28, ఏప్రిల్ 2018, శనివారం

మీరు బాగు పడాలంటే, కోటీశ్వరులు కావాలంటే, రాబోయే 3 నెలలలో మీరేం చెయ్యాలి ?

  

మీ భవిష్యత్తు విధి నిర్ణయమా? 

  మీ నిర్ణయమా?


నాకెందుకు యిలా ఆక్సిడెంట్ జరిగింది? నాకెందుకు ఈ రోగం వచ్చింది ? నాకెందుకు యిన్ని కష్టాలు వస్తూనే వున్నాయి?  నేను ఎంత జాగ్రత్తగా వున్నా నాకే యిలా ఎందుకు జరుగుతూ వుంది ?


మనం ఎప్పుడూ అనుకోని విపత్తులు, చెడు, చేదు సంఘటనలు, అనుభవాలు  మన జీవితంలో జరుగుతూ వుంటే మనకు యిలా అనిపిస్తూనే  వుంటుంది. 

కానీ, మంచి, మేలు జరిగినప్పుడు యిలా అనిపించదు. నాకే ఎందుకు యీ మంచి జరిగింది - అని అనుకునే వాడెవడూ ఉండడు.  మన మనస్సు ఆడే ఆట యిది. 

మన, కొన్ని సాధారణ జీవితానుభవాలు పరిశీలిద్దాం. మనం విత్తనాలు నాటుతాం. వాన వస్తుంది అని ఎదురు చూస్తాం. వాన రావచ్చు. రాకపోవచ్చు. లేదా, మరీ ఎక్కువగా రావచ్చు. 

విత్తనాలు నాటడం, నీరు పట్టడం లాంటివి మన చేతిలో వున్న, మనం చేయవలసిన పనులు. కానీ, మనం చేసే పనుల యొక్క ఫలితాలు మాత్రం మన చేతిలో లేవు. ఆ ఫలితాలు ఎవరు నిర్ణయిస్తున్నారో, అవి ఎవరి చేతిలో ఉందో మనకు తెలీదు. దాన్నే మనం విధి నిర్ణయం అని ఒక్కో సారి అంటూ వుంటాము.

వాన వస్తే, భూమి బాగుంటే, మొలకెత్తి పెరిగే శక్తి  మనం నాటిన విత్తనంలో వుంది. అది పెరిగేటప్పుడు, పురుగు పట్టకుండా చూసుకునే బాధ్యత మన పైన వుంది. అంత మాత్రం మనం చెయ్యగలం. చెయ్యాలి . 

పెరిగేది మొలకే. అందులో మనం చేసేదేమీ లేదు. పెరగ గలిగే శక్తి, సామర్థ్యము ఆ గింజలోను, ఆ మొలకలోను  పెట్టే దాన్ని పుట్టించాడు సృష్టి కర్త. మొలక పెరుగుతూ ఉంటే, మనం చూసి సంతోషించ వచ్చు. అది పెరిగేటప్పుడు మళ్ళీ, నీళ్లు పట్టడం లాంటి చిన్న, చిన్న పనులు చెయ్యడం మన వంతు.

మనలోనూ, విత్తనం లాగా, మొలక లాగా పెరిగే గుణం, ఆరోగ్యంగా ఉండగలిగే గుణం, సంతోషంగా ఉండగలిగే గుణం అన్నీ వున్నాయి. కానీ, మన జీవితాలు సక్రమంగా ఉండాలంటే, బాగుండాలంటే యివి చాలవు. 

మన వంతు బాధ్యతలు, మన తీసుకోవలసిన నిర్ణయాలు, మనం చెయ్యవలసిన పనులు చాలావున్నాయి. వాటితో బాటు మన జీవితాలను శాసిస్తూ ప్రకృతి చేసే పనులు, చుట్టూ వుండే మనుషులు చేసే పనులు కూడా చాలా వున్నాయి. ఈ రెండింటి కలయికతోనే మనం పుట్టడము, పసిపాపలు గా పుట్టిన మనం ఎదిగి పెద్దవాళ్లుగా, ముసలి వాళ్ళుగా మారడము, సుఖాలు, దుఃఖాలు, రోగాలు, నానా యీతి బాధలు అనుభవించడము, చివరకు చనిపోవడము, భూమి లో కలిసిపోవడము యివన్నీ మన అందరి జీవితాల్లో జరగడము మనం చూస్తూనే వున్నాము . 

మన వర్తమానము, మన భవిష్యత్తు కేవలం మన నిర్ణయాలు, మనం చేసే పనుల పైన మాత్రం ఆధారపడి లేదు - అన్న విషయం మనకు తెలుస్తూనే వుంది కదా. అలాగే కేవలం ప్రకృతి శక్తులపై కూడా పూర్తిగా ఆధార పడి వుండ లేదు. ఈ రెండింటి కలయికే మన వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 


శ్రీకృష్ణుడు భగవద్ గీతలో అన్నదానికి అర్థం యిదే . 

"నువ్వు చేసే పనులు - పూర్తిగా నీ నిర్ణయాలే, నీ బాధ్యతే. కానీ వాటి ఫలితాలు మాత్రము నీ హక్కు కాదు; నీ బాధ్యత కాదు. నీ అధికారమూ కాదు . నీకు ఏది ఫలితంగా రావాలో అది కర్మఫలదాత అయిన నా చేత నిర్ణయింప బడుతుంది. నీకు నా చేత నిర్ణయింపబడిన ఆ  ఫలితమే లభిస్తుంది. అది కూడా, ఎప్పుడు,ఎలా వస్తుంది - అన్న విషయం నీకు తెలీదు. అది నువ్వనుకున్నట్టు, నువ్వనుకున్న సమయానికి రాకపోవచ్చు. అలాగని, నువ్వు నిర్ణయాలు తీసుకోవడము, పనులు చెయ్యడము మానకూడదు. అది నీ బాధ్యత. నీకు నాచే నిర్ణయింపబడిన ఫలితం వస్తుంది. ఎప్పుడు,ఎలా అన్నది నీకు  తెలీక పోవచ్చు. అంతే." 

యిది ఏదో మత పరంగా చెప్పిన సూక్తి కాదు. యిది  కేవలం సైన్స్. శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ సైన్సే. ఒక హిందూయిజమ్ కు మాత్రం సంబంధించింది కాదు. 

యిది అర్థమైన తర్వాత, యింకాస్త లోతుగా ఆలోచిద్దాం.

సంతోషంగా ఉండడం ప్రతి మనిషి బాధ్యత. ప్రశాంతంగా ఉండడం ప్రతి మనిషి బాధ్యత. తన  కర్తవ్యమేమిటో నిర్ణయించుకోవడం కూడా ప్రతి మనిషి బాధ్యతే. 

మనం సంతోషంగా లేదు - అంటే, ఎక్కడో, ఏదో, మనం తప్పు చేస్తున్నామన్న మాటే. సంతోషంగా వుండగలగడం అనేది మన సహజ గుణం.దేన్ని గురించి మనం సంతోషం విడిచి పెట్టినా - అది మన అజ్ఞానమే అంటారు విజ్ఞులు.

అలాగే ప్రశాంతంగా ఉండగలగడం, మనం చెయ్యవలసిన పని ఏమిటో అది మనం నిర్ణయించుకోవడం - యివన్నీ మనం స్వయంగా చెయ్యవలసిన పనులే. 

ప్రతి పనికీ ఒక ఫలితం వుంటుంది. పని  చెయ్యడం మన వంతు. ఫలితం పొందడం కూడా మన వంతే. కానీ ఫలితం యివ్వడం, ఎప్పుడు, ఎలా యివ్వాలో నిర్ణయించడం మాత్రం మన వంతు కాదు. అది ఆ  కర్మ ఫల దాత వంతు - అంటాడు శ్రీకృష్ణుడు.


యుధిష్ఠిరుడు జూదం ఆడకుండా ఉంటే - పాండవులు అరణ్యాలకు పోవలసిన ప్రమేయం లేదు. మహాభారత యుద్ధం చెయ్యనక్కర లేదు. అంత మంది ఆ ఘోరమైన యుద్ధంలో చావనవసరం లేదు. 

ఒకరు చేసే ఇలాంటి చిన్న, పెద్ద తప్పులు చాలా మంది యొక్క భవిష్యత్తును రకరకాలుగా శాసిస్తాయనడానికి యిది ఒక పెద్ద ఉదాహరణ.  అవునా, కాదా? మీరు చేసిన, చేస్తున్న తప్పులు మీ జీవితాన్ని, మీతో బాటు యెంతో  మంది జీవితాలను యిలా కష్టపెడుతూ వుండొచ్చు. యోచించండి. 

అలాగే , మీరు  తీసుకునే కొన్ని చొరవలు,  చేసే కొన్ని ప్రయత్నాలు - మీ  జీవితాల్లో, ఎన్నో విజయాలను కూడా సాధించిపెడతాయి. మీలో ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరే స్వయంగా తరచి చూస్తే, వెదికి  చూస్తే, మీ విజయాలకు వెనుక మీరు తీసుకున్న చొరవలు, చేసిన ప్రయత్నాలు తప్పక కనిపిస్తాయి. 

అలాగే, మీ జీవితంలో సంభవించిన దుష్ఫలితాలకు వెనుక - మీరు చెయ్యని పనులు, మీ సోమరితనాలు, మీరు వేసిన తప్పటడుగులు కనిపిస్తాయి. 

ఇది బాగా మీకు అర్థమయితే, మీరు బాగా తెలుసుకుంటే - మీ ఆలోచనల్లో తప్పకుండా మార్పు రావాలి. మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవడానికి, వొక వుజ్జ్వల భవిష్యత్తుకు మీరే పునాది వేసుకోవడానికి మీరు ముందుకు రావాలి. 

రాబోయే మూడు నెలలలో - మీరేదయినా నేర్చుకోవాలని ప్రణాళిక వేసుకున్నారా? 

ఏదైనా, మీకో, సమాజానికో ఉపయోగపడే పని చెయ్యాలని పథకం వేసుకున్నారా? 

మీ ఆరోగ్యాన్ని మరింత బాగా చేసుకోవడానికి ఏం చెయ్యాలని అనుకున్నారు? 

మీరు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఏం చెయ్యాలని ఆలోచించారు?

మీ కుటుంబంలో వున్న అందరు ఇప్పటి కంటే యింకా ఎక్కువ బాగుండాలంటే - మీరు, వారు ఏం చెయ్యాలో, చెయ్యగలరో బాగా ఆలోచించి చెప్పండి చూద్దాం? 

ఇలా మీ భవిష్యత్తును మీరే నిర్మించు కోవడానికి ఎప్పుడైనా యోచన చేశారా? యోచన చేసి, ఏదైనా ప్రణాళికలు, పథకాలు సిద్ధం చేశారా? అటువంటి పథకాలు ఎప్పుడైనా అమలు చేశారా? 

నిజానికి - చాలా కుటుంబాలలో, ఇటువంటివి తప్పకుండా ఉండాలి కానీ లేవు. అందుకే , ఎక్కడ వున్న గొంగళి అక్కడే ఉంటూ వుంది చాలా కుటుంబాలలో. ఎవ్వడో రావాలని, ఎవ్వడో మీ అభివృద్ధి కోసం ఏదో చెయ్యాలని అనుకుంటూ వుంటారు. 

ఇక ముందు అలా ఎదురు చూపులు చూడకండి. మీ జీవితానికి మీరే అన్నీ చెయ్యాలి. మీ అభివృద్ధి పథాన్ని మీరే నిర్మించుకోవాలి.  మీరు గట్టిగా అనుకుంటే, మీ అభివృద్ధి కోసం మీరు ఏదైనా చేస్తే, దాని ఫలితం మీకు తప్పక వస్తుంది. 


ప్రతి మూడు నెలలలో ఏదైనా ఒక విద్య , ఏదైనా ఒక కళ, ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి - అని ప్లాన్ చెయ్యండి. కనీసం, తెలుగులో - రెండు పాటలు పాడడం ప్రాక్టీస్ చెయ్యండి. కొన్ని క్రొత్త వంటకాలు నేర్చుకోండి. ఇప్పుడు ప్రతి యింట్లో సెల్ ఫోన్లు , ఇంటర్నెట్, యూట్యూబ్ అన్నీ వున్నాయి. యూట్యూబ్ లో మీరు నేర్చుకోగలిగినవి ఎన్నో వున్నాయి, వంటలతో సహా, పాటలతో సహా, ఎన్నో కళలతో సహా. అవన్నీ వెదకండి. మీకు ఇష్టమైనవి నేర్చుకోండి. 


మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వెదకండి. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఈ విషయాలు చర్చించండి, కనీసం వారానికి ఒక్క సారి. మీ యింటి ఖర్చులు తగ్గించుకునే మార్గాలు కూడా వెదకండి.  


మీ ఆరోగ్యాన్ని, శరీర దృఢత్వాన్ని, బలాన్ని పెంచుకునే మార్గాలు వెదకండి. కాస్త సోమరితనం విడిచి ఏ శారీరక వ్యాయామాలు చేసినా, మూడు నెలల్లోనే , మీరు ఎంతో బలమైన, దృఢమైన , అందమైన వ్యక్తిగా మారే   అవకాశం చాలా వుంది. మన దేశానికి కూడా అలాంటి వ్యక్తులు కావాలి. ఇది మీ జీవితంలోనే చేసి ఫలితాలు పొంది, అనుభవించి చూపించండి. 

ఏదైనా వ్యసనాలు వుంటే - అవి మాన్పుకునే మార్గాలు వెదకండి. చెడు  విడిచిపెట్టడం చాలా ముఖ్యం. మీ జీవితంలో చెడు  ఉన్నంత కాలం, మంచి రావడం చాలా కష్టము.  

మంచి స్నేహితులను వెదుక్కోండి. వారి స్నేహాన్ని మాత్రం కోరుకోండి. మరేదీ వారి వద్ద ఆశించకండి. ఆ స్నేహం ద్వారానే, వారి జీవితాన్ని గమనించడం ద్వారానే , మీరెంతో లాభం పొందుతారు. 

ఒక చిన్న సలహా యిక్కడ యివ్వడం మంచిదనిపిస్తోంది. 

మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశంలో 5000 కు మించి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు వున్నాయి. వాటి షేర్ లు మనకు స్టాక్ మార్కెట్ లలో దొరుకుతాయి. అందులో 2000 కంపెనీలకు పైగా , ఎంతో కొంత ప్రతి సంవత్సరమూ అభివృద్ధి చెందుతున్నవే. వాటిలో 500 కంపెనీలు సంవత్సరానికి 20 శాతం నుండి 100 శాతం వరకు అభివృద్ధి చెందుతున్నాయి. 

అటువంటి  కంపెనీల షేర్ లు మీరు జాగ్రత్తగా పరిశీలించి కొనిపెట్టుకుంటే, ప్రతి సంవత్సరమూ, మీ పెట్టుబడి పెరగక మానదు. ఇలా కోటీశ్వరులైన వారు, మన దేశం లో ఎంతో మంది వున్నారు. మీరూ కావచ్చు. అలా కాకుండా మంచి మ్యూచ్యువల్  ఫండ్స్ లో మీ పెట్టుబడి పెడితే కూడా , వారు, మీ పెట్టుబడిని పెంపొందించగలరు. ఏది చేసినా ఎంతో కొంత నేర్చుకుని మీరు పెట్టుబడి పెట్టాలి. కష్టమేం లేదు. ప్రయత్నముండాలి. అంతే. 

మీరు దీన్ని గురించి నేర్చుకోవాలంటే - యూట్యూబ్ లో ఎంతో మంచి వీడియో లున్నాయి. వాటిని చూసి, విని కూడా నేర్చుకోవచ్చు. 

vijayamohan  stock market strategist  అన్న పేరుతో, నేను వేసినవే యిప్పటికి 10 వీడియో లున్నాయి. యూటుబ్లో అవి చూసి మీరు స్టాక్ మార్కెట్ ను గురించి పూర్తిగా నేర్చుకోవచ్చు.  యివి కాక, ఎంతో మంది వేసిన మంచి వీడియోలున్నాయి. అవన్నీ విని, చూసి, బాగా నేర్చుకోండి. మీరూ కోటీశ్వరులు కావచ్చు. 

అలాగే, మీర ఎంతో ఆరోగ్యవంతులు కావచ్చు. బలంగా, దృఢంగా, ఆత్మవిశ్వాసం కలవారుగా కావచ్చు. ఎన్నో కళలను , విద్యలను , యోగాను ,మరెన్నింటినో యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు. 

యిది ఎప్పుడు ప్రారంభిస్తారు? 

ఇప్పుడే. ఈ వ్యాసం చదివి  ముగించిన వెంటనే  ప్రారంభించండి. మీ అభివృద్ధి పథాన్ని మీరే మల్చుకోండి. 2019, ఏప్రిల్ ముగిసే లోపు  -మీరు చాలా, చాలా సాధించ వచ్చు. 

మీ ప్రయత్నం మీరు చేస్తే - దేవుడు తప్పక మీకు సహకరిస్తాడు ; ఆశీర్వదిస్తాడు ; సత్ఫలితాలను అందిస్తాడు. 

మరి - 

వెంటనే ఆరంభిస్తారా ?

శుభం భూయాత్ 
మీ 
ఉప్పలధడియం  విజయమోహన్