13, జనవరి 2012, శుక్రవారం

మానవీయ సంబంధాలు = యండమూరి వీరేంద్రనాథ్ = డాక్టర్ బీ.వీ.పట్టాభిరాం = వొక జ్ఞాపకాల వెల్లువ = ఏడవడంలోని సంతోషమూ, సంతోషంగా ఏడవడమూ - జీవితానికి ఎంత ముఖ్యమో


వొక జ్ఞాపకాల  వెల్లువ 

నేషనల్ అకాడెమీ ఆఫ్ టెలికాం ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ మన హైదరాబాద్ లోనే వుంది. అప్పట్లో - అంటే నేను అక్కడ వున్న రోజుల్లో - భారత్ సంచార్ నిగం వారి ఆధ్వర్యంలోచాలా, చాలా బాగా, జరిగేది. జరిపించే వాళ్ళం.

నేను అందులో  మానవీయ సంబంధాలు (హ్యూమన్ రిలేషన్స్) అండ్ మేనేజ్మెంటు విభాగానికి హెడ్ గా వుండే వాడిని.  ఎన్నో రకాల  ట్రైనింగులు, సెమినార్లు,వర్కు షాపులు - రకరకాల నూతన ప్రక్రియలతో నిర్వహించాము.


వొకరికొకరిని పరిచయం చేసే విధానం నుండి - అన్నీ - సరి కొత్త విధానాలే.  అన్నీ, ఎన్నో రకాలుగా యోచించి మేము  తీసుకొచ్చిన ప్రక్రియలే.

ప్రతి మనిషిలోనూ - వొక గొప్ప సృష్టికర్త -ఉన్నాడని - అతన్ని - బయటకు తీసుకు రావడమే - మనిషి చేయాల్సిన పని అని - మాకు బాగా తెలిసి వచ్చింది - అప్పుడే.

హైదరాబాదులో వున్న మన తెలుగు వారిలో - ముఖ్యంగా మానవీయ సంబంధాలలో  - చాలా గొప్ప రచయితలుగానూ, వక్తలుగానూ, పేరుపొందిన వారిని - భారత దేశానికంతా పరిచయం చేయాలని మేము ప్రయత్నాలు చేయడం జరిగింది. 

అందులో భాగంగానే - అప్పట్లో - యండమూరి వీరేంద్రనాథ్   గారిని,  డాక్టర్ బీ.వీ.పట్టాభిరాం గారిని , వారి సోదరుడిని , మరెంతో మంది - ప్రముఖులను ఆహ్వానించే వాళ్ళం.  

వీరేంద్ర నాథ్ గారి ప్రసంగము, పట్టాభిరాం గారి ప్రసంగము - వీటిలో - బయటి వారిని బాగా ఆకర్షించేవి.  సరే. మా అకాడెమీ లోని వక్తలలో - నేను. కల్యాణ్ సాగర్ గారని యింకొకరు - మా యిద్దరి  ప్రసంగాలూ -  చాలా బాగుండేవని - అందరి ప్రశంసలూ పొందేవి .  

వీరేంద్రనాథ్   గారిని -  ముఖ్యంగా వారి విజయానికి అయిదు మెట్లు ను గురించి మాట్లాడమనే వాడిని. ఆయనా - అది తనకిష్టమైన విషయం కాబట్టి - చాలా ఆకర్షణీయంగానూ, మనస్సులో హత్తుకుని పోయే లాగానూ మాట్లాడే వారు.

పట్టాభిరాం గారు - తనకు బాగా నచ్చిన ఏదో వొక విషయం పైన మాట్లాడే వారు. రక రకాల వుదాహరణాలతో,  చాలా ఆసక్తి కరంగా జరిపే వారు.

అన్ని రాష్ట్రాల నుండి - చాలా మంది మా ట్రైనింగ్ కు వచ్చే వారు.

క్లాసు రూములో - సాధారణ సంఖ్య ముప్పైకి మించరాదు. అటువంటిది - వద్దన్నా - వంద మంది వరకు భారత దేశమంతటి నుండీ వచ్చేసే వారు. మేమూ - వారిని నిరుత్సాహ పరచకుండా - రెండు క్లాసు రూముల్లో - వొకే సారి, వొక్కొక్క క్లాసు రూములో, యాభై మంది దాక ఎలాగో సర్ది - జరిపే వాళ్ళం.

మొదటి అంశం పరిచయం. నేనే చేసే వాడిని. నేను జరిపే పరిచయం ఎలా వుండేదంటే   -  వో ముప్పావు  గంటలో - క్లాసులోని ప్రతివొక్కరికి, అందరినీ - వారి పేర్లూ, వారి వూరి పేర్లతో  సహా జ్ఞాపకం వుండేటట్టు చేసే వాడిని.  మరి నాకూ గుర్తుండాలిగా. ఆ ప్రక్రియ వచ్చిన వారికి చాలా ఆశ్చర్యకరంగా  వుండేది. వచ్చిన వారిలో ఏ వొక్కరూ - తాము యాభై మంది క్రొత్త వాళ్ళను - వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన వాళ్ళను -  వారి పేర్లు, ఊర్లతో సహా మనుషులను కూడా 45 నిమిషాలలోగా గుర్తించగలమని    మొట్ట మొదట నమ్మగలిగే వాళ్ళు కాదు. కానీ - ఆ 45  నిమిషాల తర్వాత - అది చెయ్య లేని వాళ్ళూ ఎవరూ లేదు.

ఆ ప్రక్రియ మా ట్రైనింగ్ కు గట్టి   పునాదిగా మారింది.   అంతర్జాతీయ ప్రఖ్యాతి గల శివ్ ఖేరా లాంటి వారి ట్రైనింగ్ కు కూడా నేను వెళ్లాను కానీ - మా ట్రైనింగ్ లోని యిటువంటి అద్భుతమైన అంశాలు మరెక్కడా నాకు కనిపించ లేదు.

దానితో, వచ్చిన వారికి ట్రైనింగు పైన - చాలా గౌరవం వెంటనే కలిగేది. మానవీయ సంబంధాల పైన ట్రైనింగు కదా.

ట్రైనింగును - వొక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళే వాళ్ళం. అయిదు రోజులు అయ్యే సారికి - వారిలో - మేము కోరుకున్న మార్పు వచ్చి తీరాలని ప్రయత్నం చేసే వాళ్ళం. వచ్చిన వాళ్ళు ప్రతి వొక్కరూ, వచ్చినట్టు  వెళ్ళకూడదు. కొంత, నిరంతరమైన , సకారాత్మకమైన - మార్పు తోనే వెళ్ళాలి.
మొదటి రోజు - జీవితాన్ని - ఆట లాగా, పాట లాగా  హాయిగా, ఆనందంగా గడపాల్సిన అవసరం గురించి చెబుతూ - కడపటి రోజు ప్రతి వొక్కరూ, కనీసం వొక పాట లోని వొక చరణమైనా పాడాలని చెప్పే వాళ్ళం. అందుకని ప్రతి వొక్కరూ ప్రయత్నమూ చేసే వాళ్ళు. పాడే వాళ్ళు.   డాన్సు కూడా చేసే వాళ్ళు. చివరి రోజు, చివరి క్లాసు వాళ్ళదే. చాలా బాగా జరిగేది.

సరే. యండమూరి గారి క్లాసు చాలా విజ్ఞాన దాయకంగా జరిగేది. ఆయన యిచ్చే ఆలోచనలు - ప్రతి వొక్కరి మనస్సులోనూ హత్తుకు పోయేవి. మరి విజయానికి మెట్లు కదా. ఆయనను పరిచయం చేయడం మొదట నా సహ ఆఫీసర్లు లో ఎవరికైనా వొప్పగించే వాడిని. వారు - ఆయనను గురించి పేపర్లో రాసుకుని పూర్తిగా క్లాసులో చదివే వారు.

వొక్కో సారి నేనే చేసే వాడిని. యండమూరి గారి కథలు, నవలలు, అన్నీ- పత్రికలలో ప్రచురితమైనప్పుడే చదివిన వాడిని నేను. ఆయన జీవితం లోని - ముఖ్య సంఘటనలు, ఆయన విజయాలు అన్నీ బాగా తెలిసున్న వాడిని. సరే - ఆయనంటే - బాగా అభిమానమూ వున్న వాడిని అవడం వల్ల -  నాకు పేపర్లో రాసుకోవలసిన అవసరం లేదు. నేను పరిచయం చేయడంలో - ప్రతి సారి చాలా వైవిధ్యం వుండేది.  అది ఆయనకు బాగా నచ్చేది.

తరువాత, తరువాత   - ఆయన, నా పరిచయం మాత్రం మీరే చెయ్యండి - అనే వారు. నేనూ అలాగే చేసే వాడిని. ఆ తరువాత - ఆయన, విజయమోహన్ గారూ, నేను మాట్లాడడానికి ముందు మీరు వొక పది పదిహేను నిమిషాలు మాట్లాడరా, నేను వినాలి - అనే వారు. అప్పటికప్పుడు, ఏదైనా వొక విషయాన్ని గురించి మాట్లాడే వాడిని. అంతా మానవీయ సంబంధాల గురించే. అప్పట్లో - ఎన్నో వందల పుస్తకాలు చదివాను. వేల పస్తకాలు కూడా వుండొచ్చు.

అందులోని - అతి ముఖ్యమైన విషయాల గురించి, ఆ పదిహేను నిముషాలు మాట్లాడే వాడిని. ఆ తరువాత, యండమూరి - తన ప్రసంగం ఆరంభించే వారు.  యండమూరి, పట్టాభిరాం గార్ల ప్రసంగాలు - గొప్ప హై లైట్ గా చెప్పొచ్చు.

వొక రోజు - యండమూరి గారి కారు ఎక్కడో - ట్రాఫిక్ జామ్ లో యిరుక్కు పోయింది. కాస్త ఆలస్యం అవుతుందని వార్త వచ్చింది.   ఆయనకు తెలుసు - అంత వరకు - నేను కొన సాగిస్తానని. సరే. నేనూ ఏదో చెబుతున్నాను. కాని - వచ్చిన వాళ్ళు - సార్,  ఆఖరి రోజు మమ్మల్నంతా పాడమని అన్నారు కదా.  మీరు ఈ రోజు - వొక పాట   పాడండి - అని బలవంతం చేసారు. సరే. తప్పేదేముంది.

నేను పెద్ద గాయకుడిని కాను. కానీ - ఎవరైనా సరే. కొద్దో, గొప్పో పాడగలరు - అని నమ్మే వాడిని. ఆ రోజు - కభీ, కభీ - హిందీ చిత్రంలోని - కభీ,కభీ, మేరె దిల్ మే - అనే పాట కళ్ళు మూసుకుని పాడాను.

యండమూరి ఎప్పుడు వచ్చారో తెలీదు కానీ - పాటంతా అయిన తరువాత- నేను కళ్ళు తెరిచి చూస్తే -  క్లాసులోని అందరితో బాటు - ఆయన కూడా కరతాళ ధ్వనులు చేసేస్తున్నారు.

తరువాత - ఆయన పరిచయం చేసాను. మీరు పాటలో - బాగా లీనమై, చాలా బాగా పాడారని ఆయన మనస్ఫూర్తిగా అనడం - నాకు చాలా బాగా అనిపించింది.

నేను అప్పుడప్పుడూ వెళ్లి ఆయన క్లాసులోనూ, పట్టాభిరాం గారి క్లాసులోనూ వెళ్లి కూర్చుని, వినే వాడిని.

నా  ప్రసంగం -  లైఫ్ స్కిల్స్ - అనే అంశం పైన చేసే వాడిని. అందులో నేను చెప్పే విషయాలు - ఏ పుస్తకం లోనూ దొరకవు. నేను మానవీయ సంబంధాల పైన చేసిన రీసెర్చ్ ఫలితాలే. చాలా సులభంగా - ప్రతి వొక్కరూ - చేయ గలిగే అంశాలే. నేను చేయ లేనివి, నేను చేయనివి - నేను చెప్పకూడదని  సిద్ధాంతం   పెట్టుకున్నాను. అలాంటి అంశాలే చెప్పే వాడిని.

చిన్న రహస్యం - ఏమిటంటే - నా ప్రసంగం లో   - ప్రతి వొక్కరూ - చాలా సార్లు నవ్వాలి. కొన్ని సార్లు వారి కళ్ళల్లో నీళ్ళు రావాలి - యిది జరిగితేనే - నా ప్రసంగం విజయవంతం అయినట్టు - అని వొక  గోల్ / గుర్తు పెట్టుకున్నాను.

అది జరిగేది - కానీ, చివర అందరూ, మీరు బలే ఏడిపిస్తారు సార్ - అని సంతోషంతోనూ, వొక రకమైన సంతృప్తితోనూ, చెప్పే వారు.

ఏడవడంలోని సంతోషమూ, సంతోషంగా ఏడవడమూ - జీవితానికి  ఎంత ముఖ్యమో - ఎంత తృప్తి నిస్తాయో - అందరికీ తెలిసొచ్చేది. హృదయాన్ని కన్నీళ్లు ఎంత బాగా కడగ గలవో - నాకు సద్గురు జగ్గి వాసుదేవ్ గారి "భావ స్పందన" అనే యోగా ట్రైనింగ్ లో - చాలా బాగా తెలిసొచ్చింది.

మనిషికి ఈ రెండూ కావాలి. నవ్వ గలగాలి. యేడవ గలగాలి. తరువాత - ఆ రెండింటినీ -  దాటి పరిణితి చెందాలి. ముందుకెళ్లాలి.

మనిషి ఆనంద స్వరూపుడు. అది తెలుసుకున్న వాడే యోగి. ఆ ఆనందంలోనూ - కన్నీళ్ళున్నాయి. అదీ తెలుసుకోవాలి. రామకృష్ణ పరమ హంస ఎన్నో సార్లు సంతోషంతో కన్నీళ్ళు కార్చే వారు.

నిర్లిప్తంగా, నిర్వేదంగా - వుండటంలో - జీవితం సాఫల్యం చెందదు. ఆడండి. పాడండి. చిన్న పిల్లల్లా గంతులెయ్యండి. నవ్వండి. ఏడవాల్సి వస్తే, తృప్తిగా ఏడవండి. నిద్ర పోయేటప్పుడు - హాయిగా, ప్రపంచాన్ని మరిచి నిద్ర పోండి.

ప్రతి రోజూ, సృష్టి కర్త గా, సకారాత్మకంగా ఏదో వొకటి సృష్టించండి. ముఖ్యంగా - కనీసం వొకరి మనసులో, ఏదో కొంత, సంతోషాన్ని సృష్టించండి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

2 కామెంట్‌లు:

  1. ప్రతి రోజూ, సృష్టి కర్త గా, సకారాత్మకంగా ఏదో వొకటి సృష్టించండి. ముఖ్యంగా - కనీసం వొకరి మనసులో, ఏదో కొంత, సంతోషాన్ని సృష్టించండి.-చాలా మంచి మాట చెప్పారు సార్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వ్యాఖ్యకు , ప్రోత్సాహానికి చాలా సంతోషం. యిప్పుడు రాస్తున్న స్వగతం సీరీస్ కూడా చదవండి . మా అభిప్రాయాలు తెలుపుతూ వుండండి

      తొలగించండి