17, అక్టోబర్ 2011, సోమవారం

మానసిక ఆరోగ్యానికి మూల సూత్రాలు - మనసూ - బుద్ధీ ఎలా పనిచేస్తాయి - మీకు సంతోషం కావాలంటే తిరుగు లేని మార్గం


మనో మయ కోశము
మానసిక ఆరోగ్యానికి మూల సూత్రాలు 

క్రిందటి వ్యాసంలో ప్రాణమయ కోశాన్ని గురించి  తెలుసుకున్నాము. అందులో, ముఖ్యంగా  మనం గుర్తుం చుకోవలసినవి   -
  1.  స్వచ్చమైన గాలి వున్న చోట నివసిస్తే - ఆరోగ్యం బాగుంటుంది.  గాలిలో రక రకాల పొగలు, కార్బన్ మోనాక్సై డు, వుండే చోట - రోగాలు ఎక్కువగానే వస్తాయి.   కార్బన్ మోనాక్సైడు - మోటారు వాహనాల నుండి ఎక్కువగా వస్తుంది.
  2. కొంత మందికి పూల పుప్పొడి అలెర్జీ గా వుంటుంది. ఆస్తమా ,ఉబ్బసం వున్న వారికి. అటువంటివారు - పూల చెట్ల కంటే  - యితర  చెట్లు వేసుకోవడం మంచిది. కానుగ, రాగి, మద్ది చెట్ల గాలి చాలా మంచిదని చెబుతారు. ఏ చెట్ల గాలైనా మంచిదే. కానీ - వీటికి - కొన్ని ప్రత్యేకతలు  వున్నాయి.
  3. కొన్ని రకాల సులభమైన ప్రాణాయామాలు ప్రతి వొక్కరూ నేర్చుకుని, ప్రతి దినం చేస్తే చాలా ఆరోగ్యకరం.యివి శారీరక, మానసిక ఆరోగ్యాలకు రెండింటికీ  మంచిది. ముఖ్యంగా అనులోమ విలోమ; భ్రామరి; కపాలభాతి లాంటివి. వీటి ప్రయోజనం  -  మనం కొద్ది రోజులలోనే చూడవచ్చు.
  4. బ్రాహ్మీ ముహూర్తం లోను, సాయంకాలం లోనూ - సూర్య కిరణాల ఎదురుగా - ప్రాణాయామము, ధ్యానము చేయడం చాలా మంచిది.
  5. మీకు ప్రాణాయామం తెలియకుంటే - మీ ఉచ్చ్వ్వాస, నిశ్వాసలను  - ప్రశాంతంగా, హాయిగా గమనిస్తూ కూర్చోండి. మధ్యలో, మీ మనసు మరెక్కడికో వెళ్ళుతూ వుంటే - ఫరవాలేదు. మళ్ళీ దాన్ని  మీ ఉచ్చ్వాస, నిశ్వాసల పైకి మళ్లిం చండి. దీన్ని  శ్వాస మీది ధ్యాస అని చెప్పుకోవచ్చు.
  6. మీకు మంచి గురువు దగ్గర నేర్చుకునే వీలుంటే - రక రకాల ప్రాణాయామాలను సాధన చేయడం నేర్చుకోండి. 
యిక మనో మయ కోశాన్ని గురించి, మానసిక ఆరోగ్యాన్ని గురించి చూద్దాము.  దీన్లో - ముఖ్యంగా నాలుగు భాగాలు వున్నాయి. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనేవి. నాలుగూ -నాలుగు రకాల పనులు చేస్తుంది.

మనస్సులో - భావుకత ఎక్కువ. ఎమోషనల్ నేచర్ అంటాము కదా .  అదన్న మాట.

బుద్ధి - మంచి, చెడుల వివరణ - తనకు తెలిసినంతగా చేసి,  మనస్సు కు చెబుతుంది.

కొంత మంది మనస్సుకు ప్రాధాన్యత యిస్తారు. కొంత మంది బుద్ధికి ప్రాధాన్యత  యిస్తారు.రెండూ ముఖ్యమే. రెండింటికీ సమాన   ప్రాధాన్యత వుంది - జీవితం లో.

మనిషి జీవితంలో సంతోషంగా వుండాలని కోరుకుంటాడు.  సంతోషంగా వుండటం మనసుకే సాధ్యం. కాని - మంచి చెడులు తెలియకుండా సంతోషంగా వుండటానికి ప్రయత్నించే వారికీ - జీవితం దుహ్ఖ మయమై  పోతుంది. దుహ్ఖం కూడా మనసుకే సాధ్యం. సంతోషమూ, దుహ్ఖమూ అనుభవించ గలిగేది - మనస్సు. మనలను వాటి వైపు పరుగు తీయించేది  మనస్సు. దుహ్ఖం లో పడితే - బయటకు రాలేక అవస్థ పడేది మనస్సు.

వీటి నుండి మనల్ని కాపాడ గలిగేది బుద్ధి.  బుద్ధికి సంతోషమూ లేదు. దుహ్ఝామూ లేదు. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం వుంది. మనసుకు ఆలోచన వుంది. కాని అది చాలా భావుకతతో కూడిన ఆలోచన.మనసుకు మంచి చెడు చెప్ప గలిగేది బుద్ధి. ఈ రెండూ - వికసించిన మనిషిలో, సంతోషమూ వుంది. తనను తాను కాపాడుకునే నేర్పూ వుంది. సంతోషాన్ని, జీవితాంతమూ కాపాడుకోగలిగే సమర్థతా వుంది.

అహంకారము - అంటే - నేను అనే వ్యక్తిత్వ పరిధి. ఈ శరీరం నేను. ఈ ఆలోచన నేను చేస్తున్నాను. ఈ సంతోషమూ, దుహ్ఖమూ - నేను అనుభవిస్తున్నాను.  అని మనకు చెప్పేది అహంకారము.

చిత్తము అనే భాగంలో - మన భూత కాలమంతా వుంది. మన అనుభవాలన్నీ వున్నాయి. మన విజ్ఞానమంతా  వుంది. సరే. అన్ని భాగాలను కలిపే భాగం కూడా యిదే అని చెప్పొచ్చు.

బుద్ధికి - మంచి, చెడూ - ఎలా తెలుస్తుంది? యిది - చాలా ముఖ్యమైన ప్రశ్న.   

బుద్ధి - మనకు - ఆత్మ స్వరూపమైన భగవద్ చైతన్యానికీ మధ్య  వారధి లాంటిది. బుద్ధిలో - ఈ విశ్వ వ్యాప్త   చైతన్యం యొక్క ప్రతిబింబం ప్రతిఫలిస్తూ వుంటుంది. ఆ చైతన్య ప్రతిబింబం బుద్ధిలో ప్రతిఫలించడం వలననే - మన శారీరక, మానసిక జీవనంలో - చైతన్యం వుంది. అది లేని నాడు - మనలో మరి చైతన్యం లేదు.  దీన్ని గురించి ఆది శంకరుల  వారు - తమ వివేక చూడామణి, ఆత్మ బోధ లాంటి గ్రంధాలలో - "చిదాభాస"  అని పేరు పెట్టి - విశదీకరించారు . దీన్ని గురించి మరింతగా తెలుసికోవాలనుకునే వారు - ఆంగ్లములో వున్న నా బ్లాగు - వైస్ స్పిరిచువల్ ఐడియాస్.బ్లాగ్స్పాట్. కాం. లో చదవ వచ్చు.

మనకు సంతోషం కావాలి. అది జీవిత గమ్యం. అదీ నిజమే. కాని - బుద్ధి మాట  వినకుండా సంతోషం వెనుక పొతే - దుహ్ఖంలో మునిగిపోతాం. సంతోషానికి గమ్యం - దానికి మార్గం బుద్ధి - అన్న మాట. బుద్ధికి ప్రాధాన్యత యిస్తూ సంతోషం వెతుక్కుంటూ పోయే వారికి - జీవితం హాయిగా వుంటుందన్న మాట.

అయితే - దేవుడి సృష్టి విచిత్రమైనది. ఈ విషయంలో - మగ వారికీ, ఆడ వారికీ - కాస్త తేడా సృస్టించాడు.

సగటు ఆడవారు - అరవై శాతం పైగా - మనసుకే ప్రాధాన్యతనిస్తారు. యిది వారు అనుకుని చేసేది కాదు. సృష్టి విచిత్రం. అంటే - బుద్ధికి - నలభై శాతం కంటే తక్కువ ప్రాధాన్యత అన్న మాట. యిది మంచా చెడా అంటూ ఏమీ లేదు. సృష్టి యిలా వుంది. అంతే.   సంతోషాన్ని అనుభవించ గలిగే సామర్థ్యమూ, ఆడవారికే ఎక్కువ. దుహ్ఖ పడే సంభవాలూ వారికే ఎక్కువ. మమసుకు ప్రాధాన్యత ఎక్కువ, బుద్ధికి ప్రాధాన్యత తక్కువ యిస్తారు. అయితే - యిది సగటు ఆడవారిని గురించి - అంటే, 95 శాతం పైగానే వున్న వారిని గురించి -   చెబుతున్నాము.

కొంత మంది  ఆడవారు - బుద్ధికి ఎక్కువ ప్రాధాన్యత యిస్తూ వుండడం మనం చూడొచ్చు. అయితే - వారిలో, సంతోషం తగ్గి పోవడమూ మనం చూడొచ్చు. అదే విధంగా - కొంత మంది ఆడవారు - భావుకతకే ప్రాధాన్యత నిస్తూ - చిన్న విషయాలకు ఎక్కువ దుహ్ఖ పడడమో, సంతోష పడడమో కూడా మనము చూడొచ్చు.

సగటు మగ వారి విషయం యిందుకు మారుగా వుంటుంది.

సగటు మగ వారు - అరవై శాతం పైగా, బుద్ధి కే ప్రాధాన్యతనిస్తారు. యిది వారు అనుకుని చేసేది కాదు. యిదీ సృష్టి  విచిత్రమే. అంటే, మనసుకు - నలభై శాతం కంటే తక్కువ ప్రాధాన్యత  యిస్తారన్న మాట. యిది కూడా మంచా చెడా అంటూ ఏమీ లేదు. సృష్టి యిలా వుంది. అంతే.   ముందే చెప్పినట్టు,  సంతోషాన్ని అనుభవించ గలిగే సామర్థ్యమూ -ఆడవారికే ఎక్కువ. దుహ్ఖ పడే సంభవాలూ వారికే ఎక్కువ. మగవారికి తక్కువ. ఎందుకంటే -మగవారిలో మనసుకు ప్రాధాన్యత తక్కువ. బుద్ధికి ప్రాధాన్యత ఎక్కువ. అయితే - యిది సగటు మగ వారిని గురించి చెబుతున్నాము.

కొంత మంది  మగ వారు - మనసుకు ఎక్కువ ప్రాధాన్యత యిస్తూ, బుద్ధికి తక్కువ ప్రాధాన్యత నిస్తూ  వున్న వారినీ మనం చూడొచ్చు. వారిలో - కోపాలూ, తాపాలూ, చెడు సావాసాలూ, చెడు అలవాట్లకు లోను కావడమూ మనం చూడొచ్చు. చిన్న వాటికి పొంగి పోవడమూ, క్రుంగి పోవడమూ కూడా వీరిలో జరుగుతూ వుంటుంది. అదే విధంగా - కొంత మంది మగ వారు  - బుద్ధి జీవనానికే ప్రాధాన్యత నిస్తూ - సంతోషమూ, దుహ్ఖమూ - ఏమిటో కూడా తెలియకుండా వుండడమూ, ఎప్పుడూ, రాజకీయాలు, సైన్సు లాంటి వాటిలో - మునిగి వుండడం మనం చూడొచ్చు.

మగ వారు - బుద్ధి జీవనానికి ప్రాధాన్యత యివ్వ గలరు. యివ్వాలి కూడా. కాని సంతోషం అనుభవించడం కూడా తెలిసి వుండాలి; అనుభవించాలి. అంటే - బుద్ధీ, మనసూ 60 : 40 నిష్పత్తిలోనే వుండాలి వారిలో.

కానీ - ఆడ వారు, మానసిక జీవనానికి ఎక్కువ  ప్రాధాన్యత యివ్వ గలరు. యివ్వాలి కూడా. అయినా బుద్ధి జీవనం కూడా తెలిసి వుండాలి. మంచీ, చెడూ ఆలోచించ గలగాలి. సంతోషం అనుభవించడం పుట్టుకతోనే ఎక్కువగా వున్న గుణం;ఆలోచన అలవారుచుకోవలసిన గుణం. అంటే - బుద్ధీ, మనసూ 40 : 60 నిష్పత్తిలోనే వుండాలి వారిలో.  

సరే. మగ, ఆడ కలిసి జీవించడంలో అంతరార్థం ఏమిటి?  శివుడిని అర్ధ నారీశ్వరుడని చిత్రించడంలో అంతరార్థం ఏమిటి? ఆడ మగ కలయికలో మాత్రమే - సంతోషం (60  + 40 ) పూర్తిగా  100  శాతమూ, బుద్ధి కూడా ( 40 + 60 ) పూర్తిగా  100  శాతమూ యిద్దరికీ వస్తుంది. యిది ప్రకృతి నియమం.  

ఇద్దరినీ కలిపే బంధం - అనురాగము, బుద్ధి రెండూ అయి వుండాలి. అంతే.

మహర్షులలో మొదటి వాడుగా పేరు పొందిన వసిష్ఠ మహర్షి - అరుంధతిని విడిచి ఎప్పుడూ వుండలేదు. పార్వతి, శివుడు దూర దూరంగా వుంటే - యిద్దరిలోనూ - పరిపూర్ణత ఉండదని - పురాణాలు ఎలుగెత్తి చెప్పాయి. చాలా మంది ఋషులూ యిదే ఆదర్శం పాటించారు.

సరే. మగ, ఆడ వారిలో - ఏ వొక్కరైనా- బుద్ధి, మనస్సు సమంగా వుంచుకోగాలరా?  వుంచుకోవచ్చు. కానీ - 50 , 50  శాతం   మాత్రమే వుంచుకో గలరు.  రెండూ నూరు శాతం వుండాలంటే - యిద్దరూ - వొకటిగా వుండాలి.  యిదీ మనోమయ కోశానికి మొదటి సోపానం.
ఇది అర్థం కాకుండా - వొకరికొకరు పరిపూర్ణతను - యిచ్చే వారని తెలుసుకోకుండా - నేను గొప్ప, నువ్వు గొప్ప అనో, సమానత్వం కోసమనో  -  ప్రాకులాడడం - అర్థం లేని పని.

ఈ లోకంలో - ఏ ప్రాణికీ - మరొక ప్రాణి సమానం కాదు. కాలేదు.సృష్టే అలాంటిది. సర్వే జనాః సుఖినో భవంతు - అన వచ్చు; అది సాధించవచ్చు  - కానీ - సర్వే జనాః సమానో భవతు  - అనడం  కుదరదు. అది జరగదు. దేని ప్రత్యేకత దానిదే.

మనోమయ కోశము యొక్క  గమ్యం - అంటే మనిషి గమ్యం - సంతోషమే. కానీ - దీనికి మార్గం బుద్ధి. వొకటి వొకరి వద్ద - మరొకటి, మరొకరి వద్ద - ఎక్కువగా వుంది. అంతే.

మన ప్రాచీనులు - పురుషార్థాలు నాలుగు - ధర్మ, అర్థ, కామ, మోక్షాలు - అన్నారు. యిక్కడ, పురుష అన్న పదం అడ, మగ, యిద్దరికీ వర్తిస్తుంది.

మొదటి పురుషార్థం ధర్మము అన్నారు. అంటే - ఏ పని చేసినా - ధర్మ మార్గం లో నే - చెయ్యాలని అర్థం.  ఏ పనికైనా అధర్మ మార్గం పనికి రాదు. ఎందుకు?

ఉదాహరణకు - మీరు దొంగతనం చేసో, లంచగొండి తనం తోనో - కోటి రూపాయలు సంపాదించారనుకోండి. యిప్పుడు. కోటి రూపాయలు మీ దగ్గరున్నాయి. నిజమే. కానీ - దీనికి తగ్గ సంచిత కర్మ ఫలం - మీ పైన అదృశ్యంగా వున్న కర్మ ఫల సంచి లో చేరుతుంది. అది - మీ జీవితంలో, ఎప్పుడు, మిమ్మల్ని - ఎంత ఘోరంగా, దెబ్బ తీస్తుందో, మీకు - యిప్పుడు తెలీదు.  కాని - మీ సంచిత కర్మ ఫలం, మీరు అనుభవించడం మాత్రం తథ్యం. ఈ జన్మలో అది పూర్తి కాక పోతే - వచ్చే జన్మలో కూడా, మీ వెంటే వస్తుంది. మీ జన్మనూ, ఆయుస్సునూ, సుఖ,దుహ్ఖాలనూ - చాలా వరకూ శాసి స్తుంది. చెడ్డ మాత్రమే కాదు, మీరు చేసే మంచిపనుల ఫలితం కూడా మీతో బాటు వస్తుంది.

కానీ - ఈ రోజు మీరు మంచి పనులు చేస్తారా, మంచి మాటలు మాట్లాడుతారా, ఏ పనులు చేస్తారు, అన్న స్వాతంత్ర్యం మీకు వుంది. అది మీ మనస్సు పైన మీకు వున్న అధికారం పైన, మీ బుద్ధి పైన మీకు వున్న అధికారం పైన ఆధార పడి వుంది.

మంచి పని చేసినా - బుద్ధి ప్రేరేపణ తోనే చేస్తారు. దానికి, మొదట మీ మనసు సంతోష పడుతుంది. అయితే - వొక్కో సారి - మంచి పనికి చెడ్డ ఫలితం వచ్చినట్టు భ్రమ కలుగుతుంది. యింతకు ముందు వొక వ్యాసంలో - ప్రతి పనికీ రెండు రకాల ఫలితాలున్నట్టు చెప్పుకున్నాము. వొకటి దృష్ట ఫలం. రెండవది అదృష్ట ఫలం.

ఇప్పుడు మీరు చేసిన వొక మంచి పనిని దృష్టాంతంగా చూద్దాము. మీరు వొక అనాథ బాలుడికి విద్యా సౌకర్యం కోసం పది వేల రూపాయలు అతడి స్కూలులో యిచ్చేసి వస్తున్నారు. వస్తూ, వస్తూ దారిలో వొక గోతిలో పడ్డారు. బాగా గాయ పడ్డారు.  మీ మనసులో - వొక మంచి పని చేసిన దానికి,  నాకొచ్చిన బహుమానం యిదా - అనిపించ వచ్చు. కానీ అది సరి కాదు. మీరిచ్చిన డొనేషన్ కు మీకు -దృష్ట ఫలం గా సంతోషం కలిగింది. 

అన్యాయంగా - పదివేల రూపాయలు పోయిందే - అని మీరు అనుకోకుండా, హృదయపూర్వకంగా ఈ పని చేసుంటే మీకు తప్పక సంతోషం కలుగుతుంది. దీన్ని కొన్ని దశాబ్దాలు - తలుచుకుంటూ - చాలా మంచి పని చేసాను అని పొంగి పోతుంటారు. ఈ సంతోషం దృష్ట ఫలం. కానీ, పది వేల రూపాయలు పోయిందే అనుకుంటే - అది పాపమే అవుతుందే కానీ పుణ్యం కాదు. అయ్యో అనుకునే పనులు చేయకండి. నిజమైన పుణ్యానికి  దృష్ట ఫలం గా సంతోషం తప్పక కలుగుతుంది; వెంటనే కలుగుతుంది.

సరే. మీరు ప్రస్తుతం చేసిన ఏదైనా పుణ్య కార్యం ఫలితం ఎలా వుంటుందో చూడండి :

యిప్పటి పుణ్య కార్య ఫలితం = (1 )  ఈ పని యొక్క దృష్ట ఫలం సంతోషం  +  (2 ) ఎప్పటిదో అయిన  పుణ్య  పాపాల ఫలితం గా ఏదో వొక అదృష్ట ఫలం.

వొక ఫలితం యిప్పటిది. యింకొకటి ఎప్పటిదో. రెండూ కలిసి వస్తుంది. ఈ రెండవది ఎప్పటిదో, దేనిదో, మీకు తెలీదు. కానీ - ఈ రోజు చేసిన పుణ్య కర్మ యొక్క అదృష్ట ఫలం కూడా మరెప్పుడో మీకు తప్పక వస్తుంది. ఉదాహరణకు - మీరిచిన డొనేషన్ కు ఫలితం యిలానూ వుండచ్చు

దృష్ట ఫలం గా  యిప్పుడే సంతోషం (+) అదృష్ట ఫలం గా  మీకు కొన్ని నెలల తర్వాత, లేదా కొన్ని సంవత్సరాల తర్వాత,  ఏ సత్కారమో జర గొచ్చు, పేరు ప్రతిష్టలు రావచ్చు. పెద్ద పదవి రావచ్చు. ఎన్నో రావచ్చు. అబ్బా. నేను చేసిన చిన్న మంచి పనికి, నాకింత పెద్ద ఫలితమా అని మీరు ఆశ్చర్య పోవచ్చు. కానీ మీరు ఈ రోజు గోతిలో పడ్డం మాత్రం  ఎప్పడిదో అయిన కర్మ యొక్క అదృష్ట ఫలం. వీటికి సరైన లింకు పెట్టడం మనకు కష్టం.

యింతా - ఎందుకు చెబుతున్నానంటే - మనసు సంతోషానికి - ముఖ్య కారణం మనం చేసే పుణ్య కార్యాలే  - అని ఘంటా పథంగా చెప్ప వచ్చు.


యిప్పుడు చెప్పండి. మీరు సంతోషంగా వుండాలంటే - ఏం చెయ్యాలి?  ఆ..; ప్రతి రోజూ పుణ్యకార్యాలు అందరూ చెయ్య గలమా? యిది మీరే  యోచన చేయాల్సిన విషయం.పుణ్యం -మనసా, వాచా, కర్మణా - మూడు రకాలుగా చెయ్య వచ్చు.  ఉదయం లేచిన వెంటనే - లోకాః సమస్తాః సుఖినో భవంతు అనో, సర్వే జనాః సుఖినో భవంతు అనో - కళ్ళు మూసుకుని - హృదయ పూర్వకంగా ధ్యానం చేయడం కూడా పుణ్యమే. ఎవరైనా రోగులకో,   ధైర్యం లేని వారికో, దుహ్ఖంలో వున్న వారికో, మన మాటలతో - సంతోషము, ధైర్యమూ కలిగించడం కూడా పుణ్యమే. మనిషికి  మహా సంతోషం కలిగించేది, దుఖమో, కోపమో కలిగించేది రెండూ మాటే. మీరు మీ మాటల ద్వారా సంతోషం కలిగిస్తున్నారా, దుహ్ఖం లేదా కోపం కలిగిస్తున్నారా - మీ చుట్టూ వున్నా వారికి? యోచన చేయండి. యివి కూడా పుణ్య పాపాల లోకే వస్తాయి.

మీ అమ్మ మా అందరికీ అమ్మ లాంటిదే - అన్న వాడికీ, మిగతా వారికీ తేడా మీకు తెలుసు. ఆ మాట కూడా మనుషులను సంతోష పెట్టే పుణ్య కార్యమే.
 
కార్యాచరణ ద్వారా చేయ దగ్గ పుణ్యాలు పంచ మహా యజ్ఞాలుగా  చెప్పబడ్డాయి. యివి పుణ్యాలే కాదు. ప్రతి మనిషి యొక్క బాధ్యతలు కూడా.  దేవతలను, ఋషులను, గురువులను, మనుషులను, పశు పక్ష్యాదులను చెట్లతో సహా సమస్త జీవరాసులను - ఎవరిని సంతోషపెట్టే కార్యం చేసినా అది పుణ్యమే. వీటికి, దృష్ట,అదృష్ట ఫలాలు రెండూ వుంటాయి.

ధర్మం తరువాత పురుషార్థం అర్థం. లోకంలో మనకు కావలసినవన్నీ - ధర్మ మార్గం తప్పకుండా మీరు ఎంతైనా సంపాదించొచ్చు . తప్పే లేదు. దాన్ని అనుభవించడంలోనూ - ఆనందం   వుంది. దానం చేయండంలో - అంతకు మించి ఆనందం వుంది.

మూడవ పురుషార్థం కామం. ధర్మ మార్గంలో - అనుభవించే కోరికలు - ఆనందాన్నిస్తాయి. వాటిలో తప్పు లేదు. ధర్మం దాటి అనుభవించే కోరికలు - మన సంచిత కర్మం లో చేరి - రక రకాల ప్రమాదాలు తెచ్చి పెడతాయి.

ధర్మేచ, అర్థేచ , కామేచ - నాతి చరితవ్య - నాతిచరామి - అనేది వివాహం రోజున - వధూవరులిద్దరూ - చెయ్య వలసిన ప్రమాణం. అంటే - ధర్మం లోనూ, అర్థంలోనూ, కామంలోనూ - యిద్దరూ, కలిసి నడుస్తామని అర్థం. పురోహితుడు వారి దగ్గర చెప్పించాలి - ఈ ప్రమాణం. తనే చెప్పేసి వెళ్లి  పోకూడదు.

మరి  - ఈ  మంత్రాలలో  - మోక్షేచ అని ఎందుకు చెప్పలేదు? - అన్న ప్రశ్న వస్తుంది కదా. మోక్షానికి వెళ్ళేటప్పుడు భవబంధాలేవీ వుండదు. ఎవరికి వారే. దీన్ని గురించి మరో సారి చూద్దాం.
   
ఒకటో  క్లాసులో చెప్పే ఓనమాలూ, పెళ్లి రోజు చెప్పే ప్రమాణాలూ - కడ వరకూ జ్ఞాపకం వుంటాయి.  మరిచి పోయే మాటే లేదు.  కాబట్టి - పెళ్లి చేసే పెద్ద వారూ - పురోహితుడూ - వధూవరుల చేత - ఈ ప్రమాణాలు తప్పక చేయించాలి. వాటి అర్థాన్ని  - తెలుగులోనూ విడమరిచి చెప్పాలి.

యివన్నీ - యిక్కడ ఎందుకు చెబుతున్నామంటే - మన సంతోషానికీ - యివి అన్నీ పునాదులు.

మీరు చేసే పెద్ద పుణ్యం - మీ భార్యను, లేదా మీ భర్తను, సంతోష పెట్టడమే. మీ జీవితంలో - మీరు తీసుకోవలసిన ముఖ్యమైన చాలెంజ్ - కనీసం ఈ వొక్క మనిషి ఆరోగ్యానికి, సంతోషానికి, నేను పూర్తి బాధ్యత వహిస్తాను - అని.  యిందులో  పోటీ మనస్తత్వం రాకూడదు. ఎడమ చేయి చెయ్యలేదు కదా అని - కుడి చేయి, కుడి చేయి చేయ లేదు కదా అని ఎడమ చేయి - పనులు మానేయడం లాంటిది పోటీ తత్త్వం. దేని పనులు అవి చేస్తూ వుంటేనే, ఆరోగ్యమూ, సంతోషమూ.

సంతోషానికి - మూల సూత్రాలనదగిన రెండు మాటలు యిక్కడ చెప్పాలి. మీకు మంచి భర్త (లేదా భార్య) కావాలంటే -  మీరు మొదట మంచి భార్య (లేదా భర్త ) గా వుండాలి. మీకు మంచి స్నేహితుడు  కావాలంటే - మీరు  మొదట మంచి స్నేహితుడుగా వుండాలి.మీకు మంచి కొడుకో, కూతురో కావాలంటే - మీరు మొదట మంచి తల్లో,తండ్రో అయి వుండాలి.

అలాగే - మీకు   సంతోషం కావాలంటే -   తిరుగు లేని మార్గం - చుట్టూ వున్న వారికి సంతోషం యివ్వడమే. మీరు - చుట్టూ వున్న వారికి - ఏది యిస్తారో - అదే మీకు తిరిగి వస్తుంది.

నిరంతర సంతోషమే మానసిక ఆరోగ్యానికి చిహ్నం. మరి మానసిక అనారోగ్యానికి చిహ్నాలు ఏవి? అవి ఎలా పోగొట్టుకోవాలి? యిది వచ్చే వ్యాసంలో చూద్దాం.

= మీ
వుప్పలధడియం విజయమోహన్

2 కామెంట్‌లు: