మీరూ మీ,మీ పట్టణాలలో చూసే వుంటారు. యిక ముందు వందేళ్ళలో కూడా, చంద్ర గ్రహణం ఎప్పుడు వస్తుందో - గణించి చెప్ప గల సామర్థ్యం మన జ్యోతిష్య పండితులకు వుంది.
అదే విధంగా భూమిపై దాని ప్రభావం ఎలా వుంటుందో కూడా మన వారు అధ్యయనం చేసి - యిలా, యిలా అవడానికి వీలుంది - గనుక, కాస్త జాగ్రత్త వహించండి - అని చెప్పడమూ ఆనవాయితీ.
శాస్త్రానికి - రక రకాల రుజువులు, ప్రమాణాలు వుంటుంది. కొన్నిటికి - మనం కళ్ళతో చూడగల రుజువులు వుండచ్చు. కొన్నిటికి చెవులతో వినగల రుజువులు వుండచ్చు. కొన్నిటికి - కాస్త విమర్శనాత్మకంగా విచారిస్తేనే రుజువు తెలుస్తుంది - కానీ పంచేంద్రియాలకు అంద గల రుజువులు వుండక పోవచ్చు. యిలా రుజువులు ఎన్నో రకాలు.
కొన్నిటికి - స్టాటిస్టికల్ ప్రూఫ్ మాత్రమే వుంటుంది. అంటే - అనేక సందర్భాలలో - జరిగిన, లేదా, వచ్చిన ఫలితాలను ఆధారంగా, ప్రమాణంగా, యిలా జరిగే సందర్భం లో - యిటువంటి పరిణామాలు జరగ వచ్చునని - ఆధునిక శాస్త్రమూ చెబుతుంది. మన ప్రాచీన శాస్త్రమూ, అలాంటివి - ఎన్నో చెబుతుంది.,
చంద్ర గ్రహణమూ, సూర్య గ్రహణమూ అలాంటివే. ప్రాచీన కాలంలో, చంద్రుడికో, సూర్యుడికో వెళ్ల గల సామర్థ్యం లేక పోవచ్చు. కానీ - అంతరిక్షాన్ని ప్రతి దినమూ, రాత్రీ అధ్యయనం చేసి - అంతరిక్షంలో యిలా జరిగితే - భూమి పై వాటి ఫలితాలు యిలా వుండవచ్చునని - మన ప్రాచీన శాస్త్రజ్ఞులు నిర్ధారించి - అది వొక శాస్త్రం గా తయారు చేసారు. అంతరిక్షంలో జరుగుతున్న విషయం నిర్దిష్టంగా - యిదే అని వారికి తెలియక పోవచ్చు.
అందుకనే రాహు కేతువులనే గ్రహాలు - సూర్య చంద్రులను పట్టుకోవడం వలన గ్రహణం ఏర్పడుతున్న దనే వొక కారణం చెప్పారు. శాస్త్రము ఎప్పుడూ, ముందటి కంటే గొప్ప, నమ్మ దగిన రుజువు దొరికితే - దాన్ని వదిలి పెట్టదు. పాత నమ్మకాల స్థానంలో క్రొత్త నమ్మకాన్ని పెట్టుకుంటుంది. ఏ శాస్త్రమైనా అంతే.
పూర్తిగా విశ్వసించ దగిన క్రొత్త రుజువు దొరికిన తరువాత కూడా - మనం పాత, అవిశ్వసనీయమైన రుజువు పెట్టుకో నవసరం లేదు. దాన్ని మార్చుకోవాలి. మన జ్యోతిష పండితులు - చాలా మంది - అలా క్రొత్త విషయాలను సహృదయంతో - తీసుకుంటున్నారనే చెప్పాలి. మన టీ.వీ. ప్రోగ్రాములలో - యిప్పుడెవరూ - రాహు కేతువులను గురించి మాట్లాడడం లేదు. భూమి నీడ చంద్రుడి పై పడడమూ, లేదా, చంద్రుడు భూమికీ సూర్యుడికీ మధ్య రావడం లాంటి - ఆధునిక శాస్త్ర ప్రజ్ఞానాన్ని వారు తీసుకుంటున్నారు .
అదే సమయంలో - చంద్రుడు - మన మనస్సులపై చాలా ప్రభావం కలిగివున్నాడనడానికి - చాలా శాస్త్రాధారాలున్నాయి. మన ప్రాచీన శాస్త్రంలోనూ, ఆధునిక మనస్తత్వ శాస్త్రంలోనూ. చంద్రుడికి, సముద్రానికీ, చంద్రుడికీ, కలువ లాంటి పూలకూ, చంద్రుడికీ, ప్రతి ప్రాణి మనోభావాలకీ -చాలా సంబంధమున్నట్టు - ఎవరైనా చాలా సులభంగా గ్రహించ వచ్చు. ఎందుకిలా - అంటే - ఆధునిక శాస్త్రం దగ్గర కూడా - పెద్దగా ఆధారాలు లేదు. యిది యిలా జరుగుతోంది - అంతే. అది మనం గమనిస్తున్నాము.
పూలపై అంత ప్రభావం వున్న చంద్రునికి - గ్రహణ సమయంలో - గర్భస్థ శిశువుపై కూడా కొంత ప్రభావం వుండొచ్చు నని - మన వారు ఎన్నో వేల ఏండ్లు గమనించారు, గనుకే, గర్భిణీ స్త్రీలు కొంత జాగ్రత్తగా వుండమని చెప్పారు. దీనికి కారణం - ఆధునిక శాస్త్రజ్ఞులకు యింకా అందక పోవచ్చు - గానీ - యిది కాదని చెప్పడానికి ఆస్కారం లేదు.
పౌర్ణమి నాడు - మనస్స్థితి సరి లేని వారిపై దుష్ప్రభావాలు పడడం - అందరూ చూస్తూనే ఉన్నాము. అదీ - కాదని చెప్పడం వీలు కాదు. కొంత జాగ్రత్త వహించడంలో తప్పు లేదు.
అయితే - ఈ నక్షత్రం వారికి ఈ ఫలితం, మరో నక్షత్రం వారికి మరో ఫలితం అని చెప్పడంలో - మన పూర్వీకులు - స్టాటిస్టికల్ గా ఏం గమనించారో, ఎలా గమనించారో మనకు ఆధారాలు లేవు. మనకు తెలీదు. వాటికి, యిప్పుడు, మళ్ళీ, స్టాటిస్టికల్ ఎనాలిసిస్ కావాల్సి వుంది. మన పూర్వీకుల వాక్కు ఈ విషయంలో సరిగా వుండచ్చు . వుండకనూ పోవచ్చు. కానీ తప్పని - వెంటనే నిర్ధారించ లేము. శాస్త్రం తప్పని చెప్పాలంటే - మళ్ళీ శాస్త్ర పరిశోధన చేయాల్సిందే. అంతే గాని - అంధ విశ్వాసమని, మూఢ విశ్వాసమని చెప్ప లేము; చెప్ప రాదు.
యిలా ఎన్నో విషయాలు - ప్రాచీనులు చెప్పిన వాటిని మనం మళ్ళీ స్టాటిస్టికల్ ఎనాలిసిస్ ద్వారా - తప్పా , వొప్పా - చూడాల్సిన అవసరం వుంది. అంతరిక్షంలో జరిగే ఎన్నో విషయాలలో కూడా - మన వారి గమనిక - భూమి నుండి చూసేంత వరకూ - సరిగ్గానే వుంది. కొన్ని వారికి తెలీని విషయాలు ఈ రోజు మనకు తెలియ వచ్చు గాక. కానీ - చాలా విషయాలలో - వారి గమనిక - చాలా అద్భుతంగానూ, తులనాత్మకం గానూ, నిజానికి చాలా దగ్గర గానూ వుందన్న విషయం మనం వొప్పుకోక తప్పదు.
మన ప్రాచీనులు ఆరితేరిన శాస్త్రజ్ఞులు. వారు శాస్త్ర పరిశోధన చేసినంత బాగా - ఈ రోజు భారత దేశంలో - జరగడం లేదనే చెప్ప వచ్చు. ఉదాహరణకు, ఆయుర్వేదంలో - వారు చెప్పినన్ని సూచనలు, మందులు, జాగ్రత్తలు - ఇప్పటి ఆధునిక వైద్య శాస్త్రానికి తెలీదని ఘంటా పథం గా చెప్ప వచ్చు. కాకపోతే - సర్జరీ వరకు - ఆధునిక వైద్యం ఎంతో ముందుకెళ్ళింది. అదే విధంగా - మందుల తయారీ విధానాలలో - ఆధునిక వైద్య శాస్త్రం ఎంతో ప్రగతి సాధించింది. అయినా ఆయుర్వేదంలో -ప్రకృతి ద్వారా సహజ సిద్ధమైన మందుల వాడకంలో సాధించిన ప్రగతి - ఆధునిక వైద్యానికి అస్సలు తెలీదనే చెప్పాలి.
దురదృష్ట వశాత్తూ - ఆధునిక వైద్యం ఈ విషయంలో - శాస్త్రీయ దృక్పథం లోనే లేదని చెప్పాలి. వేప, పసుపు, తులసి లాంటి దివ్య ఔషధుల విషయంలో కూడా - మన దేశం లోనూ- ప్రస్తుత కాలంలో పెద్దగా, పరిశోధనలు జరగడం లేదు. మరెక్కడానూ జరగడం లేదు. హనుమంతుడుతెచ్చిన మృత సంజీవని లాంటి ఔషధులు లేవని మనం చెప్ప రాదు. పరిశోధించాలి.ప్రతి ఆకు, ప్రతి కాయా, ప్రతి పూవూ, ప్రతి బెరడూ, ప్రతి వేరూ - ఎలాంటి ఔషదో - మనం పరిశోధించాలి .
కొన్ని సంవత్సరాలకు ముందు - మేం అప్పుడు వుంటున్న యింట్లో వొక చెట్టు వుండేది. మా యింటికి వొక వృద్ధుడు - ఏదో పనిమీద వచ్చాడు. ఆయన కాలిపై పెద్ద పుండు చాలా సంవత్సరాలు గా వుందట. అది, ఎంత మంది ఆధునిక వైద్యుల వద్దకు వెళ్ళినా పూర్తిగా నయం కాలేదట. కుంటుతూనే - మా యింటికి వచ్చాడు. ఆయన మా యింట్లో వున్న రోజు - మా యింటికి మరో అతను వొక గ్రామం నుండి వచ్చాడు. ఆయన పుండును చూసి - ఆయన ను అడిగాడు. తరువాత, మా యింట్లోనే వున్న చెట్టు ఆకు రసం తీసి ఆ పుండు పై పోసి, ఏదో రకంగా కట్టు కట్టాడు. ఆయన మా యింట్లో వున్న నాలుగు రోజుల్లోనే - సంవత్సరాలలో మానని ఆయన పుండు - శుభ్రంగా మానిపోయింది. యిది మా కళ్ళ ఎదురుగా జరిగిన అద్భుతం. అంటే - అన్ని - ఆంటీ బయోటిక్స్ కూ మించిన మందులు ప్రకృతిలోనే వున్నాయని శుభ్రంగా తెలుస్తూనే వుంది కదా. అప్పటి నుండీ - మేము కూడా, ఆయుర్వేద మందులు ఎక్కువగా వాడుతూ ఉన్నాము. వాటి సత్ఫలితాలను చూస్తూనే ఉన్నాము.
చరకుడు, సుశ్రుతుడు లాంటి మహర్షులు వేల సంవత్సరాలకు ముందు చెప్పినవే యిప్పుడూ చెప్పుకుంటున్నాము. కాబట్టి - మన వారు యింకా గొప్ప శాస్త్ర పరిశోధకులు కావాలి. శాస్త్రీయ దృక్పథం యింకా ఎక్కువగా అలవరుచుకోవాలి. చరకుడు చేసిన పరిశోధన కంటే ఉన్నతమైన పరిశోధనలు ఈ రోజు చేయాలి.
భారత ప్రభుత్వమూ - ఈ విషయంలో చైనా దేశం నుండి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో వున్నాయి. వారు - వారి శాస్త్రాల పైన యింకా ఎంతో పరిశోధనలు చేస్తూనే వున్నారు. మన దేశంలో ఉన్నంత శాస్త్ర పరిజ్ఞానం మరెక్కడా లేదు. ఆయుర్వేదమే కాదు. యోగ శాస్త్రం అంత కంటే వున్నత మైనది. గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, లోహ శాస్త్రము, అర్థ శాస్త్రము, యింతెందుకు , కామశాస్త్రం కూడా - మన దేశంలో పరిశోధించ బడినంత ఎక్కువగా - మరెక్కడా జరగలేదు.
నిజంగా రామాయణంలో చెప్ప బడిన గొప్ప వోషధులు - యిప్పుడు మన మధ్య మనకు తెలియ కుండా వుంటే - అంతకు మించిన మూర్ఖత్వమూ, అశాస్త్రీయ దృక్పథమూ మరోటి వుంటుందా? ఆ వోషధులు వుండే అవకాశాలు చాలా వున్నాయని నేను నమ్ముతున్నాను. అవి వెదకాలి.
అలాగే - జ్యోతిష శాస్త్ర విషయంలో - కూడా -ఎంతో స్టాటిస్టికల్ ఎనాలిసిస్ జరగాల్సి వుంది. ఈ శాస్త్రాన్ని కూడా - మూఢ నమ్మకమని - మూడ్హంగా కొట్టి పారేయనూ కూడదు. అలాగని - శాస్త్ర పరిశోధన చేయకుండా వుండనూ కూడదు.
ప్రకృతి రహస్యాలు శాస్త్ర పరిశోధకులకు అందాలంటే - ఇలాంటి - శాస్త్రీయ దృక్పథం మొదట అలవరుచుకోవాలి.
నాకు యోగ శాస్త్రం అంటే - చాలా యిష్టం. శ్రీ కృష్ణుడు చెప్పిన ధ్యాన యోగమూ, పతంజలి మహర్షి చెప్పిన యోగ సూత్రాలను రెండింటినీ బాగా అధ్యయనం చేసి - వాటి పై నా బ్లాగు - వైజ్ స్పిరిచువల్ ఐడియాస్. బ్లాగ్ స్పాట్.కాం లో సమగ్రమైన వ్యాఖ్య రాయడం జరిగింది. అదే విధంగా - నాకు ఆవకాశం వచ్చినంత వరకు, చాలా మంది యోగా గురువుల వద్ద, ట్రైనింగ్ తీసుకోవడమూ జరిగింది. ఆ తరువాత - నాకు తెలిసినంత వరకు - దాన్ని ప్రతి రోజూ, ఆచరించడమూ జరుగుతూ వుంది. ఈ యోగ శాస్త్రం పైన ప్రతి భారతీయుడికీ అవగాహన కల్పించి, కొంతైనా ట్రైనింగ్ యిప్పిస్తే - భారత ప్రభుత్వం - మనకు ఎంతో మేలు చేసినది అవుతుంది. ప్రభుత్వ ప్రాపకం, గుర్తింపు వుంటేనే - ఏ విద్య అయినా ప్రజలకు అందుతుంది.
ఈ మధ్య నాకు తెలిసి - చాలా మంది యువకులు - 25 , 27 వయస్సులో నున్న వారు - హార్ట్ ఎటాక్ తో మరణించడం జరిగింది. యింకా ఎంతో మంది యువకులు - మానసిక వొత్తిడి వలన, సరైన శారీరక, మానసిక వ్యాయామం లేని దాని వలన - అటువంటి భయంకరమైన వ్యాధుల వైపు వెళ్ళు తుండడం చూస్తూ ఉన్నాము. మన దేశంలో - యిలా జరగడం మంచిది కాదు. ఎక్కడైనా మంచిది కాదు.
యోగశాస్త్రం పుట్టిన దేశంలో - మానసిక వొత్తిడికి, యిటువంటి వ్యాధులకు చోటు ఉండరాదు.అంతే కాదు. ఎటువంటి హృదయ వ్యాధులూ రాకుండా నివారించ గలిగే - అద్భుతమైన ఆయుర్వేద మందులూ (హృదయామృత వటి, అర్జునారిష్టము లాంటివి ఎన్నో )మన దేశంలో వున్నాయి. ఇవేవీ తెలీకుండా - అసలు శాస్త్రీయ దృక్పథం లేకుండా - మనమూ, మన ప్రభుత్వమూ - వుండడం చాలా దురదృష్ట కరం.
ఈ మధ్య తమిళం లో "ఏళాం అరివు" -అంటే యేడవ యింద్రియం (సెవెంత్ సెన్స్) లేదా, యేడవ జ్ఞానము - అని వొక సినిమా వచ్చింది. అందులో - బోధిధర్మ - అనే బౌద్ధ బిక్షువు చరిత్ర ఆధారంగా - తమిళ నాడులో ప్రాచీన కాలం లో వున్న - రక రకాల పరిజ్ఞానాలను గురించి చిత్రీకరించడం జరిగింది. బోధి ధర్మ తమిళ దేశం నుండి చైనా కు వెళ్లి - అక్కడి వారికి, వైద్య శాస్త్రమూ, యుద్ధ కళలూ - ఎన్నో నేర్పించాడు. ఆయన బోధించినవన్నీ - యిప్పుడు - చైనా, థాయ్లాండ్ లాంటి ఎన్నో దేశాలలో వున్నాయి. ఆయనను దాదాపు - దేవుడి లాగా వారు పూజిస్తున్నారు అందరూ - యిప్పటికీ. అక్కడ ఆయనను గురించి తెలియని వారు లేరు. కానీ - దురదృష్టము ఏమంటే - ఆయన పుట్టిన తమిళ నాడులో - ఆయన పేరు కూడా ఎవరికీ తెలీదు. వారి చరిత్రలో కూడా ఆయన గురించి ఎక్కడా లేదు. అందుకనే ఆ సినిమా తీసారు.
మరి తెలుగు వారున్న దేశంలో - ఎలా వుంది. అక్కడా అంతే. రాముడు తిరిగిన దంతా - తెలుగు దేశంలోనే. కానీ - దాని గురించి - తెలుసుకోవాలనే తపన మనలో లేదు. కిష్కింద వున్న చోటు మనకు అక్కర లేదు. మన రాష్ట్రంలో వున్నన్ని కొండలు చాలా రాష్ట్రాలలో లేవు. ఏ కొండలో - ఏమున్నాయో మనకు తెలీదు. మన నదుల గురించి కూడా మనకు పూర్తి అవగాహన లేదు.
సరే. అవన్నీ వొక ప్రక్క. మన నన్నయ్య, తిక్కన, రామలింగడు, పోతన, శ్రీనాథుడు లాంటి మహాకవులు - తెలుగు కాస్త సంస్కరించినంత మాత్రాన - వారి విగ్రహాలను కూడా పగుల గొట్టే - వారు వచ్చారు. ముందుకెళ్లని భాష ఏదీ వెనక్కూ వెళ్లదు. చచ్చిపోతుంది. అదే చారిత్రాత్మక సత్యం. తెలుగు వారికి సంస్కృతం, హిందీ లాంటివి చాలా సులభం. మనకున్న ఆ సౌలభ్యం మనం పోగొట్టుకోరాదు.
యిప్పుడు కూడా కొంత మంది తెలుగు వారి ధారణా శక్తి ముందు - ప్రపంచమంతా తలవంచుకోవాల్సిందే. నేను దేశమంతా తిరిగాను కానీ - మన వారిలా, అష్టావధానాలూ,శతావధానాలూ, సహస్రావాధానాలూ యింత అవలీలగా చేయడం మరెక్కడా మనం చూడలేము.
దీనికి ఎన్నో కారణాలు. యివే కాక తెలుగు వారికి వున్న కొన్ని ప్రత్యేకతలూ - దీనికి కారణాలుగా మనం చూడొచ్చు. అవి తెలుగు వారు అందరికీ అందాలి కానీ - అందరికీ పోయేటట్టు ఈ రోజు విద్యా విధానమూ, కొందరు ప్రజల మనస్తత్వమూ మారి పోతోంది.
యిది మారాలని ఆశిస్తున్నాము. మనలో శాస్త్రీయ దృక్పథం పెరగాలి. మన శాస్త్రాల పట్ల గౌరవం పెరగాలి. అవి అందరికీ అందేటట్లు చూడాలి. వాటిని - యింకా ఎంతో పరిశోధించాలి. అందుకు - అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి.
=మీ
వుప్పలధడియం విజయమోహన్
" రాహు కేతువులనే గ్రహాలు - సూర్య చంద్రులను పట్టుకోవడం వలన గ్రహణం ఏర్పడుతున్న దనే వొక కారణం చెప్పారు. శాస్త్రము ఎప్పుడూ, ముందటి కంటే గొప్ప, నమ్మ దగిన రుజువు దొరికితే - దాన్ని వదిలి పెట్టదు. పాత నమ్మకాల స్థానంలో క్రొత్త నమ్మకాన్ని పెట్టుకుంటుంది. ఏ శాస్త్రమైనా అంటే. "
రిప్లయితొలగించండి"పూలపై అంత ప్రభావం వున్న చంద్రునికి - గ్రహణ సమయంలో - గర్భస్థ శిశువుపై కూడా కొంత ప్రభావం వుండొచ్చు నని - మన వారు ఎన్నో వేల ఏండ్లు గమనించారు"
"మన ప్రాచీనులు ఆరితేరిన శాస్త్రజ్ఞులు. వారు శాస్త్ర పరిశోధన చేసినంత బాగా - ఈ రోజు భారత దేశంలో - జరగడం లేదనే చెప్ప వచ్చు"
"అలాగే - జ్యోతిష శాస్త్ర విషయంలో - కూడా -ఎంతో స్టాటిస్టికల్ ఎనాలిసిస్ జరగాల్సి వుంది. ఈ శాస్త్రాన్ని కూడా - మూఢ నమ్మకమని - మూడ్హంగా కొట్టి పారేయనూ కూడదు. అలాగని - శాస్త్ర పరిశోధన చేయకుండా వుండనూ కూడదు. "
"యోగశాస్త్రం పుట్టిన దేశంలో - మానసిక వొత్తిడికి, యిటువంటి వ్యాధులకు చోటు ఉండరాదు...."
నిజం!
మీ విశ్లేషణ అద్భుతం ప్రతీ మాట ఆలోచింపజేసే విధంగా ఉంది!!