15, మే 2011, ఆదివారం

వొక్క క్షణం ఆగండి = ఆగి దారి మళ్లించండి



వొక్క క్షణం ఆగండి. మీకీ కథ చెప్పాలి. మీరిది వినాలి.
యిది ఎక్కడో  చదివాను - కానీ,  యిది కొంత వరకు  ప్రసిద్ధమైన  సంఘటనే.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో -యిద్దరు పాపలు - వొక అక్క, వొక తమ్ముడు ఖైదీలుగా  , నాజీ ల దగ్గర పట్టుబడి విడిపోతారు. 

నాజీ ల చేత విడ గొట్ట బడటానికి ముందు - తమ్ముడు, రైలు పట్టాల మీద ఆడుకుంటూ తన షూ / సాక్స్ ను పోగొట్టుకుంటాడు. అప్పుడు వాడి అక్క, వాడిని బాగా తిట్టేస్తుంది . వచ్చేది చలి కాలము, యిప్పుడు సాక్సులను పోగొట్టుకున్నావే, మూర్ఖుడా, అంటూ, రక,రకాలుగా, అక్క తమ్ముడిని తిడుతూ వుండగానే -  వారిద్దరూ విడగొట్ట బడతారు.చెరొక రైలులో - చెరొక ఖైదీల  కాంపుకు  తీసుకుని  వెళ్ల బడతారు. 

తరువాత, ఎప్పుడూ, అక్కా, తమ్ముడూ - కలవలేదు.

కొంత కాలం తరువాత, అక్క విడుదలవుతుంది. తమ్ముడు మరో కాంపులో చనిపోయినాడన్న  వార్త వింటుంది.
భోరుమని ఏడుస్తుంది.

విడిపోవడానికి ముందు , తమ్ముడిని తానన్న కరుకైన తిట్లు తలుచుకుని చాలా, చాలా బాధ పడు తుంది.  

ఆ కొన్ని క్షణాలను  - మరెంతగా, తమ్ముడికి ధైర్యం చెప్పడానికో, సంతోషంగా వుండడానికో - వుపయోగించి   వుంటే - ఎంత బాగుండేది? కనీసం మనం ఎలా కలవగలం, నువ్వెలా వుండాలి - అని చెప్పి వుంటే - ఎంత బాగుండేది - అని రక రకాలుగా, చాలా బాధ పడింది.

యిప్పటికి, కొన్ని క్షణాల తరువాత - ఏం జరుగుతుందో - మనకు తెలీదు.

కాని, మన వాళ్ళు, మనతో వున్న ఈ క్షణాలను మనం ఎంతో వ్యర్థం చేసుకుంటున్నాము. వొకరితో వొకరు కొట్లాడుకో వడానికి , వాదించడానికి, వైరం పెంచుకోవడానికి, ముభావంగా కూర్చోవడానికి - ఇలాంటి పనులకే ఎక్కువగా ఉపయోగిస్తున్నాము.

అమూల్యమైన ఈ క్షణాలను -వ్యర్థం చేసుకుంటున్నాము.

(i ) పిల్లలు అల్లరి చేస్తే మనం కోప్పడతాము. కొడతాము. తిడతాము. తప్పని చెప్పను.  కానీ- వొక్క సారి -యోచన చేసి చూడండి  - 

పిల్లలు లేనివారు, చెట్ల చుట్టూ, రాళ్ల చుట్టూ, డాక్టర్ల చుట్టూ, మీ పిల్లల వంటి పిల్లలు తమకు పుట్టాలని  తిరుగుతున్నారు. అటువంటి అల్లరి కోసమే - వాళ్ళ మనసులు తహతహలాడుతున్నాయి. మరి వున్న దాని విలువ మనకెందుకు తెలియడం లేదు?  తెలుసు. అయినా వోర్పు లేని తనంతో - పిల్లలకు, మనకు మధ్య, మాటలతో, చేతలతో అంతరం మనమే కల్పించుకుంటాము. 

అనే మాటలు, చేసే, చేతలలో - మరింత ప్రేమ నింపి అదే మాటలే అన్నా, అదే చేతలే చేసినా - మీ క్షణాలు వృథా కావు. మీ క్షణాలు మధుర క్షణాలు కావచ్చు. మీ పిల్లలతో - మీ సంబంధం ఎంతో మెరుగుగా వుంటుంది.


(ii )  మీకు తెలుసా?  మీ పిల్లలు, మీకు దేవుడిచ్చిన వరమని!  ఎంతో  మందికి, ఎందుకో గానీ, దేవుడు, మీకిచ్చిన గొప్ప వరం ఇవ్వలేదు.  దేవుడిచ్చిన ఆ వరాన్ని  - మీరు ఎలా చూసుకోవాలి?   వరం లాగానా, శాపం లాగానా? తప్పులు చెయ్యని పిల్లలు లేరు, యిప్పటి వరకు పుట్టలేదు. తప్పులను మీరు సరిదిద్దాలి. చెప్పొచ్చు. కొట్టొచ్చు కూడా. కాని - అన్నిటిలో - అమితమైన ప్రేమ వుండాలి. అది - ఆ పిల్లలకు తెలియాలి. ఆ పిల్లలే లేక పోతే - మీ జీవితం నిస్సారమని కూడా తెలుసుకోండి. 

(iii ) మీకు తెలుసా?  మీ భర్త / మీ భార్య , మీకు దేవుడిచ్చిన వరమని!  దేవుడిచ్చిన ఈ  వరాన్ని  - మీరు ఎలా చూసుకోవాలి?   వరం లాగానా, శాపం లాగానా?

లక్ష రూపాయలను మీకిస్తే - మీరెంత భద్రం గా చూసుకుంటారు?
కోటి రూపాయలిస్తే - అంత కంటే - భద్రంగా చూసుకుంటారా - లేదా? 

మీ భర్త / మీ భార్య - మీకు దేవుడిచ్చిన  ఎంతో, ఎంతో  అమూల్యమైన కానుక.  ఆ కానుక విలువ చాలా కుటుంబాలలో, ఇద్దరికీ తెలియడం లేదు - సుమా!

వొక 45  రోజులు - " తను ఏం చేసినా, ఎలా వున్నా - నా భార్య లేదా భర్త తో నేను మాత్రం మృదువుగానే, ప్రేమ గానే, మాట్లాడుతాను" - అని వొట్టే సుకోండి. దేవుడి ముందు ప్రమాణం చేయండి. పాటించండి; చూద్దాం.

రేపు ఎవరుంటారో వుండరో - రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో - ఆ అక్కకూ - తెలియలేదు.    మనకూ తెలియడం లేదు. ఈ రోజు, మనం తిడుతున్న / కొట్లాడుతున్న  -   ఈ  భార్య / భర్త - రేపు లేక పోతే? రేపు లేయక పోతే? అప్పుడు పశ్చాత్తాప పడి  ప్రయోజనం ఏమిటి? 

అందుకని - మీ ప్రతి మాటలోనూ, చేతల్లోనూ - ప్రేమ నింపండి. తిట్లలో కూడా. 

వారికి - మీరు ఏమేం చేయగలరో - అవన్నీ  చేయండి. యిది జన్మ జన్మల అనుబంధమనే - భావన వారిలో మీరు కలుగ జేయాలి.  మీ కంటే మంచి భర్త లేదా భార్య మరొకరు దొరకరనే భావన వారిలో కలగాలి.

అప్పుడు - వారిలోనూ, అనూహ్యమైన మార్పు వస్తుంది.  కొందరిలో, వొక వారంలోనే మార్పు రావచ్చు. కొందరిలో - 45 రోజులూ పట్ట వచ్చు. కొందరిలో - మరో 45 రోజులూ కావచ్చు.  కాని మార్పు తప్పకుండా వస్తుంది.  మీ లోని మార్పు - రాయిని కూడా కరిగించ గల శక్తి కలది.

(v )  మీ అమ్మ, నాన్న - మీకు ఎన్నో చేశారు. వారు, - దేవుడు మీకిచ్చిన అతి గొప్ప వరం.  మీ వయసెంతయినా  ఫరవాలేదు. (యిది మీరు తప్పకుండా చేసి వుండరు). మీ అమ్మ వొళ్ళో; మీ నాన్న వొళ్ళో, తల వాల్చి పడుకుని - "మీరు నాకెంతో చేశారు, మీరంటే నాకెంతో యిష్టం" అని చెప్పి చూడండి. అదీ - ఏదైనా, మంచి రోజు నాడు, చేయండి.  మీరు ఎన్ని తప్పులు చేసివున్నా - వాళ్ళు , యిట్టే- క్షమించేస్తారు. వారిలో, పొంగి పొరలే సంతోషాన్ని, తృప్తినీ చూడండి.

రేపటి ప్రయాణంలో - మనతో బాటు నడిచే వారెవరో మనకు   తెలీదు.  ఈ రోజు, ఈ క్షణాలనెలా గడపాలన్నదే - మనముందున్నది. మనం చేయగలిగేది.

(vi ) యాభై సంవత్సరాల క్రితం వరకూ - మన దేశంలో - పెద్ద పెద్ద కుటుంబాలు కలిసే వుండేవి. అప్పట్లో, చిన్న చిన్న రచ్చలు వచ్చినా- అందరికీ - ఆ కుటుంబాలలో వున్న  సౌభాగ్యం, సౌలభ్యం తెలిసి వుండేది. "కలసి వుంటే, కలదు సుఖం" లాంటి సినిమాలు వచ్చేవి - ఆ రోజుల్లో.  

కాని - తరువాత రోజుల్లో, ఈ పెద్ద కుటుంబాలు వద్దు - అనుకునే వారు ఎక్కువయినారు. పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలు కావడము, చిన్న కుటుంబాలు, మరీ  చిన్న కుటుంబాలు కావడము జరుగాయి. యిప్పుడు - తల్లితండ్రులు - కొడుకు, కోడళ్ళతో వుండడానికే  యిష్టం చూపడం లేదు. కోడళ్ళు, అత్త, మామలతో వుండడానికి యిష్టం చూపడం లేదు. వొక్కొక్క సారి - కొడుకులు కూడా, తల్లి తండ్రులను తమతో చూసుకోవడానికి యిష్టం చూపడం లేదు. ఎన్నో కారణాలు.

స్వార్థం చాలా ముఖ్యమైన కారణం. కనీసపు  ముందు చూపు లేకపోవడం రెండవ కారణం. వొకరితో, వొకరు సర్దుకుని పోయే స్వభావం లేక పోవడం మరొక కారణం. 

ఇప్పుడున్న  పరిస్థితి - తల్లిదండ్రులు వేరే కుటుంబం. లేదా, వృద్ధాశ్రమాలలో  వుండడం . కొడుకు కోడళ్ళు వేరే కుటుంబం.   పిల్లలు - హాస్టళ్ళలో. 

వస్తున్న పరిస్థితి - భార్య, భర్త కూడా, వొకటిగా, వొక చోట వుండటానికి యిష్టం చూపక పోవడం!!
పెళ్ళే వద్దు. ఏ బంధమూ వద్దు -  ఏ బాదర బందీ వద్దు - అనుకునే పరిస్థితి. ఎవరూ, ఎవరినీ నమ్మలేని పరి స్థితి.ఎవరూ, ఎవరితోనూ, సర్దుకోలేని పరిస్థితి.  ఆంగ్లం లో " ఐ యాం ఓకే - యు ఆర్   ఓకే" అన్న ప్రసిద్ధమైన వొక సిద్దాంతం వుంది. అందులో చెప్పిన - "నేనూ బాగలేదు - నువ్వూ బాగ లేదు - వారూ బాగ లేదు"  ( ఐ యాం నాట్ ఓకే - యు ఆర్  నాట్  ఓకే, దే ఆర్ నాట్ ఓకే) అన్న పరిస్థితిలో వున్నారు చాలా మంది.

ఎక్కడికి వెళ్ళుతున్నాం మనం?

రేపు ఏమవుతుందో తెలీదు. ఈ రోజు - మీ పరుగును - మీ వొంటరి పరుగును - ఆపండి. ఏం జరుగుతోందో, వొక్క సారి చూడండి.

మీలో యిప్పుడు రాజ్యమేలుతున్న -  సందేహాలు, అనుమానాలు, అహంకారాలు మాత్రమే కాదు.

మీలో  -  ప్రేమ అనే దేవుడు వున్నాడు. 

వాడిని - నిద్ర లేపండి. ప్రేమ ముందు -  అన్ని సందేహాలు, అనుమానాలు, అహంకారాలు కరిగి పోతాయి. ప్రపంచమే కొత్తగా, ఎంతో అందంగా కనిపిస్తుంది.
ప్రేమంటే - ఈ రోజుల్లో అపోహ పడుతున్నట్టు, సెక్సు కానే కాదు. ప్రేమంటే - కరుణ, ఆదరణ,

నిన్ను నాలోని  భాగంగా చూడగలగడం. నీ బాగోగులు - నా బాధ్యత అని ఆనందంగా తీసుకోగలగడం . నీ సంతోషానికి నేను కారణంగా వుంటానని చెప్ప గలగడం. నీ కష్టాలన్నిటిలో, నీడగా, తోడుగా వుంటానని - చెప్పగలగడం, వుండగలగడం - యిదీ ప్రేమంటే.

వొక్క క్షణం నిలిచి యోచన చేయండి. మీరు ఎంత మంది సంతోషానికి, బాధ్యత తీసుకుంటున్నారని.

నిజానికి - చాలా మంది - తమ సంతోషానికి కూడా, బాధ్యత తీసుకోవడం లేదు.
మీలో ప్రేమ లేని నాడు, మీలో బాధ్యత లేదు. - మీలో మనిషీ లేడు; దేవుడూ  లేడు. 

ఆ ప్రేమే మీలో వుంటే - మీరే దేవుడై పోతారు.

ఈ వొక్క రోజు - మీ చుట్టూ వున్నా వారిలో - సంతోషాన్ని పంచండి . చూద్దాం.

మీ జీవితం చాలా, చాలా, మారిపోతుంది.

వేరే ఏమీ, ఎవరూ - మీకు చెప్పాల్సిన అవసరమే లేదు.

ఇందులో ఏమీ కష్టమే లేదు. సుఖం తప్ప. ఆనందం తప్ప. అసలు, సిసలైన, నిజమైన జీవితం తప్ప.

అందుకే వొక్క క్షణం ఆగండి. ఆగి దారి మళ్లించండి.

ఈ  వొక్క రోజు ప్రేమపథంలో వెళ్లుదాం.ప్రతి వొక్కరికీ  సంతోషాన్ని పంచుదాం. ప్రపంచాన్ని ప్రేమ మయంగా మారుద్దాం.

= మీ

వుప్పలధడియం  విజయమోహన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి