1, అక్టోబర్ 2011, శనివారం

జీవితానికి వొక నిర్వచనం = జరిగేవన్నీఎందుకలా జరుగుతోంది ? = మర్ఫీ సూత్రాలు = శ్రీ కృష్ణుని కర్మ యోగ సూత్రాలు

మర్ఫీ  సూత్రాలు 
శ్రీ కృష్ణుని కర్మ యోగ సూత్రాలు
మన జీవితాలు 

క్రిందటి వ్యాసంలో - మర్ఫీ సూత్రాల గురించి చదివాము. ప్రతి వొక్కరి జీవితంలో యిటువంటి సంఘటనలు - అప్పుడప్పుడూ జరుగుతూ వుంటాయి. జీవితానికి వొక నిర్వచనం
యిప్పుడు - మన జీవితాల్లో జరిగే అన్ని సంఘటనలకు - మూల సూత్రమైన కర్మ సిద్ధాంతాన్ని పరిశీలిద్దాం.శ్రీ కృష్ణుల వారి - భగవద్ గీత -ఏదో మత గ్రంధమని చెప్పడం చాలా తప్పు. ఇందులోని 18  చాప్టర్లు - వొక్కొక్క దాన్నీ వొక్కొక్క  యోగమని చెప్పారు.

యోగమంటే - నిజానికి మనకూ మధ్య నున్న దూరం తరిగి, మనలో నిజం పూర్తిగా నిండి పోవడమని, మనమే నిజంగా , మారిపోవడమని - అర్థం చెప్పుకోవచ్చు.

శ్రీ కృష్ణుల వారు - ఎలా జీవించాలో, ఎందుకలా జీవించాలో - చాలా, చాలా సహేతుకం గా చెప్పారు. ఎప్పుడో - స్వర్గానికో, నరకానికో, మోక్షానికో పోవడాన్ని గురించి - చాలా  తక్కువగా చెప్పారు. మన సాధారణ జీవితాన్ని గురించే  ఎక్కువగా చెప్పారు.

అందులో - వొక ముఖ్యమైన భాగము - కర్మ యోగము.

శ్రీకృష్ణుడు - తాను చెప్పిన  విషయాలన్నీ - ఎప్ఫుడో  మహాఋషులచే   చెప్పబడినవే - అంతే కాని  కొత్తదేమీ కాదంటాడు. అది నిజమే. అసలు తానుకూడా, ఈ విషయాలు చెప్పడం మొదటి సారి కాదంటాడు. కృతయుగంలో వివస్వతుడికి, మరెందరికో తానే చెప్పినట్టు చెబుతాడు.  

యిదంతా ఎందుకంటే -   ఈ మహా విజ్ఞానం దాదాపు వేదకాలం నుండీ -వస్తున్నదే. కానీ యుద్ధ విద్యలు, రాజ విద్యలు, కళలు, సైన్సు - లాంటి వాటి కున్న బహుళ ప్రజాదరణ - ఈ యోగ విద్యకుండడం కష్టం. 

అందుకనే - శ్రీకృష్ణుడు - దీన్ని ప్రజలందరికీ ఉపయోగ పడే రీతిలో - అర్జునుడికి మళ్ళీ చెప్పాడు. యిది ప్రతి వొక్కరూ - ఎలా చేయాలో, చేస్తే ఏమవుతుందో , చేయక పోతే ఏమవుతుందో   విశదం గా చెప్పాడు.  

కర్మ యోగం ముఖ్యంగా చాలా సరళంగా చెప్పాడు. అయినా, యిప్పటికీ - చాలా మందికి , కర్మ యోగాన్ని గురించి సరైన అవగాహన లేదనే చెప్పొచ్చు..

యిదే బ్లాగులో - యింతకు ముందు కర్మ యోగాన్ని గురించి కొద్దిగా చర్చించాం.

కానీ - మర్ఫీ సూత్రాలు చూసిన తర్వాత -     ఎందుకలా మన జీవితాల్లో జరుగుతోంది - అన్న అంశం ఆసక్తి కరంగా మారుతుంది. ఎందుకలా అన్న ప్రశ్నకు మర్ఫీ సూత్రాలలో - జవాబు లేదు. కర్మ యోగంలో వుంది. సరే. యిప్పుడు -దాన్ని గురించి కొంత తెలుసుకుందాం.

మనందరికీ కర్మ యోగమును గురించి - "కర్మణ్యేవ అధికారస్తే , మా ఫలేషు కదాచన" అన్న వొక వాక్యం మాత్రం బాగా తెలుసు. కానీ ఈ వాక్యం యొక్క అర్థం చాలా మంది చేతుల్లో, రక రకాలుగా మారి పోయింది. 

కర్మయోగం - అంటే -   నిజంగా ఏమిటి - అన్నది మనం యిప్పుడు చెప్పుకుందాం .

"కర్మ( అంటే పని )" - చేయడానికి మీకు పూర్తి అధికారం వుంది.కర్మణ్యేవ అధికారస్తే - అంటే యిదీ అర్థం.

మీరు మీ పనిని ఎన్నుకోవడంలో -మీకు స్వాతంత్ర్యమూ వుంది.

అయితే - మీరు ఎన్నుకున్న వృత్తి ధర్మాల్ని, మీ సామాజిక ధర్మాల్ని  పాటించడంలో మీ బాధ్యతా వుంది.

మీరు చేసే ప్రతి పనికీ బాధ్యులు మీరే.  మరి బాధ్యత అంటే ఏమిటి?  ఏ పని చేసినా - దానికి కొన్ని పరిణామాలు వుంటాయి.మన పనుల వలన మన చుట్టూ వున్న పరిస్థితులలో రకరకాల మార్పులు వస్తాయి.  ఈ మార్పులు మన పనుల వలన వస్తూ వుంది - కాబట్టి, ప్రపంచం దానికి  తగ్గ ప్రతిఫలం తను నిర్ణయించి పనికి కర్త  ఐన  మనకి అందజేస్తుంది. పని మనం ఎంచు కోవచ్చు. కాని ప్రతిఫలం నిర్ణయించే శక్తీ మరొకటి వుంది. అది మనం కాదు. "మా ఫలేషు కదాచన" అంటే అర్థం యిదే. ఫలం నిర్ణయించే "అధికారం" మన చేతిలో లేదు. అది -మరో అతీత శక్తి, దాన్ని మనం కర్మ ఫల దాత అని చెప్ప వచ్చు -  ఆ శక్తి చేతిలో వుంది. 

కర్మ ఫల ధాతకు స్వ, పర భేదాలు లేవు. ఎటువంటి పక్షపాత బుద్ధీ లేదు.వొకరికివ్వవలసింది  మరొకరికివ్వడమో,  మరిచిపోవడమో - లాంటివి జరుగవు.

కాబట్టి మీకు వచ్చిన, వస్తున్న, రాబోయే  కర్మ ఫలాలు - మీకు రావాల్సిందే వస్తాయి. అంతకు ఎక్కువో, తక్కువో రాదు. మరొకరి కర్మ ఫలం మీకు రావడమో, మీది మరొకరికి పోవడమో జరుగదు.

నాకు ఏదీ వద్దు. నేను ఏ పనీ చేయను - అని మీరు కూర్చో గలరా? ఊహూ. కూర్చోలేరు. మీరు ఎక్కడుంటే అక్కడ, మీ ద్వారా ఏదో పని జరుగుతూనే వుంటుంది. మీరు తప్పించుకోలేరు. మీరు మీ పనిని - మీరుగా నిర్ణయించు కోక పోతే - ఏదో వొక పని ప్రకృతి ద్వారా నిర్ణయింప బడుతుంది.అదీ మీ పనిగా మారిపోతుంది. దానికీ కర్తృత్వము మీదే.

ఈ ఫలితాలు మీకు ఎలా వస్తుందో -అది చాలా -ఆసక్తి జనకమైనది.

మీరు చేసే ప్రతి పనీ - మూడు అంశాలుగా చెప్పొచ్చు. (అ) మీ మనస్సులో మీరు చేసే ఆలోచనలు  (ఆ) మీ నోటి  ద్వారా మీరు మాట్లాడే మాటలు (ఇ) మీరు బాహ్య ప్రపంచంలో చేసే పనులు

సాధారణంగా - ఆలోచన మొదట వస్తుంది. వొక  యుద్ధానికి కూడా మూలం ఎవరి మనస్సులోనో తలెత్తిన ఆలోచనే. అంటే, మంచి పనైనా, చెడ్డ పనైనా - మొదట, మనస్సులోనే పుడుతుంది. చాలా వరకు -  మంచి, చెడ్డ ఆలోచనలు మనస్సులో పుట్టి, అక్కడే నాశనమై పోతాయి. కొన్ని ఆలోచనలు - మంచీ కాదు, చెడూ కాదు. ఉదాహరణకు - సూర్యుడు తూర్పుననే ఎందుకు ఉదయిస్తాడు? ఈ ఆలోచన -కేవలం ఆలోచనే కానీ - మంచీ, చెడూ అంటూ ఏమీ లేదు. ప్రక్కింటాయనకు -ఆరోగ్యం సర్లేదు. మనం ఆస్పత్రికి తీసుకెళదాం -  అన్నది మంచి ఆలోచన.  వారి దగ్గర మనం తీసుకున్న అప్పు ఎగ కొట్టాలనుకోవడం చెడ్డ ఆలోచన.   యిలా, మంచి, చెడూ రెండూ, ఆలోచనలలో మొదట పుడతాయి.

ఆలోచనల నుండి   -  మాటలు, చేతలు రెండూ వస్తాయి. ఆలోచనలు మంచివైతే - మాటలూ, చేతలూ సాధారణంగా మంచివిగానే వుంటాయి.

ఆలోచనలు చెడుగా వుంటే  -  మాటలు చెడుగా   వుండచ్చు.చేతలూ చెడుగా వుండచ్చు. 

కానీ చెడు ఆలోచనలు - మనసులోనే మనం వుంచుకోవచ్చు. మాటలు, చేతలపై వాటి ప్రభావం లేకుండా చేసుకోవచ్చు. అయితే, మనకు, మనసుపై కాస్త  అదుపు, కట్టుబాటు వుంటే - చెడు ఆలోచనలు   రాకుండా కూడా   నివారించ వచ్చు. లేదంటే - చెడు ఆలోచనలు వస్తాయి. కొంత మందికి ఎప్పుడూ చెడు ఆలోచనలే . వీరు విలన్లు - అన్న మాట. అయితే - దీన్ని మార్చుకోవచ్చు.

సరే. నోటిపై కాస్త అదుపు, కట్టుబాటు వుంటే - మీ ఆలోచనలు, మనసు కట్టలు దాటి, నోటి వరకు, తరువాత  నోటి నుండి, మాటలద్వారా బయటకు, రాకుండా నిరోధించ వచ్చు.అంటే - కనీసం, చెడు మాటలు మాట్లాడ కుండా చెయ్య వచ్చు.  సరే. నోటిపై కట్టుబాటు పోతే - మనసులోని ఆలోచనలు, మాటల హద్దులూ దాటి, చేతల వరకూ పోవచ్చు. 

యిలా- చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు చేతలూ  వుంటాయి. అలాగే - మంచి ఆలోచనలూ, మంచి మాటలూ, మంచి చేతలూ కూడా వుంటాయి. దేన్నైనా చెడు నుండి, మంచికి మార్చుకోగల శక్తి మనకు వుంది. అందుకనే - మన పనులన్నిటికీ - మనమే బాధ్యత వహించాల్సి వుంటుంది.

కర్మ అంటే - మనో,వాక్, కాయ కర్మలన్నీ - అని చెప్పాలి.యిక కర్మ యొక్క  ప్రతిఫలాన్ని గురించి  తెలుసుకుందాం.
  
మనకు వచ్చే ప్రతి ఫలం రెండు రకాలుగా వుంటుంది. 

(1 ) దృశ్య ఫలం : - ఈ మొదటి రకానికి చెందిన దృశ్య (ప్రతి) ఫలం మనకు, దాదాపు మన పని అయిన వెంటనే వచ్చేస్తుంది.లేకున్నా, మనం చేసిన ఫలానా పనికి - మనకు ఈ ఫలితం (ప్రతి ఫలం) వచ్చిందని - తెలిసిపోతుంది. ఉదాహరణకు - మీరు ఎవరినో, తిట్టారు. వారు వెంటనే తిట్టొచ్చు, లేదా కొట్టొచ్చు. అది మీకొచ్చిన దృశ్య ఫలం.

ఎవరో బస్సులోనో, ట్రైన్ లోనో మరిచిపోయి వదిలేసిన డబ్బు సంచిని - మీరు చూసి, పోలీసు శాఖ వారి ద్వారా, వారింటికి తీసుకెళ్ళి - వొప్పగించారనుకోండి. వొక నెల తర్వాత - మీ యింటికి - ప్రభుత్వం నుండి, ఏదో పారితోషకం రావచ్చు. మిమ్మల్ని అభినందిస్తూ, మీ ఫోటో, న్యూస్ పేపర్లలో - పడవచ్చు. పనికీ, ఫలితానికీ, మనం ముడి పెట్ట గలిగితే అది దృశ్య ఫలం. మీకు తెలియక పోవచ్చు వొక్కో సారి. మిగతా వారికి తెలియ వచ్చు.

మీరు ఎవరింట్లో నైనా - దొంగతనం చేసారనుకోండి  .పది లక్షల రూపాయలు మీరు ఎత్తుకెళ్ళారు. ఎవరూ చూడలేదు. ఎవరికీ మీరు ఎత్తుకెళ్లినట్టు   తెలీదు. యిప్పుడు ఆ పది లక్షల రూపాయలు మీకు లభించిన దృశ్య ఫలం. అయితే, వెంటనే ఎవరో చూసారు, అందరూ లేచి మిమ్మల్ని చితక బాది పోలీసులకు వొప్పగించారనుకోండి. అప్పుడదే దృశ్య ఫలం. మీకు పది సంవత్సరాల జయిలు శిక్ష పడ్డది. అదికూడా దృశ్య ఫలమే. అంటే - కార్యానికీ, ఫలితానికీ నేరుగా వున్న సంబంధం తెలిసేలాగా వుంటే - అది దృశ్య ఫలం.

(2 ) అదృశ్య ఫలం   - మీరు చేసే పని మంచో, చెడో అయితే -  మీ పనికి పూర్తిగా ఫలితం వెంటనే మీకు యివ్వ బడక పోతే - ఈ అదృశ్య ఫలం మీ అదృశ్య ఖాతాలో చేరుతుంది. మంచి పనిని మనం పుణ్యం - అంటాము. చెడ్డ పనిని - పాపం - అని అంటాము. మీ పుణ్యాలకూ, పాపాలకూ, మీకు రావలసిన ఈ అదృశ్య ఫలం - మీరు ఎక్కడికెళ్ళినా, మరో జన్మ కెళ్ళినా కూడా - మీ వెనుకనే వస్తుంది. వీటన్నిటికీ - మీకు ఫలితం వెంటనే యివ్వడం కుదరదు. అందుకే - పాపం పండాలి, అని కూడా అంటారు.

ఈ పుణ్య పాపాల మూటను "సంచిత కర్మ " అంటారు. యిది చాలా ఎక్కువగా వుందనుకోండి  . ఈ జన్మలో అనుభవించినదంతా అనుభవించి - మిగతాది - మరో జన్మకు, మీతో బాటు తీసుకెడతారు.ఈ మూటలో నుండి , ఈ జన్మలో మీరు అనుభవించ గలిగేది - ప్రారబ్ధ కర్మ గా - ఈ జన్మ ఖాతాలో చేరుతుంది. ఈ ప్రారబ్ధ  కర్మ ఫలాన్నే నే మీరు ఈ జన్మలో పొందుతారు.ఈ జన్మలో మళ్ళీ మీరు చేసే కర్మ "ఆగామి కర్మ"  అంటారు. అది మీ సంచిత కర్మతో కలిసి - వాటి ఫలితానికోసం ఎదురు చూస్తుంటాయి.

క్లుప్తంగా -యిదీ కర్మ సిద్దాంతం. కర్మ యోగం అంటే - ఈ కర్మ ఫలాల నుండి బయట పడ గలిగే కర్మ మార్గము. దాన్ని గురించి మరో సారి చూద్దాము.

కర్మ సిద్దాంతం - ఈ ప్రపంచంలో మనకు జరిగే, మనకు వచ్చే ప్రతి ప్రతిఫలాలన్నిటినీ - చక్కగా, విశదంగా, కారణ-కార్య-ఫలరూపాలలో - సశాస్త్రీయంగా  విడమర్చి చెబుతుంది.

మనకు వొక్కో సారి అనిపిస్తుంది. నేను అన్నీ మంచే చేస్తున్నాను కదా. మరి, నాకెందుకిన్ని  కష్టాలు వస్తున్నాయి?
లంచాలు తీసుకునే వాడు బాగానే వున్నాడు. హత్యలు, దోపిడీలు, మాన భంగాలు చేసే వాళ్ళు బాగానే వున్నారు. నాకెందుకీ కష్టాలు. నేను కూడా వాళ్ళ లాగానే వుంటే మేలేమో - అని అనిపిస్తుంది.

మంచివాడికి - కాలం కాదు - అని అనుకుంటాము.

అయ్యా - మీకు వస్తున్నది - మీ యిప్పటి మంచితనపు ప్రతిఫలం కాదు. మీరు జన్మ, జన్మాంతరాల నుండి మోసుకొచ్చిన సంచిలో వున్న సంచిత కర్మ యొక్క ప్రతిఫలం.   మీరు ఈ రోజు మంచి చేసారు.నిజమే. అది - వెంటనే - మీ ఖాతాలో చేర్చ బడుతుంది. మీకు తప్పకుండా - వాటి ప్రతిఫలం, ఎప్పుడో భవిష్యత్తులో వస్తుంది. కానీ ఈ రోజు వస్తున్నది. మీరు ఎప్పుడో చేసిన పనుల ప్రతిఫలం.

దొంగతనాలు, హత్యలు, మానభంగాలు చేసిన వారు - కొన్ని రోజులు ధనికులు కావచ్చు, పేరు ప్రతిష్టలు పొందచ్చు. యం.యల్.ఏ.లు కావచ్చు. యం.పీ.లు కావచ్చు. మరేదైనా కావచ్చు. కానీ - అది వారి సంచిత కర్మలో నుండి తీసి యివ్వ బడుతున్న పాత పనుల ప్రతిఫలం. అది ఏ జన్మదో. కానీ - వారు, ఈ జన్మలో చేసే పనుల మూలంగా - పాత కర్మఫలం త్వరగా ముగిసిపోవడం - ప్రస్తుత కర్మఫలం వాళ్ళను వెన్నాడడము - తప్పకుండా జరుగుతుంది.

మీరు జరుగుతున్న చరిత్ర చూస్తే కూడా - యిది సులభం గానే అర్థమవుతుంది. సంచిత కర్మ ముగియ గానే, వున్న వైభవం పోయి, పదవులూ పోయి, జయిళ్ళ పాలవడం, లేదా, తీవ్ర రోగాలు, లేదా, దుర్మరణాల పాలవడం చూస్తున్నాం గదా. యివన్నీ - కర్మ ఫల దాత చేస్తున్న చిత్రాలే. వారికి - ఎటువంటి పక్ష పాతం లేదు.ఎవరెవరికి యివ్వ వలసింది - వారి వారికి సమయం ప్రకారం ఇస్తూనే వున్నారు. మనకూ అంతే. ఏదో రోగాలు వచ్చాయనుకోండి. మీరు క్రుంగి పోనవసరం లేదు. అది పోతుంది.మీరు చేయ గలిగిన మంచి పనులు మీరు చేస్తూ వుండండి.  అవే మీ భవిష్యత్తుకు, పునాది.బంగారు బాట.

 అయితే - చెడ్డ పనులను, పాపాలను చేసే వారికి మాత్రమే కాదు - చూసే వారికి కూడా పాపం వస్తుంది. అందుకే గాంధీ గారు - అటువంటివి - ఎదిరించమన్నారు. శ్రీకృష్ణుడు, అర్జునునికి అదే చెప్పాడు. అధర్మానికి ఎదురు తిరిగే వారికి - కొన్ని కష్టాలో, అవస్థలో ఎదురైనా - అవి ఖాతరు చెయ్యకుండా ఎదురు తిరగాలి. అదే చాలా గొప్ప, మంచి పని. వారికి - వచ్చే పుణ్యం చాలా గొప్పది. 

మనం సాధారణంగా అదృష్టం, దురదృష్టం - అని అంటూ వుంటాము. అదృష్టం అంటే - మీ మంచిపనులకు, మీకొచ్చిన అదృశ్య (ప్రతి) ఫలం ఎప్పటి పనులదో, ఈ రోజు వచ్చింది.   అదే మాదిరి, దురదృష్టం - మీరు గతంలో చేసిన చెడ్డ పనులకు మీకు యిప్పుడు వచ్చిన అదృశ్య ( ప్రతి) ఫలం.

అయితే - ప్రజలు చేసే చెడ్డ పనుల ప్రతిఫలం కొంత రాజుకూ చేరుతుంది.చిన్న పిల్లలు, భార్య చేసే చెడ్డ పనుల ప్రతిఫలం కొంత భర్తకూ చెందుతుంది. అంటే - ఎవరికి - బాధ్యత వుందో - వారికీ చేరుతుంది. చేసేవారికి మాత్రమే కాదు.రాజులు చేసే చెడ్డ పనుల ప్రభావం - ఆ ప్రజల పైన కూడా పడుతుంది. 

రావణాసురుడు చేసిన చెడ్డ పనుల ప్రభావం లంకా నగర ప్రజలందరి పైనా పడింది. వారెవరూ - రావణాసురుడి చెడ్డ పనులను ఖండించ లేదు గనుక. యిప్పుడూ అంతే. 

మంచి, చెడు - అన్నది ముఖ్యంగా మన మనస్సులలో నుండి వస్తుంది. తరువాత మాటల ద్వారా, చేతల ద్వారా - బహిర్గతమవుతుంది. వాటి ఫలితాల గురించి చూసాము.

యిప్పుడు  -  వీటన్నిటినీ సమన్వయము చేసి చూడండి.

మీరు ఈ రోజు ఏదో చాలా మంచి పని చేసారు. ఉదాహరణకు - వొక అనాథ బాలుడి చదువుకు - వొక సంవత్సరానికయే ఖర్చు మీరే భరించారు. యిది చాలా మంచి పని. యిది చేసేసి, తిరిగి వస్తూ, దారిలో చిన్న గుంతలో పడ్డారు. బాగా తగిలింది. అయ్యో. మంచి పని చేస్తే - దేవుడు మనకిచ్చిన ప్రతిఫలం యిదా - కలికాలం యింతే. అనుకుంటారు.

యిది తప్పు. మీరు గోతిలో పడ్డానికి కారణం -మీరు ఎప్పుడో చేసిన చెడ్డ పని. ఈ రోజు చేసిన మంచి పని కాదు.పాప పుణ్యాల లెక్ఖ సాధారణంగా వేరే అయినా - వొక స్వామీజీ - అన్నారు. "నాయనా, అప్పుడు నువ్వు చేసిన చెడ్డ పనికి నువ్వు లారీ క్రింద పడవలసినది.  కానీ, ఈ మధ్య నువ్వు మంచి పనులే చాలా ఎక్కువగా చేస్తున్నావు. నువ్వు మంచి వాడివి అయి పోయావు. నిన్ను ఎక్కువ బాధ పెట్టడం యిష్టం లేక, గోతిలో పడవేసాను.నీ పాపం పోయిందిలే.సంతోష పడు" అని కర్మ ఫల దాత నిశ్సబ్దంగా నీ చెవిలో అంటాడు. నువ్వు నిశ్సబ్దంగా వుంటే - అదీ నీకు వినిపిస్తుంది.

మన వారు - మంచి పనులకు - పంచ మహా యజ్ఞాలని వొక లిస్టు యిచ్చారు. అవి - ప్రతి వొక్కరూ - ప్రతి రోజూ, చేయవలసిన విధులు. దేవతలకూ, ఋషులకూ, పెద్దవారికీ (పితరులకు), మనుషులకూ, మిగతా యితర ప్రాణులకూ - మీరు (నిస్స్వార్థంగా) చేయ వలసిన - విధులు. దీన్ని గురించి - మరో వ్యాసంలో - యిదే బ్లాగులో రాయబడింది. అదీ చదవండి.

మరి - మంచీ- చెడూ రెండూ కాని పనులున్నాయి కదా. వాటి విషయమేమిటి?  మంచీ-చెడూ కాకున్న  మిగతా, మామూలు  పనులను కూడా -  సరి అయినది, సరి కానిది అని రెండు రకాలుగా చెప్పొచ్చు.  సరి అయిన వాటికి మీకు నచ్చిన ఫలితమూ, కాని వాటికి, మీకు నచ్చని ఫలితమూ సాధారణంగా వస్తూ వుంటుంది.  అది కూడా కర్మ ఫల దాత యిచ్చేదే. యిక్కడే మర్ఫీ సూత్రాలు వొక్కో సారి పనిచేస్తాయి.
ఉదాహరణకు - మీరు ట్రైన్ కు  అర్ధ గంట ముందుగా వెళ్ళారు. అది పుణ్యమూ కాదు. పాపమూ కాదు. సరైన పని. మీరు కష్టం లేకుండా - ట్రైన్ యెక్క గలుగుతారు.వొక వేళ ట్రైన్ అర గంట లేటుగా వచ్చిందనుకోండి. అదేమీ మీ పాప ఫలితం కాదు. మీతో బాటు, మీ ప్రియ   మిత్రుడో (మిత్రురాలో) వుంటే -  ఆ అర గంట ఆలస్యం - మీకు బాగా సంతోషం కలిగిస్తుంది కదా. లేదా - మంచి పుస్తకం చదవవొచ్చు. అప్పుడూ - అదేదో మీకు నష్టం అయిన ఘటన అని మీరు బావించరు.

మీరు రాయాలనుకొన్నప్పుడు, మీ పేనా మొరాయించిందనుకోండి  .  అది కూడా - మీరు చేసిన పాప ఫలితం కాదు. మరో పేనా తీసుకుని రాసేసుకోండి.  యిలా ప్రతి దానిని - సులభంగా తీసుకునే మనస్తత్వం వుంటే, ప్రత్యామ్నాయం కనుక్కునే మనస్తత్వం వుంటే -  మర్ఫీ సూత్రాలు మీపై పని చేయవు.

నిజానికి - యివే కావు - మీకు వచ్చే పాప పుణ్యాల ఫలితాలు కూడా -  మీ మనసు నంటకుండా చేసేసుకోవచ్చు. ఉదాహరణకు - రమణ మహర్షి గారికి రాచ పుండు (కాన్సర్) వుండేది. ఆయన - దానిని ఖాతరు చేయకుండా - హాయిగా గడిపే వారు. అలాగే రామ కృష్ణ పరమ హంస గారు కూడా. వచ్చింది యెప్పటి పాప ఫలితమో. అయినా -  దాని వలన దుహ్ఖ పడితే - పడవచ్చు. దేవుడా - నీవు  ఏదిచ్చినా, నీ ప్రసాదమే - సంతోషం అనుకుంటే - ఆ దుహ్ఖం మరి లేదు మనకు. యిది - జ్ఞాని యొక్క మార్గం.

పాప పుణ్యాల కర్మ ఫలం - కష్ట, సుఖాలు. కష్టాలు అంటే - దరిద్రాలు, రోగాలు, మన వారిని పోగొట్టుకోవడాలు ఇలాంటివి. సుఖాలు అంటే - ధనధాన్యాలు, ఐశ్వర్యాలు, ఆరోగ్యము లాంటివి కలగడం. యివి కర్మ ఫల దాత మనకిచ్చేది. అలాగే - సరికాని పనులు చేసినా - కష్టాలు వస్తాయి.సరి అయిన పనులు చేసినప్పుడు - సుఖాలు వస్తాయి.

మరి - సంతోషం, దుహ్ఖము  అనేవి - కష్ట సుఖాల ఫలితంగా మన మనస్సులో , మనమే - కలుగ జేసుకునేవి. యివి కర్మ ఫల దాత  యివ్వడు.

స్థిత ప్రజ్నుడయిన  వాని మనస్సులో - ఏదొచ్చినా, ఏది పోయినా, సంతోషంగా ఉండగలిగే సామర్థ్యం వుంటుంది. అంటే - సంతోషానికి ముఖ్య కారణం జ్ఞానమే అని చెప్ప వచ్చు.మిగతా కారణాలు - సుఖాలు వచ్చినప్పుడు, కొద్ది కాలం సంతోషం కూడా మనమే మనలో  కలుగ జేసుకుంటాము .కానీ - అది, సుఖం వున్నా కూడా,   త్వరగానే మనల్ని విడిచి పోతుంది.

కష్టానికి కారణం పాపాలూ కావచ్చు,సరికాని పనులు చేయడం కావచ్చు. త్రాగుడు అలవాటు అయితే - అది పాపం కాక పోవచ్చు - కానీ కష్టాలకు కారణం తప్పకుండా అవుతుంది. త్రాగుడులో - పాపాలూ చేస్తారు.

అయితే - దుహ్ఖానికి కారణం అజ్ఞానమే - అని తప్పకుండా చెప్ప వచ్చు. అంటే - కష్ట సుఖాలన్నిటిలో -  మీరు  సంతోషం గా వుండ గలరు.అది మీ చేతిలో వుంది.

ఇదండీ   - కర్మ సిద్దాంతం. యిది తెలుసుకుంటే - మనం కర్మ యోగానికి వెళ్లి పోవచ్చు.

= మీ

వుప్పలధడియం విజయమోహన్

1 కామెంట్‌: