19, నవంబర్ 2016, శనివారం

మా వివాహ వార్షికోత్సవం - సేవలయా లో - వందలాది పిల్లలతో -

మా  వివాహ వార్షికోత్సవం

అపర్ణ,అభినయ,ధనుషా లతో మేము

సేవలయా లో



ఈ  నెల 17 వ తేదీ మా 38 వ వివాహ వార్షికోత్సవం. చాలా ఏళ్లుగా మేము జన్మ దినాలు, వివాహ వార్షికోత్సవాలు, మావీ, మా  పిల్లలవీ కూడా, సేవాలయా అనే అనాథ శరణాలయము, అందులోనే వున్న పాఠ శాల , వృద్ధాశ్రమాలలో ,అన్నదానం చేసి, ఆ పిల్లల మధ్యే , వారితో బాటే భోజనం చేసి జరుపు కుంటాము. 

ఈ సంవత్సరమూ అంతే. ఈ సారి అన్నదానానికి 10,000  రూపాయలు. సాధారణంగా, ఈ దినం ఒక అనాథ బాలిక పూర్తి చదువు ఖర్చు,1 నుండి ప్లస్ 2 వరకు, 1,00,000 రూపాయలు (ఎండోమెంట్ గా) ప్లస్ అన్నదానం ఖర్చు 10,000 యివ్వడం చేసే వాడిని. ఈ సారి స్టాక్ మార్కెట్ చాలా దెబ్బ  తిన్నందు వలన 1,00,000 విరాళం వాయిదా వేసాను. అది మరెప్పుడో చేస్తాను. 

ఇప్పటివరకు నలుగురు అనాథ బాలికలకు ఈ ఎండోమెంట్ ఏర్పాటు చేశాను. ధనుష ,అపర్ణ ,అభినయ, సుమిత్ర  వాళ్ళ పేర్లు. సేవాలయ కు వెళ్ళినప్పుడు ఈ నలుగురితో ఒక గంట సేపైనా మాట్లాడి, వారి చదువులు, ఇతర  కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క చాకోలెట్ ప్యాకెట్  యిచ్చి  వాళ్ళ  సహవిద్యార్థులకు, ఫ్రెండ్స్ కు, అధ్యాపకులకు పంచమంటాను.  ఈ సారీ, నేను , నా భార్య అదే చేశాము . 

అపర్ణ తాను నేర్చుకున్న భరత నాట్యం  చేసి చూపింది. మిగతా పిల్లలు మంచి పాటలు చాలా చక్కగా పాడారు. వాళ్ళ చదువుల గురించి విశదంగా చెప్పారు. వాళ్ళతో మాట్లాడ్డం ఒక  గొప్ప అనుభవం. ఆ పిల్లల మొహాల్లో ఎంతో సంతోషం. అది చూస్తే మాకూ ఎంతో సంతోషం. ఆ పిల్లల చేత తాను  ముద్దు పెట్టించుకుని, వారికి  తాను ముద్దు పెట్టి సంతోష పడడం నా భార్యకు ఒక అరుదైన అనుభవం . 

 ఆ తరువాత వందల కొద్దీ పిల్లలందరితో బాటు వాళ్ళ డైనింగ్ హాల్ లో కూర్చుని , వాళ్ళతో బాటే భోజనం . 

భోజనానికి  ముందు ఆ  పిల్లలు మా కోసం ఏదో ప్రార్థన చేస్తారు. అందరూ ఏక కంఠంతో మమ్మల్ను అభినందిస్తారు. పిల్లలు చేసే ఈ తంతు చాలా ముచ్చటగా వుంటుంది. 

నా భార్య కొంత మంది పిల్లలకు తానే స్వీట్స్ వడ్ఢన చేసింది. నేను వృద్ధాశ్రమపు వృద్ధులకు స్వీట్స్ వడ్డన చేశాను. వాళ్ళ మొహాల్లో ఎంతో సంతోషం. వాళ్ళు చేసే అభినందనలు , ఆశీర్వాదాలు. అదొక  మంచి అనుభవం. 

తిరిగి వచ్చే దారిలో వందలాది పిల్లలు థాంక్యూ సర్ అంటూ, తమకు తామే, మమ్మల్ని   చూస్తూ చేతులు ఊపుతూ వుంటే , వాళ్ళ మొహాల్లో కొట్టొచ్చినట్టు కనిపించే సంతోషం చూస్తూ వుంటే, చాలా ఆనందం అనిపించింది. దేవుడు దేవాలయం లో మాత్రమే కాదు ; ఈ సేవాలయా లో కూడా, ఈ పిల్లల హృదయాల్లో కూడా తప్పక వున్నాడనిపించింది . 

ఆ పిల్లల అభినందనే, దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం మాకు. 

అక్కడికి వెళ్లే ముందు 95 ఏళ్ళు దాటిన మా మామగారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాము. వెళ్లే దారిలో  షిర్డీ సాయి ఆలయ దర్శనం . తిరిగి వచ్చేటప్పుడు మా అన్నను చూసి రావడం. 

మా యిద్దరు కొడుకులలో ఒకరు బెంగుళూరు , ఒకరు కోయంబత్తూర్ లలో వున్నారు. వాళ్ళతో టెలిఫోన్  సంభాషణే.  వాళ్ళూ సంతోషంగా వున్నారు. కాస్త దూరం , అంతే.   వాళ్లకూ మేము యిలా చెయ్యడం  బాగా నచ్చింది. 

అయితేనేం , వందలాది పిల్లలు సేవాలయాలో దగ్గరే వున్నారు కదా . 

సర్వే జనాః సుఖినో భవంతు 
=మీ 
 ఉప్పలదడియం  విజయమోహన్
95 ఏళ్ళ మామ గారి ఆశీర్వాదం
 





సేవలయ స్కూల్


సేవలయా పిల్లలు


 




 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి