23, డిసెంబర్ 2011, శుక్రవారం

నన్ను చేరడానికి నాలుగు మార్గాలు? నీవెవరో తెలుసుకో?

ఆంగ్లంలో వొక నానుడి వుంది.

  • ఆయనకు తెలుసు. తనకు తెలుసుననీ ఆయనకు తెలుసు. ఆయన విజ్ఞుడు. మనం ఆయనను అనుసరిద్దాం.
  • మరొకాయనకు తెలుసు. కానీ, తనకు తెలుసునని ఆయనకు తెలీదు. ఆయన వొక రకమైన నిద్రలో వున్నాడు. తన జ్ఞానాన్ని వుపయోగించ లేని స్థితిలో వున్నాడు. ఆయనను నిద్ర లేపుదాం.
  • యింకొకాయనకు   తెలీదు. కానీ, తనకు తెలీదనే సంగతి ఆయనకు తెలుసు. ఆయన నేర్చుకో గలిగే స్థితిలో వున్నాడు.ఆయన విజ్ఞుడి దగ్గరకు వెళ్లి నేర్చుకోవాలి.
  • మరొకాయనకు తెలీదు. కానీ, తనకు తెలీదనే విషయం కూడా ఆయనకు తెలీదు. తనకు తెలుసనే భ్రమ లో ఉన్నాడు. తెలిసినట్టు ఏదేదో వాగుతున్నాడు. అటువంటి వారి చాయలకు కూడా వెళ్ళకండి.  వారు చాలా ప్రమాద కరమైన వ్యక్తులు.
యిలా నాలుగు రకాల మనుషుల గురించి ఈ నానుడి వుంది. ఏ విషయానికైనా - ఈ నాలుగు రకాల మనుషులూ వుంటారు.

క్షుణ్ణంగా తెలుసుకొని, అధ్యయనం చేసి, ఉపయోగిస్తున్న వారు విజ్ఞులు. వారు, తమ విజ్ఞత వలన తాము  ప్రయోజనం పొందుతున్నారు.  అందువలన, అటువంటి వారి వద్దకు మనమూ వెళ్లి, వారి విజ్ఞతను మనమూ పొందచ్చు.

మరి కొంత మందికి - కొన్ని విద్యలు వారికి తెలుసు. కాని, అవి తమకు తెలుసునన్న విషయమే వారు మర్చి పోయారు. హనుమంతుడు సర్వ విద్యా సంపన్నుడు. కాని - ఎవరైనా ఆయనకు చెప్పాలి. అప్పుడే అవన్నీ ఆయనకు  గుర్తుకు వస్తుంది.

కొంత మందికి కనీసం తమకు తెలీదన్న విషయం తమకు తెలుసు. వ్యాధి వస్తే, వైద్యుడి దగ్గరకు వెళ్లాలని, చదువుకోసం స్కూలుకెళ్ళాలని, వొక్కొక్క పని కోసం - ఆ పనిలో నిష్ణాతులైన వారి వద్దకు వెళ్లాలని - మనకు తెలుసు. మనకు  తెలీని విషయాలు నిజంగా తెలిసిన వారి దగ్గర నేర్చుకోవాలి.
కానీ - కొంత మంది - సరైన సమయానికి - సరైన వారి వద్దకు వెళ్ళకుండా కాలయాపన చేయడం, చిక్కుల్లో పడడం మనం చూస్తూనే ఉన్నాము. వీరు నాలుగో రకం మనుషులు. తమకు తెలీదు. తెలీదనే విషయం కూడా తెలీదు.  అంతే కాదు.తెలీని విషయం తెలిసినట్టు భ్రమలో వుండటమే కాకుండా - మిగతా వారికి ఉచిత సలహాలు యివ్వడము,  తాము చిక్కుల్లో పడడము, చుట్టూ వున్న వారిని చిక్కుల్లో పెట్టడము ఎన్నో సార్లు - అన్ని రంగాల్లో మనం చూస్తున్నాము. 

మనకు క్షుణ్ణంగా  తెలిసిందేది? తెలీనిది ఏది? యిదైనా మనకు తెలిసుండాలి.

మీకు రెండు చేతులున్నాయి. అది మీకు స్పష్టం గా తెలుసు. దానికి నమ్మకంతో మరి పని లేదు. నాకు రెండు చేతులున్నాయని నేను నమ్ముతున్నాను - అని మీరు చెబితే అది హాస్యాస్పదం. మీకు తెలీని విషయానికే   నమ్మకమో, అప నమ్మకమో కావాల్సి వస్తుంది.

మీ ముత్తాత గారెవరో మీరు చూడలేదు. మీ నాన్నగారికి వారి నాన్న గారు చెబుతుండగా, వారు విని మీకు చెబితే- వోహో, ఔనేమో - అని మీరు  అనుకున్నారు. అది మీకు తెలిసిన విషయం కాదు; మీరు నమ్మే విషయం. తెలిసిన విషయం వేరు. నమ్మే విషయం వేరు. తెలిసిన విషయాన్ని నమ్మాల్సిన పని లేదు. తెలీని విషయాన్నే - మనం నమ్మొచ్చు. లేదా, నమ్మక పోవచ్చు. తెలిసిన విషయం తెలిసిన విషయమే. దానికి నమ్మకం అక్కర లేదు.

దేవుడు వొక నమ్మకం. ఆత్మ వొక నమ్మకం.  శివుడు, స్వర్గం, నరకం, శని, డెవిల్, ఇంద్రుడు, ఏంజెల్, అల్లా యివి నమ్మకాలు. మనం చూడలేదు.  నిజంగా వున్నాయో, లేదో తెలీదు. ఏదో పుస్తకాల్లో రాసున్నాయి. మీరొక పుస్తకం నమ్మొచ్చు. నేనొక పుస్తకం నమ్మొచ్చు. మరొకరు మరొక పుస్తకం నమ్మొచ్చు.

ఈ గ్రంధాలతో వచ్చిన చిక్కు ఏమిటంటే - మీరు నమ్మాలి. నమ్మి తీరాలి. అవేం చెప్పినా, ఎంత నమ్మలేని మాట చెప్పినా - మీరు నమ్మి తీరాలి. లేకుంటే - మీకు స్వర్గం లేదు. లేకపోతె మానె. మీరెంత మంచి వారైనా - మీకు నరకం తప్పదు. యిలా చెప్పే గ్రంధాలెన్నో వున్నాయి. కొన్ని కొన్ని దేశాలలో - మేమంతా స్వర్గానికి పోతున్నాము. మీ మాటేమిటి? అనే పెద్ద బోర్డులు  కనిపిస్తాయట .

ఎవరి పిచ్చి వారికానందం. కాకపొతే - వారి వారి పుస్తకాల్లో వున్నది నమ్మి, పొరుగువారితో యుద్ధానికి దిగుతున్నారు.  నమ్మకం పరమైన యుద్ధాలు - స్వార్థ పరమైన యుద్ధాల కంటే - చాలా ఎక్కువ.అదీ ప్రస్తుత కాలంలో. యిది చాలా దురదృష్టం.

మన దేశంలో కూడా - దేవుడు, స్వర్గము వీటిపై నమ్మకాలు వున్నాయి. అయితే - ఈ పరిధిని, మన ధర్మ శాస్త్రాలు ఎప్పుడో దాటేసాయి. యివి లేవని శాస్త్రాలు చెప్పడం లేదు. అయితే - మంచి వాడెవడైనా - స్వర్గానికి అర్హుడే అన్నది సిద్దాంతం. మీకు దేవుడిపై నమ్మకం వున్నదా, లేదా అన్నది అక్కర లేని ప్రశ్న.

మంచి వాడి మార్గాన్ని కర్మ మార్గం లేదా కర్మ యోగం అన్నారు. వీడు దేవుడిని నమ్మక పోయినా ఫరవా లేదు. మన దేశంలో - దేవుడిని నమ్మని చార్వాకులు, జాబాలి లాంటి ఋషులు కూడా వుండేవారు. ప్రపంచం లోని  - అన్ని రకాల నమ్మకాలూ - మన దేశంలో - ప్రతి యుగంలోనూ వుండేవి. వీరికీ - అంటే, వీరిలోని మంచి వారికి - స్వర్గ ద్వారాలు తెరిచే వుంటాయి.

దేవుడిని నమ్మే మంచివారిది - భక్తి మార్గం అన్నారు. ప్రహ్లాదుడిది దాదాపుగా భక్తి మార్గమనే చెప్పొచ్చు.  శబరి, గోపికలు, హనుమంతుడు -ఇలాంటి భక్తులు - అప్పుడూ వున్నారు. యిప్పుడూ వున్నారు. భక్తి కాస్త జ్ఞానంతో కూడిన భక్తీ కావచ్చు. కన్నప్ప లాంటి వారి మూఢ భక్తీ కావచ్చు. వీరికి స్వర్గ ద్వారాలు మరింతగా తెరిచి వుంటాయి. "యిందు గలడందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే" అంటాడు ప్రహ్లాదుడు. దేవుడు లేని యిసుక రేణువు కూడా ప్రపంచంలో లేదని చెబుతాడు. అయితే - భక్తుల విషయంలో వారిది నమ్మకమా - నిజంగా వారికి తెలుసా - అని మనం చెప్పలేం. మొదట నమ్మకంగా వుండొచ్చు. కొంత మందికి అది నిజంగా కూడా మారొచ్చు.

ప్రహ్లాదుడు - దేవుడు, అన్ని చోట్లా వున్నాడన్నాడు.

కాని కొంత మంది - దేవుడు ఎక్కడో, స్వర్గంలోనో, వైకుంఠం లోనో, కైలాసంలోనో - వున్నాడనుకుంటారు.  ఏది నిజం? తెలీదు. అన్నీ నమ్మకాలే. మీరు చూడగలిగితే, విన గలిగితే, అనుభవించ గలిగితే - మీకు అది అనుభవైక సత్యం. లేకుంటే - వుట్టి నమ్మకం.

మీరు విష్ణు భక్తులను కోండి . మీరు చచ్చాక - మిమ్మల్ని కైలాసం తీసుకు వెళ్ళారనుకోండి ? పైకెళ్లినా -   మీ వేదన సులభంగా పోదు. మళ్ళీ - ఆయన చెప్పాలి. ఆయనా, నేనూ వేరే కాదు. వొకటే. వూరికే యిప్పుడు ఫ్రెండ్సు గా వున్నాం. అంతే - అని.  నమ్మకాలలో - యిటువంటి - అపనమ్మకాలకు చాలా చోటుంది. భక్తిలో పూర్తి నమ్మకం వుండేది - కొద్ది మందికే.

చాలా మందికి  భక్తి - స్వర్గ ద్వారానికి వెళ్ళే, వొక అపనమ్మకాలతో నిండిన, మార్గం మాత్రమే.  దేవుడిని మనం చూడలేదు. కొన్ని గ్రంధాలలో వ్రాసిన కథలలో హీరో గారే దేవుడు. మనకు తెలిసిందల్లా అంతే. కాని - భూమ్మీద జరిగేవన్నీ చూస్తుంటే - వొక్కో సారి - అపనమ్మకం ఎక్కువై - దేవుడిపై నమ్మకం సన్నగిల్లుతుంది. జీవితమంతా- నమ్మకాలు, అపనమ్మకాల మధ్య గడిచిపోతుంది - చాలా మందికి.

మరొక మార్గం  జ్ఞాన మార్గం. దేవుడున్నాడు - కానీ, నాలోనే వున్నాడు. నేనే ఆ దేవుడిని - నా అజ్ఞానం తొలిగితే నేనే దేవుడిగా మారిపోతాను - అన్నది జ్ఞాన మార్గం. యిది కాస్త మోటుగా చెప్పాము. మరి కాస్త నిశితంగా అర్థం చేసుకోవాల్సి వుంది.
నేనెవరు? - అన్నది మన ధర్మ శాస్త్రాలలో మొదటి ప్రశ్న.    నేనెవరు - అన్నది తెలియకుండా - మరేదీ క్షుణ్ణంగా, తెలుసుకోలేరు. దేవుడి సంగతి దేవుడెరుగు. మొదట నేనెవరో కూడా నాకు తెలీకుండా వుందే-  అన్న మధన కొంత మందిలో వుంటుంది. దీనికి సమాధానం జ్ఞాన మార్గం. మొదట మీరెవరో తెలుసుకోండి.

అవి తెలుసుకునే మార్గంలో - దేవుడి లాంటి మరెన్నో విషయాలు కూడా మీరు తెలుసుకుంటారు.స్వర్గం వుంటే - ఆ స్వర్గానికి వెళ్ళేదెవరు? నా దేహం భూమిపైనే వుండి పోతోంది కదా? మరి నేను - అనే ఆ నేను ఎవరు? స్వర్గం మాట తరువాత చూద్దాం. నేనెవరో తెలుసుకోవాలి ముందు - అన్నది జ్ఞాన మార్గం.

చాలా దేశ  సంస్కృతులలో  కర్మ మార్గం వుంది. భక్తి మార్గం వుంది. కానీ, నాకు తెలిసినంత వరకు - జ్ఞానం మార్గం భారత దేశం లో మాత్రమే వుంది. అదీ - అతి పురాతన కాలం నుండీ వుంది. వేదాలు, ఉపనిషత్తుల కాలం నుండీ వుంది.

వేదాలలో "నేనెవరు" అన్న దాన్ని గురించి మనకు తెలియజేసే "మహావాక్యాలు"  చాలా వున్నా  - వాటిలో ప్రముఖంగా నాలుగిటిని చెబుతాము.

  • ప్రజ్ఞానం బ్రహ్మ - (ఋగ్వేదం - ఐతరేయ బ్రాహ్మణం) :- దీనికి అర్థం గొప్ప జ్ఞానమే బ్రహ్మ అని. బ్రహ్మ లేదా దేవుడు అంటే - మరేం లేదు - ప్రజ్ఞానమే, విశిష్టమైన జ్ఞానమే  -  బ్రహ్మ. 
  • అహం బ్రహ్మ అస్మి - నేనే  బ్రహ్మ గా వున్నాను. (యజుర్వేదము - బృహదారణ్యక) :- బ్రహ్మ అయినటువంటి ఆ ప్రజ్ఞానం మరేదో కాదు. అది నేనే.
  •  తత్ త్వం అసి :- (సామ వేద - ఛాందోగ్యం) :- ఆ బ్రహ్మ మరెవరో కాదు. అది నేను గానే వున్నాను. అది నేనే.
  • అయం  ఆత్మా బ్రహ్మ (అథర్వణం - మాండూక్య) ;- ఆత్మ నైన నేనే బ్రహ్మను.
నాలుగు వేదాలూ - ఘోషించే మహావాక్యాలివి. యివి నిజమా? కాదా?

మరి నేనే బ్రహ్మ నైతే - నేనెందుకిలా వున్నాను.  జీవితమంతా ఏదో తప్పులు చేస్తున్నాను. నవ్వుతాను. ఏడుస్తాను. సంపాదిస్తాను.ఖర్చు పెడతాను. పుడతాను. చస్తాను. నేనెలా బ్రహ్మ నౌతాను. నా భార్య ఎలా బ్రహ్మ అవుతుంది. బ్రహ్మ నైన నాతో ఎప్పుడూ గొడవ పడుతుంది కదా?  ఎప్పుడూ, కొట్టుకు చచ్చే మేము యిద్దరూ - బ్రహ్మలం ఎలా అవుతాం. మరి ఎంత మంది బ్రహ్మ లున్నారు? వారి స్వరూపమేమిటి?

బ్రహ్మ అన్నా బ్రహ్మము అన్నా వొక్కటే. బ్రహ్మమొక్కటే - అని అన్నమాచార్యుల వారు గళమెత్తి పాడారు.  బ్రహ్మమొక్కటే - అన్నది వేద ఘోష. ఉపనిషద్ ఘోష. పురాణాలు, ఇతిహాసాలూ అదే చెబుతుంది.

మరి ఈ బ్రహ్మము ఎలా వుంటుంది?

బ్రహ్మ స్వరూపాన్ని గురించి  యిలా అన్నారు  - "సత్, చిత్, ఆనందం" బ్రహ్మ స్వరూపం.

సత్ అంటే సత్యమైనది. ఎప్పుడూ వుండేది. ఆద్యంత రహితమైనది. మార్పు లేనిది. అది ఎవరో కాదు. అది నేనే (నువ్వే).

చిత్ - అంటే జ్ఞానం. ప్రజ్ఞానం అని వేదంలో చెప్పబడిన బ్రహ్మ ప్రజ్ఞానమే. దీన్ని ఆంగ్లంలో కాన్షస్ నెస్ - అన్నారు. ఈ ప్రజ్ఞానమే - ప్రపంచమంతటా, అణువణువులోనూ, వుంది. మనలోనూ వుంది.

ఆనందం - అంటే -దుహ్ఖరాహిత్యం అని చెప్పొచ్చు. నిజానికి, ఈ మూడు పదాలకూ సరి అయిన పదాలు, తెలుగులో కానీ, ఆంగ్లం లో కాని లేవని చెప్పచ్చు.

అయినా - నేను ఎవరు అని తెలుగులో మనం చెప్పాలంటే - ఆద్యంత రహితుడైన, నిత్య సత్యమైన (సత్), ప్రజ్ఞానమైన (చిత్), ఆనందమైన (ఆనందం) - అనంతుడైన వాడిని నేను.  ఆ నేనే బ్రహ్మ లేదా బ్రహ్మము.

అన్ని చోట్లా నేనే వుంటే -మరి నీవెక్కడ వున్నావు. నీవూ, బ్రహ్మమే. నీవూ,నేనూ రెండూ బ్రహ్మమే. అంటే - నీవూ,నేనూ వేరు కాదు. వొకడే.

మరెందుకు తిట్టుకుంటున్నాము?కొట్టుకుంటున్నాము? ప్రజ్ఞానాన్ని - అజ్ఞానం కమ్మేసింది. అందువలన. ఆ అజ్ఞానాన్నే మాయ - అన్నాము. ఎందుకలా? అదే సృష్టి విచిత్రం. అదెలా తెలుస్తుంది? నేనెవరో, అనుభవ పూర్వకంగా తెలిస్తే - సృష్టి విచిత్రమంతా తెలిసిపోతుంది. అజ్ఞానం పోతే - ప్రజ్ఞానం. నేనెవరో తెలిస్తే - మిగతా అంతా తెలిసే ఆవకాశం   వచ్చేస్తుంది.

కానీ - ఆ అజ్ఞానం నుండి మనం ఎలా బయట పడగలం? అజ్ఞానం నుండి బయట పడిన - జ్ఞానులున్నారు. వారిని గురువులుగా అంగీకరించండి. వారి వద్ద మీకు ఈ జ్ఞానం పూర్తిగా లభిస్తుంది. జ్ఞానం వచ్చిన వెంటనే - అజ్ఞానం తొలగిపోతుంది.

ప్రజ్ఞానం కలుగదు - ప్రజ్ఞానం మీరే అని తెలిసిపోతుంది. దీపం చుట్టూ మసి వుంది. దీపం దేదీప్యమానంగా వెలిగినా వెలుగు కనిపించడం లేదు. మసి వలన. మసి కడిగితే - వెలుగు తెలుస్తుంది. కానీ - ఆ తెలిసే వెలుగు ఎప్పుడూ వుంది. యిప్పుడు మసి పోయింది. అంతే. ప్రజ్ఞానం ఎప్పుడూ వుంది. అజ్ఞానం కమ్మితే,  మాయలో, సృష్టిలో మునిగి పోతాం. సుఖ దుహ్ఖాల ప్రవాహాలలో కొట్టుకుపోతూ వుంటాము.

అజ్ఞానం తొలిగితే - సృష్టి నడుస్తూ వుంటుంది. కాని నేను మాత్రం - ప్రజ్ఞానం గా, సత్,చిత్, ఆనందంగా వుండిపోతాను. మరి దేవుడున్నాడా? వున్నాడు. అది నేనే. శివుడు? అదీ నేనే? విష్ణువు? అదీ నేనే? నేను? అదీ నేనే?నీవు? అదీ నేనే? సర్వం బ్రహ్మ మయం. బ్రహ్మము తప్ప మరేమీ లేదు. మాయ? అదీ బ్రహ్మస్వరూపమే. మరి మాయ నన్ను ఆవరించడమేమిటి ? నేనూ బ్రహ్మమే. మయా బ్రహ్మమే - అయినప్పుడు? అది తెలియాలంటేనే - జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే - గురువు దగ్గర కెళ్ళాలి.   యిది ఎన్నాళ్ళ చదువు? అది మీ అక్కరను బట్టి. వొక రోజు కావచ్చు. వొక సంవత్సరం కావచ్చు. వొక జన్మ కావచ్చు. ఎన్ని జన్మలైనా కావచ్చు.

అబ్బా. అయితే వద్దులే. మరేదైనా, సులభ మార్గం చెప్పండి.

సులభమో కాదో కాని - మరొక మార్గం వుంది. దాన్ని ధ్యాన మార్గం అన్నారు. శ్రీకృష్ణుడు దాన్ని ధ్యాన యోగం అన్నాడు. పతంజలి మహర్షి - అష్టాంగ యోగం, క్రియాయోగం అన్నారు.

అందులో - ఎనిమిది భాగాలు, లేదా మెట్లు వున్నాయి.అంటే - వొక దాని తర్వాత వొకటి ఎక్కాలి. వొకే సారి, ఎనిమిదో మెట్టుకు , లేదా ఆరో మెట్టుకు యెక్క లేము. అలా ప్రయత్నం చేస్తే, ఎక్కినట్టే ఎక్కి జారి మళ్ళీ క్రిందికి వచ్చేస్తాము.

ఆ మెట్లేమిటో  - పతంజలి గారే - టూకీగా చెప్పారు. అది మరింత టూకీగా - యిక్కడ పేర్లు మాత్రం యిస్తున్నాను.

(1 ) యమ :ఈ మెట్టులో 5  భాగాలున్నాయి. (1) అహింస (2)సత్య వ్రతము (3)అస్తేయం (దొంగతనం ఎటువంటిదీ  చేయకుండడం )   (4 ) బ్రహ్మచర్యం (5 ) అపరిగ్రహం : వీటికి, క్రింద వాటికీ కూడా  వివరణ మీరు నా ఆంగ్ల బ్లాగు వైజ్ స్పిరిచువల్ ఐడియాస్.బ్లాగ్ స్పాట్ . కాం లో చదవచ్చు.

(2 )  నియమ : ఈ మెట్టులో 5  భాగాలున్నాయి. (1) శౌచము (2) సంతోషము (3 )తపము (4 )స్వాధ్యాయము (5 ) ఈశ్వర ప్రణిధానము  :యిక్కడ ఈశ్వరుడు,అంటే శివుడు కాదు. పతంజలి గారు ఆ పదానికి వొక విశేష నిర్వచనం యిచ్చారు.

(3 ) ఆసనం :మీకు తెలుసు - ఆసనాలు ఎన్ని రకాలో. అయితే పతంజలి గారు - స్థిరంగా , సుఖంగా  కూర్చోగలిగేదే ఆసనం అన్నారు.

(4 ) ప్రాణాయామం :దీన్లోనూ రకరకాలున్నాయి.

(5 ) ప్రత్యాహారం : యిప్పుడు యింద్రియాల్ని  అంతర్ ముఖం చేయాలి. 

(6 ) ధారణ  : మనస్సును ఏదో వొక విషయం పై యిప్పుడు స్థిరంగా నిలపాలి.  అదెలాంటి   వస్తువైతే ధారణకు మంచిదో మనకు తెలియాలి.

(7 ) ధ్యానం : ఆ వస్తువు పై - ఏకాగ్ర చిత్తమైతే అప్పుడు ధ్యానం సిద్ధిస్తుంది.

(8 ) సమాధి : ధ్యానం లో - మరేమీ వుండక, ధ్యాన వస్తు స్వరూపం   మాత్రం మిగిలితే - అది సమాధి అవుతుంది. మళ్ళీ అందులో -అంచెలంచెలుగా  నిర్వికల్ప ధ్యానం వద్దకు వెళ్ళిపోతారు. అప్పుడు -  మీకు స్వరూప దర్శనం అవుతుంది. అప్పుడు, అక్కడ వున్నది మీరే. అప్పుడు తెలుస్తుంది మీరెవరో.  మీరు సత్,చిత్,ఆనందం -గా మిగిలిపోతారు.

మీరెవరో తెలిసాక - మీ మిగతా ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం తెలిసిపోతుంది. అప్పుడు నమ్మకాలు పనిలేదు. ప్రశ్నలు అక్కర లేదు. సమాధానాలు అక్కర లేదు. స్వర్గం, నరకం, దేవుడు, వేదం, దేనితోనూ పని లేదు.

జ్ఞాన మార్గం లోనూ ఇవేవీ పని లేదు. ధ్యాన మార్గం లోనూ ఇవేవీ పని లేదు.  ధ్యాన మార్గం కూడా మరే సంస్కృతిలోనూ చెప్పబడలేదు.

ధ్యాన మార్గం వొక నిశ్చితమైన, అడుగడుగుగా ముందుకు వెళ్ళే మార్గం. యిక్కడ, మీకు   పెద్దగా నమ్మకాలతో పని లేదు. వొక్కొక్క మెట్టు ఎక్కే సరికి -మీలో అద్భుతమైన మార్పులు వస్తాయి. అవి మీకు అపారమైన నమ్మకం కలుగ జేస్తాయి. అయితే వచ్చే అద్భుత శక్తులే - మన ఆశక్తతగా , మన బలహీనతగా, మనమే మార్చుకుని, ఆ మెట్టు వద్దే వుండి పోయే ప్రమాదం చాలా వుంది. అక్కడి నుండి క్రింది మెట్టుకు జారే ప్రమాదమూ ఉంది. అలా చేయకుంటే - కైవల్యం చేరడం - నిశ్చయం.

శ్రీ కృష్ణుడు - భగవద్గీతలో - ఈ నాలుగు మార్గాలూ, నాలుగు రకాల మనుషుల కోసం చెప్పాడు. అన్నింటిలోనూ - మనిషి భగవంతుడిని చేరగలడని చెప్పాడు. భారత సంస్కృతిలో -జ్ఞాన, ధ్యాన మార్గాలు విశిష్టం.   యివి - మరే సంస్కృతిలోనూ మనకు అంతగా కనిపించవు. యివన్నీ ఎప్పటి నుండీ వున్నాయి. సృష్ట్యాది నుండీ వున్నాయి. యివి ఏ మతానికీ సంబంధించినవి కావు. యిదొక గొప్ప విజ్ఞానం - అందుకునే వారికి లభిస్తుంది.

నన్ను చేరడానికి ముందు నిన్ను నువ్వు తెలుసుకో - అనడం - ఎంత బాగుంది!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి