27, డిసెంబర్ 2016, మంగళవారం

భగవద్ గీత - అర్జున విషాద యోగము (1)

భగవద్ గీత 

మొదటి అధ్యాయము

అర్జున విషాద యోగము (1)

భగవద్ గీత  శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినదేశ, కాల, మత, జాతులకు అతీతమైన, మహోత్కృష్టమైన జీవన విధానం

మనిషి జీవితానికి అర్థం, పరమార్థం, మనం చెయ్య వలసినవి, చెయ్యకూడనివి , ఏది చేస్తే ఏమవుతుందో, ఏది కాదో, ఏది చెయ్యకూడదో - అన్నీ సమగ్రంగా తెలిపిన ఏకైక, నభూతో నభవిష్యతి అయిన మహోపదేశం భగవద్ గీత

మహా భారత సంగ్రామానికి ముందుగా, అంత వరకు కర్తవ్యోన్ముఖుడైన, మహావీరుడైన అర్జునుడి మనసులో రేకెత్తిన అల్లకల్లోలానికి,కర్తవ్య విముఖతకు ఎన్నెన్ని కారణాలో, మనసు విప్పిశ్రీకృష్ణుడి  ముందు ఏకరువు పెడతాడు అర్జునుడు. ఇది భగవద్ గీతలో మొదటి అధ్యాయం

గీతలో కృష్ణుడి బోధ ముఖ్యం గానీ ,అర్జునుడి గోల మనకెందుకు - అనుకుంటారు చాలా మంది. నిజానికి మనమంతా, జీవితము అనే రణరంగం లో ఎప్పుడూ కర్తవ్యోన్ముఖులుగా కాక, ఎదుట పోరాడ వలసి వున్న రణరంగం నుండి పారిపోయే దానికి  సిద్ధంగా, కారణాలు, సాకులు  వెదుకుతున్న వాళ్ళమే.మనం అందరూ మహావీరుడైన అర్జునుడి లాంటి వాళ్ళమే కానీ, ఎప్పుడూ కర్తవ్యము నుండి పారిపోవడానికి సాకులు వెదుకుతున్న వాళ్ళమే - అని చెప్పొచ్చు

మనలో ఎంత మంది, మేం చెయ్య గలిగిన వన్నీ చేసేశాం, యిప్పుడూ చేస్తూనే వున్నాం - అని  చెప్పగలం? మనం చెయ్యక పోవడానికి అనేక కారణాలు, సాకులు వుంటాయి; వున్నాయి. మన సందేహాలు, కారణాలు, సాకులు, యివన్నీ శ్రీకృష్ణుడికి చెప్పడం, సమాధానం చెప్పమని అడగడం, లేదా జీవితం నాకిక చాలు యింకొద్దు అని చెప్పడం మన విషాద యోగం అవుతుంది - మన భగవద్ గీతలో.

తన మనసుల్లో వున్న ప్రశ్నలన్నీ, అర్జునుడు కూడా కృష్ణుడిని అడిగేశాడు. కృష్ణుడిని కడపట - నీవే తప్ప యితః పరంబెరుగ, నీవు ఎలా చెబితే అలా చేస్తానని - శరణు జొచ్చాడు . ఇదే అర్జున విషాద యోగం

ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రం చూద్దాం. మొట్టమొదటి శ్లోకం అంధుడైన ధృతరాష్ట్రుడు , దివ్యదృష్టి కలవాడైన సంజయుడిని వేసిన ప్రశ్న. తరువాత ధృత రాష్ట్రుడు భగవద్ గీత కడపటి వరకు మౌనం గానే వుంటాడు.

"
ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో , యుద్ధోత్సాహంతో వున్న  నా వాళ్ళు (అయిన కౌరవులు), పాండవులు ఇప్పటి వరకు ఏం చేశారు?" అని శ్లోకంలో అడుగుతాడు అంధుడైన ధృతరాష్ట్రుడు

ధృతరాష్ట్ర  వువాచ (శ్లోకం):

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః

మామకాః  పాండవాశ్చైవ  కిమకుర్వత సంజయ || (1. 1)

ఎంత అధర్మ పరులైనా కౌరవులు నా వాళ్ళు - అనడంలో దృతరాష్ట్రుడి మనసులో వున్న మరో అంధత్వం - మనకు మొదటి శ్లోకంలో కనిపిస్తుంది . యిదే దృతరాష్ట్రుడి నిజమైన అంధత్వం. నా వాళ్ళు అధర్మ పరులేనాకూ తెలుసు. అయినా వాళ్ళే గెలవాలి. వాళ్ళే రాజ్యమేలాలి - అన్న భావన ఇతనిలో జీవితమంతా మనకు కనిపిస్తుంది ; అదే శ్లోకంలోనూ వుంది

పాండవులు ధర్మపరులే. అయినా వాళ్ళే ఓడిపోవాలి. అడవుల్లోనే  వుండాలి - అన్న భావన కూడా ఇతనిలో అడుగడుగునా కనిపిస్తుంది.

కానీ , కురుక్షేత్రం ధర్మక్షేత్రం గా పేరుమోసింది. ధర్మక్షత్రంలో అధర్మ పరులైన నా వాళ్ళు గెలుస్తారా - అన్న సందేహం కూడా ఇందులో కనిపిస్తుంది

నేను, నా వాళ్ళు, నా జాతి వాళ్ళు, నా రాష్ట్రం వాళ్ళు  మాత్రమే బాగుండాలి, పక్క వాడు, యెంత మంచోడైనా, వాడు ఎలా పోయినా పర్వాలేదు - అన్న భావన యిప్పటికీ మన మనస్సులో బాగా వేర్లూని, బలంగా నాటుకుని వుంది. ఇది మనలోని ధృతరాష్ట్ర అంధత్వం. మనలో వున్న అంధత్వం పొతే గానీ, మనమూ సుఖంగా వుండలేము; మన పొరుగువాడినీ సుఖంగా వుంచలేము. ఒక వేళ  వాడు సుఖంగా వుంటేచూసి ఓర్వలేము.   

ప్రస్తుత కాలం లో - నేను బాగుండాలి. నా పెళ్ళాం ఏమైనా పరవాలేదు - అనే మూర్ఖులూ చాలా  మంది వున్నారు. వీళ్ళలో సగం మంది త్రాగుబోతులు, తిరుగుబోతులు. నేను బాగుండాలి, మా అమ్మా, నాన్నా ఎలా పోయినా పర్వాలేదు - అనే మూర్ఖులూ చాలా మందే వున్నారు

కానీ, నా వాళ్ళు, వేరే వాళ్ళు అన్న  భేదం లేకుండా ఎంతో  మంది ఆర్తులకు, అనాథలకు, వృద్ధులకు, స్త్రీలకు  చేయూత నిచ్చి ఆదుకుంటున్న మహానుభావులూ   కొంత మంది మన మధ్య  వుండనే వున్నారు. మనమంతా, గీతోపదేశం  సహాయంతో వీరిలా మారాలని ఆశిస్తూ, గీతా విశ్లేషణను  ఆరంభిస్తున్నాను. ఇందులో, అతి ముఖ్యమైన వాటిని మాత్రం పూర్తి విశ్లేషణతో యివ్వగల వాడను

మీ అభిప్రాయాలను , విమర్శలను , అనుభవాలను కూడా తెలియ  జేస్తే  చాలా బాగుంటుంది


సర్వే  జనాః సుఖినో భవంతు 

= మీ 

ఉప్పలధడియం   విజయమోహన్