8, జనవరి 2015, గురువారం

మనం సంతోషంగా వుండి - మరో పది మంది సంతోషానికి కారణమైతే ! - సర్వే జనాః సుఖినో భవంతు

 

బాధ్యత - బాధ్యతా రాహిత్యం 



మీరు లిఫ్టు లో ఏడో అంతస్తు కెళ్ళారు - అక్కడ మీ ఫ్లాటు  వుంది గనుక. పైకి వెళ్ళిన మీరు - లిఫ్టు  తలుపు మూయకపోతే - క్రింది వారు లిఫ్టు కదలక, క్రిందికి పోలేక , పైకి రాలేక - అవస్థ పడతారు . మిమ్మల్ని తిట్టు కుంటారు . లిఫ్టు తలుపులు మూయడం మీ కనీస బాధ్యత.  మీరు చేసిన తప్పే మరొకరు చేస్తే మీరూ తిట్టు కుంటారు కదా . కాబట్టి అది మీ , మన అందరి బాధ్యత . అవునా ! యిది చిన్న విషయం . యిప్పుడు మరో చిన్న విషయం . 

66 ఏళ్ళ స్వాతంత్ర్యం  తరువాత, మోడీ గారు - స్వచ్చ భారత్ ఉద్యమం ఆరంభించారు. భారత దేశం లోని ప్రతి పౌరుడికీ ఇది తన బాధ్యత అని అర్థం చేసుకోవలసిన అవసరం పూర్తిగా వుంది . మన యింట్లో, వీధిలో, వూరిలో, దేశంలో  ప్రతి వొక్కరూ స్వచ్చత , శుభ్రత పాటించాలి . చుట్టూ వున్న వారికీ తెలియ జెప్పాలి . ఇది  చిన్న విషయమే , కానీ యిదే మనం చెయ్యడం లేదు . మరి పెద్ద విషాయాలేం చేస్తాం? ఎప్పుడు చేస్తాం ?

చెయ్యాలనుకునే వారు, చేస్తూ వెడతారు. వారికీ  అడ్డంకులు, కష్టాలు వస్తాయి. కానీ, వాటిని, ఎలాగోలా అధిగమించి, తమ బాధ్యతలను పూర్తి చేస్తారు . 

రిక్షా తొక్కే వాళ్ళు, చెప్పులు కుట్టే వాళ్ళు , కూలీలు ఎంతో మంది తమ కొడుకులు, కూతుర్లను పెద్ద చదువులు చదివించి, పెద్ద ఉద్యోగాల్లో చూడడం, చూసి సంతృప్తి తో మురిసి పోవడం మనం చూస్తూ వున్నాం. అందులో కొంత మంది కొడుకులు,  కూతుర్లు , తమ తల్లిదండ్రులను బాగా చూసుకోవడం  మనకు తెలుసు . 

"మీలో ఎవరు కోటీశ్వరుడు " లో యిటువంటి వారిని మనం అప్పుడప్పుడూ చూస్తూ వున్నాం కదా . మన "నాగార్జున" గారు చాలా చక్కగా నడుపుతూ వున్నారు ఆ ప్రోగ్రామును . 

అయితే, ఎంతో కొంత వున్న వాళ్ళు - పిల్లల భవిష్యత్తును  పూర్తిగా పట్టించుకోక పోవడం , వారిని అప్రయోజకులుగా తయారు చెయ్యడం కూడా  మనం ఎన్నో కుటుంబాలలో చూడొచ్చు . 

నాకు ఈ రెండు  రకాల కుటుంబాలూ  ఎన్నో తెలుసు . 

కొంత మంది పిల్లలు,  పెద్దలు ఎంత చెప్పినా వినక , చదువును , ఆరోగ్యాన్నీ అశ్రద్ధ చేసి , తమ జీవితాలను పాడు చేసుకోవడం నేను చాలానే చూశాను, చూస్తున్నాను . కొంత మంది పెద్దలు రకరకాల వ్యసనాలలొను, అలవాట్లలోను పడి - తమ కుటుంబాన్ని, పిల్లల భవిష్యత్తు ను నాశనం చేసిన , చేస్తున్న కుటుంబాలూ చాలా చూశాను ; చూస్తున్నాను. 

అంటే - బాధ్యతలను నిర్వర్తించే వారు, నిర్లక్ష్యం చేసే వారు - రెండు రకాలూ మనలో వున్నారు. 

మన చుట్టూ వున్న పరిస్థితులను బట్టి, మన బాధ్యతలు మారుతూ వుంటాయి . పరిస్థితులను మనం మార్చలేం .  కానీ,పరిస్థితులకు అనుగుణంగా మనలను మార్చుకునే శక్తి, మన బాధ్యతలను నిర్వర్తించే  శక్తి ఎంతో కొంత దేవుడి మనకు యిచ్చాడు . 

మనకు - తల్లిదండ్రుల పట్ల , పిల్లల పట్ల, సమాజం పట్ల , దేశం పట్ల , అనేక బాధ్యతలు వున్నాయి. కొన్ని నియమాలు , కొన్ని సరిహద్దులూ, కొన్ని అధికారాలూ, కొన్ని హక్కులూ   వున్నాయి . 

ప్రస్తుతం, మన పాఠ శాలల్లో, సమాజం లో మనకు - మన హక్కులు నేర్పుతున్నారే గానీ , బాధ్యతలు  నేర్పడం లేదు. బాధ్యతలు నేర్పని సమాజం - మనం బాధ్యతా యుతంగా ఉంటామని ఎలా అనుకోగలదు. మన సమస్య అదే . 

మన దేశంలో - ముఖ్యంగా, గత 66 ఏళ్ళుగా - హక్కులు , హక్కులు అంటూ ప్రతి వర్గం వారు గోల పెట్టడము , హక్కుల కోసం పోరాడడమే కానీ, ఎవ్వరూ, ఎప్పుడూ తమ తమ బాధ్యతలు ఇవీ అని అనుకోవడం , అవి చెయ్యాలని పూనుకోవడం - చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ  వుంది .

యిప్పుడు మోడీ గారు స్వచ్ఛ  భారత్ వొక ఉద్యమం లాగా ప్రజల ముందుకు తీసుకు వచ్చారు. యిది మెల్ల మెల్లగా , ప్రజల మనస్సులో నాటుకుంటూ వుంది.  చెప్ప వలసిన వాళ్ళు , చెప్ప వలసిన విధంగా , సున్నితంగా , మనసును తాకే విధంగా చెబితే , చాలా మంది  వొప్పుకుంటారు;  పాటిస్తారు . దాదాపు 80 శాతం మందిని  మంచి మాటలతోనే  మార్చొచ్చు . 

నాయకుడుగా వున్నా వాడు , గాంధీ లాగా , రామకృష్ణ పరమహంస లాగా - తానూ చేసి , యిలా మనం చేద్దాం రండి - అంటే ఎంతో మంది ముందుకు వస్తారు. 

'నేను చెబుతున్నాను - మీరు చెయ్యండి' అంటే - అది ఉద్యమం లాగా వుండదు. ప్రజలు ప్రభావితులు కారు. ముందుకు రారు . ఆ.. మునిసిపాలిటీ  లో, జీతాలు తీసుకుంటున్న వాళ్ళు కదా ఈ పని చెయ్యాలి అనే వాళ్ళు వున్నారు యిప్పుడు కూడా. 66 ఏళ్ళు మరి అలాగే గడిచింది కదా . దేశంలో ఎక్కడ చూసినా కుళ్ళు , కంపూ - తప్ప మరొకటి లేదు . 

చిన్న వుదాహరణ - మీరు కోలకాతా నుండి చెన్నై వస్తున్నారనుకోండి . విజయవాడ ప్రాంతంలో, రాత్రి పడుకున్నారు. నిద్రలో వున్నప్పుడు , ఎక్కడో వొక చోట మహా కంపు కొట్టి, భరించ లేక మీరు లేస్తారు. మీరు పై బెర్తులో వున్నా, చీకట్లో మరేం కనిపించకున్నా , మీకు అర్థమై పోతుంది , చెన్నై దగ్గరికి వచ్చేశామని . ఈ మధ్య కాస్త పరవాలేదు కానీ ముందు చాలా దుర్వాసనగా వుండేది. యిది బాగు చెయ్యాలనుకుంటే , చెయ్యొచ్చు . చెయ్యాలని అనుకోవాలి . 60 ఏళ్ళు అనుకోలేదు . యిప్పుడూ యింకా లేదు . 

గంగ - ఆర్థికంగానూ , సామాజికం గానూ , సాంస్కృతికం గానూ - అన్ని విధాలా మనకు ముఖ్యమైన నది . స్వాతంత్ర్యం  వచ్చే వరకూ బాగానే వుండేది . ఆ తరువాత, మన నిర్లక్ష్యం కారణంగా అన్ని రకాలా కలుష పూరితంగా మారింది.  ఎన్నో దేశాల్లో, ఎన్నో నదులు - స్వచ్చంగా మార్చ బడ్డాయి. మన దేశంలో పాలకులు అనుకోలేదు . అంతే . యిప్పుడు మోడీ గారు అనుకున్నారు; అన్నారు; చాలా మంది చేత అనిపించారు.  యిప్పుడు, చుట్టూ వున్న వారి చేత - ఆ ప్రయత్నాలు తీవ్రతరం  చేయిస్తున్నారు. 

వూడవాలంటే - మొదట మోడీ గారు వూడిచి తరువాత - యిలా చెయ్యండి - అంటారు . అలాగే - గంగ విషయంలో కూడా తన స్వ ప్రయత్నం చేసి , యిక మీరు చెయ్యండి అంటారు . అన్ని విషయాల్లోనూ అంతే. 

యిప్పుడు మరో చిన్న (పెద్ద) విషయం చూద్దాం . మోడీ గారు సరే . కానీ - సంఘ్  పరివార్  లో వున్న VHP,  హిందూ మహాసభ లాంటి వారికి మోడీ గారి చిత్త శుద్ధి , కార్య దీక్ష లేదు . మిగతా మతాల వారు హిందువులను మతం మార్చేస్తున్నారు , మార్చేస్తున్నారు , వీరిని మనం మళ్ళీ మన మతం లోకి తీసుకు రావాలి, ఎలాగోలా - అన్న తపనే గానీ, వున్న వారు ఎందుకు వెళ్లి పోతున్నారు - అన్న ఆలోచన కొంత కూడా లేదు.  ఆ ఎందుకు అన్న విషయం - యిప్పుడు కాస్త చూద్దాం .

మన మత  గురువులలో ఆది శంకరాచార్యుల  వారికి  విశిష్ట స్థానం వుంది అని మనకు తెలుసు .  ఆయన అతి చిన్న వయసులో చెప్పిన నిర్వాణ షట్కం ఎంత గొప్ప  భావాలతో వుంటుందో, చదివితే మనకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది . మన సంస్కృతి , మన మతం ఏమిటో - ఆ ఆరు 'శ్లోకాల మాల' అర్థం చేసుకుంటే చాలు; మనకు నిజమైన జ్ఞానం వచ్చేస్తుంది . అందులో ఆయన, నాకు  మృత్యువు కానీ, మృత్యు భయం కానీ , జాతి భేదాలు కానీ లేవుగాక లేవు అన్నారు .  

జాతులే లేవని కాదు - అవి  గుణాన్ని బట్టి , చేసే పని బట్టి అని; జన్మ వలన కాదని శ్రీ కృష్ణుడే  అన్నాడు .  పనిని బట్టి వచ్చిన జాతి భేదాల్ని కూడా నేను చూడ వలసిన అవసరం లేదు - అన్నాడు శంకరుడు . ఆ తరువాత - సాక్షాత్  శివుడే కాశీలో తన్ను అంటరానితనం  పాటిస్తున్నావు సుమా - అని మందలించి, తన తప్పు దిద్దినట్టు, ఆయన చెప్పుకున్నాడు . శంకరులు చెప్పినా, రామానుజులు చెప్పినా - మనం మాత్రం త్వరగా మారడం లేదు . 

ఆ తర్వాత వచ్చిన వారు ఎంతో గొప్ప  వారే అయినా - శంకరులు చెప్పిన ఈ మూల సూత్రాలను, తమ మఠాల్లోనూ , దేవాలయాల్లోనూ పెద్దగా అమలు చెయ్య లేదు . ఇది వారు అనుకుంటే  వొక్క రోజులో మార్చొచ్చు . మారిస్తే, ఏ హిందువూ , మరో మతానికి వెళ్ళ  వలసిన అవసరమే వుండదు . వెళ్ళరు . హైందవ సమాజంలో వున్న ఈ వొక్క విషయం సరి దిద్దుకుంటే , మనం ఎంతో ముందుకు వెళ్ళ వచ్చు. యిది ఎవరు చేస్తారు ? ఎప్పుడు చేస్తారు ? 

మోడీ గారు చేస్తారా ? VHP , RSS , మరెవరైనా చేస్తారా ? మన మఠాధిపతులు చేస్తారా ? మరెవరైనా గురువులు చేస్తారా ? ఎందరో మహానుభావులు ; ఈ మహత్కార్యానికి ముందు నిలిచి ఎవరైనా చెయ్యచ్చు . అందరూ కలిసి చెయ్యొచ్చు .  యిది జరగాలి . గంగ పవిత్ర గంగగా మారుతూ వున్న సమయం లో, యిదీ జరిగి పొతే  ఎంత బాగుంటుంది !

నేను - నా చేత అయ్యే పని ఏదో చేస్తున్నాను . రాముడికి వుడత  చేసిన సహాయం లాగా .  సేవాలయ అనే ఆశ్రమం లో - అనాథ పిల్లలకూ, అనాథలు లాంటి లాంటి వృద్దులకూ - ప్రతి సంవత్సరమూ నేను చెయ్య గలిగినంత ధన సహాయం చేస్తూ వచ్చాను. 2014 నుండి మరో రకంగా చేద్దామని, యిద్దరు పిల్లల చదువు కు - 1 నుండి 12 వ తరగతి వరకు - అయ్యే పూర్తి ఖర్చు నేనే వారికి యిచ్చాను (1.7 లక్షలు ). యిక ముందు కూడా, నా శక్తి వున్న మేరకు, ప్రతి సంవత్సరమూ  వొకరో, ఇద్దరో పిల్లలకు చదువు పూర్తి ఖర్చు యివ్వాలని ఆశ , ఆశయం . దేవుడు ఆశీర్వదిస్తే అంత కంటే ఎక్కువే చేస్తాను . 

ఏదో చిన్న తపన నాలోనూ వుంది - నేను ఎవరి కళ్ళలో సంతోషం నింప గలను; ఎవరి కన్నీళ్లు తుడవగలను - అని . అది నన్ను ముందుకు నడిపిస్తుంది - యిక ముందు కూడా . 

నాకు తెలుసు. మన దేశంలో - ఎంతో మంది  డబ్బు వున్న వారు, ఎంతో, ఎంతో చేస్తున్నారు - విప్రో యజమాని ప్రేమ్జీ లాగా . మరెంతో మంది , ముఖ్యంగా, రాజకీయాల్లో వున్న వారు , అక్రమార్కులు గా ఉన్నారే తప్ప - ఏమీ చెయ్యడం లేదు . సరే . వారిని వదిలి పెట్టి , మనం అనుకుంటే, మనం చెయ్య గలిగింది చేస్తే ,  ఎంతో కొంత దేశం బాగు పడుతుంది కదా . 

ఇదొక్కటే కాదు . మనం మరెన్నో చెయ్యొచ్చు . నేను చేస్తున్న మరి కొన్ని పనులు మరో సారి మీతో పంచుకుంటా . 


మనం సంపాదించేదేదీ మన వెనుక రాదు ; మనం యిచ్చేదే  మనతో వస్తుందని , ఉపనిషత్తులు, గీత అన్నీ ఘోషిస్తున్నాయి .

మనం సంతోషంగా వుండి , మరో పది మంది సంతోషానికి కారణమైతే - అదే మన సంస్కృతి ఆశయం, లక్ష్యం. మన జీవన సాఫల్యం కూడా అందులోనే వుంది. 

సర్వే జనాః సుఖినో భవంతు అంటే అదే. మన బాధ్యతా నిర్వహణ అంటే కూడా అదే కదా .  

సరే . మీ అభిప్రాయాలు, సలహాలు తప్పకుండా చెప్పండి . సంతోషంగా స్వీకరిస్తాను . 

సర్వే జనాః సుఖినో భవంతు

= మీ 

వుప్పలధడియం విజయమోహన్ 

మేము యిప్పటికి చదివిస్తున్న యిద్దరు పిల్లలు