30, ఏప్రిల్ 2012, సోమవారం

పాడుతా తియ్యగా - 2012 - యిదొక సంగీత యజ్ఞం - యింత కంటే ఎక్కువ ప్రజా సేవ ఏముంటుంది?

పాడుతా తియ్యగా - ఈ రోజు సెమి ఫైనల్సు - ఎలా వుంది?

2011 అక్టోబర్ నెలలో - బాలు గారు  నిర్వహించిన - పాడుతా తియ్యగా - కార్యక్రమం - ఫైనల్సు చాలా, చాలా బాగుందని -అప్పుడు చెప్పుకున్నాం. 

యిప్పుడు మరోసారి, అలాంటి అనుభవం - అనుభవిస్తూ వున్నాం.

ఈ రోజు సెమి  ఫైనల్సు జరిగింది.వూరికే బాగుందంటే - సరిపోదు. చాలా....చాలా...చాలా...చాలా..బాగుంది.

బాలు గారు అద్భుతమైన గాయకుడనేది - భారత దేశమంతా అంగీకరిస్తుంది. ఆయన, ముఖ్యమైన అన్ని భాషలలోనూ - పాడారు. అన్ని భాషలలోనూ - ఆయన పాడిన పాటలు ప్రజలనందరినీ - ఆకట్టుకున్నాయి.

శంకరాభరణం, అన్నమయ్య లాంటి ఎన్నో సినిమాలలోని - ఎన్నో మధురమైన పాటలు - తెలుగులో మళ్ళీ వస్తాయా ? -  చాలా, చాలా కష్టం.

నాకు వొక్కో సారి అనిపిస్తుంది - అన్నమయ్య వల్ల బాలు గారికి (ఆ సినిమాలో) అంత మంచి పేరు వచ్చిందా; లేక బాలు గారి వల్ల అన్నమయ్య కు అంత మంచి పేరు వచ్చిందా - అని. యిద్దరూ  మహానుభావులే. వొకరిది గీతం; మరొకరిది గాత్రం. సరే. సినిమా అంటే - అందరి సమిష్టి కృషి ఫలితం అని చెప్పక తప్పదు. 

పాడుతా తియ్యగా - లాంటి కార్యక్రమం మాత్రం - యింత బాగా, అద్భుతంగా జరపడం - వొక్క బాలు గారు మాత్రమే చెయ్యగలరు. 

నేను, ఇలాంటి కార్యక్రమాలు దాదాపు అన్ని భాషలలోనూ చూస్తాను.

మంచి గాయకులు ప్రతి భాషలోనూ - వస్తున్నారు. మన భాష లోనూ వస్తున్నారు. 

కానీ - ఈ రోజు అతిథి గారు - అన్నట్టు - ఎన్నో రియాలిటీ షోలు ఈ రోజు మనం చూస్తున్నాము. కానీ - నిజమైన, నూటికి నూరు శాతం, రియాలిటీ అనిపించే షో - నాకు(కూడా) ఇదొక్కటే - అనిపిస్తుంది. 

బాలు గారు - 'మా పిల్లలు' - అని ఆ నలుగురు గాయకులను - అనడంలో - అది ఆయన గుండెల లోతుల్లో, ఎక్కడినుండో, వస్తున్నట్టు, మనకు బాగా అర్థమవుతుంది. అదే - నిజమైన రియాలిటీ. పిల్లలకు అంతకు మించి ప్రోత్సాహము యివ్వడం, మరెవ్వరికీ తరం కాదు.

పాటకు - భావం ముఖ్యం అని బాలు గారు  చెబుతూనే వుంటారు. భావం లేని పాటను, వొక సారి అనుభవిం చొచ్చు. కానీ - ఆ పాటకు ప్రాణం, లైఫ్ అంతే.  మళ్ళీ మళ్ళీ మనం పాడాలంటేనో, వినాలంటేనో -  భావం, మన మనసులోతుల్లోకెళ్ళాలి.  మనసును అది తాకాలి. అక్కడ నిలిచిపోవాలి. అటువంటి పాటలకు మరో యుగంలో కూడా ప్రాణం వుంటుంది.

చాలా మందికి తెలీక పోవచ్చు. కానీ, భగవద్ గీతలో కూడా, యుగ,యుగాలకూ నిలిచిపోయే పాటల లాంటి శ్లోకాలు ఎన్నో వున్నాయి. అవి, జీవిత సత్యాలు. (మతాలతో సంబంధమే లేని సత్యాలు).

మనకు, భావ ప్రధానమైన, సంగీత ప్రధానమైన, పాటలు రాయగలిగే వారు వున్నారు. అవి, మధురాతి మధురంగా స్వరపరచ గలిగే సంగీతజ్ఞులూ వున్నారు. 

అంత కంటే మధురంగా పాడగలిగే గాయకులూ వున్నారని, బాలు గారు మళ్ళీ, మళ్ళీ, పాడుతా తీయగా కార్యక్రమం  ద్వారా -  రుజువు చేస్తూనే వున్నారు.

కానీ - సంగీతం లాంటి మహోన్నతమైన కళను, మరింత ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళాలనే తపన వున్న నిర్మాతలు -యింకా ఎక్కువగా రావాలి - అనిపిస్తుంది.

సంగీతం ప్రజల స్థాయికి తీసుకు వెడుతున్నాం - ప్రజల మధ్యకు తీసుకు వెడుతున్నాం - అని కొందరంటారు - కానీ - ఆ ప్రజలు - ఏ స్థాయి వారైనా, ఈ రోజుకూ, సాహిత్యం బాగున్న సంగీతమే పాడుకుంటున్నారు - తప్ప - సాహిత్యం, అసలు లేని సంగీతం కాదు.

ప్రజలకోసం - అని - స్థాయి దించడం   కన్నా - ప్రజల స్థాయి పెరిగేలాగా, సంగీతం మలచాలి. శంకరాభరణం ఎన్ని భాషలలో చూశారు? అన్నమయ్య పాటలు - ప్రజల మన్నన ఎంతగా పొందింది? ప్రజల స్థాయి బాగానే వుందని ప్రజలు రుజువు చేసారు. అది జానపదమైనా, భక్తి ప్రధానమైనా, శృంగార ప్రధానమైనా, సంగీతం మళ్ళీ, మళ్ళీ విన గలిగే లాగా, పాడుకోగలిగే లాగా వుండాలని - ప్రతి వొక్కరూ కోరుకుంటారు. అది సినిమాలు తీసే వాళ్లకు తెలియాలి.

సరే. మళ్ళీ, పాడుతా  తీయగా కు వచ్చేద్దాం. నలుగురు గాయకులనూ - సెమీస్ నుండి , ఫైనల్సుకు తీసుకెళ్లడం బాగుంది. మళ్ళీ వచ్చే సోమవారం -   ఫైనల్సు ఎలా వుంటుందో చూద్దాం.

ఈ కార్యక్రమంలో వచ్చే వాళ్ళు ఎంతో మంది - సినిమా గాయకులుగా కూడా మారడం, ఎన్నో ఆవార్డులు సంపాదించడం మనం చూస్తూనే ఉన్నాము. యింకా ఎన్నో అవార్డులు రాగలిగేవే. సాహిత్యం బాగున్న పాటలతో, మంచి సంగీతం అందించ గలిగితే. 

నా ఉద్దేశంలో - మనం, మన సంగీతానికి - ఆస్కార్లు లాంటి ఆవార్డులకోసం ఎదురు చూడకూడదు. మన సంగీతం దాని కంటే - ఎంతో మెరుగైనది . వారికి అర్థం కాక పోవచ్చు గాక. అలా అని - వారి సంగీతం లో వున్న, మెరుగైన అంశాలను మనం వదిలి పెట్టాల్సిన అవసరం లేదు.  

హిందీ లో, చౌదవీ కి చాంద్, కభీ కభీ, ఆరాధనా లాంటి సినిమాల సంగీతాలు - యిప్పటికీ, క్రొత్త పాటల కంటే - ఎంతో ఎక్కువగా పాడుకుంటారు. తెలుగులో, ఘంటసాల పాటలు, బాలు పాటలు (శంకరాభరణం, అన్నమయ్య మాత్రమే కాదు), యివి - యిప్పటికీ ఎంతో బాగున్నాయి. తమిళంలోనూ అంతే. రెహమాన్ గారు కానీ, మిగతా గొప్ప సంగీత దర్శకులు కానీ - అలాంటి, అమర గీతాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటాను. వారికి, నిర్మాతల ప్రోత్సాహం యిలా వుండాలని -ఆశిస్తాను.

ప్రతి వారం - కొంత మంది గాయకులను ప్రోత్సాహపరచడమే కాక - సంగీతమంటే ఏమిటి - అని తెలుగు ప్రజలకు మళ్ళీ, మళ్ళీ, తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ, ప్రజలలో, సంగీతం పట్ల, అమితమైన ఆసక్తి పెంచుతూ,  పిల్లలలో, సంగీతం పట్ల, ఆరోగ్యకరమైన ఆసక్తిని పెంచుతూ - యిదేదో గొప్ప సంగీత యజ్ఞం లాగా - జరుపుతూ వున్న బాలు గారికి - మన కృతజ్ఞతలను తప్పకుండా చెప్పాలి. 

రాజ పోషణ లేని కళలు సన్నగిల్లి పోతాయి. చిక్కి పోతాయి. 

మన రాష్ట్ర ప్రభుత్వం వారు - బాలు గారిలో వున్న గొప్ప కళా కారుడిని మాత్రమే కాదు, అత్యుత్తమమైన వొక ప్రజా సేవకుడిని కూడా గుర్తించి -   వారి గౌరవం పెంచాలని, వారికి మరింత ఉత్సాహం కలిగించాలని -  వారికి భారత స్థాయిలో సరైన గుర్తింపు తేవాలని ఆశిస్తాను. బాలు గారు చేస్తున్న దాని కంటే ఎక్కువ ప్రజా సేవ ఏముంటుంది?

యిది, ఏ పక్క రాష్ట్రం వారో చేసే ముందు - మన రాష్ట్ర ప్రభుత్వం వారే - చేస్తే బాగుంటుంది. 

బాలు గారు తమ ఆరోగ్యం బాగా చూసుకోవాలని, దేవుడు ఆయన ఆరోగ్యం, ఆయన ఉత్సాహం , యింకా ఎన్నో దశాబ్దాలు బాగా వుంచాలని ప్రార్థిద్దాం. ఆశిద్దాం.

పైనల్స్ -వచ్చే సోమ వారం చూడడం - మరిచి పోకండి. 

=మీ 

వుప్పలధడియం విజయమోహన్