితి. ఎవరూ, ఎవరినీ నమ్మలేని పరి స్థితి.ఎవరూ, ఎవరితోనూ, సర్దుకోలేని పరిస్థితి.  ఆంగ్లం లో " ఐ యాం ఓకే - యు ఆర్   ఓకే" అన్న ప్రసిద్ధమైన వొక సిద్దాంతం వుంది. అందులో చెప్పిన - "నేనూ బాగలేదు - నువ్వూ బాగ లేదు - వారూ బాగ లేదు"  ( ఐ యాం నాట్ ఓకే - యు ఆర్  నాట్  ఓకే, దే ఆర్ నాట్ ఓకే) అన్న పరిస్థితిలో వున్నారు చాలా మంది.

ఎక్కడికి వెళ్ళుతున్నాం మనం?

రేపు ఏమవుతుందో తెలీదు. ఈ రోజు - మీ పరుగును - మీ వొంటరి పరుగును - ఆపండి. ఏం జరుగుతోందో, వొక్క సారి చూడండి.

మీలో యిప్పుడు రాజ్యమేలుతున్న -  సందేహాలు, అనుమానాలు, అహంకారాలు మాత్రమే కాదు.

మీలో  -  ప్రేమ అనే దేవుడు వున్నాడు. 

వాడిని - నిద్ర లేపండి. ప్రేమ ముందు -  అన్ని సందేహాలు, అనుమానాలు, అహంకారాలు కరిగి పోతాయి. ప్రపంచమే కొత్తగా, ఎంతో అందంగా కనిపిస్తుంది.
ప్రేమంటే - ఈ రోజుల్లో అపోహ పడుతున్నట్టు, సెక్సు కానే కాదు. ప్రేమంటే - కరుణ, ఆదరణ,

నిన్ను నాలోని  భాగంగా చూడగలగడం. నీ బాగోగులు - నా బాధ్యత అని ఆనందంగా తీసుకోగలగడం . నీ సంతోషానికి నేను కారణంగా వుంటానని చెప్ప గలగడం. నీ కష్టాలన్నిటిలో, నీడగా, తోడుగా వుంటానని - చెప్పగలగడం, వుండగలగడం - యిదీ ప్రేమంటే.

వొక్క క్షణం నిలిచి యోచన చేయండి. మీరు ఎంత మంది సంతోషానికి, బాధ్యత తీసుకుంటున్నారని.

నిజానికి - చాలా మంది - తమ సంతోషానికి కూడా, బాధ్యత తీసుకోవడం లేదు.
మీలో ప్రేమ లేని నాడు, మీలో బాధ్యత లేదు. - మీలో మనిషీ లేడు; దేవుడూ  లేడు. 

ఆ ప్రేమే మీలో వుంటే - మీరే దేవుడై పోతారు.

ఈ వొక్క రోజు - మీ చుట్టూ వున్నా వారిలో - సంతోషాన్ని పంచండి . చూద్దాం.

మీ జీవితం చాలా, చాలా, మారిపోతుంది.

వేరే ఏమీ, ఎవరూ - మీకు చెప్పాల్సిన అవసరమే లేదు.

ఇందులో ఏమీ కష్టమే లేదు. సుఖం తప్ప. ఆనందం తప్ప. అసలు, సిసలైన, నిజమైన జీవితం తప్ప.

అందుకే వొక్క క్షణం ఆగండి. ఆగి దారి మళ్లించండి.

ఈ  వొక్క రోజు ప్రేమపథంలో వెళ్లుదాం.ప్రతి వొక్కరికీ  సంతోషాన్ని పంచుదాం. ప్రపంచాన్ని ప్రేమ మయంగా మారుద్దాం.

= మీ

వుప్పలధడియం  విజయమోహన్