18, జూన్ 2011, శనివారం

లక్ష్య సాధన = శరీర శక్తి = ఆలోచనా శక్తి = భావనా శక్తి - ఆధ్యాత్మిక లక్ష్యాలు - సామాజిక లక్ష్యాలు - ఆర్ధిక (యితర) లక్ష్యాలు


క్రిందటి వ్యాసంలో - లక్ష్య సాధనను గురించి, కొంత వరకు తెలుసుకున్నాము.

ఈ వ్యాసంలో - ఈ అతి ముఖ్యమైన అంశాన్ని గురించి మరి కొంత చూద్దాం.

అసలు లక్ష్యమంటే ఏమిటి?

యిది చాలా తేలికైన ప్రశ్నే.కానీ - ముఖ్యమైన ప్రశ్న.

లక్ష్యం అంటే - నిర్ణీత కాలంలో, నిర్ణీత గమ్యాన్ని   చేరాలనుకోవడం. ఇప్పుడున్న  స్థితి నుండి - యింత కంటే - మెరుగైన స్థితిని చేరుకోవడం.
నిర్దిష్టమైన మానవ ప్రయత్నం లేకుండా - అటువంటి మెరుగైన స్థితిని చేరుకోవడం  కష్టం.
అంటే - నిర్ణీత కాలంలో, నిర్ణీత మైన , యిప్పటికంటే  మెరుగైన, ఉన్నతమైన   గమ్యాన్ని , మన ప్రయత్నం తో   చేరాలనుకోవడం - లక్ష్య సాధన  ఉద్దేశ్యము అని  చెప్పొచ్చు.

సరే. అటువంటి లక్ష్యాలు ఎలా వుండొచ్చు  ?ఈ  క్రింది ప్రశ్నలను చూడండి.  

1 . మీరు ఏం కావాలనుకుంటున్నారు? (శారీరకంగా,  మానసికంగా, సంఘికంగా...)
2 . మీరు ఎలా వుండాలనుకుంటున్నారు  ?  
3 . మీరు ఏం చేయాలనుకుంటున్నారు  లేదా సాధించాలనుకుం టున్నారు?
4 . మీకు  ఏమేం కావాలనుకుంటున్నారు  ? ( ఇల్లు, డబ్బు, బిజినెస్సు  ...)
5 .  మీరు ఏమేం నేర్చుకోవాలనుకుంటున్నారు? (సంగీతం, నాట్యం, కరాటే, యోగ...)
6 . మీరు మీ చుట్టూ వున్నా వారిలో ఏమేం మార్పులు తీసుకు రావాలనుకుంటున్నారు? 
7 . మీరు దేని కోసమైనా - పోరాడాలనుకుంటున్నారా?  అందులో - మీరు సాధించ దలుచుకున్న లక్ష్యం / గమ్యం ఏమిటి?

అంటే - మీరు, మీలోను, మీ చుట్టూ వున్న వారిలోనూ - వొక నిర్ణీత కాలంలో - తీసుకురాధలుచుకున్న ఉన్నతమైన మార్పులనే - లక్ష్యాలని చెప్పొచ్చు.యిదే, యింకొక రకంగా చూద్దాం. 

  • మీకొక దేహముంది. అది ఎలా ఉండాలో - మీరే నిర్ణయించుకోవాలి.అది తప్పక వొక లక్ష్యగా వుండాలి. శరీరం ఆరోగ్యంగా వుండాలనేది కనీస లక్ష్యం. మనిషికి మొట్టమొదటిది శరీర శక్తి.   శరీరం ఆరోగ్యంగా లేక పోతే - మరే యితర లక్ష్యాలనూ - మనం చేరుకోవడం, సాధించడం - చాలా కష్టం. అందుకని - దేవుడిచ్చిన శరీరాన్ని - ఆరోగ్యంగా, బలంగా, వీలైనంత అందంగా పెట్టుకోవాలనుకోవడం -అందుకు - ప్రతి దినం ఏం చేయాలో - నిర్ణయించుకోవడం  చాలా ముఖ్యం. అలాగని - అదే - మన జీవితం యొక్క  ముఖ్య లక్ష్యంగా వుండ రాదు.మిగతా గమ్యాలను చేరుకోవడానికి - అది ముఖ్యమైన చేయూత. అంతే. ఆరోగ్యమే మహా భాగ్యమని - తెలుగులో అంటాము. అలాగే - ఆరోగ్యం పోతే - అన్నీ పోయినట్టే నని అంగ్లంలో  వొక సామెత వుంది. అది నిజమే.   
  • ఈ దేహాన్ని ఎలా బాగా పెట్టుకోవడం? చిన్న కొండ గుర్తు చెబుతాను. మీ దేహంలో - ఏ, ఏ భాగమైతే ప్రతి దినమూ - బాగా పని చేస్తుందో - ఆ యా భాగాలు - ఆరోగ్యంగా వుంటాయి. ఏ ఏ భాగాలు ఎక్కువ పని చేయ్యవో - అవి నీరసించి, శక్తి  లేకుండా పోతాయి. 
  • చేత వ్రేళ్ళతో ఎక్కువ పని చేసే వాళ్లకు - వ్రేళ్ళు బలంగా వుంటాయి. వీపుపై బరువులు మోసే వాళ్లకు , వీపులోని కండరాలు, కడుపులోని కండరాలు బలంగా వుంటాయి. బాగా నడిచే  వాళ్లకు, కాళ్ళు,  గుండె, ఊపిరితిత్తులు  ఆరోగ్యంగా వుంటాయి. యోగా ఆసనాలు చేసే వాళ్లకు - శరీరంలోని - అన్ని భాగాలు - సమానంగా - ఆరోగ్యంగా వుంటాయి. ఏదైనా - అతి సర్వత్ర వర్జయేత్ - అన్న సూక్తి జ్ఞాపకం పెట్టుకోవాలి.
  • శ్రీ కృష్ణుడు గీత లోని - ధ్యాన యోగంలో - ప్రతి విషయంలోనూ - మధ్యే మార్గమే వుండాలంటాడు. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర, ఎక్కువ ఆహారము, తక్కువ ఆహారము, ఎక్కువ తిరగడము, తక్కువ తిరగడము -  ఏదీ యోగానికి పనికి రాధంటాడు. యోగమంటేనే -  ఆరోగ్యకరమైన - జీవన విధానమే. 
  • ఆహారం విషయంలో - వీలైనంతగా - సాత్విక ఆహారం తీసుకుంటే - శరీరానికి శక్తీ వస్తుంది. మెదడుకు - ఆలోచనా శక్తీ పెరుగుతుంది. మనలో - ఆహ్లాదకరమైన, ఆనందకరమైన మనస్సూ వుంటుంది. తామసిక ఆహారం తీసుకుంటే - నిద్ర, కోపాలు, అసూయ, అలసట, సోమరితనం పెరుగుతుంది. రాజసిక ఆహారం తీసుకుంటే - ఎప్పుడూ దేని వెంటో - పరుగెడుతూ వుంటాము - కానీ - దేన్లోనూ- ఎక్కువ ఆనందాన్ని అనుభవించలేము  . 
  • యిక రెండవది   - మీ ఆలోచనాశక్తి. శరీరంలో - ఆలోచనా శక్తి లేక పోతే - శరీరమూ వుండదు. వున్నా ప్రయోజనము లేదు.  మీ ఆలోచనా శక్తి  ఎలా ఉండాలో - అదీ మీరే నిర్ణయించుకోవాలి.అదీ వొక లక్ష్యముగా  వుండాలి.మీ ఆలోచనా శక్తే - మీ శరీర ఆరోగ్యాన్ని , అది చేసే పనులను  నియంత్రిస్తుంది. ఇక్కడా మొదట చెప్పిన సూత్రమే వర్తిస్తుంది. ప్రతి రోజూ - మీ ఆలోచనా శక్తికి పని పెట్టాలి. మీకు తెలుసా- చాలా రకాల  టీ వీ  ప్రోగ్రాములు - మీ ఆలోచనా శక్తిని మొద్దు బరుస్తాయని? 
  • ఆలోచనా శక్తి  రెండు రకాలుగా పని చేస్తుంది.వొకటి - అది మిమ్మల్ని తన అధీనంలో పెట్టుకుని నడిపించ  గలదు. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలన్నిటిలోనూ - వొక ద్వైదీ భావం వుంటుంది. నిశ్చిత భావం వుండదు. యిదా, అదా అన్న సమస్యలో కొట్టు మిట్టాడుతుంటారు. ఏదో వొకటి చేద్దామని, ఏదో వొకటి చేస్తుంటారు. 
  • రెండవది - ఆలోచనా శక్తి - మీ అధీనంలో, మీరు చెప్పినట్టుగా పని చేయడం. యిప్పుడు - మీరు - మీ లక్ష్య సాధన గురించి తెలుసు కుంటున్నారు కదా. మీలో -ఎంత మంది - వెంటనే - తమ తమ లక్ష్యాలను - నిర్ణయించుకుని - వాటి సాధనకు నడుం బిగించుతారో  - వారికి - వారి ఆలోచనా శక్తి , వారి అధీనంలో పని చేస్తుంది. భగవద్ గీతలో - అతి ముఖ్యమైన - అర్జునుడి ప్రశ్న  - యిదే.   శ్రీ కృష్ణుడు  చెప్పేది యిదే. లక్ష్య సాధకుడి అధీనంలో ఆలోచనా శక్తి పని చేస్తుంది. మిగతా వారిని - అది తన అధీనంలో యిష్టం వచ్చినట్టు తిప్పుతుంది. 
  • మూడవది - భావనా శక్తి - మీలో ఎన్నో భావ తరంగాలు వస్తూ వుంటాయి. ప్రేమ, ఆనందం, వాత్సల్యం, స్నేహం, దయ, వీరత్వము, పగ, ద్వేషం, కోపం, అసూయ,  ఈర్ష్య  - ఇలాంటివి  ఎన్నో వున్నాయి. వీటిలో - మీకు  ఏది కావాలి; ఏది వొద్దనేది మీరే నిర్ణయించుకోవాలి.  ఎవరు, ఏది కావాలంటే - వారు అవి ఉంచుకోవచ్చు. 
  • మొదటి అయిదు సాత్విక గుణం. తరువాత రెండూ రాజసం, మిగతావి తామస గుణం. జీవితమంతా - తామసంలో గడిపే వారూ వున్నారు. ఎవరిని చూసినా - వారికి - అసూయ, ఈర్హ్య. ఎప్పుడూ యుద్ధాల్లో, కొట్లాటలలో, లేదో మరేదో ఎడతెరపి లేని పనుల్లో  (రాజస గుణం) గడిపే వారూ వున్నారు. 
  • మీరు సినిమాల్లోనూం, నిత్య జీవితంలోనూ కూడా - చూస్తుంటారు. మా తాతల కాలం నాటి నుండీ, మాకూ, వారికీ, పగ   అంటూ వుంటారు. లేదా మా కష్టాలన్నిటికీ వేరే ఎవరో కారణం అంటూ - ఏ పనీ చేయకుండా గడిపే వారూ వుంటారు. 
  • మన భావనలే, మన ఆలోచనల్ని శాసిస్తాయి. భావనకు తగిన ఆలోచనలు, వాటికి తగిన కారణాలూ వెదుక్కుంటూ వుంటాము.   వొక మంచి లక్ష్యాన్ని  ఎన్నుకున్న వాడికి - పైవన్నీ అడ్డంకులు కావు. వచ్చే అడ్డంకులు, మన పురోగతికి, మెట్లుగా తయారవుతాయి. 
  • లక్ష్యం లేని వాడికి - ప్రతిదీ - అడ్డంకే! ఏ మార్గమూ ఉపయోగం లేదు. 
  • ఆంగ్లంలో - ఆలీస్ యిన్ ది వండర్ ల్యాండ్ - అనే పుస్తకంలో వొక ప్రశ్న-జవాబు వుంది. ప్ర: ఈ దారెక్కడికి వెళ్ళుతుంది?  జ : నువ్వెక్కడికి వెళ్ళాలి? జ : తెలీదు?  జ: అయితే ఈ దారెక్కిడికి  వెళ్ళినా పరవాలేదు. వెళ్ళు!
  • చూసారుగా. లక్ష్యం లేని వాడు - ఎటు వైపు వెళ్ళినా - వొకటే. ఏ ప్రయోజనమూ లేదు. 
  • నాలుగవది - ఆధ్యాత్మిక లక్ష్యాలు. మీరు - మీ శరీరం, ఆలోచనలు, భావనలు మాత్రమేనా? శరీరం పోయాక మీరేమవుతారు? అసలు - మీరెవరు? యిది తెలుసుకోవడం - వొక గొప్ప లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో - అడుగడుగునా - మీకు - ఎన్నో ఆసక్తి కరమైన, ఆనంద కరమైన విషయాలు తెలుస్తాయి.
  • అయిదవది - సామాజిక లక్ష్యాలు. మనం బాగుంటే - చాలదు. మన ప్రక్క వాడూ బాగుండాలి. దేశమంతా  బాగుండాలి. దేశంలోని - ప్రతి వొక్కడూ - బాగుండాలి. సర్వే జనాః సుఖినో భవంతు. దీనికి - మనం ఏం చేస్తున్నాం. మన దేశం - రక రకాలుగా - కలిసి వున్నా, మానసికంగా విడిపోయి వుంది. ప్రతి వొక్కరినీ -  వొక్క త్రాటిపైకి తీసుకు రావలసిన అవసరం వుంది. ప్రతి వొక్కరినీ - ఆర్థికంగానూ, సామాజికం గానూ మెరుగు పరచ వలసిన అవసరం వుంది. 
  • విడ గొట్టే వాళ్ళ మధ్య - మనం కలిపే వాళ్ళుగా, కలిసే వాళ్ళుగా - వుండాలి. యిది కూడా వొక లక్ష్యమే. 
  • యింతకు మించి - లక్ష్యాలు లేవా? వున్నాయి. కాని  యివి ముఖ్యం. దీనిపై - మీరు ఎన్నో లక్ష్యాలు పెట్టుకోవచ్చు. పర్యావరణ రక్షణ వొక లక్ష్యం కావచ్చు. ప్రపంచానికి సంబందించిన ఏ విషయం పైన అయినా - పరిశోధనలు చెయ్యొచ్చు. ఆర్థికంగా - మీరు చాలా, చాలా డబ్బు సంపాదించొచ్చు. రాజకీయాల్లోనో, కళా రంగాల్లోనో   అశేష కృషి చెయ్యొచ్చు. క్రీడలలో కృషి చెయ్యొచ్చు.  ఉన్నత పదవుల కోసం కృషి చెయ్యొచ్చు.
  • మీరు ఏది చేసినా - ప్రతి రోజూ - నేను సంతోషం గా వున్నానా లేదా - అన్న ప్రశ్న వేసుకోవాలి.శారరకంగా, మానసికంగా, భావనా పరంగా - ముందుకెడుతున్నానా లేదా -  అన్నది చూసుకుంటూ వెళ్ళాలి.
  • అప్పుడే - లక్ష్య సాధన జీవితంలో - ప్రముఖ పాత్ర వహిస్తుంది.
  • దీన్లో , మరి కొన్ని - మెళకువలు  మరో సారి చూద్దాం.

=  మీ

 వుప్పలధడియం విజయమోహన్



14, జూన్ 2011, మంగళవారం

మీ లక్ష్యం ఏమిటి? మీరేం సాధించారు? మీరేం సాధించ దలుచుకున్నారు?


జీవితంలో ప్రతి వొక్కరికి ఏదో కావాలి.  ఏదో సాధిస్తే సంతృప్తి. జీవితం ధన్యమవుతుందన్న  వొక భావన.

ఏదైనా వొక గొప్ప (మంచి) లక్ష్యాన్ని సాదించాలన్న తపన అందరిలోనూ వుండాలి. ముఖ్యంగా యువకులలో  ఎక్కువగా వుండాలి.

యువతలో నేర్చుకునే వేగమూ, సాధించ గలిగే వేగమూ రెండూ  ఎక్కువగానే   వుంటుంది.

నేర్చుకున్న దాన్ని ఉపయోగిస్తే - వారి  వయసుకు  - ఫలితమూ ఎక్కువగా వుంటుంది.  

లక్ష్య సాధనకై శ్రమించ గలిగే శక్తీ చిన్న వయసులో ఎక్కువగా వుంటుంది. అందు వలన లక్ష్య సాధనను యువత మనస్సులోను, చిన్న పిల్లల మనస్సు లోను  ముఖ్యంగా, బాగా నాటుకునేటట్టు చేయాల్సి వుంటుంది. 

అయితే - మధ్య వయస్కులకు, వృద్ధులకు - లక్ష్య సాధన అక్కర లేదా? తప్పక  కావాలి.

ప్రతి మనిషిలోనూ, తమ ఆఖరి శ్వాస వరకు - ఏదో వొక లక్ష్య సాధనకు - కృషి జరుగుతూ వుండాలి. లక్ష్యము లేని వారి బ్రతుకు - త్వరగా - నిస్సారమై పోతుంది.

మనం ఎన్నుకొన్న లక్ష్యమూ- మనకు, సమాజానికీ మంచిది చేసేదిగా వుండాలి.సమాజ శ్రేయస్సుకు కీడు కలిగించే లక్ష్యాన్ని - ఎన్నుకోకూడదు. మనకు కీడు కలిగించేది  కూడా - లక్ష్యమనిపించుకోదు . ఉదాహరణకు - పెద్ద దొంగ గానో, దోపిడీ దారుగానో, హంతకుడిగానో పేరు తెచ్చు కోవడం - లక్ష్యమనిపించుకోదు.

లక్ష్యము వున్న వారిలో - శారీరకం గాను, మానసికం గాను  - చురుకుదనం  వుంటుంది.ఆరోగ్యం బాగా వుంటుంది. జీవితం ఆనందం గాను, చలాకీ గానూ గడిచిపోతుంది. 

జీవన లక్ష్యం అంటే - పుట్టినప్పటి నుండి  - చచ్చే వరకు - వొకే లక్ష్యం వుంటుందని కాదు.  లక్ష్యం అప్పుడప్పుడూ మారొచ్చు; మారకనూ పోవచ్చు.  

ఉదాహరణకు - చిత్రకారుల కుటుంబంలో పుట్టి చిత్రాలే లక్ష్యంగా ఎన్నుకున్న వారికి - జీవితమంతా వొకే లక్ష్యంగా వుండొచ్చు. మరొకరు, కలెక్టరు కావాలనుకున్నారనుకోండి . వారు - కలెక్టరు అయిన తరువాత, మరొక లక్ష్యం ఎన్నుకోవచ్చు. కలెక్టరు కాలేధనుకోండి. అప్పుడూ - లక్ష్యం మార్చుకోవచ్చు. ముఖ్యమైనది ఎమిటంటే -     మనకు నిజంగా యిష్టమైనది, సంతృప్తి నిచ్చేది లక్ష్యంగా ఎన్నుకోవాలి.

అయితే - మనం రెండు మూడు రకాల లక్ష్యాలనూ ఎన్నుకోవచ్చు- కాల పరిమితి యొక్క దీర్ఘతను బట్టి. 

ప్రతి మూడు నెలలకు సాధించ దగిన లక్ష్యాలను వొకటో, రెండో, ఎన్నుకోవచ్చు.  

ప్రతి సంవత్సరానికి  సాధించ దగిన లక్ష్యాలను ఎన్నుకోవచ్చు. 

ప్రతి మూడు - అయిదు సంవత్సరాలకు  సాధించ దగిన లక్ష్యాలను వొకటో, రెండో ఎన్నుకోవచ్చు. 

జీవితాంతం సాధించ దగిన లక్ష్యాలను వొకటో, రెండో ఎన్నుకోవచ్చు. 

అయితే - వీటన్నిటినీ - సమన్వయము చేసుకుంటూ - అన్నీ దాదాపు - వొకే మార్గంలో వుండేలా చూసుకుంటూ - కనీసం వొకదానికొకటి విరుద్ధం కాకుండా చూసుకుంటూ వుంటే - మనకున్న అమూల్యమైన కాలం వ్యర్థం కాకుండా వుంటుంది. 

ఉదాహరణకు - డాక్టరు కావాలనుకున్న వారు - మళ్ళీ లాయరు కూడా కావాలనుకోకూడదు. ఇంజనీరు కూడా కావాలని ఆశ పడకూడదు. ఏదైనా వొక మార్గంలో - వొక వృత్తిలో - ప్రావీణ్యత, గుర్తింపు సంపాదిస్తే - చాలు. వొక జీవిత కాలానికి - అంతకు మించి - సమయం లేదు. 

  అలాగే - ఏదైనా వొక కళలో -   కొంత  ప్రావీణ్యం  సంపాదించాలని వొక లక్ష్యం పెట్టుకోవచ్చు. ఈ కళనే వృత్తిగా పెట్టుకోవాలనుకుంటే - దానిలోనే ఎక్కువ కృషి చేయాల్సి వుంటుంది. 

మనకు - ఆర్థికంగా - ఎంతో కొంత అభివృద్ధి చెందాలి -అన్న లక్ష్యం కూడా వుండొచ్చు. అయితే - అది - మీ వృత్తి  , మీకున్న కళలు - వీటినుపయోగించే చేస్తే -   జీవితంలో - ఆనందమూ ఎక్కువగా వుంటుంది. ఆర్థికాభివృద్ధి కూడా వస్తుంది. 

ఆర్థికాభివృద్ధి మాత్రమే - ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న వారూ  - వుంటారు. తప్పు లేదు. అమెరికా లో - ఈ లక్ష్యమే - పెట్టుకున్న వారు ఎక్కువ. యమ్ బీ ఏ  డిగ్రీ  అందుకే  వచ్చింది. యిప్పుడు - డాక్టరు, ఇంజనీరు, లాయరు కంటే - అమెరికా లాంటి దేశాల్లో - యమ్ బీ ఏ  డిగ్రీ కే ప్రాధాన్యత ఎక్కువ. అందుకే - ఆ దేశం - ప్రపంచంలోనే - గొప్ప - సుసంపన్న దేశంగా వెలుగుతోంది.

మన దేశంలో - యిప్పుడు - ఇంజనీరింగు కు అలాంటి ప్రాధాన్యత మనం యిస్తూ ఉన్నాము. కానీ,  అది ఉద్యోగాల  వరకే పరిమితమయి పోతూ వుంది.  దానిలో - ప్రావీణ్యత సంపాదించాలంటే - మళ్ళీ - అమెరికాకే వెళ్ళాల్సి వస్తూ వుంది.  మన దేశంలో - యిప్పుడు - ఏ వృత్తికీ, ఏ కళకూ -  అత్యున్నత ప్రాధాన్యత యివ్వబడ లేదనేది వాస్తవం. యిది దురదృష్టం. మన దేశానికి - వొక ముఖ్యమైన లక్ష్యమంటూ - ఏదీ లేదనడానికి - యిది అద్దం పడుతూ వుంది.

మన దేశీయ ఆటగా హాకీ ని పెట్టుకున్నాము - కానీ- ఈ హాకీ - పంజాబులో కూడా యిప్పుడు కనిపించడం లేదు. అలాగే దేశీయ పక్షి గా పెట్టుకోక మునుపు మన దేశంలో - చాలా నెమళ్ళు వుండేవి. కానీ - యిప్పుడసలు కనిపించడం లేదు.  దేశానికీ - వొక లక్ష్యమంటూ వుండాలి. ఆ మార్గంలో - నడుస్తున్నామని - సర్కారు వారికీ తెలియాలి. మనకూ తెలియాలి. 

సరే. మన వ్యక్తిగత లక్ష్యాలకు వస్తాం.

ఏ లక్ష్యం సాధించాలన్నా - మనిషి వొక నిర్ణీత  పంథాలో  - వివేకంతో, వేగంతో, తన లక్ష్యం (లేదా గమ్యం) వున్న మార్గం లో - వెళ్ళాల్సి వుంటుంది. తనకు వున్న సమయాన్ని - బాగా, ఫలదాయకంగా ఉపయోగించాల్సి వుంటుంది.

దీన్నే ఆంగ్లంలో - టైం మేనేజ్మెంటు - లేదా తెలుగులో, కాల నిర్వహణ (కళ) అనవచ్చు. కాలాన్ని అత్యధిక ప్రయోజన కారిగా ఉపయోగించే  గొప్ప కళగా దీన్ని చెప్పుకోవచ్చు.


మనలో ప్రతి వొక్కరికి - దినానికి 24 గంటలే వున్నా- కొంత మంది ఆ సమయంలోనే - మిగతా వారికంటే - చాలా, చాలా ఎక్కువ ఫలితాన్ని సాధించే విధంగా - పని చేయడము  చూస్తూ వుంటాము.  మరి కొంత మంది - వున్న సమయాన్ని వ్యర్థంగా వెళ్ళ దీయడమూ చూస్తుంటాము. 

చిన్న పిల్లల వయసు నుండి - ఈ కాలాన్ని ఉపయోగించే కళ నేర్పాల్సిన అవసరం మన దేశంలో చాలా వుంది.  

కాలాన్ని దేని కోసం ఉపయోగించాలి ?

మనకని కొన్ని ముఖ్యమైన లక్ష్యాలో, గమ్యాలో వుండాలి.

వొకరు డాక్టరు కావాలనుకోవచ్చు. వొకరు సైంటిస్టు కావాలనుకోవచ్చు. మరొకరు గొప్ప క్రీడాకారుడో  , కళాకారుడో  కావాలనుకోవచ్చు.మరొకరు రచయిత కావాలనుకోవచ్చు. రాజకీయ వేత్త కావాలనుకోవచ్చు. 

ఏదయినా  - వారు,వారు, తాము కావాలనుకున్నది  పొందాలనుకుంటే  - తమకున్న కాలాన్ని, సమర్థ వంతంగా  వుపయోగించుకోవాలి. 

మనం కాలాన్ని సామాన్యంగా - ఎలా వుపయోగించుకుంటూ వుంటాము? 

నిద్ర -                                       7  నుండి   8 గంటల వరకు ;
ఆహారము - మూడు పూటలు -  1    నుండి 2  గంటలు; 
స్నానము, నిత్యకృత్యములు -    2    గంటలు ; 

ఆఫీసు, స్కూలు / కాలేజీ     -    8     గంటలు;
టీ వీ -                                -    2     గంటలు; 

యివి కాక - న్యూసు పేపరు, యింట్లో వాళ్ళతో మాట్లాడడము, స్నేహితులు, బంధువులతో మాట్లాడడము - మున్నగు వాటికి - మిగతా టైం సరిపోతుంది. 

మరి - మనం ఏదో కావాలనుకున్నాం కదా? దాని కెక్కడ టైం?

ఇదండీ సాధారణ మానవుని టైం మేనేజ్మెంటు  సమస్య.

జీవితంలో, ఏదో వొక నిర్ణీత గమ్యాన్ని చేరడంలో, విజయాన్ని సాధించే వారికీ,  మిగతా వారికీ - యిక్కడే తేడా వస్తుంది. 

మిగతా వారికి - ఆశలుంటాయి  . కానీ, దాన్ని సాధించడానికి కావాల్సిన , బలమైన సంకల్పశక్తి  వుండదు. వారు - తమ చిన్న,చిన్న పనులను వేటినీ వదులుకోరు. పెద్ద  గమ్యం సాధించాలంటే -  కొన్ని చిన్న చిన్న పనులను వదు లుకోవాల్సిన  అవసరం ఎంతైనా వుంది. 

విద్యార్థులు  కూడా -  పరీక్షల సమయం లో చదువుపైనే - సమయం వెచ్చిస్తారు  కదా. ఆ సమయంలో - టీ వీ లు,  సినీమాలు వదిలేసి చదివే వారు - చక్కగా పాసవుతారు కదా! 

అదే విధంగా - సంవత్సరంలో - ఎక్కువ కాలం చదువు పైనే - సమయం వెచ్చించే వారు - జిల్లా లోనో, రాష్ట్రం లోనో - మొదటి వారుగా వుత్తీర్ణులవడం చూస్తున్నాం కదా. అలా రావాలనుకునే వారికి - చదువే టీ వీ, చదువే  విశ్రాంతి, చదువే సంతోషాన్నిచ్చే పనిగా వుంటుంది. 

 ఏ యితర గమ్యం సాధించాలన్నా - యిదే మార్గం. బలమైన కోరిక, బలమైన కృషి వుండాలి.

మీరు క్రికెట్ లోనో, సంగీతం లోనో,  వొక సైంటిస్టు లా క్రొత్త వస్తువులు సృష్టించడం లోనో - గొప్ప వారు కావాలనుకుంటే - ఆయా రంగాల్లో, బలమైన కృషి చేయాల్సి వుంటుంది.   

విజేతలయ్యే వారికి -  కోరికతో బాటు, దాన్ని సాధించడానికి కావలసిన సంకల్పశక్తి, మనస్సులో పూర్తిగా వుంటుంది.  వారి మనసు తమ గమ్యం పైనే, లక్ష్యం పైనే  కేంద్రీకృతం అవుతుంది. 

వారికి - లక్ష్యం సాధించిన తరువాతనే - ఆనందం అనుకోకూడదు. లక్ష్య సాధనకు చేసే ప్రతి పనిలోనూ - ఆనందమే. అంటే - జీవితమంతా ఆనందమే.

జీవితంలో - మనం చేసే పనులు నాలుగు రకాలుగా వుంటాయి.

1 . కొన్ని పనులు అవసరమైనవి (అర్జెంటు); అంతే కాదు. ముఖ్యమైనవి (యింపార్టెంటు  ) కూడా. యివి వెంటనే చేసేయాలి. యివి జీవితానికి అతి ముఖ్యమైనవి; ఉదాహరణకు -మీ యింట్లో - ఎవరికో, ఆపరేషను చేయించాలి. యిది - అన్ని లక్ష్యాల కంటే - ముఖ్యమైనది. మనిషి వుంటేనే గదా లక్ష్యం. మన ఆరోగ్యం, మన వారి ఆరోగ్యం - మనకు - ప్రధాన లక్ష్యం. దీని వెనుకే - మిగతా లక్ష్యాలు. 

2 . కొన్ని - అర్జెంటు కావు. కానీ యివి మీ జీవితానికి చాలా, చాలా  ముఖ్యమైనవి. ఇవే - మీ లక్ష్యాలు. వీటికోసం, ప్రతి దినం కనీసం రెండు గంటల కాలం కేటాయించక తప్పదు. కనీసం అన్నాము. మీరు పది గంటలు వెచ్చించినా - మంచిదే. ఇవి ఈ రోజు అర్జెంటు కాదు, కాబట్టి, సాధారణంగా, చాలా మంది వీటిని  రేపటికి చూద్దాం, మాపటికి చూద్దాం - అంటూ వాయిదా వేస్తూ వుంటారు. జీవితంలో - విజేతలయ్యే వారికీ, కాని వారికీ - యిక్కడే తేడా వస్తుంది. మన లక్ష్య సాధన కోసం మనం, ప్రతి దినమూ, ఈ మాత్రమైనా - సమయం కేటాయించక తప్పదు. యిలా కేటాయించే వారు తప్పక విజేతలవుతారు. ఈ రోజు నాకు కావలసిన మనస్స్థితి (మూడ్) లేదు - అందుకని ఈ రోజు చేయను అని ఎప్పుడూ అనుకోరాదు.

3 . కొన్ని అర్జెంటు లాగా కనిపిస్తాయి. కానీ, మన జీవితానికి, లక్ష్య సాధనకు - అవసరం మాత్రం కానే కాదు. ఉదాహరణకు - మీ స్నేహితుడెవరో వున్నారు. ఆయన టెలిఫోను చేస్తున్నాడు. మీ లాగా ఆయనకు లక్ష్యమంటూ  ఏమీ లేదు. టెలిఫోను చేయడమే ఆయన లక్ష్యం. ఆయన టెలిఫోను చేస్తే - అది అర్జెంటు లాగా కనిపించొచ్చు. స్నేహితుడు గదా మరి.  యిటువంటివి - కొంత తగ్గించుకోవాలి. అలాగే - ప్రతి ఫంక్షనుకూ మిమ్మల్ని పిలుస్తూ వుంటారు. వెళ్ళక పోతే ఎలా - అనిపిస్తుంది. వొక సారి మీరూ, వొక సారి, మీ యింట్లో ఎవరో వొకరూ - యిలా వెళ్ళొచ్చు. వొకో సారి, ఏదో బహుమతి  ఎవరి ద్వారానైనా పంపించి   ఊరుకొవచ్చు. ఏది ఏమైనా - రోజు వారీ - లక్ష్య సాధనకు - కాలం కేటాయించి తీరాలి. దాని పై - మిగతా విషయాలు గమనించాలి.

4 .  చాలా విషయాలు - అర్జెంటూ  కావు. అవసరమూ కావు. టీ వీ సీరియల్సు ఈ కోవకే వస్తాయి. నాలుగు ఎపిసోడ్లు చూశారంటే - ప్రతి రోజూ - మీ లక్ష్యం అదే అయిపోతుంది. యిక అది చూసి తీరాల్సిందే అనిపిస్తుంది. మీ నిజమైన జీవన లక్ష్యాలేవీ మరి చేయలేరు. ముఖ్యంగా - పిల్లలకు, యివి అలవాటు చేయకండి. మీరూ చేసుకోకండి. 

చెప్పొచ్చే దేమిటంటే - మనం రెండో కోవ లో చూశాం గదా  - అవి మీ జీవన లక్ష్యాలు. అవి ఈ రోజు అర్జెంటు అని అనిపించకపోవచ్చు.  కాని - లక్ష్య సాధకులకు - అలా అనిపించి తీరాలి. అవి - చేసే కొద్దీ - లక్ష్య సాధనలో ముందుకెళ్ళే కొద్దీ - వాటిలో మీకు రుచీ పెరుగుతుంది. పట్టూ వస్తుంది. మీ నైపుణ్యమూ పెరుగుతుంది.  ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ - మీ జీవితంలో - మీరు పైకి ఎదుగుతారు. 

మన తుది  శ్వాస నిలవక ముందు - " నేననుకొన్నవన్నీ సాధించాను" అన్న తృప్తి -  మనలో రావాలి.  నా జీవితం బాగానే గడిచింది. అన్న సంతృప్తి రావాలి. అప్పుడే - మనం మన జీవితాన్ని బాగా గడిపినట్టు లెక్క. అవునా!!

ఇదండీ - టైం మేనేజ్మెంటు - లేదా తెలుగులో, కాల నిర్వహణ (కళ)!

= మీ
వుప్పలధడియం విజయమోహన్

7, జూన్ 2011, మంగళవారం

మానసిక వొత్తిడి = మీకు వొక బోనసు = ఉచిత గిఫ్టు


మీరు ఎప్పుడో వొకప్పుడు మానసిక వొత్తిడికి గురి అవుతూనే  వున్నారు.

అందులో - ఈ కాలంలో -మానసిక వొత్తిడి మరీ ఎక్కువై పోతూ వుంది. 

కారణాలు ఎన్నో వున్నాయి.

1 . తెల్లవారి లేచి - మీరు వార్తా పత్రిక చదివితే చాలు - మన రాజకీయ నాయకులు కానీయండి, రక్షక దళమని పేరున్న పోలీసులు కానీయండి,  సాధారణ ప్రజానీకంలో కొందరు కానీయండి. వారు చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు - చూస్తే - మానసిక వొత్తిడి తప్పక వస్తుంది. అందుకని - ఈ  విషయంలో విశేషంగా అధ్యయనం చేసిన వారు - చెప్పేదేమిటంటే - తెల్లవారి - న్యూస్ పేపరు చదవకండి. టీ వీ న్యూస్ చూడకండి. ఏం కొంప మునిగిపోదు. చదివితే, చూస్తే  - మీకు కొంతైనా    మానసిక వొత్తిడితప్పక వస్తుంది. 

2   తగ్గని రోగాలు వుంటే -   మానసిక వొత్తిడి వస్తుంది. 

౩. ప్రక్క నున్న మనుషులు -సూటి పోటి మాటలు మాట్లాడే వారైతే - మానసిక వొత్తిడి వస్తుంది.  మీరే -అలా మాట్లాడే వారైతే - వినే వారికీ వస్తుంది; మీకూ వస్తుంది.

4  మన దేశం మరీ యింత మోసంగా వుందే - అనుకుంటే -  మానసిక వొత్తిడి వస్తుంది. 

5 . ఆర్ధిక యిబ్బందులు, సాంఘిక యిబ్బందులు, సాంసారిక యిబ్బందులు   - మరీ  ఎక్కువైతే  మానసిక వొత్తిడి వస్తుంది. 

6 . ఆడవాళ్ళలో  - అత్త గయ్యాళి గానో   , కోడలు సోమారిగానో, మెట్టినింటిలో యిమడనిదిగానో, యింటి ఆడబిడ్డలు, మెట్టినిల్లు వదిలి, పుట్టినింటికి వచ్చి అక్కడి కోడళ్ళను గురించి చెడ్డగా మాట్లాడడమో యిలా చాలా కారణాల వలన  మానసిక వొత్తిడి వస్తుంది. యివన్నీ - చాలా యిండ్లలో  జరుగుతున్నా , చాలా మంది మారడం లేదు. 

7     దేశం లో  పెరిగిపోతున్న - సిగ్గు,ఎగ్గు పూర్తిగా వదిలేసిన, పూర్తిగా బరి తెగించిన  -  లంచగొండి తనాన్ని  చూస్తే -  మీకు మానసిక వొత్తిడి వస్తుంది.

యిలా - ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు. వీటిలో - వొక ముఖ్య కారణం - చాలా విషయాల్లో, మనం ఎదురు చూసింది ఎదురు చూసినట్టు జరగక పోవడం చాలా ముఖ్య కారణం. 

ఉదాహరణకు -

(1 ) బస్సు సమయానికి రాలేధనుకోండి  . అరగంటో, గంటో లేటయిందనుకోండి. కాచుకునున్న వారిలో -   చాలా మందికి  మానసిక వొత్తిడి వస్తుంది.బీ పీ పెరిగి పొతుంది.  బస్సు రాకపోతే - మీరేమైనా చేయ గలరా. ఏమీ చేయలేరు.  నిజమే - అవతల, ముఖ్యమైన పనులున్నాయి. అయినా- అటువంటి సమయాల్లో - సంయమనం పాటించడం నేర్చుకోండి.  మీకు బీ పీ రానంత మాత్రాన - నష్టమేమైనా వుందా? లేదు కదా. రావలసిన బస్సు రాలేదు. రాకూడని బీ పీ వస్తే -  ఎవరికి నష్టం.  కనీసం ఈ వొక్క నష్టమైనా రాకుండా - మీరు నివారించ గలరు. ప్రతి  సారీ  - బస్సు  వచ్చేంత  వరకు  - నేను  మానసికంగా ఉల్లాసంగా వుంటాను - అని నిశ్చయం చేసుకోండి. 

(2 )  మీరు పోలీసు స్టేషనుకు వెళ్ళారు లేదా మరేదో ఆఫీసుకు వెళ్ళారు  - ఏదో కంప్లైంటు యివ్వడానికి లేదా మరేదో కారణానికి. వారు మీకు పూర్తిగా సహకరిస్తారా? మీరు ఎన్ని సినిమాల్లో, సీరియళ్ళలో  చూసారు కదా. వారి పద్దతులేవీ మార్చుకోరు. మీరూ వోటు వేసేటప్పుడు యివన్నీ పట్టించుకోరు.  దేశం యిలాగే వుంటుంది. దీనికి బీ పీ పెంచుకుంటారు. శివ ఖేరా గారు అంటారు - మీ ప్రక్క వాడికి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు - వాడితో మీరు సహకరించండి. పది మంది చేరండి. మీకు సమస్య వచ్చినప్పుడు - వారూ సహకరిస్తారు. అప్పుడు మన దేశంలో వుందే - లంచగొండి తనం కాస్తైనా తగ్గుతుంది. మీ, మన అందరి మానసిక వొత్తిడీ తగ్గుతుంది. 

(3 ) పరీక్షల్లో మార్కులు రాలేదని  విద్యార్థులు ఆత్మ హత్య వరకు వెళ్ళుతూ వున్నారు. మార్కులు రావాలంటే - ముందుగా బాగా చదవాలి. చదవకుండా తరువాత మార్కులు రాలేదంటే, లాభమేమిటి. పరీక్షాపత్రాలు దిద్దే  వాళ్లకు వొక మనవి.  మీరు మానసిక వొత్తిడిలో వున్నప్పుడు  దిద్దకండి. దిద్దడంలో - అశ్రద్ధగా దిద్దకండి.  యిది విద్యార్థుల జీవన సమస్య. జ్ఞాపకం వుంచుకోండి.

(4 ) అన్నిటికన్నా  ముఖ్యం - జీవితంలో ఏది జరిగినా - నేను కదలను, ఆదరను, వొత్తిడికి లోను కాను. అన్న మనో భావన మన అందరికీ కావాలి.  ఈ భావన వుంటే చాలు - చాలా రోగాలు రావు. వచ్చినవి మందులు లేకుండా  కూడా నయమయి పోతాయి. నేను చేసే ప్రతి పనిలో - నాకు విజయమే రావాలి,  అపజయం నేను తట్టుకోలేను - అన్న భావన మూర్ఖత్వం; పిచ్చితనానికి సమానం. పని చేయడం మాత్రమే మీ చేతుల్లో వుంది. ఫలితం ఎందరి చేతుల్లోనో వుంది. ఉదాహరణకు - మీరు ఆస్పత్రికి పోవచ్చు. ఫలితం డాక్టరు చేతుల్లో వుంది. డాక్టరు మందులీవచ్చు.  ఫలితం మందుల తయారీ వాడి చేతిలో వుంది. వాడి మందులు తనిఖీ చెయ్య వలసిన అధికారుల చేతిలో వుంది.  మందులివ్వవలసిన  నర్సు చేతుల్లో వుంది. రోగాలొస్తే - మన జీవితం యిలా యిందరి చేతుల్లోకి వెళ్లి పోతుంది. 

మీ పిల్లలకు - 90 శాతం రాలేదా. పరవాలేదు. ఏం కొంప మునగదు. మన దేశంలో - 90   శాతం వచ్చిన వారిలో 50   శాతం క్లర్కులు గా స్థిరపడుతున్నారు  . మిగతా వారు (డబ్బున్న వారు) పై చదువులకు వెళ్లి ఆఫీసర్లవుతున్నారు. 60 శాతం  కంటే - తక్కువ వచ్చిన వాళ్ళు బిజినెస్సులలో స్థిరపడుతున్నారు. చదువు రాని వారు -  ఎంతో మంది రాజకీయాలలోకి వెళ్లి - వాళ్ళు  బాగుపడి, దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకు చెబుతున్నానంటే - 90 శాతం రాకపోతే -  మునిగిపోయేదేమీ లేదు. మీరూ, మీ పిల్లలూ మానసిక వొత్తిడికి గురి కావలసిన అవసరం లేదు.


ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసిన విషయం మానసిక వొత్తిడి - మీకు మీరుగా, మీరే అనుకుని, బోనసుగా, ఉచితముగా ,  మీరే కొని తెచ్చుకుంటున్న - అతి పెద్ద రోగం; రోగం కాని రోగం; రోగాలన్నిటికీ మూలమయిన రోగం. ఏ మందులకూ తగ్గని రోగం. మీ చేతిలోనే మందు వున్న రోగం.   

వచ్చే ప్రతి రోగం, ప్రతి బాధా, ప్రతి కష్టం - చాలా వరకూ మళ్ళీ వెళ్లి పొయ్యేవే.   పోనివీ కొన్ని వుంటాయి. అవి కూడా - మీరు మానసిక వొత్తిడి  తెచ్చుకోకుంటే, చాలా వరకూ తగ్గుతాయి. లేకున్నా పెద్దగా బాధ పెట్టవు.  మానసిక వొత్తిడి తెచ్చుకోవడమా, మానడమా - అనేది చాలా వరకూ మీ చేతుల్లోనే వుంది. 


మీరే చూడండి. వొకే రకం కష్టానికి - కొందరు - అస్సలేమీ బాధ పడరు. చేయ వలసినదేదో చేసి ఊరుకుంటారు.  కొందరు, చేసి, బాధపడుతూ వుంటారు. కొందరు - చేయకుండా - కూడా బాధ పడరు. కొందరు - చేయకుండా బాధ పడుతూ వుంటారు. అన్ని రకాల మనుషులూ వున్నారు కదా. మరి ఏది మేలంటారు.

చేయ వలసింది చేసి - మానసిక వొత్తిడి తెచ్చుకోకుండా వుండ గలరు. ఎంతో మంది వున్నారు కదా. మీరూ వుండ గలరు. మీరు అనుకుంటే.  

మొదట చిన్న చిన్న విషయాల్లో చేయండి. మీ పెన్ను దొరకలేదనుకోండి. వొత్తిడి లేకుండా ఉల్లాసంగా వెదకండి. దొరికిన పెన్ను రాయలేదనుకోండి. మళ్ళీ అదే లాగా, వేరే పెన్ను కోసం, ఉల్లాసంగా, వెదకడానికి ప్రయత్నం చేయండి. పప్పులో ఉప్పు లేదనుకోండి. ఈజీ గా తీసుకుని - ఉప్పు వేసుకోండి. యిలా చిన్న విషయాల్లో ప్రారంభిస్తే - సులభంగా - వొత్తిడి లేని జీవన శైలిని - మీరు పాటించ గలరు. యిది మీకు అనుభవమైతే - ప్రతి విషయంలోనూ - పెద్ద విషయాల్లో కూడా - అదే మానసిక స్థితిలో - ఉల్లాసంగా - పనులు చేసుకోగలుగుతారు.    చేసుకోలేక పోయినా బాధ పడరు.

1  దారి చివర వున్నా బిచ్చగాడికి లేని వొత్తిడి మీకెందుకు?

2 .జెయిల్ లో వున్న వారికి లేని  వొత్తిడి - మీకు  ఎందుకు?

3  కాళ్ళు, చేతులు, కండ్లు లాంటివి లేని వారికి లేని  వొత్తిడి - మీకు ఎందుకు?

4 . అస్సలు చదువే రాని వారికి లేని - వొత్తిడి మీకు ఎందుకు? 

5 . దేవుడు - మీకేన్నో ఇచ్చాడు. కొన్ని యివ్వలేదు. దేవుడు ఎవరికీ అన్నీ యివ్వ లేదు. యివ్వడు. కొన్ని రోగాలు కూడా యిస్తాడు. కొన్ని కష్టాలు కూడా యిస్తాడు. అది మీరు ఎలా తీసుకుంటారో చూడటానికే. దేవుడా- నేను నిన్ను అన్నీ అడుగుతాను. కానీ, నువ్వు, ఏమిచ్చినా, బాధ పడను - అనండి. ఏమిచ్చినా సంతోషం గానే  వుంటాను అనండి. చూద్దాం.అంటే మానసిక వొత్తిడికి - మందు మీలోనే వుంది. వొత్తిడిని సృష్టించే వారు  మీరే. మందూ మీ మనసులోనే వుంది. 

ప్రయత్నం చేయండి. సఫలీకృతులౌతారు.


= మీ

వుప్పలధడియం విజయమోహన్

5, జూన్ 2011, ఆదివారం

సంకల్ప శక్తి = మీలో వున్న అతి గొప్ప, దైవీక శక్తి సంకల్ప శక్తి = మీరు సంకల్పిస్తే తప్పక చేయ గలరు.

సంకల్ప శక్తి

మనిషిలో - అంటే మన  అందరిలో - ముఖ్యంగా మూడు రకాల శ క్తులున్నాయి.

సంకల్ప శక్తి (లేదా ఇచ్చా) శక్తి ; జ్ఞాన శక్తి ; క్రియా (ప్రయత్న లేదా కార్య) శక్తి

మొదట సంకల్ప శక్తిని గురించే చెప్పుకోవాలి. మీలో వున్న అతి గొప్ప, దైవీక శక్తి సంకల్ప శక్తి.

మీ సంకల్పం - మీ  జ్ఞాన శక్తి నుండే  పుట్టొచ్చు.  అయినా - లోకంలో మీ ద్వారా జరిగే ప్రతి పనికి -  మీ సంకల్పమే మూలకారణం.

అయితే, జ్ఞానం ఎంత వున్నా - వొక మహత్ సంకల్పం మీలో పుట్టాలంటే - జ్ఞానం మాత్రమే చాలదు. మరేదో - దైవీక సహాయమో లేదా ప్రకృతి  సంకల్పమో కూడా తోడుండాలి. 

సంకల్పానికి, మామూలు ఇచ్చాశక్తికి కాస్త వేర్పాటు వుంది. సంకల్పం అంటే - దృఢ నిశ్చయం.

యిక - అది జరిగి తీరాల్సిందే. సాధారణ మనిషి అనుకుంటే - అది 'ఇచ్ఛ' కావచ్చు. మహానుభావులనుకుంటే -  అది సంకల్పం అవుతుంది. మీ ఇచ్ఛ వెనుక దృఢ నిశ్చయం వుంటే - మీ ఇచ్ఛ కూడా సంకల్పం గా మారుతుంది .

మొట్ట మొదట - సృష్టికి మూల కారణము  - పరమాత్మ యొక్క  సంకల్ప శక్తే నని వేదాలన్నీ చెబుతాయి.

ఏ సృష్టి జరగాలన్నా - రెండు రకాల కారణాలుండాలి. . (1 ) కారణభూతమైన మనిషో / దేవుడో / మరేదో ప్రాణో వుండాలి.  (2 ) కారణభూతమైన వస్తువు - దేనినుండి సృష్టి జరిగిందో - అది వుండాలి. 

కాని - ప్రథమ సృష్టి కి రెండు రకాల కారణాలూ దేవుడే నని చెబుతారు.

'సృష్టి'  చేసిందీ దేవుడే.

తనలోనుండే ప్రతి వస్తువును, ప్రాణులనూ, అన్నిటినీ సృస్టించాడు.అంటే - కారణభూతమైన వస్తువూ తానే. చేసిన సృస్తికర్తా తానే.

కేవలం తన సంకల్ప శక్తి నుపయోగించి, తనలో నుండే ప్రపంచాన్ని సృస్టించ గలవాడు దేవుడు.

దేవుడు మనిషికి కూడా సంకల్ప శక్తి కొద్దిగా ఇచ్చాడు. ఈ సంకల్ప శక్తితో, దేవుడు ముందే సృస్టించిన వస్తువులతో, మనం కూడా, మరేదైనా నూతన వస్తువులను - సృష్టించవచ్చు.

దేవుడు యివ్వని వస్తువులతో సృష్టి చేయగల శక్తీ మనకి లేదు.
అంటే - దేవుడు - మనద్వారా, తన వస్తువులతో  - తన సృష్టి కార్యాన్ని కొన సాగిస్తాడన్న మాట. మనిషి వొక్కడే - దేవుడిచ్చిన సంకల్ప శక్తి నుపయోగించి, దేవుడి లాగా సృష్టి కార్యాన్ని చేయగలడన్న మాట.  మరే ప్రాణికీ దేవుడు ఈ శక్తిని ఇచ్చినట్టు మనకు కనిపించదు.

మనలో - యిది చెయ్యాలి, అది చెయ్యాలి - అని సంకల్పం ఎలా వస్తుంది. వొకడు యింజనీరు కావాలనుకుంటాడు.
వొకడు సైంటిస్టు  కావాలనుకుంటాడు . మరొకడు శిల్పి కావాలనుకుంటాడు .ఎవరెవరో ఏదేదో చేస్తూ వున్నారు. అలాగే - సృష్టించే వాడు వొకడైతే - వినాశన కర్త మరొకడు గా తయారౌతున్నాడు. ఈ సంకల్పాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి?

అన్నిటికీ కారణం మనమేనా? లేదా- దేనికీ కారణం మనం కామా?

ఈ రెండు ప్రశ్నలకు సమాధానం - వేరే వుంది.

భగవద్ గీతలో - ఆత్మైవ బంధు ; రిపురాత్మనః ; అంటాడు శ్రీకృష్ణుడు. యిక్కడ ఆత్మ శబ్దాన్ని - మనసు, మనసు తో బాటు వున్న బుద్ధి గురించి వాడారు.

మనసు - బుద్ధి మాట వినకుండా - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య , భయాలకు లోబడి వుంటే - తన మనసే తన శత్రువుగా వుంటుంది. మనసు బుద్ధి మాట వింటే - అదే మనసే - తనకు గొప్ప మిత్రుడుగా మారుతుంది.

గొప్ప మిత్రుడుగా వున్న మనసు, బుద్ధి మాట విని చేసే సంకల్పాలు - దేవుడి ప్రోత్సాహంతో వచ్చేవిగా వుంటాయి. వాటికి దేవుడి ఆశీర్వాదం కూడా వుంటుంది.  సంకల్పం మనదే అయినా - అర్జునుడి వెనుక కృష్ణుడు వున్నట్టు - మన  సంకల్పం  వెనుక దేవుడు కూడా వుంటాడు.

మనసు బుద్ధి మాట విననిదైతే - కామ, క్రోధ, భయాదులకు - లోబడినదైతే - మన సంకల్పం మనదే. దాని ఫలితాలను మనమే అనుభవిస్తాము. దైవ సహాయం వాటికి వుండదు. మన చుట్టూ - కామ, క్రోధాదులకు కావలసిన వస్తువులెన్నో వున్నాయి.  వాటికి బానిసైతే - దేవుడికి దూరమౌతాము.

అం టే - అవేవీ మనకు వద్దా? అన్న ప్రశ్న వస్తుంది.  ధర్మ, అర్థ, కామ, మోక్షాలన్నీ పురుషార్థాలే. 

కామమూ వద్దనాల్సిందేమీ  కాదు.  అర్థమూ (డబ్బు, నగలు లాంటివి)వద్దనాల్సిందేమీ  కాదు.

అవి బుద్ధికి లోబడి - ధర్మానికి లోబడి అనుభవించాల్సినవి.  అంతే. అప్పుడు - అవిచ్చే ఆనందం లో మీకు హాని జరిగేదేమీ లేదు.

నిజానికి కామ శాస్త్రమని - వొక గొప్ప సైన్సు  రాయబడింది మనదేశంలో మాత్రమే.   అలాగే అర్థ శాస్త్రం కూడా.

సరే. సంకల్పానికి వస్తే - మీరు వొక గొప్ప సంకల్పం చేసుకోండి. పైన చెప్పిన - బలహీనతలని ( భయం లాంటివి)  విడిచి పెట్టండి.

మీ సంకల్ప శక్తికి - మీ జ్ఞాన శక్తి, మీ క్రియా శక్తి తోడవుతాయి. మీ సంకల్పం స్వార్థ రహితమైనదైతే -  మీకు ప్రకృతి శక్తులన్నీ సహకరిస్తాయి. మీరు ప్రపంచానికి గొప్ప మేలు చేసిన వారవుతారు. 

మీ మనసులో  మీకు స్వార్థమే లేక పోయినా - మీరు ప్రపంచానికి చేసే మేలుకు  ప్రతిగా,  మీకు -ఎన్నో రెట్లు మేలు జరుగక మానదు. యిది ప్రకృతి నియమం.

మీలో - ఏ గొప్ప పనైనా చేయ గల,  అతి గొప్ప సంకల్ప శక్తి దాగి వుంది.

అది వుపయోగించని నాడు - మానవ జన్మ వృథా అయిపోతుంది.  

అది - ఉపయోగిస్తే  - సార్థకమయిపోతుంది.

యిది - మీ చేతుల్లో వుంది. 

=  మీ

వుప్పలధడియం విజయమోహన్


 

3, జూన్ 2011, శుక్రవారం

సంతోషపడటానికి = ఆనందంగా వుండటానికి = ఏం కావాలి మీకు ?


 

మానవ జీవితం చాలా చిత్రమైనది. మన జీవితం ఎందుకిలా పోతోందో మనకు తెలీదు. మరెలా వెళ్ళ  గలదో మనకు తెలీదు. రేపు ఏమవుతుంధో మనకు తెలీదు.

ప్రతి వొక్కరు మన పట్ల స్నేహ భావం కలిగి వుండాలని మన ఆశ. కాని - ప్రతి వొక్కరి పట్ల - మనం అలాగా వుండ గలుగుతున్నామా - లేదు గదా.

మనకు నూటికి నూరు మార్కులు రావాలని - మన ఆశ. కాని - దానికి కనీసం 5 , 6 గంటలు చదవాలంటే - మనకి యిష్టం లేదు. 

మనకు బాగా బలం వుండాలని మన ఆశ.  కాని - దానికోసం - ప్రతిదినం, కనీసం వొక గంట పాటు - దానికి 'కావలసిన' శారీరక పరిశ్రమ చేయడానికి బద్ధకం. 

బ్రూస్ లీ లాగానూ వుండాలి. ఆర్నాల్డ్ లాగానూ వుండాలి. కుదురుతుందా?  

కావలసినంత డబ్బు రావాలి. ఎలా వస్తుందో తెలీదు.
సంతోషంగా వుండాలి. ఎలాగో తెలీదు.

మనకు ఎన్నో కావాలని వుంది. ముఖ్యంగా - మనకు ఏం కావాలో - మనకు తెలీదు.

యిదీ - ప్రపంచంలో - చాలా మంది కున్న సమస్య.

మీ సమస్యలన్నిటినీ వొక ప్రక్కన వుండనీయండి.  

చెట్టుక్రింద గోచి పాత తో ఉన్న బిచ్చ గాణ్ణి కాస్త  గమనించండి. వాడికి - మీకున్నవేమీ లేదు. అయినా, వాడు - మీకంటే  సంతోషంగా వున్నాడు.

బ్రూస్ లీ కంటే సంతోషంగా వున్నాడు. ఆర్నాల్డు కంటే - అంబానీ కంటే - మన్మోహన్ సింగు కంటే - మీ వూరి యమ్ యల్. ఏ. / యమ్.పీ కంటే ,మినిస్టర్ కంటే సంతోషంగా వున్నాడు.  

మీకు - ఏమున్నా, లేక పోయినా - కనీసం ఆ బిచ్చ్చ గాడిలా - సంతోషంగా వుండ గలరు. అవునా, కాదా?

మీరు ఏ ప్రయత్నం చేసినా - దానిలోనూ - సంతోషంగా - వుండొచ్చు. 

మీకు నూటికి నూరు మార్కులు వచ్చినా - సంతోషమే.కాస్త తగ్గినా సంతోషమే. మరీ తగ్గినా దుహ్ఖం లేదు. 

మీ ప్రయత్నం ప్రకారం వచ్చిన మార్కులు ఎన్నైనా - అవి మీవే. అవే మీవి. మరొకరితో పోల్చుకుంటేనే    - సమస్య. అశాంతి. నేనింతే చేసాను. నాకింతే  వచ్చింది. అనుకుంటే - సంతోషమే గదా. 

బిచ్చ గాడు సంతోషంగా  వుండ గలడు. ఎందుకంటే - వాడు - మీతో తనను పోల్చు కోడు. బ్రూస్ లీ తో పోల్చు కోడు. రాష్ట్రంలో మొదటి వాడుగా వచ్చిన వాడితో పోటీ లేదు. ఏ యమ్ యల్; ఏ తో పోటీ లేదు. పోల్చుకుంటే, వాడికీ - సంతోషం కరువై పొతుంది.  ఉన్న ఆ వొక్కటీ పోగొట్టుకుంటాడు.
పోటీ పడని మనస్తత్వం లో  - ఎప్పుడూ సంతోషమే.
అలాగని - మీ పని  మీరు మానుకో నవసరం లేదు. మీకేదో కావాలని మీ యిష్టం. తప్పు లేదు. మీ మార్గంలో మీ పని మీరు చేయండి. మీ పనిలో - మీరు ఆనందాన్ని పొందండి  . ఎంత ఫలితం వచ్చినా సంతోషంగా - ఆనందంగా వుండండి. 

తన పనిలో ఆనందం పొందే వాడికి - ఫలితం ఏమొచ్చినా - ఆనందమే.  

ఈ ఫలితం వస్తేనే ఆనందం అనుకుంటే - పనిలో ఆనందం ఎగిరి పోతుంది.  జీవితమంతా - అశాంతి మయం - అయిపోతుంది.  ఫలితం వచ్చినా - ఆ ఆనందం కూడా - ఆ క్షణానికే పరిమితం అయిపోతుంది.  మళ్ళీ - మరేదో కావాలని , మరేదో చేయాలనే - తపన. 

జీవితంలో - ఎప్పుడూ - రేసు గుర్రంలా  - ప్రతి వొక్కరితో  పోటీగా  పరుగిడుతుంటే మాత్రం - మీ జేవితం ఎల్లప్పుడూ - పరుగే కానీ - ఆనందం వుండదు.

పరుగు  నిలిస్తేనే  ఆనందం. పది నిమిషాలు పరుగెడితే - యిరవై నిమిషాలైనా - నిలవాలి. మంచి గాలి పీల్చుకోవాలి. మన పరుగులోని - అనుభవాలను అనుభవించాలి. ఆనందించాలి.

యిది వస్తేనే ఆనందం; అది అలా అయితేనే ఆనందం - గెలిస్తేనే ఆనందం - అనుకుంటే - మీ జీవితంలో - ఎప్పుడూ ఆనందంగా వుండలేరు. 

వొక్క సారి గమనించండి.
ఈ నిమిషంలో - మీరు ఆనందంగా వుంటే - వద్దనే వాళ్ళెవరు? ఎవరూ లేరు. మీరు తప్ప. 

ఆనందంగా వుండడానికి - కారణమే అక్కర లేదు. 

చిన్న పాపను చూడండి. నిద్రలో కూడా, చాలా అందంగా , ఆనందంగా,  చిరునవ్వు నవ్వుతూ వుంటుంది. 

ఎందుకు ఆ నవ్వు.?  ఎందుకు  ఆ ఆనందం?

ఆ పాపకు నూటికి నూరు మార్కులు వచ్చాయనా? రాష్ట్రంలో మొదటిది గా వచ్చిందనా  ? ఖరీదైన బట్టలు వేసుకుందనా ? చాలా చాలా డబ్బు వుందనా?  అవేమీ కాదు కదా!

మరెందుకు ఆ ఆనందం? 

ఎందుకో తెలుసా? మీ స్వభావమే - ఆనందం. మీ ప్రకృతి ఆనందం. మీలో అంతు లేని ఆనందం వుంది. 

  పాప ఏడిచేది ఎప్పుడో తెలుసా? బయటి వస్తువు కావాలనుకున్నప్పుడు. 

తనలోని, తన ఆనందాన్ని మరిచిపోయినప్పుడు. 

మీరూ అంతే. 

బయటి వస్తువు కావాలనుకున్నప్పుడు;  అది లేక పోతే, ఆనందం లేదనుకున్నప్పుడు;  అప్పుడు మీలో అశాంతి.

అయిదు నిమిషాలు పరుగెత్తి వచ్చి - యింట్లో నేల పై పడుకుంటే -  మహా ఆనందం.

అయిదు నిమిషాలు మీ స్నేహితుడితో  మాట్లాడితే ఆనందం. ఆట్లాడితే   ఆనందం.

మనసులో - అది కావాలి, యిది కావాలి - అన్న అశాంతి లేకుండా -ఏ పని చేసినా ఆనందమే. 

ఆనందం మీలో వుంది. మీరు ఎప్పుడైనా ఆనందం గా వుండచ్చు.

అశాంతి - బయట ఉన్న ప్రతి దాని లోనూ - కాస్తో, కూస్తో  వుండనే వుంది. ఏది కావాలనుకున్నా  - దానితో  బాటు - కాస్త అశాంతి కూడా - మీకు  వచ్చి చేరుతుంది. 

అశాంతి విడిచి పెట్టటం మీ చేతుల్లో వుంది.  ఆనందంగా వుండడం మీ చేతుల్లో వుంది. 

మీరు ఆనందంగా వుండడానికి  - పెద్ద కారణం అక్కర లేదు.
చిన్న చిన్న విషయాలకు - ఎంతో - ఆనందంగా వుండొచ్చు.  అది మీ యిష్టమే.

ఆకాశాన్ని - చూస్తే ఆనందం గా వుండచ్చు. నీళ్ళను చూస్తే ఆనందం గా వుండచ్చు. చెట్లను చూస్తే ఆనందం గా వుండచ్చు. చంద్రుడిని చూస్తే ఆనందం గా వుండచ్చు. నక్షత్రాలని చూస్తే - ఆనందంగా వుండచ్చు . వీటికి డబ్బేం అవసరం లేదు.

ఇక్కడినుండి, వొక్క ప్లేనులో - దుబాయికి వెళ్లి - అక్కడి ఆకాశమూ, నీళ్ళూ చూసి సంతోష పడే ధనవంతుడి కన్నా - మీ యింటి పై మీరు పడుకుని మీ యింటి పై ఉన్న ఆకాశము, మీ యింటిపై ఉన్న చంద్రుడు, నక్షత్రాలూ  చూసి సంతోష పడడం ఎంతో  మెరుగు. మీ సంతోషమే చాలా చాలా గొప్ప. 

సంతోషపడటానికి - మనసులో -  కాస్త చోటుండాలి.   అంటే - సంతోష పడ గలిగే, పడే, అలవాటున్న మనసుండాలి .

మనసు ఖాళీ లేదనుకోండి - సంతోషానికి స్థలం లేదు. అంతే.
 
 మరి - మీ యిష్టం.


= మీ

వుప్పలధడియం విజయమోహన్

1, జూన్ 2011, బుధవారం

బాబా రాందేవ్ జీ = అన్నా హజారే = మన్ మోహన్ సింగు = మనం

నేనూ బాబా రాందేవ్ జీ   గారి హైదరాబాదు  "యోగ శిబిర్" లో వారం రోజుల పాటు   యోగ శిక్షణ పొందిన వాడినే. 

వారి దగ్గర  నేర్చు కున్న  ప్రాణాయామాలు, ఆసనాలు, ధ్యానము యిప్పటికి చాలా ఏండ్లుగా సాధన చేస్తూ వున్న వాడిని. నేనే కాదు, నా భార్య కూడా నేర్చుకుని సాధన చేస్తూ వుంది. 

సరే. నేను - యింకా కొంత  మంది  గురువుల దగ్గర కూడా "యోగ సాధన" లోని చాలా పద్ధతులు, మెలకువలు నేర్చుకున్నాను.

అయినా - నా అభిప్రాయం ప్రకారం - ఆరోగ్య సాధన కు  - బాబా రాందేవ్ జీ గారి పద్ధతే చాలా బాగుంది.  మీ రోగాలన్నీ తప్పకుండా తగ్గుతాయని ఆయన యిచ్చే ఆశ్వాసనే మనలో సగం రోగాల్ని మాయం చేస్తుంది. ఎంత దీర్ఘ రోగి అయినా ఆయన పలుకులు, ఉపన్యాసాలు విని - వొక యోగా శిబిర్ వెళ్లి వస్తే - తప్పకుండా, ఆయన పద్ధతులు వాడుతారు. దాని సత్ఫలితాలు తప్పకుండా పొందుతారు. దీనికి తోడు, ఆయుర్వేదం. 

మహాత్మా గాంధీ గారి తర్వాత - యింత ఎక్కువగా "భారత్ దర్శన్" నిజంగా చేసిన వారు -  నాకు తెలిసి బాబా రాందేవ్ జీ  గారు మాత్రమే.యింత మంది ప్రజలకు ఆశ్వాసమిచ్చిన  వారూ ఆయన వొక్కడే.

ఆయన అభిప్రాయంలో - మన దేశం లో వున్న నల్లధనం, మన దేశం వెలుపలికి వెళ్ళిన నల్ల ధనం బయటికి వస్తే - మన దేశం - బాగా ధనవంతమైన దేశం గా మారిపోతుంది. యిది జరిగితేనే - నిజమైన లంచగొండులను కనిబెట్ట వచ్చు. వారి అక్రమాస్తులను ప్రభుత్వం స్వాధీన పరుచుకోనూ వచ్చు.      

అన్నా హజారే గారు జరుపుతున్న ఉద్యమం కు ముందునుండే   - రాం దేవ్ జీ  గారు - ఈ విషయాలను గురిం ఛి తన యోగ శిబిర్ లలో  మాట్లాడే వారు.
మనది వొక రకం గా నిద్ర పోతున్న దేశం. ప్రజలను నిద్ర నుండి మేల్కొలపాలి. మనకు శారీరక ఆరోగ్యమే కాదు. మానసిక ఆరోగ్యమూ, ధైర్యం రెండూ రావాలి. 

మన పాలక వర్గం యొక్క మానసిక ఆరోగ్యమూ బాగు పడాలి. వారికీ -చట్టం  పైన, న్యాయం పైన గౌరవం  రావాలి. Yippudavi చాలా మంది లో తక్కువని తెలుస్తూనే వుంది కదా. 
డబ్బు కున్న విలువ - నిజమైన మానవ విలువలకు లేక పోయింది. 

అందుకే రాం దేవ్ జీ గారు నడుం కట్టారు.వారికీ - అన్న హజారే గారికీ - మన  బలాన్నీ కలుపుదాం.

నా ఉద్దేశంలో - మన - ఇప్పుడున్న ప్రధాన మంత్రి, మన్ మోహన్ సింగు గారి ఆధ్వర్యంలో - యిటువంటి చాలా మార్పులు జరిగే వీలున్నది. 

వ్యక్తిగతంగా - ఆయన చాలా, చాలా, మంచి, గౌరవనీయ, ధార్మిక  వ్యక్తి. అటువంటి వ్యక్తులకు ప్రజలు డైరెక్టు గా వోటు వేసి గెలిపిస్తే - ఈ దేశం సులభం గా బాగు పడుతుంది.  కానీ అది జరుగదు. మనం, కుల, మత, పార్టీ ల లాంటి  ప్రాతిపదికల పైనే వోటు వేసి, వేసి, అలవాటు పడ్డాం.

అయినా - ఆయన ప్రధాన మంత్రి కావడం కొంత అదృష్టం. ఈ సమయంలో యిన్ని స్కాములు బయటికి రావడం, దీనికి అన్నా హజారే గారు, రాందేవ్ జీ గారు ముందుకు వచ్చి పోరాడడమూ అదృష్టమే. మన్ మోహన్ గారి కున్న రాజకీయ శ్రుంఖలాలు  కొన్ని - యిప్పుడు తొలిగి  పోవచ్చు.
యిది తరుణము.. విడిచినన్ దొరకదు. అన్న పాత పాట ప్రకారం - ఈ సమయంలో ప్రజలదరూ - కలిస్తే - వీరికి చేయూత నిస్తే -  వీరితో బాటు కలిసి - మన్ మోహన్ సింగు గారు - కావలసిన చట్టాలు తీసుకొస్తారని మనం నమ్మ వచ్చు. చేయవలసిన  విచారణలూ జరుగుతాయి. ఇది కాక - మన సుప్రీం కోర్టు వారు కూడా - ఈ విషయంలో గట్టిగా నిలబడుతున్నారు  కాబట్టి - 

అన్నా - రాం - మన్ మోహన్ గార్ల కలయికలో చాలా గొప్ప మంచి  దేశానికి జరుగుతుందని ఆశిద్దాం. వారికి - మన చేయూత నిద్దాం. 

ఈ సమయం - దేశం మంచి కోరే ప్రతి వొక్కరు మాట్లాడ వలసిన సమయం.  మాట్లాడండి మరి. పై ముగ్గురిని - సకారాత్మకం గా కలపడమే మన పని. మిగతాది - వారే చేసేస్తారు.


= మీ

వుప్పలధడియం విజయమోహన్