క్రిందటి వ్యాసంలో - చెయ్యగలిగిన మంచి పనిని వెంటనే చేసెయ్యాలని అనుకున్నాం.
అందులో వొక భాగంగానే - పదిహేడు సంవత్సరాల క్రితం దక్షిణ రైల్వే పోలీసు వారు -వొక స్త్రీ వేధింపు చర్య ఘటనల పైన చాలా బాగా వ్యవహరించిన తీరును గురించి రాయడం జరిగింది. అలాంటి మంచి పనులు అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి. అయితే - వారికి మన లాంటి వారు సరైన సమయానికి సరైన రిపోర్టు యిస్తే బాగుంటుంది. అలాగే - పోలీసు వారు కూడా - రిపోర్టు యిచ్చే వారిని వేధించకుండా, వారికి సరి అయిన రక్షణ కల్పిస్తూ వుంటే, పౌరులు-పోలీసుల మధ్య మరింత సహకారం పెరుగుతుంది .
సరే. ప్రాచీన కాలంలో - స్త్రీ, బాల, వృద్ధులు సంతోషంగా వుండే సమాజమే - ఆదర్శ వంతమైన సమాజమని చెప్పారు.
వయసులో వున్న వారు - స్త్రీ, బాల, వృద్ధులను సంతోషంగా ఉంచుకోవడానికి - చాలా ప్రయత్నాలు చేసే వారు. పురాణాలు, ఇతిహాసాలలో - వున్న వృత్తాంతాలన్నీ ఇలాంటివే. క్రిందటి వ్యాసంలో కొంత స్త్రీ వేధింపు చర్యల గురించి మాట్లాడాము.
మిగతావి వచ్చే వ్యాసాలలో చూద్దాము. ఈ వ్యాసంలో - మరో చిన్న సంఘటన. నవంబర్ పదిహేడో తేదీ - మా దంపతులు వివాహం జరిగి ముప్ఫై మూడు వసంతాలు ఆనందంగా గడిపిన సందర్భంగా, మా ఊళ్లోనే వున్న - "సేవాలయ" -అనే అనాథ బాలుర, వృద్ధుల ఆశ్రమానికి వెళ్ళాము.
యిది రెండో సారి, అక్కడికి మేము వెళ్ళడము.
మొదటి సారి లాగే- ఈ సారీ వొక్క రోజు పూర్తి ఖర్చులు మేము యిచ్చేసాము. కాని, అది జరిపే వారి చిత్త శుద్ధి, కార్య శుద్ధి ముందు - మనం చేసే ధన సహాయం అసలు ఏమీ లేదు. యిప్పటికి దాదాపు 200 మంది వృద్ధులు, 200 మంది తల్లీ,. తండ్రీ లేని విద్యార్థులు - ఆ ఆశ్రమం లో వుంటున్నారు. ఆ విద్యార్థులతో బాటుగా- మరో 800 మంది బీద విద్యార్థులు కూడా ప్రక్క గ్రామాల నుండి వచ్చిఅక్కడ పాట్హ శాలలో చదువుకుంటున్నారు.అందుకనే - సేవాలయా వారికి చాలా మంది సహాయం చేస్తున్నారు.
అంతకు మించి మనం ఏమిచేయ గలమా -అన్నదే, మనం ఆలోచించ వలసిన విషయం.
తిరిగి వస్తూవుంటే - ఆ కాంపౌండు లోనే - వొక చిన్న పిల్ల మమ్మల్ని చూసి చిరునవ్వుతో - చెయ్యి ఊపింది. చాలా ముచ్చటగా వుంది. నేనే అడిగాను - నీ పేరేమి, ఎన్నో క్లాసు చదువుతున్నావు అని . చెప్పింది. పేరు కృత్తిక. క్లాసు 6 - బీ సెక్షను.
బాగా చదవాలి. మళ్ళీ మేం వస్తాము. వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా వెతుక్కుంటూ వచ్చి చూస్తాము - అన్నాము. ఆ పిల్ల సంతోషంగా -సరే, అంది. చూట్టానికీ ముచ్చటగా వుంది. దేవుడి దయ వుంటే - (వుండాలి)- బాగా వృద్ధిలోకి రాగల పిల్ల. కానీ తల్లీ, తండ్రీ లేరు.ఇలాంటి వారిని చూసినప్పుడు - మనమెందుకు, దాదాపుగా, చేయ గలిగే మంచి పనులు, ఏవీ చేయడం లేదు - అనిపిస్తుంది.
దేశంలో, అనాథలంటూ - ఎవరూ వుండకూడదు. ప్రతి వొక్కరికీ - నీకు సహాయం నేనున్నాను, అని చెప్పే ఏదో వొక సహృదయుడు (రాలు) తోడు వుండాలి. ప్రతి బాలుడు, బాలిక మొహంలో సంతోషం వుండాలి. అది చెరిగిపోనివ్వకూడదు మనం. ఆ సంతోషం మనం చూడాలి.
అప్పుడే - వారు, మంచి పౌరులుగా పెరగ గలరు.
అంటే - మనం చెయ్య గలిగిన మంచి పనులు - యింకా ఎన్నో వున్నాయి చెయ్యడానికి. రోజూ చెయ్య గలిగినవి, వారం, వారం చెయ్య గలిగినవి. నెలా,నెలా చెయ్య గలిగినవి - కనీసం ప్రతి నెలా , ఏదో, మంచి పని చెయ్యాలి.
ఎందరో ఎంతో మంది మహానుభావులు ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు కూడా. వారికి - చేయూత నివ్వడం కూడా చేయాలి.
యిది వృద్ధుల ఆశ్రమం |
బాలల క్లాసు రూము. |
వీరి వెబ్ సైటు = సేవాలయ.ఆర్గ్ ; అందులో మీరు వారి పూర్తి వివరాలు చూడొచ్చు. యిప్పుడు యింకా బాగా - ఎన్నో చేస్తున్నారు.
వీరి లాగా - మంచి పనులు - త్వరగా చెయ్యాలనుకునే వారిని - చేసే వారిని తలుచుకుంటే - ఆనందంగా వుంది కదా .
=మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి