31, అక్టోబర్ 2011, సోమవారం

ఎస్.పీ.బాలసుబ్రమణ్యం గారు = పాడుతా, తీయగా = ఎనభై ఏళ్ళ తరువాత ?? =

ఎస్.పీ.బాలసుబ్రమణ్యం గారు ఎన్నో మధురమైన పాటలు పాడారు. తెలుగులో, తమిళం లో, హిందీ లో, కన్నడంలో, మరెన్నో భాషలలో. 

మనకు,అంటే తెలుగు వారికి,  వారు తెలుగులో పాడిన ఎన్నో పాటలు, ఎంతో, ఎంతో, ఎంతో యిష్టం కదా.  

అందుకని, తెలుగు వారికి అత్యంత ఆప్తుడైన మన ఎస్.పీ.బాలు గారు - నాకు కూడా - చాలా,చాలా యిష్టమైన వ్యక్తులలో వొక ముఖ్యమైన వ్యక్తి. 

సినీమాల్లో ఆయన పాడడం తగ్గించుకోవడం మనకు కాస్త నిరాశాజనకంగా వున్నా - అందువలన -  తెలుగు వారందరికీ మరో గొప్ప మేలు జరిగింది. బాలు గారు - భవిష్యత్తులో, బాలుగారిలాగా - పాడగల ఎంతో మంది చిన్నారులను -  తెలుగునాట, వెలుగులోకి తీసుకొచ్చారు. వారికి రకరకాల మెరుగులు దిద్దారు.

ఆయన సారథ్యం వహించిన సంగీత రథాలు - ఎంతో మంది పిల్లల స్వప్నాలను  సాకారం చేసింది. ఎంతో మందిని ముందుకు నడిపించింది . ఈ అందరికీ సినిమాల్లో అవకాశము దొరుకుతుందో లేదో గాని -  మనందరి మనస్సులో మాత్రం - స్థానం దొరికింది, అనడంలో - ఏమాత్రం అతిశయోక్తి లేదు.  

వారు సారథ్యం వహించిన పాడుతా, తీయగా - చాలా అమోఘంగా,(ఆ సమయంలో) మరే ప్రోగ్రామునూ చూడనివ్వకుండా, నడిచింది.

ఈ రోజు పోటీ  ఫయనల్సు ముగిసింది. చిన్నారుల పాటలన్నీ చాలా, చాలా  బాగుంది. పోటీ ముగిసే సమయానికి  - వారు తమను తాము ఎంత మెరుగుపరుచుకున్నారో -  చూడటానికి, వినడానికీ - చాలా హాయిగా, ఆనందంగా వుంది. మరి యింత మంది పిల్లల ఈ అభివృద్ధికి - బాలు గారు ఎన్ని రకాలుగా కారణమయారో చూసిన వారికి - వారిని తప్పక అభినందించాలని ఆకాంక్ష కలుగుతుంది.

దేశ సేవ, మానవ సేవ ఎన్ని రకాలుగా చేయ వచ్చో  గాని - ఇలాంటి దేశ సేవ, మానవ సేవ -మరో వందేళ్ళు నిలిచి పోయే సేవ అని మాత్రం చెప్పొచ్చు.  మనం మాతృ దేవోభవ, పితృదేవోభవ అన్న తరువాత - ఆచార్య దేవోభవ అని - గురువు గారిని దైవం స్థానంలో నిలిపే సాంప్రదాయం వున్న వాళ్ళం.   సరే. ఈ చిన్నారులు - ఎనభై ఏళ్ళ తరువాత - ఎవరి గురించి  మాట్లాడుకుంటారంటే - బాలు గారిని గురించి, అదీ వొక ఆచార్య స్థానంలో వారిని  వుంచి -  మాట్లాడుతారని - తప్పకుండా చెప్పొచ్చు. తాము పాడిన పాటలు కూడా వారి మనస్సులో తప్పక నిలిచిపోతాయి. బాలు గారి జీవితం నిజంగా ధన్యమే.

బాలు గారికి - ఆంధ్ర దేశం మరే సత్కారాలు అందజేస్తుందో  - నాకు తెలియదు గాని - వారికి భగవంతుడు - నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతమైన జీవితం యివ్వాలని, అంత వరకు వారు సంగీతానికి సేవ చెయ్యాలని - నేనైతే కోరుకుంటాను.  

= మీ

వుప్పలధడియం విజయమోహన్

23, అక్టోబర్ 2011, ఆదివారం

మనసే మిత్రుడు-మనసే శత్రువు - కోరికలు రెండు విధాలు - కోపమొస్తే - ధైర్యమూ, బుద్ధిబలమూ - వున్న చోటే సంతోషము, విజయము


క్రిందటి వ్యాసంలో మానసిక ఆరోగ్యాన్ని గురించి కొంత తెలుసుకున్నాము.

మన మనస్సు చేసే పని చాలా చిత్రమైన పని.
  • ఎప్పుడూ -వొకదానితో మరొకటి బేరీజు వేసి యిదా,అదా అని చూసుకొంటూ వుంటుంది. అందు వలన ఎక్కడా స్థిరంగా నిలవదు.
  • ఎక్కువ సమయం భూతకాలంలో గడపడానికే యిష్టపడుతుంది భూతకాలంలో లేదంటే - భవిష్యతు వైపు పరుగులెడుతుంది.వర్తమానం లో నిలవడం దానికి చాలా కష్టమైన పని.
  •  తన అలవాట్లకు చాలా సులభంగా బానిసై పోతుంది.అవి - మంచైనా సరే, చెడైనా సరే. వాటినుండి బయట పడడం మనసుకు చాలా కష్టమైన పని.
  • మనసుకు మంచి అలవాట్లు రావడానికి మనం కొంతైనా శ్రమ పడాలి. కొన్ని రోజుల పాటో, నెలల పాటో - పరిశ్రమించాలి . సాధారణంగా - మంచి అలవాట్లు మనసులో నాటుకోవాలంటే - మండలం రోజులు - అంటే 45   నుండి 48  రోజులు - అంతరాయాలు లేకుండా పాటించాలి.  తరువాత, వాటిని కాపాడడం - సులభమే.
  • కానీ - చెడు అలవాట్లను చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. వొక్క నిముషంలో - మీరు పొగ  త్రాగడానికో, మత్తు పదార్థాలు త్రాగడానికో, తినడానికో అలవాటు పడొచ్చు.
  • దురదృష్టమేమంటే   - మంచి అలవాట్లను విడిచిపెడ్డడం చాలా సులభం. యాభై ఏళ్ళ మంచి అలవాటును - వొక్క రోజులో విడిచి పెట్ట వచ్చు. కానీ - చెడు అలవాట్లను విడిచి పెట్టడం చాలా కష్టం.
  • మంచి అలవాట్లను మనం వుంచుకోవాలంటే   - సరైన పరిసరాలు, వాతావరణం ముఖ్యం. చెడు అలవాట్లు తమకు కావాల్సిన పరిస్థితులను తామే సృస్టిస్తాయి, లేదా, సులభంగా వెదుక్కుంటాయి . 
  • బుద్ధి మాట వినని మనసు - తాత్కాలికంగా - సంతోషాన్ని తెచ్చినా- పోను,పోనూ, దుఖాలనూ, కష్టాలనూ తప్పకుండా తెచ్చిపెడతాయి.
  • బుద్ధి మాట వినే మనసే - దుహ్ఖాలనూ, కష్టాలనూ తప్పించుకుంటూ -  ఎక్కువ కాలం సంతోషాన్ని, ఆనందాన్ని - తన స్వంతం చేసుకోగలదు.
అసలు మనసంటే ఏమిటి? మనలోని ఆలోచనల ప్రవాహము; వాటితో బాటు చేరిన భావ ప్రవాహము. ఈ రెండింటికి   నిలకడ లేదు. ఏ వొక్క ఆలోచన పైనా మీ మనస్సు అయిదు నిమిషాలు కూడా నిలువలేదు. ఆలోచనలూ, వాటితో బాటు, భావనలూ మారిపోతుంటాయి. ఈ నిమిషంలో - మీ బాసు జ్ఞాపకం వస్తే మనసు కోపంతోనో, భయంతోనో, ఏహ్యత తోనో - నిండచ్చు. అయిదు నిమిషాల తర్వాత మీ  భార్య జ్ఞాపకం వస్తే - మీరు ఆఫీసులోనే, ఆనందంగా ఈల వేయవచ్చు. సరే. మీ బాసు, మీ భార్య వీరి పట్ల మీ జ్ఞాపకాలను బట్టి - రివర్సు గానూ వుండచ్చు.ఆలోచనలూ, వాటితోబాటు తలెత్తే భావావేశాలూ - యివి రెండూ లేక పొతే మనసే లేదని చెప్ప వచ్చు. 

సంతోషమే సగము బలము -అన్నారు. నిజమే. మనసు సంతోషం గానూ, ప్రశాంతం గానూ, హాయి గానూ  - వుండడమే మానసిక ఆరోగ్యం. అలా లేకుంటే - మానసిక అనారోగ్యం. తమిళంలో - ఎప్పటిదో వొక మంచి పాట వుంది. దీనికి తెలుగులో అర్థం - కళ్ళు వెళ్ళే చోటికి, కళ్ళు వెళ్ళే విధంగా, కాళ్ళనూ పోనివ్వ వచ్చా? కాళ్ళు వెళ్ళాలీ,వెళ్ళాలీ అనే చోటికి, మనస్సును వెళ్ళనివ్వ వచ్చా?  మనస్సు వెళ్ళే చోటికి, మనస్సు వెళ్ళే విధంగా, మనిషి వెళ్ళ వచ్చా? - అని. నిజంగా,

యిందులో, ఎంతో మనస్తత్వ శాస్త్రం ఇమిడి వుందని చెప్పవచ్చు. కళ్ళకు అడ్డు లేదు. ఎక్కడికైనా వెడతాయి. పోరాని చోటుకు కళ్ళు పోకుండా మనం అడ్డు పెట్టాలి.  సరే. కళ్ళు చూసాయి. చూసినవన్నీ మనకు మంచి చేసేవి కావు. కానీ, మంచి చేయనివి ఎన్నో, మనను - రా,రా, అంటూ రెచ్చ గొడతాయి. మరి కళ్ళు చూసిన అటువంటి చోట్లకంతా, కాళ్ళు వెళ్ళ వచ్చా? ప్రమాదం, ప్రమాదం అని బుద్ధి హెచ్చరిస్తున్నా వినకుండా వొక్కో సారి కాళ్ళు అటువైపు దారి తీయ మంటాయి. అటువంటి చోటికి - మనసును వెళ్ళ నివ్వ వచ్చా? అటువంటి వెళ్ళ కూడని చోట్లకూ మనసు వెళ్లూ, వెళ్ళూ - అని తొందర పెడుతుంది. అట్టి చోట్లకు మనిషి వెళ్ళవచ్చా? వొద్దూ, వొద్దనే బుద్ధి మాట వినకుండా - మనసు చెప్పిన వైపు పరుగెత్తే వాళ్లకు ప్రమాదం ఎప్పుడూ పొంచి వుండనే వుంటుంది. బుద్ధి బలహీనంగా వుంటే - మంచి గురువుల మాట వినాలి. మంచి స్నేహితుల మాట వినాలి.

మానసిక ఆరోగ్యానికి కావాల్సింది యింతే. పంచేంద్రియాల పైన కాస్త నియంత్రణ.మనసుపైన కాస్త నియంత్రణ. యివి వుంటే - మానసిక ఆరోగ్యానికి కొరత  వుండదు.

దీన్ని గురించి - ఆధునిక మనస్తత్వ శాస్త్రము, మన ప్రాచీన మనస్తత్వ శాస్త్రము రెండూ ఏం చెబుతాయో - రెండింటికి గల వైవిధ్యమూ, వైరుధ్యమూ ఏమిటో మనం తెలుసుకోవాలి.

మనసే మన మిత్రుడు.మనసే మన శత్రువు అన్నాడు శ్రీకృష్ణుడు.

బుద్ధి మాట వినే మనసు మన మిత్రుడు. బుద్ధి మాట వినని మనసు మన శత్రువు.

మంచేదో చెడేదో తెలుసు.కానీ చెడే చేయమని నా మనసు చెబుతూ వుంటుంది - దాని మాటే వింటూ వచ్చాను.మంచి  తెలిసీ, చెడే చేసాను - అంటాడు దుర్యోధనుడు. దాని ఫలితం అనుభవించాడు.

భగవద్గీత  దాదాపు అంతా మనస్తత్వ శాస్త్రమే అని చెప్పవచ్చు. నా మనస్సు చాలా బలవత్తరంగా వుంది - అది నేను నా బుద్ధి అధీనం లోకి తీసుకు రాగాలనా - అని అర్జునుడు అడుగుతాడు. 

శ్రీ కృష్ణుడు  కూడా - ఔను. నిజమే. మనసును మన బుద్ధి అధీనం లోకి తీసుకు రావడం  కష్టమైన పనే. కాని నిరంతర సాధనతో చెయ్యాలి - అని అంటాడు.  మనసు మన బుద్ధి అధీనం లోకి రావాలి - అన్న జ్ఞానం మనకు పుట్టడమే  మొదటి సోపానం.

మరి ఈ కాలంలో - మనసు ఎలాచెబితే అలా నడుచుకోవాలనుకునే సమయంలో - యిది మరీ కష్టమైన పనే. మనసును తప్పు మార్గంలోకి తీసుకెళ్ల గల మార్గాలు, సాధనాలు ఎన్నో! టీ.వీలు, సినిమాలు, బార్లు,మనసును విచ్చల విడిగా విడిచే షికార్లు,   కంప్యూటర్లు , యింటర్ నెట్ లు -యిలా ఎన్నెన్నో . యివి కాక -మత్తు పదార్థాలు, రక రకాల దురలవాట్లు చేసుకోగల అవకాశాలు అందరికీ ప్రక్కనే వున్నాయి.

మనసును గురించి వొక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి.  మనసుకు ఏది  మనం అలవాటు చేస్తామో - దానికి అది బానిసగా మారుతుంది. అదే మళ్ళీ మళ్ళీ కావాలంటుంది. బుద్ధి అలా కాదు. ఏది మంచో, ఏది చెడో యోచన చేసి చెబుతుంది.  కానీ - ప్రతి సారీ - మనసు మార్గానికే ప్రాధాన్యత యిస్తే - తరువాత మనసు బుద్ధి మాట వినదు . బుద్ధి కూడా తన పని మానుకుంటుంది .యింక అధో మార్గమే నన్న మాట. 

అందుకే - చెడు అలవాట్లకు మొదటి సారీ "నో" అని చెప్పాలి. ప్రతి సారీ "నో" అని చెప్పాలి. లేదంటే - ప్రమాదమే. యివి అలవాట్ల సంగతి.
సరిగ్గా తెలుసుకుంటే - యిది  నిజంగా చిన్న విషయమే.  చెడు అలవాట్లను, మానసిక రోగాలను రాకుండా చేసుకోవడం అంత కష్టమైన విషయం కాదు. మీ  మనసులో, ఎక్కువగా కలిగే భావ ప్రకంపనలు ఎలాంటివి? లేదా - ఎక్కువ కాలం, మీ మనసులో -ఎలాంటి భావాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలు.

మీలో సాధారణంగా కోపం ఎక్కువా; కామం ఎక్కువా, మోహం  ఎక్కువా, గర్వం (మదం) ఎక్కువా -లోభం ఎక్కువా - యివన్నీ - చాలా సులభంగా మనమే తెలుసుకో గలిగే విషయాలు.  మనకు తెలియక పొతే - మన మిత్రులను అడగ వచ్చు. ఏ గుణం ఎక్కువో -అది,తనకు కావాల్సిన అలవాట్లు  తెచ్చుకుంటుంది. మిమ్మల్ని అటువైపు పరుగులు  తీయిస్తుంది. యిప్పుడు కళ్ళేలు మీ బుద్ధి చేతిలో లేవు కాబట్టి పరుగు పతనం వైపే వుంటుం ది.    

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, భయాలు - ఇవీ మీ నిజమైన మానసిక శత్రువులు. అంతః శత్రువులు. ఇవీ మీ నిజమైన మానసిక రోగాలు. వీటినే నకారాత్మక గుణాలు అంటారు.యివి మీ మనసులో ఎక్కువగా వుంటే -మీ మనసే మీ శత్రువని  మీరు నిర్ధారించ వచ్చు. మీకు మానసిక ఆరోగ్యం లేనట్టే లెక్క.

యివి కాక -ప్రేమ, దయ, వాత్సల్యము, కరుణ, ఆర్ద్రత, దానగుణము, ధైర్యము, శాంతము  లాంటి సకారాత్మక గుణాలు ఎక్కువగా వుంటే - మీ మనసు మీ బుద్ధి మాట కొద్దో, గొప్పో వింటూ వుందన్న మాట. యిక్కడ  మరొక మాట చెప్పుకోవాలి. ధైర్యము సకారాత్మకమా కాదా అన్నది - మన ధైర్యం దేనికి అన్న దానిపై  కూడా ఆధారపడి వుంది. దుర్యోధనుడి ధైర్యములో కామ, క్రోధ,లోభాదులన్నీ వున్నాయి. అప్పుడు - ఆ ధైర్యము కూడా నకారాత్మకమే అవుతుంది.

ఏ మనసులో - నకారాత్మక గుణాలున్నాయో - అది రోగ గ్రస్త మైన మనస్సు.

పైన చెప్పిన - కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, భయాలు  లేని మనస్సులో రోగాలు లేవు.


వీటన్నిటికీ - మూలమైన, ముఖ్యమైన మొదటి రోగము - కామము - అంటాడు శ్రీకృష్ణుడు. ఈ కామం - స్త్రీ పురుషుల మధ్య వున్న ఆకర్షణ కాదు. కామము అంటే కోరిక - ధర్మానికి లోబడని కోరిక. ధర్మానికి లోబడిన కోరిక ఏదీ నకారాత్మకం కాదు. మానసిక రోగం కాదు.

యుదిష్టిరుడు, పాండవులు కౌరవులతో చేసిన యుద్ధంలో   - ధర్మ బద్ధమైన కోరిక వుంది. కామము లేదు. దుర్యోధనుడి యుద్ధంలో కామము నిండి వుంది.

రావణుడి నాశనానికి కారణం పర స్త్రీ అయిన సీత పై మనసులో బలంగా నాటుకున్న   కామము. రాముడిలో సీతపై వున్న ప్రేమ ధర్మానికి కట్టుబడ్డ కోరిక.

సరే. ఈ కామము   లేదా అధార్మికమైన  కోరిక ఎక్కడినుండి పుడుతుంది? దీనికీ మరొక మూలం వుందా?

దీనికి సమాధానం - గీత లోని  మొట్ట మొదటి శ్లోకం లోనే   మనకు లభిస్తుంది. అధార్మికమైన కోరికలకు మూలం - అహంకారము, మమకారము.

ధృతరాష్ట్రుడు చెప్పే వొకే వొక గీతా శ్లోకంలో - మానవుల అతి ముఖ్యమైన, పతన కారణమైన రెండు గుణాలు - మహా భారత యుద్ధానికి మూలమైన రెండు మానసిక రోగాలు - అహంకారము, మమకారము గా - ధృత రాష్ట్రుని ముఖ్య గుణాలుగా యిక్కడ మనకు తెలుస్తుంది. అహంకారమంటే - నేను, అన్నీ నాకే కావాలి. నేనే గొప్ప అన్న తత్త్వం. మమకారం అంటే - అన్నీ నా వారికే కావాలి అన్న తత్త్వం. యివి రెండూ వున్న వారికి - నేనూ, నా వారూ - మేం బాగుండాలి. మిగతా వారు ఎలా పోయినా పరవాలేదు. అనేదే న్యాయము, ధర్మమూ.  యివి మానసిక రోగాలే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.

మనస్సు యొక్క ఆరోగ్యం ఏమిటి - మనస్సు యొక్క అనారోగ్యం ఏమిటి -ఇది  పైన  చెప్పిన విధంగా నిర్ధారితంగా తెలియనంత కాలం మనం మానసిక రోగాలకు యిచ్చే పేర్లు వేరుగా వుంటాయి.

ఉదాహరణకు - ఆధునిక మానసిక వైద్య శాస్త్రము మానసిక రోగాలకు ఇచ్చే పేర్లు చూడండి.

అక్యూట్ స్ట్రెస్  డిజార్డర్  
అంక్సైటీ     డిజార్డర్
డిప్రెషన్
ఇన్సోమ్నియా
మేగాలోమానియా
శిజోఫ్రేనియా
హిస్టీరియా  

-ఇలాంటి మానసిక వ్యాధుల పెద్ద లిస్టు మీరు క్రింద చూపిన వెబ్ సైటులో చూడొచ్చు:

http://en.wikipedia.org/wiki/List_of_mental_disorders 

యివి కాక - మానసిక వొత్తిడి -స్ట్రెస్ - అనేది పెద్ద వ్యాధిగా వుంది ఈ రోజుల్లో. అంతేనా? నిజానికి - దాదాపు ప్రతి భౌతిక వ్యాధికీ - మనసులోని ఏదో బలహీనత కారణం అంటున్నారు. అంటే - దాదాపు ప్రతి వ్యాధీ - సైకో సోమాటిక్ వ్యాధి (మానసిక-భౌతిక వ్యాధి) అని చెబుతున్నారు. మీకు వచ్చే పడిశం, జ్వరాలు, చర్మ వ్యాధుల నుండీ, కాన్సర్ వరకూ గల అన్ని వ్యాధుల వరకు  సైకో సోమాటిక్ వ్యాధులని చెబుతున్నారు.

కానీ - నిజమైన మానసిక వ్యాధులు యివి కావు. యివి వ్యాధి లక్షణాలు, వాటి ప్రభావాలు మాత్రమే. నిజమైన వ్యాధులు మొదట చెప్పిన ఏడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, భయాలు.వీటికి మూలమైన అహంకార, మమకారాలు.

వీటిలో-ఏదున్నా మరో పది రోగాలు తెచ్చి పెడతాయి. యిది అర్థం కానంత కాలం వైద్యులు ప్రతి లక్షణానికీ - వొక పేరు పెట్టి - అదే వ్యాధి అని -దాన్ని, మత్తు మందు, నిద్ర మందు, మెదడును మొద్దు పరిచే మందు లాంటి వాటితో వైద్యం చేస్తారు. సంవత్సరాల తరబడి వైద్యం చేసినా మానసిక వ్యాధులు తగ్గడం లేదన్నది - అందరికీ తెలుసు. తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తూ వుంది. మందుల వలన - రక రకాల శారీరక వ్యాధులూ పుట్టుకొస్తున్నాయి.

అసలు రోగాలైన కామ, క్రోధాదులు  పొతే కానీ -  మానసిక రోగం పోనే పోదని - ఘంటా పథంగా చెప్పొచ్చు.
యివి లేక పోతే - మానసిక రోగాలు దాదాపు లేవని, రావని  చెప్ప వచ్చు.

అయితే - ఇవి కాక, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు కొన్ని వున్నాయి. అవి భౌతిక వ్యాధులే అయినా - మెదడును , అందులోని నరాలను బలహీన పరిచేవి అయి వుండడం వలన - మానసిక వ్యాధులుగా పరిగణించ బడతాయి.  ఉదాహరణకు - అల్జీమర్స్, డెమెంషియా, పార్కిన్సంస్ లాంటివి. యివి కూడా - మొదటి నుండీ - మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకునే వారికి - చాలా వరకు రావని చెప్ప వచ్చు.

సరే. ఈ మానసిక రోగాలు -రాకుండా ఎలా చేసుకోవాలి?

 బాల్యంలో - మనకు చెప్పిన చిన్న చిన్న నీతి పద్యాలు - పాటిస్తే చాలు.

ఉదాహరణకు - "తన కోపమె   తన శత్రువు, తన శాంతమె   తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమె   స్వర్గము, తన దుహ్ఖమె  నరకమండ్రు తథ్యము సమతీ" అన్నారు."

మీ కోపము మీ శత్రువు - అనేది మీకు పూర్తిగా అర్థమయిందా? లేదా - అదేదో - మీకు చాలా ముఖ్యమైన  ఆయుధం, మీ మిత్రుడు   అనుకుంటున్నారా?

మీకు కోపం వస్తే మీలో ఏమవుతుందో కొద్దిగా తెలుసా?

మీ రక్తపు పోటు చాలా  ఎక్కువవుతుంది.

పళ్ళు కొరుకుతారు. ముష్టి బిగిస్తారు. చెమట ఎక్కువగా పడుతుంది. శరీరమంతా -పాలిపోవచ్చు.  మీలో అడ్రినాలిన్ అనే హార్మోను ప్రసారం ఎక్కువవుతుంది. వెంటనే - ఏదైనా చేసేయాలని ఆత్రుత వుంటుంది.
మీ మెదడులోని అమిగ్డాలా భాగం రకరకాలుగా పనిచేస్తుంది.ఏదో ప్రతీకార చర్య చేసేయాలని పరుగెడుతూ వుంటుంది.
మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీ శ్వాస వేగంగా జరుగుతుంది. మీకు తల నొప్పి రావచ్చు  నిద్ర రాకపోవచ్చు.  చర్మరోగాలు ( ఎక్జేమా లాంటివి) రావచ్చు. యింకా ఎన్నో అవాంఛనీయ మార్పులు మనలో జరుగుతాయి.  

నిజానికి ఎన్నో రకాల మానసిక, మరియూ భౌతిక రోగాలకు మూల కారణం మీలోని కోపం; కోపానికి మూల కారణం అధార్మికమైన కోరికలు (కామము). మనిషి లోని  కోరికలు రెండు విధాలు.

ఏదో లేనిది -కావాలని.

ఏదో వున్నది - పోవాలని.

లేనిది కావాలి; వున్నది పోవాలి. యివి రెండు తప్ప మరేదైనా కోరికలున్నాయా - ఏవీ లేవు.

ఈ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. ఉదాహరణకు - పొగడ్త కావాలి.తిట్టడం పోవాలి. మిమ్మల్ని గురించి తిట్టడం అలవాటుగా వున్న వారికి - ఆ అలవాటు పోవాలని మీరు కోరుకుంటారు. మిమ్మల్ని తిట్టడం వున్నది. అది ఆ తిట్టే వారికి పోవాలి. పొగడడం లేనిది. అది వారికి రావాలి. అదే మీ శత్రువులను తిడుతూ, మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారనుకోండి. సరే. యిదేదో బాగానే వుందనుకొంటారు.  బంగారం కావాలి.  ధనం కావాలి. బలం కావాలి. రోగం పోవాలి. దుహ్ఖం పోవాలి. శత్రువులు పోవాలి. మిత్రులు కావాలి.

ఇలాంటి కోరికల ప్రవాహమే - మనస్సు. వీటిని - సక్రమ మార్గంలో పెట్టేదే బుద్ధి. బుద్ధి మాట వినని మనస్సు ఎలా వుంటుంది?

మనసుకు పగ్గాలు లేకుండా  విడిస్తే  అదేం చేస్తుంది?

రావణుడు మొదట పార్వతీ దేవిని కూడా మోహించినట్టు;  శివుడి  దగ్గర బాగా శిక్ష పడి, ప్రాయశ్చిత్తమైనట్టు;  తరువాతనే నిజమైన శివ భక్తుడైనట్టు - కథ. శివుడు తనకంటే మహా బలవంతుడని గ్రహించిన తర్వాత  బుద్ధి వచ్చింది. మళ్ళీ నలకూబరుడి భార్య అయిన రంభను చెరుస్తాడు. అక్కడ మళ్ళీ పగ్గాలు లేని, కోరికల ప్రకోపమే.బల గర్వమే.  ఎన్ని శాపాలు వచ్చినా యిది మాత్రం పోలేదు.  మళ్ళీ రాముడేం చేయగలడని ధీమాతో సీతమ్మను ఎత్తుకు వెడతాడు. అంతే. లంకతో బాటు  తానూ నాశనమౌతాడు. అధార్మికమైన కోరిక వల్ల ఎవరైనా నాశనమౌతారని  చెప్పడమే - రామాయణం. భారతమూ - అంతే. రావణుడిపై రాముడి విజయం - మనసుపై బుద్ధి విజయం. కౌరవులపై పాండవుల విజయం - మనసుపై బుద్ధి విజయం.

అన్ని సమస్యలకూ మూల కారణం - మనసులో - అతిగా వున్న, అధార్మికమైన కోరికలే.

కోరికలు తీరితే లోభము, మోహము, మదము మన మనస్సులో చోటు చేసుకుంటాయి. కోరికలు తీరకపోతే, క్రోధము, మాత్సర్యమూ , భయమూ  వస్తాయి.

అందుకనే శ్రీ కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, ఆది శంకరుడు-అందరు మహానుభావులూ - కోరికలను, ధర్మ మార్గంలో పెట్టుకోమన్నారు.ధర్మ మార్గంలో తీర్చుకోమన్నారు.

సరే. ధర్మ మార్గంలో కోరిక -ఎంత వుండొచ్చు? అతి సర్వత్ర వర్జయేత్. ఏదీ అతిగా వుండకూడదు. మీరు ఎంత  పని చేస్తారో - అంత లాభం వుంటుంది. సంతోషం కోరికలో లేదు. కోరిక వలన వచ్చిన లాభంలోనూ లేదు. మీరు ఆ లాభాన్ని అనుభవించే విధానంలో వుంది. నిజానికి - మీ లోనే ఆనందం వుంది.  బయటి నుండి వచ్చిన వాటిలో కాదు.

పది మంది భార్యలో, భర్తలో వున్న వారికి - భౌతిక కామం పది రెట్లు తీరుతుందన్న మాట ఏమీ  లేదు.అనురాగవతి(వంతుడు) అయిన భార్య (భర్త),  వుంటే చాలు.

మీకు తెలుసా. వసిష్టుడు, అరుంధతి - లకు నూరుగురు కొడుకులని. వారు - అరణ్యం లో తమ ఆశ్రమంలో - తపస్సులో వున్న వారు. వసిష్టుడి తపస్సు వొక రకం. అరుంధతి తపస్సు వొక రకం. ధర్మేచ, అర్థే చ,   కామేచ నాతిచరామి - అన్న సిద్దాంతం పాటించిన వారు ఎంత ఆనందాన్ని అనుభవించ గలరో -ఈ దంపతులే సాక్ష్యం. సంతోషంగా వుండడం ఎలా - అన్న దానిపై మన వారు చేసినంత  రీసెర్చి -మరే దేశంలోనూ, ఈ కాలం లోనూ జరగలేదని -చెప్పవచ్చు. అది - భౌతికమైనా సరే, మానసికమైన సరే - ఆనందానికి మూలం నిర్దిష్టంగా తెలుసుకున్న వారు మన వారు.

అందుకే - మనసు బుద్ధి మాట విని, బుద్ధి  మార్గంలో నడవాలి కానీ - తనలో లేచే కోరికల ప్రవాహంతో బాటు పొతే -  దుర్గతే నని మళ్ళీ మళ్ళీ చెప్పారు.

భౌతిక కామానికి - వొక కామ శాస్త్రం రచింప బడినది - మన దేశంలో మాత్రమే నని మరిచి పోకూడదు. అర్థ శాస్త్రమూ వుంది. ధర్మ శాస్త్రమూ వుంది. మోక్ష శాస్త్రమూ వుంది మన దేశంలో. ఏ చెట్టు ఆకులలో, బెరడులో, వేరులో, కాయలో, పూవులో, పండులో - ఏ రోగానికి ఔషధం దాగి వుందో - యిప్పటికీ మన వారికి తెలిసినట్టు - ప్రపంచంలో - మరెక్కడా తెలీదు.

మరి పాశ్చాత్యులకు - మన కామ శాస్త్రం మాత్రం కావలసి వచ్చింది కానీ - అంత కన్నా ముఖ్యమైన ధర్మ, అర్థ, మోక్ష, ఆయుర్వేద శాస్త్రాల లాంటివి కావాల్సి రాలేదు. అందుకే - ప్రతి వొక్కరూ -మానసిక వైద్యుల వద్దకు వెళ్లి వస్తుంటారు.   మనసుకు పగ్గాలు వేయనంట కాలం ఈ పరిస్థితి యింకా ఎక్కువవుతుంది - కానీ తగ్గే అవకాశం లేదు.  

సరే. కోపానికి మూలమైన కోరికను గురించి - ఆధునిక శాస్త్రాలకు తెలియనే తెలియదు.

కోపమెలా తగ్గడం - అని రీసెర్చి  చేస్తున్నారు. అవన్నీ తప్పని అనడం లేదు. కోపమొస్తే - ఆ స్థలం నుండీ - దూరంగా వెళ్ళమన్నారు.చల్లటినీళ్ళలోముఖం కడుక్కోవడమో, స్నానం చేయడమో చెయ్య వచ్చు. కళ్ళు మూసుకుని వొకటి నుండి పది వరకు లెక్క పెట్ట వచ్చు.

చాల, చాలా ముఖ్యమైనది - ప్రతి మానసిక రోగానికీ - యిప్పుడు "యోగ" చేయమంటున్నారు. అందులో మంచి జరుగుతూ వుందన్న విషయం పాశ్చాత్యులకూ అర్థమైంది. కానీ -ఎలా అన్నది యింకా అర్థం కాలేదు వారికి .

యోగ - అంటేనే పతంజలి చెప్పిన నిర్వచనం - "యోగః చిత్త వృత్తి నిరోధః" అని. అంటే - మనసును అదుపులో ఉంచడమే యోగ - అని  అర్థము.  యోగ  శాస్త్రాన్ని  గురించి  మీరు  పూర్తిగా ,  వివరంగా  తెలుసు కోవాలనుకుంటే - ఆంగ్లంలో వున్న నా బ్లాగు "వై స్ స్పిరిచువల్  ఐడియాస్.బ్లాగ్ స్పాట్ . కాం" లో చదవ వచ్చు.

కోపమొస్తే - రెండు రకాల  రీయాక్షన్లు మనలో జరగ వచ్చు.     వొకటి - ఎదుటి వాడితో కొట్లాడుతాము. రెండవది - అక్కడి నుండి వెళ్లిపోతాము. ఆంగ్లంలో - ఫైట్ మరియు ఫ్లైట్ అంటారు వీటిని. మనకు బలం వుందనిపిస్తే   మొదటి పధ్ధతి. లేదనిపిస్తే - రెండవది. బలం లేకున్నా కొట్లాడమన్నారు కొన్ని పరిస్తితులలో - పరాయి మగ వాడు ఎంత బలవంతుడైనా - భార్యనుకానీ, తల్లిని కానీ, కూతురిని గానీ అవమానపరిస్తే, మానహరణ చేయాలనుకుంటే - ఫైట్  - కొట్లాడడమే  కానీ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు మగ వాడికి. ప్రాణం పోయినా పరవాలేదు.

రెండు కుక్కలు కొట్లాడుతుంటే -వాటిల్లో ఏది గెలుస్తుందో  చెప్పమని వొక పెద్దాయనను అడిగారట.పెద్దదా, చిన్నదా.  తెల్లదా, నల్లదా?  అవేవీ కాదు. ఏ కుక్కలో ధైర్యం ఎక్కువో - అదే గెలుస్తుందన్నాడట   ఆయన. ఎంత పెద్ద కుక్కైనా - ధైర్యం చాల ఎక్కువగా వున్న చిన్న కుక్క దగ్గర ఎక్కువ సేపు నిలువ లేదు. 

మీలో కోపం ఎక్కువగా వుందా - అన్నది ప్రశ్న కాదు.  మీలో బలం ఎక్కువగా వుందా అన్నది కూడా ప్రశ్న కాదు. మీలో ధైర్యం వుందా? సాహసం వుందా? మీ ఆదర్శం కోసం ప్రాణాలు కూడా అర్పించే నిరతి వుందా? యిది చాలా ముఖ్యం. ధైర్యమూ, బుద్ధి బలమూ - వున్న చోట, విజయమూ, సంతోషమూ ఎల్లప్పుడూ వుంటుందన్నది  గీతా వచనం. "యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర  పార్ధో ధనుర్ధరః  తత్రశ్రీర్విజయో భూతిహ్  ధృవా నీతిర్ మతిర్ మమ" . గీతా శాస్త్రం అంతా మనం భూమ్మీద సంతోషంగా వుండడం ఎలాగో తెలిపే శాస్త్రమే.

యిక్కడ బుద్ధిబలం శ్రీకృష్ణుడు. ధైర్యమూ మనోబలము - అర్జునుడు. యివి రెండూ వున్న చోట - శ్రీ (అంటే, ఐశ్వర్యమూ, సంతోషమూ) మరియూ విజయోహ్    (అంటే - సదా విజయమే అన్న మాట) -రెండూ ఎప్పుడూ వుంటాయని చెబుతూ - గీతను సమాప్తం చేస్తారు.

ఇదండీ   - మానసిక ఆరోగ్యానికి వొక ముఖ్య మూల సూత్రము - ధైర్యమూ, బుద్ధిబలమూ.  యివి రెండూ - అలవరుచుకోండి. మాటిమాటికీ బుద్ధి మాట వినండీ - అని చెబుతున్నాము. ఎందుకంటే - మనసే సంతోషాన్ని యివ్వ గలిగేది - కానీ నిరంతర సంతోషానికి మార్గం చూపేది బుద్ధి మాత్రమే.

అయినా - మానసిక రోగాలూ, ఆరోగ్యాలూ - గురించి మరి కాస్త చాలా ముఖ్య విషయాలు మనం తెలుసుకో వలసి వుంది. అవి మరో వ్యాసంలో.


= మీ

వుప్పలధడియం విజయమోహన్  

17, అక్టోబర్ 2011, సోమవారం

మానసిక ఆరోగ్యానికి మూల సూత్రాలు - మనసూ - బుద్ధీ ఎలా పనిచేస్తాయి - మీకు సంతోషం కావాలంటే తిరుగు లేని మార్గం


మనో మయ కోశము
మానసిక ఆరోగ్యానికి మూల సూత్రాలు 

క్రిందటి వ్యాసంలో ప్రాణమయ కోశాన్ని గురించి  తెలుసుకున్నాము. అందులో, ముఖ్యంగా  మనం గుర్తుం చుకోవలసినవి   -
  1.  స్వచ్చమైన గాలి వున్న చోట నివసిస్తే - ఆరోగ్యం బాగుంటుంది.  గాలిలో రక రకాల పొగలు, కార్బన్ మోనాక్సై డు, వుండే చోట - రోగాలు ఎక్కువగానే వస్తాయి.   కార్బన్ మోనాక్సైడు - మోటారు వాహనాల నుండి ఎక్కువగా వస్తుంది.
  2. కొంత మందికి పూల పుప్పొడి అలెర్జీ గా వుంటుంది. ఆస్తమా ,ఉబ్బసం వున్న వారికి. అటువంటివారు - పూల చెట్ల కంటే  - యితర  చెట్లు వేసుకోవడం మంచిది. కానుగ, రాగి, మద్ది చెట్ల గాలి చాలా మంచిదని చెబుతారు. ఏ చెట్ల గాలైనా మంచిదే. కానీ - వీటికి - కొన్ని ప్రత్యేకతలు  వున్నాయి.
  3. కొన్ని రకాల సులభమైన ప్రాణాయామాలు ప్రతి వొక్కరూ నేర్చుకుని, ప్రతి దినం చేస్తే చాలా ఆరోగ్యకరం.యివి శారీరక, మానసిక ఆరోగ్యాలకు రెండింటికీ  మంచిది. ముఖ్యంగా అనులోమ విలోమ; భ్రామరి; కపాలభాతి లాంటివి. వీటి ప్రయోజనం  -  మనం కొద్ది రోజులలోనే చూడవచ్చు.
  4. బ్రాహ్మీ ముహూర్తం లోను, సాయంకాలం లోనూ - సూర్య కిరణాల ఎదురుగా - ప్రాణాయామము, ధ్యానము చేయడం చాలా మంచిది.
  5. మీకు ప్రాణాయామం తెలియకుంటే - మీ ఉచ్చ్వ్వాస, నిశ్వాసలను  - ప్రశాంతంగా, హాయిగా గమనిస్తూ కూర్చోండి. మధ్యలో, మీ మనసు మరెక్కడికో వెళ్ళుతూ వుంటే - ఫరవాలేదు. మళ్ళీ దాన్ని  మీ ఉచ్చ్వాస, నిశ్వాసల పైకి మళ్లిం చండి. దీన్ని  శ్వాస మీది ధ్యాస అని చెప్పుకోవచ్చు.
  6. మీకు మంచి గురువు దగ్గర నేర్చుకునే వీలుంటే - రక రకాల ప్రాణాయామాలను సాధన చేయడం నేర్చుకోండి. 
యిక మనో మయ కోశాన్ని గురించి, మానసిక ఆరోగ్యాన్ని గురించి చూద్దాము.  దీన్లో - ముఖ్యంగా నాలుగు భాగాలు వున్నాయి. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనేవి. నాలుగూ -నాలుగు రకాల పనులు చేస్తుంది.

మనస్సులో - భావుకత ఎక్కువ. ఎమోషనల్ నేచర్ అంటాము కదా .  అదన్న మాట.

బుద్ధి - మంచి, చెడుల వివరణ - తనకు తెలిసినంతగా చేసి,  మనస్సు కు చెబుతుంది.

కొంత మంది మనస్సుకు ప్రాధాన్యత యిస్తారు. కొంత మంది బుద్ధికి ప్రాధాన్యత  యిస్తారు.రెండూ ముఖ్యమే. రెండింటికీ సమాన   ప్రాధాన్యత వుంది - జీవితం లో.

మనిషి జీవితంలో సంతోషంగా వుండాలని కోరుకుంటాడు.  సంతోషంగా వుండటం మనసుకే సాధ్యం. కాని - మంచి చెడులు తెలియకుండా సంతోషంగా వుండటానికి ప్రయత్నించే వారికీ - జీవితం దుహ్ఖ మయమై  పోతుంది. దుహ్ఖం కూడా మనసుకే సాధ్యం. సంతోషమూ, దుహ్ఖమూ అనుభవించ గలిగేది - మనస్సు. మనలను వాటి వైపు పరుగు తీయించేది  మనస్సు. దుహ్ఖం లో పడితే - బయటకు రాలేక అవస్థ పడేది మనస్సు.

వీటి నుండి మనల్ని కాపాడ గలిగేది బుద్ధి.  బుద్ధికి సంతోషమూ లేదు. దుహ్ఝామూ లేదు. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం వుంది. మనసుకు ఆలోచన వుంది. కాని అది చాలా భావుకతతో కూడిన ఆలోచన.మనసుకు మంచి చెడు చెప్ప గలిగేది బుద్ధి. ఈ రెండూ - వికసించిన మనిషిలో, సంతోషమూ వుంది. తనను తాను కాపాడుకునే నేర్పూ వుంది. సంతోషాన్ని, జీవితాంతమూ కాపాడుకోగలిగే సమర్థతా వుంది.

అహంకారము - అంటే - నేను అనే వ్యక్తిత్వ పరిధి. ఈ శరీరం నేను. ఈ ఆలోచన నేను చేస్తున్నాను. ఈ సంతోషమూ, దుహ్ఖమూ - నేను అనుభవిస్తున్నాను.  అని మనకు చెప్పేది అహంకారము.

చిత్తము అనే భాగంలో - మన భూత కాలమంతా వుంది. మన అనుభవాలన్నీ వున్నాయి. మన విజ్ఞానమంతా  వుంది. సరే. అన్ని భాగాలను కలిపే భాగం కూడా యిదే అని చెప్పొచ్చు.

బుద్ధికి - మంచి, చెడూ - ఎలా తెలుస్తుంది? యిది - చాలా ముఖ్యమైన ప్రశ్న.   

బుద్ధి - మనకు - ఆత్మ స్వరూపమైన భగవద్ చైతన్యానికీ మధ్య  వారధి లాంటిది. బుద్ధిలో - ఈ విశ్వ వ్యాప్త   చైతన్యం యొక్క ప్రతిబింబం ప్రతిఫలిస్తూ వుంటుంది. ఆ చైతన్య ప్రతిబింబం బుద్ధిలో ప్రతిఫలించడం వలననే - మన శారీరక, మానసిక జీవనంలో - చైతన్యం వుంది. అది లేని నాడు - మనలో మరి చైతన్యం లేదు.  దీన్ని గురించి ఆది శంకరుల  వారు - తమ వివేక చూడామణి, ఆత్మ బోధ లాంటి గ్రంధాలలో - "చిదాభాస"  అని పేరు పెట్టి - విశదీకరించారు . దీన్ని గురించి మరింతగా తెలుసికోవాలనుకునే వారు - ఆంగ్లములో వున్న నా బ్లాగు - వైస్ స్పిరిచువల్ ఐడియాస్.బ్లాగ్స్పాట్. కాం. లో చదవ వచ్చు.

మనకు సంతోషం కావాలి. అది జీవిత గమ్యం. అదీ నిజమే. కాని - బుద్ధి మాట  వినకుండా సంతోషం వెనుక పొతే - దుహ్ఖంలో మునిగిపోతాం. సంతోషానికి గమ్యం - దానికి మార్గం బుద్ధి - అన్న మాట. బుద్ధికి ప్రాధాన్యత యిస్తూ సంతోషం వెతుక్కుంటూ పోయే వారికి - జీవితం హాయిగా వుంటుందన్న మాట.

అయితే - దేవుడి సృష్టి విచిత్రమైనది. ఈ విషయంలో - మగ వారికీ, ఆడ వారికీ - కాస్త తేడా సృస్టించాడు.

సగటు ఆడవారు - అరవై శాతం పైగా - మనసుకే ప్రాధాన్యతనిస్తారు. యిది వారు అనుకుని చేసేది కాదు. సృష్టి విచిత్రం. అంటే - బుద్ధికి - నలభై శాతం కంటే తక్కువ ప్రాధాన్యత అన్న మాట. యిది మంచా చెడా అంటూ ఏమీ లేదు. సృష్టి యిలా వుంది. అంతే.   సంతోషాన్ని అనుభవించ గలిగే సామర్థ్యమూ, ఆడవారికే ఎక్కువ. దుహ్ఖ పడే సంభవాలూ వారికే ఎక్కువ. మమసుకు ప్రాధాన్యత ఎక్కువ, బుద్ధికి ప్రాధాన్యత తక్కువ యిస్తారు. అయితే - యిది సగటు ఆడవారిని గురించి - అంటే, 95 శాతం పైగానే వున్న వారిని గురించి -   చెబుతున్నాము.

కొంత మంది  ఆడవారు - బుద్ధికి ఎక్కువ ప్రాధాన్యత యిస్తూ వుండడం మనం చూడొచ్చు. అయితే - వారిలో, సంతోషం తగ్గి పోవడమూ మనం చూడొచ్చు. అదే విధంగా - కొంత మంది ఆడవారు - భావుకతకే ప్రాధాన్యత నిస్తూ - చిన్న విషయాలకు ఎక్కువ దుహ్ఖ పడడమో, సంతోష పడడమో కూడా మనము చూడొచ్చు.

సగటు మగ వారి విషయం యిందుకు మారుగా వుంటుంది.

సగటు మగ వారు - అరవై శాతం పైగా, బుద్ధి కే ప్రాధాన్యతనిస్తారు. యిది వారు అనుకుని చేసేది కాదు. యిదీ సృష్టి  విచిత్రమే. అంటే, మనసుకు - నలభై శాతం కంటే తక్కువ ప్రాధాన్యత  యిస్తారన్న మాట. యిది కూడా మంచా చెడా అంటూ ఏమీ లేదు. సృష్టి యిలా వుంది. అంతే.   ముందే చెప్పినట్టు,  సంతోషాన్ని అనుభవించ గలిగే సామర్థ్యమూ -ఆడవారికే ఎక్కువ. దుహ్ఖ పడే సంభవాలూ వారికే ఎక్కువ. మగవారికి తక్కువ. ఎందుకంటే -మగవారిలో మనసుకు ప్రాధాన్యత తక్కువ. బుద్ధికి ప్రాధాన్యత ఎక్కువ. అయితే - యిది సగటు మగ వారిని గురించి చెబుతున్నాము.

కొంత మంది  మగ వారు - మనసుకు ఎక్కువ ప్రాధాన్యత యిస్తూ, బుద్ధికి తక్కువ ప్రాధాన్యత నిస్తూ  వున్న వారినీ మనం చూడొచ్చు. వారిలో - కోపాలూ, తాపాలూ, చెడు సావాసాలూ, చెడు అలవాట్లకు లోను కావడమూ మనం చూడొచ్చు. చిన్న వాటికి పొంగి పోవడమూ, క్రుంగి పోవడమూ కూడా వీరిలో జరుగుతూ వుంటుంది. అదే విధంగా - కొంత మంది మగ వారు  - బుద్ధి జీవనానికే ప్రాధాన్యత నిస్తూ - సంతోషమూ, దుహ్ఖమూ - ఏమిటో కూడా తెలియకుండా వుండడమూ, ఎప్పుడూ, రాజకీయాలు, సైన్సు లాంటి వాటిలో - మునిగి వుండడం మనం చూడొచ్చు.

మగ వారు - బుద్ధి జీవనానికి ప్రాధాన్యత యివ్వ గలరు. యివ్వాలి కూడా. కాని సంతోషం అనుభవించడం కూడా తెలిసి వుండాలి; అనుభవించాలి. అంటే - బుద్ధీ, మనసూ 60 : 40 నిష్పత్తిలోనే వుండాలి వారిలో.

కానీ - ఆడ వారు, మానసిక జీవనానికి ఎక్కువ  ప్రాధాన్యత యివ్వ గలరు. యివ్వాలి కూడా. అయినా బుద్ధి జీవనం కూడా తెలిసి వుండాలి. మంచీ, చెడూ ఆలోచించ గలగాలి. సంతోషం అనుభవించడం పుట్టుకతోనే ఎక్కువగా వున్న గుణం;ఆలోచన అలవారుచుకోవలసిన గుణం. అంటే - బుద్ధీ, మనసూ 40 : 60 నిష్పత్తిలోనే వుండాలి వారిలో.  

సరే. మగ, ఆడ కలిసి జీవించడంలో అంతరార్థం ఏమిటి?  శివుడిని అర్ధ నారీశ్వరుడని చిత్రించడంలో అంతరార్థం ఏమిటి? ఆడ మగ కలయికలో మాత్రమే - సంతోషం (60  + 40 ) పూర్తిగా  100  శాతమూ, బుద్ధి కూడా ( 40 + 60 ) పూర్తిగా  100  శాతమూ యిద్దరికీ వస్తుంది. యిది ప్రకృతి నియమం.  

ఇద్దరినీ కలిపే బంధం - అనురాగము, బుద్ధి రెండూ అయి వుండాలి. అంతే.

మహర్షులలో మొదటి వాడుగా పేరు పొందిన వసిష్ఠ మహర్షి - అరుంధతిని విడిచి ఎప్పుడూ వుండలేదు. పార్వతి, శివుడు దూర దూరంగా వుంటే - యిద్దరిలోనూ - పరిపూర్ణత ఉండదని - పురాణాలు ఎలుగెత్తి చెప్పాయి. చాలా మంది ఋషులూ యిదే ఆదర్శం పాటించారు.

సరే. మగ, ఆడ వారిలో - ఏ వొక్కరైనా- బుద్ధి, మనస్సు సమంగా వుంచుకోగాలరా?  వుంచుకోవచ్చు. కానీ - 50 , 50  శాతం   మాత్రమే వుంచుకో గలరు.  రెండూ నూరు శాతం వుండాలంటే - యిద్దరూ - వొకటిగా వుండాలి.  యిదీ మనోమయ కోశానికి మొదటి సోపానం.
ఇది అర్థం కాకుండా - వొకరికొకరు పరిపూర్ణతను - యిచ్చే వారని తెలుసుకోకుండా - నేను గొప్ప, నువ్వు గొప్ప అనో, సమానత్వం కోసమనో  -  ప్రాకులాడడం - అర్థం లేని పని.

ఈ లోకంలో - ఏ ప్రాణికీ - మరొక ప్రాణి సమానం కాదు. కాలేదు.సృష్టే అలాంటిది. సర్వే జనాః సుఖినో భవంతు - అన వచ్చు; అది సాధించవచ్చు  - కానీ - సర్వే జనాః సమానో భవతు  - అనడం  కుదరదు. అది జరగదు. దేని ప్రత్యేకత దానిదే.

మనోమయ కోశము యొక్క  గమ్యం - అంటే మనిషి గమ్యం - సంతోషమే. కానీ - దీనికి మార్గం బుద్ధి. వొకటి వొకరి వద్ద - మరొకటి, మరొకరి వద్ద - ఎక్కువగా వుంది. అంతే.

మన ప్రాచీనులు - పురుషార్థాలు నాలుగు - ధర్మ, అర్థ, కామ, మోక్షాలు - అన్నారు. యిక్కడ, పురుష అన్న పదం అడ, మగ, యిద్దరికీ వర్తిస్తుంది.

మొదటి పురుషార్థం ధర్మము అన్నారు. అంటే - ఏ పని చేసినా - ధర్మ మార్గం లో నే - చెయ్యాలని అర్థం.  ఏ పనికైనా అధర్మ మార్గం పనికి రాదు. ఎందుకు?

ఉదాహరణకు - మీరు దొంగతనం చేసో, లంచగొండి తనం తోనో - కోటి రూపాయలు సంపాదించారనుకోండి. యిప్పుడు. కోటి రూపాయలు మీ దగ్గరున్నాయి. నిజమే. కానీ - దీనికి తగ్గ సంచిత కర్మ ఫలం - మీ పైన అదృశ్యంగా వున్న కర్మ ఫల సంచి లో చేరుతుంది. అది - మీ జీవితంలో, ఎప్పుడు, మిమ్మల్ని - ఎంత ఘోరంగా, దెబ్బ తీస్తుందో, మీకు - యిప్పుడు తెలీదు.  కాని - మీ సంచిత కర్మ ఫలం, మీరు అనుభవించడం మాత్రం తథ్యం. ఈ జన్మలో అది పూర్తి కాక పోతే - వచ్చే జన్మలో కూడా, మీ వెంటే వస్తుంది. మీ జన్మనూ, ఆయుస్సునూ, సుఖ,దుహ్ఖాలనూ - చాలా వరకూ శాసి స్తుంది. చెడ్డ మాత్రమే కాదు, మీరు చేసే మంచిపనుల ఫలితం కూడా మీతో బాటు వస్తుంది.

కానీ - ఈ రోజు మీరు మంచి పనులు చేస్తారా, మంచి మాటలు మాట్లాడుతారా, ఏ పనులు చేస్తారు, అన్న స్వాతంత్ర్యం మీకు వుంది. అది మీ మనస్సు పైన మీకు వున్న అధికారం పైన, మీ బుద్ధి పైన మీకు వున్న అధికారం పైన ఆధార పడి వుంది.

మంచి పని చేసినా - బుద్ధి ప్రేరేపణ తోనే చేస్తారు. దానికి, మొదట మీ మనసు సంతోష పడుతుంది. అయితే - వొక్కో సారి - మంచి పనికి చెడ్డ ఫలితం వచ్చినట్టు భ్రమ కలుగుతుంది. యింతకు ముందు వొక వ్యాసంలో - ప్రతి పనికీ రెండు రకాల ఫలితాలున్నట్టు చెప్పుకున్నాము. వొకటి దృష్ట ఫలం. రెండవది అదృష్ట ఫలం.

ఇప్పుడు మీరు చేసిన వొక మంచి పనిని దృష్టాంతంగా చూద్దాము. మీరు వొక అనాథ బాలుడికి విద్యా సౌకర్యం కోసం పది వేల రూపాయలు అతడి స్కూలులో యిచ్చేసి వస్తున్నారు. వస్తూ, వస్తూ దారిలో వొక గోతిలో పడ్డారు. బాగా గాయ పడ్డారు.  మీ మనసులో - వొక మంచి పని చేసిన దానికి,  నాకొచ్చిన బహుమానం యిదా - అనిపించ వచ్చు. కానీ అది సరి కాదు. మీరిచ్చిన డొనేషన్ కు మీకు -దృష్ట ఫలం గా సంతోషం కలిగింది. 

అన్యాయంగా - పదివేల రూపాయలు పోయిందే - అని మీరు అనుకోకుండా, హృదయపూర్వకంగా ఈ పని చేసుంటే మీకు తప్పక సంతోషం కలుగుతుంది. దీన్ని కొన్ని దశాబ్దాలు - తలుచుకుంటూ - చాలా మంచి పని చేసాను అని పొంగి పోతుంటారు. ఈ సంతోషం దృష్ట ఫలం. కానీ, పది వేల రూపాయలు పోయిందే అనుకుంటే - అది పాపమే అవుతుందే కానీ పుణ్యం కాదు. అయ్యో అనుకునే పనులు చేయకండి. నిజమైన పుణ్యానికి  దృష్ట ఫలం గా సంతోషం తప్పక కలుగుతుంది; వెంటనే కలుగుతుంది.

సరే. మీరు ప్రస్తుతం చేసిన ఏదైనా పుణ్య కార్యం ఫలితం ఎలా వుంటుందో చూడండి :

యిప్పటి పుణ్య కార్య ఫలితం = (1 )  ఈ పని యొక్క దృష్ట ఫలం సంతోషం  +  (2 ) ఎప్పటిదో అయిన  పుణ్య  పాపాల ఫలితం గా ఏదో వొక అదృష్ట ఫలం.

వొక ఫలితం యిప్పటిది. యింకొకటి ఎప్పటిదో. రెండూ కలిసి వస్తుంది. ఈ రెండవది ఎప్పటిదో, దేనిదో, మీకు తెలీదు. కానీ - ఈ రోజు చేసిన పుణ్య కర్మ యొక్క అదృష్ట ఫలం కూడా మరెప్పుడో మీకు తప్పక వస్తుంది. ఉదాహరణకు - మీరిచిన డొనేషన్ కు ఫలితం యిలానూ వుండచ్చు

దృష్ట ఫలం గా  యిప్పుడే సంతోషం (+) అదృష్ట ఫలం గా  మీకు కొన్ని నెలల తర్వాత, లేదా కొన్ని సంవత్సరాల తర్వాత,  ఏ సత్కారమో జర గొచ్చు, పేరు ప్రతిష్టలు రావచ్చు. పెద్ద పదవి రావచ్చు. ఎన్నో రావచ్చు. అబ్బా. నేను చేసిన చిన్న మంచి పనికి, నాకింత పెద్ద ఫలితమా అని మీరు ఆశ్చర్య పోవచ్చు. కానీ మీరు ఈ రోజు గోతిలో పడ్డం మాత్రం  ఎప్పడిదో అయిన కర్మ యొక్క అదృష్ట ఫలం. వీటికి సరైన లింకు పెట్టడం మనకు కష్టం.

యింతా - ఎందుకు చెబుతున్నానంటే - మనసు సంతోషానికి - ముఖ్య కారణం మనం చేసే పుణ్య కార్యాలే  - అని ఘంటా పథంగా చెప్ప వచ్చు.


యిప్పుడు చెప్పండి. మీరు సంతోషంగా వుండాలంటే - ఏం చెయ్యాలి?  ఆ..; ప్రతి రోజూ పుణ్యకార్యాలు అందరూ చెయ్య గలమా? యిది మీరే  యోచన చేయాల్సిన విషయం.పుణ్యం -మనసా, వాచా, కర్మణా - మూడు రకాలుగా చెయ్య వచ్చు.  ఉదయం లేచిన వెంటనే - లోకాః సమస్తాః సుఖినో భవంతు అనో, సర్వే జనాః సుఖినో భవంతు అనో - కళ్ళు మూసుకుని - హృదయ పూర్వకంగా ధ్యానం చేయడం కూడా పుణ్యమే. ఎవరైనా రోగులకో,   ధైర్యం లేని వారికో, దుహ్ఖంలో వున్న వారికో, మన మాటలతో - సంతోషము, ధైర్యమూ కలిగించడం కూడా పుణ్యమే. మనిషికి  మహా సంతోషం కలిగించేది, దుఖమో, కోపమో కలిగించేది రెండూ మాటే. మీరు మీ మాటల ద్వారా సంతోషం కలిగిస్తున్నారా, దుహ్ఖం లేదా కోపం కలిగిస్తున్నారా - మీ చుట్టూ వున్నా వారికి? యోచన చేయండి. యివి కూడా పుణ్య పాపాల లోకే వస్తాయి.

మీ అమ్మ మా అందరికీ అమ్మ లాంటిదే - అన్న వాడికీ, మిగతా వారికీ తేడా మీకు తెలుసు. ఆ మాట కూడా మనుషులను సంతోష పెట్టే పుణ్య కార్యమే.
 
కార్యాచరణ ద్వారా చేయ దగ్గ పుణ్యాలు పంచ మహా యజ్ఞాలుగా  చెప్పబడ్డాయి. యివి పుణ్యాలే కాదు. ప్రతి మనిషి యొక్క బాధ్యతలు కూడా.  దేవతలను, ఋషులను, గురువులను, మనుషులను, పశు పక్ష్యాదులను చెట్లతో సహా సమస్త జీవరాసులను - ఎవరిని సంతోషపెట్టే కార్యం చేసినా అది పుణ్యమే. వీటికి, దృష్ట,అదృష్ట ఫలాలు రెండూ వుంటాయి.

ధర్మం తరువాత పురుషార్థం అర్థం. లోకంలో మనకు కావలసినవన్నీ - ధర్మ మార్గం తప్పకుండా మీరు ఎంతైనా సంపాదించొచ్చు . తప్పే లేదు. దాన్ని అనుభవించడంలోనూ - ఆనందం   వుంది. దానం చేయండంలో - అంతకు మించి ఆనందం వుంది.

మూడవ పురుషార్థం కామం. ధర్మ మార్గంలో - అనుభవించే కోరికలు - ఆనందాన్నిస్తాయి. వాటిలో తప్పు లేదు. ధర్మం దాటి అనుభవించే కోరికలు - మన సంచిత కర్మం లో చేరి - రక రకాల ప్రమాదాలు తెచ్చి పెడతాయి.

ధర్మేచ, అర్థేచ , కామేచ - నాతి చరితవ్య - నాతిచరామి - అనేది వివాహం రోజున - వధూవరులిద్దరూ - చెయ్య వలసిన ప్రమాణం. అంటే - ధర్మం లోనూ, అర్థంలోనూ, కామంలోనూ - యిద్దరూ, కలిసి నడుస్తామని అర్థం. పురోహితుడు వారి దగ్గర చెప్పించాలి - ఈ ప్రమాణం. తనే చెప్పేసి వెళ్లి  పోకూడదు.

మరి  - ఈ  మంత్రాలలో  - మోక్షేచ అని ఎందుకు చెప్పలేదు? - అన్న ప్రశ్న వస్తుంది కదా. మోక్షానికి వెళ్ళేటప్పుడు భవబంధాలేవీ వుండదు. ఎవరికి వారే. దీన్ని గురించి మరో సారి చూద్దాం.
   
ఒకటో  క్లాసులో చెప్పే ఓనమాలూ, పెళ్లి రోజు చెప్పే ప్రమాణాలూ - కడ వరకూ జ్ఞాపకం వుంటాయి.  మరిచి పోయే మాటే లేదు.  కాబట్టి - పెళ్లి చేసే పెద్ద వారూ - పురోహితుడూ - వధూవరుల చేత - ఈ ప్రమాణాలు తప్పక చేయించాలి. వాటి అర్థాన్ని  - తెలుగులోనూ విడమరిచి చెప్పాలి.

యివన్నీ - యిక్కడ ఎందుకు చెబుతున్నామంటే - మన సంతోషానికీ - యివి అన్నీ పునాదులు.

మీరు చేసే పెద్ద పుణ్యం - మీ భార్యను, లేదా మీ భర్తను, సంతోష పెట్టడమే. మీ జీవితంలో - మీరు తీసుకోవలసిన ముఖ్యమైన చాలెంజ్ - కనీసం ఈ వొక్క మనిషి ఆరోగ్యానికి, సంతోషానికి, నేను పూర్తి బాధ్యత వహిస్తాను - అని.  యిందులో  పోటీ మనస్తత్వం రాకూడదు. ఎడమ చేయి చెయ్యలేదు కదా అని - కుడి చేయి, కుడి చేయి చేయ లేదు కదా అని ఎడమ చేయి - పనులు మానేయడం లాంటిది పోటీ తత్త్వం. దేని పనులు అవి చేస్తూ వుంటేనే, ఆరోగ్యమూ, సంతోషమూ.

సంతోషానికి - మూల సూత్రాలనదగిన రెండు మాటలు యిక్కడ చెప్పాలి. మీకు మంచి భర్త (లేదా భార్య) కావాలంటే -  మీరు మొదట మంచి భార్య (లేదా భర్త ) గా వుండాలి. మీకు మంచి స్నేహితుడు  కావాలంటే - మీరు  మొదట మంచి స్నేహితుడుగా వుండాలి.మీకు మంచి కొడుకో, కూతురో కావాలంటే - మీరు మొదట మంచి తల్లో,తండ్రో అయి వుండాలి.

అలాగే - మీకు   సంతోషం కావాలంటే -   తిరుగు లేని మార్గం - చుట్టూ వున్న వారికి సంతోషం యివ్వడమే. మీరు - చుట్టూ వున్న వారికి - ఏది యిస్తారో - అదే మీకు తిరిగి వస్తుంది.

నిరంతర సంతోషమే మానసిక ఆరోగ్యానికి చిహ్నం. మరి మానసిక అనారోగ్యానికి చిహ్నాలు ఏవి? అవి ఎలా పోగొట్టుకోవాలి? యిది వచ్చే వ్యాసంలో చూద్దాం.

= మీ
వుప్పలధడియం విజయమోహన్

15, అక్టోబర్ 2011, శనివారం

మానసిక ఆరోగ్యం - శారీరక ఆరోగ్యం - ప్రాణ మయ కోశము - ప్రాణాయామాల ఉపయోగాలు


ప్రాణ మయ కోశము
ప్రాణాయామాల   ఉపయోగాలు

క్రిందటి వ్యాసంలో ఆరోగ్యాన్ని గురించి ప్రముఖుల అభిప్రాయాల్ని చదివాము.

ముఖ్యంగా - మానసిక దార్ధ్యాన్ని గురించి వారు పలు రకాలుగా చెప్పారు.మనిషిలో - మనోబలం వుంటే - చాలా వరకు రోగాలు రావు. వచ్చినా త్వరగా పోవడానికి అవకాశాలు ఎక్కువున్నాయి - అన్న విషయం నిర్వివాదాంశం.

ఇంకొక విధంగా చెప్పాలంటే - రోగం యొక్క బలం చాలా వరకు - మనను మానసికంగా భయ గ్రస్తులను చేయడం, క్రుంగదీయడం లోనే   వుంటుంది.   మీరు భయపడలేదనుకోండి. అంత పరిధి వరకు - రోగం యొక్క బలం కూడా తగ్గి పోతుంది. యిది చాలా, చాలా ముఖ్యమైన విషయం. వైద్యులు కూడా ముఖ్యంగా జ్ఞాపకం వుంచుకోవలసిన   విషయం. మీరు మూడు నెలలలో  పోతారు,. రెండు సంవత్సరాలలో పోతారు - అన్న మాటలు - దాదాపు అనవసరం అనుకోవచ్చు.  కడపటి క్షణం వరకు - ధైర్యంగా, సంతోషంగా వుంటే - దేవుడు యిచ్చిన ఆయుస్సు పూర్తిగా, హాయిగా గడిపేస్తాం. 

చాలా పెద్ద వ్యాధులు అనుకున్నవి -  యిక మరణం తప్ప వేరే మార్గం లేదన్నవి - అద్భుతంగా తగ్గి పోవడం చాలా మంది విషయంలో జరిగింది.  వీటిని "మెడికల్ మిరాకుల్స్" అన్నారు. ఈ అద్భుతాలలో - అందరికీ కనిపించే ముఖ్య విషయం - ఈ రోగాన్ని నేను ఖాతరు చెయ్యను. ఉన్నంత వరకు సంతోషంగా వుంటాను - భయమన్నది యిక నాలో వుండదు అన్న దృఢమైన మనో భావన.

ధైర్యమేరా జీవితం, ధైర్యమేరా శాశ్వతం.   

మన భారతీయ విజ్ఞానం ప్రకారం - మనలో అయిదు భాగాలున్నాయి. (1 ) అన్న మయ కోశము  (2 ) ప్రాణమయ కోశము (3 ) మనోమయ కోశము (4 ) విజ్ఞాన మయ కోశము (5 ) ఆనంద మయ కోశము .ప్రస్తుతానికి - మన ధ్యేయానికి -మొదటి మూడు కోశాలూ చాలు. మిగతా రెండూ మరెప్పుడైనా చూద్దాము .

యిందులో   ప్రాణ మయ కోశము - అంటే మనలో జరిగే ప్రాణ శక్తి ప్రవాహాల సముదాయము. ప్రాణ శక్తి గాలి ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది. ఈ గాలి కూడా ఆధునిక విజ్ఞానం ప్రకారం ఊపిరితిత్తుల  లోకి  వెళ్ళుతుందని, గుండెకు ప్రాణ వాయువు లేదా ఆక్సిజన్ ను అందించి మలిన వాయువులను తాను గ్రహించి    మళ్ళీ - ముక్కు ద్వారా బయటకు వెళ్లి పోతుందని మనం చదివాము.

కానీ, మన ప్రాచీన విజ్ఞానం ప్రకారం - శరీరంలోని అనేక స్థలాలలో ఈ ప్రాణ శక్తి, అనేక రకాలుగా పని చేస్తుందని తెలుసుకోవచ్చు. వొక్కొక్క చోట దానికి వొక్కొక్క పేరు పెట్టారు. ఉదాహరణకు - ప్రాణ, అపాన, ఉదాన, సమాన, త్రాణ వాయువులు మనలో అయిదు చోట్ల వేవ్వేరు రకాలుగా పని చేస్తుంటాయి.  యింకా అనేక వాయువులు మన శరీరంలో - ఎన్నో పనులు చేస్తూ వున్నాయి. యివన్నీ ప్రాణ శక్తితో కూడినవే. ఊపిరితిత్తులలోకి మాత్రం పోయే గాలి - మిగతా చోట్లలో - ఎలా వచ్చిందండీ? అక్కడ అది వూరికే కూర్చోలేదు. చాలా ముఖ్యమైన పని చేస్తూ వుంది. యిదీ - మన ప్రాచీన విజ్ఞానము. 

మంచి గాలి, చెట్లు, వున్న చోట వుండమన్నారు మన వారు. మన లాగా - వారు, గాలిని కలుషితం చేయ లేదు.చెట్లను నరికెయ్య లేదు. చెట్లను పూజించారు. చెట్ల క్రింద అరుగులు కట్టుకుని పడుకున్నారు. చెట్ల క్రిందనే పంచాయితీలు నిర్వహించారు.

ధ్యానం చేసే వారు, కొన్ని రకాల చెట్ల క్రింద చిన్న అరుగులు కట్టుకుని ధ్యానం చేయడం మనందరికీ తెలిసిన విషయమే - అయినా, గంటల కొద్దీ ధ్యానంలో కూర్చోవాలంటే  - అటువంటి ప్రాణ శక్తి కావాలనేది - మనం తెలుసుకోవాల్సిన విషయం. మీ యింటి చుట్టూ చెట్లు పెట్టుకోండి.  మీ ప్రాణ మయ కోశము కూడా ఆరోగ్యం గా వుంటుంది.  

యిది కాకుండా - మనకు తెలిసిన మరో విషయం - గాలి పీల్చడం, విడవడం, మన ప్రమేయం లేకుండా పుట్టిన క్షణం నుండీ చివరి క్షణం వరకూ -  మరేదో శక్తి అధీనంలో వుంటూ జరగుతూ వుండడం.  అది మన అధీనంలో లేదు - అన్నది మనకూ తెలుసు. మనం ఎంత గాఢ నిద్రలో వున్నా అది మాత్రం ఆగదు. అయితే యిందులో - మనం బాగా గమనించాల్సిన ఆశ్చర్యాలూ వున్నాయి. గాఢ నిద్రలో - జరిగే శ్వాస క్రమం - దీర్ఘంగా, నిండుగా, చాలా ఆరోగ్యకరంగా  జరుగుతుంది. అటువంటి శ్వాస క్రమాన్నే - మనం - సాధారణంగా, "ప్రాణాయామ" పద్ధతుల్లో కూడా అవలంబిస్తాము.  అంటే - తనకు తానుగా జరిగే ఈ శ్వాస క్రియను, కొంత వరకు, మన మనసు, తన అధీనంలో కూడా జరప గలదని తెలుసుకోవచ్చు.
మన శరీరం గానీ, మనస్సు గానీ కాస్తో, కూస్తో శాంతంగా లేని  పరిస్థితి లో వుంటే - శ్వాస క్రమం కూడా, సరిగ్గా జరగదు. సరే. వ్యాయామం లాంటివి చేస్తే - ఎక్కువ గాలి కావాల్సి వస్తుంది.

అయితే - ప్రాణాయామం ద్వారా మనసును మళ్ళీ ప్రశాంత స్థితికి తీసుకురావచ్చు.

కొన్ని,కొన్ని రకాల ప్రాణాయామ పద్ధతుల ద్వారా - శరీరం లోలోపల వున్న భాగాలకు కూడా - తగినంత ప్రాణ శక్తినీ, ఆరోగ్యాన్నీ అందించ వచ్చునన్నది - యోగుల ద్వారా - మనకు తెలుస్తుంది.

మీరు - అన్నీ చేయక పోయినా బాబా రాం దేవ్ జీ గారు చెప్పే, చేసి చూపే అయిదారు ప్రాణాయామాలు -సులభంగా, కష్టపడకుండా - మరీ శక్తికి మించి చేయకుండా - హాయిగా చేయండి.

ఇవి - ఆరోగ్యానికి -చాలా, చాలా మంచిది. మరీ కష్టపడి చేయ వలసినవి వద్దు. అవే గురువు దగ్గరే నేర్చుకోండి.   

మీరు సులభంగా చేయ గలిగేవి - అనులోమ విలోమ, భ్రామరి, భస్త్రిక, కపాల భాతి, వంటివి. యివి కూడా, కష్ట పడకుండా, భోజనానికి ముందు - అంటే తెల్లవారి వొక సారి, సాయంకాలం వొక సారి, కడుపు కాస్త ఖాళీగా వున్నప్పుడు చెయ్యండి. కళ్ళు మూసుకుని, రేడియోలు, టీ వీలు  ఆఫ్ చేసేసి -ప్రశాంతంగా చెయ్యండి. యింటిలో నున్న వారంతా కలిసి చేస్తే మరీ మంచిది. కాకపోతే - అందులో - వొకరితో వొకరు ఎప్పుడూ పోటీ పడవద్దు. వొక్కొక్క ప్రాణాయామము - అయిదు నిమిషాలు మించి అక్కర లేదు. వొకటి, రెండు నెలల తర్వాత - సమయం పెంచుకోవచ్చు.

వారి వారి శక్తి ప్రకారం, వారు వారు చెయ్యండి. సుఖంగా, సంతోషంగా చెయ్యండి. ఇవేవీ కష్టపడుతూ చేయాల్సినవి  కావు. మొదట, ప్రతి ప్రాణాయామము మందగతి లో - అంటే మెల్లగా చెయ్యండి. రెండు వారాల తర్వాత - మధ్యమ గతి లో చెయ్యండి. ఏదైనా దీర్ఘ కాలిక రోగాలు వుంటే - మధ్యమ గతి వరకే చాలు.వేగంగా చెయ్య నవసరం లేదు.

వీటిలో - బంధాలు వగైరాలున్నాయి. అవి గురువు దగ్గరే నేర్చుకోండి. లేదంటే - అవి అక్కర లేదు. పైన చెప్పిన నాలుగు ప్రాణాయామాలు చేయండి చాలు. ఈ నాలుగు - మీరు - బాబా రాం దేవ్ జీ గారి వీడియో సి.డీ. చూసి గాని, టీ.వీ.లో వారి ప్రదర్శన చూసి గాని సులభంగా నేర్చుకోవచ్చు. చెయ్య వచ్చు. 

నేను ఆయన యోగ శిబిరంలోనే - వారం రోజులు నేర్చుకున్నాను.మరి కొందరు గురువుల దగ్గర కూడా (సద్గురు జగ్గి వాసుదేవ్; ఆర్ట్ ఆఫ్ లివింగ్; స్వామి సుఖబోధానంద వంటి గురువులు ....) ప్రాణాయామాల గురించీ, యోగ విద్య గురించీ చాలా నేర్చుకున్నాను. వొక్కొక్క ప్రాణాయామానికీ - కొన్ని ప్రయోజనాలు వున్నాయి. పైన చెప్పిన నాలుగు - సులభంగా నేర్చుకుని, చెయ్య గలిగేవి. మన ఆరోగ్యానికి చాలా, చాలా దోహద కారులు.

మీకు - ఏ ప్రాణాయామమూ రాకున్నా - కళ్ళు మూసుకుని,ప్రశాంతంగా కూర్చొని - మీ శ్వాస, నిశ్వాస ప్రక్రియలను - హాయిగా గమనిస్తూ కూర్చోండి. యిది చాలా గొప్ప ప్రక్రియ.  చాలా ఉపయోగాలున్న ప్రక్రియ. వొక్కొక్క సారి, మనసు శ్వాస మీద నిలువదు. ఎక్కడికో వెళ్లి, ఏదో, యోచనలు పెట్టుకు కూర్చుంటుంది. ఫరవాలేదు.  మళ్ళీ శ్వాస మీద ధ్యాస ప్రారంభించండి. యిందులో, హాయిగా వుండడం, శ్వాసను గమనించడం - రెండూ ముఖ్యమే.

ఈ మధ్య మీరు ప్రహ్లాద్ జానీ - అనే ఆయనను గూర్చి చదివే వుంటారు. ఆయన చాలా దశాబ్దాలుగా - తిండీ, నీరూ, మల మూత్ర విసర్జనాలూ - ఏవీ లేకుండా - వున్నారు. ఆరోగ్యంగానే వున్నారు. యిది కూడా వొక యోగ ప్రక్రియనే. 
సూర్యోదయాత్పూర్వము,సూర్యాస్తమయానంతరమూ - భూమి పై పడే  సూర్య కిరణాలు మన శరీరానికి కావలసినంత ప్రాణ శక్తిని యివ్వగలవంటారు. అందుకనే - ధ్యాన సాధన కూడా ఆ సమయంలో ఎక్కువ ఫలితాన్నిస్తుంది. ఉదయం - బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం ప్రారంభించి - సూర్య కిరణాల దర్శన సమయంలో - సూర్య నమస్కారాలు చేసి ధ్యాన సాధకులు మిగతా సాధనాలు ఆరంభిస్తారు. అయితే - మరీ తీక్షణంగా సూర్య కిరణాలు వున్న సమయంలో -  ఈ ప్రయోజనాలు సిద్ధించవు .అవి ఆరోగ్యాన్ని చెడప గలవు కూడా. అప్పుడివన్నీ చేయకండి.

మీకు ధ్యానం తెలియకున్నా, ప్రాణాయామం తెలియకున్నా ఫరవాలేదు. పైన చెప్పిన సమయాల్లో, సూర్యునికెదురుగా, ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకునే కూర్చోండి. అప్పుడప్పుడూ, వొక సెకను కళ్ళు తెరిచి, ఆ లేత కిరణాలను చూసి, కళ్ళు మూసేసుకోవచ్చు. ఆ సమయంలో, కళ్ళు మూసుకుని, శ్వాస మీద ధ్యాస కూడా సాధన చెయ్య వచ్చు.

ఈ ప్రాణమయకోశము - మనలో వొక భాగమే. బయటి గాలి - మనలో వొక భాగం - అంటే - ఆధునిక శాస్త్రానికి - అర్థం కూడా కాదు.అది లేకుండా - మనం అయిదు నిమిషాలు కూడా ప్రాణంతో వుండలేమంటే  - అది మనలో వొక భాగం కాదా?

నిజానికి - గాలి కానీ, ఆహారం కానీ, నీరు కానీ - మన శరీరంలో - వుండేది కొద్ది నిమిషాలో, గంటలో, దినాలో మాత్రమే.  అన్నే లోపలి వెడతాయి. అలాగే బయటకూ వెళ్లి పోతాయి. నిరంతరంగా వుండేది ఏదో - మనమింకా మాట్లాడుకోలేదు. లోపల ఉన్నంత వరకు - ప్రాణమయ కోశము మనలో వొక భాగమే. 

స్థలాభావం వల్ల ప్రాణాయామము మరింత వివరంగా ఎలా చేయాలో చెప్ప లేదు. రాం దేవ్ జీ గారి సి.డీ.లు అన్ని చోట్లా దొరుకుతున్నాయి.ఆస్థా టీ.వీ. చానెల్ లోనూ ప్రతి దినం చూడొచ్చు. అదీ కాక - యు ట్యూబు వెబ్ సైటు లో కూడా వారి వీడియోలు చాలా వున్నాయి.అవీ చూడొచ్చు. వీలైతే వారి యోగ శిబిరాలకూ వెళ్ళొచ్చు.
పుట్టిన బిడ్డ మొట్ట మొదట చేసే పని లోపలికి గాలి తీసుకోవడం - అంటే ఉచ్చ్వాస .అప్పుడే ఆ బిడ్డ ఏడుస్తుంది. ఆ తరువాత, ఈ శ్వాస, నిశ్వాసల ప్రక్రియ జీవితాంతమూ జరిగిపోతూ వుంటుంది. మనం కట్ట కడపట - చేసే పని ఏమిటి? నిశ్వాస! చిట్టా చివరి సారి గాలి విడుస్తారు - మళ్ళీ లోపలికి  తీసుకోలేరు. జగన్నాటకంలో - మన ప్రస్తుత పాత్ర అంతటితో ముగిసిపోయినట్టే.

ఈ మధ్య జరిగే జీవన యాత్రలో - మనం - ఆరోగ్యంగా, సంతోషంగా ఎలా ఉండాలో - దానికి, ఈ వ్యాసంలో చెప్పిన పద్ధతులన్నీ  ఉపకరిస్తాయి. మన శారీరక ఆరోగ్యం గురించి - అన్న మయ కోశం గురించి   తరువాత వ్యాసం లో చూద్దాం.


= మీ
వుప్పలధడియం విజయమోహన్ 



12, అక్టోబర్ 2011, బుధవారం

మీ ఆరోగ్యం మీ చేతిలో = ప్రముఖులు ఏమంటున్నారు?

ఆరోగ్యమే మహా భాగ్యం.
యిది మనం తాతల కాలం నుండీ వింటున్న  మాటే. దీనితో బాటు మన వారు, మరో మాట కూడా  అన్నారు : సం తోషము  సగము బలము అని.

మీరు  ఎవరినైనా చూసారనుకోండి . ఎలా పలకరిస్తారు ? "బాగున్నారా" - అని.

అమెరికా కెళ్ళినా అంతే - హౌ ఆర్ యు - అంటారు. ఎవరైనా అంతే. ఎక్కడైనా అంతే. మీరు బాగున్నారా, మీరు కులాసానా.మీ భార్య / భర్త, పిల్లలు, తల్లిదండ్రులు బాగున్నారా? యివే మన కుశల ప్రశ్నలు.    

మీ డబ్బు బాగుందా, మీ ఇల్లు బాగుందా - అని ఎవరూ అడగరు.  మీకు క్రొత్తగా వచ్చిన రోగాలేమైనా ఉన్నాయా - అని   ఎవరూ అడగరు.

మీరు బాగుండడం - అంటే, మీ ఆరోగ్యమూ, మీ సంతోషమూ - యివే ముఖ్యము. యివి రెండూ వుంటే - అన్నీ ఉన్నట్టే.

యివి లేదనుకోండి. నా ఆరోగ్యం ఏమీ బాగా లేదు. నా సంతోషం ఏమీ బాగా లేదు. కానీ, నాకు ప్రమోషన్ వచ్చింది. అని తృప్తి గా అనుకోగలరా. మొదటి రెండూ సరిగా లేదంటే - మరేదున్నా, ఏది వచ్చినా - ఏ ప్రయోజనమూ లేదు కదా.

"మా నాన్నకు లాటరీలో కోటి రూపాయలు వచ్చింది. కానీ, ఆయన మెదడు చెడిపోయింది." - అని తృప్తి పద గలరా? సరే. యివి రెండూ మీకే జరిగిందనుకోండి. మంచిదేనా? కాదుగదా!

కాబట్టి, మళ్ళీ చెబుతున్నాను. మీరు బాగుండడం - అంటే- మీ ఆరోగ్యమూ, మీ సంతోషమూ బాగున్నాయి అని అర్థము కదా.- ఎవరికైనా యివే ముఖ్యము. యివి రెండూ వుంటే - అన్నీ ఉన్నట్టే. యివి లేదంటే - ఏదున్నా, లేనట్టే.
 
మరి - ఈ ఆరోగ్యము, సంతోషము - మనం  జీవితాంతమూ  ఎలా కాపాడుకోవాలి?

ఆరోగ్యమూ, సంతోషమూ వుండాలంటే , ప్రతి మనిషికీ కావాల్సింది - జీవితం పైన, తన పైన గట్టి నమ్మకము, గట్టి సంకల్పము (పట్టుదల).

 వైద్యుడూ, మందులూ  కూడా "కొంత" సహాయం చేస్తాయి. అవీ కావాలి. నిజమే.  కానీ, నిజంగా రోగాలు రాకుండా కాపాడేవి, ఆరోగ్యాన్ని నిలిపేవి మొదట   చెప్పిన మూడే !

అంటే - మన ఆరోగ్యాన్ని కాపాడుకునే  బాధ్యత  మనదే. అందుకు కావాల్సిన  ముఖ్యమైన ఆయుధాలూ - మన దగ్గరే వున్నాయి.

మీ దరిదాపుల్లో, ఎవరైనా - ఏదైనా  రోగాలతో బాధ పడుతూ వుంటే, మీకూ వొక బాధ్యత వుంది. బాధ పడుతున్న వారికి,  తమ జీవితం పైన తమకు గట్టి నమ్మకము, రోగాలు తగ్గుతుందనే నమ్మకము, తగ్గించుకుంటామనే   పట్టుదల - మనం కలిగించాలి. యిది - మనం అందరమూ చెయ్య గలిగిన, చెయ్య వలసిన ముఖ్యమైన బాధ్యత. రోగికి - ముఖ్యంగా కావలసినది యిదే. మిగతాది వైద్యుడు చేస్తాడు.

సరే. ఆరోగ్యాన్ని గురించి, రోగాలు రాకుండా వుండడానికి, వచ్చిన రోగాలు తగ్గడానికి -  కొన్ని ముఖ్యమైన పద్ధతులు, చిట్కాలు, ప్రముఖుల అభిప్రాయాలు  చదవండి.

  1. థామస్ ఫుల్లర్  అంటారు :- ఆరోగ్యం విలువ ఎప్పుడు తెలుస్తుంది? రోగాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. 
  2. వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమానం 1937  లో తీసుకున్న  ఆల్బర్ట్ జెంట్ గ్యోర్గ్యీ అంటారు : మంచి నీరు - మనిషి జీవితానికి కావలసిన ముఖ్య పదార్థమే కాదు; మన జీవితం చుట్టూ విస్తరించి వుండే గొప్ప వల (మేట్రిక్స్) లాంటిది. నీరు లేకుండా ఏ ప్రాణీ, ప్రాణమూ లేదు.  (అంటే - మంచి నీరు, జీవితానికి అంత ముఖ్యమన్న మాట)
  3. క్రయిగ్ టౌన్సెండ్ అంటారు :-  15  సంవత్సరాలుగా    నన్ను బాధ పెట్టిన  ఆస్తమా వ్యాధి నుండి, నన్ను నేను పూర్తిగా బాగు చేసుకో గలగడానికి - రెండే మందులు తోడ్పడ్డాయి - (1 ) బాగవుతో వుందన్న నమ్మకము (విజువలైజేషన్), (2 )ఏ భయాలూ లేకుండా హాయిగా వుండగల గట్టి మనస్స్థితి (రిలాక్సేషన్). నా మనస్సు యొక్క శక్తి ఎంత గొప్పదో నాకు తెలిసి వచ్చింది. (చూడండి. ఆయన చెప్పే మందులు ప్రతి వొక్కరు వాడాల్సినవి. అవి లేకుండా - వైద్యుడి మందులు  అంతగా పనిచేయవు.) 
  4. డాక్టర్ దీపక్ చోప్రా అంటారు :-  మీ ఆలోచనలు ఎలా వుంటుందో, మీ ప్రవర్తన ఎలా వుంటుందో, మీ ఆహారపు అలవాట్లు ఎలా వుంటాయో - దాన్ని బట్టి , మీ జీవితపు కొలత ముప్ఫై నుండి యాభై సంవత్సరాల వరకు - ప్రభావితం కావచ్చు.  (అంటే ఎక్కొచ్చు, తగ్గొచ్చు అని మనం చెప్ప వచ్చు ).
  5. లూయిసీ హే అనే  కాన్సర్ బాధితురాలు గా ఉండి బ్రతికిన మహిళ అంటారు : - ప్రేమానురాగాలు నిజంగా చాలా,చాలా, గొప్ప అద్భుతమైన మందు. అందులోనూ, మనపై మనకే వుండే  ప్రేమ - మరింత గొప్ప అద్భుతంగా  పని చేస్తుంది.  
  6. డాక్టర్ దీపక్ చోప్రా  అంటారు :-   మీ హృదయంలో మిగతా వారికి ఎంత తక్కువ స్థానం యిస్తారో -  మీ హృదయం అంత ఎక్కువ కష్టపడుతుంది. (అంటే - స్వార్థం రోగాలను తెచ్చి పెడుతుంది. స్వార్థ రహితంగా వుంటే - ఆరోగ్యము  పెరుగుతుంది.)
  7. వొక పారిశ్రామిక వేత్త అంటారు : - మన జీవితంలో - అయిదు ముఖ్య భాగాలు - మన వుద్యోగం, కుటుంబము, ఆరోగ్యము, స్నేహితులు, ఆధ్యాత్మికత - ఉద్యోగంలో పొర పొచ్చాలొస్తే   కొంత కష్టంతో సర్దుకోవచ్చు.ముందుకంటే మంచి స్థితికీ రావచ్చు. మిగతా నాలుగిట్లో సమస్యలొస్తే - అవి దెబ్బ తింటాయి.మళ్ళీ మామూలు స్థితికి రావడం చాలా కష్టం. (అంటే -  ఆరోగ్యం పోతే - పూర్తి ఆరోగ్యం రావడం రావడం కష్టం -అన్న మాట)
  8. డాక్టర్ కార్ల్ మేన్నింగర్ అంటారు :- ప్రేమాభిమానాలు - యిచ్చేవారికీ, యివ్వబదేవారికీ - ఆరోగ్యం పెరుగుతుంది,   రోగాలు తరుగుతుంది. 
  9. జాన్ ఏ. లోగన్ అంటారు :-  సంగీతం మన మనస్సు కొక  గొప్ప మందు.
  10. నిజమైన  రోగం  కంటే, మనం ఊహించుకున్న రోగమే చాలా  ప్రమాదమైనది.- సామెత
  11. రోగాలు రావడానికి కారణం  వెలుపల వుండే రోగ క్రిముల కంటే - శరీరంలో తగ్గిన రోగ నిరోధక శక్తి అని చెప్ప వచ్చు - డాక్టర్ హాన్స్ సెల్యే
  12. హాయిగా నవ్వ గలిగే శక్తి, నిద్ర పోయే శక్తి - అన్ని రోగాలకూ, అద్భుతమైన మందులు. - సామెత
  13. చుట్టూ వుండే చెట్లు, సూర్య రశ్మి చాలా గొప్ప ఆరోగ్య కారులు - సామెత 
  14.  దయాగుణం గొప్ప రోగ వినాశిని. - డాక్టర్ వెయిన్ డైయ్యర్ 
  15.  క్షమించే గుణం -  గొప్ప రోగ వినాశిని.  - డాక్టర్ హెర్బర్ట్  బెన్సన్
  16. రోగాలను తగ్గించే వాటిల్లో - అతి ముఖ్యమైనది మన పై మనలో వున్ననమ్మకమే - నికోలాయ్ లెనిన్ 
  17. రోగ క్రిములు ప్రపంచ మంతటా వున్నాయి. రోగాలు  మాత్రం కొందరికే వస్తున్నాయి. కారణం, మన మనస్సులోను, రీరంలోను వున్న  నిరోధక శక్తే. - యిది చాలా మంది అన్న మాట
  18. ప్రేమ, మానసిక శక్తి ఈ రెండింటి తో ఏ రోగాన్నయినా తగ్గించవచ్చు - మార్టిన్  బ్రాఫ్ మాన్,పీ.హెచ్.డీ (కాన్సర్ నుండి బ్రతికిన వారు)
  19. మీరు దేన్ని చూసి, ఎంతగా భయ పడతారో, - దానికి, మీరే మీపైన అంత క్తి నిస్తూ ఉన్నారన్న మాట. రోగాల విషయం లోనూ అంతే  -సామెత (అంటే - రోగాన్ని చూసి భయడితే రోగానికి మరింత క్తినిచ్చిన వారిమౌతామన్న మాట)
  20. ఆరోగ్యమే మనకున్న ఆస్తులలో - గొప్ప ఆస్తి అంటారు - లావో ట్సూ; బుద్ధ ;వర్గిల్;
  21. రోగాన్ని తెచ్చుకునేదీ మీరే. ఆరోగ్యాన్ని తెచ్చుకునేదీ మీరే - బుద్ధుడు.
  22. చదువుకంటే - ఎక్కువ సమయాన్ని వ్యాయామానికీ, ఆనందంగా వుండడానికీ  కేటాయించమంటారు - వొకప్పటి అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫెర్సన్ 
  23. మంచి గాలి - రోగాల్ని దూరంగా వుంచుతుంది.   - సామెత
  24. మంచి నీరు, గాలి, శుభ్రత - మాత్రమే నా వైద్య శాస్త్రము ప్రకారం నాకు కావాల్సిన మందులు  - నెపోలియన్ 1 
  25. వ్యాయామాన్ని రేపు, రేపు అని వాయిదా వేయకండి - రేపు వ్యాయామానికి బదులు రోగం వచ్చి కూర్చో వచ్చు.-సామెత 
  26.  ఆరోగ్యం అంటే - శరీరాన్ని, మనస్సును, ఆత్మను, వొకే త్రాటిపై నడిపించడమే. - సామెత
  27. రోగం అనేది - ప్రకృతి, తన చట్టాలను మనం అతిక్రమిస్తే మనకు వేసే శిక్ష. ఆరోగ్యం అనేది - ప్రకృతి చట్టాల ప్రకారం మనం నడిస్తే - ప్రకృతి యిచ్చే బహుమతి, ఆశీర్వాదం. - సామెత
  28. అతి సర్వత్ర వర్జయేత్. ఆహార, విహారాల్లోనూ, నిద్ర, మెలకువల్లోనూ, పని,విశ్రాంతులలోనూ - మరీ ఎక్కువ   తక్కువలు లేకుండా -మధ్యే మార్గము లో వెళ్ళే వాళ్లకు మాత్రమే యోగము సిద్ధిస్తుంది - శ్రీకృష్ణుడు.
  29. రోగం వచ్చింతరువాత పోగొట్టుకోవడం కంటే - రాకుండా చూసుకోవడం - చాలా సులభం.- సామెత
  30. మానసిక ఆరోగ్యము - శారీరక ఆరోగ్యాన్ని కూడా  రక్షించ గలదు.- సామెత (అంటే - మీ మనస్సును   ఆరోగ్యం గా వుంచుకోండి )
  31. మీ శరీరము, మీ మనస్సు - దేవుడి   గుడి లాంటివి. అవి పరిశుభ్రంగా వుంచుకోండి.-సంస్కృత వాక్యము
  32. ఈ రోజు మీరేమి తింటారో - రేపు మీరు అదే అవుతారు. -సామెత ( మీ ఆహారం ప్రకారమే, మీ ఆరోగ్యము వుంటుంది - అని అర్థము)
చూసారా. యిటువంటి గొప్ప వారి అభిప్రాయాలెన్నో వున్నాయి. యిక్కడ కొన్నే యిచ్చాను. 
యిందులో - రోగాల్ని పోగొట్టుకోవడానికీ, రాకుండా చేసుకోవడానికీ   - మన మానసిక శక్తి , నమ్మకము గొప్ప మందులుగాను, వరాలుగాను   ప్రతి వొక్కరూ చెప్పారు.  కాన్సర్ లాంటి వ్యాధులను - తమ మానసిక శక్తి తో నయం చేసుకున్న వాళ్ళు ఎందరో వున్నారు. యిదే కాదు. ఎన్నో రకాల దీర్ఘ కాల రోగాలను - తమ మానసిక శక్తి పెంపొందించుకోవడం ద్వారా నయం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది వున్నారు.

మందులే వద్దని అనడం లేదు. డాక్టర్లు వద్దని అనడం లేదు. వాటినన్నిటేనీ   మించిన రోగ నిరోధక, మరియు  నివారక శక్తి మనలోనే వుందనడం నిర్వివాదాంశం - అంటున్నారు ఈ మహానీయులందరూ . 

సంతోషం గా వుండడం వొక్క విషయం. చుట్టూ ఉన్న వారికి సంతోషం యివ్వడం - అంతకంటే ముఖ్య విషయం.

తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుహ్ఖమే నరకమండ్రు తథ్యము సుమతీ - అన్నారు.

శాంతము, దయ, సంతోషము ఉన్న చోట రోగాలు రావు - ఎప్పుడో వచ్చినా త్వరగా పారిపోతాయి. యివి మీలో వుంటే - భూమిలోనే - మీరూ, మీ చుట్టూ ఉన్న వారూ - స్వర్గంలో ఉన్నట్టే.
వీటికి విరుద్ధమైనవి వున్నాయి. వాటిని గురించి -  "కామ, క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యానాం   దేహే తిష్టతి తస్కరాః" అని కూడా అన్నారు. వీటికి భయాన్ని కూడా జోడించుకోండి.  యివి ఉన్న చోట - ఉన్న వారికి, వారి చుట్టూ ఉన్న వారికి రోగాలు తప్పవు. వచ్చేవి త్వరగా పోవు - ఎన్ని మందులు   వాడినా.అంతే - అదే నరకం అన్న మాట.

- ఆరోగ్యాన్ని గురించి  మరిన్ని విషయాలు మరో వ్యాసంలో 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్

8, అక్టోబర్ 2011, శనివారం

శారీరక ఆరోగ్యం - మానసిక ఆరోగ్యం - సమీకృతాహారం - వాత, పిత్త, కప్హ దోషాలు - సత్వ, రజస్, తమస్ గుణాలు


శారీరక  ఆరోగ్యం - మానసిక  ఆరోగ్యం
ఈ బ్లాగు పేరు దీర్ఘ దర్శి . మనం జీవితంలో ఎలాంటి సంఘటనలను సంధిస్తామో, వాటినెలా ఎదుర్కొంటామో - మన జీవిత లక్ష్యమేమిటో -అదెలా సాధిస్తామో - ఇలాంటివన్నీ కూలంకషంగా చర్చించడమే - ఈ బ్లాగు లక్ష్యం.

గౌతమ బుద్ధుడి కథలు మీరు చదివే వుంటారు. యశోధనుడు కొడుకైన సిద్దార్థుడిని   చాలా అపురూపంగా, కష్టాలేవీ తెలీకుండా పెంచాడు. అతనికి - చాలా సౌందర్యవతి, గుణవంతురాలు అయిన  యశోధర తో వివాహం చేయడం, రాహులుడనే  కొడుకు  పుట్టడమూ   కూడా జరిగింది. 

సరే. వొక రోజు, వొకే వొక రోజు, సిద్ధార్థుడు, నగర వీధులలో, రథంలో వెడుతూ - మూడు రకాల సంఘటనలు చూస్తాడు. మనమంతా అప్పుడప్పుడూ చూసేదే. 

చనిపోయిన శవాన్నెత్తుకుని  బంధువులంతా  ఏడుస్తూ వెళ్ళడం చూసాడు. సారథిని - అదేమిటి - అని అడిగాడు. సారథి వివరంగా చెప్పాడు.  నేనూ చనిపోతానా - అని అడిగాడు. అవును అని సమాధానం వచ్చింది. మరి - యశోధర? ఆమె కూడా. తండ్రి యశోధనుడు?    ఆయనే ముందుగా పోతాడు. రాహులుడు? మీ తరువాత పోతాడు. అందరూ కాస్త ముందుగానో, వెనుకనో -  పోవలసిన వాళ్ళమే -అని సమాధానం వచ్చింది. ఎక్కడికి పోతాము ?  ఏమో,తెలీదు - కానీ, శరీరాన్ని మాత్రం కాల్చడమో, పూడ్చడమో చేస్తాము. మళ్ళీ రావడం జరగదు.

కాస్త వెనుకగా - వొక ముసలాయన , వంగిన, ముడుతలు పడ్డ  శరీరంతో, చేతిలో కట్టెను పట్టుకుని,   మెల్ల, మెల్లగా అడుగులు వేస్తూ - నడుస్తుండడం గమనించాడు -సిద్ధార్థుడు. తన తండ్రి శరీరానికీ, యితనికీ -కాస్త  ఏదో - పోలికలు కనిపించాయి. సారథిని అడిగాడు. సారథి - ముసలితనాన్ని గూర్చి విశదంగా చెప్పాడు. మళ్ళీ అదే ప్రశ్నలు. నేనూ ముసలి వాడినవుతానా? నువ్వే కాదు - ప్రతి వొక్కరు ముసలి వాళ్ళవుతారు. తరువాత చని పోతారు - అని సారథి చెప్పాడు. సిద్ధార్థుడికి మనసులో - గుబులు బయల్దేరింది. నేనూ యిలా ముసలి వాడినయి, చని పోయి, శవంగా మారి - కాలిపోతానా? యిదా నిజం?ఈ నిజం తొందరగా మనసులో - జీర్ణం కావడం లేదు.

అంతలో - రహదారి కొసలో - వొక కుష్టు రోగి కుంటుతూ వెడుతూ కనిపించాడు.అతని చేతులు కాళ్ళు సరిగా లేక పోవడం చూసాడు. మళ్ళీ సారథిని అడిగాడు. సారథి వోపికగా -విశదంగా - రకరకాల రోగాలు, అవి ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, వాటికి ఏం చెయ్యాలి - అన్నీ చెప్పాడు. కానీ, సిద్ధార్థుడి మనసులో - మళ్ళీ పాత ప్రశ్నలు పైకి రేగాయి. రోగాలు అందరికీ వొస్తాయా? అవును. అందరికీ వొస్తాయి. కానీ- ఎవరికి, ఏ రోగం ఎప్పుడు వస్తుందో చెప్ప లేము. ప్రతి వొక్కరికీ - ఎప్పుడో వొకప్పుడు, ఏదో వొక రోగం రాక మానదు. కొన్నిటికి మందులు వున్నాయి. కొన్నిటికి మందులూ లేవు.

పుట్టిన ప్రతి పాపా - యౌవనవంతులవడం -ఎంత సహజమో - రోగాలూ, ముసలి తనమూ, చావూ - అంతే సహజమని - ఆ వొక్క రథ యాత్రలో - సిద్దార్థుడికి తెలిసి పోయింది.

ఏదేది సుఖమనుకున్నాడో - అవన్నీ - చివరికి - దుహ్ఖాలకు దారి తీస్తాయని - యిది తప్పకుండా జరిగి తీరుతుందని తెలిసి పోయింది. మరి ఎందుకీ జీవితం? దీని పరమార్థం ఏమిటి? దీని లక్ష్యం ఏమిటి? 

ఈ రోగాలు, ముసలితనాలు , కష్టాలూ, శోకాలూ - యివి లేకుండా, ఆనందంగా వుండ గలగడం సాధ్యమా?

యిది తెలుసుకోవాలన్న తపన - మనకెవరికీ కలుగనంత బలవత్తరంగా -   సిద్ధార్థుడి మనసులో కలిగింది.

రాజ భవనానికి వచ్చాడే కాని - తన తండ్రి  మొహంలో యిప్పుడు  ముసలి తనం  స్పష్టంగా కనిపిస్తూ వుంది. రాత్రి పక్కనే వున్న యశోధర మొహంలో - ఏ మాత్రం ఆకర్షణా కనిపించలేదు. రాహులుడి  మొహంలో - పసితనం, అమాయకత్వం కనిపించ లేదు. ముందు ముందు జరగబోయేది కనిపిస్తూ వుంది. 

ప్రతి వొక్కరు, వారి వారి ప్రయాణంలో - వారు వున్నట్టు కనిపిస్తూ వుంది. దీనికి అర్థమేమిటి? ఈ జీవన ప్రయాణం ఏ గమ్యానికి? యిది తెలియకుండా - యిక  నిద్ర పట్టనంటుంది.

అంతే. అక్కడి నుండి, రాచ నగరు విడిచి వొంటరిగా బయల్దేరాడు.మరెన్ని ఏండ్లకో, ఎన్నో ప్రయత్నాల తరువాత, ఎంతో మంది గురువుల దగ్గర  శుశ్రూష తరువాత  -  బోధి వృక్షం క్రింద - జ్ఞానో దోయం అయ్యింది.   గౌతమ బుద్దుడయ్యాడు.  

బుద్ధుడికి జ్ఞానోదయం అయినప్పుడు  - ఆయన దగ్గర ఎవరూ లేరు.వొంటరి వాడే. ఆ సమయంలో - చాలా సేపు నవ్వుకున్నాడట. జీవిత మర్మం యింత సరళ మైనదా ; యింత సులభమైనదా, యిది కూడా నాకెందుకు అర్థం కాలేదు? అని చాలా సేపు నవ్వుకున్నట్టుగా   వొక కథ చెబుతారు. అదే - లాఫింగ్ బుద్దా విగ్రహాలుగా మనం చూస్తుంటాము. యిది ఎంత నిజమో మనకు తెలీదు కానీ -  జీవిత మర్మం చాలా సరళమేనని -  చాలా సార్లు బుద్ధుడనడం మనం చదవవొచ్చు.

మీరు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాల్సిన పని లేదు. మీకు మీరు అర్థమయితే - చాలునన్నది - వొక ముఖ్యమైన సిద్దాంతం. బుద్ధుడు చెప్పిందీ అదే. మన వేదాంతంలో - వుపనిషిత్తుల్లో -  చెప్ప బడిందీ  అదే.

మీకు మీరు అర్థం అయ్యారా?

మీరంటే - మీకు పూర్తిగా, యిష్టముందా? 

మిమ్మల్ని   మీరు  వొక్క సారి తనివి తీరా అద్దంలో చూసుకోండి. కనీసం మీ శరీరాన్ని , ముఖ్యంగా మీ ముఖాన్ని, మీరు వొక్క సారి పూర్తిగా చూడండి. మీలో - మీకు నచ్చినవి ఏమిటి? నచ్చనివి ఏమిటి? వొక్క సారి రాయండి.

నచ్చనివి - ఎందుకు నచ్చలేదో కూడా రాయండి. 

యిప్పుడు మీ వయసు యిరవై వుండొచ్చు. నలభై వుండొచ్చు. అరవై వుండొచ్చు. యిన్ని ఏళ్ళలో - ఎప్పుడైనా - మీ శరీరాన్ని వొక్క సారైనా, పూర్తిగా చూసారా?  లేదు. లేదని నాకు తెలుసు.కనిపించే తమ శరీరాన్ని (అంటే శరీరపు పై చర్మపు పొర మాత్రమే) కూడా ఎవరూ పూర్తిగా చూడనూ లేదు. తెలుసుకోనూ లేదు. ఈ శరీరానికి నిజంగా, ఎప్పుడెప్పుడు, ఏదేది అవసరమో - కూడా మనకు తెలీదు.

ఇప్పుడున్న, మీకు తెలిసిన వాళ్ళందరి యిళ్ళలో -  అసలు- రోగాలే లేని వాళ్ళున్న ఇల్లు ఏదైనా వుందా - అని కాస్త వెతకండి. ఏదీ వుండదు. ఎవరికో వొకరికి ఏదో వొక రోగం వుండనే వుంటుంది. వయసుతో నిమిత్తం లేకుండా.  

బాగా వయసయిన వాళ్ళుంటే  -  రోగాల సంఖ్య కాస్త ఎక్కువగా వుంటుంది. వయసు తక్కువగా వుంటే - రోగాలు తక్కువగా వుండొచ్చు.నలుగురున్న యింట్లో - కనీసం వొక్కరికైనా - ఏదో వొక రోగం  - ఈ రోజు, యిప్పుడు కూడా - వుండనే వుంటుంది. అంటే - ఎప్పుడూ, ఎవరికో వొకరికి వుంటుందన్న మాటేగా. మీరు, ఏ దేశానికి వెళ్ళినా - యిది మాత్రం తప్పక గమనించ వచ్చు. అంటే - మీరున్న యింట్లో - ఎవరున్న యింట్లో అయినా - రోగాలకు - స్థిర నివాసం వుందన్న మాట. మనమంతా - వొకే త్రాటి పైన నడుస్తున్నాము. జ్ఞాని అయిన బుద్దుడికీ రోగాలు వచ్చాయి. రమణ మహర్షికీ వచ్చాయి. రామకృష్ణ పరమ హంసకూ వచ్చాయి. స్వామి వివేకానందుడికీ   వచ్చాయి.మహా బలశాలులకూ వచ్చాయి. మనం పుట్టిన మొదటి రెండు సంవత్సరాల్లోనే - మనకు ఎన్నో రోగాలు వస్తాయి. అవి తగ్గడానికి - మన తల్లిదండ్రులు పడే శ్రమ మనకు తెలుసు. రోగం రాని వాడెవడూ -  భూమ్మీద పుట్ట లేదు.

సరే. కనిపించే శరీరానికి యిన్ని రోగాలు.  మరి కనిపించని మనసుకో? 

మన పూర్వీకులు అన్నారు కదా - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, భయము - యివి  మనసుకు పట్టే ముఖ్యమైన రోగాలు. యివి అందరికీ వస్తాయి.
 వొక్క సారి మిమ్మల్ని గురించి మాత్రం మీరు అనుకోండి. దాదాపు యివన్నీ మీకూ వున్నాయి కదా. అప్పుడప్పుడూ వస్తూ వుంటాయి. పోతూ వుంటాయి. యివి వచ్చినప్పుడు - మీరెప్పుడైనా - చాలా సంతోష పడ్డారా? లేదు కదా? 

అంటే - దాదాపు - అందరూ - మానసిక రోగ గ్రస్తులే. యివి, మన ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో - రోగాలుగా చెప్ప బడలేదు. కానీ - మనం చేసే ప్రతి నేరానికీ కారణం - యివే. యివి మనసులో లేక పోతే - శారీరకంగా ఏ నేరమూ జరుగదు.

యివి కాక - చదివినవి మరిచిపోవడం, అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సంస్ వ్యాధి,  పిచ్చి, లాంటి మానసిక వ్యాదులెన్నో వున్నాయి.  వాటిని గురించి మనం యిప్పుడు మాట్లాడడం లేదు. 

పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో - యోగానికి కూడా ప్రతిబంధకాలుగా - మనం పైన చెప్పిన శారీరక రోగాలు, మానసిక రోగాలనే చెబుతాడు. ముసలి తనం గానీ, చావు గానీ - తప్పించుకోలేం. కానీ - రోగాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. 

మరి యివి ఎలా తగ్గించుకోవడం? పోగొట్టుకోవడం కూడా సాధ్యమా?

వీటిని గురించి కొన్ని వ్యాసాలలో చెప్పుకుందాం.

మొదట శారీరక రోగాలను తగ్గించుకోవడం గురించి  - క్లుప్తంగా యిక్కడ చూద్దాం.

ఆధునిక  భౌతిక శాస్త్రం ప్రకారం - మనకు - సమీకృతాహారం  కావాలి. కార్బో హైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, క్రొవ్వుపదార్థాలూ - అన్నీ వున్న ఆహారం కావాలి.

యిందులో - ఏది తక్కువైనా, ఏది ఎక్కువైనా - కష్టమే. యింత వరకూ మనకు తెలుసు.అయినా - సమీకృతాహారం కాని వాటినన్నిటినీ -మనం తింటున్నాము .

సమీకృతాహారం వుంటే చాలా? చాలదు.  మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం - శరీరంలో - వాత, పిత్త, కప్హ దోషాల ప్రమాణం సమానంగా వుండాలి. దేహంలో వచ్చే చాలా రోగాలకు - వీటి సమానత్వం చెదరడమే కారణంగా చెబుతారు. ఈ దోషాలలో ఏది ఎక్కువైనా దానికి తగ్గ రోగాలు వస్తాయి. దానికి తగ్గ ఆహారమూ, మూలికా వైద్యమూ తీసుకుంటే - సరిపోతుంది.

కానీ - రోగాలు రాకుండా వుండాలంటే - యిదీ చాలదు.

శరీరంలో మూడు దోషాలు సమతుల్యంగా వుండాలన్నది నిజమే అయినా - శరీరం చేయబడింది మూడు గుణాలతో అన్నది - అంతకు ముందు నుండే వున్న శాస్త్రము. వీటిని సత్వ, రజస్, తమస్ - అని అంటారు.

సత్వ గుణం ప్రధానంగా వున్న వారికి - దాదాపుగా - మానసిక రోగాలేవీ రావు. అన్ని మానసిక వృత్తులూ, వారి అధీనంలో వుంటాయి. శారీరక రోగాలూ వీరికి తక్కువే. వీరిలో - శాంతము, సంతోషము, దయ లాంటి గుణాలు ఎక్కువగా మనం చూడొచ్చు. కామము వుండదని కాదు. అది ధర్మ మార్గంలోనే పొందుతారు.

రజో గుణం ప్రధానంగా వున్న వారికి కోపము, ద్వేషము, కామము, మదము  - లాంటివి ఎక్కువగా వుంటాయి. యివి 24  గంటలూ వుంటాయని కాదు. వీరి ప్రవృత్తిలో - యివి  ఎక్కువ అని తెలుసుకోవాలి. తొందరపాటు, కక్షలూ, కొట్లాటలు, యివి సత్వ గుణ ప్రధానుల కంటే - వీరి జీవితాల్లో చాలా ఎక్కువ.

తమో గుణం ప్రధానంగా వున్న వారికి- లోభం, మాత్సర్యము, అలసత్వము, సోమరితనము, నిద్ర -యిటువంటివి ఎక్కువగా వుంటాయి.

అంటే - ప్రతి మనిషిలోనూ- అన్ని గుణాలూ - కొద్దో, గొప్పో వుండనే వుంటాయి. ఏ గుణం ప్రధానం గా వుందన్నదే   ముఖ్యం. సత్వ గుణ ప్రధానులకూ నిద్ర కావాలి కదా. కొద్దో గొప్పో కోరికలూ వుంటాయి కదా.  

అయితే - గుణాలలో - విశిష్ట గుణం అంటే - సత్వమని, దాని తరువాత రజస్ అనీ, చివరిది తమస్ అని -  తప్పకుండా చెప్పాలి.

మరి - ఈ గుణాలు మనకెలా వస్తాయి - అని శ్రీకృష్ణుడు భగవద్ గీతా శాస్త్రంలో - గుణ త్రయ విభాగ యోగం లోను, యితర యోగాల్లోనూ  - కొంత వరకు చెప్పాడు.   ఎందరో రుషులో కూడా   దీన్ని గురించి చెప్పారు.

అంటే - మనకు - ఆధునిక శాస్త్రాల్లో చెప్ప బడ్డ సమీకృతాహారము కావాలి.  అది మన దేహం లోని దోష త్రయాన్ని సమన్వయ పరిచేలా వుండాలి. అందులోనూ - సత్వ గుణ ప్రధానంగానూ - తగినంత రజోగుణ,తమోగుణాలు కూడా  వుండే   లాగానూ వుండాలి. ఈ రెండవ, మూడవ విషయాల్ని గురించి - ఆధునిక శాస్త్రాలకు అస్సలేమీ తెలీదు.

యివి రాబోయే వ్యాసాల్లో - విశదంగా చూద్దాము.
యివి చాలా మన ఆరోగ్యానికి?

చాలదు.

మనకు తెలుసు. మంచి నీళ్లుండాలి. మంచి గాలి వుండాలి. "ఎప్పుడు ఎడతెగక పారు యేరు" వున్న చోటే వుండ  మన్నాడు సుమతి శతక కారుడు. మంచి వైద్యుడు కూడా వున్న చోట వుండ మన్నాడు.

యిదీ చాలదు. మనకు మంచి చెప్పే స్నేహితులో,గురువులో - వున్న చోట వుండమన్నారు - అది శంకరాచార్యులు, చాలా మంది శతక  కారులూ.

యివన్నీ వుంటే -   మన శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండూ - బాగుంటాయి.

వీటిని గురించి మరింత విశదంగా - వచ్చే వ్యాసాల్లో చెప్పుకుందాం.

= మీ
వుప్పలధడియం విజయమోహన్

1, అక్టోబర్ 2011, శనివారం

జీవితానికి వొక నిర్వచనం = జరిగేవన్నీఎందుకలా జరుగుతోంది ? = మర్ఫీ సూత్రాలు = శ్రీ కృష్ణుని కర్మ యోగ సూత్రాలు

మర్ఫీ  సూత్రాలు 
శ్రీ కృష్ణుని కర్మ యోగ సూత్రాలు
మన జీవితాలు 

క్రిందటి వ్యాసంలో - మర్ఫీ సూత్రాల గురించి చదివాము. ప్రతి వొక్కరి జీవితంలో యిటువంటి సంఘటనలు - అప్పుడప్పుడూ జరుగుతూ వుంటాయి. జీవితానికి వొక నిర్వచనం
యిప్పుడు - మన జీవితాల్లో జరిగే అన్ని సంఘటనలకు - మూల సూత్రమైన కర్మ సిద్ధాంతాన్ని పరిశీలిద్దాం.శ్రీ కృష్ణుల వారి - భగవద్ గీత -ఏదో మత గ్రంధమని చెప్పడం చాలా తప్పు. ఇందులోని 18  చాప్టర్లు - వొక్కొక్క దాన్నీ వొక్కొక్క  యోగమని చెప్పారు.

యోగమంటే - నిజానికి మనకూ మధ్య నున్న దూరం తరిగి, మనలో నిజం పూర్తిగా నిండి పోవడమని, మనమే నిజంగా , మారిపోవడమని - అర్థం చెప్పుకోవచ్చు.

శ్రీ కృష్ణుల వారు - ఎలా జీవించాలో, ఎందుకలా జీవించాలో - చాలా, చాలా సహేతుకం గా చెప్పారు. ఎప్పుడో - స్వర్గానికో, నరకానికో, మోక్షానికో పోవడాన్ని గురించి - చాలా  తక్కువగా చెప్పారు. మన సాధారణ జీవితాన్ని గురించే  ఎక్కువగా చెప్పారు.

అందులో - వొక ముఖ్యమైన భాగము - కర్మ యోగము.

శ్రీకృష్ణుడు - తాను చెప్పిన  విషయాలన్నీ - ఎప్ఫుడో  మహాఋషులచే   చెప్పబడినవే - అంతే కాని  కొత్తదేమీ కాదంటాడు. అది నిజమే. అసలు తానుకూడా, ఈ విషయాలు చెప్పడం మొదటి సారి కాదంటాడు. కృతయుగంలో వివస్వతుడికి, మరెందరికో తానే చెప్పినట్టు చెబుతాడు.  

యిదంతా ఎందుకంటే -   ఈ మహా విజ్ఞానం దాదాపు వేదకాలం నుండీ -వస్తున్నదే. కానీ యుద్ధ విద్యలు, రాజ విద్యలు, కళలు, సైన్సు - లాంటి వాటి కున్న బహుళ ప్రజాదరణ - ఈ యోగ విద్యకుండడం కష్టం. 

అందుకనే - శ్రీకృష్ణుడు - దీన్ని ప్రజలందరికీ ఉపయోగ పడే రీతిలో - అర్జునుడికి మళ్ళీ చెప్పాడు. యిది ప్రతి వొక్కరూ - ఎలా చేయాలో, చేస్తే ఏమవుతుందో , చేయక పోతే ఏమవుతుందో   విశదం గా చెప్పాడు.  

కర్మ యోగం ముఖ్యంగా చాలా సరళంగా చెప్పాడు. అయినా, యిప్పటికీ - చాలా మందికి , కర్మ యోగాన్ని గురించి సరైన అవగాహన లేదనే చెప్పొచ్చు..

యిదే బ్లాగులో - యింతకు ముందు కర్మ యోగాన్ని గురించి కొద్దిగా చర్చించాం.

కానీ - మర్ఫీ సూత్రాలు చూసిన తర్వాత -     ఎందుకలా మన జీవితాల్లో జరుగుతోంది - అన్న అంశం ఆసక్తి కరంగా మారుతుంది. ఎందుకలా అన్న ప్రశ్నకు మర్ఫీ సూత్రాలలో - జవాబు లేదు. కర్మ యోగంలో వుంది. సరే. యిప్పుడు -దాన్ని గురించి కొంత తెలుసుకుందాం.

మనందరికీ కర్మ యోగమును గురించి - "కర్మణ్యేవ అధికారస్తే , మా ఫలేషు కదాచన" అన్న వొక వాక్యం మాత్రం బాగా తెలుసు. కానీ ఈ వాక్యం యొక్క అర్థం చాలా మంది చేతుల్లో, రక రకాలుగా మారి పోయింది. 

కర్మయోగం - అంటే -   నిజంగా ఏమిటి - అన్నది మనం యిప్పుడు చెప్పుకుందాం .

"కర్మ( అంటే పని )" - చేయడానికి మీకు పూర్తి అధికారం వుంది.కర్మణ్యేవ అధికారస్తే - అంటే యిదీ అర్థం.

మీరు మీ పనిని ఎన్నుకోవడంలో -మీకు స్వాతంత్ర్యమూ వుంది.

అయితే - మీరు ఎన్నుకున్న వృత్తి ధర్మాల్ని, మీ సామాజిక ధర్మాల్ని  పాటించడంలో మీ బాధ్యతా వుంది.

మీరు చేసే ప్రతి పనికీ బాధ్యులు మీరే.  మరి బాధ్యత అంటే ఏమిటి?  ఏ పని చేసినా - దానికి కొన్ని పరిణామాలు వుంటాయి.మన పనుల వలన మన చుట్టూ వున్న పరిస్థితులలో రకరకాల మార్పులు వస్తాయి.  ఈ మార్పులు మన పనుల వలన వస్తూ వుంది - కాబట్టి, ప్రపంచం దానికి  తగ్గ ప్రతిఫలం తను నిర్ణయించి పనికి కర్త  ఐన  మనకి అందజేస్తుంది. పని మనం ఎంచు కోవచ్చు. కాని ప్రతిఫలం నిర్ణయించే శక్తీ మరొకటి వుంది. అది మనం కాదు. "మా ఫలేషు కదాచన" అంటే అర్థం యిదే. ఫలం నిర్ణయించే "అధికారం" మన చేతిలో లేదు. అది -మరో అతీత శక్తి, దాన్ని మనం కర్మ ఫల దాత అని చెప్ప వచ్చు -  ఆ శక్తి చేతిలో వుంది. 

కర్మ ఫల ధాతకు స్వ, పర భేదాలు లేవు. ఎటువంటి పక్షపాత బుద్ధీ లేదు.వొకరికివ్వవలసింది  మరొకరికివ్వడమో,  మరిచిపోవడమో - లాంటివి జరుగవు.

కాబట్టి మీకు వచ్చిన, వస్తున్న, రాబోయే  కర్మ ఫలాలు - మీకు రావాల్సిందే వస్తాయి. అంతకు ఎక్కువో, తక్కువో రాదు. మరొకరి కర్మ ఫలం మీకు రావడమో, మీది మరొకరికి పోవడమో జరుగదు.

నాకు ఏదీ వద్దు. నేను ఏ పనీ చేయను - అని మీరు కూర్చో గలరా? ఊహూ. కూర్చోలేరు. మీరు ఎక్కడుంటే అక్కడ, మీ ద్వారా ఏదో పని జరుగుతూనే వుంటుంది. మీరు తప్పించుకోలేరు. మీరు మీ పనిని - మీరుగా నిర్ణయించు కోక పోతే - ఏదో వొక పని ప్రకృతి ద్వారా నిర్ణయింప బడుతుంది.అదీ మీ పనిగా మారిపోతుంది. దానికీ కర్తృత్వము మీదే.

ఈ ఫలితాలు మీకు ఎలా వస్తుందో -అది చాలా -ఆసక్తి జనకమైనది.

మీరు చేసే ప్రతి పనీ - మూడు అంశాలుగా చెప్పొచ్చు. (అ) మీ మనస్సులో మీరు చేసే ఆలోచనలు  (ఆ) మీ నోటి  ద్వారా మీరు మాట్లాడే మాటలు (ఇ) మీరు బాహ్య ప్రపంచంలో చేసే పనులు

సాధారణంగా - ఆలోచన మొదట వస్తుంది. వొక  యుద్ధానికి కూడా మూలం ఎవరి మనస్సులోనో తలెత్తిన ఆలోచనే. అంటే, మంచి పనైనా, చెడ్డ పనైనా - మొదట, మనస్సులోనే పుడుతుంది. చాలా వరకు -  మంచి, చెడ్డ ఆలోచనలు మనస్సులో పుట్టి, అక్కడే నాశనమై పోతాయి. కొన్ని ఆలోచనలు - మంచీ కాదు, చెడూ కాదు. ఉదాహరణకు - సూర్యుడు తూర్పుననే ఎందుకు ఉదయిస్తాడు? ఈ ఆలోచన -కేవలం ఆలోచనే కానీ - మంచీ, చెడూ అంటూ ఏమీ లేదు. ప్రక్కింటాయనకు -ఆరోగ్యం సర్లేదు. మనం ఆస్పత్రికి తీసుకెళదాం -  అన్నది మంచి ఆలోచన.  వారి దగ్గర మనం తీసుకున్న అప్పు ఎగ కొట్టాలనుకోవడం చెడ్డ ఆలోచన.   యిలా, మంచి, చెడూ రెండూ, ఆలోచనలలో మొదట పుడతాయి.

ఆలోచనల నుండి   -  మాటలు, చేతలు రెండూ వస్తాయి. ఆలోచనలు మంచివైతే - మాటలూ, చేతలూ సాధారణంగా మంచివిగానే వుంటాయి.

ఆలోచనలు చెడుగా వుంటే  -  మాటలు చెడుగా   వుండచ్చు.చేతలూ చెడుగా వుండచ్చు. 

కానీ చెడు ఆలోచనలు - మనసులోనే మనం వుంచుకోవచ్చు. మాటలు, చేతలపై వాటి ప్రభావం లేకుండా చేసుకోవచ్చు. అయితే, మనకు, మనసుపై కాస్త  అదుపు, కట్టుబాటు వుంటే - చెడు ఆలోచనలు   రాకుండా కూడా   నివారించ వచ్చు. లేదంటే - చెడు ఆలోచనలు వస్తాయి. కొంత మందికి ఎప్పుడూ చెడు ఆలోచనలే . వీరు విలన్లు - అన్న మాట. అయితే - దీన్ని మార్చుకోవచ్చు.

సరే. నోటిపై కాస్త అదుపు, కట్టుబాటు వుంటే - మీ ఆలోచనలు, మనసు కట్టలు దాటి, నోటి వరకు, తరువాత  నోటి నుండి, మాటలద్వారా బయటకు, రాకుండా నిరోధించ వచ్చు.అంటే - కనీసం, చెడు మాటలు మాట్లాడ కుండా చెయ్య వచ్చు.  సరే. నోటిపై కట్టుబాటు పోతే - మనసులోని ఆలోచనలు, మాటల హద్దులూ దాటి, చేతల వరకూ పోవచ్చు. 

యిలా- చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు చేతలూ  వుంటాయి. అలాగే - మంచి ఆలోచనలూ, మంచి మాటలూ, మంచి చేతలూ కూడా వుంటాయి. దేన్నైనా చెడు నుండి, మంచికి మార్చుకోగల శక్తి మనకు వుంది. అందుకనే - మన పనులన్నిటికీ - మనమే బాధ్యత వహించాల్సి వుంటుంది.

కర్మ అంటే - మనో,వాక్, కాయ కర్మలన్నీ - అని చెప్పాలి.యిక కర్మ యొక్క  ప్రతిఫలాన్ని గురించి  తెలుసుకుందాం.
  
మనకు వచ్చే ప్రతి ఫలం రెండు రకాలుగా వుంటుంది. 

(1 ) దృశ్య ఫలం : - ఈ మొదటి రకానికి చెందిన దృశ్య (ప్రతి) ఫలం మనకు, దాదాపు మన పని అయిన వెంటనే వచ్చేస్తుంది.లేకున్నా, మనం చేసిన ఫలానా పనికి - మనకు ఈ ఫలితం (ప్రతి ఫలం) వచ్చిందని - తెలిసిపోతుంది. ఉదాహరణకు - మీరు ఎవరినో, తిట్టారు. వారు వెంటనే తిట్టొచ్చు, లేదా కొట్టొచ్చు. అది మీకొచ్చిన దృశ్య ఫలం.

ఎవరో బస్సులోనో, ట్రైన్ లోనో మరిచిపోయి వదిలేసిన డబ్బు సంచిని - మీరు చూసి, పోలీసు శాఖ వారి ద్వారా, వారింటికి తీసుకెళ్ళి - వొప్పగించారనుకోండి. వొక నెల తర్వాత - మీ యింటికి - ప్రభుత్వం నుండి, ఏదో పారితోషకం రావచ్చు. మిమ్మల్ని అభినందిస్తూ, మీ ఫోటో, న్యూస్ పేపర్లలో - పడవచ్చు. పనికీ, ఫలితానికీ, మనం ముడి పెట్ట గలిగితే అది దృశ్య ఫలం. మీకు తెలియక పోవచ్చు వొక్కో సారి. మిగతా వారికి తెలియ వచ్చు.

మీరు ఎవరింట్లో నైనా - దొంగతనం చేసారనుకోండి  .పది లక్షల రూపాయలు మీరు ఎత్తుకెళ్ళారు. ఎవరూ చూడలేదు. ఎవరికీ మీరు ఎత్తుకెళ్లినట్టు   తెలీదు. యిప్పుడు ఆ పది లక్షల రూపాయలు మీకు లభించిన దృశ్య ఫలం. అయితే, వెంటనే ఎవరో చూసారు, అందరూ లేచి మిమ్మల్ని చితక బాది పోలీసులకు వొప్పగించారనుకోండి. అప్పుడదే దృశ్య ఫలం. మీకు పది సంవత్సరాల జయిలు శిక్ష పడ్డది. అదికూడా దృశ్య ఫలమే. అంటే - కార్యానికీ, ఫలితానికీ నేరుగా వున్న సంబంధం తెలిసేలాగా వుంటే - అది దృశ్య ఫలం.

(2 ) అదృశ్య ఫలం   - మీరు చేసే పని మంచో, చెడో అయితే -  మీ పనికి పూర్తిగా ఫలితం వెంటనే మీకు యివ్వ బడక పోతే - ఈ అదృశ్య ఫలం మీ అదృశ్య ఖాతాలో చేరుతుంది. మంచి పనిని మనం పుణ్యం - అంటాము. చెడ్డ పనిని - పాపం - అని అంటాము. మీ పుణ్యాలకూ, పాపాలకూ, మీకు రావలసిన ఈ అదృశ్య ఫలం - మీరు ఎక్కడికెళ్ళినా, మరో జన్మ కెళ్ళినా కూడా - మీ వెనుకనే వస్తుంది. వీటన్నిటికీ - మీకు ఫలితం వెంటనే యివ్వడం కుదరదు. అందుకే - పాపం పండాలి, అని కూడా అంటారు.

ఈ పుణ్య పాపాల మూటను "సంచిత కర్మ " అంటారు. యిది చాలా ఎక్కువగా వుందనుకోండి  . ఈ జన్మలో అనుభవించినదంతా అనుభవించి - మిగతాది - మరో జన్మకు, మీతో బాటు తీసుకెడతారు.ఈ మూటలో నుండి , ఈ జన్మలో మీరు అనుభవించ గలిగేది - ప్రారబ్ధ కర్మ గా - ఈ జన్మ ఖాతాలో చేరుతుంది. ఈ ప్రారబ్ధ  కర్మ ఫలాన్నే నే మీరు ఈ జన్మలో పొందుతారు.ఈ జన్మలో మళ్ళీ మీరు చేసే కర్మ "ఆగామి కర్మ"  అంటారు. అది మీ సంచిత కర్మతో కలిసి - వాటి ఫలితానికోసం ఎదురు చూస్తుంటాయి.

క్లుప్తంగా -యిదీ కర్మ సిద్దాంతం. కర్మ యోగం అంటే - ఈ కర్మ ఫలాల నుండి బయట పడ గలిగే కర్మ మార్గము. దాన్ని గురించి మరో సారి చూద్దాము.

కర్మ సిద్దాంతం - ఈ ప్రపంచంలో మనకు జరిగే, మనకు వచ్చే ప్రతి ప్రతిఫలాలన్నిటినీ - చక్కగా, విశదంగా, కారణ-కార్య-ఫలరూపాలలో - సశాస్త్రీయంగా  విడమర్చి చెబుతుంది.

మనకు వొక్కో సారి అనిపిస్తుంది. నేను అన్నీ మంచే చేస్తున్నాను కదా. మరి, నాకెందుకిన్ని  కష్టాలు వస్తున్నాయి?
లంచాలు తీసుకునే వాడు బాగానే వున్నాడు. హత్యలు, దోపిడీలు, మాన భంగాలు చేసే వాళ్ళు బాగానే వున్నారు. నాకెందుకీ కష్టాలు. నేను కూడా వాళ్ళ లాగానే వుంటే మేలేమో - అని అనిపిస్తుంది.

మంచివాడికి - కాలం కాదు - అని అనుకుంటాము.

అయ్యా - మీకు వస్తున్నది - మీ యిప్పటి మంచితనపు ప్రతిఫలం కాదు. మీరు జన్మ, జన్మాంతరాల నుండి మోసుకొచ్చిన సంచిలో వున్న సంచిత కర్మ యొక్క ప్రతిఫలం.   మీరు ఈ రోజు మంచి చేసారు.నిజమే. అది - వెంటనే - మీ ఖాతాలో చేర్చ బడుతుంది. మీకు తప్పకుండా - వాటి ప్రతిఫలం, ఎప్పుడో భవిష్యత్తులో వస్తుంది. కానీ ఈ రోజు వస్తున్నది. మీరు ఎప్పుడో చేసిన పనుల ప్రతిఫలం.

దొంగతనాలు, హత్యలు, మానభంగాలు చేసిన వారు - కొన్ని రోజులు ధనికులు కావచ్చు, పేరు ప్రతిష్టలు పొందచ్చు. యం.యల్.ఏ.లు కావచ్చు. యం.పీ.లు కావచ్చు. మరేదైనా కావచ్చు. కానీ - అది వారి సంచిత కర్మలో నుండి తీసి యివ్వ బడుతున్న పాత పనుల ప్రతిఫలం. అది ఏ జన్మదో. కానీ - వారు, ఈ జన్మలో చేసే పనుల మూలంగా - పాత కర్మఫలం త్వరగా ముగిసిపోవడం - ప్రస్తుత కర్మఫలం వాళ్ళను వెన్నాడడము - తప్పకుండా జరుగుతుంది.

మీరు జరుగుతున్న చరిత్ర చూస్తే కూడా - యిది సులభం గానే అర్థమవుతుంది. సంచిత కర్మ ముగియ గానే, వున్న వైభవం పోయి, పదవులూ పోయి, జయిళ్ళ పాలవడం, లేదా, తీవ్ర రోగాలు, లేదా, దుర్మరణాల పాలవడం చూస్తున్నాం గదా. యివన్నీ - కర్మ ఫల దాత చేస్తున్న చిత్రాలే. వారికి - ఎటువంటి పక్ష పాతం లేదు.ఎవరెవరికి యివ్వ వలసింది - వారి వారికి సమయం ప్రకారం ఇస్తూనే వున్నారు. మనకూ అంతే. ఏదో రోగాలు వచ్చాయనుకోండి. మీరు క్రుంగి పోనవసరం లేదు. అది పోతుంది.మీరు చేయ గలిగిన మంచి పనులు మీరు చేస్తూ వుండండి.  అవే మీ భవిష్యత్తుకు, పునాది.బంగారు బాట.

 అయితే - చెడ్డ పనులను, పాపాలను చేసే వారికి మాత్రమే కాదు - చూసే వారికి కూడా పాపం వస్తుంది. అందుకే గాంధీ గారు - అటువంటివి - ఎదిరించమన్నారు. శ్రీకృష్ణుడు, అర్జునునికి అదే చెప్పాడు. అధర్మానికి ఎదురు తిరిగే వారికి - కొన్ని కష్టాలో, అవస్థలో ఎదురైనా - అవి ఖాతరు చెయ్యకుండా ఎదురు తిరగాలి. అదే చాలా గొప్ప, మంచి పని. వారికి - వచ్చే పుణ్యం చాలా గొప్పది. 

మనం సాధారణంగా అదృష్టం, దురదృష్టం - అని అంటూ వుంటాము. అదృష్టం అంటే - మీ మంచిపనులకు, మీకొచ్చిన అదృశ్య (ప్రతి) ఫలం ఎప్పటి పనులదో, ఈ రోజు వచ్చింది.   అదే మాదిరి, దురదృష్టం - మీరు గతంలో చేసిన చెడ్డ పనులకు మీకు యిప్పుడు వచ్చిన అదృశ్య ( ప్రతి) ఫలం.

అయితే - ప్రజలు చేసే చెడ్డ పనుల ప్రతిఫలం కొంత రాజుకూ చేరుతుంది.చిన్న పిల్లలు, భార్య చేసే చెడ్డ పనుల ప్రతిఫలం కొంత భర్తకూ చెందుతుంది. అంటే - ఎవరికి - బాధ్యత వుందో - వారికీ చేరుతుంది. చేసేవారికి మాత్రమే కాదు.రాజులు చేసే చెడ్డ పనుల ప్రభావం - ఆ ప్రజల పైన కూడా పడుతుంది. 

రావణాసురుడు చేసిన చెడ్డ పనుల ప్రభావం లంకా నగర ప్రజలందరి పైనా పడింది. వారెవరూ - రావణాసురుడి చెడ్డ పనులను ఖండించ లేదు గనుక. యిప్పుడూ అంతే. 

మంచి, చెడు - అన్నది ముఖ్యంగా మన మనస్సులలో నుండి వస్తుంది. తరువాత మాటల ద్వారా, చేతల ద్వారా - బహిర్గతమవుతుంది. వాటి ఫలితాల గురించి చూసాము.

యిప్పుడు  -  వీటన్నిటినీ సమన్వయము చేసి చూడండి.

మీరు ఈ రోజు ఏదో చాలా మంచి పని చేసారు. ఉదాహరణకు - వొక అనాథ బాలుడి చదువుకు - వొక సంవత్సరానికయే ఖర్చు మీరే భరించారు. యిది చాలా మంచి పని. యిది చేసేసి, తిరిగి వస్తూ, దారిలో చిన్న గుంతలో పడ్డారు. బాగా తగిలింది. అయ్యో. మంచి పని చేస్తే - దేవుడు మనకిచ్చిన ప్రతిఫలం యిదా - కలికాలం యింతే. అనుకుంటారు.

యిది తప్పు. మీరు గోతిలో పడ్డానికి కారణం -మీరు ఎప్పుడో చేసిన చెడ్డ పని. ఈ రోజు చేసిన మంచి పని కాదు.పాప పుణ్యాల లెక్ఖ సాధారణంగా వేరే అయినా - వొక స్వామీజీ - అన్నారు. "నాయనా, అప్పుడు నువ్వు చేసిన చెడ్డ పనికి నువ్వు లారీ క్రింద పడవలసినది.  కానీ, ఈ మధ్య నువ్వు మంచి పనులే చాలా ఎక్కువగా చేస్తున్నావు. నువ్వు మంచి వాడివి అయి పోయావు. నిన్ను ఎక్కువ బాధ పెట్టడం యిష్టం లేక, గోతిలో పడవేసాను.నీ పాపం పోయిందిలే.సంతోష పడు" అని కర్మ ఫల దాత నిశ్సబ్దంగా నీ చెవిలో అంటాడు. నువ్వు నిశ్సబ్దంగా వుంటే - అదీ నీకు వినిపిస్తుంది.

మన వారు - మంచి పనులకు - పంచ మహా యజ్ఞాలని వొక లిస్టు యిచ్చారు. అవి - ప్రతి వొక్కరూ - ప్రతి రోజూ, చేయవలసిన విధులు. దేవతలకూ, ఋషులకూ, పెద్దవారికీ (పితరులకు), మనుషులకూ, మిగతా యితర ప్రాణులకూ - మీరు (నిస్స్వార్థంగా) చేయ వలసిన - విధులు. దీన్ని గురించి - మరో వ్యాసంలో - యిదే బ్లాగులో రాయబడింది. అదీ చదవండి.

మరి - మంచీ- చెడూ రెండూ కాని పనులున్నాయి కదా. వాటి విషయమేమిటి?  మంచీ-చెడూ కాకున్న  మిగతా, మామూలు  పనులను కూడా -  సరి అయినది, సరి కానిది అని రెండు రకాలుగా చెప్పొచ్చు.  సరి అయిన వాటికి మీకు నచ్చిన ఫలితమూ, కాని వాటికి, మీకు నచ్చని ఫలితమూ సాధారణంగా వస్తూ వుంటుంది.  అది కూడా కర్మ ఫల దాత యిచ్చేదే. యిక్కడే మర్ఫీ సూత్రాలు వొక్కో సారి పనిచేస్తాయి.
ఉదాహరణకు - మీరు ట్రైన్ కు  అర్ధ గంట ముందుగా వెళ్ళారు. అది పుణ్యమూ కాదు. పాపమూ కాదు. సరైన పని. మీరు కష్టం లేకుండా - ట్రైన్ యెక్క గలుగుతారు.వొక వేళ ట్రైన్ అర గంట లేటుగా వచ్చిందనుకోండి. అదేమీ మీ పాప ఫలితం కాదు. మీతో బాటు, మీ ప్రియ   మిత్రుడో (మిత్రురాలో) వుంటే -  ఆ అర గంట ఆలస్యం - మీకు బాగా సంతోషం కలిగిస్తుంది కదా. లేదా - మంచి పుస్తకం చదవవొచ్చు. అప్పుడూ - అదేదో మీకు నష్టం అయిన ఘటన అని మీరు బావించరు.

మీరు రాయాలనుకొన్నప్పుడు, మీ పేనా మొరాయించిందనుకోండి  .  అది కూడా - మీరు చేసిన పాప ఫలితం కాదు. మరో పేనా తీసుకుని రాసేసుకోండి.  యిలా ప్రతి దానిని - సులభంగా తీసుకునే మనస్తత్వం వుంటే, ప్రత్యామ్నాయం కనుక్కునే మనస్తత్వం వుంటే -  మర్ఫీ సూత్రాలు మీపై పని చేయవు.

నిజానికి - యివే కావు - మీకు వచ్చే పాప పుణ్యాల ఫలితాలు కూడా -  మీ మనసు నంటకుండా చేసేసుకోవచ్చు. ఉదాహరణకు - రమణ మహర్షి గారికి రాచ పుండు (కాన్సర్) వుండేది. ఆయన - దానిని ఖాతరు చేయకుండా - హాయిగా గడిపే వారు. అలాగే రామ కృష్ణ పరమ హంస గారు కూడా. వచ్చింది యెప్పటి పాప ఫలితమో. అయినా -  దాని వలన దుహ్ఖ పడితే - పడవచ్చు. దేవుడా - నీవు  ఏదిచ్చినా, నీ ప్రసాదమే - సంతోషం అనుకుంటే - ఆ దుహ్ఖం మరి లేదు మనకు. యిది - జ్ఞాని యొక్క మార్గం.

పాప పుణ్యాల కర్మ ఫలం - కష్ట, సుఖాలు. కష్టాలు అంటే - దరిద్రాలు, రోగాలు, మన వారిని పోగొట్టుకోవడాలు ఇలాంటివి. సుఖాలు అంటే - ధనధాన్యాలు, ఐశ్వర్యాలు, ఆరోగ్యము లాంటివి కలగడం. యివి కర్మ ఫల దాత మనకిచ్చేది. అలాగే - సరికాని పనులు చేసినా - కష్టాలు వస్తాయి.సరి అయిన పనులు చేసినప్పుడు - సుఖాలు వస్తాయి.

మరి - సంతోషం, దుహ్ఖము  అనేవి - కష్ట సుఖాల ఫలితంగా మన మనస్సులో , మనమే - కలుగ జేసుకునేవి. యివి కర్మ ఫల దాత  యివ్వడు.

స్థిత ప్రజ్నుడయిన  వాని మనస్సులో - ఏదొచ్చినా, ఏది పోయినా, సంతోషంగా ఉండగలిగే సామర్థ్యం వుంటుంది. అంటే - సంతోషానికి ముఖ్య కారణం జ్ఞానమే అని చెప్ప వచ్చు.మిగతా కారణాలు - సుఖాలు వచ్చినప్పుడు, కొద్ది కాలం సంతోషం కూడా మనమే మనలో  కలుగ జేసుకుంటాము .కానీ - అది, సుఖం వున్నా కూడా,   త్వరగానే మనల్ని విడిచి పోతుంది.

కష్టానికి కారణం పాపాలూ కావచ్చు,సరికాని పనులు చేయడం కావచ్చు. త్రాగుడు అలవాటు అయితే - అది పాపం కాక పోవచ్చు - కానీ కష్టాలకు కారణం తప్పకుండా అవుతుంది. త్రాగుడులో - పాపాలూ చేస్తారు.

అయితే - దుహ్ఖానికి కారణం అజ్ఞానమే - అని తప్పకుండా చెప్ప వచ్చు. అంటే - కష్ట సుఖాలన్నిటిలో -  మీరు  సంతోషం గా వుండ గలరు.అది మీ చేతిలో వుంది.

ఇదండీ   - కర్మ సిద్దాంతం. యిది తెలుసుకుంటే - మనం కర్మ యోగానికి వెళ్లి పోవచ్చు.

= మీ

వుప్పలధడియం విజయమోహన్