25, జులై 2013, గురువారం

తోలి విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఏం తెలుపుతున్నాయ్?


ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో తోలి విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఏం తెలుపుతున్నాయ్?

తెలుగుదేశం పార్టీ అందరికన్నా ముందుంది. అన్ని ప్రాంతాలలోనూ. ఆ తరువాత అసలు కాంగ్రెస్సు, ఆ తరువాత, వై.యస్. ఆర్. పీ - వీరందరికంటే క్రింద - తె. రా. స.

యింకా రెండవ విడత, మూడవ విడత ఎన్నికలు జరుగనున్నాయి.

ముందు. ముందు, ఏం జరుగుతుందో - మనకు తెలీదు. కానీ. ఈ ఎన్నికల ఫలితాల విశ్లేషణ ఎలా చేయాలో , దాని ఫలితాలు ఏమిటో చూద్దాం .

మొదటి అంశం - చంద్ర బాబు గారి నాయకత్వం పైన చాలా మందికి నమ్మకం వుందని తెలుస్తోంది . అదీ - రాష్ట్రం లోని 3 ప్ర్రాంతాల లోనూ.   తెలుగు దేశం పార్టీ లోని మిగతా నాయకులు కూడా - యింకా గట్టిగా, వారికి అండగా నిలిస్తే - వారు మళ్ళీ  ఈ రాష్ట్రానికి CM కావచ్చు - అనిపిస్తోంది. అదే కాక, తెలంగాణా ప్రాంతం లో తె. రా.స. కంటే, ప్రజలకు, యింకా తె.దె.పా పైన, కాంగ్రెసు పైనే  ఎక్కువ మక్కువ అనేది తెలుస్తోంది. ముఖ్యంగా, తెలుగు దేశం పైన. ఈ ప్రజాభిప్రాయాన్ని - ఢిల్లీ లోని - నేతలు బాగా మనసులో పెట్టుకొవాలి. తె. రా. స. ఏది చెబితే, అదే, ప్రజాభిప్రాయం అనుకోవడానికి - లేదు అని తెలంగాణా ప్రజలు చెబుతున్నారు కదా. 

రెండవ అంశం : వై.యస్. ఆర్. పీ ఎంత ప్రచారం చేసినా - కాంగ్రెసు కు కూడా అన్ని ప్రాంతాల లోనూ మంచి బలం వుందనేది తెలుస్తోంది. అంటే -  కిరణ్ కుమార్ గారి నాయకత్వమో, మరేదో, వారిని ఆకర్షించిందనేగా అర్థం.

మూడవ అంశం : వై.యస్. ఆర్. పీ మూడవ స్థానంలో వుండడం కూడా, గొప్ప విషయమే. జగన్ గారిపై నున్న ఆరోపణలు, యిప్పటి వరకు విదితమైన విషయాలు ఎన్నో ఆరోపణలకు బలం యిచ్చేవిగా వున్నాయి.  అయినా వారి పార్టీ కి కూడా చాలా బలం వుందనేది తేలుతూ వుంది. అంటే , లోపాలెన్నో వున్నా, నాయకత్వ లక్షణాలు కూడా వున్నాయని తెలుస్తోంది. అదే  గాక,మరేదైనా కారణాలు కూడా ఉన్నాయా?

నాలుగవ అంశం : తె. రా. స -ఎన్ని మాటలు మాట్లాడినా, వారిపై, ఎవరికీ ఎక్కువ మక్కువ, నమ్మకం లేదనేది  తెలుస్తోంది. పదవికి రాక ముందే ఇలాంటి మాటలు ఇలాంటి చేతలు, వుంటే - పదవికొస్తే - ఎలా వుంటారో - అనే భయం ప్రజలకు వుండొచ్చు. మమతా గారు పశ్చిమ బెంగాల్ లో యిలాగే మాట్లాడే వారు. యిప్పుడు ఎలా మాట్లాడుతున్నారో- వారు గానీ, వారి క్రింద నున్న నాయకులు గానీ - యిది మనకు తెలుస్తోంది. అదే కథ ఇక్కడా జరగొచ్చు. - అని, ప్రజలు అనుకుంటూ వుండవచ్చు.

సరే. ఏ పార్టీ, మందు కోసం, ఎంత ఖర్చు పెట్టింది - అనేది కూడా వొక అంశమే. మరి ఎన్ని విధాల్లో, ఎలా వోట్లు కొన బడ్డాయి -అనే అంశం కూడా రాజకీయ విశ్లేషకులు చూడాల్సిందే.  కులం,మతం  ప్రాతిపదిక పైన ఎన్ని వోట్లు పడ్డాయి - అలా జరగడం మనం ఎప్పుడు విడిచి పెడతాం - అన్నదీ చర్చనీయాంశం.

యివన్నీ వొక ప్రక్క.  వోటు వేసి గెలిచిన వ్యక్తి యిక ముందు తన ప్రజలకు ఏమేం మేలు చేస్తాడనేది ప్రధానాంశం. ప్రజలు ఆయనను నిలదీసి - అన్ని పనులూ చేయించుకోవాలి. అప్పుడే అది పంచాయితీ రాజ్ అవుతుంది.

సర్వేజనాః సుఖినో భవంతు .

= మీ

వుప్పలధడియం విజయమోహన్

22, జులై 2013, సోమవారం

సంతోషంగా వుండడం యింత సులభమా?



నిరంతరం వుండేది  ఆనందం అంటారు; అప్పుడప్పుడూ వచ్చి పొయ్యేది సంతోషం.

 మనం ఎవరో, ఏమిటో  తెలుసుకుంటే అసలైన ఆనందం.  లేదంటే - సంతోషము, దుహ్ఖాల మధ్య జీవితమంతా వూగిసలాట..

కోరికలను మన అదుపులో వుంచుకుంటే ఆనందం. కోరికల వెనుక పరుగెడితే కాస్త సంతోషం; అంత కంటే ఎక్కువ దుహ్ఖాలు, కష్టాలు. నిజానికి , అల్ప సంతోషులకు సంతోషం చాలా యెక్కువ.  కోరికలు ఎక్కువ అయ్యే కొద్దీ, సంతోషం తగ్గి పోతూ వుంటుంది.

యిలా ఎన్నో జీవిత సత్యాలను, సూత్రాలను మన పూర్వీకులు మనకు యిచ్చే వెళ్ళారు.

అయినా - మనం కోరికల వెనుక పరుగెడుతూ వుంటాం;  మన మనసు కోరికలతో బాటే పుట్టింది. కోరికల వెనుక పరుగెడకుండా ససేమిరా వుండదు.

యిది యిలా వుండ నివ్వండి.

అసలు, మనకు సంతోషాన్నిచ్చే విషయాలేమిటి?

ఎలా వుంటే - ఎక్కువ కాలము, ఎక్కువగా సంతోషాన్ని అనుభవించ గలము? యిది తెలుసు కుంటే - మేలే కదా!


గాంధీ గారు  ఏమంటారంటే - మీ మనసు, మాట, చేత - అన్నీ వొక విషయం పైన కేంద్రీకృతం అయితే - దాన్లో మీకు చాలా, చాలా  సంతోషం లభిస్తుంది. మనసొక చోట, మాట వొక చోట , చేత మరో చోట అయితే - సంతోషం వుండదు.  అది - రకరకాల క్లిష్ట పరిస్థితులకు దారి తీస్తుంది.

సంతోషము మనం చేసే  పనుల పైనే ఆధార పడి వుంటుంది - అంటారు దలై లామా.

మనం ఎలాంటి పనులు చేయాలి?

మీ వద్దకు వచ్చిన ప్రతి  వొక్కరు సంతోషంతోనే - తిరిగి వెళ్లేట్టు చూడండి.  మీ మాటలో, మోహంలో, చిరునవ్వులో, దయను ప్రతిఫలించండి -అంటారు మదర్  థెరెసా.  అలాగే,మార్టిన్ ల్యూథర్ కింగ్ (జూనియర్) గారంటారు -  మీరు సంతోషం గా వుండటానికి రాజ మార్గం మీ చుట్టూ వున్న వారి సంతోషానికి కారణంగా మీరు నిలవడమే - అని.

యిదే మాట మార్క్ ట్వైన్ లాంటి  మరెంత మందో అన్నారు.

యిమాన్యువల్ కాంట్ అనే తత్వ శాస్త్రజ్ఞుడు సంతోషానికి మూడు సూత్రాలు చెబుతాడు - (1)  మీకు నచ్చే ఏదో వొక పని ఎప్పుడూ మీకు వుండాలి ; అది మీరు చేస్తూ వుండాలి (2) మీరు ప్రేమించడానికి / బాగా యిష్ట పడడానికి   ఎవరో వొకరు మీ దగ్గర వుండాలి  (3) మీ జీవితంలో ముందు ముందు ఏదో మంచి జరుగుతుందన్న ఆశ, నమ్మకము వుండాలి. అంతే నండి. యివి వుంటే - హాయిగా బ్రతికేయచ్చు.

కొంత మంది మన వద్దకు వస్తే - మనకు చాలా సంతోషం కలుగుతూ వుంటుంది. అలాంటి వారు కొంత మంది ఎక్కడికి వెళ్ళినా - అక్కడ సంతోషం వెల్లివిరుస్తుంది.

 అయితే, మరి కొంత మంది, మన వద్ద నుండి వెళ్లి పోతూ వుండేటప్పుడు - మనం సంతోష పడతాము. వాళ్ళు వుండే టప్పుడు ఎందుకొచ్చారా - అనిపిస్తూ వుంటుంది. - అంటారు ఆస్కార్  వైల్డ్.

ముందే  అన్నాము కదా - సంతోషం  వస్తుంది,పోతుంది కూడా. మనతో అలాగే వుండి పోదు.

కానీ దుహ్ఖం తను వెళ్లి పోయేటప్పుడు - మన మనసులో ఏదో వొక మచ్చను మిగిల్చే పోతుంది. అందుకని, మనం, దుహ్ఖాత్మకమైన సంఘటనలను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని బాధ పడుతూ వుంటాము.

సంతోషం మాత్రం చెప్పా చెయ్య కుండా వెళ్లి పోతుంది. వొక్కో సారి వెళ్ళేటప్పుడు -  చాలా  బాధ కూడా పెడుతుంది. ఎటువంటి సంతోషమైనా కొన్నాళ్ళ తరువాత మర్చి పోతాము. అందుకని, మన జీవితంలో జరిగే సంతోష కర సంఘటనలను మాత్రం రాసుకోవడం, అప్పుడప్పుడూ నెమరు వేసుకోవడం మంచిది.

కొంత మందికి  జ్ఞాపక శక్తి తక్కువ. కస్టాలు, దుహ్ఖాలు గుర్తు రావు. అలాంటి మరపు - సంతోషానికి చాలా మంచిది కదా.

ముఖ్యంగా యింట్లో జరిగే కలహాలు అందరూ మర్చి పోవాలి. లేదంటే - ఎప్పుడో యిరవై ఏళ్ళ నాడు జరిగిన కలహం; అది, చిన్నదైనా, పెద్దదైనా, ఆ తరువాత జరిగిన సంతోష కర సంఘటనలన్నీ వదిలేసి - దాన్ని ఈ రోజు ముందు వేసుకుని పెద్దగా పోట్లాడుకునే వారిని, ఎంతో మందిని, మనం చూడొచ్చు. అంటే, అటువంటి వారికి, సంతోషంగా వుండటం ఎలాగో తెలీదన్న మాట. యిటువంటి చిన్న చిన్న సూత్రాలు మర్చి పొతే - జీవితాంతం - కొట్లాటలు, పోట్లాటలే గాని, సంతోషం వుండదు.

మనలో కొంత మంది - అయ్యో, ఈ ప్రపంచం యింత ఘోరంగా, యింత మోసం గా వుందే, అని బాధ పడుతూ వుంటారు. అలా అనిపించడం, కొంత సహజమే అయినా - మనం మరో జీవిత సత్యం తెలుసుకోవాలి .

యిదే - ప్రపంచంలో మంచీ వుంది; చెడూ వుంది. మీరు బాధ పడినంత మాత్రాన చెడు పోదు . మీరు చెయ్య గలిగేది చెయ్యండి  కానీ, ఈ చెడుతో బాటు, యిదే ప్రపంచంలో మీరు సంతోషంగా వుండ గలిగే  అవకాశమూ  పూర్తిగా
వుంది. మీరు ఏ మంచి చేసినా, మీరు సంతోషం గా వుంటూ - చెయ్యండి.  బాధ పడే వారి పట్ల దయ చూపండి . వారికి చెయ్య గలిగే సహాయమూ చెయ్యండి. అంతే గాని, మీరు కూడా వారితో పాటు  బాధ పడితే - వారికి వొరిగేదేమీ లేదు..


మిమ్మల్ని గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసు కుంటే - అంత సంతోషంగా వుండే అవకాశం వుంది. యిదొక జీవిత సూత్రం.

యివన్నీ సరే. ఎంతో కొంత సంతోషం, ప్రతి దినం మనం సృష్టించు కోగలమా?  గలము. మనకు ఏది సంతోషం యిస్తుందో - అది మనం చెయ్యాలి. ఏది దుహ్ఖం యిస్తుందో, దాన్నుండి, కాస్త దూరంగా వుండాలి.

 కొన్ని ఉదాహరణాలు చూద్దాం :

1. ప్రేమలో పడడం - చాలా సంతోషం యిస్తుంది. నిజమే. కాకపోతే, ఆ ప్రేమ సరైన వారితో నైతే, జీవితమంతా - సంతోషం వస్తూ వుంటుంది. లేక పొతే - ప్రేమనే తరువాత దుహ్ఖంగా మారిపోతుంది. అమెరికాలో జరిగే ప్రేమ వివాహాల్లో - దాదాపు 51 శాతం విడాకులలో ముగుస్తోందని,  తెలుస్తోంది.

2 . నవ్వడం, నవ్వించడం, నవ్వించే వారి ప్రక్క నుండడం - యివన్నీ సంతోష కారకాలే కదా!

3. చాలా చిన్న చిన్న విషయాలు కూడా సంతోషా న్నిస్తాయి. (1) మీకు నచ్చిన ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినడం; (2) పిక్నిక్ లకు బాగా తయారయి వెళ్ళడం; (3) మీకు బాగా నచ్చిన సినిమా, మీకు నచ్చిన వారితో బాటు చూడడం;
(4) మీకు నచ్చిన పాట వినడం;అదీ వీడియో తో బాటు వింటే మరీ బాగుంటుంది; (5) మంచి రహదారి పైన  నడవడమో; వొక్కో సారి, కార్లో అటువంటి రోడ్డు పైన చుట్టూ వున్న ప్రకృతిని చూస్తూ, వెళ్ళడ మో, అదీ స్నేహితులతో; (6) వో నలుగురు స్నేహితుల మధ్య కూర్చుని హాయిగా మాట్లాడుకోవడం ; (7)  బీచ్ లో ఆడుకోవడం; (8) చిన్న పిల్లలతో ఆడడం; (9) ఎవరో మీ గురించి చాలా మంచిగా, గొప్పగా పొగుడుతూ వుంటే,  అనుకోకుండా, వారికి తెలీకుండా మీరు వినడం జగడం ;(10)  ప్రేమికుల మధ్య నైతే మీరు మొదటి సారి పెట్టుకున్న ముద్దు లాంటివి; మీరు ఎంత బాగున్నారు అని వారు వర్ణించడం; స్విమ్మింగ్ పూల్ లో దిగి ఆడుకోవడం; వొకరి ప్రక్కన వొకరు కూర్చొని సూర్యాస్తమయమో, చంద్రోదయమో చూస్తూ మాట్లాడుకోవడం;  వొకరి చేతిలో మరొకరి చెయ్యి వేసి నడవడం; ఇలాంటివి ఎన్నో , ఎన్నెన్నో;

ఇలాంటి సంతోష కర సంఘటనలు - మీరు అప్పుడప్పుడూ సృష్టించుకోవాలి.

కొందరి మనసులో కదిలిన -  కొన్ని భావనలు చూడండి :-

4.. నన్ను చూసి నవ్వే, నవ్వించే నీ కళ్ళను చూసి  ఎన్ని రోజులయిందో!  నా కళ్ళలో, నా మొహంలో కూడా - నవ్వు  యిన్నిరోజులుగా లేక పోయిందని నీకు తెలుసా?

5. నేను బాగున్నానని అనిపించినప్పుడల్లా,  నేను హాయిగా నవ్వుకున్నప్పుడల్లా, నేను సంతోషంగా వున్నప్పుడల్లా - నా ప్రక్కన వున్నది ఎవరో తెలుసా? నువ్వే?

6. నేను వొక్కో సారి, ఎంతో సేపు, నిన్ను గురించే అనుకుంటూ వుంటాను . ఆ తరువాత తెలుస్తుంది నాకు, అంత సేపూ, నా మోహంలో  చిరునవ్వు, నా మనసులో సంతోషం నిండి వుందని.

7. నీ ప్రక్కన ఉన్నంత సేపూ , నేను సంతోషంగా వుండాలని ప్రయత్నం చెయ్యనక్కర లేదు. అది తానుగా అలా...జరిగి పోయే విషయం

8. వొక్కో సారి , ఎవరో వొకరు వచ్చి వొక్క మాట మాట్లాడి వెళ్లి పొతారు. మరి ఆ రోజంతా, నేను ఉత్సాహంగా, సంతోషంగా వుండి పోతాను. ఆ వోక్కరు ఎవరో తెలుసా?

..... ఈ భావనలు కలిగే వారిలో, కలిగించే వారిలో , ఎప్పుడూ సంతోషం వుంటుంది కదా.

మనసున ఉన్నదీ... , చెప్పాలనున్నదీ... , మాటలు రావే యెలా.... అంటే యిద్దరికీలాభం లేదు.

చెప్పే వారు చెబితే, వినే వారు వింటే నే - యిద్దరికీ సంతోషం కదా!  మనం చాలా మంది, చాలా సమయాల్లో, జంకు తోనో, భయం తోనో , చాలా సంతోషం కోల్పోతాము.

9. అంగట్లో సంతోషం అయితే దొరకదు ; ఐస్ క్రీమ్ దొరుకుతుంది. నిజమే. యిది మనకు తెలిసిన మాటే. అయితే వొక్కో సారి, ఆ ఐస్ క్రీమే, చాలా సంతోషాన్నిస్తుంది కదా.

10. మీరు హాయిగా పడుకుని నిద్ర పోతున్నారు. మీలో ఏ భయాలూ లేవు; సంకోచాలూ లేవు. ఎందుకంటే, మీ ప్రక్కన వున్న వారిపైన , మీకు అమితమైన విశ్వాసమూ, ప్రేమా వున్నాయి గనుక.  నిద్రలో కూడా, మీకు ఆనందమే కదా.  యిది మనం యిచ్చి పుచ్చుకోవలసిన విశ్వాసమూ, ప్రేమా .  మొదట మీరే  యివ్వండి. మీకు అది రెండు రెట్లు ఎక్కువగానే తిరిగి వస్తుంది

11. మీరు  ఏదో వంట  చేశారు. అందులో ఏదో సరిగ్గా పడలేదు. లేదా, కాస్త మాడిపోయింది. కానీ, మీ వారు, అబ్బ, ఎంత బాగుంది, అంటూ తిన్నారు. మీరు తినేటప్పుడు తెలిసింది - అసలు సంగతి.  అడిగితే - నీ మొహం చూస్తూ తిన్నాను కదా. నాకు బాగుందనే అనిపించింది - అన్నారు . మీకు తృప్తిగా లేక పోవచ్చేమో గానీ, సంతోషంగా మాత్రం వుంది కదా.

12. దేవుడి గుడికి వెళ్ళారు. వొకరికోసం వొకరు ప్రార్థన చేశారు.  ఆ ప్రార్థన ఎంత బాగుంటుంది - వినే ఆ దేవుడికి.  ఆ దేవుడు తప్పకుండా మీరు అడిగింది కొద్దో గొప్పో ఇవ్వనే యిస్తాడు.

13. ప్రతి రోజూ, దేవుడి మీకిచ్చిన ఆశీర్వాదాలు, మీరు గుర్తు పెట్టుకోండి. మీ శరీరం, మీ భర్త/ భార్య, పిల్లలు, మీ వుద్యోగం, యిలా ఎన్నో దేవుడు మీకు యిచ్చాడు.  ఎన్నో యివ్వ లేదు కూడా.   నిజమే. కానీ దేవుడు ప్రపంచం లో ఎవరికీ - అన్నీ యివ్వ లేదు. మీకు ముఖ్యంగా - సంతోషంగా వుండ గలిగే మనసు యిచ్చాడు. అది బాగా వుపయోగించండి. మీకు ధనం వుండొచ్చు; లేక పోవచ్చు; అధికారం    వుండొచ్చు; లేక పోవచ్చు; మరెన్నెన్నో వుండొచ్చు; లేక పోవచ్చు; కానే, మీరు తలుచుకుంటే - సంతోషంగా మాత్రం వుండగలరు.

అదే కదా మీకు ముఖ్యం!

=మీ

వుప్పలధడియం విజయమోహన్




;