30, డిసెంబర్ 2011, శుక్రవారం

2012 వ సంవత్సరపు శుభారంభం = మీకందరికీ నా హార్దిక శుభాకాంక్షలు = 2011 ఎలా గడిచింది?

2012  వ సంవత్సరపు శుభారంభం 
ఈ శుభ సమయంలో -  మీకందరికీ నా హార్దిక శుభాకాంక్షలు .

2011  - మీ జీవితంలో ఎలా గడిచింది?

కొన్ని సుఖాలు, కొన్ని కష్టాలు; కొన్ని సంతోషాలు, కొన్ని దుహ్ఖాలు;

కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు; కొంత ఆరోగ్యం, కొంత అనారోగ్యం.


సరే. దేశానికెలా  గడిచింది?

లంచగొండితనం రాక్షస విహారం చేసింది. ధరల పెరుగుదల పారాకష్ట చేరింది.

రాజకీయాల్లో - అవినీతి మాత్రమే కాదు, తెలివిమాలిన తనం, కుల,మత రాజకీయాలు, 2011 లో ఎన్నో యింతలు పెరిగింది.

వొక బలిష్టమైన, సమర్థ వంతమైన, నిష్పాక్షికమైన    లోక్ పాల్ తీసుకురండని ప్రజల పక్షాన అన్నా హజారే గారు కోరితే - అందుకు, ప్రజలు, విపక్షాలు వారిని సమర్థిస్తే - చివరికి, రాజకీయ చదరంగంలోని - అన్ని రకాల చాణక్య నీతులూ ఉపయోగించి - ప్రభుత్వం - అది రాకుండా చేసింది. ముందేం జరుగుతుందో తెలీదు.  లోక్ పాల్ వస్తుందా, రాదా? గత 60 సంవత్సరాలలో - ఎందుకు రాలేదో  మాత్రం - చాలా స్పష్టంగా తెలిసి పోయింది.

అంతకు ముందు - అదే బాణీలో, బాబా రాం దేవ్ గారు - నల్ల ధనం గురించి చేపట్టిన ఆందోళన కూడా చాలా గొప్పదే. కాని - ప్రభుత్వం వారు, చేపట్టిన అర్దరాత్రి దాడి వలన - అది వీగిపోయింది.

మహాభారత యుద్ధం తర్వాత నిద్ర పోతున్న వీరుల పై అశ్వత్థామ  దాడి చేసి - వారిని చంపాడట.   ఆ పాపానికి - అప్పటి నుండి, యిప్పటి వరకు, కలియుగాంతం వరకు అశ్వత్థామ శిక్ష అనుభవిస్తూ వుంటాడట . నాకు మాత్రం - ఈసంఘటన తలుచుకుంటే - అదే జ్ఞాపకం వచ్చింది.

కాని - ప్రజలలో - రావాల్సిన స్పందన రాలేదు. రాందేవ్ గారు, పైనుండి క్రిందికి దూకాడట. ఎవరో ఆయన  శిష్యులిచ్చిన   చుడీదార్  వేసుకున్నాడట. నిద్ర నుండి లేచిన ఆ క్షణంలో  జరిగిన ఆ చిన్న చర్యను రకరకాలుగా ప్రభుత్వం వారు చెప్పుకున్నారు గానీ, ప్రజలూ దాన్ని విన్నారు గానీ -  ప్రభుత్వం నిర్వహించిన అమానుష చర్యను ఖండించాల్సినంతగా   ఖండించలేదనే  చెప్పాలి.

నా ఉద్దేశంలో - మన దేశానికి పట్టిన వొక రాక్షసి నల్ల ధనం. మరొకటి, దాని చెల్లెలు లంచగొండి తనం. రాం దేవ్ గారు మొదటి నుండి, మన దేశస్తుల నల్ల ధనం విదేశీ బాంకుల్లో  మూలుగుతోందనీ   - అది తీసుకు రాగలిగితే - మనం దేశం సుసంపన్నంగా వుంటుందనీ   -  చెప్పారు. కానీ - అది వెనక్కు తీసుకు రావడంలో - ప్రభుత్వానికి ఎంత మాత్రం - చిత్త శుద్ధి లేదని తెలుస్తూనే వుంది. ఎన్నో దేశాలు చేస్తున్న ఆ పని - మనం మాత్రం చేయడం లేదు. ఎందుకు? ఎందుకు?

అయితే - ప్రజల మనస్తత్వం విచిత్రమైనది. పక్కింటి వాడిని, రౌడీలో, పోలీసులో - కొడుతూ వుంటే - చంపేస్తే కూడా మనకేమీ పట్టనట్టు ఊరుకునే తత్వం   పెరిగిపోయింది మనకు. అది పోవాలి.

ప్రజల కంటే - టీం అన్నా సభ్యులు కూడా - రాం దేవ్ జీ గారిని - ప్రక్కన బెట్టడం - నాలుగెద్దులు, సింహం కథ లాగా వుంది. తరువాత - అదే పంథాను మళ్ళీ ప్రభుత్వం టీం అన్నా పై కూడా  ప్రయోగించాలని చూసింది.

కానీ - విపక్షాలూ, ప్రజలు, టీం అన్న సభ్యులూ బాగా మేల్కొనడంతో - చేయలేక పోయింది.

యూ.పీ.ఏ -1 ప్రభుత్వం దేశాన్ని నిజంగా,  అభ్యుదయ పంథాలో తీసుకెళ్ళిన  మాట   వాస్తవం. మరి అదే  యూ.పీ.ఏ -2  ప్రభుత్వం  - ఎందుకిలా ప్రవర్తిస్తోందో   అస్సలు తెలియడం లేదు.  ప్రధాని మన్మోహన్  సింగు గారు  యిప్పుడైన మేల్కొనాలి. వారిదైన - నిజాయితీ తో - ప్రభుత్వం నడపాలి. చెప్పుడు మాటలు పక్కన బెట్టి - మహాత్మా గాంధీ గారి పద్దతిలో - దేశాన్ని ముందుకు నడిపించాలి. తన పేరు చెడి పోతోందని, దేశం వక్ర మార్గాన్ని పట్టిందని - ఆయన అర్థం చేసుకోవాలి.

దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా - అస్తవ్యస్తం గా అయిపోతోంది. దేశ పాలనలో - తప్పులు చేయడమే -తమ వుద్యోగమన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. యిది చాలదన్నట్టు, ధరల పెరుగుదలను అరికట్టుతానంటూ -  రిజ ర్వు బ్యాంకి వారు - యిష్టం వచ్చినట్టు - వడ్డీ రెట్లు పెంచి - పారిశ్రామిక పెరుగుదలను పూర్తిగా తగ్గించేసింది. ప్రభుత్వం వారు ధరల తరుగుదలకు చేయవలసిన ఏ పనీ చేయలేదు.   దీనితో - కుక్క అరవాల్సిన చోట -గాడిద అరిచి దెబ్బలు తిన్న చందం అయిపోయింది. ధరలు తగ్గలేదు. అభివృద్ధి పడిపోయింది.

ఎవరు చెప్పినా - ఆర్.బీ.ఐ. పట్టించుకోవడం లేదు.

సరే. ఈ దెబ్బలతో - స్టాక్ మార్కెట్ - ఎప్పుడూ లేనంతగా పడిపోయింది. ఎన్నో, గొప్ప లాభాలు గడిస్తున్న కంపెనీల ధరలు కూడా -     ఎప్పుడూ లేనంతగా పడిపోయాయి.

అమెరికాలో - నిరుద్యోగుల సంఖ్య 6 %  దాటితే - వారు పెద్ద గోల పెట్టేస్తున్నారు. దానికి, ఎన్నో రకాల ప్రయత్నాలు, ప్లాన్లు అమలు చేస్తున్నారు. మన దేశంలో - నిరుద్యోగుల సంఖ్య ఎంత? చిరుద్యోగుల సంఖ్య ఎంత?

గణాంకాలే లేవు. మరి ప్లాన్లు ఎక్కడి  నుండి వస్తాయి? ఇంజనీరింగ్ చదివి నిరుద్యోగులు గానూ, చిరుద్యోగులు గానూ - వున్న వారిని ఎంతో మందిని నేను చూస్తున్నాను. అయిదు వేల రూపాయలు కూడా మాస వేతనం లేని , పట్ట భద్రులయిన నర్సులను, పది వేల జీతంతో పని చేస్తున్న డాక్టర్లను  చూస్తున్నాము.

ఈ పధ్ధతి మారేది ఎప్పుడు? అసలు యిది ఎవరు పట్టించుకుంటారు, ఎప్పుడు?

యిది చాలదన్నట్టు - రీటైల్ ఆర్ధిక వ్యవస్థలో - వాల్ మార్ట్ లాంటి విదేశీ కంపెనీలను తీసుకు రావాలని ప్రభుత్వం రకరకాల వాదనలు చేస్తోంది. తెచ్చేస్తానని బెదిరిస్తోంది. మన దేశంలో, వ్యవసాయం తరువాత - ఉపాధి కల్పన ఎక్కువగా వున్న మొదటి రంగం రీటైల్ వ్యవస్థ. అందులో - దాదాపు ఆరుకోట్ల మంది వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. నిస్సందేహంగా, వీరిలో - అసమర్థత, వుంది. లేదని కాదు. అదే అసమర్థత అన్ని రంగాల్లోనూ - వుంది. దాన్ని సవరించడానికి బదులు - వారి స్థానంలో - విదేశీ సంస్థలను తెస్తాననడం - ఏ మాత్రం న్యాయంగా లేదు. ప్రభుత్వ   రంగంలో - నికరంగా - వొక్క ఉద్యోగమూ సృష్టించ లేని ప్రభుత్వం, ఏకంగా, కోట్ల వుపాధులపై వేటు వేయ బూనడం,  చాలా ప్రమాద కరమైన విషయం. దీని వల్ల వ్యవసాయ దారులకు, వాడకం దారులకు మేలు జరుగుతుందట. అది తప్పని వాల్ మార్ట్ పుట్టిన దేశంలోనే మనకు తెలుస్తూ వుంది.

వొక వేళ రైటే అయినా  - మధ్య వాడిని చంపేస్తే, వాడి అన్నకూ, తమ్ముడికీ ఆస్తి ఎక్కువగా వస్తుంది - అన్న వాదనలాగా వుంది, యిది.  మరి, మధ్య వాళ్ళ నందరినీ చంపేద్దామా?

ప్రక్కనింటి   వాడి పెళ్ళాం కు ముక్కు బాగుందని -స్వంత పెళ్ళాం కు విడాకులిచ్చేసి - ఆవిడను పెళ్లి చేసుకున్నాడట. తరువాత తెలిసింది - ఆవిడ ముక్కు బాగుందని; మెదడు మాత్రం సరి లేదని.  ఇలాంటి పిచ్చి పనులు యిప్పుడు చాలా చూస్తున్నాము.

సరే. ప్రభుత్వం మారాలంటే - మనం చాలా మారాలి.

2012  లో  ప్రభుత్వం తీరు మారుతుందని - ఆశిద్దాము. నాకు మాన్ మోహన్ సింగు గారిపై - చిన్న ఆశ యింకా వుంది.

యింట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. మనం 2012 లో యింట గెలవాలి. యింట్లోని   అందరి మనసులనూ గెలవాలి. ప్రతి యింట్లోనూ - ప్రేమ, అభిమానం, సంతోషం, ఆదరణ చాలా, చాలా పెరగాలి. అహంకారము, కక్షలు, కార్పణ్యాలు పూర్తిగా పోవాలి.

పొరుగు వాడితో సఖ్యత పెరగాలి. పెరగాలంటే - పొరుగు వాడిపై నమ్మకం పెరిగేటట్లు - అందరం ప్రవర్తించాలి.  పొరుగు వాడి కష్టంలో - అడగకుండా మనమే సహాయం అందించే మనస్తత్వం పెరగాలి.

మన దేశంలో - దరిద్రమూ వుంది. మధ్య వర్గమూ వుంది. ధనిక వర్గమూ వుంది. దేశంలోని - అందరు బీద పిల్లలకూ - చదువూ, తిండీ -లోటు లేకుండా చేయడానికి మన వంతు సహాయం మనం ప్రతి వొక్కరూ చెయ్యాలి.  ఏదో వొక శరణాలయానికి, మీ వంతు సహాయం మీరు తప్ప కుండా చెయ్యండి. మీకు తెలుసు. మనం వెళ్ళేటప్పుడు మనతో, వచ్చేది ఈ మంచి (చెడు) పనుల ఫలితం మాత్రమే. యిచ్చేటప్పుడు వున్న సంతృప్తి, మరెప్పుడూ వుండదు.

ఈ కాలంలో -మరో జాడ్యం ప్రబలి పోతోంది. వొక ప్రక్క వయసయిన తల్లి తండ్రులను గమనించడం లేదు. మరో వైపు పిల్లలనూ గమనించడం లేదు. తల్లి దండ్రులపై గౌరవం పెరగాలి. పిల్లలపై ప్రేమ పెరగాలి. యిది రెండూ - సామాజిక వ్యవస్థకు పునాదులు. ఈ పునాదులు కూలిపోతే - మొత్తం వ్యవస్థే కూలిపోతుంది.

నా ఉద్దేశంలో - ఆడ వాళ్లకు - మెట్టినింటిపై   - గౌరవం, మమకారం క్రమక్రమంగా సడలి పోతోంది.  దీనికి - ఎన్నో కారణాలు. వచ్చిన కోడలిపై ప్రేమ చూపక పోవడం వొక కారణం. మరో వైపు, వచ్చే కోడళ్ళకి కూడా, పెద్ద వారిపై ఏ మాత్రము గౌరవం లేక పోవడం మరో కారణం. మన వ్యవస్థను కూల్చేసే చట్టాలు - మరో కారణం. ముఖ్య కారణం, ఆడవారిలో - సహనం బాగా తగ్గి పోతోంది. ప్రేమాభిమానాల స్థానంలో - అహంకారం పెరుగుతోంది. మా చిన్న తనంలో చెప్పే వారు - మగ వాడు చెడితే - వాడు మాత్రమే చెడతాడు; ఆడది చెడితే - ఊరంతా చెడుతుందని.

మన వ్యవస్థలో - ఆడ వాళ్ళకున్నంత గౌరవం - మరెక్కడా లేదు. ఆ గౌరవం తరగరాదు. అదే సమయంలో - ఆడవాళ్ళు - యింటికీ, దేశానికి చెడ్డపేరు తీసుకు రారాదు. ఈ మధ్య కొన్ని చోట్ల కొంత మంది ఆడ వారు, స్లట్ వాక్  అని - మా యిష్టం వచ్చినట్టు, మేము దుస్తులు వేసుకుంటాం, మా యిష్టం వచ్చినట్టు - మేము రోడ్లపై నడుస్తాం - అని ప్రదర్శనలు యిచ్చారు. యింత కంటే మూర్ఖత్వం మరోటి లేదు.  యిలా జరుగుతూ, జరుగుతూ, యిప్పుడు అమెరికా లాంటి దేశాలలో - పరిస్థితి ఏమిటంటే - వొకరిపై వొకరికి ఆకర్షణ పూర్తిగా పోయి, మగ వారిని మగవారు; ఆడవారిని ఆడవారు పెళ్లి చేసుకునే  స్థితికి వచ్చేసింది. యిప్పుడిప్పుడు, మన దేశంలో కూడా, యిది పెరుగుతూ వుంది. ఈ పరిస్థితి మారాలి. ఆడవారిలో - ఎంతో మంది మేధావులున్నారు. వారు, యిటువంటి వాటిని మార్చడానికి పూనుకోవాలి.

సరే. ఈ పరిస్థితికి కారణం 50  శాతం  మగవారిలో చోటు చేసుకున్న - విశ్రుంఖలత్వం  అని చెప్పక తప్పదు. నీకొక రూలు, నాకొక రూలు - అని మగ వాళ్ళు ప్రవర్తించడం మానాలి. రామాయణమంతా -  అదే చెబుతుంది.

మగ వారిలో - భార్యా పిల్లల పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతాయుతమైన ప్రవర్తన చోటు చేసుకోవాలి. మనం మారుతామా? 2012  లో మనం మారాలి.

2012  వ సంవత్సరానికి -కొన్ని ప్రత్యేకతలు వున్నాయని అంటారు.

ప్రపంచం ఏదో అయిపోతుందని - మాయన్ సంస్కృతి వారు వేల  ఏండ్ల క్రిందట రాసి పడేసారు. డిసెంబర్, 21 వ తేదీ నాడు, ఆ తేదీ దగ్గర - ఏదో అయిపోతుందని - వొక నమ్మకం. మిగతా ప్రత్యేకతలు, మరో సారి మాట్లాడదాం.

అయితే, గియితే - ఏం పరవాలేదు. మనమంతా, వొక్క సారి ఎక్కడికి వెళ్ళినా - మంచిదే. ఎక్కడికి వెళ్ళితే - అదే మన ప్రపంచం అయిపోతుంది. దాన్ని గురించి వచ్చే వదంతులను ప్రక్కన పెట్టండి.

దేశమును ప్రేమించుమన్నా ; మంచి అన్నది పెంచుమన్నా -అన్నది ఆర్యోక్తి.

కుల, మత, ప్రాంతీయ, భాషా విభేదాలను ప్రక్కన పెట్టి -మనమంతా వొక్క కుటుంబమే , మనమంతా సహోదరులమే. ప్రేమైక జీవులమే - అని గ్రహించి - మన యింటిని, ఊరినీ, దేశాన్ని - నందన వనం చేద్దాం.   

= మీ

వుప్పలధడియం విజయమోహన్

23, డిసెంబర్ 2011, శుక్రవారం

నన్ను చేరడానికి నాలుగు మార్గాలు? నీవెవరో తెలుసుకో?

ఆంగ్లంలో వొక నానుడి వుంది.

  • ఆయనకు తెలుసు. తనకు తెలుసుననీ ఆయనకు తెలుసు. ఆయన విజ్ఞుడు. మనం ఆయనను అనుసరిద్దాం.
  • మరొకాయనకు తెలుసు. కానీ, తనకు తెలుసునని ఆయనకు తెలీదు. ఆయన వొక రకమైన నిద్రలో వున్నాడు. తన జ్ఞానాన్ని వుపయోగించ లేని స్థితిలో వున్నాడు. ఆయనను నిద్ర లేపుదాం.
  • యింకొకాయనకు   తెలీదు. కానీ, తనకు తెలీదనే సంగతి ఆయనకు తెలుసు. ఆయన నేర్చుకో గలిగే స్థితిలో వున్నాడు.ఆయన విజ్ఞుడి దగ్గరకు వెళ్లి నేర్చుకోవాలి.
  • మరొకాయనకు తెలీదు. కానీ, తనకు తెలీదనే విషయం కూడా ఆయనకు తెలీదు. తనకు తెలుసనే భ్రమ లో ఉన్నాడు. తెలిసినట్టు ఏదేదో వాగుతున్నాడు. అటువంటి వారి చాయలకు కూడా వెళ్ళకండి.  వారు చాలా ప్రమాద కరమైన వ్యక్తులు.
యిలా నాలుగు రకాల మనుషుల గురించి ఈ నానుడి వుంది. ఏ విషయానికైనా - ఈ నాలుగు రకాల మనుషులూ వుంటారు.

క్షుణ్ణంగా తెలుసుకొని, అధ్యయనం చేసి, ఉపయోగిస్తున్న వారు విజ్ఞులు. వారు, తమ విజ్ఞత వలన తాము  ప్రయోజనం పొందుతున్నారు.  అందువలన, అటువంటి వారి వద్దకు మనమూ వెళ్లి, వారి విజ్ఞతను మనమూ పొందచ్చు.

మరి కొంత మందికి - కొన్ని విద్యలు వారికి తెలుసు. కాని, అవి తమకు తెలుసునన్న విషయమే వారు మర్చి పోయారు. హనుమంతుడు సర్వ విద్యా సంపన్నుడు. కాని - ఎవరైనా ఆయనకు చెప్పాలి. అప్పుడే అవన్నీ ఆయనకు  గుర్తుకు వస్తుంది.

కొంత మందికి కనీసం తమకు తెలీదన్న విషయం తమకు తెలుసు. వ్యాధి వస్తే, వైద్యుడి దగ్గరకు వెళ్లాలని, చదువుకోసం స్కూలుకెళ్ళాలని, వొక్కొక్క పని కోసం - ఆ పనిలో నిష్ణాతులైన వారి వద్దకు వెళ్లాలని - మనకు తెలుసు. మనకు  తెలీని విషయాలు నిజంగా తెలిసిన వారి దగ్గర నేర్చుకోవాలి.
కానీ - కొంత మంది - సరైన సమయానికి - సరైన వారి వద్దకు వెళ్ళకుండా కాలయాపన చేయడం, చిక్కుల్లో పడడం మనం చూస్తూనే ఉన్నాము. వీరు నాలుగో రకం మనుషులు. తమకు తెలీదు. తెలీదనే విషయం కూడా తెలీదు.  అంతే కాదు.తెలీని విషయం తెలిసినట్టు భ్రమలో వుండటమే కాకుండా - మిగతా వారికి ఉచిత సలహాలు యివ్వడము,  తాము చిక్కుల్లో పడడము, చుట్టూ వున్న వారిని చిక్కుల్లో పెట్టడము ఎన్నో సార్లు - అన్ని రంగాల్లో మనం చూస్తున్నాము. 

మనకు క్షుణ్ణంగా  తెలిసిందేది? తెలీనిది ఏది? యిదైనా మనకు తెలిసుండాలి.

మీకు రెండు చేతులున్నాయి. అది మీకు స్పష్టం గా తెలుసు. దానికి నమ్మకంతో మరి పని లేదు. నాకు రెండు చేతులున్నాయని నేను నమ్ముతున్నాను - అని మీరు చెబితే అది హాస్యాస్పదం. మీకు తెలీని విషయానికే   నమ్మకమో, అప నమ్మకమో కావాల్సి వస్తుంది.

మీ ముత్తాత గారెవరో మీరు చూడలేదు. మీ నాన్నగారికి వారి నాన్న గారు చెబుతుండగా, వారు విని మీకు చెబితే- వోహో, ఔనేమో - అని మీరు  అనుకున్నారు. అది మీకు తెలిసిన విషయం కాదు; మీరు నమ్మే విషయం. తెలిసిన విషయం వేరు. నమ్మే విషయం వేరు. తెలిసిన విషయాన్ని నమ్మాల్సిన పని లేదు. తెలీని విషయాన్నే - మనం నమ్మొచ్చు. లేదా, నమ్మక పోవచ్చు. తెలిసిన విషయం తెలిసిన విషయమే. దానికి నమ్మకం అక్కర లేదు.

దేవుడు వొక నమ్మకం. ఆత్మ వొక నమ్మకం.  శివుడు, స్వర్గం, నరకం, శని, డెవిల్, ఇంద్రుడు, ఏంజెల్, అల్లా యివి నమ్మకాలు. మనం చూడలేదు.  నిజంగా వున్నాయో, లేదో తెలీదు. ఏదో పుస్తకాల్లో రాసున్నాయి. మీరొక పుస్తకం నమ్మొచ్చు. నేనొక పుస్తకం నమ్మొచ్చు. మరొకరు మరొక పుస్తకం నమ్మొచ్చు.

ఈ గ్రంధాలతో వచ్చిన చిక్కు ఏమిటంటే - మీరు నమ్మాలి. నమ్మి తీరాలి. అవేం చెప్పినా, ఎంత నమ్మలేని మాట చెప్పినా - మీరు నమ్మి తీరాలి. లేకుంటే - మీకు స్వర్గం లేదు. లేకపోతె మానె. మీరెంత మంచి వారైనా - మీకు నరకం తప్పదు. యిలా చెప్పే గ్రంధాలెన్నో వున్నాయి. కొన్ని కొన్ని దేశాలలో - మేమంతా స్వర్గానికి పోతున్నాము. మీ మాటేమిటి? అనే పెద్ద బోర్డులు  కనిపిస్తాయట .

ఎవరి పిచ్చి వారికానందం. కాకపొతే - వారి వారి పుస్తకాల్లో వున్నది నమ్మి, పొరుగువారితో యుద్ధానికి దిగుతున్నారు.  నమ్మకం పరమైన యుద్ధాలు - స్వార్థ పరమైన యుద్ధాల కంటే - చాలా ఎక్కువ.అదీ ప్రస్తుత కాలంలో. యిది చాలా దురదృష్టం.

మన దేశంలో కూడా - దేవుడు, స్వర్గము వీటిపై నమ్మకాలు వున్నాయి. అయితే - ఈ పరిధిని, మన ధర్మ శాస్త్రాలు ఎప్పుడో దాటేసాయి. యివి లేవని శాస్త్రాలు చెప్పడం లేదు. అయితే - మంచి వాడెవడైనా - స్వర్గానికి అర్హుడే అన్నది సిద్దాంతం. మీకు దేవుడిపై నమ్మకం వున్నదా, లేదా అన్నది అక్కర లేని ప్రశ్న.

మంచి వాడి మార్గాన్ని కర్మ మార్గం లేదా కర్మ యోగం అన్నారు. వీడు దేవుడిని నమ్మక పోయినా ఫరవా లేదు. మన దేశంలో - దేవుడిని నమ్మని చార్వాకులు, జాబాలి లాంటి ఋషులు కూడా వుండేవారు. ప్రపంచం లోని  - అన్ని రకాల నమ్మకాలూ - మన దేశంలో - ప్రతి యుగంలోనూ వుండేవి. వీరికీ - అంటే, వీరిలోని మంచి వారికి - స్వర్గ ద్వారాలు తెరిచే వుంటాయి.

దేవుడిని నమ్మే మంచివారిది - భక్తి మార్గం అన్నారు. ప్రహ్లాదుడిది దాదాపుగా భక్తి మార్గమనే చెప్పొచ్చు.  శబరి, గోపికలు, హనుమంతుడు -ఇలాంటి భక్తులు - అప్పుడూ వున్నారు. యిప్పుడూ వున్నారు. భక్తి కాస్త జ్ఞానంతో కూడిన భక్తీ కావచ్చు. కన్నప్ప లాంటి వారి మూఢ భక్తీ కావచ్చు. వీరికి స్వర్గ ద్వారాలు మరింతగా తెరిచి వుంటాయి. "యిందు గలడందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే" అంటాడు ప్రహ్లాదుడు. దేవుడు లేని యిసుక రేణువు కూడా ప్రపంచంలో లేదని చెబుతాడు. అయితే - భక్తుల విషయంలో వారిది నమ్మకమా - నిజంగా వారికి తెలుసా - అని మనం చెప్పలేం. మొదట నమ్మకంగా వుండొచ్చు. కొంత మందికి అది నిజంగా కూడా మారొచ్చు.

ప్రహ్లాదుడు - దేవుడు, అన్ని చోట్లా వున్నాడన్నాడు.

కాని కొంత మంది - దేవుడు ఎక్కడో, స్వర్గంలోనో, వైకుంఠం లోనో, కైలాసంలోనో - వున్నాడనుకుంటారు.  ఏది నిజం? తెలీదు. అన్నీ నమ్మకాలే. మీరు చూడగలిగితే, విన గలిగితే, అనుభవించ గలిగితే - మీకు అది అనుభవైక సత్యం. లేకుంటే - వుట్టి నమ్మకం.

మీరు విష్ణు భక్తులను కోండి . మీరు చచ్చాక - మిమ్మల్ని కైలాసం తీసుకు వెళ్ళారనుకోండి ? పైకెళ్లినా -   మీ వేదన సులభంగా పోదు. మళ్ళీ - ఆయన చెప్పాలి. ఆయనా, నేనూ వేరే కాదు. వొకటే. వూరికే యిప్పుడు ఫ్రెండ్సు గా వున్నాం. అంతే - అని.  నమ్మకాలలో - యిటువంటి - అపనమ్మకాలకు చాలా చోటుంది. భక్తిలో పూర్తి నమ్మకం వుండేది - కొద్ది మందికే.

చాలా మందికి  భక్తి - స్వర్గ ద్వారానికి వెళ్ళే, వొక అపనమ్మకాలతో నిండిన, మార్గం మాత్రమే.  దేవుడిని మనం చూడలేదు. కొన్ని గ్రంధాలలో వ్రాసిన కథలలో హీరో గారే దేవుడు. మనకు తెలిసిందల్లా అంతే. కాని - భూమ్మీద జరిగేవన్నీ చూస్తుంటే - వొక్కో సారి - అపనమ్మకం ఎక్కువై - దేవుడిపై నమ్మకం సన్నగిల్లుతుంది. జీవితమంతా- నమ్మకాలు, అపనమ్మకాల మధ్య గడిచిపోతుంది - చాలా మందికి.

మరొక మార్గం  జ్ఞాన మార్గం. దేవుడున్నాడు - కానీ, నాలోనే వున్నాడు. నేనే ఆ దేవుడిని - నా అజ్ఞానం తొలిగితే నేనే దేవుడిగా మారిపోతాను - అన్నది జ్ఞాన మార్గం. యిది కాస్త మోటుగా చెప్పాము. మరి కాస్త నిశితంగా అర్థం చేసుకోవాల్సి వుంది.
నేనెవరు? - అన్నది మన ధర్మ శాస్త్రాలలో మొదటి ప్రశ్న.    నేనెవరు - అన్నది తెలియకుండా - మరేదీ క్షుణ్ణంగా, తెలుసుకోలేరు. దేవుడి సంగతి దేవుడెరుగు. మొదట నేనెవరో కూడా నాకు తెలీకుండా వుందే-  అన్న మధన కొంత మందిలో వుంటుంది. దీనికి సమాధానం జ్ఞాన మార్గం. మొదట మీరెవరో తెలుసుకోండి.

అవి తెలుసుకునే మార్గంలో - దేవుడి లాంటి మరెన్నో విషయాలు కూడా మీరు తెలుసుకుంటారు.స్వర్గం వుంటే - ఆ స్వర్గానికి వెళ్ళేదెవరు? నా దేహం భూమిపైనే వుండి పోతోంది కదా? మరి నేను - అనే ఆ నేను ఎవరు? స్వర్గం మాట తరువాత చూద్దాం. నేనెవరో తెలుసుకోవాలి ముందు - అన్నది జ్ఞాన మార్గం.

చాలా దేశ  సంస్కృతులలో  కర్మ మార్గం వుంది. భక్తి మార్గం వుంది. కానీ, నాకు తెలిసినంత వరకు - జ్ఞానం మార్గం భారత దేశం లో మాత్రమే వుంది. అదీ - అతి పురాతన కాలం నుండీ వుంది. వేదాలు, ఉపనిషత్తుల కాలం నుండీ వుంది.

వేదాలలో "నేనెవరు" అన్న దాన్ని గురించి మనకు తెలియజేసే "మహావాక్యాలు"  చాలా వున్నా  - వాటిలో ప్రముఖంగా నాలుగిటిని చెబుతాము.

  • ప్రజ్ఞానం బ్రహ్మ - (ఋగ్వేదం - ఐతరేయ బ్రాహ్మణం) :- దీనికి అర్థం గొప్ప జ్ఞానమే బ్రహ్మ అని. బ్రహ్మ లేదా దేవుడు అంటే - మరేం లేదు - ప్రజ్ఞానమే, విశిష్టమైన జ్ఞానమే  -  బ్రహ్మ. 
  • అహం బ్రహ్మ అస్మి - నేనే  బ్రహ్మ గా వున్నాను. (యజుర్వేదము - బృహదారణ్యక) :- బ్రహ్మ అయినటువంటి ఆ ప్రజ్ఞానం మరేదో కాదు. అది నేనే.
  •  తత్ త్వం అసి :- (సామ వేద - ఛాందోగ్యం) :- ఆ బ్రహ్మ మరెవరో కాదు. అది నేను గానే వున్నాను. అది నేనే.
  • అయం  ఆత్మా బ్రహ్మ (అథర్వణం - మాండూక్య) ;- ఆత్మ నైన నేనే బ్రహ్మను.
నాలుగు వేదాలూ - ఘోషించే మహావాక్యాలివి. యివి నిజమా? కాదా?

మరి నేనే బ్రహ్మ నైతే - నేనెందుకిలా వున్నాను.  జీవితమంతా ఏదో తప్పులు చేస్తున్నాను. నవ్వుతాను. ఏడుస్తాను. సంపాదిస్తాను.ఖర్చు పెడతాను. పుడతాను. చస్తాను. నేనెలా బ్రహ్మ నౌతాను. నా భార్య ఎలా బ్రహ్మ అవుతుంది. బ్రహ్మ నైన నాతో ఎప్పుడూ గొడవ పడుతుంది కదా?  ఎప్పుడూ, కొట్టుకు చచ్చే మేము యిద్దరూ - బ్రహ్మలం ఎలా అవుతాం. మరి ఎంత మంది బ్రహ్మ లున్నారు? వారి స్వరూపమేమిటి?

బ్రహ్మ అన్నా బ్రహ్మము అన్నా వొక్కటే. బ్రహ్మమొక్కటే - అని అన్నమాచార్యుల వారు గళమెత్తి పాడారు.  బ్రహ్మమొక్కటే - అన్నది వేద ఘోష. ఉపనిషద్ ఘోష. పురాణాలు, ఇతిహాసాలూ అదే చెబుతుంది.

మరి ఈ బ్రహ్మము ఎలా వుంటుంది?

బ్రహ్మ స్వరూపాన్ని గురించి  యిలా అన్నారు  - "సత్, చిత్, ఆనందం" బ్రహ్మ స్వరూపం.

సత్ అంటే సత్యమైనది. ఎప్పుడూ వుండేది. ఆద్యంత రహితమైనది. మార్పు లేనిది. అది ఎవరో కాదు. అది నేనే (నువ్వే).

చిత్ - అంటే జ్ఞానం. ప్రజ్ఞానం అని వేదంలో చెప్పబడిన బ్రహ్మ ప్రజ్ఞానమే. దీన్ని ఆంగ్లంలో కాన్షస్ నెస్ - అన్నారు. ఈ ప్రజ్ఞానమే - ప్రపంచమంతటా, అణువణువులోనూ, వుంది. మనలోనూ వుంది.

ఆనందం - అంటే -దుహ్ఖరాహిత్యం అని చెప్పొచ్చు. నిజానికి, ఈ మూడు పదాలకూ సరి అయిన పదాలు, తెలుగులో కానీ, ఆంగ్లం లో కాని లేవని చెప్పచ్చు.

అయినా - నేను ఎవరు అని తెలుగులో మనం చెప్పాలంటే - ఆద్యంత రహితుడైన, నిత్య సత్యమైన (సత్), ప్రజ్ఞానమైన (చిత్), ఆనందమైన (ఆనందం) - అనంతుడైన వాడిని నేను.  ఆ నేనే బ్రహ్మ లేదా బ్రహ్మము.

అన్ని చోట్లా నేనే వుంటే -మరి నీవెక్కడ వున్నావు. నీవూ, బ్రహ్మమే. నీవూ,నేనూ రెండూ బ్రహ్మమే. అంటే - నీవూ,నేనూ వేరు కాదు. వొకడే.

మరెందుకు తిట్టుకుంటున్నాము?కొట్టుకుంటున్నాము? ప్రజ్ఞానాన్ని - అజ్ఞానం కమ్మేసింది. అందువలన. ఆ అజ్ఞానాన్నే మాయ - అన్నాము. ఎందుకలా? అదే సృష్టి విచిత్రం. అదెలా తెలుస్తుంది? నేనెవరో, అనుభవ పూర్వకంగా తెలిస్తే - సృష్టి విచిత్రమంతా తెలిసిపోతుంది. అజ్ఞానం పోతే - ప్రజ్ఞానం. నేనెవరో తెలిస్తే - మిగతా అంతా తెలిసే ఆవకాశం   వచ్చేస్తుంది.

కానీ - ఆ అజ్ఞానం నుండి మనం ఎలా బయట పడగలం? అజ్ఞానం నుండి బయట పడిన - జ్ఞానులున్నారు. వారిని గురువులుగా అంగీకరించండి. వారి వద్ద మీకు ఈ జ్ఞానం పూర్తిగా లభిస్తుంది. జ్ఞానం వచ్చిన వెంటనే - అజ్ఞానం తొలగిపోతుంది.

ప్రజ్ఞానం కలుగదు - ప్రజ్ఞానం మీరే అని తెలిసిపోతుంది. దీపం చుట్టూ మసి వుంది. దీపం దేదీప్యమానంగా వెలిగినా వెలుగు కనిపించడం లేదు. మసి వలన. మసి కడిగితే - వెలుగు తెలుస్తుంది. కానీ - ఆ తెలిసే వెలుగు ఎప్పుడూ వుంది. యిప్పుడు మసి పోయింది. అంతే. ప్రజ్ఞానం ఎప్పుడూ వుంది. అజ్ఞానం కమ్మితే,  మాయలో, సృష్టిలో మునిగి పోతాం. సుఖ దుహ్ఖాల ప్రవాహాలలో కొట్టుకుపోతూ వుంటాము.

అజ్ఞానం తొలిగితే - సృష్టి నడుస్తూ వుంటుంది. కాని నేను మాత్రం - ప్రజ్ఞానం గా, సత్,చిత్, ఆనందంగా వుండిపోతాను. మరి దేవుడున్నాడా? వున్నాడు. అది నేనే. శివుడు? అదీ నేనే? విష్ణువు? అదీ నేనే? నేను? అదీ నేనే?నీవు? అదీ నేనే? సర్వం బ్రహ్మ మయం. బ్రహ్మము తప్ప మరేమీ లేదు. మాయ? అదీ బ్రహ్మస్వరూపమే. మరి మాయ నన్ను ఆవరించడమేమిటి ? నేనూ బ్రహ్మమే. మయా బ్రహ్మమే - అయినప్పుడు? అది తెలియాలంటేనే - జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే - గురువు దగ్గర కెళ్ళాలి.   యిది ఎన్నాళ్ళ చదువు? అది మీ అక్కరను బట్టి. వొక రోజు కావచ్చు. వొక సంవత్సరం కావచ్చు. వొక జన్మ కావచ్చు. ఎన్ని జన్మలైనా కావచ్చు.

అబ్బా. అయితే వద్దులే. మరేదైనా, సులభ మార్గం చెప్పండి.

సులభమో కాదో కాని - మరొక మార్గం వుంది. దాన్ని ధ్యాన మార్గం అన్నారు. శ్రీకృష్ణుడు దాన్ని ధ్యాన యోగం అన్నాడు. పతంజలి మహర్షి - అష్టాంగ యోగం, క్రియాయోగం అన్నారు.

అందులో - ఎనిమిది భాగాలు, లేదా మెట్లు వున్నాయి.అంటే - వొక దాని తర్వాత వొకటి ఎక్కాలి. వొకే సారి, ఎనిమిదో మెట్టుకు , లేదా ఆరో మెట్టుకు యెక్క లేము. అలా ప్రయత్నం చేస్తే, ఎక్కినట్టే ఎక్కి జారి మళ్ళీ క్రిందికి వచ్చేస్తాము.

ఆ మెట్లేమిటో  - పతంజలి గారే - టూకీగా చెప్పారు. అది మరింత టూకీగా - యిక్కడ పేర్లు మాత్రం యిస్తున్నాను.

(1 ) యమ :ఈ మెట్టులో 5  భాగాలున్నాయి. (1) అహింస (2)సత్య వ్రతము (3)అస్తేయం (దొంగతనం ఎటువంటిదీ  చేయకుండడం )   (4 ) బ్రహ్మచర్యం (5 ) అపరిగ్రహం : వీటికి, క్రింద వాటికీ కూడా  వివరణ మీరు నా ఆంగ్ల బ్లాగు వైజ్ స్పిరిచువల్ ఐడియాస్.బ్లాగ్ స్పాట్ . కాం లో చదవచ్చు.

(2 )  నియమ : ఈ మెట్టులో 5  భాగాలున్నాయి. (1) శౌచము (2) సంతోషము (3 )తపము (4 )స్వాధ్యాయము (5 ) ఈశ్వర ప్రణిధానము  :యిక్కడ ఈశ్వరుడు,అంటే శివుడు కాదు. పతంజలి గారు ఆ పదానికి వొక విశేష నిర్వచనం యిచ్చారు.

(3 ) ఆసనం :మీకు తెలుసు - ఆసనాలు ఎన్ని రకాలో. అయితే పతంజలి గారు - స్థిరంగా , సుఖంగా  కూర్చోగలిగేదే ఆసనం అన్నారు.

(4 ) ప్రాణాయామం :దీన్లోనూ రకరకాలున్నాయి.

(5 ) ప్రత్యాహారం : యిప్పుడు యింద్రియాల్ని  అంతర్ ముఖం చేయాలి. 

(6 ) ధారణ  : మనస్సును ఏదో వొక విషయం పై యిప్పుడు స్థిరంగా నిలపాలి.  అదెలాంటి   వస్తువైతే ధారణకు మంచిదో మనకు తెలియాలి.

(7 ) ధ్యానం : ఆ వస్తువు పై - ఏకాగ్ర చిత్తమైతే అప్పుడు ధ్యానం సిద్ధిస్తుంది.

(8 ) సమాధి : ధ్యానం లో - మరేమీ వుండక, ధ్యాన వస్తు స్వరూపం   మాత్రం మిగిలితే - అది సమాధి అవుతుంది. మళ్ళీ అందులో -అంచెలంచెలుగా  నిర్వికల్ప ధ్యానం వద్దకు వెళ్ళిపోతారు. అప్పుడు -  మీకు స్వరూప దర్శనం అవుతుంది. అప్పుడు, అక్కడ వున్నది మీరే. అప్పుడు తెలుస్తుంది మీరెవరో.  మీరు సత్,చిత్,ఆనందం -గా మిగిలిపోతారు.

మీరెవరో తెలిసాక - మీ మిగతా ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం తెలిసిపోతుంది. అప్పుడు నమ్మకాలు పనిలేదు. ప్రశ్నలు అక్కర లేదు. సమాధానాలు అక్కర లేదు. స్వర్గం, నరకం, దేవుడు, వేదం, దేనితోనూ పని లేదు.

జ్ఞాన మార్గం లోనూ ఇవేవీ పని లేదు. ధ్యాన మార్గం లోనూ ఇవేవీ పని లేదు.  ధ్యాన మార్గం కూడా మరే సంస్కృతిలోనూ చెప్పబడలేదు.

ధ్యాన మార్గం వొక నిశ్చితమైన, అడుగడుగుగా ముందుకు వెళ్ళే మార్గం. యిక్కడ, మీకు   పెద్దగా నమ్మకాలతో పని లేదు. వొక్కొక్క మెట్టు ఎక్కే సరికి -మీలో అద్భుతమైన మార్పులు వస్తాయి. అవి మీకు అపారమైన నమ్మకం కలుగ జేస్తాయి. అయితే వచ్చే అద్భుత శక్తులే - మన ఆశక్తతగా , మన బలహీనతగా, మనమే మార్చుకుని, ఆ మెట్టు వద్దే వుండి పోయే ప్రమాదం చాలా వుంది. అక్కడి నుండి క్రింది మెట్టుకు జారే ప్రమాదమూ ఉంది. అలా చేయకుంటే - కైవల్యం చేరడం - నిశ్చయం.

శ్రీ కృష్ణుడు - భగవద్గీతలో - ఈ నాలుగు మార్గాలూ, నాలుగు రకాల మనుషుల కోసం చెప్పాడు. అన్నింటిలోనూ - మనిషి భగవంతుడిని చేరగలడని చెప్పాడు. భారత సంస్కృతిలో -జ్ఞాన, ధ్యాన మార్గాలు విశిష్టం.   యివి - మరే సంస్కృతిలోనూ మనకు అంతగా కనిపించవు. యివన్నీ ఎప్పటి నుండీ వున్నాయి. సృష్ట్యాది నుండీ వున్నాయి. యివి ఏ మతానికీ సంబంధించినవి కావు. యిదొక గొప్ప విజ్ఞానం - అందుకునే వారికి లభిస్తుంది.

నన్ను చేరడానికి ముందు నిన్ను నువ్వు తెలుసుకో - అనడం - ఎంత బాగుంది!

16, డిసెంబర్ 2011, శుక్రవారం

పరంజలి యోగ సూత్రాలు = 2.36 = సత్యానికి బలం ఎంత? మీకు తెలుసా? = యోగి వాక్కు బ్రహ్మ వాక్కు =జరిగి తీరుతుంది

పరంజలి యోగ సూత్రాలు 
2.36  =  సత్య ప్రతిష్ట 

గత రెండు మూడు నెలలుగా - నా బ్ల్లాగు - వైజ్ స్పిరిచువల్ ఐడియాస్.కాం లో -   పతంజలి యోగ సూత్రాలకు, ఆంగ్లంలో వ్యాఖ్యానము రాస్తున్నాను.  అది రాయడానికి, స్వామీ వివేకానందా, స్వామీ గురుపరానందా, స్వామీ శివానందా,  ఓషో లాంటి  వారి  వ్యాఖ్యానాలూ పరిశీలించి , గీతలోని ధ్యాన యోగాన్నీ పరిశీలించి ఆకళింపు చేసుకునే రాస్తున్నాను.

ఎన్నో ఏళ్ళుగా రక రకాల ధ్యాన ప్రక్రియలు పాటిస్తున్నా - యిది రాసేటప్పుడు - నేను చేస్తున్న పొరబాట్లను సరిదిద్దుకోవడానికి  ఎంతో ఉపయోగంగా వుంది.

కొన్ని, కొన్ని విషయాలు చదివితేనే చాలు. మనం చేసేస్తామని అనిపిస్తుంది.

కొన్ని కొన్ని విషయాలు పతంజలి మహర్షి చెప్పినవి - మహాత్ములు వ్యాఖ్యానించినవి  -  చాలా ఆనంద పరుస్తుంది.

అందులో మచ్చుకు వొక్కటి క్రింద ఉదాహరిస్తున్నాను.

సాధన పాదంలో -36 వ సూత్రంలో యిలా చెప్ప బడింది.

సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం.

దీనికి వివేకానందుల   వారి వ్యాఖ్యానం ప్రకారం - సత్యంలో నెలకొని వుండటం వల్ల యోగి (తన కొరకూ, యితరుల కొరకూ కూడా) కర్మలను చేయకుండానే కర్మ ఫలాలను పొందే శక్తి సంపన్నుడౌతాడు.

యిలాగే, స్వామి గురుపరానందా, తదితరులు కూడా సత్య నిష్ఠ తో వున్న యోగి వాక్మహిమ ను గురించి చాలా చెప్పారు.  

యోగి ఏమన్నా - దీవించినా, శపించినా -  అది జరిగి పోతుంది.యోగి సాధారణంగా శపించడు.   ఆయనకు కష్టం కలిగిస్తే చాలు. ఆయన ఏమీ అనక పోయినా - కలిగించిన వాడికి వినాశనం తప్పదు. ఆయన ఆజ్ఞా పాలన చేయడానికి, ఆయన మనస్సుననుసరించి  నడవడానికి -   ప్రకృతి సంతోషంతో కాచుకుని వుంటుంది.

భారత సంస్కృతిలో - యిది అందరికీ తెలుసు. ఏ యోగి మన వూరికి వచ్చినా - సాధారణంగా - అందరూ వెళ్లి - వారి ఆశీర్వచనం తీసుకోవడం మనం చూడొచ్చు.  ముఖ్యంగా చిన్న పిల్లలను వారి పాదాలకు నమస్కరింప చేసి - ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వుంది.

అసలు సాయి బాబా లాంటి - పరమపదించిన యోగుల శిలా విగ్రహాలపై కూడా - పసిపాపలను పడుకోబెట్టి ఆయన ఆశీర్వాదము, అనుగ్రహమూ కోరుకొనే  వారు ఎందరో వున్నారు.

ఏసుక్రీస్తు - అడగండి. మీకు యివ్వ బడుతుంది - అన్నారు. అయితే - ఎవరిని అడగాలి. ఎం అడగాలి అన్నది ముఖ్యం. ఎదురుగా వున్న దైవ స్వరూపులు, సత్య స్వరూపులు యోగులు. వారిని అడగండి. ముఖ్యంగా వారి ఆశీర్వాదం అడగండి.

యోగి అంటే, ముక్కు మూసుకుని కూర్చొన్న వారు మాత్రమే కాదు. కొద్దో, గొప్పో, సత్య నిష్ఠ వున్న వాళ్ళందరికీ - ఈ ఆశీర్వాద బలం వుంటుంది. సత్య నిష్ఠ వున్నవారందరూ యోగ సాధకులే. అటువంటి సత్య సాధకులు మీ వూళ్ళో, మీ ఎదురుగా కూడా వుండొచ్చు . వారి వారి సత్య నిష్టను బట్టి, వారి వారి ఆశీర్వాద బలం వుంటుంది.

ఈ కాలంలో కూడా - చాలా మంది యోగుల వెనుక కోట్ల కొద్ది శిష్యులు వుండటం మనం చూడొచ్చు. వారికి గురువులు ఏం ఇస్తున్నారు? రెండు మంచి మాటలు. హృదయ పూర్వక ఆశీర్వాదమూ.  అంతే. వాటితోనే - వారి మనస్సులో - మహదానందం నింప గల శక్తి ఆ యోగుల మాటల్లో వుంది.

కానీ - అటువంటి కొంత మంది యోగుల పై అసత్య ఆరోపణలు చెయ్యడం, వారిపై కేసులు బనాయించడం, వారిని జైలుకు పంపించిన సంఘటనలూ   జరిగాయి కొన్ని. వాటిని పరిశీలిస్తే - అవి చేసిన వారిపై -ప్రకృతి ఎంత తీవ్రంగా స్పందించిందో   - మనకు అర్థమౌతుంది. ఎంతో ఆర్ధిక, రాజకీయ, ఉద్యోగ   బలాలు అన్నీ వున్న వారిగా కనిపించిన వారు డిస్మిస్ కావడమూ, వారి కుటుంబాలు అనారోగ్యాల   పాలు కావడము, వారు అర్ధాంతరంగా చని పోవడము - మరి కొంత మంది వేరే ఎన్నో కేసుల్లో చిక్కుకోవడం లాంటివన్నీ చాలా జరిగాయి. 

కానీ ఆ యోగుల జీవితంలో జైల్లో వున్నా మార్పు రాలేదు.  వారు వీరిని తిట్టడమో, దూషించడమో  జరుగలేదు. వారిపై వచ్చే ప్రతి అభియోగానికీ - ప్రకృతి స్పందించడం చాలా ఆశ్చర్యంగా మనకు కనిపిస్తుంది.  కానీ - యిది ఎప్పటికైనా వారికి అర్థం అవుతుందా - అంటే - ఏమో. యిటువంటివి వచ్చినప్పుడు - మనం అప్పుడు చేసిన ఆ కర్మకు - యిది, యిప్పుడు  ఫలితం  అని తెలియడం విజ్నులకే గానీ అజ్నులకు సాధ్యం కాదు.

యిక ముందు కాస్త నిశితంగా చూడండి. యోగులకు చెడ్డ చేసే వారిపై ప్రకృతి ఎలా స్పందిస్తుందో?

అయినా - యోగులను గౌరవిస్తే, వారి ఆశీర్వాదం, వారి సలహా స్వీకరిస్తే - మేలు జరుగడం మాత్రం ఖాయం. 
 మనం వారి సత్-ప్రయత్నాలకు చేదోడుగా ఏదైనా చేస్తే - యింకా మంచిది. దీన్ని పంచ మహా యజ్ఞాలలో - రుషి యజ్ఞం అంటారు. రుషి యజ్ఞానికి ఫలితం చాలా గొప్పది.

ఈ మేలు - మీకు, ఎలా, ఎప్పుడు జరుగుతుంది? - అదీ విజ్నులకే తెలుస్తుంది. కానీ మీకు మేలు జరగడం ఖాయం. యిది పతంజలి చెప్పారు. శ్రీ కృష్ణుడు చెప్పారు. వేదాలు, వుపనిషిత్తులు, పురాణాలు, ఇతిహాసాలు - అన్నిటిలో చెప్పబడిన అంశం యిది.

మనం చేయవలసిన, సులభంగా చేయదగిన పని - యోగులను గురువుగా అనుకోవడం. వీలైనప్పుడు, వారి సన్నిధికి వెళ్లి వారి ఆశీర్వాదం స్వీకరించడం, వారి మహత్-ప్రయత్నాలకు మనం చేయ గలిగిన సహాయం చేయడం.

యింతకు మించి ఏమైనా చేయ గలరా? గలరు! మీరే సత్య నిష్టా పరులు అవడానికి ప్రయత్నించండి. మీరే యోగ విద్య అభ్యసించండి. అదేమంత   కష్టమైన విషయం కాదు.

బురద నుండి బయటకు వచ్చి మనల్ని మనం కడుక్కున్నట్టు వుంటుంది.  అంతే.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

వివరణ : యోగులకు కష్టం కలిగించే వారికి ప్రకృతి దండన విధిస్తుంది. అది సరే. మరి యోగులకు కష్టాలెందుకు? ఈ సందేహం చాలా మందికి వస్తుంది. యోగులకు కష్టాలేమీ  లేవు. కానీ ప్రతి సాధనకూ - అప్పుడప్పుడూ - శోధన (పరీక్ష) వుంటుంది. ఆ శోధన యోగి మనః శక్తిని పెంచడానికే. అది మామూలే. ఆ శోధన యోగికీ తెలుసు. 

రమణ మహర్షి గారికి రాచపుండు వచ్చింది. ఆయనేం బాధ పడ లేదు. ఆయనకు తెలుసు. వొక్కొక్క శోధనతో, యోగి వొక్కొక్క మెట్టు పైకి వెళ్ళుతుంటాడు. 

హరిశ్చంద్రుడికి వచ్చిందీ శోధనే కాని కష్టం కాదు. హరిశ్చంద్రుడు కష్టం అని - ఈ విశ్వామిత్రుడేమిటి - యిలా చేస్తున్నాడే అంటే చాలు -   ప్రకృతంతా అంతటి విశ్వామిత్రుడిపైన విరుచుకు పడేది. కాని ఆయన అలా అనుకోలేదు. అదంతా - తన సత్యవ్రతానికి వచ్చిన శోధన అనుకున్నాడు.  లేదంటే - ఆయన మానవుడుగా వున్నా - బ్రహ్మ సభలో చర్చనీయుడయ్యే వాడా? 

శోధన అని తెలిసున్న యోగికి కష్టాలంటూ ఏం లేవు. వారి మనసులో - ఎప్పుడూ - ఆనందమే.

12, డిసెంబర్ 2011, సోమవారం

లోక్ పాల్ గోల = నిరశన వ్రతాలకు చక్కటి సమాధానం మౌన వ్రతం.=

ప్రహ్లాద్ జాని గారికీ, అన్నా హజారే గారికీ, మనకూ వున్నా తేడా ఏమిటంటే - అందరికీ తెలుసు.

ప్రహ్లాద్ జానీ గారు దాదాపు అరవై డెబ్భై ఏళ్ళుగా ఏమీ త్రాగడం లేదట. తినడం లేదట.  ఆయన ఏమీ తినకుండా, త్రాగకుండా, చేయకుండా ఎందుకున్నారో - అస్సలు ఎందుకుండాలో ,  ఆయనకే అంతు పట్టడం లేదు. యిప్పు డాయనను  ఎవరూ పట్టించుకోవడం లేదు.  లోక్ పాల్ బిల్లు కోసం - ఆయన నిరశన వ్రతం చేస్తే ఎలా వుంటుందో తెలీదు.  వొక వేళ చేస్తే, ఆ నిరశన వ్రతాన్ని ఆయన ఎప్పుడు, ఎలా వదిలి పెడతాడో - అదీ తెలీదు.

కానీ - అన్నా హజారే గారికి మాత్రం - అలసట వచ్చేస్తుంది. పోటీ తట్టుకోలేరు. మన్మోహన్ సింగు  గారితో తో పోటీ పడొచ్చు గానీ ప్రహ్లాద్ జానీ తో పోటీ పడ లేము. 

ఎంతటి, రాజా లాంటి వారి లంచగొండి తనమైనా మనం భరించ గలమేమో కానీ - భరిస్తున్నాము కదా - యిలా దినాల కొద్దీ, వారాల కొద్దీ, నెలల కొద్దీ నిరశన వ్రతాలు చేయడం మాత్రం మన వల్ల కాదు.

అది అన్నా గారికే వదిలేద్దాం. ఆయనకు అలవాటయ్యింది ఆయన చేయ నీయండి. మనకు తెలిసింది, చాతయ్యింది మనం చేద్దాం.  టీం అన్నా సభ్యులందరూ నిజానికి అదే చేస్తున్నారు. అన్నాజీ, నిరశన వ్రతం మీరు చేయండి. మాట్లాడడం మేము చేస్తాము - అని పనులు పంచుకున్నారు.

యిదేదో బాగానే వుంది. బంగారపు తట్టలలో భోంచేసినా - గనులలో ఏం మేసినా - చివరకు, జైళ్ళలో భోం చేయ వలసింది - గాలే కదా.  అది అలవాటున్న వారు చేయడమే మంచిది.

లంచగొండి తనం పోతుందా - లేదా? ఎలా పోతుంది. ఎప్పుడు పోతుంది?

లోక్ పాల్ వస్తారా - లేదా? ఏ రూపంలో వస్తారు? వచ్చి ఏం చేస్తారు? దేశాన్ని వుద్ధరిస్తారా? కాంగ్రెసును, డీ.ఏం. కే. ను వుద్ధరిస్తారా? ప్రతి పక్షాలను వుద్ధరిస్తారా? లంచ గొండులను   జైళ్ళలో పెట్టాలంటే -  ఎన్ని జైళ్ళు కావాలి?  వాళ్ళ, వాళ్ళ ఇళ్ళే   -  వాళ్లకు జైళ్ళు గా మారిస్తే పోలా? రాజా గారు ఏమంటారో?

లోక్ పాల్ గా ఎవరొస్తారు. కాంగ్రెస్ లో   చేరితే, గీరితే, ఎంచక్కా జగత్తునంతా మోహింప చేస్తూ - మన జగన్ గారు కూడా రావచ్చు. లేక పొతే - ఏ కరుణానిధి గారో, వారి అనుచరులో రావాల్సిందే. కొయాలిషన్   రాజకీయాలంటే   మాటలా.  వారొస్తే -  విపక్షాలలో వున్న లంచగొండి తనమంతా కడిగేస్తారు.

రచ్చ గెలిచామంటే -  యింట గెలవకున్నా ఏం మునిగి పోదు.  విపక్షాల రచ్చ గెలిస్తే చాలు.

కరుణానిధి గారు అర్జెంటుగా ప్రెసిడెంటుగా అయిపోతే - ఎలా వుంటుంది? జయలలితా గారు ఏం చేసినా - ఆయనను ఏమీ చేయలేరు కదా. ఏ లోక్ పాల్ వచ్చినా - ఏం భయం లేదు. యివన్నీ - కొన్ని ఊహలు మాత్రమే. సలహాలు కాదు.

కిరణ్ కుమార్ రెడ్డిగారు  ఎన్నో చేస్తున్నారు. చిరంజీవి గారు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అవకాశం యిప్పుడో, అప్పుడో వచ్చేస్తుంది. బాబు గారు మాత్రం - పథకాలు వేస్తున్నారు. కలలు చాలా కంటున్నారు. వయసయిన తర్వాత ఎలాంటి కలలు వస్తాయి? అవి నిజమవుతాయా?

రోశయ్య గారికి ఆరోగ్యం బాగాలేక సి.యం పదవి విడిచేసారు. కానీ -  గవర్నరు పదవికి అదేమీ పెద్ద అడ్డంకు కాదు. ఆయనకు - వద్దన్నా పదవులన్నీ వస్తున్నాయి. వడ్డించే వాళ్ళు మన వాళ్ళయితే అంతే మరి.

తెలంగాణా వచ్చేసినట్టు కల. చాలా మందికి. అది రామరాజ్యం లా, రామారావు రాజ్యంలా వున్నట్టు కొంత మందికి కల. కే.సి.ఆర్. గారు అప్పుడూ  ఏదేదో అర్థం లేకుండా మాట్లాడేస్తున్నారు.  తిట్టేస్తున్నారు. అలవాటుగా. కానీ, యిదంతా కలే. కలలో మాటే. నిజమూ అంతే ననుకోండి.

మన్మోహన్ సింగు గారు ఏమీ మాట్లాడడం లేదు. ఎప్పటి లాగే. నిరశన వ్రతాలకు చక్కటి సమాధానం మౌన వ్రతం. ఆయన ఆర్ధిక శాస్త్రం మరిచి పోయారు. రాజకీయ శాస్త్రం తెలీదు. హంస నడక మరిచిపోయే. కాకి నడక రాక పోయె. సోనియా గారికి ఎమోచ్చో ఎవరికీ తెలీదు. కాని చక్రం తిప్పగలరు. అది తిరిగితే.

దేశంలో - చిదంబర రహస్యాలెక్కువై పోయాయి. బురదలో చెయ్యి పెడితే మట్టి అంటుకోదా . ఈ బురద కడుక్కోవడం చాలా కష్టంగానే వుంది చిదంబరం గారికి. కడిగే కొద్దీ కొత్త బురద చల్లుతున్నారు.

శరద్ పవార్ గారిని ఫెళ్ళున చెంప దెబ్బ కొట్టాడట వొకాయన.  సగటు మనిషి కోపమే నేను చూపించాను - అన్నాడట. కూరగాయలు, తినే వస్తువుల ధరలన్నీ పెరిగినా - దాన్ని గురించి ఆయనకు  కొంత కూడా చింత లేదు. కారణం - ఆయనకు క్రికెట్ బోర్డు పై, మిగతా స్పోర్ట్సు బోర్డులపై   చాలా సరదా. మరి స్పోర్ట్సు మినిస్టరు గారికి అవంటే - పట్టదు.  అటు ఆటలూ పోయె. యిటు ఆహార పదార్థాలూ, వాటి వెలలూ  ఆకాశానికి  వెళ్లి పోయె. యివన్నీ కొయాలిషన్ రాజకీయాలు మరి. మన్మోహన్ సింగు గారు అలా చూస్తూ వుందా వలసిందే.

మిగతా వాళ్ళు ఎప్పటి లాగే - వర లక్ష్మీ వ్రతం చేసుకుంటున్నారు. ఏంతొస్తే  అంత రానీ. మరో ఎలెక్షనొస్తే లక్ష్మి ఎవరి పక్కో ఎవరికి తెలుసు? పీత బాధ పీతది.  సీత బాధ సీతది. ఎవరి బాధ వాళ్ళది. రేపటి సంగతి ఎవరు చూసొచ్చారు? లోక్ పాల్ గానీ వచ్చేస్తే?

= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

11, డిసెంబర్ 2011, ఆదివారం

శాస్త్రీయ దృక్పథం = చంద్ర గ్రహణం= జ్యోతిష శాస్త్రము= ఆయుర్వేద=యోగ శాస్త్రం=ఏళాం అరివు= తెలుగు వారి ధారణా శక్తి = మనమేం చేయాలి

పౌర్ణమి నాడు సాయంసమయం నుండి రాత్రి వరకు చంద్ర గ్రహణం చూసాము.

డిసెంబర్ 2011 చంద్ర గ్రహణం 


మీరూ మీ,మీ పట్టణాలలో చూసే వుంటారు. యిక ముందు వందేళ్ళలో కూడా, చంద్ర గ్రహణం ఎప్పుడు వస్తుందో - గణించి చెప్ప గల  సామర్థ్యం మన జ్యోతిష్య  పండితులకు వుంది. 

అదే విధంగా భూమిపై దాని ప్రభావం ఎలా వుంటుందో కూడా మన వారు అధ్యయనం చేసి - యిలా, యిలా అవడానికి వీలుంది - గనుక, కాస్త జాగ్రత్త వహించండి - అని చెప్పడమూ ఆనవాయితీ.

శాస్త్రానికి - రక రకాల రుజువులు, ప్రమాణాలు వుంటుంది. కొన్నిటికి - మనం కళ్ళతో చూడగల రుజువులు వుండచ్చు. కొన్నిటికి చెవులతో వినగల రుజువులు వుండచ్చు. కొన్నిటికి - కాస్త విమర్శనాత్మకంగా విచారిస్తేనే రుజువు తెలుస్తుంది - కానీ పంచేంద్రియాలకు అంద గల రుజువులు వుండక పోవచ్చు. యిలా రుజువులు ఎన్నో రకాలు.

కొన్నిటికి - స్టాటిస్టికల్ ప్రూఫ్ మాత్రమే వుంటుంది. అంటే - అనేక సందర్భాలలో - జరిగిన, లేదా,  వచ్చిన ఫలితాలను ఆధారంగా, ప్రమాణంగా,  యిలా జరిగే సందర్భం లో - యిటువంటి పరిణామాలు జరగ వచ్చునని - ఆధునిక శాస్త్రమూ చెబుతుంది. మన ప్రాచీన శాస్త్రమూ, అలాంటివి - ఎన్నో చెబుతుంది.,

చంద్ర గ్రహణమూ, సూర్య గ్రహణమూ  అలాంటివే. ప్రాచీన కాలంలో, చంద్రుడికో, సూర్యుడికో వెళ్ల గల  సామర్థ్యం లేక పోవచ్చు. కానీ - అంతరిక్షాన్ని ప్రతి దినమూ, రాత్రీ అధ్యయనం చేసి - అంతరిక్షంలో యిలా జరిగితే - భూమి పై వాటి ఫలితాలు యిలా వుండవచ్చునని - మన ప్రాచీన శాస్త్రజ్ఞులు నిర్ధారించి - అది వొక శాస్త్రం గా తయారు చేసారు. అంతరిక్షంలో జరుగుతున్న విషయం నిర్దిష్టంగా - యిదే అని వారికి తెలియక పోవచ్చు.

అందుకనే రాహు కేతువులనే గ్రహాలు - సూర్య చంద్రులను పట్టుకోవడం వలన గ్రహణం ఏర్పడుతున్న దనే వొక కారణం చెప్పారు.  శాస్త్రము ఎప్పుడూ, ముందటి కంటే గొప్ప, నమ్మ దగిన  రుజువు దొరికితే - దాన్ని వదిలి పెట్టదు. పాత నమ్మకాల స్థానంలో క్రొత్త నమ్మకాన్ని పెట్టుకుంటుంది. ఏ శాస్త్రమైనా అంతే. 

పూర్తిగా విశ్వసించ దగిన క్రొత్త రుజువు దొరికిన తరువాత కూడా -  మనం పాత, అవిశ్వసనీయమైన రుజువు పెట్టుకో నవసరం లేదు. దాన్ని మార్చుకోవాలి. మన జ్యోతిష పండితులు - చాలా మంది - అలా క్రొత్త విషయాలను సహృదయంతో - తీసుకుంటున్నారనే   చెప్పాలి. మన టీ.వీ. ప్రోగ్రాములలో - యిప్పుడెవరూ - రాహు కేతువులను గురించి మాట్లాడడం లేదు. భూమి నీడ చంద్రుడి పై పడడమూ, లేదా, చంద్రుడు భూమికీ సూర్యుడికీ మధ్య రావడం లాంటి - ఆధునిక శాస్త్ర ప్రజ్ఞానాన్ని వారు తీసుకుంటున్నారు .

అదే సమయంలో - చంద్రుడు - మన మనస్సులపై చాలా ప్రభావం కలిగివున్నాడనడానికి - చాలా  శాస్త్రాధారాలున్నాయి. మన ప్రాచీన శాస్త్రంలోనూ, ఆధునిక మనస్తత్వ శాస్త్రంలోనూ. చంద్రుడికి, సముద్రానికీ, చంద్రుడికీ, కలువ లాంటి పూలకూ, చంద్రుడికీ, ప్రతి ప్రాణి మనోభావాలకీ -చాలా సంబంధమున్నట్టు - ఎవరైనా చాలా సులభంగా గ్రహించ వచ్చు. ఎందుకిలా - అంటే  - ఆధునిక శాస్త్రం దగ్గర కూడా - పెద్దగా ఆధారాలు లేదు. యిది యిలా జరుగుతోంది - అంతే. అది మనం గమనిస్తున్నాము.

పూలపై అంత ప్రభావం వున్న చంద్రునికి -  గ్రహణ సమయంలో - గర్భస్థ శిశువుపై కూడా కొంత ప్రభావం వుండొచ్చు నని - మన వారు ఎన్నో వేల ఏండ్లు గమనించారు, గనుకే, గర్భిణీ స్త్రీలు కొంత జాగ్రత్తగా వుండమని చెప్పారు.  దీనికి కారణం - ఆధునిక శాస్త్రజ్ఞులకు యింకా అందక పోవచ్చు - గానీ - యిది కాదని చెప్పడానికి ఆస్కారం లేదు.

పౌర్ణమి నాడు - మనస్స్థితి సరి లేని వారిపై దుష్ప్రభావాలు పడడం - అందరూ చూస్తూనే ఉన్నాము. అదీ - కాదని చెప్పడం వీలు కాదు. కొంత జాగ్రత్త వహించడంలో తప్పు లేదు.

అయితే - ఈ నక్షత్రం వారికి ఈ ఫలితం, మరో నక్షత్రం వారికి మరో ఫలితం అని చెప్పడంలో - మన పూర్వీకులు - స్టాటిస్టికల్ గా ఏం గమనించారో, ఎలా గమనించారో మనకు ఆధారాలు లేవు.  మనకు తెలీదు. వాటికి, యిప్పుడు, మళ్ళీ, స్టాటిస్టికల్ ఎనాలిసిస్ కావాల్సి వుంది. మన పూర్వీకుల వాక్కు ఈ విషయంలో సరిగా వుండచ్చు . వుండకనూ   పోవచ్చు. కానీ తప్పని - వెంటనే నిర్ధారించ లేము. శాస్త్రం తప్పని చెప్పాలంటే - మళ్ళీ శాస్త్ర పరిశోధన చేయాల్సిందే. అంతే గాని - అంధ విశ్వాసమని, మూఢ విశ్వాసమని చెప్ప లేము; చెప్ప రాదు.

యిలా ఎన్నో విషయాలు - ప్రాచీనులు చెప్పిన వాటిని మనం మళ్ళీ స్టాటిస్టికల్ ఎనాలిసిస్ ద్వారా - తప్పా , వొప్పా - చూడాల్సిన అవసరం వుంది. అంతరిక్షంలో జరిగే ఎన్నో విషయాలలో కూడా - మన వారి గమనిక - భూమి నుండి చూసేంత వరకూ - సరిగ్గానే వుంది.  కొన్ని వారికి తెలీని విషయాలు ఈ రోజు మనకు తెలియ వచ్చు గాక. కానీ - చాలా విషయాలలో - వారి గమనిక - చాలా అద్భుతంగానూ, తులనాత్మకం గానూ, నిజానికి చాలా దగ్గర గానూ వుందన్న విషయం మనం వొప్పుకోక తప్పదు. 

మన ప్రాచీనులు ఆరితేరిన శాస్త్రజ్ఞులు. వారు శాస్త్ర పరిశోధన చేసినంత బాగా - ఈ రోజు భారత దేశంలో - జరగడం లేదనే చెప్ప వచ్చు. ఉదాహరణకు, ఆయుర్వేదంలో - వారు  చెప్పినన్ని సూచనలు, మందులు, జాగ్రత్తలు - ఇప్పటి ఆధునిక వైద్య  శాస్త్రానికి తెలీదని ఘంటా పథం గా చెప్ప వచ్చు.  కాకపోతే - సర్జరీ వరకు - ఆధునిక వైద్యం ఎంతో ముందుకెళ్ళింది. అదే విధంగా - మందుల తయారీ విధానాలలో - ఆధునిక వైద్య శాస్త్రం ఎంతో ప్రగతి సాధించింది. అయినా ఆయుర్వేదంలో -ప్రకృతి  ద్వారా సహజ సిద్ధమైన మందుల వాడకంలో సాధించిన ప్రగతి - ఆధునిక వైద్యానికి అస్సలు తెలీదనే చెప్పాలి. 

దురదృష్ట వశాత్తూ - ఆధునిక వైద్యం ఈ విషయంలో - శాస్త్రీయ దృక్పథం లోనే లేదని చెప్పాలి. వేప, పసుపు, తులసి లాంటి దివ్య ఔషధుల విషయంలో కూడా -  మన దేశం లోనూ- ప్రస్తుత కాలంలో పెద్దగా, పరిశోధనలు జరగడం లేదు. మరెక్కడానూ జరగడం లేదు. హనుమంతుడుతెచ్చిన మృత సంజీవని లాంటి ఔషధులు లేవని మనం చెప్ప రాదు. పరిశోధించాలి.ప్రతి ఆకు, ప్రతి కాయా, ప్రతి పూవూ, ప్రతి బెరడూ, ప్రతి వేరూ - ఎలాంటి ఔషదో - మనం పరిశోధించాలి .  

కొన్ని సంవత్సరాలకు ముందు - మేం అప్పుడు వుంటున్న యింట్లో వొక చెట్టు వుండేది. మా యింటికి వొక వృద్ధుడు - ఏదో పనిమీద వచ్చాడు. ఆయన కాలిపై పెద్ద పుండు చాలా సంవత్సరాలు గా వుందట.  అది, ఎంత మంది ఆధునిక వైద్యుల వద్దకు వెళ్ళినా పూర్తిగా నయం కాలేదట. కుంటుతూనే  - మా యింటికి వచ్చాడు. ఆయన మా యింట్లో వున్న రోజు - మా యింటికి మరో అతను వొక గ్రామం నుండి వచ్చాడు. ఆయన పుండును చూసి -  ఆయన ను అడిగాడు. తరువాత, మా యింట్లోనే వున్న చెట్టు ఆకు రసం తీసి ఆ పుండు పై పోసి, ఏదో రకంగా కట్టు కట్టాడు. ఆయన మా యింట్లో వున్న నాలుగు రోజుల్లోనే - సంవత్సరాలలో మానని ఆయన పుండు - శుభ్రంగా మానిపోయింది. యిది మా కళ్ళ ఎదురుగా జరిగిన అద్భుతం. అంటే - అన్ని - ఆంటీ బయోటిక్స్ కూ మించిన మందులు ప్రకృతిలోనే వున్నాయని శుభ్రంగా తెలుస్తూనే వుంది కదా.   అప్పటి నుండీ - మేము కూడా, ఆయుర్వేద మందులు ఎక్కువగా వాడుతూ ఉన్నాము. వాటి సత్ఫలితాలను చూస్తూనే ఉన్నాము.

చరకుడు, సుశ్రుతుడు లాంటి మహర్షులు  వేల సంవత్సరాలకు ముందు చెప్పినవే  యిప్పుడూ చెప్పుకుంటున్నాము. కాబట్టి - మన వారు యింకా గొప్ప శాస్త్ర పరిశోధకులు కావాలి. శాస్త్రీయ దృక్పథం యింకా ఎక్కువగా అలవరుచుకోవాలి. చరకుడు చేసిన పరిశోధన కంటే ఉన్నతమైన పరిశోధనలు ఈ రోజు చేయాలి. 

భారత ప్రభుత్వమూ - ఈ విషయంలో  చైనా దేశం నుండి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో వున్నాయి.  వారు - వారి శాస్త్రాల పైన యింకా ఎంతో పరిశోధనలు చేస్తూనే వున్నారు. మన దేశంలో ఉన్నంత శాస్త్ర పరిజ్ఞానం మరెక్కడా లేదు. ఆయుర్వేదమే కాదు. యోగ శాస్త్రం అంత కంటే వున్నత మైనది. గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, లోహ శాస్త్రము, అర్థ శాస్త్రము, యింతెందుకు , కామశాస్త్రం  కూడా -  మన దేశంలో పరిశోధించ బడినంత ఎక్కువగా - మరెక్కడా జరగలేదు.

మన దేశంలోని - ఆధునిక వైద్యులు కూడా - ఆయుర్వేదమూ అభ్యసించ వలసిన  అవసరం వుంది. అదే విధంగా - ఆయుర్వేద వైద్యులూ - ఆధునిక వైద్యం అభ్యసించ వలసిన అవసరమూ వుంది. రెండిటి మిశ్రమం యివ్వ గలిగే గొప్ప ఫలితాలు - రెండూ వేర్వేరుగా యివ్వ లేవు. యిది మన దేశంలో - మన ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాల్సిన ముఖ్యమైన పని.  రెండు శాస్త్రాల అధ్యయనం వొకే డిగ్రీ లో జరగాలి. యం.బీ.బీ.ఎస్ (ఏం.డీ) ల లోనూ, మిశ్రమంగా వుండాలి. ఆయుర్వేద డిగ్రీలలో కూడా   మిశ్రమంగా వుండాలి. ఆ పైన ఆ రెండింటిలో   - పరిశోధనలూ జరగాలి.

నిజంగా  రామాయణంలో చెప్ప బడిన  గొప్ప వోషధులు - యిప్పుడు మన మధ్య మనకు తెలియ కుండా వుంటే  -  అంతకు మించిన మూర్ఖత్వమూ, అశాస్త్రీయ  దృక్పథమూ మరోటి వుంటుందా? ఆ వోషధులు వుండే అవకాశాలు చాలా వున్నాయని నేను నమ్ముతున్నాను. అవి వెదకాలి.

అలాగే - జ్యోతిష శాస్త్ర విషయంలో - కూడా -ఎంతో స్టాటిస్టికల్ ఎనాలిసిస్ జరగాల్సి వుంది. ఈ శాస్త్రాన్ని కూడా - మూఢ నమ్మకమని - మూడ్హంగా  కొట్టి పారేయనూ కూడదు. అలాగని - శాస్త్ర పరిశోధన చేయకుండా వుండనూ   కూడదు. 

ప్రకృతి రహస్యాలు శాస్త్ర పరిశోధకులకు అందాలంటే - ఇలాంటి - శాస్త్రీయ దృక్పథం మొదట అలవరుచుకోవాలి. 
నాకు యోగ శాస్త్రం అంటే - చాలా యిష్టం. శ్రీ కృష్ణుడు చెప్పిన  ధ్యాన యోగమూ, పతంజలి మహర్షి చెప్పిన యోగ సూత్రాలను రెండింటినీ   బాగా అధ్యయనం చేసి - వాటి పై నా బ్లాగు - వైజ్ స్పిరిచువల్ ఐడియాస్. బ్లాగ్ స్పాట్.కాం లో సమగ్రమైన వ్యాఖ్య రాయడం  జరిగింది. అదే విధంగా - నాకు ఆవకాశం వచ్చినంత వరకు,  చాలా మంది యోగా గురువుల వద్ద, ట్రైనింగ్ తీసుకోవడమూ జరిగింది. ఆ తరువాత -  నాకు తెలిసినంత వరకు - దాన్ని ప్రతి రోజూ, ఆచరించడమూ   జరుగుతూ వుంది.  ఈ యోగ శాస్త్రం పైన ప్రతి భారతీయుడికీ అవగాహన కల్పించి, కొంతైనా ట్రైనింగ్ యిప్పిస్తే - భారత ప్రభుత్వం - మనకు ఎంతో మేలు చేసినది అవుతుంది. ప్రభుత్వ ప్రాపకం, గుర్తింపు వుంటేనే - ఏ విద్య అయినా ప్రజలకు అందుతుంది.

ఈ మధ్య నాకు తెలిసి - చాలా మంది యువకులు - 25 , 27   వయస్సులో నున్న వారు - హార్ట్ ఎటాక్ తో మరణించడం జరిగింది. యింకా ఎంతో మంది  యువకులు - మానసిక వొత్తిడి వలన, సరైన శారీరక, మానసిక వ్యాయామం లేని దాని వలన - అటువంటి భయంకరమైన వ్యాధుల వైపు వెళ్ళు తుండడం  చూస్తూ ఉన్నాము. మన దేశంలో - యిలా జరగడం మంచిది కాదు. ఎక్కడైనా మంచిది కాదు.

యోగశాస్త్రం పుట్టిన దేశంలో - మానసిక వొత్తిడికి, యిటువంటి వ్యాధులకు చోటు ఉండరాదు.అంతే కాదు. ఎటువంటి హృదయ వ్యాధులూ రాకుండా నివారించ గలిగే - అద్భుతమైన ఆయుర్వేద మందులూ (హృదయామృత వటి, అర్జునారిష్టము లాంటివి ఎన్నో )మన దేశంలో వున్నాయి. ఇవేవీ తెలీకుండా - అసలు శాస్త్రీయ దృక్పథం లేకుండా - మనమూ, మన ప్రభుత్వమూ - వుండడం చాలా దురదృష్ట కరం.

ఈ మధ్య తమిళం లో "ఏళాం   అరివు" -అంటే యేడవ యింద్రియం (సెవెంత్ సెన్స్)   లేదా, యేడవ జ్ఞానము - అని వొక సినిమా వచ్చింది. అందులో - బోధిధర్మ - అనే బౌద్ధ బిక్షువు చరిత్ర ఆధారంగా - తమిళ నాడులో ప్రాచీన కాలం లో వున్న - రక రకాల పరిజ్ఞానాలను గురించి చిత్రీకరించడం జరిగింది. బోధి ధర్మ తమిళ దేశం నుండి చైనా కు వెళ్లి - అక్కడి వారికి, వైద్య శాస్త్రమూ, యుద్ధ కళలూ - ఎన్నో నేర్పించాడు. ఆయన బోధించినవన్నీ - యిప్పుడు - చైనా, థాయ్లాండ్ లాంటి ఎన్నో దేశాలలో వున్నాయి.    ఆయనను దాదాపు - దేవుడి లాగా వారు పూజిస్తున్నారు  అందరూ - యిప్పటికీ. అక్కడ ఆయనను గురించి తెలియని వారు లేరు. కానీ - దురదృష్టము ఏమంటే - ఆయన పుట్టిన తమిళ నాడులో - ఆయన పేరు కూడా ఎవరికీ తెలీదు. వారి చరిత్రలో కూడా ఆయన గురించి ఎక్కడా లేదు. అందుకనే ఆ సినిమా తీసారు. 
 
మరి తెలుగు వారున్న దేశంలో - ఎలా వుంది. అక్కడా అంతే. రాముడు తిరిగిన దంతా - తెలుగు దేశంలోనే. కానీ - దాని గురించి - తెలుసుకోవాలనే తపన మనలో లేదు.  కిష్కింద వున్న చోటు మనకు అక్కర లేదు.  మన రాష్ట్రంలో వున్నన్ని కొండలు చాలా రాష్ట్రాలలో లేవు. ఏ కొండలో - ఏమున్నాయో మనకు తెలీదు. మన నదుల గురించి కూడా మనకు పూర్తి అవగాహన లేదు. 

సరే. అవన్నీ వొక ప్రక్క. మన నన్నయ్య, తిక్కన, రామలింగడు, పోతన, శ్రీనాథుడు లాంటి మహాకవులు -  తెలుగు కాస్త సంస్కరించినంత   మాత్రాన -  వారి విగ్రహాలను కూడా పగుల గొట్టే - వారు వచ్చారు. ముందుకెళ్లని   భాష ఏదీ వెనక్కూ వెళ్లదు. చచ్చిపోతుంది. అదే చారిత్రాత్మక సత్యం. తెలుగు వారికి సంస్కృతం, హిందీ  లాంటివి చాలా సులభం. మనకున్న ఆ సౌలభ్యం మనం పోగొట్టుకోరాదు. 

యిప్పుడు కూడా కొంత మంది తెలుగు వారి ధారణా శక్తి ముందు -  ప్రపంచమంతా తలవంచుకోవాల్సిందే. నేను దేశమంతా తిరిగాను కానీ - మన వారిలా, అష్టావధానాలూ,శతావధానాలూ, సహస్రావాధానాలూ  యింత అవలీలగా చేయడం మరెక్కడా మనం చూడలేము.

దీనికి ఎన్నో కారణాలు. యివే కాక తెలుగు వారికి వున్న కొన్ని ప్రత్యేకతలూ - దీనికి కారణాలుగా మనం చూడొచ్చు. అవి తెలుగు వారు అందరికీ అందాలి కానీ - అందరికీ పోయేటట్టు ఈ రోజు విద్యా విధానమూ, కొందరు ప్రజల మనస్తత్వమూ మారి పోతోంది.

యిది మారాలని ఆశిస్తున్నాము. మనలో శాస్త్రీయ దృక్పథం పెరగాలి. మన శాస్త్రాల పట్ల గౌరవం పెరగాలి. అవి అందరికీ అందేటట్లు చూడాలి. వాటిని - యింకా ఎంతో పరిశోధించాలి. అందుకు - అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి. 

=మీ

వుప్పలధడియం  విజయమోహన్

8, డిసెంబర్ 2011, గురువారం

శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు = రామాయణంలో మానవీయ సంబంధాలు = దాంపత్య సంబంధాలు



శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు మంచి ధారణా పటిమ గల విద్వాంసుడు. వక్త. పురాణ, ఇతిహాసాలలో దిట్ట. వారి ప్రవచనాలలో - రామాయణంలో మానవీయ సంబంధాలు - అన్న అంశంపై , అందులోనూ, దాంపత్య సంబంధాలు అన్న అంశంపై వైజాగు లో చెప్పిన కొన్ని ప్రవచనాలు గత కొన్ని రోజులుగా నేను టీ.వీ. ద్వారా వినడం జరిగింది.

అందులో - అన్ని అంశాలూ చాలా బాగున్నా - వొకటి రెండు మాటలు మనసుకు హత్తుకు పోయేలా వున్నవి యిక్కడ చెప్పాలనిపించింది.

  • భార్యాభర్తలిద్దరూ - వొకరికొకరు నీడ లాంటి వారు. మీరు, రాజ మార్గంలో వెళ్ళినా, ముళ్ళ బాటలో నడుస్తున్నా, మీ నీడ మీ వెనుకే వస్తుంది కదా. అబ్బే. ఈ ముళ్ళ బాటలో మీతో బాటు రాను. దూరంగా వెళ్లి రాజ మార్గం వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాను అంటుందా? లేదు కదా. మీరు, మీ భార్య / భర్తకి నీడలా, తోడుగా  అలా వుండాలి. అదే సీత గొప్పదనం. అదే రాముడి గొప్పదనం. అరణ్యాలలో కూడా వొకరికొకరు తోడుగా, ఆనందంగా వున్నారు. (నా అభిప్రాయంలో - నిజానికి, అరణ్యాలలోనే -  వారి దాంపత్య శోభ పారాకాష్ట నందుకుందని మనం చెప్పచ్చు. రాజ్యానికి వచ్చిన తరువాత - రాముడు కూడా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లాగా - 12 , 14  గంటలు పని చేసే వాడు కదా. అప్పుడీ దాంపత్య శోభ కాస్తో, కూస్తో తగ్గే వుంటుంది.)    
  • సీత అంటుందట   - రామా, అరణ్యంలో నేను నీ ముందు నడుస్తాను. అక్కడ ముళ్ళు వుంటే, అవి నా కాళ్ళకు గుచ్చుకుంటే , నాకు సంతోషం వేస్తుంది. ఎందుకంటే, ఆ ముళ్ళు తరువాత  నీకు గ్రుచ్చుకోకుండా, నీ మార్గం సుగమం చేసాను కదా అని. అందుకని - నేను నీతోనే వస్తాను అందట. -  ( భార్యాభర్తలు అలా వొకరి కోసం వొకరు జీవిస్తేనే బాగుంటుంది. అదే మన సంస్కృతి. యిందుకు మారుగా - చాలా అమెరికా పత్రికలలో మనకొక విషయం కనిపిస్తుంది. వారి సలహా ఏమిటంటే - మీ భార్య / భర్తతో - మీ డబ్బును మాత్రం పంచుకోకండి.  డూ నాట్ మిక్స్ యువర్ మనీ విత్ యువర్ హనీ - అంటారు. అంటే - ఎప్పుడు విడిపోతామో అన్న సందేహం తోనే జీవితమంతా గడిచిపోతుంది.)

  • అరణ్యంలో వొక చోట - వొక పెద్ద చెట్టుకు, అందమైన పూల తీగ అల్లుకుని వుందట. దాన్లో, అందమైన, సువాసనా భరితమైన, పెద్ద పెద్ద, రంగు,రంగుల పూలు నిండుగా వున్నాయట. అది చూపిస్తూ రాముడు అన్నాడట - సీతా, ఎంత పెద్ద చెట్టైనా - ఆ తీగ అలా అల్లుకోక పొతే, దానికి అందమెక్కడిది ? సువాసన ఎక్కడిది? ఎవరు చూస్తారు దాన్ని? - అని. 

  • సీత అందట - కానీ, రామా, ఆ తీగ, ఆ చెట్టును అలా అల్లుకోక పోతే, అది నెల మీద పడి పశువులచేత త్రొక్క బడి -ఎప్పుడో చచ్చిపోయి వుండేది కదా.   చెట్టు లేక పొతే - తీగ లేనే లేదు- అని. 

  • సరే. సీతా రాముల వివాదానికి - లక్ష్మణున్ని, మధ్య వర్తిత్వానికి పిలిచారు. చెట్టు గొప్పా, తీగ గొప్పా? లక్ష్మణుడు అన్నాడుట - అ చెట్టు అలా పెరిగి, ఆ తీగ అలా అల్లుకోక పొతే - నేను వాటి నీడ క్రింద, ఆ సువాసనల మధ్య ఎలా సేద తీరుతాను.   ఆ రెండూ అలా వుంటేనే - మా లాంటి వారికి - చాలా సంతోషం అని. ( పాశ్చాత్య దేశాలలో - రెండూ రెండు చెట్లుగా వుంటాయి. వొకటి చెట్టు; వొకటి తీగగా వుండవు. అల్లుకునే స్వభావం లేదు. రెండూ వొకటయే సమస్యే లేదు. అదో లోకం. నువ్వు గొప్ప అంటే, నువ్వు గొప్ప అనే మన సంస్కృతి. నేను గొప్ప అంటే, కాదు నేను అనే ఆ సంస్కృతి. ఎవరిష్టం వారిది.)

ఇదండీ మన సంస్కృతి. మచ్చుకు, చాగంటి వారు చెప్పిన  రెండు మూడు  ఉదాహరణలు యిచ్చాను.  కాస్త నా అభిప్రాయమూ చెప్పాను.  ఈ సంబంధాలలో ఏదో త్యాగం వుందనుకుంటే, చాలా తప్పు. అందులోనే వారి, వారి సంతోషం కూడా వుంది గనుకే -   వారు అలా వున్నారు.  అది వారికి అర్థమయ్యింది.   మనకు....  అర్థం కావాలి. అంతే.

ఇలాంటివి రామాయణంలో ఎన్నో వున్నాయి.

=మీ

వుప్పలధడియం విజయమోహన్

మీకు నిజంగా ఏం కావాలో, ఎలా వస్తుందో మీకు తెలుసా? = జీవితంలో సక్సస్ కు అతి ముఖ్యమైన మూల మంత్రం = వొక్క 48 రోజులు = యిలా చెయ్యండి


వచ్చే వొక గంట కాలంలో - మీరు ఏది అడిగితే అది మీకు వచ్చేస్తుంది, మీకు ఎవరో యిచ్చేస్తారు - అనుకోండి. మళ్ళీ ఆ గంట తరువాత , మీ ముందటి స్థితికి మీరు వచ్చేస్తారు - అని  కూడా  అనుకోండి. యిలా జరిగితే  మీరు ఆ వొక గంట కాలంలో - మీకేం  కావాలని అడుగుతారు?

ఆఆ.... వస్తుందా, పోతుందా... నేను అడిగేది వచ్చేటట్టుంటే స్వర్గమే అడిగేద్దును కదా!

నిజమే. మీరు స్వర్గము కూడా అడగవచ్చు. కానీ ఎందుకా స్వర్గము మీకు - మీరు ఆ కారణం మాత్రం చెప్పాలి. స్వర్గం ఎందుకేమిటి? మహా సౌఖ్యాలనుభవించ వచ్చు కదా -అంటారు.

నిజమే కావచ్చు. కాకనూ పోవచ్చు. స్వర్గం మీరు చూడలేదు. అక్కడ వున్నవి మీకు నచ్చుతాయో లేదో మీకు తెలీదు. తీరా, స్వర్గం వచ్చి, అక్కడ, అన్నీ ఆ యింద్రుడి మాట ప్రకారం జరిగితే? అయినా - అక్కడ ఉన్నవన్నీ మీకు  నచ్చుతాయని  మీకు  చాలా, ఆనందాన్నిస్తాయని మీకు తెలుసా?

అది బైబిల్ లోని స్వర్గం లాంటిదా. మన పురాణాల లోని స్వర్గం లాంటిదా. కొరాను లోని స్వర్గం లాంటిదా.యివన్నీ కాక మరొక లాంటిదా? అక్కడ ఏముంటుంది? మీ ఉద్దేశంలో - అక్కడ ఏముండాలి? ఏముంటే - మీకు అది స్వర్గం లా అనిపిస్తుంది? ఏమి లేక పొతే, లేదా-ఏమి వుంటే, మీకు మహా బోరు కొట్టగలదు? ఏదో కావాలని వుంది మీకు - కానీ, నిజంగా, స్వర్గం లో ఏమి వుండాలో, ఏమి  కావాలో, ఏదుంటే, మీకు చాలా బాగుంటుందో  మీకు తెలీదు.

పోనీ, బిల్ గేట్స్ లాంటి వారి అందరి వద్దా వున్న సంపద  మీకిస్తే - మీకు చాలా తృప్తా? మరిచి పోకండి, గంట తర్వాత, అంతా పోతుంది మళ్ళీ. సరే. ఆ సంపద వున్న గంట సమయంలో మీకెలా వుంటుంది? చాలా సంతోషంగా వుంటుందా? అదెలా ఖర్చు చెయ్యాలో తెలీకుండా అవస్థ పది పోతారా? యోచన చెయ్యండి.  యిప్పుడు బిల్ గేట్స్ ఏం చేస్తున్నారో తెలుసా? అయిదు సంవత్సరాలుగా - తన డబ్బులో - మూడో వంతు  దానంగా ఇచ్చేసారు. యింకా ఇస్తూనే వున్నారు.ఆ డబ్బు మరేం చెయ్యాలో - ఆయనకే తెలియడం లేదు. మీకెలా తెలుస్తుంది?

లేదంటే - ఆ వొక్క గంటా, గడచినా అయిదు సంవత్సరాలలో సెలెక్టయిన మిస్ వరల్డు లందరూ మీరేం చెబితే   అవి చెయ్యడానికి సిద్ధంగా కూర్చున్నారనుకోండి. అది చాలా మీకు? అది మీకు తృప్తి నిస్తుందా ?

మరి మీరు ఆడవాళ్ళయితే - ఏమి అడుగుతారు? మీకు నచ్చిన హీరోలు మీ యింటి ముందు క్యూ లో నిలబడి, మీరేం చెబితే   అవి చెయ్యడానికి సిద్ధంగా కూర్చున్నారనుకోండి. అది చాలా మీకు? అది మీకు తృప్తి నిస్తుందా ?

యోచన చెయ్యండి. వొక గంట - మీరేం అడిగితే - అది మీకివ్వబడుతుంది.

ఏదడిగినా - ఎందుకో మీరు చెప్పాలి. అంతే.

ఎందుకు?
ఎందుకు?
ఎందుకు?
ఎందుకు?
ఎందుకు?

యిలా - మీ ప్రతి కోరికకూ - కారణం చెబుతూ వెళ్ళండి.

ఆరో సారి  మీరు కారణం చెప్పేటప్పటికి - మీకు తెలిసి పోతుంది. మీకు కావలసింది - అవేవీ కాదు.

మీకు నిజంగా కావలసింది వొక్కటే. నిజమైన, అసలైన, హృదయాన్ని నింపే సంతోషం. అదే మీకు కావలసినది.
కాని మీరు - నాకు అదివ్వు. సంతోషం వస్తుంది. నాకు యిదివ్వు. సంతోషం వస్తుంది. నాకు యివి రెండూ కాదు - మరోటి యివ్వు. సంతోషం వస్తుంది. యిలా అంటూ వెడతారు.

నిజానికి కోరికలేవీ నిజమైన, పూర్ణమైన  సంతోషాన్నివ్వలేవు.

మీకు కావాల్సింది, అదీ, యిదీ, మరొకటీ కావు. మీకు కావలసిందే సంతోషమే.

అదొక్కటుంటే  - మరేది లేక పోయినా పరవాలేదు. అది లేకుంటే - జీవితమే వ్యర్థం.

మరో అడుగు ముందుకు వేసి - చూద్దాం.

మీలో అమితమైన, లేదా, ఎంతో కొంత  సంతోషం వుందనుకోండి. యిప్పుడు కళ్ళు మూసుకుని మరేం కావాలో యోచన చేయండి.... ఏదో కావాలనుకున్నారు కదా. ఎవరెవరి యిష్టం వారిది. మీరు యిప్పుడు కోరుకున్నది మీ  యిష్టం. ఏం కావాలో కోరుకోండి .

యిప్పుడు మళ్ళీ యోచన చేయండి. మీలో యిప్పుడు ముందటి  సంతోషం వుందా? అక్కడ అతృప్తి చోటు చేసుకుందా?

ఘంటా పథం గా చెప్పొచ్చు - ఏ క్షణంలో, మీరు మరొకటి కూడా వుంటే మేలనుకున్నారో - ఆ క్షణం నుండే , మీ సంతోషం చాలా తగ్గి, ఆ స్థలంలో, అతృప్తి చోటు చేసుకుంటుందని.

మీ దగ్గర ఏమున్నా, ఎన్నున్నా - యిప్పుడు మీ మనసంతా - మీరు   కావాలని కోరుకున్న  ఆ మరోటి పైనే వుంది.  మీలో సంతోషం వున్న స్థలంలో, యిప్పుడు, ఆ కోరిక వుంది.

అందు వలన మీ దగ్గర ముందున్న సంతోషం లేదని - మీకు చాలా సులభంగా తెలిసిపోతుంది.

మరో రెండు కోరికలు కోరారనుకోండి. మీ సంతోషం  ఎనభై శాతం తగ్గి పోతుంది. యిరవై శాతమే మిగులుతుంది.

యిదో పరీక్షగా ,ప్రయోగంగా - చేసి చూడండి. కోరికలు ఎక్కువయ్యే కొద్దీ - సంతోషం అదే శాతంలోనో, అంతకంటే ఎక్కువగానో   - తగ్గి పోతుందని యిట్టే అర్థమయి పోతుంది. యిది పచ్చి నిజం. కృష్ణుడి నుండీ, బుద్ధుడి నుండీ, జ్ఞానులందరూ చెప్పేది యిదే.

యిప్పుడు - మరో చిన్న ప్రయోగం చేసి చూడండి. యివన్నీ , మీరు, నేను చేయ గలిగేవే. పెద్ద  బ్రహ్మ యజ్ఞంమేం కాదు.

మరో సారి కళ్ళు మూసుకోండి. యిప్పుడు - మీ దగ్గర నిజంగా వున్నవి మాత్రం మీకు చాలు; మరేం అక్కరలేదు మీకు - అని అనుకోండి.  మీ భార్య / మీ భర్త - తప్ప మరెవరూమీకు అక్కర లేదు. వారు మీకు బాగా నచ్చినట్టు అనుకోండి. వారు తప్ప మరెవరైనా కూడా - మీతో అంత బాగా వుండలేరని, వున్న వారిలో, వారే మీకు తగిన వారని అనుకోండి. అలాగే - మీ సంతానం - మీకు బాగా నచ్చారనుకోండి. మీ తలిదండ్రులు మీకు బాగా నచ్చారనుకోండి.

మీకు యివ్వ బడినవన్నీ - మీకు తగినవే; మీకు మరేమీ అక్కర లేదు; యివ్వ బడిన వాటితో తృప్తి పడతానని మనః పూర్వకంగా అనుకోండి.

అసలు నిజం కూడా అదే. మీ శరీరం వొక్క సారి చూసుకోండి.  మీ రంగు, మీ ఎత్తు, బరువు, లావు - ఎన్నో, మీకు నచ్చక పోవచ్చు. కానీ ఆ శరీరం వదిలేసి, మరో శరీరం తీసుకో గలరా. లేదు కదా?

యిప్పుడు - మీకు వున్న శరీరం మీకు నచ్చితే సంతోషంగా వుండ గలరా? మీకు నచ్చక పోతే సంతోషంగా వుండ గలరా? నచ్చితేనే గదా. కాబట్టి మీ శరీరాన్ని హృదయ పూర్వకంగా వొప్పుకోండి. అది ఎలా వున్నా సరే.

మన పూర్వీకులు "దేహో దేవాలయో ప్రోక్తః" అన్నారు. అంటే - మీ దేహం వొక దేవాలయం. అందులో, నిజమైన దేవుడున్నాడు. మీ దేవాలయాన్ని, అంటే , మీ దేహాన్ని, అది చిన్నదైనా, పెద్దదయినా, ఎలా వున్నా, ప్రేమించండి. గౌరవించండి. శుభ్రంగా పెట్టుకోండి. వీలైనంత ఆరోగ్యంగా పెట్టుకోండి. అది మీకు తప్పకుండా సంతోషం యిస్తుంది.

మీకు జన్మనిచ్చిన తలిదండ్రులు - ఎలా వున్నారు? వయసయిన కాలంలో ఎలా వుంటారు? మీ శరీరాన్ని మీరు మార్చుకోలేనట్టే , దాన్ని ప్రేమించినట్టే -  తలిదండ్రులు ఎలా వున్నా, వారిని ప్రేమించడం, గౌరవించడం  చేస్తే - ఆ భావన వలన కూడా, మీ మనసులో, తృప్తి, సంతోషం పెరుగుతుంది.   లేదంటే - మీ మనసు - అతృప్తితో, నిస్సంతోషంగా తయారవుతుంది. మన సంస్కృతిలో - మొదటి రెండు దేవుళ్ళు ఎవరో తెలుసా? మాతృదేవో భవ; పితృ దేవో భవ;   తల్లి కనిపించే దైవం. ఆ తరువాత - తండ్రి కనిపించే  దైవం. నిజమైన దేవుడిని, అంటే, శివుడినో, విస్ద్నువునో, ఎహోవానో, మరే పేరున్న దైవాన్నయినా మీరెప్పుడూ మీ కళ్ళతో చూడ లేరు. కానీ - తల్లి దండ్రులలో - వారెవరినైనా చూడొచ్చు. చూడాలి. చూడండి.

మీ సంతానమైనా అంతే. వారినీ మార్చలేరు మీరు. వారెలా వున్నా వారే - మీ సంతానం. వారినీ - మీరు  హృదయపూర్వకంగా ప్రేమించండి. మీ సంతోషం వెంటనే పెరుగుతుంది.

కారణం ఏదైనా కానివ్వండి.  మీరు వారిని ప్రేమించ లేక పొతే -  మీకే నష్టం. మీ సంతోషమే పడిపోతుంది.

మీ శరీరాన్ని గాని, మీ తలిదండ్రులను గాని, మీ  సంతానాన్ని గాని - మీరు మార్చు కోలేరు. మరి కాస్త యోచన చేస్తే - మీకు అర్థమవుతుంది - వారంతా, మీకివ్వబడిన వర ప్రసాదమని.  వారిని మీరు కాస్త ప్రేమిస్తే - వారిలో - మీ పట్ల ఎంత మార్పు వస్తుందో - మీకు యింకా తెలియలేదు.

మీ చాలెంజి అల్లా వొక్కటే.

కనీసం 48  రోజులు - వారిని పూర్తిగా ప్రేమించండి. వారి తప్పులను  (అంటే, మీ దృష్టిలో - వారి తప్పులు)  పూర్తిగా ఈ 48  రోజులు క్షమించండి. వారికి మీరు ఏమేమి మంచి చేయ గలరో - అవన్నీ చెయ్యండి. వారి నుండీ, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయండి.  వారి పట్ల  విమర్శలను పూర్తిగా విడిచి పెట్టండి, ఈ 48  రోజులు.  వారు ఏ మంచి పని చేసినా, మీకు నచ్చిన ఏ (మంచి) పని చేసినా  - కొద్దిగా పొగడండి.

సరే. 49  వ రోజు - మీ యింట్లో, ఏ మార్పు వచ్చిందీ  - మీకే తెలుస్తుంది. చాలా, చాలా మార్పులు మీకే స్పష్టంగా కనిపిస్తాయి. మీ సంతోషం చాలా పెరుగుతుంది. మీ తప్పులు మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీ వారు, మీకు నచ్చే విధంగా ప్రవర్తించాలని ప్రయత్నించడం మీరే చూస్తారు. పూర్తిగా అని కాదు సుమా.  పూర్తిగా, మీకు నచ్చే విధంగా, మీరే వుండలేరు తెలుసా. మరొకరెలా వుంటారు?

యివన్నీ వొక ఎత్తు. మీరు - యిదే బాణీలో - మీ భార్య / భర్త ను - మీకు దేవుడిచ్చిన అతి గొప్ప వరంగా తీసుకుని - వారిని ప్రేమించండి. 48  రోజులు - మళ్ళీ.

వారిపై మీరు చేసే విమర్శలు పూర్తిగా నిలపండి. వారిని అప్పుడప్పుడు, నిజమైన కారణాలు కనిపించినప్పుడు - కాస్త పొగడండి. పని కట్టుకుని నిజమైన కారణాలు వెదికి - తప్పకుండా  పొగడాలి.  కనీసం రెండు రోజులకు వొక్క సారైనా (మరీ ఎక్కువ చేయకుండా) పొగడండి.

వారికి, మీరు, ఏమేం సహాయం చేయగలరో, చెయ్యండి. వారికి, మీలో నచ్చని, చెడు విషయాలుంటే - అవి ప్రక్కన పెట్టడానికి కృషి చెయ్యండి.

మీరు యివన్నీ పూర్తిగా, హృదయ పూర్వకంగా చెయ్యాలంటే - ప్రతి దినం ఉదయం వొక చిన్న పని చెయ్యాలి.  లేచిన వెంటనే, మొహం కడుక్కున్న వెంటనే - ఏదో వొక దేవుడిని తలుచుకొని, లేదా, దేవుడి విగ్రహం ముందో, పటం ముందో నిలిచి , లేదా మనసులో అనుకుని - వీరందరి ఆరోగ్యం కోసం, సంతోషం కోసం, మంచి కోసం - రెండు నిముషాలు మనస్ఫూర్తిగా  ప్రార్థించండి . అందుకు మీ చేతనైన పనులన్నీ మీరు చేస్తానని కూడా చెప్పండి.

వొక్క 48  రోజులు  యిలా చెయ్యండి. యిది కష్టమనుకున్నారా ?  కానే కాదు. ప్రయత్నం చేసి చూడండి. యిది చాలా, చాలా సులభమైన ప్రయోగం. మీరు కావాలనుకుంటే - దీన్ని, ఎంతో, ఉత్సాహంతో, నాటకీయతతో కూడా చెయ్యొచ్చు. (నిజానికి, కృష్ణుడు జీవితమంతా అలాగే చేసాడట). ఈ ప్రయోగంలో, ప్రతి వారంలోనూ, మీరు ఎన్నో  మార్పులు గమనిస్తారు.

మీ వారందరిలో - గణనీయమైన మార్పు వస్తుంది. మీ యింటి వాతావరణం చాలా మారుతుంది. యిలా బ్రదకడం సులభం. ఈ ప్రయోగానికి ముందు మీరున్నట్టుగా బ్రదకడమే కష్టం,

సరే. మీ వారెవరూ మారనే లేదనుకోండి. యిలా జరుగదు.  కాస్తయినా మార్పు తప్పదు. కాని వొక వేళ మారక పొతే!

అప్పటికి - అతి ముఖ్యమైన మార్పు - జరగనే జరిగింది. అది మీలో జరిగింది.

మీరు మారారు. మీ సంతోషానికి మూలం, మీ ఆనందానికి కారణం  మీకు తెలిసి పోయింది. అది - మీ బయట లేదు. మీ లోపలే వుంది.

అది - మీ సంతోషానికి మూలం - మీ తృప్తి.

తృప్తికి మరో  పేరే సంతోషం. 

= మీ

వుప్పలధడియం విజయమోహన్

చిన్న వివరణ : నిస్స్వార్థంగా చేసే దేన్నైనా కోరిక అనరు; యజ్ఞము అంటారు. వాటి ఫలితం మీరు - మీకోసం కోరలేదు.  మిగతా అందరి కోసం కోరారు; చేసారు. అయినా - ప్రకృతి సంతోషంతో - మీకు వెల  కట్ట లేనిది మరేదో యిస్తుంది. అదే సంతోషం. అదే తృప్తి. అది మాత్రమే కాదు. మీరు మిగతా వారికి భవిష్యత్తులో - యివ్వడానికి, చెయ్యడానికి,  మీకు కావలసినంత శక్తి సామర్థ్యాలు కూడా యిస్తుంది.

స్వార్థంతో చేసే ఏ పనిలో నైనా - మీకు నిజమైన సంతోషం దొరకదు. దొరికేది - కొంత సేపు కూడా వుండదు. జాగ్రత్తగా గమనించి చూడండి. మీ ప్రయత్నాల ఫలితం - మీకు వచ్చినా - ఎంతో కొంత అతృప్తిని మిగిల్చేసి త్వరగా  వెళ్లి పోతుంది. యిది ప్రకృతి నియమం.

కాబట్టి - నిజమైన సంతోషం కావాలంటే - ప్రతి రోజూ, నిస్స్వార్థంగా, ఏ చిన్న పనైనా చేయండి. యిది - జీవితంలో సక్సస్ కు అతి ముఖ్యమైన మూల మంత్రం. దీన్నే మనం యజ్ఞం - అన్నాం.

21, నవంబర్ 2011, సోమవారం

SEVALAYA =ఎందరో మహానుభావులు = సేవాలయ = బాలల, వృద్ధుల ఆశ్రమం = మనమేం చెయ్యగలం ?


క్రిందటి వ్యాసంలో - చెయ్యగలిగిన మంచి పనిని వెంటనే చేసెయ్యాలని అనుకున్నాం.

అందులో వొక భాగంగానే - పదిహేడు సంవత్సరాల క్రితం దక్షిణ రైల్వే  పోలీసు వారు -వొక స్త్రీ వేధింపు చర్య ఘటనల పైన చాలా బాగా వ్యవహరించిన తీరును గురించి రాయడం జరిగింది. అలాంటి మంచి పనులు అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి. అయితే - వారికి మన లాంటి వారు సరైన సమయానికి సరైన రిపోర్టు యిస్తే బాగుంటుంది. అలాగే - పోలీసు వారు కూడా - రిపోర్టు యిచ్చే వారిని వేధించకుండా, వారికి సరి అయిన రక్షణ కల్పిస్తూ వుంటే,  పౌరులు-పోలీసుల మధ్య మరింత సహకారం పెరుగుతుంది .

సరే. ప్రాచీన కాలంలో - స్త్రీ, బాల, వృద్ధులు సంతోషంగా వుండే సమాజమే - ఆదర్శ వంతమైన సమాజమని చెప్పారు.

వయసులో వున్న వారు - స్త్రీ, బాల, వృద్ధులను  సంతోషంగా  ఉంచుకోవడానికి - చాలా ప్రయత్నాలు చేసే వారు. పురాణాలు, ఇతిహాసాలలో - వున్న వృత్తాంతాలన్నీ ఇలాంటివే.  క్రిందటి వ్యాసంలో కొంత స్త్రీ వేధింపు చర్యల గురించి మాట్లాడాము.

మిగతావి వచ్చే వ్యాసాలలో చూద్దాము. ఈ వ్యాసంలో -  మరో చిన్న సంఘటన. నవంబర్ పదిహేడో తేదీ - మా దంపతులు వివాహం జరిగి  ముప్ఫై మూడు వసంతాలు ఆనందంగా గడిపిన సందర్భంగా, మా ఊళ్లోనే వున్న - "సేవాలయ" -అనే  అనాథ బాలుర, వృద్ధుల ఆశ్రమానికి వెళ్ళాము.

 యిది రెండో సారి, అక్కడికి మేము వెళ్ళడము.

మొదటి సారి లాగే- ఈ సారీ వొక్క రోజు పూర్తి ఖర్చులు మేము యిచ్చేసాము. కాని, అది జరిపే  వారి చిత్త శుద్ధి, కార్య శుద్ధి   ముందు - మనం చేసే  ధన సహాయం అసలు ఏమీ లేదు. యిప్పటికి దాదాపు 200 మంది వృద్ధులు, 200  మంది తల్లీ,. తండ్రీ లేని విద్యార్థులు - ఆ ఆశ్రమం లో వుంటున్నారు. ఆ విద్యార్థులతో బాటుగా-  మరో 800  మంది బీద విద్యార్థులు  కూడా   ప్రక్క గ్రామాల నుండి వచ్చిఅక్కడ పాట్హ శాలలో చదువుకుంటున్నారు.అందుకనే - సేవాలయా వారికి చాలా మంది సహాయం చేస్తున్నారు. 

అంతకు మించి మనం ఏమిచేయ గలమా -అన్నదే, మనం ఆలోచించ వలసిన విషయం.

తిరిగి వస్తూవుంటే - ఆ కాంపౌండు లోనే - వొక చిన్న పిల్ల మమ్మల్ని చూసి చిరునవ్వుతో   -  చెయ్యి ఊపింది. చాలా ముచ్చటగా వుంది. నేనే  అడిగాను - నీ పేరేమి, ఎన్నో క్లాసు చదువుతున్నావు అని . చెప్పింది. పేరు కృత్తిక. క్లాసు 6  - బీ సెక్షను.

బాగా చదవాలి. మళ్ళీ మేం వస్తాము. వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా వెతుక్కుంటూ వచ్చి చూస్తాము - అన్నాము. ఆ పిల్ల సంతోషంగా -సరే, అంది. చూట్టానికీ ముచ్చటగా వుంది. దేవుడి దయ వుంటే - (వుండాలి)- బాగా వృద్ధిలోకి రాగల పిల్ల. కానీ తల్లీ, తండ్రీ లేరు.ఇలాంటి వారిని చూసినప్పుడు - మనమెందుకు, దాదాపుగా, చేయ గలిగే మంచి పనులు, ఏవీ  చేయడం లేదు - అనిపిస్తుంది.

దేశంలో, అనాథలంటూ - ఎవరూ వుండకూడదు. ప్రతి వొక్కరికీ -  నీకు సహాయం నేనున్నాను,  అని చెప్పే ఏదో వొక సహృదయుడు (రాలు)  తోడు వుండాలి. ప్రతి బాలుడు, బాలిక మొహంలో సంతోషం వుండాలి. అది చెరిగిపోనివ్వకూడదు మనం. ఆ సంతోషం మనం చూడాలి.

అప్పుడే - వారు, మంచి పౌరులుగా పెరగ గలరు.

అంటే - మనం చెయ్య గలిగిన మంచి పనులు - యింకా ఎన్నో వున్నాయి చెయ్యడానికి. రోజూ చెయ్య గలిగినవి, వారం, వారం చెయ్య గలిగినవి. నెలా,నెలా చెయ్య గలిగినవి -  కనీసం ప్రతి నెలా , ఏదో, మంచి పని చెయ్యాలి.

ఎందరో ఎంతో మంది మహానుభావులు ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు కూడా. వారికి - చేయూత నివ్వడం కూడా చేయాలి.

యిది వృద్ధుల ఆశ్రమం

బాలల క్లాసు రూము.
వీరి వెబ్ సైటు = సేవాలయ.ఆర్గ్ ; అందులో మీరు వారి పూర్తి వివరాలు చూడొచ్చు. యిప్పుడు యింకా బాగా - ఎన్నో చేస్తున్నారు.

వీరి లాగా - మంచి పనులు - త్వరగా చెయ్యాలనుకునే వారిని - చేసే వారిని తలుచుకుంటే - ఆనందంగా వుంది కదా .

=మీ 

వుప్పలధడియం విజయమోహన్

19, నవంబర్ 2011, శనివారం

చెయ్య గలిగిన మంచి పని = యిప్పుడే చేసెయ్యండి. = స్త్రీ వేధింపు చర్యలు = లంచగొండితనం =మనమేం చెయ్యగలం ? = దేశ / రాష్ట్ర మహిళా కమిషన్ ఎం చెయ్యాలి?


మనిషికి చాలా, చాలా సంతోషాన్నిచ్చే పనులు - మనం నిస్స్వార్థంగా, మరొకరి కొరకు చేసే పనులే అని చెప్పుకోవచ్చు. అవి  చిన్నవే  కావచ్చు. కాస్త  పెద్దవీ  కావచ్చు. కొన్ని సందర్భాల్లో - మహా గొప్ప పనులూ కావచ్చు.  ఏదైనా - మనం నిస్స్వార్థంగా చేసే పనులు మనకు జీవితాంతం  సంతోషాన్నిస్తాయనడంలో  నాకు సందేహం లేదు.  

అవి యితరులకు చెప్పుకోవచ్చా - చెప్పుకోకూడదా?  మన యిష్టం. చేసిన పుణ్యం చెబితే పోతుందని వొక సామెత. సరే. పుణ్యం పోతే పోనీ. మనసుకు ఏదో వొక సంతోషం - అనుకుంటే- చెప్పొచ్చు.   చెబితే - మిగతా వారు కూడా అలాంటివి చేస్తారనుకుంటే   - తప్పకుండా చెప్పొచ్చు.

శ్రీ రామానుజాచార్యుల వారికి - వారి గురువు , చాలా రహస్యం, మరెవరికీ తెలియరాదు -అని నారాయణ మంత్రం ఉపదేశించారు. వెంటనే -  రామానుజాచార్యులు గుడిపైకెక్కి అందరినీ పిలిచి - అందరికీ ఆ మంత్రాన్ని చెప్పారు. అది మంచా కాదా -అన్నది వివాదాస్పదమే. కొందరికి చాలా గొప్ప పని అనిపిస్తుంది.  కొందరికి - మంత్రోపదేశం అలా చేయడం చాలా తప్పు అనిపిస్తుంది.

ఇలాగా - వొక్కొక్క సందర్భం లోనూ - వొక్కొక్కరికి వొక్కొక్క  రకంగా అనిపించడం చాలా సహజం.

అయితే - నిశ్చయంగా, యిది మంచి పనే అనిపించిన దాన్ని - మనం  వెంటనే చేసేస్తే మంచిది. 

వొకాయన అంటారు - మీరు చేయలేని పని చేయక పోతే మునిగి పోయిందేమీ లేదు. కాని, చేయ గలిగిన మంచి పని చేయక పోతే - జన్మ వ్యర్థం అయిపోతుంది.

నిజమే. మనం చేయగలిగిన మంచి పనులు చేస్తూ పోవాలి.

తెలుగులో వొక సామెత వుంది. మేసే గాడిదను - కూసే గాడిద వచ్చి చెడిపిందట. అలాగా, మంచి పని చేయాలనుకునే వాడిని - చేయని వాళ్ళు వచ్చి చెయ్య నివ్వకుండా ఆపుతుంటారు . చేసే వాళ్ళకు విమర్శల వర్షం తట్టుకునే  శక్తి కూడా వుండాలి. అదీ విషయం.

మనమంతా - చిన్న చిన్న - తప్పులు చేస్తూనే వుంటాము. అలాగని - మంచి పనులు చేయ కూడదని నియమమేమీ లేదు. చిన్న తప్పులు చేసిన వాళ్ళు - పెద్ద మంచి పనులు తాము చేయడమో, చేసే వాళ్లకు తోడు పడడమో - చేయకూడదని రూలేమీ లేదు. కానీ  - ఏమీ చేయని వాళ్ళు - చేసే వాళ్ళను - చిన్న తప్పులు చూపించి పరిహాసం చేస్తూ వుంటారు. విమర్శిస్తూ వుంటారు.   

యిప్పుడు దేశం స్థితి అలాగే వుంది. టీం అన్నా లోని ప్రతి సభ్యుల పైనా - ఏదో చిన్న తప్పు రుద్దడమూ - వీరా లంచా గొండి తనం పైన యుద్ధం చేసే వారు - అని విమర్శించడం జరుగుతోంది.  నా ఉద్దేశంలో -ఎవరైనా ఈ యుద్ధంలో చేరవచ్చు. యిప్పుడు మీరు లంచం తీసుకుంటూ వున్నా సరే - ఈ పధ్ధతి పోవాలి అనుకుంటే - అందరూ చేరండి.విమర్శలు చేసే వారు - మారే వారిని కూడా మారనివ్వరు. విమర్శకుల మాట వింటే - దేశం యిలాగే ఎప్పుడూ లంచగొండి దేశం గా వుండి పోతుంది. నా అభ్యర్ధన - అందరూ - ఈ యుద్ధంలో చేరండి. మనమూ- నూరు శాతం ప్రజలు - ఆర్ధిక ఉన్నతికి నోచుకోవాలి. లంచమనే పదం కూడా దేశం నుండీ వెళ్లి పోవాలి.

దేశాన్ని పీడిస్తున్న మరో మహా మారి - స్త్రీలపై వేధింపులు. ఆంగ్లంలో ఈవ్ టీజింగ్ అంటారు కదా. అదన్న మాట. కత్తితో దాడి చేయడం, ఆసిడ్ పోయడం - బస్సుల్లో, రైళ్ళలో వేధించడము   - యివన్నీ ఎక్కువవుతున్నాయి. కొన్ని నగరాల్లో మరీ ఎక్కువ.

చెన్నై నగరంలో - యిది పదిహేడేళ్ళ క్రితం జరిగిన సంగతి.

నేను నగరం మధ్య నుండి మారి - నగర శివార్లలో,  స్వంత ఇల్లు కట్టడానికి ఆరంభించిన రోజులు.  క్రొత్త వూరి నుండి ట్రెయిన్ లో దాదాపు ముప్ఫై కి.మీ. దూరం వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు తెలిసింది - చెన్నై దగ్గర కూడా - స్త్రీలపై వేధింపులు ఎంత ఘోరంగా వుంటుందో.

 సెకండు క్లాసులో వెళ్ళిన రోజు -ప్రతి రోజూ ఇలాంటి వేధింపు చర్యలు చూడవలసి వచ్చింది. సెకండు క్లాసులోనే వొక చిన్న భాగంలో - స్త్రీల భాగం వుండేది. ఈ రెండింటికీ మధ్య  తలుపు లేని వొక ద్వారం వుండేది. చాలా మంది కాలేజీ విద్యార్థులూ, కార్మికులూ - ఆ ద్వారం వద్ద నిలబడి - లోనున్న ప్రతి స్త్రీ పైనా - వొక్కొక్కరి పైనా - అసభ్యకరమైన  పదజాలం విసిరి హింసించే వాళ్ళు. అయిదేళ్ళ పసిపాప నుండి   - ఎనభై ఏళ్ళ ముదుసలి వరకూ - ఎవరినీ వారు విడిచి పెట్ట లేదు.

వచ్చే ప్రతి స్టేషన్ లోనూ - కొత్త వాళ్ళు   రావడం, వాళ్ళలో - మరి కొందరు ఆ ద్వారం వద్ద నిలబడడమూ  -  గుంపు ఎక్కువయ్యే కొద్దీ - స్త్రీల భాగంలోకే వెళ్లి - అక్కడే మరింత రెచ్చి పోయి మాట్లాడడమూ -జరిగేది. మొదటి రోజే - ఈ తంతు భరించడం నాకు చాలా కష్టమయ్యింది. వొక అబ్బాయిని పిలిచి - మన ప్రక్క ఖాళీయే   కదా. అక్కడకెళ్ళి కూర్చోకూడదా- అన్నాను. ఆ అబ్బాయి పెద్దగా నవ్వి - పూర్తిగా స్త్రీల భాగంలోకి చొచ్చుకెళ్ళాడు.

సరే. ప్రక్క నున్న ప్రయాణీకులతో మాట్లాడి - మనమంతా - వారికి - నచ్చచెప్ప కూడదా - అన్నాను. వారంతా, పెదవి విరిచేశారు. ఏమీ లాభం లేదు సార్. వీరు   ఎవరి మాటా వినే రకాలు కారు. మనం చెబితే - మరింత రెచ్చి పోతారు. ఎక్కువ చెబితే - కొట్టినా కొడతారు. వినరు గాక వినరు - అన్నారు. పది రోజులు ఈ తంతు భరించాను. కాని తరువాత - ఏదో చెయ్యాలి. ఏదైనా చెయ్యాలి - అనిపించింది.

పదకొండో రోజు - ఆఫీసు చేరిన వెంటనే - అదే మూడ్ లో -  టెలిఫోను డైరెక్టరీ లో - రైల్వే వారి పబ్లిక్ గ్రీవెన్సస్  సెల్ వారి అడ్రెస్సు, సదరు ఆఫీసర్ల పేర్లు, చెన్నై డివిషన్ సూపరింటెండెంటు   వారి పేరూ , అడ్రెస్సూ అన్నీ రాసుకున్నాను.

తరువాత దాదాపు పది పేజీల సుదీర్ఘ లేఖ తయారు చేసాను. అసలు ఏం జరుగుతోంది - అన్నది పూస గ్రుచ్చినట్టు  రాసాను. దాని క్రిందే - దానికి పరిష్కార మార్గాలు కూడా చాలా రాసాను. అయితే - అవన్నీ - గాంధీ గారి అహింసా మార్గాలే. యివన్నీ రాసి, ఆ అడ్రెస్సులకు అన్నిటికీ పంపించేసి  - అబ్బ, ఏదో చేయగలిగింది చేసాను - అని అనుకున్నా.

తరువాత పది రోజులు ఏమీ కాలేదు. పదకొండో రోజు - యిద్దరు పోలీసు ఆఫీసర్లు మా ఆఫీసుకు - నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నా రూముకే వచ్చారు. వారిని కూర్చోమని - పని ఏమిటి - అని అడిగాను.  వారు - నేను రాసిన లేఖను చూపి - అది నేను రాసిందేనా అని అడిగారు. నాకు మనసులో - చిన్న జంకు. కానీ- ఎందుకో - గాంధీ గారు గుర్తుకొచ్చారు. భయమెరుగని గాంధీ దేశంలో పుట్టి - మంచి పనికి భయపడడం ఎందుకనిపించింది.

అంతే. మరి భయం లేదు. జంకూ లేదు. అవును అన్నాను. వారు - అసలేం జరుగుతోందో - నేను చూసినవన్నీ చెప్పమన్నారు. ప్రతి వొక్కటీ - వొక్కటి వదలకుండా - అన్నీ - కాస్త ఆవేశం గానే చెప్పాను.

చివర అన్నాను - ఆ రైళ్ళలో - మా వాళ్ళు గానీ, మీ వాళ్ళు గానీ ప్రయాణం చేసినా - ఎవరూ సంతోషంగా దిగ లేరు. ఎంత మంది స్త్రీలు డిప్రెషన్ కు  లోనవుతున్నారో - మనకు తెలీదు. ఎంత మంది ఈ బాధ భరించలేక  ఉద్యోగాలు, చదువులు వదిలేస్తున్నారో కూడా తెలీదు. ఇవేవీ చేయలేని వాళ్ళు - ఎవరో వొకరు ఆత్మహత్యలు చేసుకున్నా - ఆశ్చర్య పడనక్కర లేదని చెప్పాను.

వారు చాలా వోపిగ్గా విన్నారు. కడపట, నేను యిచ్చిన పరిష్కార మార్గాల గురించి కూడా చెప్ప బోయాను. అప్పుడు   - వారు కాస్త నవ్వి - సార్, మీరిచ్చిన  ఈ వివరాలు మాకు చాలు. మీ పరిష్కార మార్గాలు -అటువంటి దుర్మార్గుల పై పని చెయ్యవు. ఎం చెయ్యాలో - మేం చూసుకుంటాం.  అన్నీ - మీకు కూడా తెలుపుతాం. మీకు మా ధన్యవాదాలు -  అని వెళ్ళిపోయారు.

తరువాత, మా ఆఫీసులోని వాళ్ళంతా - వచ్చి విషయమేమిటని అడిగారు. చెప్పాను. వారందరి ఏకగ్రీవమైన అభిప్రాయం - నేను చాలా తొందర పాటు పని చేసానని. ఈ పోలీసులు మనల్నే వేధిస్తారు కాని - అసలు రౌడీలపై ఏ ఆక్షనూ   తీసుకోరు. పైపెచ్చు - ఆ రౌడీలకు మీ పేరు తెలిసిందంటే - మీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతారు - అంటూ ఎన్నెన్నో చెప్పారు.

కానీ అప్పటికి - నా మనసులో - వొకే ఆలోచన. యింత దూరం వచ్చాక - ఏదైనా జరగనీ. చూచుకుందాం-అని. ఏదో అంటారు కదా. రోటిలో తల పెట్టి, రోకటి పోటుకు వెరువరాదని. నా సహ ఉద్యోగులు మాత్రం ఎం జరుగుతుందో, ఏమో  - అని చెబుతూనే వున్నారు, ప్రతి దినమూ.  నాలుగు రోజులు ఏమీ జరగలేదు.

తరువాత - వొక రోజు, మా అన్న కొడుకు వచ్చి- చిన్నాన్న! ఈ రోజు నిజంగా మన పోలీసులు పోలీసుల మాదిరి పని చేసారు - అన్నాడు. తనొచ్చిన ట్రెయిన్ లో - స్త్రీల భాగంలో నిల బడ్డ వారిని - బయటికి లాగి -అంతే కాక, వారి ద్వారం దగ్గర నిలబడ్డ వారందిరినీ బయటికి లాగి - వారి లాఠీలకు బాగా పని కల్పించారట . అందులో - ముఖ్యమైన వారిని - అరెస్టు చేసి కూడా తీసుకెళ్ళారట.    ఆహా - అనుకున్నానే - కానీ, యిది, నా నిర్వాకమే అన్నది అప్పటికి అర్థం కాలేదు.

తరువాత ట్రైన్లో వచ్చిన నా మరదలూ, ఆ తర్వాత వచ్చిన మా ప్రక్కింటి వాళ్ళూ - యిలా చాలా మంది - యిదే చెప్పడం జరిగింది. అంటే  - ప్రతి ట్రెయిన్ లోనూ  - పోలీసులు తమ ఆక్షన్ ను జరుపుతున్నారని అర్థమయ్యింది. అప్పుడు - కాస్త సందేహం - యిది నా నిర్వాకమే నేమో నని. కానీ అనుకున్నా - మరెవరైనా కూడా రాసిండొచ్చుగా     - అని.

తరువాత పదిహేను రోజులు - ప్రతి ట్రెయిన్ లోనూ - యిదే తంతు -విడవకుండా జరిపారు రైల్వే పోలీసులు.

 తరువాత - నాకు వారి పబ్లిక్ గ్రీవెన్సస్ సెల్ నుండీ, చెన్నై రైల్వే సూపరింటెండెంట్ వారి నుండీ -    రిప్లై లేఖలు అందాయి. అందులో - వారు నా లేఖ పై తీసుకున్న ఆక్షన్ అంతా - పూర్తిగా తెలపడమూ,   యిక ముందు కూడా, యిటువంటి స్త్రీ వేధింపు చర్యలు జరగకుండా చూసు కుంటామని  హామీలు యివ్వడమూ - యిలా అన్ని విషయాలూ రాసారు. 

కానీ - వారు, నన్ను మళ్ళీ  పిలవడమో, ఏ రకంగా నైనా నాకు కష్టం కలిగించడమో - అస్సలు చెయ్య లేదు. ఆ రోజు నుండీ - ఈ పదిహేడు సంవత్సరాలుగా - ఆ ట్రెయిన్ మార్గంలో - మళ్ళీ అటువంటి స్త్రీ వేధింపు చర్యలు జరగడం లేదన్నది - వాస్తవం. అటువంటి ఆఫీసర్లకు, ఆ పోలీసులకు - మనం హృదయ పూర్వక అభినందనలు తెలపాల్సిందేగా .ఆ తరువాత ఎప్పుడో, మాయింట్లో వారికి కూడా యివన్నీ  చెప్పాను. ఈ రిప్లై లేఖలు చూపాను.


ఈ మధ్య ముంబై లో జరిగిన కీనన్, ర్యూబెన్ ల హత్యలో - స్త్రీ వేధింపు చర్యలే మొదటి ఘట్టంగా వుండింది. పత్రికల్లో , టీ.వీ ఛానళ్లలో - అక్కడ వున్న వారెవరూ - హతులకు సపోర్టుగా రాలేదని ,యిది చాలా తప్పనీ రాసారు.  నిజమే, కొంత వరకు. కానీ- చాలా మంది ప్రజలలో - రౌడీలకంటే - పోలీసులంటే - ఎక్కువ భయం ఉందన్నది తెలుసు గదా. కానీ రౌడీలకు పోలీసులంటే పెద్ద భయం లేదు.  యిది పోగొట్ట వలసిన బాధ్యత- పోలీసు వ్యవస్థ దే నని చెప్పక తప్పదు. మన దేశమంతటా   -  యిది జరగాలి.

పోలీసుల్లో మంచి వాళ్ళు ఎంతో మంది వుండొచ్చు. కానీ లంచగొండి తనమూ, ఎక్కువే నని ప్రజల నమ్మకం. అటువంటి వారి దగ్గర అన్యాయమే జరుగుతుందని వొక విశ్వాసం. అందు వలన - ఎక్కడ ఏ అన్యాయం జరిగినా - సాధారణ ప్రజలు పట్టించుకోవడం వదిలేశారు.  వారిలో ధైర్యమూ ,విశ్వాసమూ కలిగించ వలసిన  బాధ్యత పాలక వర్గానిదీ, పోలీసులదీను. కొన్ని, కొన్ని చోట్ల ఇది జరుగుతున్నది. చాలా చోట్ల జరగాల్సి ఉంది.

సరే. స్త్రీలపై  వేధింపు చర్యలను - అరికట్టేందుకు - కొన్ని చోట్ల  ( ముఖ్యంగా చెన్నై లో ) అప్పుడప్పుడూ, మహిళా పోలీసులను సాధారణ దుస్తులలో బస్సు స్టాపుల్లోను, రద్దీ ప్రాంతాల్లోనూ నిలిపి,  వారి ద్వారా ఈ రౌడీలను పట్టేస్తున్నారు.  పూర్తిగా పోక పోయినా -  యిప్పుడు, చాలా  తగ్గిందని చెప్పొచ్చు. యిటువంటివి - బస్సుల్లోనూ, యితర రద్దీ ప్రాంతాల్లోనూ - యింకా జరగాల్సిన అవసరం ఉంది.

ముంబై, డిల్లీ లాంటి పట్టణాలలో - స్త్రీ వేధింపు చర్యలు ఎక్కువగానే వున్నాయి. పోలీసు వ్యవస్థ -కంప్లయింటు కోసం ఎదురు చూడకుండా - ముందు చూపు చర్యలు తీసుకుంటే - అంటే-   వేధింపులు జరిగే సమయంలో, జరిగిన చోట, రౌడీలను పట్టుకుంటే, వారికి కావలసిన శాస్తి చేస్తే - పోలీసుల పై ప్రజలకు గౌరవమూ పెరుగుతుంది. మన దేశం మరింత శాంతివంతం గానూ, నేరప్రవృత్తి లేకుండానూ  వుంటుంది.

అలాగే - కంప్లైంటు ఇచ్చే వారిని - మళ్ళీ మళ్ళీ పిలిచి వేధించకుండా , వారిని  నేరస్తుల ముందు పిలువకుండా - వారికి తగిన ప్రోత్సాహం యిస్తూ వుంటే - ధైర్యం గా కంప్లైంటు యివ్వగలరు. యిది మన దేశ / రాష్ట్ర  మహిళా కమిషన్ వారు కూడా పరిశీలించి తగిన సూచనలు, చర్యలు చేబట్టాల్సిన అవసరం ఉంది.

యిది చేస్తేనే - స్త్రీలకూ కూడా పురుషులపై గౌరవం పెరుగుతుంది.

మన  ప్రాచీనులు అంటారు - ఏ దేశంలో అయితే, ఏ యింట్లో అయితే - స్త్రీ కంట తడి పెడుతుందో - ఆ దేశం లో , ఆ యింట్లో, దేవతలు వుండరు. నీళ్ళు కూడా వుండవు. వానలు కురవవు -  అని. అందుకే గాంధీ గారు కూడా అన్నారు - అర్ధ రాత్రైనా, ఏ స్త్రీ అయినా , భారత దేశం లోని ఏ రోడ్డు లో నైన ,ఎక్కడైనా, వొంటరిగా,  ప్రయాణం చేయ గలిగిన పరిస్థితి రావాలి. అప్పుడే, మనకు నిజమైన స్వతంత్రం -అని.

చదువరులకు - వొక విన్నపం. మనమంతా, మన మహిళా కమిషన్ వారికి - యిటువంటి సూచనలు రాయాలి. అప్పుడే - ఈ జగన్నాథ రథ చక్రాలు కదుల్తాయి. మంచి రోజులు వస్తాయి. మంచి పని అనుకుంటే - వెంటనే చేసెయ్యండి. 

=మీ

వుప్పలధడియం విజయమోహన్


12, నవంబర్ 2011, శనివారం

భయమూ - దానికి గల కారణాలూ - మన మానసిక ఆరోగ్యమూ



మనం  కొన్ని వ్యాసాలలో యిది వరకే - మానసిక ఆరోగ్యం గూర్చి లోతుగా పరీక్షించాము .  అందులో - మితి మీరిన కోరికే -మానసిక అనారోగ్యానికి ప్రథమ కారణం అని తెలుసుకున్నాము. అన్ని మతాలలో - వుండేదీ అదే.

కోరిక తప్పు కాదు. కోరిక అనారోగ్యం కాదు. కోరిక లేని నాడు - మనిషే లేడు. కృష్ణుడికి కోరిక లేదా? భగవద్ గీత చెప్పడం ఎందుకు? అర్జునా! యుద్ధం చెయ్యి - అని ప్రోత్సహించడం ఎందుకు?

దేవుడి కోరికను - సంకల్పం  అన్నారు. అంటే - వుట్టి కోరిక కాదు. తీరగలిగే కోరిక. ఆ కోరిక వెనుక, వొక బలమైన సకారాత్మక శక్తి కూడా వుంది. అందు  వలన అది జరిగి తీరుతుంది. మనమైనా అంతే. తీరగలిగే కోరకలు కోరుతూ - వాటి వెనుక, బలమైన, సకారాత్మక శక్తినీ - పెట్టామంటే -  మీ కోరిక వెనుక ప్రకృతి శక్తులన్నీ కూడా తోడుంటాయి. మీ కోరికలు తప్పక తీరుతాయి. అందువలన మీ జీవితంలో - సంతోషమూ, ఆనందమూ - నిండుతాయి. 

అదే - మానసిక ఆరోగ్యమని  చెప్ప వచ్చు. 

కాబట్టి - 

తీరని కోరికలు కోరకండి.  ఎండమావుల వెనుక పరుగెత్తకండి. 

మనిషి ఎవరైనా వొక్క సారి, వొక్క అడుగే వెయ్యాలి. వెయ్య గలడు. ఆ అడుగు ప్రమాణం మీ శక్తి సామర్థ్యాల పైన ఆధారపడి  వుంటుంది. వొకరి అడుగు చిన్నది గాను, మరొకరిది, కాస్త పెద్దది గాను వుండొచ్చు .

నడిచి వెళ్ళే వాళ్ళు - యిరవై, ముప్ఫై  మైళ్ళు నడవ గలిగితే - పరుగెత్తే వాళ్ళు - వొక్క కిలోమీటరు దూరం కూడా వెళ్ళ లేరు. జీవితమంతా పరుగెత్తాలనుకునే వాళ్ళు - ఎక్కువ కాలం పరుగెత్త లేరు. ఏ విషయం లో నైనా అంతే.

యివి జ్ఞాపకం పెట్టుకుంటే - హాయిగా - జీవితమంతా గడిపెయ్య వచ్చు.

సరే. మానసిక అనారోగ్యంలో - మరికొన్ని సమస్యలున్నాయి.

మనిషికి భయం -అనేది పెద్ద అనారోగ్య లక్షణం. భయానికి ముఖ్య కారణం మన అజ్ఞానం, అశ్రద్ధ .

ఉదాహరణకు - చాలా మందికి - బొద్దింక అంటే  భయం. అది పెద్దగా కరవదని తెలుసు. కరిచినా పెద్ద ప్రమాదమేమీ లేదని తెలుసు. అయినా - అదంటే కాస్త భయం. ఎందుకంటే -  బొద్దింకకు  మనమంటే భయం లేదు. నేరుగా - మనమెక్కడున్నామో అక్కడికే వచ్చేస్తుంది. మీరు దూరంగా - తోసేసినా, మళ్ళీ దగ్గరగా వచ్చేస్తుంది. కాస్త ఏమరుపాటుగా వుంటే - దుస్తుల్లోకి వెళ్లి పోతుంది. ఎందుకో తెలీదు. యిదీ చాలా మంది భయం.  కొంత మంది - దాన్ని చంపకుండా, దాని మీసాలు పట్టుకుని దూరంగా విసిరేస్తారు. వారికి  బొద్దింక భయం లేదని చెప్పొచ్చు. కొందరు ఏ చీపురు కట్ట తోనో - దానిపై పట్టుమని కొడతారు. అది చచ్చిపోతుంది. తరువాత దాన్ని చీపురుకట్టతోనే బయట పార వేస్తారు.యిక్కడ హింసా వుంది. భయమూ వుంది. 

మన యిండ్లలో వుండే యెర్ర చీమ - దేవుడిని వరం అడిగిందట. నేను కుడితే చచ్చిపోవాలని. దేవుడు తథాస్తు అన్నాడట. అప్పటినుండి యెర్ర చీమ కుడితే - దాన్ని చంపేస్తారు. అది చచ్చిపోతుంది. వరం ఎలా అడగాలో కూడా చీమకు తెలియలేదు. బొద్దింక - పాపం, కుట్టక పోయినా చచ్చి పోతుంది.

సరే. పామంటే - చాలా మందికి భయం. అందులో విషం వుండే పాము ఏదో, విషం లేని పాము ఏదో చాలా మందికి ఖచ్చితంగా తెలీదు.ఏ పామైనా భయమే. కానీ, కొంత మందికి భయం లేదు. వారు, పెద్ద పెద్ద నాగుపాములతో కూడా ఆడుకుంటారు. పాములను చంపడం తేలికే. కాస్త ధైర్యమూ కావాలి. మెళకువలూ తెలిసుండాలి. అంతే. తెలీకపోతే - పాములకు దూరంగా వుండడమే - మంచిది.

కుక్కలంటే - కొంత మందికి భయం. పిచ్చి పట్టని కుక్క సాధారణంగా, మనిషిని ఏమీ చెయ్యదు. ఎప్పుడో వొక సారి కొరక వచ్చు. అప్పుడు - సరైన ఇంజెక్షన్లు క్రమం తప్పక వేసుకోవాలి. కానీ పిచ్చి పట్టిన కుక్క - తప్పక కొరుకుతుంది. అటువంటిది - ప్రతి వొక్కరికీ - చాలా అపాయం. అప్పుడు ముఖ్యంగా - కొరికిన భాగాన్ని బాగా నీళ్ళతో కడగడమూ   ముఖ్యమే. తరువాత - సరైన ఇంజెక్షన్లు క్రమం తప్పక వేసుకోవాలి. లేదంటే చాలా అపాయం.  కుక్క కాటును ఎప్పుడూ అలక్ష్యం చేయకండి. వొక గంటలోగా - ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా - మీ మొదటి ఇంజెక్షను వేసుకోండి. ఏ కుక్క కొరికినా క్రమం తప్పకుండా - ఇంజెక్షన్లు వేసుకోండి.

అలాంటి పిచ్చి కుక్క నన్నూ వొక సారి వెనుక నుండీ వచ్చి కొరికింది. - నాలుగేళ్ల క్రిందట. వెంటనే కొరికిన భాగాన్ని నీళ్ళతో బాగా కడిగేసి - మా ఊళ్లోనే వున్న డాక్టరు గారి దగ్గర ఆంటీ రాబీస్ ఇంజెక్షన్లు క్రమం తప్పక వేసుకున్నాను. తరువాత దాని వలన ప్రమాదమేమీ లేదు. అయితే - ఈ మధ్య మన రాష్ట్రంలో - వివిధ ప్రాంతాలలో - పిచ్చి కుక్క చాలా మందిని కొరికిన సంఘటనలు చాలా విన్నాము.  అవి కాస్త పెద్ద ఊళ్ళే అయినా -   ఆంటీ రాబీస్ ఇంజెక్షన్లు - అక్కడ లేక పోవడం చాలా దురదృష్టకరం.

మీ వూళ్ళో - ఈ ఆంటీ రాబీస్ ఇంజెక్షన్లు ప్రతి డాక్టరు దగ్గరా వుండాలి. లేకపోతే - వెంటనే - ప్రభుత్వం వారికి ప్రతి వొక్కరూ రాయండి. పిచ్చి కుక్క కాటుకు, పాము కాటుకు మందు మాత్రం - ప్రతి వూర్లో వుండి తీరాలి.  అంతే కాదు. కరిచిన వెంటనే కరిచిన భాగాన్ని కడగడము, వెంటనే డాక్టరు గారి దగ్గరకు వెళ్ళడము మనం చెయ్యాలి. దీన్ని గురించి మరింత సమగ్ర సమాచారం - నా మరో బ్లాగులో - వైజ్ లివింగ్ ఐడియాస్ . బ్లాగ్ స్పాట్. కాం లో రాసాను. ఎందుకంటే - భారత దేశంలోని - ప్రతి గ్రామంలోనూ- ప్రతి పట్టణంలోనూ - వీధి కుక్కలూ వున్నాయి. కొంత వరకూ - పాములూ వున్నాయి. అందు వలన వాటి వలన వచ్చే ప్రమాదాలూ, విరుగుళ్లూ అందరికీ తెలిసుండాలి. నిజానికి - యిది - ఐదో  తరగతి చదివే విద్యార్థికి కూడా  సమగ్రంగా తెలిసుండాలి. 

మన దురదృష్టం ఏమంటే   - మన చదువులో - మనకు ఉపయోగ పడేది చాలా తక్కువ. ఎప్పుడో ఏదో చేసిన ఔరంగజేబు ను గురించి చాలా చదువుతాము. యిందు వలన మనకొచ్చే ఉపయోగం - నన్నడిగితే సున్నా.

దారిలో రోజూ కనపడే పాములు, కుక్కలు మనల్నేం చేస్తాయో, మనమేం చెయ్యాలో - మనకు తెలీదు. వాటికి కావలసిన మందులు - ఘనత వహించిన మన  ప్రభుత్వం వారు - చాలా ఊళ్లలో సప్లయ్ చేసినట్టు లేదు. మనమూ అడిగేటట్టు లేదు. సరైన చదువు ద్వారా వీటన్నిటిని గురించిన విజ్ఞానమూ రావాలి. సరైన విజ్ఞానముతో బాటు, వీటివలన వచ్చే భయమూ పూర్తిగా పోవాలి. ఈ రెండూ చదువు ద్వారా జరగడం లేదు. కనీసం పాము యొక్క మృత శరీరాన్నైనా  విద్యార్థులు తాకి పార వేసేటట్టుగా వుండాలి. 

నాగు పాములంటే మనకు భయమూ వుంది. భక్తీ వుంది. కానీ పాముకాటుకు మన వూళ్ళో మందు వుందో లేదో మాత్రం తెలీదు.



మనకు తెలుసు - మన పూర్వీకులలో చాలా మంది అరణ్యాలలో వుండే వారని. కొందరు రుషులుగా తపస్సు చేసుకుంటూ వుంటే - మరి కొందరు - వేట తోనో, మరో వృత్తి తోనో  అడవుల్లో జీవించే వారు.  పులులు, సింహాలు కూడా వున్న అడవుల్లో - వారు భయపడ కుండా వుండే వారు.  మేము పిల్లలు గా వున్న సమయంలో కూడా - వూరి బయటే- పెద్ద అడవులుండేవి .  మృగాలూ, పాములూ, తేళ్ళూ- అన్నే వుండేవి. కానీ- మనస్సులో ఎవరికీ భయం వుండేది కాదు. యిప్పుడు - అడవులూ లేవు. మృగాలూ చాలా వరకూ లేవు. కానీ - పాములు - అందులోనూ విష సర్పాలు యింకా  చాలా వున్నాయి. వాటి కాట్లకు ఉపయోగ పడే పాత మందుల పరిజ్ఞానం యిప్పుడు లేదు.కొత్త మందులు సప్ప్లై  లేదు. 

వీధి కుక్కలు వున్నాయి. వర్షాలు వొచ్చినప్పుడో, పిల్లలు పుట్టినప్పుడో - వొక్కొక్క సారి - వాటికి పిచ్చి పడుతూ వుంటుంది. అలాంటప్పుడు, అవి స్వంత పిల్లల్ని కూడా చంపేయడం జరుగుతూ ఉంది. అప్పుడే - కనిపించిన మనిషినల్లా కొరకడం కూడా జరుగుతూ వుంటుంది. అప్పుడు - మన ఆధునిక పరిజ్ఞానం ప్రకారం - వాటిని పట్టుకుని , రెండు వారాలు వాటిని జాగ్రత్తగా గమనించమని అంటారు. యిది నాకు వొక పిచ్చి సలహా గా కనిపిస్తుంది.

నన్నడిగితే - పిచ్చి కుక్కను మీరు పట్టుకునే ప్రయత్నం చేయడమంత    మూర్ఖత్వం మరోటి లేదనిపిస్తుంది. బ్లూ క్రాస్ వాళ్ళను పిలిచి - అయ్యా- పిచ్చి కుక్క మమ్మల్ని కరిస్తే - మేము దాన్ని ఏం చేయాలి - అని వారిని అడగండి.  సమాధానం వాళ్ళ దగ్గరా లేదు. యిది ఎలా వుంటుందంటే   -  మమ్మల్ని ఎవడైనా మర్డరు లేదా రేపు చేయడానికి వస్తే - మేమేం చెయ్యాలి అని పోలీసు వాళ్ళను అడగండి. వాళ్ళేం చెబుతారు? మీరు చట్టాన్ని మీచేతిలోకి తీసుకోకూడదు. మా దగ్గరకు వచ్చి చెప్పండని చెబుతారు.

మిమ్మల్ని మర్డరు చేసిన తరువాత పోలీసు స్టేషనుకు వెళ్లి చెబుతారా.

మిమ్మల్ని రేపు చేసేంత  వరకూ ఆగి తరువాత పోలీసు స్టేషనుకు వెళ్లి చెబుతారా. 

మిమ్మల్ని పిచ్చి కుక్క కరిచేంత   వరకూ చూస్తూ వుండి , దాన్ని మెల్లగా పట్టుకుని బ్లూ క్రాస్ వారికి అప్పగిస్తారా?

నాకయితే - మన డెమాక్రసీ ప్రభుత్వాల  కంటే - కొంత మంది పాత కాలపు రాజులు ఈ విషయంలో - తెలివిగా చట్టాలు చేసే వారని అనిపిస్తుంది.  మన చాలా భయాలకు కారణం మన ప్రస్తుత విద్యా విధానము, పాలనా విధానము, మన చట్టాలు, వాటిని మనం అమలు చేస్తున్న తీరు  - అని చెప్పక తప్పదు.

మిమ్మని రేపు చేసారనుకోండి. మీరూ తీరిగ్గా వెళ్లి పోలీసు వారికి రిపోర్టు ఇచ్చారనుకోండి.  ఏం జరుగుతుందో - మనకు తెలీదా. పోలీసు స్టేషన్లో ఏమీ జరక్క పోయినా - మరో సారి పత్రికల్లో, కోర్టుల్లో తప్పక  మీ రేపు జరుగుతుంది. సరే. కేసు ఏ యుగంలో ముగుస్తుందో - ఎలా ముగుస్తుందో ఎవరూ చెప్ప లేరు.

మన చాలా భయాలకు - కారణం మన చట్టాలూ, దాన్ని మనం అమలు చేస్తున్న విధానమే అని నాకు అనిపిస్తుంది. జాతిని, పూర్తిగా నిర్వీర్యం చేసే ఈ పాలనా విధానం మారాల్సిన అగత్యం ఉంది. 

ఈ మధ్య కీనన్ సాన్తోజ్ , ర్యూబెన్ ఫెర్నాండెజ్ అనే యిద్దరు యువకులు  ముంబై వీధులలో గూండాలచేత హత్య చేయ బడిన విషయం  మనకందరికీ తెలిసిన విషయమే.వొక అమ్మాయిని, పట్ట పగలు, నడివీధిలో, గూండాలు  అవమానం చేస్తూ వుంటే - సహించ లేక వాళ్ళను ఈ యిద్దరు యువకులూ అడ్డుకున్నారు. అక్కడికక్కడే - వాళ్ళను ఆ గూండాలు కత్తులతో పొడిచి చంపేశారు.   సరే. నలభై మంది ఆ ఘటనను చూస్తూ వున్నారు. కానీ   వారెవరూ  ఆ గూండాలను అడ్డుకోలేదు. కీనన్ తండ్రి గారు - తరువాత "కీనన్   చేసింది సరి అయిన  పని.  పిరికి వాడిగా జీవించడం కంటే - అన్యాయాన్ని ఎదుర్కొని కీనన్ లాగ మరణించడమే మంచిది" అన్నారు.

నిజమే. మన సమాజం అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్య వంతులను తయారు చెయ్యాలి.  పిరికి వాళ్ళను కాదు.

కానీ - ఆ చూస్తూ ఊరుకున్న నలభై మందిని అడగండి - వాళ్ళెందుకు వూరుకున్నారో తెలుస్తుంది. మన చట్టాలు, మన పోలీసులు, మన పాలనా వ్యవస్థ  - ఏ వొక్కటీ మనలను ధైర్య వంతులను చేసేవి కావని తప్పక చెబుతారు. వారు భయపడింది - గూండాలకు కాదు. వారి వెనుక నున్న వారికి. చట్టాన్ని తమ చేతిలో కీలు బొమ్మగా నడిపిస్తున్న వారికి.  యిది మారాలి. యిది మారాలంటే - మన విద్యా వ్యవస్థ మారాలి. మనలను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వారిగా తయారు చేసే  విద్య రావాలి. 

మీ వూళ్ళో - గూండాలెవరో - మీ వూళ్ళో పోలీసులకు తెలీదా.   వాళ్ళేం చేస్తున్నారో వీరికి తెలీదా. మరి గూండాలు -  గూండాలుగానే  ఎలా కొనసాగుతున్నారు?

యిప్పుడు మన దేశంలో -ఏ విషయాన్ని కదిపినా - వందల, వేల, లక్షల కోట్ల లంచ గొండి తనం  బయటకు వస్తూ ఉంది. మరి - ఈ వ్యవస్థను సరిచేసే నాథుడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు. పాలకులలో లేని మానసిక ఆరోగ్యం ప్రజలలో ఎలా వుంటుంది.

యథా రాజా, తథా ప్రజా. మీరు ఏ రాజా గురించైనా అనుకోండి. దాదాపు యిదే కథ గా ఉంది.

ఈ వ్యవస్థ మారాలి. ఎలా మారుతుంది. మనం అందరూ కలిసి మార్చాలి. కనీసం అది మార్చడానికి ప్రయత్నిస్తున్న - అన్నా హజారే, రాం దేవ్ జీ, జయప్రకాశ్ నారాయణ్   లాంటి వారికి పూర్తి మద్దతు నివ్వాలి.

పాలకుల లోనూ, ప్రజలలోనూ - న్యాయానికి, ధర్మానికి విలువ వచ్చేటట్టు మనం చూడాలి.  అది వుంటే - మనలోని భయాలు చాలావరకు పోతాయి.   అది రావాలంటే - మన విద్యా వ్యవస్థ - బాబర్లు , ఔరంగజేబులను కాస్త వదిలి పెట్టి - ప్రస్తుత సమాజ సమస్యలకు రావాలి. మానవ విలువలను విద్యార్థులలో నింపాలి. కనీసం వచ్చే తరం అయినా బాగుంటుంది. భయం లేని వారిగా, ధైర్య వంతులుగా వుంటారు. చట్టాలను కాస్త మానవతా దృక్పథంతో తయారు చెయ్యాలి. వాటిని అమలు చెయ్యడం కూడా అలా వుండాలి. 

యిదంతా ఎందుకు చెబుతున్నానంటే -  అమెరికాలో , బ్రిటన్ లో ప్రజలకు   వున్న  ధైర్యం భారత దేశ ప్రజలకు ఈ రోజు లేదు.  అది వారి తప్పు కాదు. పాలకుల తప్పు. అటువంటి పాలకులను  ఎన్నుకోవడం ప్రజల తప్పు.

భయాన్ని గురించి మనం తెలుసుకోవలసిన మరి కొన్ని ముఖ్యమైన విషయాలు మరో వ్యాసంలో చూద్దాం.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

2, నవంబర్ 2011, బుధవారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడెలా వుంది? = భిన్నత్వంలో ఏకత్వం = దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ = నాది భారత దేశం. అంతే.


1953, నవంబర్, వొకటవ తేదీ నాడు కర్నూలు రాజధానిగా  ఆంధ్ర రాష్ట్రం గా మొదట అవతరించి, తరువాత, 1956 , నవంబర్,వొకటవ  తేదీ నాడు హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ గా మారిన మన రాష్ట్రం  ఇప్పుడెలా వుంది? ఎందుకలా వుంది? 

మొన్న,మొన్న జరిగిన అసెంబ్లీ ఎలెక్షన్లలో కూడా, ప్రజలందరూ - సమైక్యంగా వుండాలనే పార్టీలకే వోటు చేసారు. ఆ తరువాత  వై.యస్.ఆర్. గారు పోవడమూ, మరో సరైన, సమర్థుడైన, అందరూ వొప్పుకో గలిగే  నాయకుడు రాక పోవడమూ జరగడం తో -  వేర్పాటు వాదం బలపడిందని అనిపిస్తుంది.

భారత దేశంలోనే - మొదటి నుండి - భిన్నత్వంలో ఏకత్వం - అని మనం అంటున్నా కూడా,  ఏకత్వాని కంటే, భిన్నత్వానికే ప్రాముఖ్యమిచ్చే  రాజకీయ వాదులు - అన్ని రాష్ట్రాల్లో బల పడుతుండడం  మెల్ల మెల్లగా జరుగుతోంది.

ప్రతి రాష్ట్రంలోనూ యిదే కథ. భాషకు చాలా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాలలో తప్ప - భాష కూడా మనుషులను కలిపే ముఖ్యమైన సాధనంగా వుండడం లేదు.  

అంటే - వేర్పాటు వాదాలకు - బలమైన కారణాలే లేవా? వుంటాయి. విడిపోవడానికి ఎన్నో బలమైన కారణాలు మనం చూడొచ్చు. అలాగే - కలిసి వుండాలంటే కూడా - ఎన్నో బలమైన కారణాలూ మనం చూడొచ్చు.

యిది పాత కథే. గ్లాసు అర్ధం నిండి వుందా? అర్ధం ఖాళీగా వుందా? అనేది - చూసేవారి దృక్పథం పైన ఆధార పడి వుంది. వారూ కరెక్టే. వీరూ కరెక్టే. నేను ఖాళీనే చూస్తాను -అనుకుంటే - ఖాళీనే చూడొచ్చు. నేను నిండి వున్న భాగాన్నే చూస్తాను - అంటే -  నిండి వున్న భాగాన్నే చూడొచ్చు.

అమెరికాలో - యిప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళలో - యాభై శాతం పైన - చాలా త్వరగా, విడాకులలో, ముగిసిపోతూ వుందట. వీరంతా ఖాళీ భాగాన్ని ఎక్కువగా చూస్తారనిపిస్తుంది . మిగతా వారు కలిసే వున్నారు. వీరు నిండి వున్న భాగాన్నే ఎక్కువగా చూస్తూ వున్నారని అనుకోవచ్చు.

కొంత మంది లాయర్ల వద్దకు వెళితే - ఎంత అన్యోన్యమైన భార్యాభర్తలకు కూడా - ఖాళీ గ్లాసు భాగంలోని జీవితాన్నే చూపించి -  సునాయాసంగా విడాకులు ఇప్పించేయగలరు. మరి కొంత మంది లాయర్ల దగ్గరికి వెళితే -  విడాకులకోసం పోట్లాడుతూ వచ్చిన వారిని కూడా కలిపేయ గలరు. 

వైవాహిక జీవితంలో - అసలు పోట్లాడని భార్యాభర్తలున్నారా? అలాటి జీవితంలో అస్సలు రుచి లేదని కూడా మనకు తెలుసు కదా. అలాగని - పోట్లాటలు మాత్రం జ్ఞాపకం వుంచుకొని - అందరూ విడిపొతున్నారా?  రోజూ కొట్లాడే భార్యాభర్తలకు కొందరికి - వొకరినొకరు చూడకుంటే - క్షణమైనా గడవదు. వాళ్ళు కలిసే వున్నారు. ఎప్పుడో వొక రోజు కొట్లాడి,  ఆ మాత్రానికి, విడాకుల వరకు పొయ్యే భార్యా భర్తలు కొందరు ఈ కాలంలో తయారవుతున్నారు.

ఇల్లైనా అంతే.  జిల్లా అయినా అంతే. రాష్ట్రమైనా అంతే. దేశమైనా అంతే. యిప్పుడు మన దేశానికి కూడా, దేశమంతటా వొప్పుకో దగ్గ నాయకుడో, నాయకురాలో కావాలి. దేశ నాయకుడంటే -   దేశమంతా నాది. దేశ ప్రజలందరూ - నా వాళ్ళు -వారందరి బాగు కోసం నేను కృషి చేస్తాను - అని మనసారా  కోరుకునే వారు, ప్రతి ప్రాంతం లోని వారితో సులభంగా కలిసి పోయే వారూ నాయకులు గా రావాలి.

మొట్ట మొదట భారత దర్శనం అని - దేశమంతటా యాత్ర చేసిన గాంధీ గారు - దేశ నాయకుడయ్యారు. మరెంతో మంది స్వాతంత్ర్య యోధులున్నా - దేశమంతటా తిరిగిన నాయకుడుగా గాంధీ గారే మనకు మొదట కనిపిస్తారు. స్వాతంత్ర్యం తరువాత    - నెహ్రూ గారు దేశమంతటా తిరిగి -తద్వారా -దేశప్రజల  మనస్సులో - సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

ఎంతో మంది ప్రధాన మంత్రులయారు. కానీ - భారత దేశమంతటా తిరిగి, అందరితో కలిసిన  ప్రధాన మంత్రులుగా - నాకు మాత్రం ముగ్గురే జ్ఞాపకం వస్తారు. నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు.

మిగతా ఎవరూ - దేశమంతటా తిరిగారా లేదా అని నాకు తెలీదు. వారు, వచ్చిందీ, పోయిందీ కూడా గుర్తు లేదు. యిప్పుడు యల్.కే. అద్వానీ గారు దేశంలోని కొన్ని ముఖ్య భాగాలలో రథ యాత్ర చేస్తున్నారు. నిజమే.  కానీ - దక్షిణ భారతంలో కూడా - ఆయన హిందీ లోనే - మాట్లాడి వెళ్లి పోతే - ఆయన వచ్చిందీ, పోయిందీ ఎవరికీ గుర్తుండదు.  అదే - యిందిరా గాంధీ గారు  కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ  వస్తే - ఆంధ్ర దేశంలో రెండు ముక్కలు తెలుగులోనూ, తమిళనాడులో తమిళంలోనూ కర్ణాటకా లో కన్నడంలోనూ తప్పక మాట్లాడుతారు. తరువాత ఆంగ్లంలో మాట్లాడుతారు. ప్రజల మనస్సులో నిలవాలనే ప్రయత్నం చేస్తారు. మిగతా వారిలో అది చాలా తక్కువ.

సరే. యిప్పుడు - దేశ నాయకులుగా వుండాలనే కోరిక వున్న వారు కూడా ఏ పార్టీ లోనూ వున్నట్టు అనిపించదు. రాష్ట్రం సంగతికి వస్తే - అదే సంగతి. రాష్ట్రంలోని అన్ని భాగాలలో నివసించిన వారికైతే -  అన్ని భాగాలనూ వొకే రకంగా చూడాలనే కోరిక వుంటుంది.  తాము పుట్టిన జిల్లానుండి కూడా బయటికి పోనీ వారికి - తాము తప్ప మిగతా అందరూ బాగున్నారు-అని అనిపించడం  సాధారణంగా జరుగుతుం ది. 

అదే విధంగా, వొకే రాష్ట్రంలో, పుట్టి పెరిగి, మరో రాష్ట్రం కూడా చూడని వారికి, జాతీయతా భావం రావడం కాస్త కష్టమవుతుంది. ఇప్పుడున్న ముఖ్య మంత్రులు కానీయండి, యం.యల్.ఏ.లు కానీయండి - ఏ  వొకరిద్దరు తప్ప - దాదాపు అందరూ - తమ రాష్ట్రపు ఎల్లలు దాటని వారే. మరో రాష్ట్రంలో - రెండేళ్ళు వుండి వుంటే - వారి దృక్పథం మరోలా వుంటుంది.

మా నీళ్ళు   మాదే. మా బొగ్గు మాదే. మా గాలి మాదే - అని  రామారావు గారో, జయలలిత గారో అనరు.  అలా అనే వారు - ఆ రాష్ట్రపు పొలిమేరలు దాటలేదని అర్థము చేసుకోవచ్చు.

పొరుగు రాష్ట్రం వారిపట్ల శివ సేన వారు వ్యవహరించేటట్లుగా - టెండుల్కర్  వ్యవహరించలేడు కదా. 

నాయకులు మారాలి. కనీసం భారత దేశమంతా మనది - దేశమంతా అభివృద్ధి చెందాలి - అనే నాయకులు రావాలి. నిజమైన, హృదయపూర్వకమైన జాతీయ దృక్పథం రావాలి.  ప్రతి మంత్రీ, ప్రతి యమ్.యల్.ఏ., ప్రతి యమ్.పీ. భారత దేశమంతా తిరిగీ, ప్రతి సంస్కృతినీ ఆకళింపు చేసుకున్న వారిగా - ప్రతి వోక్కరు నా వారే - అనుకునే వారు గా వుంటే - మన దేశం చాలా బాగు పడుతుంది.

తెలంగాణా రావాలా, వద్దా - అన్నది ప్రశ్నే కాదు. ప్రజలు కావాలనుకుంటే  రావచ్చు. ప్రజలు వద్దనుకుంటే - రాకపోవచ్చు.  చిన్న రాష్ట్రాలలో - మంచి నాయకులుంటే   -  అభివృద్ధి బాగానే వుంటుంది. అయితే- పెద్ద రాష్ట్రాలలో కూడా - అటువంటి అభివృద్ధి సాదించవచ్చు .మనసుంటే - మార్గం వుంటుంది.

కానీ - అభివృద్ధి అంటే - నేలకా, మనుషులకా - అన్నది మనం అర్థం చేసుకోవాలి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే  మనుషులోయ్ - అన్న సత్యాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. కొన్ని, కొన్ని ప్రదేశాలలో - ప్రకృతి వనరులు వుండవు. కొన్ని ప్రదేశాలలో - ఎక్కువగా వుంటాయి. వొక జీవ నది డెల్టా ప్రాంతంలో పండే పంటలు - మనం ఏం చేసినా - కొన్ని ప్రాంతాలలో పండే అవకాశం లేదు.  వొక చోట గాసు నిల్వలు వుండొచ్చు. మరొక చోట బొగ్గు గనులు వుండొచ్చు. వొక చోట రక రకాల ఖనిజాలు వుండవచ్చు. యిలా - ఎన్నో రకాల ప్రకృతి వనరులు - వివిధ ప్రదేశాలలో వుండ వచ్చు.  నా గాసు, నా బొగ్గు అని అనుకుంటే - బొగ్గు వాడికి గాసు లేదు. గాసు వాడికి బొగ్గు లేదు. అందుకే అన్నారు - దేశమంటే  మనుషులోయ్ - అని.

ముంబై లాంటి మహా పట్టణం - దేశంలో  మరొకటి లేదు. శివ  సేన అది మాదే అంటున్నారు. మరి డిల్లీ ఎవరిది? అలాగే - హైదరాబాద్ ఎవరిది? చెన్నై ఎవరిది?  దేశమంటే  మనుషులే కానీ ఆయా ప్రదేశాలు కావు. యివన్నీ భారతీయులందరిదీ .

మరి ముంబై లాగా చెన్నై ఎందుకు కాలేదు? చెన్నై లాగా హైదరాబాద్ ఎందుకు కాలేదు? హైదరాబాద్ లాగా  చిత్తూరు, కర్నూలు ఎందుకు కాలేదు? చిత్తూరు లాగా, మావూరు ఎందుకు కాలేదు? అలా ఎప్పటికీ కావు.కాలేవు.   కాకుంటే - అన్ని ప్రాంతాలలో - రోడ్లు బాగుండాలి . ఆ రోడ్లు బాగా వేయనివాడు ఖచ్చితంగా - మీ / మా వూరి వాడే అయివుంటాడు. ప్రతి ఊరికీ - మంచి నీటి సదుపాయం వుండాలి. అవి మన రాష్ట్రంలోని నదులు, చెరువుల నుండే  రావాలి. లేదంటే - పక్క రాష్ట్రం నుండీ అయినా రావాలి. 

భారతీయులందిరికీ వారి వారి వూర్లో రోడ్లు, నీళ్ళు, స్కూళ్ళు, దగ్గరలో కాలేజీలు, ప్రతి ప్రదేశంలోని ఉద్యోగాల్లో పాల్గొనే హక్కు - ఇవీ మనకు కావలసిన కనీస సౌకర్యాలు. మన ఊళ్లోనే - వొక స్టీలు ఫాక్టరీ, వొక బొగ్గు గని, వొక నది, వొక విమానాల కర్మాగారం వుండాలంటే - కాదు కదా.

యింతకు ముందు, నాయకులకు వుండ వలసిన మనస్తత్వం గురించి అనుకున్నాము. మనకు కూడా - ఉద్యోగాల కోసం, వేరే ఉపాధుల కోసం  దేశంలో ఎక్కడికయినా వెళ్ళ గలిగే మనస్తత్వమూ, స్వాతంత్ర్యమూ రెండూ వుండాలి. వొక జోకు చెబుతారు. టెన్ సింగ్ నార్కే, ఎడ్మండ్  హిల్లరీ  ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి - అబ్బ, అంటూ కూర్చున్నారట. అంతలో - అక్కడికి - వొక మలయాళీ అతను - చాయ్, చాయ్ - అంటూ - టీ అమ్మ వచ్చాడట. అది మలయాళీల మనః స్వాతంత్ర్యానికి ఉదాహరణగా చెబుతారు.

తెలుగు వారు వొకప్పుడు వున్న వూరు కదిలి వెళ్ళే వారు కారు. యిప్పుడిప్పుడు వెళుతున్నారు.  రైతు సమూహం తప్ప, మిగతా అందరూ - అన్ని ప్రదేశాలకూ వెళ్లి ఉండగలిగే  మానసిక స్వాతంత్ర్యం కలిగి వుండాలి.భారత దేశానికి యిది చాలా ముఖ్యం. అలాగే - అందరూ, నా వారే - అనే మనస్తత్వమూ వుండాలి. ఎక్కడో పుట్టిన మదర్  థెరెసా కున్న భావం మనలో కూడా వుండాలి కదా.

పైనున్న మ్యాపు అలాగే వుంటుందా , మారిపోతుందా?  ఎప్పుడు?

ఏమో. నాకు తెలీదు. కానీ - ఖమ్మం  పక్కన  తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అలాగే వుంటాయి. నల్గొండ ప్రక్కన - కృష్ణా, గుంటూరు లు అలాగే వుంటాయి. మహబూబ్ నగర్ ప్రక్కన కర్నూలు, ప్రకాశంలు అలాగే వుంటాయి. దేవుడు పెట్టినవి, ఏవీ, ఎక్కడికీ మారవు. అక్కడి గాలి ఇక్కడికీ, యిక్కడి వానలు అక్కడికీ పోతూనే వుంటాయి. రాజకీయ వాదులు మరీ స్వార్థపరులు కాకుంటే - నదులు మహారాష్ట్రలో పుట్టినా, కర్నాటకాకు, అక్కడి నుండి తెలంగాణా ప్రాంతం ద్వారా కోస్తాకూ - అక్కడి నుండి బంగాళాఖాతానికీ వెళ్ళుతూనే వుంటాయి. కాళిదాసు గారు -మహా కవి కాక ముందు -  తానున్న కొమ్మను తానే నరుకుతూ ఉన్నాడట. అలా  మన నెత్తిన మనమే రాళ్ళు వేసుకునే పనులు ఎన్నైనా, ఏ రాష్ట్రం వారైనా చెయ్యొచ్చు - నదుల విషయంలో.  లేదంటే - రాష్ట్రాలు ఎన్నైనా మనమంతా వొక్కటే.

నేను ఉద్యోగ రీత్యా - దేశంలోని - దాదాపు అన్ని ప్రాంతాలలో - నివసించవలసి వచ్చింది. బెంగాల్ ,అస్సాం, కోస్తా, హైదరాబాద్, తమిళనాడు లతో సహా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాలు గడిపాను. నాకు - ఆ అన్ని ప్రాంతాలూ నచ్చాయి. మనుషులూ నచ్చారు. భాషలూ నచ్చాయి. కానీ రాజకీయ వాదులు మాత్రం చాలావరకు స్వార్థ పరులు గానే వున్నారు. 

యిప్పుడు నా రాష్ట్రం ఏది? నాకు తెలీదు. నాది భారత దేశం. అంతే.


 = మీ 

  వుప్పలధడియం విజయమోహన్