ఈ మధ్య మానభంగాల సంఖ్య చాలా ఎక్కువయిపోతోందని - అందుకు కారణాలేమిటని - మీడియా వారడిగిన వొక ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ డీ.జీ.పీ. గారు - అందుకు కొందరి ఆడవారి అర్ధనగ్న దుస్తులు, మితి మీరిన ఫాషన్లు కూడా కారణమని అన్నారట.
ఆ వొక్క మాటకు - (కొంత మంది) ఆడవారినుండి - తీవ్ర వ్యతిరేక స్పందన ఎదురైంది.
కానీ యిదే మాట ఢిల్లీ ముఖ్య మంత్రి షీలా దీక్షిత్ గారు కూడా అన్నారట. అసలింతకీ - ఈ విషయం వొక సామాజిక పరిశోధనలో తేలిన అంశమట.
ఎక్కువయి పోతోన్న మాన భంగాల సంఖ్యకు అర్ధ నగ్న, మితిమీరిన ఫాషను దుస్తులు కూడా వొక కారణం కాదా?
నిస్సందేహంగా - అది కూడా వొక బలమైన కారణమే అని - నా వరకు నేను డీ.జీ.పీ గారి పై మాటతో తప్పకుండా అంగీకరిస్తాను. నిజాన్ని చెప్పినందుకు ఆయన ఎవరికీ సంజాయిషీ యివ్వాల్సిన పని లేదు- అన్నది నా అభిప్రాయం. అదే మాట చెప్పిన షీలా దీక్షిత్ గారు -జీవితాన్ని మధించి చెప్పిన మాటే అది.
పాషన్ల పేరిట ప్రపంచం లోని అందరు మగాళ్లనూ - ఆకర్షించాలని కొందరు ఆడవారు చేసే ప్రయత్నాలు -అందరు ఆడ వాళ్ళ కొంప ముంచుతుందనడంలో నాకు సందేహం లేదు.
ఆడ-మగ మధ్య పరస్పర సంబంధాలు, ఆకర్షణలు,ప్రేమలు, పెళ్ళిళ్ళు, -ఈ వ్యవస్థకు పునాది నే పీకి పారేయాలని మూర్ఖంగా ఆలోచిస్తే - సమాజమంతా - అస్తవ్యస్తంగా తయారవుతుంది.
దుస్తుల విషయంలో, ఆడవారికి గానీయండి, మగ వారికి గానీయండి - పూర్తి స్వాతంత్ర్యం లేదు. వుండ రాదు.
వొకరిపై, వొకరికి గౌరవం వచ్చే విధంగా దుస్తులు వుండాలి గాని - సెక్సీ గా, ఆకర్షించే విధంగా వుంటే - ప్రమాదమే - అన్నది ప్రతి వొక్కరు తెలుసుకోవాలి.
మగ వారి విషయంలో - చాలా వరకు, దుస్తులు దేహాన్ని కప్పే వున్నాయి. ఎవరో, వొకరిద్దరు తప్ప.
ఎటుతిరిగీ - కొంతమంది (అందరూ కాదు) ఆడ వారే - సినిమాల్లో కానీయండి, టీ.వీ లో కానీయండి, మరీ బరి తెగించి ఎంత భాగం నగ్నంగా ప్రదర్శించ గలమా అని చూస్తున్నట్టు తెలుస్తూనే వుంది కదా. పైగా - అది నా యిష్టం అంటున్నారు.
అందుకు కొంత మంది మగ నిర్మాతలూ, దర్శకులూ కూడా చాలా, చాలా, కారణం గా వుంటున్నారు.
సరే. ప్రేక్షకుల్లో వొక భాగం - దీనికి బానిసలై పోతునారు. మందు కొట్టడం, పొగత్రాగడం లాగా, యిది కూడా వొక వ్యసనమే అని - ఆ వ్యసనానికి బానిసలైతే - మనం మరే మంచి పనీ చేయలేమని సమాజం గుర్తించాలి.
టీ.వీ. తెరిస్తే చాలు - ఈ అర్ధ నగ్న డాన్సులు ప్రత్యక్షమవుతున్నాయి. యివి మగ వారి మనస్సులో సెక్సు కాంక్షని కొద్దో, గొప్పోరేకెత్తిస్తాయి- అనడంలో అతిశయోక్తి లేదు. సమాజం మొత్తం వీటికి బానిసై పోతున్నారు . మరి యివి చూసి, చూసి, మగ వాళ్ళు పక్కన ఎవరున్నారా, వీధిలో ఎవరున్నారా - అని చూస్తే - అది ఎవరి తప్పు?
మన సమాజంలో - యివన్నీ తెలిసే - కొన్ని నిబంధనలు పెట్టారు. అలాగని - పైనుండి, క్రింది వరకు ముసుగులో దాచెయ్యలేదు. మగ వాడు చేసే తప్పుకు కూడా ఆడవారిని కొట్టి చంపాలని చెప్ప లేదు.
కానీ - ఎవరికైనా - ఎప్పుడూ -విశృంఖలమైన స్వాతంత్ర్యం లేదు. వుండ రాదు.వుంటే - అది కావాలనుకుంటే - మళ్ళీ ఆ సమాజానికి భవిష్యత్తు లేదనే చెప్పొచ్చు.
సరే. యిందులో - మగ వారి తప్పు లేదా? మగ వారి తప్పు లేకుండా - ఆడది తప్పు చెయ్య లేదు. అలాగే - ఆడ వారి తప్పు లేకుండా - మగ వాడు తప్పు చెయ్య లేదు.
మానభంగం జరిగితే - అది చేసేది - మగ వాడే కాని - ఆడది కాదుగా. అది మగ వాడి తప్పే. అందులో ఆవ గింజంత సందేహం కూడా అక్కర లేదు.
వొక ఆడది యిచ్చే నగ్న ప్రదర్శనలను - తప్పు అని మొట్ట మొదటే చెప్ప గలిగే - ధైర్యం మగ వాడికి వుండాలి. ఎందుకు? అది కొంప ముంచేది - మగ వాడినే గనుక!
మన పురాణాల్లో కూడా- యిది మళ్ళీ,మళ్ళీ చెప్ప బడింది. ఎక్కడో అడవిలో కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే విశ్వామిత్రుడిని - పనిగట్టుకుని వెళ్లి , మేనక చెడిచింది - ఇలాంటి అర్ధ నగ్న దుస్తులు, డాన్సులుతోనే కదా.
మరి తపస్సు చేసుకునే విశ్వామిత్రుడినే చెడప గలిగే లాంటి దుస్తులు, చాలా మంది ఆడ వారు వేసుకుంటే - జరిగేదేమిటి? మాన భంగాలు పెరగవా? కాక పొతే - రోడ్డు మీదో, సినిమా లో నో, టీ.వీ. లోనో - యివన్నీ చూసి, చూసి - మనసు పాడైన - కొందరు - ఎక్కడో దొరికిన చోట, ఎవరో అమాయకులను మాన భంగాలు చేసేస్తున్నారు. తప్పొకరిది. చేటొకరికి. మాన భంగం చెయ్య బడిన అమ్మాయి తప్పు అస్సలు లేక పోవచ్చు. కాని మరెక్కడో తప్పు జరిగింది.
అదే విధంగా - కేవలం డబ్బు కోసం - కొంత మంది నిర్మాతలు, దర్శకులు - ఇలాంటి అర్ధ నగ్న డాన్సులు, ప్రదర్శనలను ప్రోత్సహించడం వలననే - కొంత మంది ఆడ వారు యిలా చేస్తున్నారనడం లో కూడా - సందేహం లేదు. అంటే- సగం తప్పు మగ వారిది. సగం తప్పు ఆడ వారిది. కానీ - నష్టం అందరికీ.
తప్పును - తప్పు అని చెప్పే ధైర్యం మనకు లేదంటే - తప్పులే పెరుగుతాయి.
ఆడవారిపై, మగ వారికీ, మగ వారిపై ఆడవారికి -గౌరవం యిచ్చే లాగా యిద్దరి ప్రవర్తనా వుండాలి. అదే అందరికీ క్షేమం.
రోడ్డు పై నడిచే మగవారిలో - 25 శాతం మంది - సరే. కనీసం అయిదు శాతం మంది - సెక్సు కాంక్షతో - వుంటే - జరిగేదేమిటి?
యిది పోవాలంటే - సినిమాల్లో, టీ.వీ.లలో, ఆమ్మాయిలు వేసుకునే దుస్తులలో - కాస్త గౌరవ నీయత వుండాలంటే - తప్పేమిటో - నాకు తెలియడం లేదు.
మగ వారిలో - ఆడవారి పట్ల గౌరవం పెంచాలి - కానీ ఆకర్షణ ను కాదు - అన్న విషయం - అందరూ అర్థం చేసుకోవాలి.
అప్పుడే - గాంధీ గారు అన్న - "అర్ధ రాత్రి కూడా, ప్రతి ఆడది, వొంటరిగా, భారత దేశంలోని ఏ వీధిలో నైనా నిర్భయంగా తిరగగలిగే" - స్వాతంత్ర్యం వస్తుంది.
యిప్పుడి జరుగుతున్న కొన్ని సంఘటనలు వింటే, చదివితే, చాలా, చాలా బాధ కలుగుతుంది. మూడేళ్ళ పసిపాపను యింట్లో వారే , లైంగికంగా వాడుకున్నారట. మరో యింట్లో - డెబ్భై ఏళ్ళ ముసలమ్మపై అత్యాచారం జరిగిందట. వాళ్ళు మనుషులేనా - అన్న సందేహం మనకు రావాలి. అమ్మంటే గౌరవం లేదు. అవ్వంటే మర్యాద లేదు. అక్క చెల్లెళ్ళంటే కూడా ఏమీ స్నేహ భావం లేదు. యిలా తయారవుతున్నారు - కొంత మంది మగ వారు.
మరి కొంత మంది ఆడవారైతే - మామ గారి ఎదురుగా, తండ్రి ఎదురుగా, మరుదుల ఎదురుగా - ఇలాంటి సెక్సు ఆకర్షణ కలిగించే విధంగా తిరగొచ్చునా - అన్న విచక్షణ లేకుండా వున్నారు.
ఈ పధ్ధతి మారాలి.
కొన్నేళ్ళ క్రితం - దక్షిణ రైల్వే లోని - వొక ట్రైన్ రూటు లో - నేను ప్రతి రోజూ ఫస్టు క్లాసు, సెకండు క్లాసులలో - ఆఫీసుకు వెళ్ళే వాడిని. అప్పట్లో - ఆ రూటులో - స్త్రీ వేధింపు చర్యలు ( ఈవ్ టీజింగ్) చాలా, చాలా ఎక్కువగా వుండడం నేను చూసాను.
నా సహ ప్రయాణీకులతో ప్రతి రోజూ అనే వాడిని - మనమంతా కలిసి - ఈ రౌడీ వెధవల ఆగడం అరికట్టాలి - అని. వొక్కరంటే - వొక్కరు కూడా ముందుకు రావడానికి సాహసించ లేదు.
కొన్ని రోజుల పాటు చూసి, చూసి - వోర్చుకోలేక - పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ కు, జనరల్ మేనేజర్ గారికి - పెద్ద ఫిర్యాదు రాసి పంపించాను. వారి పోలీసు ఆఫీసర్లు - మా ఆఫీసుకు వచ్చి - నా వద్ద - రాసింది నేనేనా, నాకు యింకా చెప్ప వలసింది ఏదైనా వుందా - అని మాత్రం అడిగి తెలుసుకుని వెళ్ళారు.
అంతే. తరువాత - నెల రాజులు వారు తీసుకున్న చర్యల ఫలితంగా - ఆ రూటులో -యిప్పటి వరకూ స్త్రీ వేధింపు చర్యలు దాదాపు లేవనే చెప్పొచ్చు. కానీ - దురదృష్టమేమంటే - వొక్కరంటే, వొక్కరు, నాకు మొదట సపోర్టు యిచ్చిన వారు లేరు. అయినా నేను ముందుకు వెళ్లి పోయాను. అదృష్ట వశాత్తూ - దక్షిణ రైల్వే లోని - ఆఫీసర్లు చిత్త శుద్ధితో వ్యవహరించారు. అందువలన ఆ రూటులో - ఆడవారి సమస్యలు - తీరిపోయాయి.
సరే. ఆడదే , మరో ఆడదానికి సమస్యగా మారితే?
డీ.జీ.పీ. గారు చెప్పిన దానికి అర్థం అదే. ఆ పరిస్థితి కూడా మారాలి.
సరిగ్గా ఆలోచించే ఆడవారు, మగ వారు - అందరూ - వెర్రితలలు వేస్తున్న అర్ధ నగ్న దుస్తులను, శరీరాన్ని పూర్తిగా అంటుకుని, అంతటినీ - దాదాపు బహిర్గతం చేసే లాగున్న దుస్తులు మంచిది కావన్న సంగతి - మన పిల్లలందరికీ చెప్పాలి. అలాగే, ఐటం సాంగు పేరుతో - అశ్లీల ప్రదర్శనలు చేయించే నిర్మాతలకు, దర్శకులకూ కూడా చెప్పాలి.
లేదంటే - డీ.జీ.పీ. గారు చెప్పినట్టు - మానభంగాలను అరికట్టడం సుసాధ్యం కాదు.
చదివే వారిని - నేను కోరేదేమిటంటే - అయ్యలారా,అమ్మలారా, మీ అభిప్రాయాలూ చెప్పండి. మన పిల్లలు - తప్పు మార్గాల్లో వెళ్ళకూడదంటే - అందరూ క్షేమంగా, ఆనందంగా వుండాలంటే - సరైన సమయంలో - సరైన అభిప్రాయం చెప్పక తప్పదు.
దేశం పాడవడం చెడ్డ వాళ్ళ చర్యల కంటే - మంచి వాళ్ళ మౌనం వలన ఎక్కువ - అని అందరం గ్రహించాలి. ఈ విషయంలో అందరూ చేయి కలపండి.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి