శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు మంచి ధారణా పటిమ గల విద్వాంసుడు. వక్త. పురాణ, ఇతిహాసాలలో దిట్ట. వారి ప్రవచనాలలో - రామాయణంలో మానవీయ సంబంధాలు - అన్న అంశంపై , అందులోనూ, దాంపత్య సంబంధాలు అన్న అంశంపై వైజాగు లో చెప్పిన కొన్ని ప్రవచనాలు గత కొన్ని రోజులుగా నేను టీ.వీ. ద్వారా వినడం జరిగింది.
అందులో - అన్ని అంశాలూ చాలా బాగున్నా - వొకటి రెండు మాటలు మనసుకు హత్తుకు పోయేలా వున్నవి యిక్కడ చెప్పాలనిపించింది.
- భార్యాభర్తలిద్దరూ - వొకరికొకరు నీడ లాంటి వారు. మీరు, రాజ మార్గంలో వెళ్ళినా, ముళ్ళ బాటలో నడుస్తున్నా, మీ నీడ మీ వెనుకే వస్తుంది కదా. అబ్బే. ఈ ముళ్ళ బాటలో మీతో బాటు రాను. దూరంగా వెళ్లి రాజ మార్గం వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాను అంటుందా? లేదు కదా. మీరు, మీ భార్య / భర్తకి నీడలా, తోడుగా అలా వుండాలి. అదే సీత గొప్పదనం. అదే రాముడి గొప్పదనం. అరణ్యాలలో కూడా వొకరికొకరు తోడుగా, ఆనందంగా వున్నారు. (నా అభిప్రాయంలో - నిజానికి, అరణ్యాలలోనే - వారి దాంపత్య శోభ పారాకాష్ట నందుకుందని మనం చెప్పచ్చు. రాజ్యానికి వచ్చిన తరువాత - రాముడు కూడా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లాగా - 12 , 14 గంటలు పని చేసే వాడు కదా. అప్పుడీ దాంపత్య శోభ కాస్తో, కూస్తో తగ్గే వుంటుంది.)
- సీత అంటుందట - రామా, అరణ్యంలో నేను నీ ముందు నడుస్తాను. అక్కడ ముళ్ళు వుంటే, అవి నా కాళ్ళకు గుచ్చుకుంటే , నాకు సంతోషం వేస్తుంది. ఎందుకంటే, ఆ ముళ్ళు తరువాత నీకు గ్రుచ్చుకోకుండా, నీ మార్గం సుగమం చేసాను కదా అని. అందుకని - నేను నీతోనే వస్తాను అందట. - ( భార్యాభర్తలు అలా వొకరి కోసం వొకరు జీవిస్తేనే బాగుంటుంది. అదే మన సంస్కృతి. యిందుకు మారుగా - చాలా అమెరికా పత్రికలలో మనకొక విషయం కనిపిస్తుంది. వారి సలహా ఏమిటంటే - మీ భార్య / భర్తతో - మీ డబ్బును మాత్రం పంచుకోకండి. డూ నాట్ మిక్స్ యువర్ మనీ విత్ యువర్ హనీ - అంటారు. అంటే - ఎప్పుడు విడిపోతామో అన్న సందేహం తోనే జీవితమంతా గడిచిపోతుంది.)
- అరణ్యంలో వొక చోట - వొక పెద్ద చెట్టుకు, అందమైన పూల తీగ అల్లుకుని వుందట. దాన్లో, అందమైన, సువాసనా భరితమైన, పెద్ద పెద్ద, రంగు,రంగుల పూలు నిండుగా వున్నాయట. అది చూపిస్తూ రాముడు అన్నాడట - సీతా, ఎంత పెద్ద చెట్టైనా - ఆ తీగ అలా అల్లుకోక పొతే, దానికి అందమెక్కడిది ? సువాసన ఎక్కడిది? ఎవరు చూస్తారు దాన్ని? - అని.
- సీత అందట - కానీ, రామా, ఆ తీగ, ఆ చెట్టును అలా అల్లుకోక పోతే, అది నెల మీద పడి పశువులచేత త్రొక్క బడి -ఎప్పుడో చచ్చిపోయి వుండేది కదా. చెట్టు లేక పొతే - తీగ లేనే లేదు- అని.
- సరే. సీతా రాముల వివాదానికి - లక్ష్మణున్ని, మధ్య వర్తిత్వానికి పిలిచారు. చెట్టు గొప్పా, తీగ గొప్పా? లక్ష్మణుడు అన్నాడుట - అ చెట్టు అలా పెరిగి, ఆ తీగ అలా అల్లుకోక పొతే - నేను వాటి నీడ క్రింద, ఆ సువాసనల మధ్య ఎలా సేద తీరుతాను. ఆ రెండూ అలా వుంటేనే - మా లాంటి వారికి - చాలా సంతోషం అని. ( పాశ్చాత్య దేశాలలో - రెండూ రెండు చెట్లుగా వుంటాయి. వొకటి చెట్టు; వొకటి తీగగా వుండవు. అల్లుకునే స్వభావం లేదు. రెండూ వొకటయే సమస్యే లేదు. అదో లోకం. నువ్వు గొప్ప అంటే, నువ్వు గొప్ప అనే మన సంస్కృతి. నేను గొప్ప అంటే, కాదు నేను అనే ఆ సంస్కృతి. ఎవరిష్టం వారిది.)
ఇదండీ మన సంస్కృతి. మచ్చుకు, చాగంటి వారు చెప్పిన రెండు మూడు ఉదాహరణలు యిచ్చాను. కాస్త నా అభిప్రాయమూ చెప్పాను. ఈ సంబంధాలలో ఏదో త్యాగం వుందనుకుంటే, చాలా తప్పు. అందులోనే వారి, వారి సంతోషం కూడా వుంది గనుకే - వారు అలా వున్నారు. అది వారికి అర్థమయ్యింది. మనకు.... అర్థం కావాలి. అంతే.
ఇలాంటివి రామాయణంలో ఎన్నో వున్నాయి.
=మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి