31, అక్టోబర్ 2011, సోమవారం

ఎస్.పీ.బాలసుబ్రమణ్యం గారు = పాడుతా, తీయగా = ఎనభై ఏళ్ళ తరువాత ?? =

ఎస్.పీ.బాలసుబ్రమణ్యం గారు ఎన్నో మధురమైన పాటలు పాడారు. తెలుగులో, తమిళం లో, హిందీ లో, కన్నడంలో, మరెన్నో భాషలలో. 

మనకు,అంటే తెలుగు వారికి,  వారు తెలుగులో పాడిన ఎన్నో పాటలు, ఎంతో, ఎంతో, ఎంతో యిష్టం కదా.  

అందుకని, తెలుగు వారికి అత్యంత ఆప్తుడైన మన ఎస్.పీ.బాలు గారు - నాకు కూడా - చాలా,చాలా యిష్టమైన వ్యక్తులలో వొక ముఖ్యమైన వ్యక్తి. 

సినీమాల్లో ఆయన పాడడం తగ్గించుకోవడం మనకు కాస్త నిరాశాజనకంగా వున్నా - అందువలన -  తెలుగు వారందరికీ మరో గొప్ప మేలు జరిగింది. బాలు గారు - భవిష్యత్తులో, బాలుగారిలాగా - పాడగల ఎంతో మంది చిన్నారులను -  తెలుగునాట, వెలుగులోకి తీసుకొచ్చారు. వారికి రకరకాల మెరుగులు దిద్దారు.

ఆయన సారథ్యం వహించిన సంగీత రథాలు - ఎంతో మంది పిల్లల స్వప్నాలను  సాకారం చేసింది. ఎంతో మందిని ముందుకు నడిపించింది . ఈ అందరికీ సినిమాల్లో అవకాశము దొరుకుతుందో లేదో గాని -  మనందరి మనస్సులో మాత్రం - స్థానం దొరికింది, అనడంలో - ఏమాత్రం అతిశయోక్తి లేదు.  

వారు సారథ్యం వహించిన పాడుతా, తీయగా - చాలా అమోఘంగా,(ఆ సమయంలో) మరే ప్రోగ్రామునూ చూడనివ్వకుండా, నడిచింది.

ఈ రోజు పోటీ  ఫయనల్సు ముగిసింది. చిన్నారుల పాటలన్నీ చాలా, చాలా  బాగుంది. పోటీ ముగిసే సమయానికి  - వారు తమను తాము ఎంత మెరుగుపరుచుకున్నారో -  చూడటానికి, వినడానికీ - చాలా హాయిగా, ఆనందంగా వుంది. మరి యింత మంది పిల్లల ఈ అభివృద్ధికి - బాలు గారు ఎన్ని రకాలుగా కారణమయారో చూసిన వారికి - వారిని తప్పక అభినందించాలని ఆకాంక్ష కలుగుతుంది.

దేశ సేవ, మానవ సేవ ఎన్ని రకాలుగా చేయ వచ్చో  గాని - ఇలాంటి దేశ సేవ, మానవ సేవ -మరో వందేళ్ళు నిలిచి పోయే సేవ అని మాత్రం చెప్పొచ్చు.  మనం మాతృ దేవోభవ, పితృదేవోభవ అన్న తరువాత - ఆచార్య దేవోభవ అని - గురువు గారిని దైవం స్థానంలో నిలిపే సాంప్రదాయం వున్న వాళ్ళం.   సరే. ఈ చిన్నారులు - ఎనభై ఏళ్ళ తరువాత - ఎవరి గురించి  మాట్లాడుకుంటారంటే - బాలు గారిని గురించి, అదీ వొక ఆచార్య స్థానంలో వారిని  వుంచి -  మాట్లాడుతారని - తప్పకుండా చెప్పొచ్చు. తాము పాడిన పాటలు కూడా వారి మనస్సులో తప్పక నిలిచిపోతాయి. బాలు గారి జీవితం నిజంగా ధన్యమే.

బాలు గారికి - ఆంధ్ర దేశం మరే సత్కారాలు అందజేస్తుందో  - నాకు తెలియదు గాని - వారికి భగవంతుడు - నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతమైన జీవితం యివ్వాలని, అంత వరకు వారు సంగీతానికి సేవ చెయ్యాలని - నేనైతే కోరుకుంటాను.  

= మీ

వుప్పలధడియం విజయమోహన్

3 కామెంట్‌లు: