మనిషికి చాలా, చాలా సంతోషాన్నిచ్చే పనులు - మనం నిస్స్వార్థంగా, మరొకరి కొరకు చేసే పనులే అని చెప్పుకోవచ్చు. అవి చిన్నవే కావచ్చు. కాస్త పెద్దవీ కావచ్చు. కొన్ని సందర్భాల్లో - మహా గొప్ప పనులూ కావచ్చు. ఏదైనా - మనం నిస్స్వార్థంగా చేసే పనులు మనకు జీవితాంతం సంతోషాన్నిస్తాయనడంలో నాకు సందేహం లేదు.
అవి యితరులకు చెప్పుకోవచ్చా - చెప్పుకోకూడదా? మన యిష్టం. చేసిన పుణ్యం చెబితే పోతుందని వొక సామెత. సరే. పుణ్యం పోతే పోనీ. మనసుకు ఏదో వొక సంతోషం - అనుకుంటే- చెప్పొచ్చు. చెబితే - మిగతా వారు కూడా అలాంటివి చేస్తారనుకుంటే - తప్పకుండా చెప్పొచ్చు.
శ్రీ రామానుజాచార్యుల వారికి - వారి గురువు , చాలా రహస్యం, మరెవరికీ తెలియరాదు -అని నారాయణ మంత్రం ఉపదేశించారు. వెంటనే - రామానుజాచార్యులు గుడిపైకెక్కి అందరినీ పిలిచి - అందరికీ ఆ మంత్రాన్ని చెప్పారు. అది మంచా కాదా -అన్నది వివాదాస్పదమే. కొందరికి చాలా గొప్ప పని అనిపిస్తుంది. కొందరికి - మంత్రోపదేశం అలా చేయడం చాలా తప్పు అనిపిస్తుంది.
ఇలాగా - వొక్కొక్క సందర్భం లోనూ - వొక్కొక్కరికి వొక్కొక్క రకంగా అనిపించడం చాలా సహజం.
అయితే - నిశ్చయంగా, యిది మంచి పనే అనిపించిన దాన్ని - మనం వెంటనే చేసేస్తే మంచిది.
వొకాయన అంటారు - మీరు చేయలేని పని చేయక పోతే మునిగి పోయిందేమీ లేదు. కాని, చేయ గలిగిన మంచి పని చేయక పోతే - జన్మ వ్యర్థం అయిపోతుంది.
నిజమే. మనం చేయగలిగిన మంచి పనులు చేస్తూ పోవాలి.
తెలుగులో వొక సామెత వుంది. మేసే గాడిదను - కూసే గాడిద వచ్చి చెడిపిందట. అలాగా, మంచి పని చేయాలనుకునే వాడిని - చేయని వాళ్ళు వచ్చి చెయ్య నివ్వకుండా ఆపుతుంటారు . చేసే వాళ్ళకు విమర్శల వర్షం తట్టుకునే శక్తి కూడా వుండాలి. అదీ విషయం.
మనమంతా - చిన్న చిన్న - తప్పులు చేస్తూనే వుంటాము. అలాగని - మంచి పనులు చేయ కూడదని నియమమేమీ లేదు. చిన్న తప్పులు చేసిన వాళ్ళు - పెద్ద మంచి పనులు తాము చేయడమో, చేసే వాళ్లకు తోడు పడడమో - చేయకూడదని రూలేమీ లేదు. కానీ - ఏమీ చేయని వాళ్ళు - చేసే వాళ్ళను - చిన్న తప్పులు చూపించి పరిహాసం చేస్తూ వుంటారు. విమర్శిస్తూ వుంటారు.
యిప్పుడు దేశం స్థితి అలాగే వుంది. టీం అన్నా లోని ప్రతి సభ్యుల పైనా - ఏదో చిన్న తప్పు రుద్దడమూ - వీరా లంచా గొండి తనం పైన యుద్ధం చేసే వారు - అని విమర్శించడం జరుగుతోంది. నా ఉద్దేశంలో -ఎవరైనా ఈ యుద్ధంలో చేరవచ్చు. యిప్పుడు మీరు లంచం తీసుకుంటూ వున్నా సరే - ఈ పధ్ధతి పోవాలి అనుకుంటే - అందరూ చేరండి.విమర్శలు చేసే వారు - మారే వారిని కూడా మారనివ్వరు. విమర్శకుల మాట వింటే - దేశం యిలాగే ఎప్పుడూ లంచగొండి దేశం గా వుండి పోతుంది. నా అభ్యర్ధన - అందరూ - ఈ యుద్ధంలో చేరండి. మనమూ- నూరు శాతం ప్రజలు - ఆర్ధిక ఉన్నతికి నోచుకోవాలి. లంచమనే పదం కూడా దేశం నుండీ వెళ్లి పోవాలి.
దేశాన్ని పీడిస్తున్న మరో మహా మారి - స్త్రీలపై వేధింపులు. ఆంగ్లంలో ఈవ్ టీజింగ్ అంటారు కదా. అదన్న మాట. కత్తితో దాడి చేయడం, ఆసిడ్ పోయడం - బస్సుల్లో, రైళ్ళలో వేధించడము - యివన్నీ ఎక్కువవుతున్నాయి. కొన్ని నగరాల్లో మరీ ఎక్కువ.
చెన్నై నగరంలో - యిది పదిహేడేళ్ళ క్రితం జరిగిన సంగతి.
నేను నగరం మధ్య నుండి మారి - నగర శివార్లలో, స్వంత ఇల్లు కట్టడానికి ఆరంభించిన రోజులు. క్రొత్త వూరి నుండి ట్రెయిన్ లో దాదాపు ముప్ఫై కి.మీ. దూరం వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు తెలిసింది - చెన్నై దగ్గర కూడా - స్త్రీలపై వేధింపులు ఎంత ఘోరంగా వుంటుందో.
సెకండు క్లాసులో వెళ్ళిన రోజు -ప్రతి రోజూ ఇలాంటి వేధింపు చర్యలు చూడవలసి వచ్చింది. సెకండు క్లాసులోనే వొక చిన్న భాగంలో - స్త్రీల భాగం వుండేది. ఈ రెండింటికీ మధ్య తలుపు లేని వొక ద్వారం వుండేది. చాలా మంది కాలేజీ విద్యార్థులూ, కార్మికులూ - ఆ ద్వారం వద్ద నిలబడి - లోనున్న ప్రతి స్త్రీ పైనా - వొక్కొక్కరి పైనా - అసభ్యకరమైన పదజాలం విసిరి హింసించే వాళ్ళు. అయిదేళ్ళ పసిపాప నుండి - ఎనభై ఏళ్ళ ముదుసలి వరకూ - ఎవరినీ వారు విడిచి పెట్ట లేదు.
వచ్చే ప్రతి స్టేషన్ లోనూ - కొత్త వాళ్ళు రావడం, వాళ్ళలో - మరి కొందరు ఆ ద్వారం వద్ద నిలబడడమూ - గుంపు ఎక్కువయ్యే కొద్దీ - స్త్రీల భాగంలోకే వెళ్లి - అక్కడే మరింత రెచ్చి పోయి మాట్లాడడమూ -జరిగేది. మొదటి రోజే - ఈ తంతు భరించడం నాకు చాలా కష్టమయ్యింది. వొక అబ్బాయిని పిలిచి - మన ప్రక్క ఖాళీయే కదా. అక్కడకెళ్ళి కూర్చోకూడదా- అన్నాను. ఆ అబ్బాయి పెద్దగా నవ్వి - పూర్తిగా స్త్రీల భాగంలోకి చొచ్చుకెళ్ళాడు.
సరే. ప్రక్క నున్న ప్రయాణీకులతో మాట్లాడి - మనమంతా - వారికి - నచ్చచెప్ప కూడదా - అన్నాను. వారంతా, పెదవి విరిచేశారు. ఏమీ లాభం లేదు సార్. వీరు ఎవరి మాటా వినే రకాలు కారు. మనం చెబితే - మరింత రెచ్చి పోతారు. ఎక్కువ చెబితే - కొట్టినా కొడతారు. వినరు గాక వినరు - అన్నారు. పది రోజులు ఈ తంతు భరించాను. కాని తరువాత - ఏదో చెయ్యాలి. ఏదైనా చెయ్యాలి - అనిపించింది.
పదకొండో రోజు - ఆఫీసు చేరిన వెంటనే - అదే మూడ్ లో - టెలిఫోను డైరెక్టరీ లో - రైల్వే వారి పబ్లిక్ గ్రీవెన్సస్ సెల్ వారి అడ్రెస్సు, సదరు ఆఫీసర్ల పేర్లు, చెన్నై డివిషన్ సూపరింటెండెంటు వారి పేరూ , అడ్రెస్సూ అన్నీ రాసుకున్నాను.
తరువాత దాదాపు పది పేజీల సుదీర్ఘ లేఖ తయారు చేసాను. అసలు ఏం జరుగుతోంది - అన్నది పూస గ్రుచ్చినట్టు రాసాను. దాని క్రిందే - దానికి పరిష్కార మార్గాలు కూడా చాలా రాసాను. అయితే - అవన్నీ - గాంధీ గారి అహింసా మార్గాలే. యివన్నీ రాసి, ఆ అడ్రెస్సులకు అన్నిటికీ పంపించేసి - అబ్బ, ఏదో చేయగలిగింది చేసాను - అని అనుకున్నా.
తరువాత పది రోజులు ఏమీ కాలేదు. పదకొండో రోజు - యిద్దరు పోలీసు ఆఫీసర్లు మా ఆఫీసుకు - నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నా రూముకే వచ్చారు. వారిని కూర్చోమని - పని ఏమిటి - అని అడిగాను. వారు - నేను రాసిన లేఖను చూపి - అది నేను రాసిందేనా అని అడిగారు. నాకు మనసులో - చిన్న జంకు. కానీ- ఎందుకో - గాంధీ గారు గుర్తుకొచ్చారు. భయమెరుగని గాంధీ దేశంలో పుట్టి - మంచి పనికి భయపడడం ఎందుకనిపించింది.
అంతే. మరి భయం లేదు. జంకూ లేదు. అవును అన్నాను. వారు - అసలేం జరుగుతోందో - నేను చూసినవన్నీ చెప్పమన్నారు. ప్రతి వొక్కటీ - వొక్కటి వదలకుండా - అన్నీ - కాస్త ఆవేశం గానే చెప్పాను.
చివర అన్నాను - ఆ రైళ్ళలో - మా వాళ్ళు గానీ, మీ వాళ్ళు గానీ ప్రయాణం చేసినా - ఎవరూ సంతోషంగా దిగ లేరు. ఎంత మంది స్త్రీలు డిప్రెషన్ కు లోనవుతున్నారో - మనకు తెలీదు. ఎంత మంది ఈ బాధ భరించలేక ఉద్యోగాలు, చదువులు వదిలేస్తున్నారో కూడా తెలీదు. ఇవేవీ చేయలేని వాళ్ళు - ఎవరో వొకరు ఆత్మహత్యలు చేసుకున్నా - ఆశ్చర్య పడనక్కర లేదని చెప్పాను.
వారు చాలా వోపిగ్గా విన్నారు. కడపట, నేను యిచ్చిన పరిష్కార మార్గాల గురించి కూడా చెప్ప బోయాను. అప్పుడు - వారు కాస్త నవ్వి - సార్, మీరిచ్చిన ఈ వివరాలు మాకు చాలు. మీ పరిష్కార మార్గాలు -అటువంటి దుర్మార్గుల పై పని చెయ్యవు. ఎం చెయ్యాలో - మేం చూసుకుంటాం. అన్నీ - మీకు కూడా తెలుపుతాం. మీకు మా ధన్యవాదాలు - అని వెళ్ళిపోయారు.
తరువాత, మా ఆఫీసులోని వాళ్ళంతా - వచ్చి విషయమేమిటని అడిగారు. చెప్పాను. వారందరి ఏకగ్రీవమైన అభిప్రాయం - నేను చాలా తొందర పాటు పని చేసానని. ఈ పోలీసులు మనల్నే వేధిస్తారు కాని - అసలు రౌడీలపై ఏ ఆక్షనూ తీసుకోరు. పైపెచ్చు - ఆ రౌడీలకు మీ పేరు తెలిసిందంటే - మీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతారు - అంటూ ఎన్నెన్నో చెప్పారు.
కానీ అప్పటికి - నా మనసులో - వొకే ఆలోచన. యింత దూరం వచ్చాక - ఏదైనా జరగనీ. చూచుకుందాం-అని. ఏదో అంటారు కదా. రోటిలో తల పెట్టి, రోకటి పోటుకు వెరువరాదని. నా సహ ఉద్యోగులు మాత్రం ఎం జరుగుతుందో, ఏమో - అని చెబుతూనే వున్నారు, ప్రతి దినమూ. నాలుగు రోజులు ఏమీ జరగలేదు.
తరువాత - వొక రోజు, మా అన్న కొడుకు వచ్చి- చిన్నాన్న! ఈ రోజు నిజంగా మన పోలీసులు పోలీసుల మాదిరి పని చేసారు - అన్నాడు. తనొచ్చిన ట్రెయిన్ లో - స్త్రీల భాగంలో నిల బడ్డ వారిని - బయటికి లాగి -అంతే కాక, వారి ద్వారం దగ్గర నిలబడ్డ వారందిరినీ బయటికి లాగి - వారి లాఠీలకు బాగా పని కల్పించారట . అందులో - ముఖ్యమైన వారిని - అరెస్టు చేసి కూడా తీసుకెళ్ళారట. ఆహా - అనుకున్నానే - కానీ, యిది, నా నిర్వాకమే అన్నది అప్పటికి అర్థం కాలేదు.
తరువాత ట్రైన్లో వచ్చిన నా మరదలూ, ఆ తర్వాత వచ్చిన మా ప్రక్కింటి వాళ్ళూ - యిలా చాలా మంది - యిదే చెప్పడం జరిగింది. అంటే - ప్రతి ట్రెయిన్ లోనూ - పోలీసులు తమ ఆక్షన్ ను జరుపుతున్నారని అర్థమయ్యింది. అప్పుడు - కాస్త సందేహం - యిది నా నిర్వాకమే నేమో నని. కానీ అనుకున్నా - మరెవరైనా కూడా రాసిండొచ్చుగా - అని.
తరువాత పదిహేను రోజులు - ప్రతి ట్రెయిన్ లోనూ - యిదే తంతు -విడవకుండా జరిపారు రైల్వే పోలీసులు.
తరువాత - నాకు వారి పబ్లిక్ గ్రీవెన్సస్ సెల్ నుండీ, చెన్నై రైల్వే సూపరింటెండెంట్ వారి నుండీ - రిప్లై లేఖలు అందాయి. అందులో - వారు నా లేఖ పై తీసుకున్న ఆక్షన్ అంతా - పూర్తిగా తెలపడమూ, యిక ముందు కూడా, యిటువంటి స్త్రీ వేధింపు చర్యలు జరగకుండా చూసు కుంటామని హామీలు యివ్వడమూ - యిలా అన్ని విషయాలూ రాసారు.
కానీ - వారు, నన్ను మళ్ళీ పిలవడమో, ఏ రకంగా నైనా నాకు కష్టం కలిగించడమో - అస్సలు చెయ్య లేదు. ఆ రోజు నుండీ - ఈ పదిహేడు సంవత్సరాలుగా - ఆ ట్రెయిన్ మార్గంలో - మళ్ళీ అటువంటి స్త్రీ వేధింపు చర్యలు జరగడం లేదన్నది - వాస్తవం. అటువంటి ఆఫీసర్లకు, ఆ పోలీసులకు - మనం హృదయ పూర్వక అభినందనలు తెలపాల్సిందేగా .ఆ తరువాత ఎప్పుడో, మాయింట్లో వారికి కూడా యివన్నీ చెప్పాను. ఈ రిప్లై లేఖలు చూపాను.
ఈ మధ్య ముంబై లో జరిగిన కీనన్, ర్యూబెన్ ల హత్యలో - స్త్రీ వేధింపు చర్యలే మొదటి ఘట్టంగా వుండింది. పత్రికల్లో , టీ.వీ ఛానళ్లలో - అక్కడ వున్న వారెవరూ - హతులకు సపోర్టుగా రాలేదని ,యిది చాలా తప్పనీ రాసారు. నిజమే, కొంత వరకు. కానీ- చాలా మంది ప్రజలలో - రౌడీలకంటే - పోలీసులంటే - ఎక్కువ భయం ఉందన్నది తెలుసు గదా. కానీ రౌడీలకు పోలీసులంటే పెద్ద భయం లేదు. యిది పోగొట్ట వలసిన బాధ్యత- పోలీసు వ్యవస్థ దే నని చెప్పక తప్పదు. మన దేశమంతటా - యిది జరగాలి.
పోలీసుల్లో మంచి వాళ్ళు ఎంతో మంది వుండొచ్చు. కానీ లంచగొండి తనమూ, ఎక్కువే నని ప్రజల నమ్మకం. అటువంటి వారి దగ్గర అన్యాయమే జరుగుతుందని వొక విశ్వాసం. అందు వలన - ఎక్కడ ఏ అన్యాయం జరిగినా - సాధారణ ప్రజలు పట్టించుకోవడం వదిలేశారు. వారిలో ధైర్యమూ ,విశ్వాసమూ కలిగించ వలసిన బాధ్యత పాలక వర్గానిదీ, పోలీసులదీను. కొన్ని, కొన్ని చోట్ల ఇది జరుగుతున్నది. చాలా చోట్ల జరగాల్సి ఉంది.
సరే. స్త్రీలపై వేధింపు చర్యలను - అరికట్టేందుకు - కొన్ని చోట్ల ( ముఖ్యంగా చెన్నై లో ) అప్పుడప్పుడూ, మహిళా పోలీసులను సాధారణ దుస్తులలో బస్సు స్టాపుల్లోను, రద్దీ ప్రాంతాల్లోనూ నిలిపి, వారి ద్వారా ఈ రౌడీలను పట్టేస్తున్నారు. పూర్తిగా పోక పోయినా - యిప్పుడు, చాలా తగ్గిందని చెప్పొచ్చు. యిటువంటివి - బస్సుల్లోనూ, యితర రద్దీ ప్రాంతాల్లోనూ - యింకా జరగాల్సిన అవసరం ఉంది.
ముంబై, డిల్లీ లాంటి పట్టణాలలో - స్త్రీ వేధింపు చర్యలు ఎక్కువగానే వున్నాయి. పోలీసు వ్యవస్థ -కంప్లయింటు కోసం ఎదురు చూడకుండా - ముందు చూపు చర్యలు తీసుకుంటే - అంటే- వేధింపులు జరిగే సమయంలో, జరిగిన చోట, రౌడీలను పట్టుకుంటే, వారికి కావలసిన శాస్తి చేస్తే - పోలీసుల పై ప్రజలకు గౌరవమూ పెరుగుతుంది. మన దేశం మరింత శాంతివంతం గానూ, నేరప్రవృత్తి లేకుండానూ వుంటుంది.
అలాగే - కంప్లైంటు ఇచ్చే వారిని - మళ్ళీ మళ్ళీ పిలిచి వేధించకుండా , వారిని నేరస్తుల ముందు పిలువకుండా - వారికి తగిన ప్రోత్సాహం యిస్తూ వుంటే - ధైర్యం గా కంప్లైంటు యివ్వగలరు. యిది మన దేశ / రాష్ట్ర మహిళా కమిషన్ వారు కూడా పరిశీలించి తగిన సూచనలు, చర్యలు చేబట్టాల్సిన అవసరం ఉంది.
యిది చేస్తేనే - స్త్రీలకూ కూడా పురుషులపై గౌరవం పెరుగుతుంది.
మన ప్రాచీనులు అంటారు - ఏ దేశంలో అయితే, ఏ యింట్లో అయితే - స్త్రీ కంట తడి పెడుతుందో - ఆ దేశం లో , ఆ యింట్లో, దేవతలు వుండరు. నీళ్ళు కూడా వుండవు. వానలు కురవవు - అని. అందుకే గాంధీ గారు కూడా అన్నారు - అర్ధ రాత్రైనా, ఏ స్త్రీ అయినా , భారత దేశం లోని ఏ రోడ్డు లో నైన ,ఎక్కడైనా, వొంటరిగా, ప్రయాణం చేయ గలిగిన పరిస్థితి రావాలి. అప్పుడే, మనకు నిజమైన స్వతంత్రం -అని.
చదువరులకు - వొక విన్నపం. మనమంతా, మన మహిళా కమిషన్ వారికి - యిటువంటి సూచనలు రాయాలి. అప్పుడే - ఈ జగన్నాథ రథ చక్రాలు కదుల్తాయి. మంచి రోజులు వస్తాయి. మంచి పని అనుకుంటే - వెంటనే చేసెయ్యండి.
=మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి