5, డిసెంబర్ 2016, సోమవారం

మీకే సమస్యలు , కష్టాలు వున్నాయా ? పరిష్కారాలు లేవా ? వున్నాయి సార్ ! చదవండి మరి


సమస్యలు - పరిష్కారాలుపుట్టిన ప్రతి మనిషికీ సమస్యలు వున్నాయి. పక్కింటివాడికి సమస్యలు లేవు, ఎదురింటి వాడికి లేవు , అన్నీ నాకే వున్నాయి -  అని అనుకోలేము. ప్రతి ఒక్కరికీ సమస్యలు వున్నాయి. ఇక ముందు కూడా, అంటే భవిష్యత్తులో కూడా, యేవో సమస్యలు, కష్టాలు వస్తూనే వుంటాయి. నరేంద్ర మోడీ గారికీ, డోనాల్డ్ ట్రంప్ గారికీ , చంద్ర బాబు నాయుడు గారికీ మీకున్న సమస్యలు  వుండొచ్చు , వేరే సమస్యలు వుండొచ్చు . కానీ సమస్యలు లేకపోవడం అంటూ వుండదు .

సమస్యలను ఎదుర్కొనే విధానం లో మాత్రం మనిషికీ , మనిషికీ మధ్య చాలా  వ్యత్యాసం వుంటుంది. సమస్య వచ్చే సంవత్సరం వస్తుందంటేనే , యిప్పటినుండి భయపడుతూ వుండే వాళ్ళు కొందరు, సమస్యను సమర్థ వంతంగా పరిష్కరించుకునే మార్గాలు వెదికి ధైర్యంగా ముందుకు వెళ్లే వాళ్ళు కొందరు, వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకునే వారు కొందరు, నాకు మాత్రం రాదు అని నిర్లక్ష్యంగా వుండేవారు కొందరు - యిలా మనలో ఎన్నో రకాలు. 

సమస్యలే కష్టాలు అని చెప్పలేం. అవి కొంత మందికి కష్టాలుగా  కనిపించ వచ్చు. మరి కొంత మందికి, వారి  జీవితం  అభివృద్ధికి అతి ముఖ్య సాధనాలుగా కనిపించ వచ్చు. అది వారి వారి దృక్పథం  పైన ఆధార  పడి వుంటుంది. కానీ సమస్యలు మాత్రము అందరికీ వస్తాయి. 

జయలలిత గారు ఏకచ్ఛత్రం గా పరిపాలించే, ప్రజాభిమానం పొందిన  ముఖ్య  మంత్రి అయినా - ఆమెకూ అపోలో హాస్పిటల్ వాసం తప్ప లేదు.  వారి ప్రత్యర్థి అయిన  కరుణానిధి కీ హాస్పిటల్  వాసం తప్ప లేదు.

గుజరాత్ లో ఆయనెవరో గొప్ప ధనవంతుడు 13000 వేల కోట్ల రూపాయల నల్ల ధనం తన వద్ద వుండడం ప్రభుత్వానికి చెప్పేశారు. ఇక  ఆయన తిప్పలు ఆయనవి. మనమంతా ఏదో కొన్ని పాత నోట్లు పుచ్చుకుని బ్యాంకుల ముందు నిలబడ్డాము. మనలో కొంత మంది మోడీ గారి సమర్థకులు , కొంత మంది విమర్శకులు , కొంత మంది ఏకంగా ప్రత్యర్థులు. ఎవరు ఎవరో మోడీ గారికి తెలీదు. మీ గోల మీది. ఆయన గోల ఆయనది. 

ఆర్ధిక సమస్యలు , ఆరోగ్య సమస్యలు, సామాజిక సమస్యలు, పెళ్ళాంతో మొగుడికి,మొగుడితో పెళ్ళాంకు సమస్యలు, పిల్లలతో సమస్యలు, పిల్లలు లేక సమస్యలు, అత్తలతోను కోడళ్లతోను సమస్యలు, పక్కింటోళ్లతో సమస్యలు, ఈవ్ టీజింగ్  వారితో సమస్యలు, దొంగలు పోలీసులు యిద్దరితోనూ సమస్యలు , లంచగొండ్లతో సమస్యలు, కల్తీ  వ్యాపారులతో సమస్యలు, లైంగిక సమస్యలు, త్రాగుడు రాయళ్లతో సమస్యలు, రౌడీలతో సమస్యలు,  రాజకీయ వాదులతో సమస్యలు, యిలా మనం రాసుకుంటూ పొతే , మనకు బోలెడన్ని  సమస్యలు వున్నాయని   మనం తప్పకుండా వొప్పుకుంటాము.

యివి కాక,  రోడ్ల మీద   పిచ్చి కుక్కలు, పాములు వస్తాయి. ఎవరినో  కరుస్తాయి. కరిచిన కుక్కను, పామును బ్లూ క్రాస్ వాళ్ళు  అయ్యో పాపం అంటారు, చంప కూడదంటారు. కరవబడిన వాడికి  ఆ సింపతీ లేదు. నిముషాల్లో వాడికి వైద్యం యివ్వడానికి మన దేశంలో ఎక్కడా సరైన సదుపాయం మాత్రం లేదు. బ్లూ క్రాస్ వాళ్లకి సంబంధం లేని విషయం అది. పిచ్చి కుక్క ఎందుకు కరిచింది? దాని సమస్య దానిది?  పామెందుకు కరిచింది? దాని సమస్య దానిది? ఫలానా వాడినే ఎందుకు కరిచింది ?  తప్పు వాడిదా , పాముదా, సమాజందా? ఇక ముందు కరవకుండా వుండాలంటే మనం ఏం చెయ్యాలి? ఇది మన సమస్య . 

అలాగే, ఒక్కో సారి, ఎక్కడో ఆకాశంలో పోయే కాకి మీపైన వాలి , మొత్తేసి , తన్నేసి, ముక్కుతో కుచ్చేసి లేదా రెట్ట వేసేసి పొయ్యే అవకాశం ఉంది. చిన్న గువ్వలు, చిలుకలు, పావురాలు మన సెల్ ఫోన్ టవర్ ల వలన మాయమై పోతున్నాయి . కాకులు చిరంజీవులు లాగా వున్నాయి. వాటికీ   చిర్రెత్తి , అప్పుడప్పుడూ , ఎవరో వొకరిని తన్నేసి పోతూ వుంటుంది. కాకి తంతే అపశకునం అని కొందరు మంచం పడతారు. బల్లి మనపై ఎక్కడ పడితే ఏం జరుగుతుందో పెద్ద శాస్త్రం వుంది మన దేశంలో. ఈ శకునాల శాస్త్రాలు బ్యాన్ చెయ్యవలసిన అవసరం చాలా వుంది. 

మీ పెంపుడు కుక్క ఎదురింటి వాడిని కరిస్తే మీకు ఎవరు ముఖ్యం? తప్పు  మీ కుక్కదా, ఎదురింటి వాడిదా? ఎదురింటి వాడు మంచోడు  కాదు, కోతి మొహమూ, వాడూను. అందుకే మా టామీ వాడిని కరిచింది - అనే వాళ్ళు కోకొల్లలు. 

ఇవి కాక దోమలు, ఈగలు , వైరస్  లు, బాక్టీరియాలు -  వీటి వలన వచ్చే సమస్యలు . ఇవన్నీ మీ, నా , మన సమస్యలు - జీవితాంతం వుండేవి.

ఇలా భూప్రపంచంలో లక్షన్నర సమస్యలు వున్నాయి.  వ్యక్తిగత సమస్యలు కొన్ని. మత పరమైన సమస్యలు కొన్ని. సామాజిక సమస్యలు కొన్ని. అందరికీ అన్ని సమస్యలూ వుంటాయా? వుండవు.  ఏదో కొన్ని వుంటాయి. అన్ని రోగాలూ మీకు లేవు కదా. ఎవరికీ లేవు. కొన్ని మీకు. కొన్ని పక్కింటోడికి. కొన్ని పోలీసోడికి. కొన్ని  దొంగకు. కొన్ని ముఖ్య మంత్రికి, యిలా దేవుడు బట్వాడా చేస్తూ వుంటాడు. 

వీటన్నిటితో బాటు మీరు ఎన్నేళ్లు బ్రతుకుతారో, యెంత కష్టాలతో బ్రతుకుతారో, యెంత సుఖాలతో బ్రతుకుతారో - మీ మీ తలరాత పైన,  గ్రహాలూ , నక్షత్రాలూ , జాతకాలూ, చేతి గీతలు,  మీ పేరులో వున్న లక్షణం అవలక్షణం - వీటిలో దేని పైన  ఆధార పడి వుందో ,  కొందరు చెబుతారు.  వారి రాతలు సరి చేసుకున్నట్టు పెద్దగా దాఖలాలు లేవు. ఏలినాటి శని హిందువులకు మాత్రమే వుంది. మిగతా వాళ్లకు శాతాన్, మరేదో వుంది.  మనకు తెలీని శక్తీ ఏదో  మనల్ని చూస్తూ, కావాలనే మనకు సమస్యలు , కష్టాలు సృష్టిస్తూ వుంది . అవునా ? కావచ్చు. 

సమస్యలు మన అందరికీ వున్నాయి. మీకే కాదు, వూర్లో అందరికీ 'యేవో కొన్ని' సమస్యలు ఉండనే వున్నాయి. 'మనకే కాదు అందరికీ వున్నది' -  అన్న విషయం సంతోష కరమైన విషయం కదా. కాబట్టి ఎంతో కొంత సంతోషించండి.

99 శాతం సమస్యలకు కాల పరిమితి అంటూ వుంటుంది. వారం పాటు మాత్రమే వుండే రోగాలు, రోగాల లాంటి అతిథులు, అలాంటివే మిగతా తక్కువ కాలపు సమస్యలు, నెలలు, సంవత్సరాల తరబడి వుండే సమస్యలు, జీవితాంతం వుండే సమస్యలు, ఆ తరువాత కూడా, అంటే  పునర్జన్మ వుంటే అక్కడికి కూడా మనతో వచ్చే సమస్యలు - యిలా రకరకాల కాల పరిమితి తో వుంటాయి సమస్యలన్నీ.

సరైన సమాధానం వెదికే వారికి  చాలా సమస్యలు శీఘ్రంగా పోతుంది; వెదకని  వారికి ఎక్కువ కాలం వుంటుంది . మరీ జటిలం కావచ్చు . వున్నా సమస్యలే, క్రొత్త సమస్యలూ సృష్టించ వచ్చు.

కొన్ని సమస్యలే కాక పోవచ్చు ;సాధారణంగా, సీదా సాదాగా  కనిపించే పెళ్ళామో, మొగుడో  సమస్య కాదు.  అనేక సమస్యలకు పరిష్కారంగా కూడా వుండొచ్చు. అయినా కొందరికి వాళ్ళు సమస్యల లాగా కనిపించవచ్చు.

అలాగే పొగ త్రాగడం, మందు కొట్టడం, మత్తు పదార్థాలకు అలవాటు పడడం నిజమైన సమస్యలే అయినా, వాటికి బానిసలైన వారికి అవి సమస్యల లాగా కనిపించవు . ప్రపంచం లోని అన్ని సమస్యలకు సమాధానాలుగా కనిపించ వచ్చు. 

సమస్యలు వస్తే , నాకెందుకు  వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది. నేనేం పాపం చేశాను. పక్కింటి వాడికి ఎందుకు రాలేదు? ఎవడో నాకు ఏదో చేశాడు , అందుకే  యిలా అయిందేమో ! ఇలా యోచన చేసే వారు కొంత మంది?

నాకొచ్చింది సరే . ఎలా త్వరగా పోతుంది ? నేనేం చెయ్యాలి ? ఎవరి సహాయం తీసుకోవాలి ? యిలా సమస్యకు సరైన సమాధానం వెదికేవారు కొందరు .  

పాత కాలంలో ఆడాళ్ళు మంచి మొగుడు కావాలని దేవుడిని  వేడుకునే వారు. మంచి మొగుడు అంటేనే , అందులో మంచి అత్తా మామలు కూడా వచ్చేస్తారు. ఆడ పిల్లల తల్లిదండ్రులూ అలాగే వెదికే వారు. ఆ  పధ్ధతి మంచి  తెలివైన పధ్ధతి అని నాకు అనిపిస్తుంది.

అలాగే  మంచి పెళ్ళాం దేవుడిచ్చే వరం అని ఆ కాలంలో అన్నారు. తమిళం లో యిలాంటి పాట కూడా ఒకటి వుంది . మనైవి అమైవదెల్లామ్ యిరైవన్ కొడుత్త వరం - అని , అంటే , మంచి పెళ్ళాం దేవుడిచ్చే వరం అని.ఇంటికి దీపం  యిల్లాలే అనేవారు, అనుకునే వారు.  అది నిజమే. 

మంచి జంట - అంటే మంచి మొగుడికి మంచి పెళ్ళాం - ప్రేమ, అభిమానం వున్న జంట , మనసున మనసై బ్రదుకున  బ్రదుకై ఒకరికొకరు తోడుగా  వుండే జంట - ఒకరి సమస్యలకు మరొకరు పరిష్కారంగా వుంటారు . అలాంటి జంటలు  మన దేశంలో యిప్పటికీ చాలా మంది వున్నారు. 

గయ్యాళి పెళ్ళాలు , దుర్మార్గపు మొగుళ్ళు పాత  కాలం లోనూ వుండేవాళ్ళు . కానీ వారి సంఖ్య యిప్పటితో పోలిస్తే చాలా తక్కువే . వారిపైన కూడా సమాజపు సత్ప్రభావం వుండేది . వాళ్ళ దుర్మార్గం ఎక్కువగా సాగనిచ్చే వారు కాదు. ఇప్పుడు మంచి పెళ్లాం , మంచి మొగుడు కావాలని పిల్లలు పెద్దగా అనుకోవడం లేదని నా అభిప్రాయం. అసలు నేను మంచి పెళ్ళాం గా వుండను కదా, అత్తా మామలను తరిమేస్తాను, మొగుడిని నా  చుట్టూ  తిప్పుకుంటాను, నేను వంటెందుకు చేస్తాను, నేనేం వంట మనిషా అనే మూర్ఖపుటమ్మాయిలు చాలా మందే వున్నారు. అలాగే అబ్బాయిలు - వారికేం కావాలో తెలీదు, రకరకాల దురలవాట్లకు కూడా లోబడుతున్నారు.  దానికి తోడు మన టీవీ సీరియల్సు మరీ ఘోరంగా వున్నాయి.  మొగుళ్ళ పాత్రలు, పెళ్ళాల పాత్రలు , అత్తల పాత్రలు చాలా అధ్వాన్నం గా, సమాజాన్ని అధః పాతాళానికి   తీసుకు పోయేలా వుంది. ఈ సీరియల్స్  మార్చ లేమా? మనకు మరీ ఘోరంగా కనిపించిన సీరియల్స్ గురించి ఆ టీవీ చానెళ్లకు రాయాలి. సమాజపు ఒత్తిడి వుంటే వాళ్ళూ సులభంగా మారుతారు. 

కొన్ని సమస్యలా , సమాధానాలా - చెప్పడం కష్టం. విడాకులు తీసుకోవడం మంచిదా, కాదా? ఈ మొగుడు సర్లేదు, ఈ పెళ్ళాం సర్లేదు - విడాకులే బెటర్. అనుకుంటారు. సరే . రెండో మొగుడు, రెండో పెళ్ళాం బాగుంటారా? యిలా పర్ఫెక్ట్  మొగుళ్లను, పర్ఫెక్ట్  పెళ్లాలను జీవితాంతం వెదుక్కునే పధ్ధతి అమెరికా నుండి మనం  దిగుమతి చేసుకుంటున్నాము. నేను పర్ఫెక్ట్ గా వున్నానా అన్న ఆత్మ విమర్శ చాలా కష్టంగా వుంటుంది . కానీ, సమస్యకు సరైన సమాధానం అదే కదా .

 మీరెలా వున్నా , ఏదో ఒక సమస్య రానే వస్తుంది; వచ్చిన సమస్య పోతుంది. దాని స్థానంలో మరోటి వస్తుంది. యిలా జీవితాంతం సమస్యలు ఉండనే వుంటాయి. వచ్చినవన్నీ  పోతాయని చెప్పలేం. బీపీ, షుగర్ లాంటివి నువ్వూ నేనూ  కలిసే వుందాం, కలిసే పోదాం అన్నట్టుగా వుంటాయి. గయ్యాళి పెళ్ళాం ,  దుర్మార్గపు మొగుడూ అంతే , విడాకుల పరిష్కారం లేకపోతే. 

కొన్ని సమస్యల లాగా కనిపిస్తాయి ; కానీ అవి దేవుడిచ్చిన అవకాశాలు. మీ జీవితానికి రాజ మార్గాలు  తెరవ గలిగే బంగారు ద్వారాలు. మీరు రాయవలసిన ముఖ్యమైన పరీక్ష లేదా ఇంటర్వ్యూ అలాంటిదే. పది మంది  అభ్యర్థులు వున్నారు ; వారిలో  మీరూ ఒకరు. యిప్పుడు మీరేం చేస్తారు. ఇది ఎప్పుడో ఎవరికో ఫిక్స్ అయిపోయుంటుంది , నా  ప్రయత్నం దండుగ అనుకుంటారా, ఈ వుద్యోగం ఖచ్చితంగా నాకే రావాలని పూర్తి ప్రయత్నం చేస్తారా? ప్రతి పెద్ద పరీక్ష లోనూ నెగ్గే వారిని చూడండి. రిక్షా తొక్కే వాడి కూతురు, మూటలు మోసే వాడి కూతురు యిలా మంది ఐఏఎస్ పరీక్షలలో, ఐఐటీ పరీక్షలలో నెగ్గారు. ఎంతో మంది తమ సమస్యలను  అవకాశాలుగా తీసుకుని , జీవితానికి రాజ మార్గం  వేసుకున్నారు. 

అవకాశాలను సమస్యలుగా భ్రమ పడి , భయంతో , సోమరితనం తో విడిచి పెట్టే వాళ్ళే ఎక్కువ మంది వున్నారు మన దేశంలో. 

మీరు ధైర్యంతో ఎదుర్కొన్న ప్రతి సమస్యా - మిమ్మల్ని మరింత సమర్థవంతులు గా చేస్తుంది, మీరు గెలిచినా సరే, ఓడినా సరే.  మీకు దేవుడు సమస్యలను యివ్వడానికి అసలు సిసలైన కారణం మిమ్మల్ని సమర్థులు గా చెయ్యడానికే. పసి పాప పడిపోతానని తెలిసీ మళ్ళీ లేస్తుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తుంది, లేచి నడవ గలిగే వరకూ చేస్తూనే వుంటుంది. ఇదే మనకు పుట్టుకతో వచ్చిన అసలు గుణం. పడడానికి భయపడడం మనకు పుట్టుకతో వచ్చిన గుణం కాదు. క్షత్రియ వంశంలో పుడితే యుద్ధాలకు, దెబ్బలకు, గెలుపోటములకు అన్నిటికీ సిద్ధంగా పెంచేవారు ఆ కాలంలో. ఏ వంశంలో  పుట్టినా , మనకు  పుట్టుకతో వచ్చిన గుణం అదే . 

ఇప్పుడూ అలాగే పెంచాలి; అలాగే పెరగాలి. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొని, పోరాడి  గెలుపొందాలి. సమాధానం లేని సమస్యంటూ లేదు. ఒక వుదాహరణ : స్టేజి 4 కాన్సర్ లో - 6 సముద్రపాల ఆకుల  రసం (తెల్లవారి పరకడుపుతో) , 1 గచ్చకాయ  పప్పు+4 మిరియాల పొడి (10 గంటలకు), కారట్ జ్యూస్ (మధ్యాహ్నం ), వీట్ గ్రాస్ జ్యూస్(రాత్రి)  యిస్తూ వున్న వారికి , యిద్దరు పేషెంట్స్ కు చక్కగా నయమవుతూ వుండడం మేము చూస్తున్నాము. వీరి విషయంలో అల్లోపతీ డాక్టర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఆ తరువాత ఈ వైద్యం.  వీటి విషయంలో ఆయుర్వేద వైద్యంలో ఎంతో పరిశోధనలు జరగాలి. అన్ని కాన్సర్ లకు, దేశీయ పద్ధతిలో చక్కని సమాధానాలు వుందనేది నిస్సందేహం.అలాగే అన్ని రోగాలకూ. కానీ 70 ఏళ్ళ పాలనలో మన దేశం మన వైద్యాలను ప్రోత్సహించ లేదన్నది విచార కరమైన వాస్తవం .

జనగణమన సినిమాల్లో మళ్ళీ పెట్టాలి అన్నది సుప్రీమ్ కోర్ట్ చెప్పే వరకు మనం చెయ్య లేదు. ఎక్కడో , ఎవరో , ఏదో కొన్ని సమస్యలకు సమాధానాలవుతున్నారు. సంతోషం. 

మన దేశంలో నల్ల ధనం సమస్య 70 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనలో వచ్చిందే కదా. మన రాజకీయ నాయకులు , మన ధనికులు మాత్రమే కాదు ఈ సమస్యకు కారకులు. పాకిస్తాన్ లో మన నోట్లను ప్రింట్ చేసే పెద్ద ప్రెస్  వుంది. వేల కోట్ల రూపాయల నోట్లు పాకిస్తాన్ మన దేశంలోని వాళ్ళ తొత్తులకు యిచ్చి  అరాచకం, టెర్రరిజం సృష్టిస్తున్నారు. నక్సలైట్లు, మావోయిస్టులు వీళ్ళందరూ ప్రజల వద్ద బలవంతంగా లాక్కుంటున్న నల్ల దానం కూడా మితి మీరు వుంది. దానితో వాళ్ళేమీ ప్రజోపయోగ కార్యాలు  చెయ్యడం లేదు. తుపాకులు కొని భీభత్సం సృష్టిస్తున్నారు. ప్రజల సమస్యలు నిజమైన సమస్యలు. టెర్రరిస్టులు, మావోయిస్టుల సమస్యలు వారి బుర్రల్లో పుట్టిన కల్పిత సమస్యలు.  ఈ రోజు  మోడీ గారు ఏదో చేస్తున్నారు. ఆయన చేసింది కనీసం పాకిస్తాన్ వారికి , టెర్రరిస్టులకు , నక్సలైట్లకు చాలా పెద్ద దెబ్బే. మన దేశంలోని నల్లధనం రాజులకు కూడా పెద్ద దెబ్బే . 

అయితే, సామాన్య ప్రజలైన మనకు కూడా  రెండు నెలల పాటు అసౌకర్యం కలుగుతూ ఉంది. ఒక పెద్ద జటిలమైన సమస్యకు గట్టి సమాధానం కొంత యిలా వుంటుంది. తప్పదు. కానీ, భారత దేశంలో ఎంతో  కొంత నిజాయితీ పెరుగుతుంది. మన జీవితాలు మెరుగు పడతాయి. 

మన వ్యక్తిగత జీవితాల్లోనూ యింతే. దారిద్య్రం ఒక సమస్య. చదువు లేమి ఒక సమస్య. ఉద్యోగాలు సృష్టించక పోవడం పెద్ద సమస్య.  కనీసావసరాలు తీర్చని ప్రభుత్వాలు   పెద్ద సమస్య. లంచగొండితనం పెద్ద సమస్య.

కానీ వీటన్నిటికీ సమాధానాలున్నాయి. సరైన పరిష్కారాలున్నాయి. కష్టాలలో వుండే వాళ్లకు చదువులు రాదని రూలేమీ లేదు. కష్టాలలో వుండే వాళ్లకు చదువులు చాలా బాగా వస్తుందని  ఎంతో మంది  మన దేశంలో చేసి చూపించారు. ప్రతి సంవత్సరమూ ఐఏఎస్ , ఐఐటీ  లాంటి  ప్రతిష్టా కర పరీక్షల్లో ఎంతో మంది అట్టడుగు వర్గాల వారు విజయం సాధిస్తున్నారు. 

అంటే - సమస్యల పట్ల మీ దృక్పథం ఏమిటి అన్నదే ముఖ్యం. ధైర్యంగా నిలిచి పోరాడుతారా , వెనుకంజ వేసి , పిరికితనం తో పారిపోతారా - అన్నదే ముఖ్యం.  భారత దేశంలో మరో ముఖ్య సమస్య - మనలో ఐక్యత లేక పోవడం. ఇది మన దేశంలో ఒక ప్రధాన సమస్యే.

ఇప్పుడు  సమస్యల  స్థూల స్వరూపాన్ని మరొక్క సారి ఆకళింపు  చేసుకుందాం :

1. సమస్యలు  అందరికీ వున్నాయి. సమస్యలు లేని వాళ్ళు లేరు.
2. జీవితాంతం  ఏదో ఒక సమస్య , చిన్నదో, పెద్దదో  వుండనే వుంటుంది.
3. చాలా సమస్యలు ఒక కాల పరిమితితో  వుంటాయి. తరువాత  వెళ్లి పోతాయి, సరైన పరిష్కారం  చూసుకుంటే.
4. సరైన  పరిష్కారం చూసుకోక పోతే , జటిలమవుతాయి.
5. సమస్యలన్నీ కష్టాలు కావు . భవిష్యత్తు ను మనం మలుచుకోవడానికి మంచి మార్గాలు .
6. ప్రతి సమస్య లోనూ, మిమ్మల్ని మానసికంగానూ, శారీరకంగానూ  యిప్పటికంటే బలవంతులు, ఆరోగ్యవంతులు గా చెయ్యగలిగే  అంశాలు  చాలా వుంటాయి. అవి మీరు వెదకాలి. 
7. రాబోయే ఎన్నో సమస్యలకు , యిప్పుడే అడ్డుకట్ట వెయ్యవచ్చు.
8. ముందు చూపుతో , ధైర్యంతో , సాహసంతో , తెలివితేటలతో ముందుకు సాగిపోయే వారికి సమస్యలు గొప్ప ఆయుధాలు.
9. పిరికితనంతో, భయంతో, సమస్యల నుండి పారిపోయే వారికి సమస్యలు కష్టాలుగా మారుతాయి, సుడిగుండాలుగా కనిపిస్తాయి.
10. మన వ్యక్తిగత, సామాజిక, దేశీయ సమస్యలకన్నిటికీ పరిష్కార మార్గాలు యెవరు కనుగొనాలి ? మనమే.

ఈ బాటలో మనం మళ్ళీ కలుద్దాం.

శుభం భూయాత్

సర్వే జనాః సుఖినోభవంతు

=మీ

ఉప్పలధడియం విజయమోహన్
నా మొదటి రచన-736 పేజీలు-amazon.in లో వుంది

 వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి