ప్రపంచ చరిత్రలో అతి గొప్ప గ్రంథం ఏది ?
ప్రపంచ చరిత్రలో అతి గొప్ప గ్రంథం ఏది ? ప్రపంచంలో చాలా ఎక్కువ మంది చేత చదవ బడే పుస్తకమా ? చాలా, చాలా పురాతనమైన పుస్తకమా ? చాలా, చాలా అమూల్యమైన అత్యంత మానవోపయోగకర విషయాలు తెలియ జేసే పుస్తకమా? ఏది?
మీరు క్రైస్తవ మతం లో చేరితే వెంటనే మీ చేతిలో బైబిల్ పుస్తకం పెట్టేస్తారు. కొన్ని రైల్వే స్టేషన్ల ముందు నుంచుంటే చాలు , మీకు ఒక కాపీ యిచ్చేస్తారు. మీయింటికొచ్చి కూడా ఒక కాపీ మీ చేతిలో పెట్టేస్తారు. యిది మత ప్రచారం. యిది కాస్త తలనొప్పి మిగతా మతాల వారికి.
చర్చిలో బైబిల్ గూర్చి చెబుతారు; చర్చిస్తారు. యిది మంచి పద్ధతే. బైబిల్ లో ముఖ్యంగా క్రీస్తు చెప్పిన విషయాలు చాలా బాగుంటాయి. బైబిల్ గొప్ప గ్రంధమే. నాకు సందేహం లేదు. మంచి జీవితానికి కావలసిన ఎన్నో సూక్తులు యిందులొ వున్నాయి.
ఒక ధనవంతుడు దేవుడి రాజ్యంలో అడుగు పెట్టడం కంటే , ఒక ఒంటె సూది సందులో దూరి పోగలగడం తేలిక అని బైబిల్ అంటుంది. నిజమేనా ! అయితే వారిలో ఎంత మంది దేవుడి రాజ్యం లోకి సులభంగా అడుగు పెట్టగలరు? ధనవంతుడు కాకూడదనే క్రైస్తవులు ఎంత మంది ? చర్చిలు ఎన్ని ? యిది విమర్శ అని కాదు. చెప్పడం ఒకటి చెయ్యడం ఒకటి గా వుంది , దాదాపు అన్ని మతాల లోనూ. వ్యక్తిగతంగా నాకు క్రీస్తు చాలా యిష్టమే . ఆయన చెప్పినవి యిష్టమే. క్రిస్టియానిటీ అంటే కూడా గౌరవమే. అలా అని బైబిల్ మాత్రమే అన్నిటి కంటే అతి గొప్ప గ్రంథం అని నేను అనుకోను.
మన దేశం లో చాలా మంది ముస్లిములు, ఎంతో మంది యితరుల కంటే చాలా మంచి వాళ్ళుగా వుండడం నా అనుభవం. అయితే పడమటి ఆసియా దేశాల్లో జరుగుతున్న ఎన్నో అమానుషాలు, ఇతర మతాల పట్ల , తమ లోనే యితర వర్గీయుల పట్ల , అసహాయ స్త్రీల పట్ల ఎంతో మంది చేస్తున్న క్రూర చర్యలు యివన్నీ మనలో ఎన్నో సందేహాలు రేకెత్తించక మానవు . అలాగే పాకిస్తాన్ , బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఇతర మతాల వారి పట్ల ప్రవర్తించే తీరు అస్సలు ఏమీ బాగా లేదు. మతోన్మాదం ముస్లిం దేశాల్లో చాలా ఎక్కువ అన్నది విచారకరమైన విషయం . కానీ , అక్కడా ఎంతో మంది మానవతా వాదులు మనకు కనిపిస్తున్నారు. ఆ దేశాల్లో ప్రశాంతత, మత సామరస్యం ఎప్పుడొస్తుందో , ఏమో అర్థం కావడం లేదు. రావాలనేది మన ఆకాంక్ష.
ఖొరాన్ లో ఏముందో నాకు బాగా తెలీదు. కానీ , సంఖ్యాపరంగా ఖొరాన్ ప్రతులే ఎక్కువ వుండొచ్చు ప్రపంచంలో. ప్రపంచం లోనే అతి గొప్ప గ్రంథం ఖొరాన్ అని వారు అనుకోవచ్చు. పడమటి ఆసియా దేశాల్లో జరుగుతున్న అమానుషాలు తగ్గి ప్రశాంతత వచ్చే వరకు నేను అలా అనుకోలేను. అదికాక , ఆ గ్రంధాన్ని అసలు ఎవరూ విమర్శించరాదు - విమర్శించే వాళ్ళను ఏమైనా చెయ్యొచ్చు అనడం ఒక పెద్ద నెగటివ్ పాయింట్ గా వుంది . అయితే , అది గొప్ప గ్రంథాల్లో ఒకటి అనడంలో సందేహం లేదు.
త్రిపిటికాలు అనే బౌధ్ధ గ్రంధాలు, గురు గ్రంథ సాహెబ్ అనే సిక్కు మత గ్రంధము, యిలాంటి మత గ్రంధాలు కూడా ఆయా మతస్థుల మధ్య బాగా ప్రాచుర్యంలో వున్నాయి . అంతే కాదు. వాటిని, ఆ మతస్తులు ఎంతో కొంత పాటిస్తూనే వున్నారు కూడా. అది మనకు తెలుస్తూనే ఉంది . ఆ గంధాల మానవతా విలువలు కొంతైనా వారి మధ్య వుండడం గమనార్హం . అవి కూడా గొప్ప గ్రంధాలే.
మత గ్రంధాలు కాక , తిరుక్కురళ్ అనే తమిళ గ్రంథం తమిళుల మధ్య బాగా ప్రాచుర్యంలో వుంది . యిందులో వున్న విషయాలు కూడా చాలా అందమైన జీవిత సత్యాలు. చదవడం వరకు బాగానే ఉంది ; కానీ , ఎంత మంది, యివి పాటిస్తున్నారు - అంటే సందేహాస్పదమే. అయితే , తిరుక్కురళ్ కూడా గొప్ప గ్రంధమే అనడం లో సందేహం లేదు. అంతే . అంతకు మించి లేదు.
ఇవన్నీ కాక , రామాయణం మన దేశం లో పుట్టిన అతి పురాతనమైన,అత్యద్భుతమైన గ్రంధం. ప్రపంచం లోనే మొట్ట మొదటి మహా కావ్యం. మన దేశంలో, మనకు చాలా,చాలా బాగా తెలిసినది. వాల్మీకి ఆది కవి. అంత వరకు చదువుకు నోచుకోని వాడు. రామాయణం రాయడానికి ప్రత్యేకంగా నియమింప బడ్డవాడు , ఆశీర్వదింప బద్ద వాడు. రామాయణం రాముడి కథ ; రావణుడి కథ; హనుమంతుడి కథ ; సీత కథ; ధర్మాధర్మాల కథ; రాజు ఎలా వుండాలో , బంటు ఎలా వుండాలో, భర్త ఎలా వుండాలో , భార్య ఎలా వుండాలో , సోదరులు ఎలా వుండాలో, ప్రజలు ఎలా వుండాలో, వీళ్ళందరూ ఎలా వుండకూడదో - ప్రపంచంలోనే మొట్ట మొదటి సారి మనకు తెలిపిన కథ . నిజానికి యిది కథ కాదు. ఒక యుగపు చరిత్ర. ఆ యుగపు మహా పురుషుల గురించి తెలిపిన చారిత్రక కావ్యము. ఇందులో అంతర్భాగంగా యోగ వాసిష్ఠం అనే గొప్ప యోగా ప్రసంగం వుంది. అనేక, అమూల్య రహస్య మూలికల ప్రస్తావం ఉంది. అద్భుతమైన ఆనకట్టల నిర్మాణం ఉంది. విమానాల ప్రస్తావన ఉంది. మానవ, రాక్షస, వానర, భల్లూక, విహంగాలతో కూడిన అత్యద్భుత యుద్ధాల వర్ణన వుంది. అంతకు ముందు కానీ , అప్పటి నుండి యీ రోజు వరకు కానీ, ప్రపంచంలో మరెక్కడా, ఇటువంటి అద్భుత గ్రంధం రాయబడలేదన్నది నిర్వివాదాంశం. ఇది కూడా, 15 వేల ఏళ్ళ నాటిదని కొందరు,లేదు,6 వేల ఏళ్ల నాటిదని కొందరు పాశ్చాత్య చరిత్రకారులు చెప్పొచ్చు ; తర్కించవచ్చు . కొన్ని లక్షల ఏళ్ల నాటిదైనా - ఆశ్చర్యం లేదు. నా వ్యక్తిగత అభిప్రాయంలో - పైన చెప్పబడిన వాటితో పోలిస్తే - రామాయణం చాలా గొప్పది అనిపిస్తుంది . మత గ్రంధాలతో పోల్చడం సరి కాదేమో కానీ అతి గొప్ప గ్రంధం అంటే రామాయణం అనిపిస్తుంది.
రామాయణం తరువాత వచ్చింది మహా భారతం. ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథం; రామాయణం తర్వాత అతి పురాతనమైనది; రామాయణం లో అంతర్భాగం యోగ వాసిష్ఠం అయితే , మహా భారతంలో అంతర్భాగం భగవద్ గీత. మహా భారతం రామాయణం కంటే కొన్ని విషయాలలో విలక్షణమైనది. మహాభారతం - కృష్ణుడి కథ, భీష్ముడి కథ, పాండవుల కథ , కౌరవుల కథ , ప్రపంచ చరిత్ర లోనే అత్యద్భుత మహా సంగ్రామం కథ. యుద్ధ నీతి అనీతిల కథ. రాజ నీతి కథ. ధర్మాధర్మాల కథ. ఈ రెండు గ్రంధాలు చదివిన వాడికి ఎంత జ్ఞానం వస్తుందో - చెప్పలేం. మన దేశంలో ఎన్ని మతాల గొడవలున్నా, మత సామరస్యము వుండడానికి కారణం , ఈ రెండు గ్రంధాలే. స్త్రీలను దేవుడిగా చూసుకున్న ఒకే ఒక సంస్కృతి మనది. స్త్రీలను నిన్న మొన్నటి వరకు అమ్మా అనే పిలిచి , గౌరవించిన ఈ సంస్కృతి కి ముఖ్య కారణం ఈ రెండు గ్రంధాలే . స్త్రీలను అవమానించిన వారికి ఎలాంటి శిక్ష వెయ్యాలో - రావణుడు , దుర్యోధనుడు ల కథ తెలుపుతుంది. ఏ దేశంలో ఉంది , ఇలాంటి గంధాలు?
భగవద్ గీత - వీటన్నింటినీ మించిన గ్రంధం. సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పిన సందేశం. ఇందులో ఒక్కొక్క భాగం , ఒక్కొక్క యోగం గా చెప్పాడు. ఒక్కొక్క యోగంలో శ్రీకృష్ణుడు ఒక సైన్స్ ను చెప్పాడు. భగవద్ గీత శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి భగవద్ గీత మన మత గ్రంథం అనుకుంటే చాలా పొరబాటు. అది అంతా సైన్స్ మయమే. అర్థం కావాలి. అంతే. మీరు పి.హెచ్.డి. సైన్స్ అయినా - భగవద్ గీత చదవలేదంటే మీకు అసలయిన సైన్స్ ఏదీ తెలీదనే చెప్పాలి. జీవితం గురించి కూడా తెలీదనే చెప్పాలి. మీరు జీవితంలో అతి ముఖ్యమైన దాన్ని , అసలు మిస్ కాకూడని దాన్ని మిస్సవుతున్నారు . ప్రపంచం లో 7 వండర్స్ లేదు. ఒకటే వుంది. అది భగవద్ గీత. ఇది 5000 సంవత్సరాలకు ముందటిదని , బైబిల్ , కొరాన్ , త్రిపిటికాలు , గురు గ్రంథసాహెబ్ , తిరుక్కురళ్ లాంటి అన్ని పుస్తకాల కంటే అతి పురాతనమైనది అని - అందరు చరిత్రకారులు వొప్పుకోవలసిన, ఒప్పుకున్న గ్రంధం యిది.
మన దురదృష్టం ఏమంటే - సెక్యూలరిజం పేరిట , గత 70 ఏళ్లుగా , యిందులోని సైన్స్ అంతా , మనకు దూరంగా పెట్టింది , మన ప్రభుత్వాలు. ఇప్పుడైనా మనం ఈ సైన్స్ ను చదవాల్సిన , నేర్చుకోవాల్సిన, మన జీవితాలలో పాటించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
నేను భగవద్ గీత చదివాను. అంతా అర్థమయ్యిందని చెప్పను. కానీ అందులోని చాలా విషయాలు నాకు చాలా బాగా నచ్చాయి. నా మొదటి ఆంగ్ల పుస్తకం - కాంప్రెహెన్సివ్ ట్రీటైజ్ ఆన్ పతంజలి యోగసూత్రాస్ - లో చాలా విషయాలు భగవద్ గీత నుండి వివరంగా చెప్పాను. నాకు తెలిసినంత వరకు, నా అభిప్రాయంలో , ప్రపంచం లో అతి గొప్ప గ్రంధం అంటే - భగవద్ గీత - అనే అంటాను.
ఇక మీదట , అప్పుడప్పుడు, గీత నుండి , అందులో వున్న శాస్త్ర జ్ఞానంతో సహా , ఎన్నో ఆసక్తి కరమైన వివరాలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను.
శుభం భూయాత్
సర్వే జనాః సుఖినో భవంతు
= మీ
ఉప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి