29, ఆగస్టు 2012, బుధవారం

చీకటి వెలుగుల ఆట - అహంకారం, మమకారాల పై మన పోరాటం - శ్రీరాముడు శ్రీకృష్ణుడు తమ జీవితాల్లో నిజంగా చేసింది ఏమిటి?-



మన నిజమైన పోరాటం  ఎవరిపై ?

మన సంస్కృతి  లక్షల సంవత్సరాల నుండి వస్తున్న సంస్కృతి.  


వేదాలు ఎప్పుడు వచ్చాయో, ఎలా వచ్చాయో, ఎవరికీ తెలీదు.



ఆందులోని ఉపనిషత్తులు, ఆరణ్యకాలు లాంటివి  వొక్కటొక్కటి ఎప్పుడు వచ్చాయో - వాటి కర్త ఎవరో - ఎవరికీ తెలీదు . 



నా వరకు నేను - శంకరాచార్యుల రచనలు, ఉపనిషత్తుల సారము - కొంత వరకు  చదవడం వినడం చేసాను - గత నాలుగు సంవత్సరాలలో .




మహానుభావులయిన  గురువుల సమ్ముఖంలో వాటి లోతుపాతులను గురించి వినడం జరిగింది. 


మన సంస్కృతి - చాలా శాస్త్రీయమైన - సైంటిఫిక్ అయిన - సంస్కృతి అని  మనం తప్పకుండా తెలుసుకోవచ్చు. అసలు లోపాలే లేవని నేను చెప్పను. ఏదైనా - కాలం మారే కొద్దీ, కొంత మార్పు చెందాలి. మన సంస్కృతి కూడా, శ్రీకృష్ణుడి కాలం వరకు మార్పులు, చేర్పులు, కాలానుగుణంగా, పొందుతూనే వుంది. శ్రీకృష్ణుడి భగవద్ గీత - ఈ మార్పులు, కూర్పులలో - వొక అంతర్గత భాగమే. 

భారత కాలంలోనే వ్యాసుల వారు - వేదాలను, పురాణాలను - ఎంతో సంస్కరించడము  జరిగింది. వ్యాసుల వారి తల్లి - సత్యవతి అనబడే యోజనగంధి. ఆమె పూర్వపు పేరు, మత్స్య గంధి . మత్స్య కారుల వంశస్తురాలు.  కానీ- ఆమె వొక వైపు మహా గొప్ప వాడై న వ్యాస మహర్షి పుట్టుకకు, మరొక వైపు, పాండవకౌరవ -వంశాలకు  మూల కారణం అయింది. అది ఆ కాలం.


మనిషికి వుండవలసిన గుణాలేవి; వుండకూడని గుణాలేవి - మనిషికి నిజంగా కావలసినది ఏది; వద్దన్నది ఏది - లాంటి విషయాలపైన - ఎంత సుదీర్ఘ  చర్చ జరిగిందో - అది మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్ గీత లాంటివి  చదివి అర్థం చేసుకుంటే - తెలుస్తుంది.

ఉదాహరణకు - ముఖ్యంగా వుండ కూడని రెండు గుణాలు - అహం; మమ - అంటారు. అంటే అహంకారం; మమకారం. ప్రస్తుతానికి - ఈ రెండింటిని గురించి కొద్దిగా విశ్లేషణ చేద్దాం. 

అహంకారం - అంటే, నేను,నావి,  నాకే -అనే భావం. 

నేను గొప్ప -అనే భావం లో, నేను కాని వారు, నాకంటే  తక్కువ - అనే భావం -మిళితమై వుండనే వుంటుంది.అది - తననూ నాశనం చేస్తుంది. చుట్టూ వున్న వారినీ నాశనం  చేస్తుంది. ఆంగ్లం లో దీన్ని - ఈగో -అని చెప్ప వచ్చు.   

వొక సారి, స్వామి సుఖ బోధానంద గారు -  "ఈగో" అనే పదానికి - ఎడ్జింగ్ గాడ్ అవుట్ -అంటే - లోనున్న దేవుడిని బయటకు గెంటేయడం -అని అర్థం - అని చాలా అందమైన నిర్వచనం చెప్పారు.

మీ లోపల అప్పుడు మీరు మాత్రమే వుంటారు.మరెవరికీ చోటు లేదు. దేవుడికి కూడా లేదు. మీలో ఎవరి ఆలోచనైనా వస్తే - దేవుడి ఆలోచన వచ్చినా సరే - వారు. మీ స్వార్థానికి ఎలా ఉపయోగ పడతారనే విషయానికోసమే అయి వుంటుంది . మీరు మాత్రమే బాగుండాలి;మిగతా వారు - ఎలా పోయినా ఫరవా లేదు -అనే భావన పెరిగి పోతుంది. 

అహంకారానికి - వొక గొప్ప ఉదాహరణం -రావణాసురుడు.   రావణుడికి  తానూ, తన సుఖం తప్ప - మిగతా ఏదీ గొప్ప కాదు. అందులో వొక భాగంగానే - సీతను ఎత్తుకు పోవడం. 

వొక్క సీతపై మాత్రం కామం రాలేదు రావణుడికి.  మహా కవులు  అంటారు - పార్వతీ దేవి పై కామం తో శివుడినే నువ్వెంత అన్నవాడు  రావణుడు. అందుకు ఫలితం అనుభవించాడు. కానీ అహంకారం నిండిన రావణుడు వూరికే  వుండలేడు కదా. నన్ను మించిన వాడు లేడని గర్వం. వొక సారి తన అన్న గారైన కుబేరుడి కోడలు, రంభనే-   బలవంతంగా చెరిచాడు.  నువ్వు నాక మామ గారు, తండ్రి లాంటి వాడు అని ఎంత మొత్తుకున్నా వినలేదు రావణుడు .అందుకు, కోపంతో, ఆమె భర్త నలకూబరుడు - శాపం పెట్టాడు. అలాగే - వేదవతి అనే - తపస్సు చేసుకుంటున్న కన్యను చెరచ బోయి - ఆమె శాపానికీ గురి అయ్యా డు. అయినా, అహంకారం పోలేదు.

ఎంతోమంది ఆడవారిని యిలా బలవంతంగా ఎత్తుకొచ్చిన వాడు రావణుడు. ఎంతో మంది ఋషులకు, రాజులకు, దేవతలకు, ప్రజలకు - ఎన్నో కష్టాలను తెచ్చి పెట్టిన వాడు రావణుడు. తాను సీతను అనుభవించడానికి - తన వాడై న మారీచుడి ప్రాణాలను కూడా పణం గా పెట్టిన వాడు రావణుడు. మారీచుడు వద్దు మొర్రో అంటున్నా, వినక - రాముడి చేతుల్లో చస్తావో లేదో కాని - నా పని చేయక పోతే, నా చేతుల్లో చస్తావు, అని బెదిరించిన వాడు.

సీత కోసం విభీషణుడిని కూడా ఫో అన్న వాడు. కుంభకర్ణుడిని, తన కొడుకులను, తన వంశంలోని అందరినీ  పణం గా పెట్టి - ఏ  మాత్రం బాధ పడని వాడు. సీత దక్క లేదే అన్న బాధ, రాముడిని జయించ లేదే -అన్న బాధ పెద్దది  కాని - యింత  మందిని  పోగొట్టుకున్నామే అన్న బాధ పెద్దది కాదు  రావణుడికి.

ఏదో సినిమాల్లో -చూసి రావణుడు మహా మంచి వాడు అనుకుంటే - చాలా తప్పు . అంటే - రావణుడిలో మంచి గుణాలే  లేవని  కాదు

గొప్ప  శివ భక్తుడు. కానీ శివుడి భార్యనే - లోక మాతనే, కామదృష్టితో చూసిన వాడు.

వేదాలన్నీ చదివిన వాడు. కానీ - వేదాలలోని మంచి నంతా  వదిలేసి - అవి, వద్దు, వద్దు అనే - కామక్రోధాదులనే  అంతః శతృవులకు - పూర్తిగా లోబడిన వాడు. వర గర్వితుడు. నన్ను మించిన వాడు లేదని విర్ర వీగిన వాడు. మొత్తానికి ప్రపంచంలో మహా అహంకారిగా పేరు పొందిన వాడు. కులము లో - వొక అహంకారి -వుంటే  కులమంతా నాశనమవుతుందని -చెప్పడానికి, వొక గొప్ప ఉదాహరణం,  రామాయణం లోని రావణుడు.

అహంకారం లేని, పరోపకారిగా, వొక వైపు రాముడు; మహా అహంకారిగా, మరోవైపు రావణుడు. వీరి మధ్య కాదు -యుద్ధం  ; ఈ గుణాల మధ్య యుద్ధం. అదీ రామాయణం. అహంకారం ఎంత చెడుపు చేస్తుందో , అది - చెప్పడమే రావణుడి పాత్ర లక్ష్యం. అహంకారం లేకుండా వుండాలంటే ఏం చెయ్యాలి మనలో అహంకారం వుందో, లేదో ఎలా తెలుసు కోవడం అన్న దానికి నిదర్శనం రాముడు .  

సరే. మన విషయానికొస్తే - అహంకారం మనలో  వుందో లేదో ఎలా తెలుసు కోవడం?

1. మీరు  మగ వారైతే - మీ తల్లితండ్రులను ఎంత మాత్రం గౌరవిస్తున్నారో - మీరే తరచి చూడండి. మీరు వారికేం చేస్తున్నారు.  వారు మీ పట్ల ఎంత సంతోషంతో వున్నారు - అన్నది మొదటి అంశం. మీరు ఎప్పుడైనా - వారికి నమస్కారం చేసి, వారి ఆశీర్వాదం తీసుకోవాలని ప్రయత్నం చేసారా? మీకు - చేయాలని అనిపించలేదంటే - మీలో అహంకారం దాగి ఉన్నట్టే .

2. మీరు ఆడ వారైతే -  పెళ్ళైన వారైతే - యిదే విషయం - మీ అత్త మామల పట్ల వర్తించుకోవాల్సి వుంటుంది. అదేమిటి. మేమూ మా తల్లి తండ్రుల పట్లే - విధేయంగా - వుంటాము అంటే - నేను చెప్పేదేమీ లేదు.సహ ధర్మ చారిణి, బెటర్ హాఫ్ , గృహ లక్ష్మి -అన్న పదాలు - మీరు ఎంతగా భర్త కుటుంబంలో కలిసిపోతారో -  దానిని బట్టే వుంటుంది.  నిజానికి  భార్యాభర్త లిద్దరూ -అత్తమామలను, తల్లితండ్రులను కూడా  గౌరవించవలసిన వారే. కానీ భార్య ఎంతగా, భర్త కుటుంబంలో కలిసి పోతుందో - అంతగా , ఆమె - రెండు కుటుంబాలకూ  గౌరవ కారణం అవుతుంది. యిది జరగని చోట  -ఆమెలో  అహంకారం వున్నట్టు లెక్క 

3. మీ భార్యకు - కాలో, చెయ్యో తగిలింది , లేదా బెణికింది - అనుకోండి. - నేనేమిటి, తన కాలును తాకడం ఏమిటి - అని మీరు (మగ వారు) -అనుకుంటే, మీలో బాగా అహంకారం ఉన్నట్టే లెక్క.   ధర్మేచ, అర్థేచ, కామేచ - అన్నిటిలో సహధర్మ చారిణి అయిన భార్యను, అన్ని రకాలుగా కాపాడ వలసిన, సంతోష పరచ వలసిన కర్తవ్యం పురుషుడికి తప్పకుండా వుంది. అది చెయ్యని నాడు - అది అహంకారానికి గుర్తే. అలాగే భార్య కూడా - భర్తకు, ఏదైనా సరే -  చెయ్యాలి. నా భర్త (లేదా నా భార్య)  ఆరోగ్యం, సంతోషం, నా పూర్తి బాధ్యత - అని యిద్దరూ - అనుకుంటేనే -వారిలో  అహంకారం లేనట్టు లెక్క. నేనెందుకు చెయ్యాలి - అనుకునే వారిలో అహంకారం వున్నట్టు లెక్క.

4. గురువుల పట్ల, వయోవృద్ధుల పట్ల, జ్ఞాన వృద్ధుల పట్ల- గౌరవం వుండాలి. మనిషికి, ఏ వయసులో నైనా - వొక గురువు వుండాలి. ఎవరినో వొకరిని గురువుగా అంగీకరించి - వారి మాటే వినే వారికి - అహంకారం కాస్త దూరంగా వుంటుంది.

5. నాకు తెలుసు - నాకే తెలుసు - నాకు అన్నీ తెలుసు - అనే భావనలు వస్తూ వుంటే - అహంకారం పెరుగుతూ పోతుంది. నాకు తెలియనిది ఏది, అది నేను  ఎలా తెలుసుకోవాలి  అనుకునే వారికి; తనకు తెలియదు అనే విషయాల్ని -సంకోచం లేకుండా, అంగీకరించే వారికి, అహంకారం దూరంగా వుంటుంది. మన దేశంలో కొంత మంది సినిమా హీరోలు, రాజకీయ వేత్తలు, ఇలాంటి వారు - అన్నీ తమకు తెలిసినట్టు,  ఏ విషయం పైన ప్రశ్నలు అడిగినా - టక్కు టక్కు మంటూ  జవాబులు చెప్పడం  మనం చూడవచ్చు. తెలియనివి, తెలియదని చెప్పడానికి నామోషీ . అ నామోషీ వెనుక అహంకారం తప్పకుండా వుంటుంది.

6. నాకు తెలియదు - అని నేను అంగీకరించనంత వరకు -  మరింత తెలుసుకునే ప్రయత్నం నేను చెయ్యను. ఆ అవకాశం నాకు పోతుంది. నిజంగా తెలిసిన వారు, నాకు దూరంగావెళ్ళుతూ  వుంటారు.  యిది, మన జీవితంలో -జరుగుతూ వుంటుంది . కానీ, మనకు తెలియదు. అర్థమూ కాదు. అహంకారం మహిమ అలా వుంటుంది. మన శ్రేయోభిలాషులను మనకు దూరం చేస్తుంది. మూర్ఖులను, స్వార్థ పరులను చుట్టూ చేరుస్తుంది.

యిలా యెన్నైనా  చెబుతూ పోవచ్చు. ప్రయత్నం చేస్తే , మనలో  అహంకారం వుందా, లేదా అనేది - యిట్టే తెలిసి పోతుంది.

సరే. అహంకారానికి విరుగుడు ఏమిటి? ఏది వుంటే అహంకారం వుండదు?

చాలా, చాలా సులభమైన  ప్రశ్న యిది.

ప్రేమ వున్న చోట స్వార్థమూ వుండదు; అహంకారమూ వుండదు.

అహంకారం స్వార్థాన్ని మాత్రమే కోరుకుంటుంది. ప్రేమనిస్స్వార్థమైనది. ప్రేమకు యివ్వడమే తెలుసు కానీ - అడగడము, దాచడము,  స్వార్థం - ఇలాంటివి తెలీదు.

నాదీ నీదే, నీదే నీదే - అనేది ప్రేమ. నీదీ నాదే.నాదీ నాదే  - అనేది అహంకారము,స్వార్థము. 

ఈ రెండింటి  మధ్య కొంత అహంకారము, కొంత ప్రేమ, కొంత సంశయము - వీటితో కొట్టుకులాడుతుంటారు - చాలా మంది.  ప్రేమంటే ఏమిటో  తెలిసి ; నిజంగా దాన్ని అనుభవించిన నాడు - అహంకారం  పూర్తిగా పోతుంది.



జ్ఞానము రెండవది . జ్ఞానము వున్న చోట కూడా అహంకారం వుండదు.

వొక సారి చీకటి  దేవుడి దగ్గరకు వెళ్లి - వెలుగుపై  ఫిర్యాదు చేసిందట. నేను ఎక్కడకు వెళ్ళినా, ఈ వెలుగు, నన్ను తరిమి కొడుతూ వుంది. దాన్ని కాస్త ఆపి, నన్ను కూడా దానికి సమంగా వుండ నివ్వండి, అని.  సరే, నేను కనుక్కుంటానులే, నువ్వు,వెళ్ళు అన్నాడు దేవుడు. వెలుగును పిలిచి అడిగాడు - చీకటి యిలా నీపై ఫిర్యాదు చేసింది - అని.

వెలుగు ఆశ్చర్య పోతూ అంది. నేనెప్పుడూ  చీకటిని తరమనేలేదు. కనీసం చూడనే లేదు. అయినా మీరు చెప్పారు కాబట్టి, చీకటి ఎక్కడుందో,చూసి, క్షమాపణ అడుగుతాను -అనింది. ఆ రోజు నుండి, ఈ రోజు వరకూ, వెలుగు, చీకటిని వెదుకుతూ వుంది. కానీ చీకటి, వెలుగుకు కనిపించడం లేదు. అలాగే. చీకటి మాత్రం, వెలుగును చూసి భయపడి పారిపోతూనే  వుంది కానీ -  ఎదుట పడటం లేదు.

జ్ఞానం కథ యింతే. జ్ఞానం వచ్చిన వెంటనే - అహంకారం మాయమవుతుంది. అది జ్ఞానం వున్న చోట వుండ  జాలదు. కాక పోతే - సగం తెలిసి,సగం తెలియకుండా వున్న వారిలో - వారి సగం తెలియని తనం లో దాక్కుని వుంటుంది. నాకు - యిది తెలియదు, నేను యిది తెలుసుకోవాలి  అన్న జ్ఞానం వస్తే చాలు - అహంకారం మరి వుండలేదు;  పారిపోతుంది.

జ్ఞానమూ అహంకారాన్ని పారద్రోలుతుంది. ప్రేమ కూడా అహంకారాన్ని పారద్రోలుతుంది.

నిజానికి - జ్ఞానమున్న చోట ప్రేమ వుండనే వుంటుంది. అలాగే - ప్రేమ వున్న చోట - జ్ఞానం కూడా - అంతర్గతంగా వుండనే వుంటుంది. - ప్రేమకు జ్ఞానం ఎవరూ చెప్పకుండానే - తెలిసి పోతుంది. ఈ రెండింటిలో  - ఏది మీలో (కాస్త ఎక్కువగా) వున్నా సరే  - మీలో అహంకారం వుండదు.

అహంకారానికి ప్రతీక రావణుడైతే - మమకారానికి ప్రతీక ధృత రాష్ట్రుడు. భారత యుద్ధానికి  ముఖ్య కారణం  ధృతరాష్ట్రుని  మమకారమే. దుర్యోధనుడు చిన్నతనం నుండీ చేసిన చెడ్డ పనులను - దేనినీ ధృతరాష్ట్రుడు  వారించ లేదు.

మమకారము అంటే - ప్రేమ అని మనం సాధారణంగా అనుకుంటూ వుంటాము. కాదు. రెండింటికీ అంతరం వుంది. ముందే అన్నాం - ప్రేమలో స్వార్థం వుండదని. ప్రేమ -ఎప్పుడూ  చెడును ప్రోత్సహించదు.

మమకారమంటే - నా  వారు మాత్రమే బాగుండాలి - అనే భావన.  మిగతా వారు ఎలా పోయినా ఫరవాలేదు.

భగవద్ గీత అంతటికీ -ధృతరాష్ట్రుడు మాట్లాడే మాట - వొక్క మొదటి శ్లోకం మాత్రమే. ఈ  శ్లోకం మమకారానికి ప్రతీకగా చెబుతారు.

 నా వాళ్లైన కౌరవులు, వారు (పాండవులు) ఏమేమి చేస్తున్నారో, చెప్పు సంజయా -అని అడుగుతాడు. కౌరవులేమో - నా వాళ్ళు.   పాండవులకు - నా వాళ్ళు అనే పదం వర్తింప జేయ లేదు ధృతరాష్ట్రుడు.  ధృతరాష్ట్రుడి అంధత్వం - కళ్ళది కాదు , మనసుది. మనసులోని మమకారానిది.  మమకారానికి  కళ్ళు  లేదు. అది గ్రుడ్డిది. తన వాళ్ళు - అనుకునే వాళ్ళకోసం -మిగతా వారికి ఎంత అన్యాయమైనా చేయడానికి - ప్రోత్సహిస్తుంది.  నిజమైన ప్రేమ వెనుక జ్ఞానం వుంటుంది. అది అన్యాయాన్ని ప్రోత్సహించదు.

దుర్యోధనుడిది అహంకారం. ధృతరాష్ట్రుడిది, గాంధారిది - మమకారమనే గ్రుడ్డి తనం. రెండూ వినాశనానికే  దారి తీస్తాయి. 

మనం  వొక కథ వినే వుంటాం. వొక కొడుకు ప్రక్క నింట్లోని చెట్లో - పళ్ళు కాజేస్తాడు. వాళ్ళమ్మ - ఎవరికీ చెప్పకు, అని  కొడుకును తినమంటుంది . కొడుకు మరో రోజు - కూరగాయలు తస్కరిస్తాడు. అప్పుడూ తల్లి ఏమీ అనదు. ఆ కూరగాయలను  వండి పెడుతుంది . స్కూల్లో - ప్రక్క పిల్లల వస్తువులు కాజేస్తాడు.అప్పుడూ అంతే .


యిలా, తల్లి మమకారంతో, ప్రోత్సాహంతో పెరిగిన కొడుకు గజదొంగ గా  తయారవుతాడు. ఎవరికీ చిక్కడు అప్పుడూ అంతే . తల్లికి కొడుకును ప్రోత్సహించడమే  పని. వొక సారి  హత్య చెయ్యాల్సి వస్తుంది. ఎప్పుడో వొక సారి పట్టు బడతాడు.  ఉరిశిక్ష పడుతుంది. తన కడపటి కోరిక ఏమిటని - అడుగుతారు. తన తల్లిని చూడాలని అంటాడు. తల్లి వస్తుంది. అప్పుడు - కొడుకు తిడతాడు. మొదటి సారి పండు కాజేసిన నాడే - నువ్వు నన్ను తిట్టి , చెయ్యొద్దని చెప్పి వుంటే , నేను బాగు పడే వాడిని కదా - అంటాడు. 

ఈ రోజుల్లో, ముఖ్యంగా - మన దేశ  రాజకీయాల్లో - అహంకారము, మమకారాల పాత్ర మనం చూస్తూనే వున్నాం. పట్టుబడితే దొంగ. లేదంటే - దొర. యిదీ కథ.  వీటి వలన - వారు మాత్రమే కాక, అందరం  రకరకాల బాధలు పడుతున్నాం.


యింట్లోని  వారు కానీ, పార్టీల నాయకులు కానీ - మరెవరైనా కానీ  - తప్పులు చేసే వారిని - తమకు లాభం వచ్చే వరకు - అస్సలు - అడగడం - లేదు. చివరికి - మతాలూ, మిగతా  రకాల సంస్థలూ  కూడా అలాగే  వుంటున్నాయి.

ఎప్పుడో లక్షల ఏండ్ల నాడు ఎవరో వొకాయన రాసిన మనుధర్మ శాస్త్రాన్ని - మనం తప్పు బడతాం.అయినా ,దాన్ని సంస్కరించుకోం. 


కానీ- దేశంలోఎక్కడైనా, కనీసం  వొక్క రోడ్డైనా-  సింగపూర్ లాగా, అమెరికా లాగా - వేయగలుగుతున్నామా - అంటే లేదు. కారణం - 'నా' స్వార్థం. 'నా వారి' స్వార్థం. అంటే - అహంకారం, మమకారం. బియ్యంలో కలపడం; పాలలో కలపడం; పప్పుల్లో కలపడం; మందుల్లో కలపడం; కలపడం లేని - వస్తువే మన దేశంలో దొరకడం లేదు. కారణం - అహం-మమ. ఈ రెండు కారాలే. బ్రిడ్జీలు -కట్టక ముందే -కూలిపోతున్నాయి.అడగ వలసిన వాడు అడగడు . మనం నోరు తెరిచి అడగ లేము. 

లంచ గొండి తనానికి  ముఖ్య కారణం - మనలో ప్రేమ శూన్యమై పోవడమే అంటారు శ్రీ శ్రీ రవిశంకర్ గారు. అందరూ నా వారే - అనుకుంటే - లంచ గొండి తనమూ వుండదు, కలపడమూ వుండదు.

సద్గురు  జగ్గి వాసుదేవ్ గారంటారు - మీ వేలు వొక్క సారి చూసుకోండి. దాన్ని,ఏదైనా రాయెత్తి  కొట్టండి చూద్దాం. మీరు చెయ్యరు. ఎవరూ చెయ్యరు. ఎందుకంటే - అది నాది అనే భావన. మీ కొడుకు దగ్గరో భార్య దగ్గరో లంచం అడుగుతారా? అడగరనే అనుకుంటున్నా . ఎందుకంటే , వీళ్ళు నా వాళ్ళు  అనే భావన మీలో వుంది గనుక. "నా వారు" అని అనుకోని వారి దగ్గరే - మీలో స్వార్థము, వారికేమైనా ఫరవాలేదు అనే భావన తలెత్తుతాయి.

మీరు హాస్పిటలుకు -వెళితే  వెయ్యి ఫారాలు రాసిన తర్వాత గానీ   అడ్మిషన్  యివ్వని డాక్టర్ గారు - తనకైతే ఏం చేస్తారు? మొదట ట్రీట్మెంటు -తరువాత ఫారాలు. మీ వారు రేపుకు గురైతే - పోలీసు వారు ఏంచేస్తారు? తమ వారు గురైతే ఏం చేస్తారు?

వీటన్నిటి వెనుక - అహంకారం వుంది. మమకారం వుంది.  యివే స్వార్థమనే రూపం లో వెయ్యి, వెర్రి తలలు వేస్తూ వుంది.

అసలైన జ్ఞానమూ లేదు. ప్రేమా లేదు.

యివి నశించి పోతూ వుంది మనలో.   "ఐ లవ్ యూ " అనే మాటల్లో కూడా - ఎక్కువగా అహంకారం, మమకారం మాత్రమే వున్నాయి. నువ్వు నాకు ఉపయోగ పడే వరకే  "ఐ లవ్ యూ ". లేదంటే - యిది మరో చోటికి వెళ్లి పోతుంది.

గీతా సారమంతా - వొక్క వాక్యంలో చెప్పాలంటే - "అహంకారం, మమకారం వున్నమీ మనస్సులో , జ్ఞానము, ప్రేమ నింపుకోండి."   శ్రీకృష్ణుడి ప్రబోధమంతా యింతే 

జ్ఞానమూ, ప్రేమా మీలో వున్నట్టు ఏం గుర్తు?

 మీరు మనసారా- "సర్వే జనాః సుఖినోభవంతు" అని అనుకోగాలరా . అలా ఉండగలరా.  అదే గుర్తు.

ఈ మధ్య స్వామి పరిపూర్ణానంద  గారు - దళిత వాడలలో పర్యటించి, వారితో మాట్లాడి, వారి మాటలను విన్న తరువాత - వొక్క మాట అన్నారట - నేను యిప్పుడే  నిజంగా పరిపూర్ణానంద అయ్యా ను. వూరికే ఉపన్యాసాలు, ప్రవచనాలు యిచ్చేటప్పుడు, ఏదో వెలితి వుండేది - అని. ఆ తర్వాతా ఆయన మాట్లాడే మాటలలో సర్వే జనాః సుఖినోభవంతు - అన్న భావన హృదయపు లోతుల నుండి వచ్చేటట్టు మనం గమనించ వచ్చు. 

అంతే . అంతకు మించి చెప్పేదేమీ  లేదు. తమ,తమ జీవితాల్లో, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు యిద్దరూ చేసింది యిదే.

సర్వే జనాః సుఖినో  భవంతు .


= మీ

వుప్పలధడియం విజయమోహన్







27, ఆగస్టు 2012, సోమవారం

మారుతున్న కాలం - ఎటు వైపు మన ప్రయాణం ? - ఏం చెయ్యాలి మనం ?

కిం కర్తవ్యం ?


ప్రపంచం లో  ఎన్నో మార్పులు జరిగి పోతున్నాయి.

మనం వూహించ  గలిగేవి, వూహించ లేనివి  - ఎన్నో, ఎన్నో జరిగి పోతున్నాయి.

వొక్క భారత దేశంలోనే - మనుషులలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మెరిసేదంతా బంగారం  కాదు - అన్న పాత కాలం సామెత లోని నిజం తెలిసి వచ్చేటట్టుగా వుంది.

మచ్చుకు వొక్క విషయం చూద్దాం.

మన ఆరోగ్య -మంత్రి  ఘులాం నబి ఆజాద్ గారు అన్నారు - భారత దేశం లోని   మగ వాళ్ళలో - యిన్ ఫెర్టిలిటీ (పిల్లలు పుట్టలేని స్థితి) -చాలా ఎక్కువవుతున్నదట. దీనికి కారణం - మన దేశంలోని రసాయనిక కర్మాగారాల్లో నుండి వెలువడే - క్సెనో బయోటిక్స్ -అని అన్నారు. వీటి వల్ల - స్పెరం క్రిముల సంఖ్య , వాటి  ఆరోగ్యము , నాణ్యత,సామర్థ్యము  గణనీయంగా తగ్గిపోతున్నవట.
    
సరే . డిల్లీ  లోని అఖిల భారత మెడికల్ సైన్సస్ ఇంస్టి ట్యూట్  వారు ఈ విషయం పై చాలా పరిశోధనలు  నిర్వహించి  క్రింది విషయాలు తేల్చారు :

వొక సాధారణ భారత యువకుడిలో (ఆ పై వయసు వారి లో కూడా) - 3 దశాబ్దాల క్రితం స్పెరం సంఖ్య  60 మిల్లియన్లు (వొక మిల్లీ లీటరుకు) వుండేవట . ఆ సంఖ్య యిప్పుడు 20 మి .న్ల కు పడి  పోయిందట.

దీనికి వొక ప్రముఖ కారణం - వారు పని చేసే చోట వుండే - అధిక ఉష్ణత  అన్నారు. అంటే - ఉష్ణోగ్రత  ఎక్కువగా వున్న  కర్మాగారాలు లాంటివి.

యిది కాక, అనేక కారణాల వల్ల ,  మగ వారి స్పెరం నాణ్యత - ప్రతి సంవత్సరమూ - దాదాపు 2% తగ్గిపోతున్నదట .

దాదాపు 40 శాతం మగ వారిలో -  స్పెరం సంఖ్య , నాణ్యత గణనీయంగా తగ్గిపోతున్నదట . సెమన్ ఉత్పతి కూడా  కూడా తగ్గి పోతున్నదట.

ఆరోగ్యముగా పుట్టే స్పెరం సంఖ్య చూస్తే   - వొక్క దశాబ్దంలో  26 శాతం  స్పెర్మ్స్ లో 60 శాతం ఆరోగ్యంగా వుండేవి - యిప్పుడు 7 శాతానికి పడిపోయాయట. అంతకు  ముందు - అంత కంటే మరింత ఆరోగ్యంగా వుండే వుంటాయి. ఇలాంటి మరెన్నో విషయాలు -పరి శోధనల్లో  తెలిశాయిట.  

కోపెన్ హాగెన్ విశ్వ విద్యాలయం పరిశోధనలలో  కూడా - వారి దేశంలో - యిటువంటి మార్పులు వస్తున్నట్టు తెలిసిందట. 

న్యూ యార్క్ విశ్వ విద్యాలయం పరిశోధనలలో - లాప్ టాప్  కంప్యూటర్లను తమ కాళ్ళపై పెట్టుకొని పనిచేసే  వారిలో - ఈ సమస్య చాలా ఎక్కువగా , చాలా త్వరగా వస్తున్నట్టు తేల్చారు. 

ముఖ్యంగా - పురుషుల మర్మా వయవాలకు -వేడి కాస్త ఎక్కువగా తగిలితే కూడా - ఈ సమస్య త్వరగా వస్తుందని -తెలుస్తోంది . 

సాధారణంగా  ఈ భాగం శరీరానికి వెలుపల, మూడు డిగ్రీలు తక్కువ వేడితో వుంటుందిట. అప్పుడే దాని ఆరోగ్యం, సామర్థ్యం సరిగ్గా వుంటుందట 

అలాగే - క్రిమి సంహారక మందులు వాడబడే తోటల్లో ఎక్కువగా పనిచేసే మగ వారికి కూడా  -యిలా జరుగుతున్న ట్టు, గమనించారు.

సరే.  ఈ కాలం లో శారీరక పరిశ్రమ లేని ఉద్యోగాల్లో వుండే వారికి ఈ సమస్య బాగా  వస్తున్నది. శారీరకంగా క్రొవ్వు ఎక్కువ వుండే వారికి కూడా - యిలా జరుగుతున్నది.

ఎక్కువగా స్మోకింగ్ , త్రాగే అలవాటు వున్న  వారిలో కూడా - ఈ సమస్య ఎక్కువవుతున్నది.

సెల్ ఫోన్లు -శరీరానికి కాస్త దూరం వుంచితే మేలు అంటారు.అలాగే, సైక్లింగ్, బైక్ రైడింగ్  చేసే వారు - సీటింగ్ బాగా సుఖంగా వుందా అని గమనించితే మేలు-అంటారు .

శరీరానికి మరీ బిగుతుగా వుండే దుస్తులు వేసుకుంటే - కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి - అదీ మర్మావయవాల దగ్గర వేడి కొద్దిగా ఎక్కువ కావడం వల్ల .  

నేను చదివిన - ఈ కొన్ని విషయాలు -పాఠకులతో  పంచుకోవాలనిపించింది. ఎందుకంటే -ఈ మార్పులు -మనకు తెలియకుండా , చాలా త్వరగా ,మన అందరి  శరీరాలలో వస్తున్నట్టు  స్పష్టంగా , పరిశోధనా పూర్వకంగా  తెలుస్తూ వుంది. దీనిని కొంతైనా  అరికట్ట వచ్చు - అని, నేను అనుకుంటున్నాను.  

మన శరీరాల్లో, మనస్సులో - జరుగుతున్న తీవ్రమైన మార్పులను - అరికట్టాలంటే , మగ వారు, ఆడ వారు అందరూ జరుగుతున్న మార్పులను, వాటి - కారణాలను అర్థం చేసుకుంటే -  కొంతైనా తగ్గించుకోవచ్చు.

వొక కాలంలో అనే వారు - మగవాడు చలికి భయపడ కూడదు. ఆడది, వేడికి భయపడకూడదు -అని. దాని వెనుక - యిటువంటి కారణాలు - ఏమైనా వున్నాయేమో! వుండినా  వుండొచ్చు . మనకు తెలీదు. 

ఇలాగే ఆడవారిలో కూడా - అనేక రకాలైన మార్పులు వస్తుండడం మనం గమనించ వచ్చు.- వాటికీ  ఎన్నో కారణాలు వుంటాయి. సాధారణ ప్రసవాలు చాలా, చాలా, తగ్గిపోతూ వుండడం చూస్తూనే ఉన్నాము. అదైనా వొకటి లేదా రెండు అని ప్రభుత్వం అనడం మానేసినా - యిప్పుడు చాలా మంది జంటలకు, వొక్క సంతానం  మాత్రమే వుండడం మనం చూస్తున్నాము.వీటికి మనం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రమే  కారణం కాక పోవచ్చు. మనలో వస్తున్న అంతర్గత మార్పులు కూడా కారణం కావచ్చు. వీటిని గురించి మరో సారి మరింతగా చూద్దాం .

పశ్చిమ దేశాలలో చాలా ఎక్కువగా వస్తున్న గే-యిజం, లెస్బియన్-యిజం, లాంటి వాటికి కూడా - వారు స్వచ్చందంగా తీసుకునే నిర్ణయాల కంటే - శారీరక, మానసిక,జన్యు సంబంధ మార్పులే ఎక్కువ కారణం కావచ్చు. యివి యిప్పుడు, మన దేశంలో కూడా - ఎక్కువవుతున్నాయి.

మొత్తానికి - ఆరోగ్య కరమైన -  స్త్రీ పురుష సంబంధాలలో - పరస్పర  స్నేహము, సహానుభూతి ,ఆకర్షణ వుండాలి. ఎప్పుడూ తగవులాడే జంటలలో - నేనా,నువ్వా,అని ప్రతి దానికీ  పోటీ పడే వారి మధ్య-  ఈ  సమస్యలు  ఎక్కువవడం తప్పవు.

మారుతున్న కాలం - మనం పూర్తిగా ఆపలేం - కానీ ఎటు వైపు మన ప్రయాణం - అనేది తెలుసుకుంటే - -మనలో  ఆలోచన పెరుగుతుంది.  

అన్ని కారణాలూ - మనకు తెలియక పోయినా - తెలిసిన కారణాలు కొంత  తగ్గించుకుంటే - మంచిది  కదా .

మనకున్నది వొక్క జీవితం. అది అందంగా మలుచుకోవాలంటే - సంతోషంగా గడపాలంటే - నూరేళ్ళు నిండుగా  వుండాలంటే - ధర్మేచ అర్థేచ కామేచ అనే సూత్రం ప్రకారం  - స్త్రీ పురుషులిద్దరూ  - కలిసి - ఎలా ఉండాలో - ఎలా వుంటే -యిద్దరికీ మేలో -   తెలుసుకుంటే - మేలు కదా.



= మీ 

వుప్పలధడియం  విజయమోహన్ 




7, ఆగస్టు 2012, మంగళవారం

హిందూ మతంలోని లోటుపాట్లు, రుగ్మతలు = మనం ఏం చెయ్యాలి ?

హిందూ మతంలోని లోటుపాట్లు, రుగ్మతలు 


ఈ రోజు టీవీ 9 ఛానల్ లో స్వామీ పరిపూర్నానంద గారి ఆవేదన,దానికి విరుద్ధంగా కొంత, సపోర్ట్ గా కొంత,  రాజకీయ వాదులు మాట్లాడడం, వినడం జరిగింది. 

రాజకీయాలు ప్రక్కన బెడితే  - మనం చాలా సులభంగా చూడగలిగే విషయం -ప్రతి మతం లోనూ - ఈ రోజు కొన్ని రుగ్మతలు, కొన్ని లోటుపాట్లు చోటు చేసుకున్నాయన్న విషయం.

ఏదో హిందూ మతం లోనే అన్ని లోటుపాట్లు వున్నాయనుకోవడం-  ప్రపంచాన్ని , అందులో వివిధ దేశాల్లో జరుగుతున్న విషయాల్ని పూర్తిగా విస్మరించడమే అవుతుంది. ఈ రోజు ప్రపంచంలో - యుద్దాలు జరిగితే -    అది హిందూ మతం వలన మాత్రం కాదు. ఇండియా లో పుట్టిన ఏ మతం వలనా కాదు.

మొదటి ప్రపంచ యుద్ధం కానీ , రెండవ ప్రపంచ యుద్ధం గానీ - ఆ తరువాత - ఈ రోజు వరకు జరుగుతున్న అనేక యుద్ధాల్లో - పాల్గొంటున్న మతాల వారెవరు? మనం కాదు

వొక మతం వాళ్ళే తమలో తాము - మత ప్రాతిపదికపై -  కొట్టు కుంటున్న  దేశాలు ఎన్నో వున్నాయి. మా మతంలో - అంతా బాగుంది - ఎవరిపై విద్వేషం లేదు - ఏ రకమైన భేద భావాలు లేవు -    అని చెప్పడం - నిజానికి  చాలా దూరం.  

అయితే - యివి - మొదట - దేవుడే చెప్పాడా ప్రవక్త చెప్పాడా - ఆ తరువాత మతంలో చోటు చేసుకున్నాయా -అన్నది - వివాదాంశం . 

సరే. హిందూ మతంలో - రాముడు కానీ కృష్ణుడు కానీ - అట్టడుగు వాళ్ళకే ప్రాధాన్యత యిచ్చినట్టు - మనకు తేట తెల్లంగా తెలుస్తూనే వుంది.  

శంకరాచార్యుల వారు -అంటరానితనం పాటించ రాదని -    తననే వొక ఉదాహరణగా - తనకు మహా శివుడే  చెప్పినట్టు - గొంతెత్తి చెప్పారు.   

అప్పుడు కూడా - మనం మారక - పోతే - తప్పు మనదా ?  మతానిదా?  

హిందూయిజం - ఎన్నో రకాలుగా మొదటి నుండీ - మారుతున్న మతమే కానీ , మారని మతం కాదు. మొన్న మొన్న ద్వాపరయుగంలో కూడా -  శ్రీకృష్ణుడు - గీతోపదేశం చేసాడు. అది పాటిస్తున్నామా లేదా ?  

శంకరాచార్యుల వారు ఎన్నెన్ని చెప్పారు ? రామానుజుల వారు ఎన్నెన్ని చెప్పారు ? 

అందరిలో నిన్ను; నీలో  అందరినీ; చూడకపోతే - నీకు జ్ఞానం లేదనే నిర్దిష్టంగా  చెప్పారు.

అది వొక ప్రక్కన  వుండనియ్యండి. దాన్ని గురించి మరింత విశదంగా మరో సారి చూద్దాం.

యిప్పుడు ముఖ్యంగా - మనం చూసే లోటుపాట్లు కొన్ని చూద్దాం.

వొకటి ఆలయ ప్రవేశం.దేవుడి దగ్గర కు  వెళ్ళడానికి - ప్రతి  వొక్కరికీ హక్కు దేవుడే యిచ్చాడు . భక్త కన్నప్ప వెల్ల లేదా? తిన్నడు వెల్ల లేదా? శివుడు వద్దన్నాడా?

ఎక్కడైనా , హిందువులైన వారికి ఎవరికైనా - ఆలయ ప్రవేశం లేదంటే - అది సరి చేయడానికి - 66 సంవత్సరాలు అక్కర లేదు వొక్క రోజు  చాలు. కాకపోతే - నేను తాగేసి వెడతాను బూతులు మాట్లాడుతాను - అని అనే వారికి; దేవుడి విగ్రహం పై ఏ నమ్మకం లేని వారికి,  దేవుడి విగ్రహాలు పగుల గొట్టాలి - అనే వారికి - ఆలయ ప్రవేశం - మిగతా వారికి మంచిది కాదు.

సర్దార్ వల్లభాయి పటేల్ గారు చేసినట్టు - నమ్మకం వుండి, రావాలనుకున్న -వారినందిర్నీ- గుడి లోపలికి    పోలీసో  ,  మిలటరీనో - సహాయం తీసుకుని - తీసుకెళ్ళి పోవడమే.అంతే.  అన్ని కులాల్లో - సమానత్వం వుండాలన్న భావన         వున్న వారు చాలామంది వున్నారు. వారి సహాయమూ - తోడూ తీసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు మిగతా వారు మారడం చాలా సులభంగా జరిగి పోతుంది.     

ఎవడెవడు  వద్దని అంటాడో  - అడ్డు కుంటాడో -   వారిని ఆ గుడి నుండీ - వొక సంవత్సరం నాళ్ళు - బహిష్కరించండి. తప్పే లేదు. మరొకరి హక్కులకు  అడ్డం నిలిచే వాళ్లకు అలాంటి  శిక్ష తగినదే.  ఈ ఆలయ ప్రవేశం - అనే వొక సమస్య  - వొక్క రోజులో పరిష్కరించ వచ్చు .   

అలాగే - టీ అంగళ్లు ,హోటళ్ళలో -   వివక్షత వుంటే - ఆ హోటల్లు మూసేయండి . తప్పే లేదు. ఎవరి హక్కుకూ -ఎవరూ  అడ్డు నిలవడం సరి కాదు. కాకపోతే - శుభ్రత లాంటి విషయాలు - చూడాల్సిందే . ఏ కులం ఏ మతం వారైనా - తాగేసి రావడమో, శుభ్రత లేకుండా రావడమో, బూతులు, మాట్లా మో -  చెయ్య రాదు. యివి -  వొక్కరని కాదు - చాలా కులాల వారు చేస్తున్నారు . అగ్ర వర్ణాల / వర్గాల వాళ్ళు కూడా చేస్తున్నారు  .ఏ సమాజం లో నైనా - యివి పనికి రావు.  

మాట్లాడుతూ వుంటే - సమస్యలు పరిస్ద్ష్కారం కావు. శ్రీకృష్ణుడు ఎన్నో చేసాడు.శంకరాచార్యులు  చేసారు. రామానుజులూ చేసారు. మనం చెయ్యడం లేదు.వూరికే మాట్లాడుతూ ఉన్నాము.  

గోటి తో పోయేదానికి - గోరూ ఉపయోగించడం లేదు . గొడ్డలీ ఉపయోగించడం లేదు. అసలేమీ చెయ్యడం లేదు. సంవత్సరాల తరబడీ - వూరికే  మాట్లాడుతూ  ఉన్నాము. 

మతోద్దారకులూ, సమాజోద్దారుకులూ - అయిన హిందువులందరూ - రంగం లోకి దిగి - సమస్యను - పరిష్కరించండి. వొక్క రోజు కాకున్నా వొక-నెలలో - కనీసం - ఆంధ్ర ప్రదేశ్ లో - ఈ సమస్యలు రూపు మాపండి . అదే విధంగా - వారికి సహాయంగా -ప్రభుత్వం నిలవాలి . చట్ట పరంగా ప్రభుత్వం అందరి హక్కులనూ కాపాడాలి కదా.

యివన్నీ ఏదో విప్లవం లాగా చేయాల్సిన పనేం లేదు. చాలా శాంతి యుతంగా, చెయ్యగల పనే. సులభమైన పనే. చెయ్యాలి - తప్పదు.     

చేసి - అందరికీ మార్గ దర్శకులుగా నిలవండి.  


స ర్వే జనాః సుఖినో భవంతు .  

=మీ

ఉప్పల దడియం  విజయ మోహన్