29, సెప్టెంబర్ 2011, గురువారం

మర్ఫీ సూత్రాలు = జీవితం వేసే తప్పటడుగులు =

మర్ఫీ  సూత్రాలు   = జీవితం వేసే తప్పటడుగులు


ఆంగ్లం లో మర్ఫీ సూత్రాలు అని -   అందమైన, బాగా ప్రచలితమైన  సూత్రాలు కొన్ని వున్నాయి.

అవి - ప్రపంచంలో మనం -సాధారణం గా - గమనించే , కొన్ని పనులు - వాటి పరిణామాల గురించి వినోదం గానూ, వినూత్నం గానూ, అదే సమయంలో, హృదయానికి హత్తుకునే - అక్షర సత్యాల లానూ - చెబుతాయి. అయితే యివన్నీ - నిరాశా వాదం గానూ,  సంశయాత్మక వాదం గానూ, ఎక్కువగా కనిపిస్తాయి.

అనుమానపు పుట్ట అని అనుకునే మనుషులకు తమ జీవితమంతా యిలాగే కనిపించొచ్చు.

కానీ - వొక్కో సారి, ప్రతి మనిషి జీవితంలోనూ - ఇలాంటి సంఘటనలు - కొన్ని రోజుల పాటో, వారాల పాటో, నెలల పాటో , సంవత్సరాల పాటో - కూడా జరుగుతూ వుండడం మనం చూడొచ్చు . మనుషుల జీవితాల్లోనే కాదు -  దేశాల జీవితాల్లోనూ, సంస్థల జీవితాల్లోనూ కూడా యిలా జరగడం మనం చూడొచ్చు.

మనకు ఎన్నో సామెతలు వున్నాయి.

కష్టాలు చెప్పి రావు. వస్తే వొక్కటిగా రావు. నిండా మునిగిన వాడికి చలేమిటి. ఇలాంటివి.

చాలా మంది శతక కారులు కూడా   ఈ విషయాలను అక్కడక్కడా విధ విధాలుగా చెప్పారు.  "మోహరమున తానెక్కిన పారని గుఱ్ఱము" వెంటనే విడిచిపెట్టండని, సుమతి  శతక కారుడు  సలహా యిచ్చాడు. మీరు యుద్ధానికి వెళ్లారు. వెళ్లేంత  వరకు   బుద్ధిగా వున్న మీ గుఱ్ఱము - తరువాత ముందుకూ వెళ్ళడం లేదు. పోనీ, వెనక్కూ వెళ్ళడం లేదు. మీరేం చేస్తారు?

 అయితే - సుమతి  శతక కారుడు , ఏం చేయాలో సలహా యిస్తాడు. మర్ఫీ సూత్రాలలో - సలహా వుండదు. యిలా జరగవచ్చు. అలా జరగవచ్చు అని సూచన మాత్ర మే వుంటుంది.

అయితే - మర్ఫీ సూత్రం అని మొదట పిలువ బడ్డది - ఎవరు చెప్పారో, ఎవరు రాశారో, ఖచ్చితంగా ఎవరికీ తెలీదు. యిప్పుడు మాత్రం - ప్రతి మనిషి జీవితంలో జరిగే  అనూహ్య సంఘటనలన్నీ - మర్ఫీ సూత్రాల్లోకి చేరిపోతున్నాయి. యిప్ఫుడవి వేల సంఖ్యలో వున్నాయి. మీరు కూడా, వాటికి - మరిన్ని సూత్రాలు చేరుస్తూ పోవచ్చు. అప్పుడు మీరూ మర్ఫీయే!

మర్ఫీ సూత్రాలు యిలా వుంటాయి :

  1. ఈ ప్రపంచంలో, ఏదీ  - ఎప్పుడూ చెడిపోకుండా, ఎప్పుడూ వొకే లాగా వుండేలా - చెయ్య బడ లేదు. కాబట్టి - ప్రతి వొక్కటీ - ఎప్పుడో వొకప్పుడు - చెడిపోతుంది.
  2. ఏదైతే యిలా చెడి పోగలదో - అది మీరు ఎదురు చూడనప్పుడు చెడిపోతుంది.
  3. ఏదైతే తప్పుగా జరగవచ్చో - అది మీరు ఎదురు చూడనప్పుడు తప్పుగా జరుగుతుంది.
  4. యిలా జరిగేది - మీకు   కష్టమూ, నష్టమూ, పరవు నష్టమూ లాంటివి (చాలా ఎక్కువగా) కలిగే సమయంలో - జరుగుతుంది .
  5. యిటువంటి సంఘటనలు - మీ తప్పు గా,  అందరికీ  కనిపించ గలిగే సమయాల్లో - జరుగుతుంది.(విరిగే స్థితిలో వున్నది, మీరు తాకినప్పుడు విరుగుతుంది)
  6. మీ చుట్టూ, చాలా విషయాలు, వస్తువులు, సంఘటనలు..చెడిపోయే ఆవకాశం వున్నవి - వాటిలో, మీకు బాగా నష్టం కలిగించేది, మీరు ఎదురు చూడని సమయం లో - చెడి పోతుంది.
  7. మీరు (ఇది యిప్పట్లో ) చెడి  పోదు అనుకునేది, మీరు - అస్సలు ఎదురు చూడని సమయంలో - చెడి పోతుంది.
  8. మీరు ఏదైనా   విషయం (వస్తువులు, సంఘటనలు...) - ఏదో నాలుగు రకా ల పరిస్థితులలో  చెడి పోవచ్చు - అని క్షుణ్ణంగా తెలుసుకొని, వాటి పరిష్కారాలు కూడా సిద్ధంగా  వుంచుకుంటే -  మీకు తెలియని, ఐదో రకంగా చెడిపోవడానికి సిద్ధం అవుతుంది.
  9. ఏ విషయమైనా - మీ పర్యవేక్షణలో లేకుండా వుంటే -   బాగున్నది కూడా త్వరగా చెడి పోతుంది. అలా చెడి పోయింది, త్వరగా కుళ్ళి పోతుంది. అలా కుళ్ళి పోయింది -మీరు భరించ లేకుండా అయి పోతుంది.అప్పుడే - మీకు తెలిసి వస్తుంది.
  10.  మీ పర్యవేక్షణలో వున్నది - చెడి పోదన్న గ్యారంటీ ఏమీ లేదు.
  11. ఏది త్వరగా చెడి పోగలదో - అది  - అన్నిటి కంటే క్రింద - మీ కంటికి కనిపించ కుండా వుంటుంది.
  12. మీ కంటికి కనిపించ  కుండా వున్నది - మీకు తెలియ కుండా, తను చెడడమే కాకుండా - బాగున్న వాటిని కూడా చెడపడానికి - ప్రయత్నం చేస్తుంది.
  13. ఈ రోజు చాలా మంచి రోజు. ఎందుకంటే , రేపు చాలా విషయాలు చెడిపోతాయి. రేపు చెడ్డ రోజు. కాబట్టి, ఈ రోజు మంచి రోజు. ఈ రోజు నవ్వండి....ఎలాగైనా...
  14. మీరు మాత్రం నవ్వ లేని సమయంలో - ఎదురుగా వున్న వారు చాలా మంది  నవ్వుతూ కనిపిస్తారు.
  15. చాలా సమస్యలలో - మీకు, అసలు సమస్య ఏమిటో తెలీదు. సమస్య తెలిసేటప్పటికి - సమాధానం పనికి రాకుండా పోతుంది.
  16. మీరు, చాలా రహస్యంగా వుంచాలనుకునే విషయాలు,  ఎవరికి చెప్పకూడదో - వారి ముందే, పదే పదే జ్ఞాపకం వస్తుంది. ఎవరికో, వొకరికి చెప్పకుండా మీరు వుండడం చాలా కష్టం అని అనిపిస్తుంది.
  17. అందు వలన - మీరు, వేరే ఏదేదో విషయాలు, అసంబద్ధంగా వాళ్లకు చెబుతారు.
  18. మీరేదో దాస్తున్నట్టు - వారికి తెలిసిపోతుంది. 
  19. ఏ సమస్యకైనా - మనం ఇచ్చే పరిష్కారాలవలన - వున్న సమస్య ఎంత పోతుందో కాని - కొన్ని క్రొత్త  సమస్యలు రానే  వస్తాయి.
  20. మీకు ఈ రోజు ఏ సమస్యా రాక పోతే - రేపు రెండు సమస్యలు వస్తాయి.
  21. మీకు బాగు లేకున్న రోజునే - మీ భార్య (లేదా భర్త) మిమ్మల్ని ఎక్కువగా విసిగిస్తారు.
  22. నెలాఖరునే - ఖర్చులెక్కు వొస్తాయి. 
  23. నెలాఖరునే -  బంధువు లెక్కువగా వొస్తారు.
  24. మీరు చెట్టు క్రింద కూర్చున్న చోటికి పైనే - కాకి కూర్చుంటుంది. (రెట్ట వేస్తుంది)
  25. మీకు ముఖ్యంగా కావలసిన వస్తువును, మీరు పెట్టిన చోట తప్ప - మిగతా అన్ని చోట్లలో వెదుకుతారు. 
  26. మీ కళ్ళద్దాలు కనిపించక పోతే - ఇల్లంతా వెదుకుతారు . కడపట, మీ కళ్ళ ముందే చూస్తారు.
  27. మీ పెన్ దొరక్క పోతే - కొత్తడి కొనండి. తరువాత పాతది దొరుకుతుంది.
  28. మీరు నుంచున్న క్యూ కు, ప్రక్క నున్న క్యూ,   శీఘ్రంగా ముందుకు వెళుతూ వుంటుంది . 
  29. మూర్ఖుడితో  - వాదులాడకండి.   "చూసే వారికి" మీరెలా కనిపిస్తారో, ఎందుకో - మీకు మాత్రం అర్థం కాదు.
  30. మీ నాన్నకు జవాబు తెలీక పోతే - మిమ్మల్ని కొడతారు (చిన్న పిల్లలకు తెలిసిన సూత్రము)
  31. బాత్ రూమ్ లో ఎవరు కాలు జారి పడ్డా - అంతకు ముందు  స్నానం చేసి,  సోపునీళ్ళు బాత్ రూమంతా పోసిన వారు - మీరే అని - అందరూ అనుకుంటారు.
  32. మీరు పడితే  మాత్రం - "అంత మాత్రం చూసుకుని పోరా, ఎవరైనా" - అని అంటారు.
  33. మీరు బస్సు కోసం క్యూలో నిలబడితే - టికెట్లు మీ ముందు వారి వరకు వచ్చి - బస్సు నిండి పోతుంది.
  34. మరో బస్సు రెండు గంటలు లేటుగా రావచ్చు.
  35. మీ బాసు పైన మీకు చాలా సార్లు కోపం వస్తుంది. కానీ  ప్రయోజనం లేదు. అందు వలన - మీరు ఎవరెవరితోనో - కొట్లాడుతారు. అయినా కోపం తగ్గదు.   ఎలా తగ్గుతుందో మీకు తెలీదు.
  36. మీరు భద్రంగా, రహస్యంగా దాచి పెట్టిన వస్తువులు ఎంత వెదికినా - మీకు కనిపించదు. 
  37. ఏ.టీ.యం - లో మీ డెబిట్ కార్డు ను పెట్టి మీ పిన్ నంబరు కొడితే - రాంగు నంబర్ అంటుంది . మీకు తెలుసు - మీరు పిన్ నంబర్ కరెక్టు గానే కొట్టారని. వేరే మార్గం లేక బయటికి వచ్చేస్తారు. వచ్చేసాక గుర్తు వస్తుంది - మీరు పెట్టిన డెబిట్ కార్డు తప్పని.
  38. మీ ముఖ్యమైన పరీక్ష రోజునే - మీకు యిష్టమైన  మంచి సినిమా వస్తుంది .చూస్తారు. లేదా, అర్ధ మనసుతో చదువుతారు.  అలా కాకపోతే - ఆ రోజే క్రికెట్ మాచ్, టెండుల్కర్ బాగా ఆడుతుంటాడు. ఫలితం - మీకు పది శాతం మార్కులు తగ్గుతుంది.
  39. మీకు నచ్చనివన్నీ - మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. నచ్చినవి రావు. లేదా - మీ ఇంటరెస్టు పూర్తిగా పోయిన తర్వాత వస్తుంది.
  40. మీకు నచ్చిన సినిమాకు మీ ఆవిడ రాదు. ఆమెకు నచ్చే సినిమా మీకు పరమ బోరు.
  41. మీరు ఏదీ అనుభవించే లోగానే - మీకు వయస్సు అయిపోతుంది.  లేదా - అయిపోయినట్టు అనిపిస్తుంది.
  42. మీరు చేసే గొప్ప పనులు, తెలివి గల పనులు - ఎవరూ చూడరు. మీరెప్పుడైనా - ఏ వొక్క మూర్ఖపు పని చేసినా - అది అందరూ చూస్తారు. మీరు చేసేవన్నీ అలాంటివే -అని అనుకొంటారు లేదా అంటారు.
  43. నవ వచ్చే చోట గోక కుండా - వుండలేరు. గోకిన చోటంతా నవలు పెద్దదవుతుంది. కొత్త చోట్లకూ ప్రాకుతుంది.
  44. మీకు జరిగే మంచి - చాలా త్వరగా వెళ్లి పోతుంది. చెడ్డ మాత్రం - మీరు వద్దు మొర్రో అన్నా పోదు.
  45. ఉన్నట్టుండి -  యింటి నిండా చీమలు కనిపిస్తాయి. కానీ -ఈ చీమలు ఎక్కడ పుట్టలు పెట్టాయో ముందుగా కనుక్కోవడం మాత్రం చాలా కష్టం. 
  46. టీ.వీ. యాడ్ చూసి బ్యూటీ క్రీమ్ రాస్తే - మీకు మాత్రం మొహమంతా గుల్లలు వస్తాయి. 
  47. మీరు కట్టిన చీర కంటే - మీ పక్కింటావిడ కట్టిన చీర ఎప్ఫుడూ బాగుంటుంది.
  48. మీరు కొన్న చీర కంటే - మీరు షాపులో - వద్దని వదిలేసిన చీర బాగుంటుంది. అయినా,యిది - యింటికి వచ్చిన తర్వాతే - మీకు బాగా అర్థమవుతుంది. పూర్తిగా తెలిసి పోతుంది. షాపులో చెప్పనందుకు మీ వారిపై కోపం వస్తుంది.
  49. మీ ఆవిడ మాటలు (చాలా) - మీకు అర్థమయి చావవు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - అని తెలిసినా - ఆ అర్థాలు యేవో మీకు తెలియదు. మీ భర్తకు మీరు ఏం చెప్పినా సరిగ్గా అర్థం కాదు.
  50. ప్రపంచంలో - మీరు ఏం చేసినా, ఎంత సంపాదించినా -మీ కంటే - మీ ప్రక్కనింటాయన  సుఖంగా వున్నట్టు - మీకు  అనిపిస్తుంది. మీ ప్రక్కనింటావిడ సుఖంగా వున్నట్టు - మీ యావిడకూ అనిపిస్తుంది. 
ఇదండీ మర్ఫీ సూత్రాల కథ. యిలా మనం ఎన్నైనా, రాసుకుంటూ పోవచ్చు. మీ - ఇలాంటి అనుభవాలన్నీ క్రోడీకరించి -మొదట వొక డయిరీ రాసి - మీ మనమడికో, మనమరాలికో మాత్రం చూపించేలా - విల్లు రాసేసుకోండి . 
 
యిలా - మీ జీవితంలో చాలా సార్లు జరిగిందా? జరిగే వుంటుంది. అందరి జీవితాల్లో జరుగుతూ వుంటుంది.

దీనికి వొక కారణం - మనం మంచి జరిగేది గుర్తు పెట్టుకోం.  చెడు జరిగేది మర్చిపోం.

పది సంవత్సరాల తర్వాత కూడా - ఎప్పుడో జరిగిన చెడు గుర్తుంటుంది. మంచి వొక వారం తర్వాత కూడా గుర్తుండదు. యిందులో -ఆడవారికీ, మగ వారికీ కాస్త తేడా మనం గమనించొచ్చు. దాన్ని గురించి మరోసారి చూద్దాం. తెలిసుంటే - మీరే చెప్పండి.

మన అందరి జీవితాల్లో మంచీ - చెడూ -రెండూ - జరుగుతాయి. కొందరి జీవితాల్లో - మంచి ఎక్కువగా, చెడు తక్కువగా జరగొచ్చు. మరి కొందరి జీవితాల్లో - మంచి తక్కువగా, చెడు ఎక్కువగా జరగొచ్చు.

ఎందుకిలా? మీ జీవితం ముందు ముందు ఎలా వుండ బోతుంది ? మీ జీవితంలో, మంచి ఎక్కువగా జరగాలంటే మీరేం చెయ్యాలి?

యివన్నీ, కారణాల తో సహా - శ్రీకృష్ణుల వారు తన గీతోపదేశం లో  విశదం గానే చెప్పారు. అది మరో వ్యాసంలో.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

21, సెప్టెంబర్ 2011, బుధవారం

మీకు ఎవరంటే చాలా, చాలా యిష్టం? ఎందుకు? ( మీ స్నేహాలు - సంబంధాలు - సంతోషాలు)

స్నేహాలు - సంబంధాలు - సంతోషాలు 

మీకు ఎవరంటే చాలా, చాలా యిష్టం?

ఈ ప్రశ్నకు - చాలా మంది , ఆలోచించ కుండానే - నాకు సల్మాన్ ఖాన్ అంటే చాలా యిష్టం, మహేష్ అంటే చాలా యిష్టం, టెండుల్కర్  అంటే చాలా యిష్టం - అని, యిలా ఏదో వొకటి చెబుతారు.

ఎందుకు?  

నిజానికి - మనం ఎవరిని, ఎక్కువగా, ఎందుకు,  యిష్ట పడతాము?

ఎవరైతే మనకు ఎక్కువ    సంతోషాన్ని కలుగ జేస్తారో - వారంటే   - మనం ఎక్కువ ఇష్ట పడతాము. వారి దగ్గరే వుండాలనుకుంటాము . వారు కలుగ జేసే ఆనందం - ఎక్కువగా  పొందాలనుకుంటాము.

మరి - ఏ కారణం వలన అయినా గానీ,  వారి దగ్గర, మనకు కొన్నాళ్ళు సంతోషం దొరక లేదనుకోండి. వారిపై వున్న యిష్టం తగ్గి పోతుంది.

ఈ మధ్య కాలంలో మరెవరైనా, మనకు సంతోషం కలిగిస్తే - వారిపై యిష్టం పెరుగుతుంది.

మొత్తానికి - సంతోషం కలిగించే వారిపై -యిష్టం.  కలిగించని వారిపై యిష్టం లేకపోవడం - జీవితమంతా జరుగుతూ వుంటుంది.

అలాగే - మనకు, ఎవరిపై అనిష్టం? ఎవరిపై ద్వేషం?

ఎవరు - మనలో - అసంతోషాన్ని కలుగజెస్తారో -  వారిపై అనిష్టం.

ఎవరు మనకు కష్టం, దుహ్ఖం కలుగజేస్తారో - వారిపై ద్వేషం.

బాల్యంలో - మీకు బొమ్మలంటే యిష్టం.కాబట్టి, బొమ్మలు కొనిచ్చే వారంటే యిష్టం.

చిన్న పిల్లల్లాగా మీతో ఆడుకునే వారంటే యిష్టం. మీ అమ్మో,నాన్నో, తాతో - మీతో ఆడుకుంటే - వారంటే - యిష్టం.

మీతో ఆడుకునే -మీ వయసు పిల్లలంటే - మీకు చాలా యిష్టం.

అమ్మ మీకు  అన్నీ చేస్తుంది ;అమ్మ లేకపోతే - మీరు ఏమీ చేయలేరు - కాబట్టి , అమ్మంటే యిష్టం.
తరువాత, స్కూలు కెడతారు.

స్కూల్లో - మీతో, బాగా మాట్లాడే పిల్లలు, ఆడే పిల్లలు, మీతో అన్నే పంచుకునే పిల్లలు - వీరంటే - మీకు బాగా యిష్టం. చాలా మందికి, ఈ బాల్య స్నేహాలు కడపటి వరకు తియ్యటి జ్ఞాపకాలుగా  మిగిలిపోతాయి. కొంత మందికి - కడపటి వరకు ఈ స్నేహాలు నిజాలుగానూ వుంటాయి. యివి స్వార్థం లేని స్నేహాలు.మనసు లోతుల్లో నుండి వచ్చే స్నేహాలు. ఎంతటి చెడ్డ వాళ్లైనా - ఈ బాల్య స్నేహితులతో - చాలా మంచి వాళ్ళుగా వుండడం మనం చూడొచ్చు. 
అలాగే - మీరంటే - వాత్సల్యం తో - మీకు బాగా చదువు రావాలని శ్రమించే - మీ వుపాధ్యాయులంటే  కూడా - మీకు యిష్టం పెరుగుతుంది.

అక్కడినుండి - మీరు కాలేజీలకు వెడతారు. 

కాలేజీల్లో -  మీరు కట్టే స్నేహాలు, బాల్య స్నేహాలంత రుచిగా వుండవు. వాటిలో, అంత లోతైన స్నేహం కుదరడం కొంచం కష్టం.  బాల్య స్నేహాల్లో లేని  పోటీ మనస్తత్వం యిక్కడ వుంటుంది. అయినా - ఇక్కడా, మంచి స్నేహాలు కుదిరే చాన్సు  బాగా వుంది. 

వయసు వస్తే - 

కాలేజీ కి మీరు వచ్చిన  వయస్సులో - మీ లోని - హార్మోనుల్లో - చాలా, చాలా మార్పులు వస్తాయి. వీటి ప్రభావం - మీపై - చాలా ఎక్కువగా వుంటుంది. మగ పిల్లలకు ఆడ పిల్లల తోను,  ఆడ పిల్లలకు మగ పిల్లలతోను స్నేహం చేయాలనే సరదా ఎక్కువగా వుంటుంది. చూడగానే ప్రేమలో పడ్డాను - అంటూ వుంటారు, ఈ సమయంలో. యవ్వనంలో వున్న, దగ్గరగా వున్న ఎవరిపైనన్నా - ఈ ఆకర్షణ వస్తుంది. అది స్నేహంగా మారొచ్చు. అయితే - ఈ స్నేహాల్లో - చాలా వరకు, మీ మనసుకు అర్థం కాని నిబంధనలు వుంటూ  వుంటాయి.  మీ బాయ్ ఫ్రెండు మరొక అమ్మాయితో మాట్లాడితే - మీరు సహించ లేరు. మీ గర్ల్ ఫ్రెండు మరొక అబ్బాయితో  మాట్లాడితే - మీరు అసూయతో, కాలిపోతారు. 

ఈ విషయాలపై పోట్లాడుకోవడం జరుగుతుంది. తరువాత - వోహో, ప్రేమంటే - యిదే, అనుకుంటారు. అనుకున్న తరువాత - ప్రేమ పురాణం మొదలవుతుంది. అక్కడి నుండి, యింటిలో వారు - అమ్మా, నాన్న , అందరూ నచ్చకపోవడమూ, లోకంలో వొక్కరే మీకు నచ్చడమూ - వారు లేకపోతే - ప్రపంచంలో మరేమీ లేదనుకోవడమూ -  యివన్నీ జరుగుతాయి.

ఈ సమయంలో - మీలో - చెలరేగుతున్న హార్మోనులకు - అమ్మా, నాన్నా, తాతా - లాంటి వారు - యిప్పుడు సంతోషాన్ని యివ్వలేరు. వొక్కరే యివ్వగలరు. మీ బాయ్ ఫ్రెండు లేదా మీ గర్ల్ ఫ్రెండు.

వారికీ అంతే. 24  గంటలూ వీరికి వారితోను, వారికి వీరితోను మాట్లాడాలనిపిస్తుంది . జాతీ, మతం, సామాజిక స్థితి - ఇవేవీ -  మీ హార్మోనులకు అడ్డు రావు. అంటే ఈ వయస్సులోని ప్రేమలకు అడ్డు రావు.
 
మనకు తెలుసు. కథ కంచికీ వెళ్ళొచ్చు. పెళ్ళికీ వెళ్ళొచ్చు. తల్లిదండ్రులు మొత్తుకుంటారు . చదవమంటే మీరు చేసే పని యిదా - అని. వారి మాటలు మీకు వినపడదు. రుచించదు. వారు రాక్షసుల లాగా కనిపిస్తారు.

వారి బాధ వారిది. మీ గోల మీది. 

సరే. ప్రేమలలో - ఎప్పుడో పెళ్లి మాట రావచ్చు. అప్పుడు, కొన్ని చిక్కులు   కనిపిస్తాయి. అవి యిక్కడ చెప్పడం కుదరదు. వాటి మూలంగా - మీ ప్రేమ విఫలం కావచ్చు. 

అప్పుడు - మరొకరితో పెళ్లి కావచ్చు. వారితో మీరు అడ్జస్టు అవ్వొచ్చు. కాక పోవచ్చు.

యివన్నీ    కాక -  ఈ మధ్య కాలంలో - చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు - వొక్కరితో కాక,  కొంత మందితో స్నేహాలు చేయడం -తరువాత - వదిలేయడం కూడా  జరుగుతోంది.

యివన్నీ - హార్మోనుల ప్రభావమే అంటే - ఆ....కానే కాదు. మాది అమర ప్రేమ అని అంటారు.

సరే. ఎప్పుడో - పెళ్లి జరగిపోతుంది.

పెళ్లి తరువాత - యిద్దరూ - హాయిగా వుండచ్చు. వుండక పోవచ్చు.

ప్రేమికులుగా వుండి - పెళ్లి చేసుకున్న వారు, ముందు వొకరి కొకరు తెలియ కుండా  వుండి పెళ్లి చేసుకున్న వారి కంటే -  ఎక్కువ హాయిగా వున్నారా - అంటే - అలాంటి  దాఖలాలేమీ లేవు.

ప్రేమ వివాహాలే నూరు శాతం వున్న అమెరికాలో - యాభై శాతం పైగా - రెండేళ్ళ లోపు   విడాకులు తీసుకుంటున్నారు.

విడాకులకు ముందు  - వారి మధ్య జరిగే రామ రావణ యుద్ధాలు, మనస్పర్థలు - విడాకుల తర్వాత వారి జీవితాలు అల్ల కల్లోలం కావడం, మళ్ళీ వారు మరో పెళ్లి కి సిద్ధం అయ్యేవరకు వారి జేవితాలలో వుండే  నరక యాతన  - వీరేనా - ఐ లవ్ యూ - అని గంటకో సారి అన్న వారు అని అనిపిస్తుంది.   యిప్పుడు మన దేశంలో కూడా -మూడో  పెళ్లి వారు - నాలుగో పెళ్లి వారితో పెళ్ళికి సిద్ధం కావడం ప్రారంభమయింది. యిది - ప్రేమ పురాణం. కాక పోతే - అమెరికాలో కూడా -నలభై శాతానికి పైగా - బాగానే వున్నారు. 

ప్రేమ లేని పెళ్ళిళ్ళు - ఆమరణాంతం  - సాగిపోవడం మన దేశం లో చూస్తూనే ఉన్నాము.

ఎందుకు - ప్రేమలో వొకరిని విడిచి వొకరు వుండలేని వాళ్ళు -  పెళ్ళైన తరువాత వొకరితో వొకరు వుండ లేక పోతూ వున్నారు?  దీనికి కారణం ప్రేమకు అర్థం తెలీక పోవడమే.

ఎవరైనా - మనతో వుండాలని ఎందుకు ఆరాటపడాలి?  వారికి   - మనపై ఎందుకు యిష్టం వుండాలి?

వారికి - మన వలన సంతోషం  కలుగుతూ వుంటే - వారిలో, మనతో వుండాలనే కోరిక కలుగుతూ వుంటుంది.

కాని చాలా ప్రేమ వివాహాల్లో - జరిగేది ఏమిటంటే -  "నాకు వారి వలన సంతోషం కావాలి" అనుకుంటామే గాని,  "నేను వారికి సంతోషం యివ్వాలి" అని అనుకోం. 

నాకు కావాలి, నాకు కావాలి - అన్నది విడిచి పెట్టి, నేను యివ్వాలి, నేను యివ్వాలి - అనుకునే చోట - ఎదుటి వారికి మనతో వుండాలనే ఆకాంక్ష  బలంగా వుంటుంది.

అంటే - మన వారు మనకు చేయాలనే తపన కంటే, మనం మన వారికి చేయాలి అన్న తపన - రెండు వైపులా ఎక్కడ వుంటుందో, అక్కడ, స్నేహం, ప్రేమ రెండూ బలంగా వుంటుంది.

స్నేహాల్లోనూ యింతే. ప్రేమల్లోనూ యింతే. పెళ్ళిళ్ళలోనూ యింతే. యిది తెలుసుకున్న జంటలలో - ప్రేమ వివాహాలైనా సరే, పెద్దలు చేసిన పెళ్లినా సరే - సంతోషంగా వుండే అవకాశాలు ఎక్కువగా వుంటుంది.

ప్రేమ ముందుగా లేని పెళ్ళిళ్ళలో, చాలా జంటలలో, పెళ్లి  తరువాత పెరిగే స్నేహం చాలా బలంగా  వుంటుంది.వొకరికొకరు చేసే సహాయం - దాని వలన కృతజ్ఞతా భావం, ప్రేమ అన్నీ పెరుగుతాయి. 

నేను ఎందుకు చేయాలి -అని ఏ వొక్కరు అనుకున్నా - ఆ జంటలో- యిద్దరిలోనూ - సంతోషం తగ్గిపోతుంది.

భార్యాభర్తల మధ్య - వొకరికొకరు యిచ్చే సంతోషం పెరుగుతూ పోవాలి. వయస్సు అయ్యే కొద్దీ - ఈ భావం యింకా ఎక్కువ కావాలి. యిది ఎంత వరకు? కడ వరకు.

ఉద్యోగాల మాట : మరి ఉద్యోగుల సంగతి ఏమిటి? సహా ఉద్యోగుల పట్ల - స్నేహ భావం వుండాలి. నిజానికి - కొంత మంది ఉద్యోగులకు నిజమైన, దీర్ఘ కాల స్నేహాలు, మంచి స్నేహాలు  సహ ఉద్యోగుల్లో దొరకొచ్చు.  మంచి స్నేహితులు దొరకడం కష్టం. దొరికితే - మీరు వారికి మంచి స్నేహితులుగా మారిపోండి. 

మన సంతోషానికి -  కొన్ని అమూల్యమైన మూల సూత్రాలున్నాయి.

మీకు మంచి స్నేహితుడు కావాలంటే - మీరు వారికి మంచి స్నేహితుడుగా  మొదట మారండి.

మీకు మంచి భర్త కావాలంటే - మీరు   వారికి మంచి భార్యగా మొదట మారండి.

మీకు మంచి భార్య కావాలంటే - మీరు వారికి మంచి భర్తగా మొదట  మారండి.

మంచి తండ్రి కావాలంటే - మంచి కొడుకు గానూ, మంచి కొడుకు కావాలంటే - మంచి తండ్రి గానూ,  మంచి కోడలు కావాలంటే - మంచి అత్త గాను,    మంచి అత్త కావాలంటే - మంచి కోడలు గానూ - మొదట మీరు మారండి.

మీరు మొదట వారికి సంతోష కారకులు గా మారండి. మీరు సంతోషం యివ్వడం ప్రారంభించండి.అప్పుడు - మీకూ సంతోషం పూర్తిగా, మీరు అనుకున్న దానికంటే  ఎక్కువగా, లభిస్తుంది.

కానీ- సంతోషం ఎలా యివ్వడం? ఎలా?

మనిషికి మహా సంతోషం కలిగించేది - మాట.   

మాట సంతోషమూ కలిగించగలదు. దుహ్ఖమూ కలిగించగలదు.ద్వేషమూ, స్నేహమూ, ప్రేమా, యిష్టమూ -అనిష్టమూ - అన్నీ కలిగించ గలిగేది మాటే. 

దేవుడికి కూడా మాటంటే చాలా యిష్టము.  అందుకే మాటే - మంత్రము  అన్నారు. దేవుడికి శత నామార్చన , సహస్ర  నామార్చన చేస్తాం గదా? మనుషులకు కూడా కొద్దో గొప్పో - పొగడ్త, మంచి మాట కావాలి.

మరి - మంత్రాలలాంటి  మాటలతో - మీకు యిష్టమైన వారికి - అప్పుడప్పుడూ సంతోషం కలిగించండి, చూద్దాం.

దేవుడికి యిన్ని ఉపచారాలు ఎందుకు చేస్తాము?  నైవేద్యము, గంధం, స్నానం, పానీయం, తాంబూలం లాంటి -  వుపచారాలెన్నో వున్నాయి కదా. 

అవే మనుషులకూ - కొద్ది పాటి మార్పులతో కావాలి.భార్య భర్తకూ, భర్త భార్యకూ, చేసే స్నేహోపచారాలు - ఎన్నో రకాలుగా చెయ్యొచ్చు. చెయ్యాలి.

సరే.  "అవసరం వచ్చినప్పుడు ఉపయోగ పడని స్నేహితుడు" - మిగతా సమయాల్లో ఏం మాట్లాడినా లాభం లేదు. 

అక్కరకు రాని చుట్టము....మోహరమున తానెక్కిన పారని గుఱ్ఱము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ - అన్నారు. 

అలాగా- మీ భర్తో,భార్యో, తండ్రో ,తల్లో, స్నేహితుడో - ఏదో ఆపదలో ఉన్నారనుకోండి . అప్పుడు - వెంటనే, మీరు స్పందించాలి. మీ చేతనైన సహాయం వెంటనే చేసెయ్యాలి.

యిది చాలా ముఖ్యం.

ఉదాహరణకు - మీ భర్తకో, భార్యకో - ఏదో రోగాలు వచ్చాయనుకోండి. ధైర్యం చెప్పడము, వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళడము - హృదయ పూర్వకంగా ( మొక్కుబడిగా కాకుండా) చెయ్యాలి. సమయానికి చేసెయ్యాలి. 

నా వారు - నాకున్నారనే ధైర్యం మీరు కలుగ జెయ్యాలి.   

ధర్మేచ, అర్థేచ , కామేచ -నాతి చరామి - అని పాటించే భర్త పై భార్యకు ప్రేమ - సంతోషం లేకుండా ఎలా వుంటుంది?
అలాగే - కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా - అని తోడుండే   భార్యపై - భర్తకు ప్రేమ, సంతోషం లేకుండా ఎలా వుంటుంది.

ఈ సంబంధాన్ని గురించి కాస్త ఎక్కువగానే చెప్పాల్సి ఉంది. ఎందుకంటే - 

ఈశ్వరుడిని కూడా అర్ధ నారీశ్వరుడనే అన్నారు. శివుడే కాదు. మనుషులూ అంతే. పరిపూర్ణత్వానికి అర్థం ఈ బంధమే. వీరు లేక వారూ, వారు లేక వీరూ పరిపూర్ణులుగా వుండలేరు. యిద్దరిలో ఏ వొక్కరిలో నైనా అహంకారం చోటు చేసుకుంటే - యిద్దరికీ నష్టమే.

తరువాత -

మన సంస్కృతిలో - మాతృదేవోభవ. పితృదేవోభవ. ఆచార్య దేవోభవ. అతిథి దేవో భవ - అన్నారు. వీరిని దేవుడి లాగా చూసుకోవాలి. 

అలాగే - యింటికొచ్చిన కోడలు  - లక్ష్మీ దేవి ప్రతి రూపం అన్నారు.  జామాత స్వయం విష్ణుః  అన్నారు. ఈ సంబంధాలు యిలా వుండాలి. ఈ రోజుల్లో అత్త గారు - కొత్త కోడలు సంబంధాలు కొన్ని కొన్ని ఇళ్ళలో చాలా బాధాకరంగా ఉంది. అత్తగారు మంచిగా వుంటే - కోడలు మంచిగా లేక పోవడము, కోడలు మంచిగా వుంటే - అత్తగారు మంచిగా లేక పోవడము -  వొకరితో వొకరు వుండలేక పోవడము జరుగుతూ ఉంది. వారిద్దరూ - తమ తమ తప్పులు గ్రహించాలి. యిద్దరూ - సఖ్యంగా వున్న చోట - గృహం స్వర్గంగా వుండడం చూడొచ్చు.

సరే - సంతోషం  సంబంధాల్లో నేనా - మనం చేసే ప్రతి పని లోనూ వుంటుంది.

మనిషికి సంతోషం కలిగించే పనులు ఎన్నో వున్నాయి.

యింతకు ముందు మరో వ్యాసంలో చెప్పినట్టు - మీలో సృజనాత్మకత వుంటే - సంతోషం పెరుగుతుంది. మీకే కాదు. అందరికీ. 

అలా కాకుండా - విమర్శనాత్మకత - అందులోనూ, నకారాత్మక విమర్శనాత్మకత  మీలో ఎక్కువగా వుంటే - మీ చుట్టూ వున్న వారు పారిపోతారు. 

మీలో వున్నసృష్టి కర్తను  వెలుపలికి తీసుకురండి. మీలో వున్న కళా కారుడిని వెలుపలికి తీసుకు రండి.  మీరూ సంతోష పడతారు. మీ చుట్టూ వున్న వారూ సంతోష పడతారు.

జీవితం  యొక్క ధ్యేయం - సంతోషం. అందుకే, ఈ ధ్యేయానికి కల మార్గాలను - యిన్ని కోణాల నుండి  గమనించి చూస్తున్నాము.

సంతోషానికి మూలమైన కొన్ని సంబంధాల గురించి ఈ వ్యాసంలో చర్చించాం.

కానీ - సంతోషం ఎక్కడ వుంటుంది? మీలోనే? అది - పుట్టేది అక్కడే. పెరిగేది అక్కడే. పోయేది అక్కడే.

మరి మీతో - మీకున్న సంబంధం ఎలాంటిది? యిది మరో వ్యాసంలో.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

అంగుళీమాలుడు = బుద్ధుడు = సమైక్యతా వాదం = లంచగొండితనానికి ప్రతిగా పోరాటం = నరేంద్ర మోడీ


బుద్ధుడి కాలంలో  అంగుళీమాలుడు అనే గజ దొంగ వుండే వాడట. వాడు దొంగ మాత్రమే కాదు. 999  మందిని చంపి వారి వేళ్ళను హారంగా తన మెడలో వేసుకు తిరిగే వాడట.

వాడు ఎక్కడో కొండల్లో , కీకారణ్యం మధ్య - వుండే వాడు. వాడి భయంతో అటువైపు ఎవరూ వెళ్ళే వారు కాదు.
      
వొక సారి బుద్ధుడు  అటు వైపుగా వొక గ్రామానికి వెళ్ళ వలసి వచ్చింది.

శిష్యులు, అనుయాయులు అంతా భయపడ్డారు.

అందరూ - బుద్ధుడితో  అటువైపు పోనే పోవద్దని ఎంతగానో చెప్పారు.

కానీ బుద్ధుడు విన లేదు. అంగుళీమాలుడు కొండ పైన వుంటే - నా పనీ అక్కడే - అంటూ బయల్దేరాడు.

శిష్యులు వేరే మార్గం తోచక - బుద్ధుడి వెనుకే - బయల్దేరారు.

కొండ పైన - వొక చోట - దూరం నుండి  అంగుళీమాలుడు - వీరిని చూడనే చూసాడు.

మరి శిష్యులకు  అడుగు ముందుకు పడ లేదు. భయంతో - వున్న చోటనే నిలిచి పోయారు.

కానీ - బుద్ధుడు చిరునవ్వుతో - ముందుకు  సాగాడు.

అంగుళీమాలుడు - బుద్ధుడిని చూసాడు. వాడిలో - ఏదో మార్పు. ఏదో కలవరం.

వెయ్యో వాడిని చంపాలి. కానీ - 

ఇతడిని చూస్తే చాలా మంచివాడి లాగా వున్నాడు. వెయ్యో వాడిగా - యింత మంచి వాడిని - ఎలా చంపడం?

యిదీ అంగుళీమాలుడిలో  - ద్వైధీభావం.

అందుకని దూరం నుండే అరిచాడు - వెనక్కు పారిపో - లేదంటే చస్తావు.... పారిపో - లేదంటే చస్తావు.

బుద్ధుడు ముందుకు పోతూనే వున్నాడు.     అంగుళీమాలుడిని చూసి నవ్వుతూ అరిచాడు.

పారిపోతున్నది నీవే. యిక పారిపోకు. నేను వస్తున్నాను - అని.
అంగుళీమాలుడికి యిది అర్థం కాలేదు. నేను పారిపోతున్నానా? యిక పారిపోకూడదా?  ఏమంటున్నాడు ఇతను?

బుద్ధుడి మొహం లోని ప్రశాంతత - ఏదో ఆకర్షణ - అతడ్ని అక్కడే నిల బెట్టింది. జీవితంలో ఎప్పుడూ అనుభవించని అల్లకల్లోలం అతడి మనసులో.

ఏదో జరగ బోతూ  వుంది తన జీవితంలో. ఏదో  తన దగ్గర లేనిది - ఈ బుద్ధుడి దగ్గర వుంది. అది తనకూ కావాలి. అంత మాత్రం తెలుస్తూ వుంది. 

అయినా - ఏదో భయం. పారిపో. దగ్గర రాకు - అని అరుస్తున్నాడు.

బుద్ధుడూ - నువ్వు పారిపోకు. నేను వస్తున్నాను - అని దగ్గరకు వచ్చేస్తున్నాడు.

కాస్సేపట్లో - యిద్దరూ ముఖాముఖిగా - నిలబడ్డారు.

బుద్ధుడి మొహంలో ప్రశాంతత , చిరునవ్వు.  అంగుళీమాలుడి మనస్సులో - ఏదో కలవరం. ఏదో కావాలి తనకు. ఏదో తెలుస్తో వుంది తనకు.  విధి తన పని తాను చేస్తూ వుంది.

బుద్ధుడు ఏం చెప్పాడో, అంగుళీమాలుడు - ఏం విన్నాడో - శిష్యులకు తెలీదు.  తెలిసిందల్లా - అంగుళీమాలుడు బుద్ధుడి శిష్యుడు గా మారి పోయాడు.

తరువాత - బుద్ధుడు శిష్యులతో - ఏదో  రాజ్యానికి వెడతాడు. అక్కడ - శిష్యులందరూ భిక్షాటనకు వెడతారు.   అంగుళీమాలుడు కూడా.

రాజ్యంలో అందరూ చూసారు.   అంగుళీమాలుడు - అంటే - అందరికీ భయం.వణుకు.

అంగుళీమాలుడిపై - రాళ్ళు విసిరారు. అంగుళీమాలుడిలో యిప్పుడు భయం లేదు. ద్వేషం లేదు. భవతి బిక్షాం దేహి  - అంటూ , రాళ్ళ దెబ్బలు తింటూ - ముందుకు సాగాడు. 

యిప్పుడు  అంగుళీమాలుడిలో - గజ దొంగ లేదు.హంతకుడు లేదు. అది ఎప్పటి మాటో.

యిప్పుడు వున్నది - వొక మహర్షి. వొక యోగి. 

కానీ - ప్రజలకు అది తెలీదు. రాళ్ళు విసురుతూనే వున్నారు. రాళ్ళ దెబ్బలకు అంగుళీమాలుడి శరీరం వాలి పోయింది.  శిష్యులు పరుగెత్తి వెళ్లి - బుద్ధుడికి చెప్పారు. బుద్ధుడు వచ్చాడు.

అంగుళీమాలుడి శిరస్సును  - తన వొడిలో పెట్టుకున్నాడు. బాధగా వుందా - అని అడిగాడు. 

అంగుళీమాలుడు - లేదన్నాడు. నమస్కారం చేసాడు. బుద్ధుడిని చూస్తూ, బుద్ధుడి వొడిలో ప్రాణాలు వదిలాడు.

కొన్ని వేల, లక్షల యేండ్ల క్రితం వేట గాడుగా, దొంగగా వున్న - వాల్మీకి కూడా యిలాగే -  మహర్షి గా మారాడు - నారద మహర్షి మాటలతో.

రామాయణం రాసింది - దొంగగా వున్న వాల్మీకా? మహర్షి వాల్మీకా?

బుద్ధుడి వొడిలో- శిరస్సు వాల్చింది - దొంగ గా వున్న అంగుళీమాలుడా ? మహర్షి ఐన  అంగుళీమాలుడా ? 

యిదంతా ఎందుకంటే - మనుషులు మారుతారు. వారిని మారనివ్వాలి. మారే పరిస్థితులు కల్పించాలి. యిరవై ఏళ్ళ క్రితం చూసిన వాడు యింకా గజ దొంగైన  అంగుళీమాలుడు గానో, వాల్మీకి గానో - వున్నాడని అనుకోవాల్సిన పని లేదు.  వారిని మారనివ్వాలి.

మరి - ఈ రోజు మాట కొద్దాం.

ఈ రోజు - లంచ గొండులుగా వున్న వారంతా మారుతారా? మారరా? అస్సలు మారరనుకుంటే  -  ఈ నిరాహార దీక్షలు, ఈ లోక్ పాల్ లు - యివన్నీ ఎందుకు? లోక్ పాల్ వ్యవస్థనే - లంచ గొండి వ్యవస్థగా మారుతుందా?  చెప్పలేం. కానీ -

మనం మారాలి. మారి తీరాలి.  మన మానవ విలువలు మారితే - లంచగొండి తనం పోతుంది. లోక్ పాల్ వున్నా, లేకున్నా పోతుంది. మనం మారక పోతే - యిప్పటి పోలీసు వ్యవస్థ లాగా - అదీ వొక ప్రమాదంగా మారొచ్చు. అయినా - లోక్ పాల్ వ్యవస్థ కావాలి. ఎవడో వొకడు - టీ. ఎన్.  శేషన్ - లాగా వచ్చి - వ్యవస్థను ప్రక్షాళనం చెయ్యొచ్చు. అదండీ మన ఆశ.

నిజానికి - మనం - మన విద్యా వ్యవస్థలోనే - మనుషులను - మహనీయులుగా మార్చాలి. వూరికే - ఫిజిక్సు, కెమిస్ట్రీ, లెక్కలు, బయాలజీ తెలుసుకుంటే - మర మనుషులుగా మారిపోతాం.  మానవులుగా మారాలి. కొంత మందైనా - మహనీయులుగా మారాలి.  అందుకు అధ్యాపకులే కృషి చేయాలి. 

ఈ మధ్య -వొక మంచి ఆలోచన చాలా మంది చెబుతున్నారు. భారతీయ అధ్యాపక సర్వీసు - అని వొక ఉన్నత శ్రేణి సర్వీసు నెలకొల్పాలని. అది - అత్యున్నత ప్రమాణాలు, మంచి జీతాలతో సహా వుండాలని.  యిది - ఎంత త్వరగా వస్తే - దేశం అంత త్వరగా బాగు పడుతుంది. యిది వొక  గొప్ప మౌలికమైన మార్పు గా వుంటుంది. చదివే వారు అందరూ - దీన్ని గురించి తమ అభిప్రాయాలను - ప్రతి వార్తా పత్రికకు - ప్రభుత్వానికి రాస్తే - బాగుంటుంది.

సరే - వొక  కొస మెరుపు- నరేంద్ర మోడీ గారు - సద్భావానా మిషన్ - అని మూడు రోజుల నిరశన వ్రతం  చేస్తున్నారు. వారి పాలన - అద్భుతంగా వుందని - యిది వరలో - చాలా మంది అన్నారు. యిప్పుడు సాక్షాత్తూ అమెరికా కాంగ్రెసు వారే అన్నారు. వారికి నరేంద్ర  మోడీ గారు అస్సలు నచ్చరు. కానీ వారే యిప్పుడు - మోడీ గారి పాలన అద్భుతంగా వుందన్నారు.  

అయినా, 2001 -02 - ఆ మధ్యలో గుజరాత్ లో -  జరిగిన మత కలహాల్లో - రెండు వైపుల వారూ - అల్లర్లు చేసారు. అప్పట్లో - మోడీ గారు - వాటిని అణచడానికి - తగిన కృషి చేయలేదని వారిపై ఆరోపణ.  వుండొచ్చు.

కానీ - యిప్పుడు పదేళ్ళు గడిచాయి. ఈ పదేళ్ళలో - వారు అద్భుతమైన పాలన యిచ్చారు. ఈ పదేళ్ళలో - మత కలహాలు అక్కడ జరగలేదు. మరి మిగతా రాష్ట్రాలన్నింటిలో - జరిగాయి.  మన రాష్ట్రంలో కూడా జరిగాయి. మరి, వీరు, వారిని, పదేళ్ళ క్రితం నాటి మత  కలహాల గురించే గుచ్చడం -గురివింద గింజ తన క్రింద నున్న నలుపు మరిచిపోవడం లాగా వుంది.

డిల్లీ, మహారాష్ట్ర, యు.పీ, ఆంధ్ర లతో సహా - అన్ని రాష్ట్రాలలో జరిగిన, జరుగుతున్న మత కలహాలను వదిలేసి - పదేళ్ళ నాటి కలహాలను - అదీ - గుజరాత్ కలహాలను - దాన్లోనూ - వొకటిని మరిచి పోయి - మరొక్క దాన్ని గురింఛి మాత్రం    ప్రశ్నిస్తూ వుండడం - సబబుగా తోచడం లేదు.

గుజరాత్ లో - అందరినీ - సమైక్య పరుస్తున్నాను - అని అనే వారిని - ఎందుకు నిరుత్సాహ పరచాలి.

మోడీ గారి మంచి పాలనలో - యిదీ వొక భాగంగా - ఎందుకు తీసుకో రాదు. రాజకీయాలు మరెక్కడైనా వుండనీయండి. సమైక్యతా వాదం, లంచగొండితనానికి ప్రతిగా పోరాటం - లాంటి విషయాల్లో - దేశమంతా వొకటి కావాలి. 

విభజించి పాలించే రాజకీయ వాదులు చాలా ఎక్కువగా ఉన్న  మన దేశంలో - వొక్క సమైక్యతా వాది వచ్చినా మంచిదే.


వారికి - గాంధీకి పోలిక లేదు. వారికి అన్నా కు పోలిక లేదు లాంటి - వాదాలు అనవసరం. మనకు సమైక్యత కావాలి. మతవాదం, జాతివాదం వద్దు.   అవి వద్దని గుజరాత్ లో అందరూ అనడం, ముఖ్యంగా బీ.జే.పీ. వారనడం - ఈ దేశానికి చాలా మంచిదనే  నా  భావన. 

మళ్ళీ గాంధీ రాడు. మోడీ వస్తే తప్పు లేదు. మరి వారు ప్రైం మినిస్టరు కావాల్నా, వద్దా -  ఈ చర్చ అనవసరం. వొక వేళ రాహుల్ గాంధీ గారు - యింత కంటే గొప్ప పని చేస్తే  వారూ రావచ్చు. నితీష్ కుమార్ గారు గొప్ప పనులు చేస్తే - వారూ రావచ్చు. మన దేశానికి - నాలుగైదు ప్రత్యామ్నాయాలుంటే మంచిదే కదా. 

దురదృష్ట వశాత్తూ - ఈ రోజు - వొక్కరు కూడా లేదు.   మన వోటులో - "వీరెవరూ నాకు వద్దు"  అని మనం పోరాడ వలసిన  దుస్థితిలో మనం వున్నాం. అది పోయి - మనకు - గొప్ప నాయకులు వస్తారని - వీరైతే మంచిది - వారైతే యింకా మంచిది అనగలిగిన స్థితి రావాలి - అని ఆశిద్దాం.

= మీ 
వుప్పలధడియం విజయమోహన్

12, సెప్టెంబర్ 2011, సోమవారం

సంతోషంగా వుండడానికీ, సంతోషం నిలుపుకోవడానికీ - అంతా మీ చేతుల్లో వుంది - కొన్ని మార్గాలు

మనలో చాలా మందికి   సంతోషంగా వుండటం  ఎలాగో తెలీదు. 

.సంతోషం వస్తూ వుంది. పోతూ వుంది. ఈ  మధ్యలో యేవో కష్టాలు వస్తున్నాయి. అవీ పోతున్నాయి.

  కానీ - సంతోషం ఎప్పుడో, కాస్త ఆలస్యంగానే  వచ్చి, త్వర త్వరగా వెళ్లి పోతున్నట్టు అనిపిస్తుంది.

కష్టాలు, రావడం మాత్రం త్వరగానూ, పోవడం ఆలస్యం గానూ  జరుగుతున్నట్టు అనిపిస్తుంది.

 ఇది దాదాపు అందరి జీవితాల్లోనూ సాధారణంగా మనం చూసే విషయమే.

 ఒక్కో సారి - దూరపు కొండలు నునుపు అన్నట్టు - పక్కింటి వారు, మనకంటే  చాలా సంతోషం గా వున్నట్టు భ్రమ పడుతుంటాము. వారు ఎప్పుడైనా మన యిం టికి వచ్చి తమ  గోడు  మనతో చెబితే - ఆహా, మనమే వారికంటే కాస్త నయం అనుకుంటూ వుంటాము.

సాధారణంగా - మన కంటే ఎక్కువ ధనవంతులైన వారు, అందమైన వారు, ప్రసిద్ధులైన వారు, పెద్ద పదవులలో వున్నా వారు,  మనకంటే సంతోషంగా వున్నట్టు భ్రమ పడుతుంటాము. 

అదీ తప్పే. సంతోషానికి, ఇవేవీ పెద్ద కారణాలు కావు.

ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతుల లిస్టు లో వున్న  వారిలో చాలా  మంది -మన కంటే - ఎక్కువ "సుఖాల"లో వున్నా- మన కంటే ఎక్కువ "సంతోషం" గా  మాత్రం లేరని సులభంగా తెలుసు కోవచ్చు. కాబట్టి ధనం వలన సుఖాలు రావచ్చు గాని - సంతోషం తప్పకుండా వస్తుందని మాత్రం అనుకోలేము.

అందం వలన సంతోషం వస్తుందా? చాలా అంద గాళ్ళు/గత్తె లుగా పేరుపొందిన వారు  -  సంతోషానికి చాలా దూరంగా తమ జీవితం గడిపినట్టు తెలుస్తూ వుంది. 

అలాగే - పేరు ప్రఖ్యాతుల్లో సంతోషం వస్తుందని గ్యారంటీ ఏమీ లేదు.

మమ్మల్ని మించిన వాళ్ళు లేరని అనుకున్న వాళ్ళు  - ఎన్నో కష్టాలకు లోను కావడము, సంతోషానికి దూరం కావడమూ - ప్రతి రోజూ వార్తా పత్రికల్లో చూస్తూ ఉన్నాము.

పోనీ - ఫలానా మతం వాళ్ళు ఎప్పుడూసంతోషంగా వుంటారని చెప్పగలమా? అదీ లేదు.

మతం ప్రధానమైన దేశాల్లో - ఎప్పుడూ తమలో తాము యుద్ధాలు, జగడాలు చేసుకోవడం - యిప్పుడు కాదు, శతాబ్దాలుగా చూస్తున్నాము. శాంతే లేని చోట - సంతోషం వుంటుందా?

మరి కొన్ని సుసంపన్న దేశాలలో-  ఈ రోజు పెళ్లి, సంవత్సరాంతం లోగా విడాకులు - దాదాపు 52 శాతానికి  పైగా జరుగుతున్నాయి. జీవితంలో ఒక్క మనిషితో సర్దుకోలేని వాళ్లకు - సంతోషం ఎక్కడినుండి వస్తుంది?

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రచయిత డేల్ కార్నెగీ - రెండు సార్లు పెళ్లి చేసుకోవడం రెండు  సార్లూ విడాకులివ్వడం  జరిగింది. మరి ఆయన రాసిన పుస్తకాలు " హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుఎన్సె పీపుల్" ఆయన నిజ జీవితంలో తన యింట్లోనే - ఎందుకు పనికి రాలేదు?

ఆయనే కాదు. ఇలాంటి గొప్ప పేరున్న వాళ్ళలో చాలా మందికి మన కంటే - ఎక్కువ సంతోషం  మాత్రం లేదని ఘంటా పథం గా   చెప్పొచ్చు.

ఏ.సీలు , కార్లు, డబ్బు లాంటి అన్ని సుఖ కారణాలు వున్నాయి కానీ  - సంతోషం   మాత్రం సుసంపన్న దేశాలలో కూడా చాలా తక్కువే.

సరే. అందరికీ సంతోషం కావాలి. 

వీటన్నిటి ద్వారా సంతోషం రాక పోతే - మరి ఎలావస్తుంది.దీనికి ఏమిటి మార్గం.

యిది యిప్పుడు చూద్దాం.

మీ మనసులో - మీరు మాత్రం  వుండడాన్ని - అహంభావం అని అంటారు. అహంభావమంటే మనందరికీ తెలుసు. అహంభావులకు ఎన్ని సుఖాలున్నా - సంతోషం  మాత్రం శూన్యమే.

మీ మనసులో - మీరు మాత్రం కాక - మీ వాళ్ళు కూడా వుండడాన్ని - మమకారం అని . అంటారు. వీరికి కొంత సంతోషం, కొన్ని కష్టాలు, కొన్నిదుహ్ఖాలు  వొక దాని వెనుక వొకటి వస్తూ  వుంటాయి.పగలు - రాత్రి - పగలు  - రాత్రి లాగా.

భగవద్ గీత సారాంశమంతా  యిదే. మొదటి శ్లోకం లోనే - ధృత రాష్ట్రుని నిజమైన అంధత్వమేమిటో    మనకు తెలుపుతుంది. "పాండవులూ, నావారైన కౌరవులూ - కురుక్షేత్రంలో  ఏమి చేస్తునారు?"  అంటాడు.

పాండవులు ధర్మాత్ములైనా నా వారు కాదు.వారు  ఎటు పోయినా , ఏమైనా - ఫరవాలేదు.

కౌరవులు - చెడ్డవారైనా, అధర్మ పరులైనా - నా  వారు గనుక - వారికే శుభం జరగాలి.

యిదండీ - ధృత రాష్ట్రుని నిజమైన అంధత్వము.

చాలా వరకు - మనందరిలో వున్న  అంధత్వము యిదే.

దీని వలన - ఏమవుతుంది? మీరు నాకు, నేను మీకు -యిలా సమాజంలో - వొకరికొకరు దుహ్ఖ కారకులౌతాము.
ఏ దేశ చరిత్ర చూసినా , ఏ సమాజం చరిత్ర   చూసినా - జరిగింది, జరుగుతున్నదీ,  జరగా బోయేదీ  - యిదే.

అందు వలన - అంటే అహంకార, మమకారాల వలన - మన జీవితమంతా - రెండు రోజులు సుఖం వస్తే - మూడు రోజులు  కష్టం వస్తుంది. యిలా  జరిగిపోతూ వుంటుంది. సుఖం వచ్చినప్పుడు సంతోషం. కష్టం వచ్చినప్పుడు దుహ్ఖం.

ఏది, ఎప్పుడు వస్తుందో - తెలీకుండా - జీవితం గడిచిపోతూ వుంటుంది.

రేపు మన జీవితంలో - సంతోషముందా, దుహ్ఖముందా - ఎవరు చెప్ప గలరు?

నిత్య సంతోషాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో - "ఆనందం" అని అంటారు.ఆత్మ జ్ఞానం పొందిన వాళ్ళు  - ఈ "ఆనందమే" "స్వరూపం"గా  వుంటారు.దాన్ని గురించి యిక్కడ మనం ప్రస్తావించడం లేదు.

మన సాధారణ సామాజిక జీవితంలో - సంతోషం అప్పుడప్పుడూ వచ్చి పోతూ వుంది. దాన్ని మనమే సృష్టించు కోవడం ఎలాగా? ఎక్కువకాలం వుండేలా చేసుకోవడం ఎలాగా - అన్నదే - మన  బాధ.యిక్కడ చర్చనీయాంశం అదే.

 కొన్ని చిట్కాలు - మన పూర్వీకులు చెప్పినవి యిక్కడ చూద్దాం.

 సంతోషంగా వుండడానికీ, సంతోషం నిలుపుకోవడానికీ - కొన్ని మార్గాలు  

 1  అతి  సర్వత్ర వర్జయేత్ -అంటారు.గీతలో శ్రీకృష్ణుడు కూడా  యిదే చెబుతాడు. ఆహారము, నిద్ర, వ్యాయామము, వినోదము, లాంటి నిత్యావసర విషయాల్లో - కాస్త    సంయమనం పాటించాలి. ఎక్కువ తినే వాడు, చాలా తక్కువ  తినే వాడు, ఎక్కువ నిద్రపోయే వాడు, చాలా తక్కువ నిద్ర పోయే వాడు - యిలా అన్ని  విషయాల్లోఅతిగా వుండే వారు - యోగానికి పనికి రారని చెబుతాడు. వీరు సంతోషానికీ పనికి రారు. వీరు తమ అలవాట్లతో తామే - దుహ్ఖాన్ని కొని తెచ్చుకుంటూ వుంటారు.చూసారా. ఎక్కువ ఏది కావాలనుకున్నా - అది దుహ్ఖానికే దారి తీస్తుంది. సరైన, మితమైన  ఆహారమూ, నిద్రా, వ్యాయామమూ, వినోదమూ వున్నా వారి జీవితంలో సంతోషం ఎక్కువగా  వుంటుంది.

 2 .మన మనస్సు వొక పాత్ర లాంటిది. సంతోషం పాల లాంటిది. చాలా ఆరోగ్యకరమైన వస్తువు. మీ దగ్గరే అది వుంది కూడా. ఎలాగా? ఉదయం లేచీ లేవగానే - కళ్ళు తెరవక ముందే - "ఈ రోజు నేను - నా వాళ్ళు - లోకంలోని ప్రతి వొక్కరూ - సంతోషం గా వుండాలని" -  ప్రార్థించి, తరువాత కళ్ళు  తెరవండి. లోకాః సమస్తాః సుఖినోభవంతు; సర్వే జనాః సుఖినోభవంతు. వొక  రెండు నిమిషాలు  కళ్ళు మూసుకునే వుండి - మీలో ఈ  భావన నింపుకుని తరువాత కళ్ళు తెరవండి. యిప్పుడు, మనసనే పాత్రలో - సంతోషం నింపడానికి ప్రయత్నం చేసారన్న మాట. మన  సంస్కృతిలో  ఇలాంటి చాలా ఆరోగ్యకరమైన, సులభమైన పద్ధతులు, ఎన్నో వున్నాయి. అనుకుంటే - వచ్చేస్తుందా? అనే సందేహం వద్దు. అనుకుంటే  తప్పక వస్తుంది.యిదే కాక - ఉదయం కళ్ళు  తెరవక ముందు - చెప్పుకోధగిన విషయాలు, శ్లోకాల రూపంలో వున్నాయి. తెలుగులో చెప్పాలంటే - "సకల ఐశ్వర్యాలకూ  దేవత అయిన లక్ష్మీ దేవి నా  చేతుల్లోనే నివసిస్తూ వుంది. సకల విధ్యలకూ, కళలకూ నిలయమైన సరస్వతి కూడా నా  చేతుల్లోనే నివసిస్తూ వుంది.సకల శుభాలకూ, మంగళాలకూ  దేవత  అయినగౌరీదేవి కూడా నా  చేతుల్లోనే నివసిస్తూ వుంది.వారు ముగ్గురికీ వందనం చేస్తూ -ఈ  శుభోదాయానికి   స్వాగతం పలుకుతున్నాను." అంటూ కళ్ళు  తెరవాలి.

౩. మన  దగ్గర వున్నది కొంత; లేనిది విశ్వమంతా -అని అనుకోవడం చాలా సహజం. కాని - వున్న  దాని విలువ మనం మరిచిపోతూ వుంటాము. మన కళ్ళ విలువ మనకు గుర్తు లేదు.కాళ్ళ విలువ తెలీదు.చేతుల విలువ, మిగతా అంగాల విలువ అసలు తెలీదు. లక్ష రూపాయలు పోయిందని గుండెపోటు తెచ్చుకుంటారు. మీకు ఏది ముఖ్యం - లక్షరూపాయలా, చక్కగా పనిచేసే గుండెనా? ఏది, చెప్పండి? మీకు కోటి రూపాయలు యిస్తాను.వొక, మంచి, గుండెపోటు తెచ్చుకోవడానికి సిద్ధంగా వున్నారా? మరో కోటి రూపాయలు యిస్తే - మరో  గుండెపోటుకు రెడీ అవుతారా? రెండో, మూడో - లక్షలిస్తాను. మీ కళ్ళు యిచ్చేస్తారా? చూడండి. మీ  వద్దఎన్ని, వెల  కట్టలేనివి వున్నాయో?  తెలిసి చేయనివి - మనం   తెలీకుండా చేస్తున్నాము. చాలా మంది - డబ్బు పోయిందని, ప్రమోషన్ రాలేదని, పెళ్లి నిలిచి  పోయిందని, యిలా  ఎన్నో కారణాలకు గుండెపోటు  తెచ్చుకుంటున్నారా , లేదా? యిదే విషయాలకు ఏమీ జరగనట్టు సంతోషంగానే బ్రతికేస్తున్న వాళ్ళూ వున్నారు.ఆహా, వీటికి బాధ పడక పోతే, వర్రీ కాకపోతే - ఎలాగండీ? ఇదండీ - మన వర్రీ. వీటికి   వర్రీ కాకపోతే ఎలా అన్నది ముఖ్యమైన వర్రీగా వుంది  మనకు.పోయింది ఎలాగూ పోయింది. వున్నది  పోకుండా చూద్దాం అనుకోండి.యిదేదో పెద్ద కష్టమైన విషయం కాదు. మన యిరుగు పొరుగు వాళ్ళు అలా చేసారని మనమూ అలా చేస్తున్నాము. అంతే. ఈ రోజు గట్టి నిర్ణయం తీసేసుకోం డి .ఇలాంటి ఏ విషయానికీ బాధ పడను - అని. మీ సంతోషం మీ దగ్గరఎక్కువ కాలం వుంటుంది.

 4 . ఆరోగ్యమే మహా భాగ్యం -అన్నారు. నిజమే. ఆరోగ్యం కాపాడుకుంటే - మనం ఎక్కువ సంతోషం అనుభవిం చగలం. నియమితమైన ఆహార, నిద్రా, విహారాలతో - ఆరోగ్యం కాపాడుకోవచ్చు. సత్వ గుణ ప్రధానమైన ఆహారం - చాలా  ఆరోగ్య దాయకం.మరి www  లో చూడండి. వాళ్ళు తినే ఆహారం రజో గుణం, తమోగుణం ఎక్కువ వున్నది కదా. ఎంత బలంగా వున్నారు! అని మీకు సందేహం వస్తుంది. నిజమే. వారి మొహాలు చూడండి. మీకు  సంతోషం కాస్తైనా కనిపిస్తుందా? సత్వ గుణ ప్రధానఆహారాలలో - మీకు బలము, శక్తీ, ఆరోగ్యము, సంతోషము కూడా  వస్తుంది. మన  స్మామీజీలు దాదాపు అందరూ - తెల్లవారి 4 గంటలకు   లేచి, అప్పటి నుండి - రాత్రి 10 గంటల వరకూ పని చేస్తూ  వుంటారు. వారి మొహాల్లో కనిపించే ప్రశాంతత, సంతోషము మరే దేశంలోనూ మీరు చూడలేరు. రోగాలు వచ్చినప్పుడు - వెంటనే - వైద్యుడి సహాయం తీసుకోవాలి. పతంజలి మహర్షి  అంటారు - యోగ సాధనకు ముఖ్యమైన  అడ్డంకి వ్యాధి - అని.  సంతోషానికి ముఖ్యమైన  అడ్డంకి కూడావ్యాధే. కాబట్టి ఆరోగ్యం కాపాడుకోండి. ఎక్కువగా టీ.వీ చూడడం, త్రాగుడు లాంటి వ్యసనాలకు లోబడడం, కోపము, ద్వేషము లాంటి అంతః శత్రువులకు బానిస కావడం - ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. యివి జ్ఞాపకం వుంచుకుంటే - మీ సంతోషం మీ దగ్గరే వుంటుంది.

 5 . మన సంతోషానికి వొక ముఖ్య కారణం - మాట.  మంచి మాట వింటే - మన సంతోషం  పెరుగుతుంది. మనం మంచి మాట చెబితే - వినే వారి  సంతోషం పెరుగుతుంది. మీ భర్త, మీ భార్య, మీ  స్నేహితులు, మీ చుట్టూ వున్న వారు మిమ్మల్ని అభిమానిస్తూ, మీతో మంచి  మాటలే  చెప్పే వారైతే - వారి  నుండీ మీకు ఎల్లప్పుడూ సంతోషం వస్తూ వుంటుంది కదా. అయితే - మీకు మంచి భర్త కావాలంటే - మీరు మంచి భార్యగా వుండాలి. మీకు మంచి భార్య కావాలంటే - మీరు మంచి భర్త గా వుండాలి. మీకు మంచి స్నేహితులు కావాలంటే - మీరు మంచి స్నేహితులు గా వుండాలి. మీరలా వున్నారా? కనీసం ఈ రోజు  నుండీ అలావుండండి. 45 - 48  రోజులలో - మీచుట్టూ వున్న వారిలోకూడా గణనీయమైన మార్పు వస్తుంది.

 6 .మాటకు ఎంత శక్తి వున్నా - మంచి చేతలకు అంతకంటే ఎక్కువ శక్తి వుంది. మనం చేసే చిన్న చిన్న, నిస్స్వార్థ మైన  పనులకు - కొండలు కూడా కరిగిపోతాయి. గుండెలు కరగడం పెద్ద  గొప్పేమీకాదు. మీ భర్త (లేదా భార్య) - మీకు దేవుడిచ్చిన  గొప్ప వరం. అది - మీ  నిర్లక్ష్యం వలన శాపంగా మారొచ్చు. వారు  మీకేమి ఇస్తున్నారని చూడకండి. మీరు వారికేం చేస్తున్నారని - చూడండి.యిది చాలా ముఖ్యం. మీరు  చేయగలిగినవన్నీ చేయండి. ముందు చెప్పినట్టు - 45 - 48  రోజులలో - వారిలోకూడా గణనీయమైన మార్పు వస్తుంది. 


 7 . మంచి స్నేహితులు - స్వర్గానికి ద్వారాలు.  మంచి స్నేహితులు - అంటే, మీ మంచి  కోరే వారు. మీకు మంచే చెప్పే వారు. మీ  సుఖాన్ని తమ సుఖంగా భావించే వారు. అలాంటి స్నేహితులు -దొరికితే , విడవకండి. వారికి మీరు మంచి స్నేహితులుగా మారిపోండి. వొక  ఇద్దరో,ముగ్గురో మంచి స్నేహితులు వుంటే, భర్త  / భార్య  తో సఖ్యంగా వుంటే మీ సంతోషానికి ఆనకట్టలు వుండవు. అలాగే - చెడ్డ స్నేహితులు - నరకానికి మార్గాలు. తాము చెడడమే కాక మిమ్మల్నీ చెడుపుతారు. అటువంటి స్నేహాలకు దూరంగా వుండండి.

.8 . చుట్టూ వున్న సమాజంలో - మీరు  చేయ గలిగే  సహాయం చేయండి.ముఖ్యంగా లేని వారికి, వ్యాధిగ్రస్తులకు, సహాయం అవసరమైన వారికి - సహాయం చేయండి. మీరూ, మీ స్నేహితులూ కలిసి చేస్తే మరీ మంచిది.వొక సంస్థగా ఏర్పడి నియమిత లక్ష్యం తో చేస్తే - అంత కన్నా మంచిది.

 9 .మీ సంతోషానికి -అమోఘమైన ఆయుధం, ఔషధం -  ధ్యానము. ప్రతిరోజూ -కనీసం పది నిమిషాలు ఉదయం, సాయంకాలం  మీరు  ధ్యానం చేసారంటే -  మీలో ఎంతో ప్రశాంతత, తత్కారణంగా   ఎంతో సంతోషము కలుగుతాయి.

భారతీయ శాస్త్రజ్ఞానం ప్రకారం - మన దుహ్ఖానికి కారణం కేవలం అజ్ఞానము, మూర్ఖత్వం మాత్రమే. మన లేమి కాదు. ఏది లేకున్నా - మీరు సంతోషంగా వుండచ్చు. పైన చెప్పిన మార్గాలు - మీ సంతోషాన్ని మరింతగా పెంచడానికి తోడు పడతాయి. చివరిగా వొక మాట:

"నా వారు" అన్న పదానికి మీ నిర్వచనం పెంచండి. వసుధైవ కుటుంబకం  - అన్న మనస్తత్వం పెట్టుకోండి. మిగతా వారి సంతోషానికి మీరు ఎంతగా కృషి చేస్తారో - మీ  సంతోషమూ  అంతగా పెరుగుతుంది. మీ  జీవితానికి విలువ కూడా అంతగా పెరుగుతుంది. 

 = మీ 

వుప్పలధడియం విజయమోహన్

8, సెప్టెంబర్ 2011, గురువారం

సృజనాత్మకత = విమర్శనాత్మకత = ఏది వుంది మీలో? = మీరు ఏ కోవకు చెందుతారు?

మనిషిలో రెండు రకాల శక్తులున్నాయి. (1 ) సృజనాత్మకత  ; (2 ) విమర్శనాత్మకత;

 సృజించే వాడు సృష్టికర్త.

మనిషిని సృష్టించేందుకు  విశ్వ సృష్టికర్త కు ఎలాంటి మానసిక  స్థితి , శక్తి  కావాలో - మనిషి చేసే ప్రతిసృష్టి లోనూ అతనికి అదే మానసిక స్థితి,  శక్తి కావాలి.

ఏకాగ్రత, తన  సృష్టిపై గౌరవము, ప్రేమ, సృష్టింపబడే వస్తువు ఎలా వుండాలో -ముందుగానే పూర్తిగా తన ఊహలో సృస్టించడము -   ఆటువంటివి ఎన్నో వుంటే గానీ  మనిషి నిజమైన, గొప్పదైన సృష్టి ని సాధించ లేడు.

 ఏదైనా సరే - మొదట మానసిక సృష్టి - దాని తరువాత  భౌతిక సృష్టి  జరుగు తుంది.

మామూలు మనిషి రాయిని చూస్తాడు. కానీ శిల్పి ఆ రాయిలో - తాను సృస్టించబోయే  కళా ఖండాన్ని ముందుగానే మానసికంగా  దర్శిస్తాడు. తరువాత  అదే రూపాన్ని  ఉలితో ఆ రాయిలో మలుస్తాడు.

 శకుంతలా  దుష్యంతుల ప్రణయాన్ని, పరిణయాన్ని,  వియోగాన్ని,సంయోగాన్ని - తన మనో లోకంలో పూర్తిగా   దర్శింగ గలవాడు  మాత్రమే - కాళిదాసు కాగలిగాడు.

రవీంద్ర నాథ్ టాగూరు రాసిన ప్రతి వాక్యంలోనూ - మనం అటువంటి సృష్టిని చూడగలం.

 రవివర్మ చిత్రాల్లో - మనం చూడగలిగే వైవిధ్యం, క్రొత్తదనం - ఆయనలో దాగున్న సృష్టికర్త గుణాలే.

 ప్రతి మనిషిలోను - ఈ సృజనాత్మక శక్తి నిక్షిప్తమై వుంది. దీన్ని పైకి తీసుకు రావడమే మనం చేయవలసిన పని. 

 మీలో - వొక రచయిత వుండవచ్చు.శిల్పి వుండవచ్చు. గాయకుడు వుండ వచ్చు  కవి వుండ.వచ్చుచిత్రకారుడు  వుండ వచ్చు  వొక అసాధారణ శాస్త్రీయ అన్వేషకుడు వుండ.వచ్చు.

 మీలో  - వొక గొప్ప సృష్టి కర్త ధాగి వున్నాడు. అతన్ని పైకి  తీసుకురావలసిన బాధ్యత మీదే.

సృష్టి కర్త కాని వారిలో రెండు రకాల మనుషులున్నారు.

వొకడు విమర్శకుడు. మరొకడు దర్శకుడు.  దర్శకుడంటే- సినీమా దర్శకుడి లాగా అనుకోకండి.  ఈ దర్శకుడు , మామూలు ప్రేక్షకుడు మాత్రమే. చూస్తాడు.బాగుంది; లేదా బాగులేదు - అనుకోవడం మించి అతనేమీ చేయడు.

ప్రతి సృష్టినీ విమర్శనాత్మకం గా చూసేవాడు విమర్శకుడు. వీరిలోనూ - సకారాత్మకంగా , విమర్శిం చే వారు, నకారాత్మకంగా విమర్శిం చేవారు - రెండు రకాలు.

తప్పొప్పులు మాత్రమే  చూసేవాడు, అందు లోనూ - తప్పులెక్కువగా   చూసేవాడు, తప్పులే - ఎక్కువగా చూడాలనుకునేవాడు - నకారాత్మక విమర్శకుడు.

.సృష్టికర్త లోని - ఆర్ద్రతను, సృజనా నైపుణ్యాన్ని, చూసి, అనుభవించి మనకు చెప్ప గలవాడు సకారాత్మక విమర్శకుడు. యితడు తప్పులు చూడడని కాదు - తప్పులు చూడడంలోనూ - సృష్టికర్త ఆరాటాన్ని అర్థం చేసుకుం  టూ చూస్తాడు.

.యితని వలన సృష్టికర్త  నైపుణ్యం పెరుగుతుంది . మరో సృష్టి మరింత సమ్మోహనం గా జరుగుతుంది.

మరి - మీరు ఏ కోవకు చెందుతారు?

మీలో వొక సృష్టికర్త వున్నాడు. అతన్ని - బయటికి తీసుకు రండి.

మరో సృష్టిని ని చూసినపుడు -మీలోని - సకారాత్మక విమర్శకుడికి పని కల్పించండి.


నకారాత్మక విమర్శకుడిగా మాత్రం మిగిలిపోకండి. మీ చుట్టూ వున్న వారి జీవితం, మీ జీవితం రస హీనమై పోతుంది.

ప్రేక్షకుడిగా  వున్నా పరవాలేదు.


= మీ


వుప్పల దడియం విజయమోహన్

1, సెప్టెంబర్ 2011, గురువారం

మీకు ఎన్నాళ్ళు బ్రతకాలని వుంది? = శతాయుష్మాన్ భవ =


మీకు ఎన్నాళ్ళు బ్రతకాలని వుంది? 

ఈ ప్రశ్న నేను నేషనల్ అకాడెమి ఆఫ్ టెలికాం ఫైనాన్స్ అండ్ మేనేజ్ మెంటు లో వున్నప్పుడు నా వర్కుషాపులకు     వచ్చే వారినందరినీ అడిగే వాడిని.

చాలామంది అరవై ఏళ్ళు, డెబ్భై ఏళ్ళు యిలా ఏదో వొకటి చెప్పే వారు. ఏ ఒక్కరూ వందేళ్ళు వుండాలని  కోరుకోలేదు.

యిది చాలా చిత్రం అనిపించింది.

నా పనే యిటువంటి  విషయాలను పరిశీలించడమూ,  రీసెర్చ్ చేయడమే గనుక   దీనిపై అధ్యయనం చేయడం  జరిగింది.  

ప్రపంచంలో - ముఖ్యంగా - రష్యా, దానికి సమీపంగా వున్న కొన్ని దేశాలలో వున్న- కొన్ని ప్రదేశాలలో మనుషులు - దాదాపు అందరూ , వందా, అంతకు మించి బ్రదికేస్తున్నారు. అది వారికేమీ గొప్పగానో, క్రొత్త గానో అనిపించడం లేదు. 

అదే విధంగా - 113  ఏళ్ళకు  పైగా జీవించిన వంద మంది   లిస్టు -గిన్నెస్స్ వరల్డ్  రికార్డు  వారిచే తయారు చేయ బడింది. అందులో చాలా మంది ఆడవాళ్ళు గా వుండడం, అమెరికా వారిగా వుండడం విశేషం.

అందులో భారత దేశం వారు కానీ చైనా వారు కానీ  వొక్కరు కూడా లేక పోవడం మరో విశేషం.

దీనికి వొక ముఖ్య కారణం - ఈ రెండు దేశాల్లోనూ - సరైన బర్త్ సర్టిఫికేట్ - ఆధారం లేకపోవడం కూడా. అయితే - మన దేశంలో వందేళ్ళు పైగా  జీవించే  వారు  లేక పోలేదు. గిన్నెస్స్  వారు నమ్మ గలిగిన ఆధారం (ప్రమాణం) లేదు. అంతే.  అయితే, మన దేశంలో, వీరి సంఖ్య చాలా తక్కువ.

ప్రపంచమంతటా - వంద ఏళ్ళు అయి బ్రతికున్న వాళ్ళు ఆరోగ్యం గానూ వున్నారు. సంతోషంగానూ వున్నారు. ఏదో, మంచంపై  నుండి - లేయలేక మరొకరిపై ఆధార పడి వుండడం లేదు.  వారికి - వారికంటే, చిన్న వారు- బాగా గౌరవమూ, మర్యాదా యిస్తున్నారు.

ఎందుకలా అక్కడ?  ఎందుకు మరోలా యిక్కడ?

యిక్కడ, చాలా  మంది, వంద ఏళ్ళు బ్రతకాలనే  అనుకోవడం లేదు. కోరుకోవడం లేదు

మనం దీవించడం మాత్రం -  శతాయుష్మాన్  భవ -  అనే దీవిస్తున్నాము.  

కానీ - మన సమాజంలో వంద ఏళ్ళు సుఖంగా  వుండ గలిగే పరిస్థితులు - మాత్రం తగ్గిపోతున్నాయి.

ఒకప్పుడు రోగాలతో పొయ్యే వాళ్ళు - యిప్పుడు వొంటరితనం తో పోవలసిన పరిస్థితులు వస్తున్నాయి. మానసికంగా వందేళ్ళు సుఖంగా వుండగలం - అన్న నమ్మకం వున్న వారు తగ్గిపోతున్నారు. చిన్నవాళ్లకు, పెద్ద వాళ్ళపై  గౌరవమూ - తగ్గుతూ వుంది. 

అందువలన -వంద దాటి - సంతోషంగా, ఆరోగ్యంగా వుండే వారు, మన దేశంలో, యిప్పుడు, చాలా, చాలా తక్కువగా వున్నారు. "మన వారు" అని అనుకోగలిగిన వారు లేక పోతే - బ్రతుకు పై ఆశ సన్నగిల్లి పోతూ వుంది. ఈ పరిస్థితిని సులభం గానే మార్చ వచ్చు. మార్చాలి కూడా.  

రష్యా, అమెరికా  లాంటి కొన్ని దేశాలలో - కొన్ని ప్రాంతాలలో - ఎంతో మంది,  వందకు పైగా బ్రతుకుతూ  వుండటం వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ యిది  నిజం.  యిప్పటికీ జరుగుతూనే వుంది.

కొన్నేళ్ళు ముందట - అమెరికాలో చిన్న ప్రయోగం చేసారు.

ఈ ప్రయోగం ప్రకారం - కాస్త వయసు మళ్ళిన వాళ్ళు -  కొన్ని నెలల పాటు - తమ వయస్సును మరిచి పోయి, 25 - 30 ఏళ్ళ  వాళ్ళ  లాగా,  పూర్తిగా - అన్ని విషయాల్లోనూ -వ్యవహరించాలి. ఈ ప్రయోగానికి ఎంతో మంది ఉత్సాహం గా ముందు కొచ్చారు. యిలా కొన్ని నెలల పాటు  చేసిన వారిలో - చాలా మార్పులు భౌతికంగానూ, మానసికం గానూ కనిపించాయి. 

వారి భౌతిక వయస్సు - చాలా, చాలా తగ్గినట్టు  తెలిసొచ్చింది. అంటే - మీ శరీరం, కొంత వరకూ - మీ మనస్సుకు అనుగుణంగా ప్రయాణం చేస్తుందన్న మాట. మీ మనస్సును మీ ఆశయాలకు అనుగుణంగా పెట్టుకోవాలి. అంతే.
మీరు అరవై వరకు చాలనుకుంటే - మీ మనసు ప్రకారం - మీ శరీరం కూడా అలా అనుకునే ప్రమాదం వుంది. అదే - మీరు 101 వరకు  వుండాలనుకుంటే  -మీ మనసు , మీ శరీరం రెండూ - దానికి  అనుగుణంగా పోవచ్చు.

జీవితంలో మనం  చేయ వలసిన 101 పనులు - అన్న శీర్షికతో - నామరో అంగ్ల భాషా బ్లాగులో నేను  రాసిన మొట్ట మొదటి పని -  దీన్ని గురించే :

మీరు - 101 సంవత్సరాలు - ఆరోగ్యంగా, సంతోషంగా బ్రతకాలి - అన్న గట్టి నిర్ణయం  తీసుకోవడమే - మీరు చేయ   వలసిన మొట్ట మొదటి పని.

మనమెక్కడ  101 సంవత్సరాలు బ్రతుకుతాం - అరవయ్యో , డెభైయో  చాలులే - అనుకునే వారే మనలో, ఎక్కువగా వున్నారు. అందుకే, ఆ వయస్సు వచ్చే సరికి - మన వారంతా - తిరుగు లేని ఆ ప్రయాణానికి  రెడీ అయిపోతున్నారు.

మన ఆరోగ్యం వుండేంత వరకు చాలు - అనుకునే వారు - ఏ కాస్త  అనారోగ్యం వచ్చినా  - యిక మన పని  అయిపోయింది  అని అధైర్య పడడమూ మనం చూడొచ్చు. 

అరవై, లేదా, డెబ్భై చాలు  - అనుకునే వారు - ధైర్యం విడిచేసి - ఏ చిన్న అనారోగ్యం వచ్చినా  చావుకు రెడీ అవుతారు.  వందేళ్ళు ఖచ్చితం అనుకునే వారిలో - ఆ భావన తొందరగా రాధు. రోగాలు వస్తే - ఆ.., చిన్న,చిన్న రోగాలు, యివి తొందరగా పోతాయిలే - అని ధైర్యంగా వుంటారు. వారి మనస్సు ప్రకారం రోగాలు కూడా తొందరగా పోతాయి. ముప్ఫై ఏళ్ళలో , యిరవై ఏళ్ళలో  వుండే ధైర్యం డెబ్భై ఏళ్ళ లోనూ వుంటుంది.తొంభై ఏళ్ళ లోనూ వుంటుంది.

ఆరోగ్యంతో, సంతోషంతో 101 సంవత్సరాలు నేను  వుండాలి - అని మొదట గట్టి నిర్ణయం తీసేసుకోండి. 

రష్యా లోని - కొన్ని గ్రామాల్లోని - శతాయుష్కులైన  ఆ యువకుల్లాగా - తెలుగువారంతా కనీసం  101  సంవత్సరాలు - ఆరోగ్యంతో, సంతోషంతో బ్రతుకుదాం.

యిలా అనుకుంటే -  తప్పకుండా 101  సంవత్సరాలు - ఆరోగ్యంతో, సంతోషంతో బ్రతుకుతామా? ఈ ప్రశ్న అనవసరం. మన శరీరం, మన మనస్సూ ఆ దిశగా ప్రయాణిస్తాయి. అంతే. 

 మరి ప్రకృతి  శక్తులూ, దేవుడి లీలలూ వుంటాయి. వాటి ప్రభావమూ వుంటుంది. వాటి వలన ముందుగా పోవచ్చు. లేదా మరి కొన్ని ఏళ్ళు. ఎక్కువా బ్రతకొచ్చు. వాటిని ప్రక్కన పెట్టి - మీరు  మీ  చేతిలో వున్న - మీ నిర్ణయం గట్టిగా తీసుకోండి.

.మీ బ్రతుకు - ఎవరికోసమో కాదు - మీ కోసమే. మీ సంతోషం ఎవరి కోసం? అదీ మీకోసమే?

బ్రతుకుపై ఆశ ముఖ్యం కాదు. దాని కంటే - బ్రతుకులో ఉత్సాహం, ఏదో వొకటి సాధించాలనే ధ్యేయము పెట్టుకోండి. 

ఎప్పుడూ భూత కాలం గురించి మాత్రమే యోచించేవాడికి  భవిష్యత్తు తగ్గిపోతుంది. శీఘ్రంగా ముసలితనమూ, దాని వెనుక మృత్యువు వచ్చేస్తాయి.

ఎప్పుడూ భవిష్యత్ కాలం గురించి, తన ధ్యేయం గురించి యోచించేవాడికి  దాని సాధనకై  కృషిలో మునిగి వుండే వాడికి శీఘ్రంగా ముసలితనమురాదు. కాస్త దూరంగానే వుంటుంది.


బ్రతికున్నంత కాలం -ఏదో వొక విధంగా , మీకు వీలైనంతగా - పది  మందికీ  ఉపయోగంగా  వుండండి. ఏదో , మీకు నచ్చిన, వొక ధ్యేయము పెట్టుకోండి.  జీవితం ఉత్సాహం గా  సాగిపోతుంది. 

101  సంవత్సరాలు చాలా? అబ్బే - అది అప్పుడు చూసుకుందాం.

 = మీ

వుప్పలధడియం విజయమోహన్