మర్ఫీ సూత్రాలు = జీవితం వేసే తప్పటడుగులు
ఆంగ్లం లో మర్ఫీ సూత్రాలు అని - అందమైన, బాగా ప్రచలితమైన సూత్రాలు కొన్ని వున్నాయి.
అవి - ప్రపంచంలో మనం -సాధారణం గా - గమనించే , కొన్ని పనులు - వాటి పరిణామాల గురించి వినోదం గానూ, వినూత్నం గానూ, అదే సమయంలో, హృదయానికి హత్తుకునే - అక్షర సత్యాల లానూ - చెబుతాయి. అయితే యివన్నీ - నిరాశా వాదం గానూ, సంశయాత్మక వాదం గానూ, ఎక్కువగా కనిపిస్తాయి.
అనుమానపు పుట్ట అని అనుకునే మనుషులకు తమ జీవితమంతా యిలాగే కనిపించొచ్చు.
కానీ - వొక్కో సారి, ప్రతి మనిషి జీవితంలోనూ - ఇలాంటి సంఘటనలు - కొన్ని రోజుల పాటో, వారాల పాటో, నెలల పాటో , సంవత్సరాల పాటో - కూడా జరుగుతూ వుండడం మనం చూడొచ్చు . మనుషుల జీవితాల్లోనే కాదు - దేశాల జీవితాల్లోనూ, సంస్థల జీవితాల్లోనూ కూడా యిలా జరగడం మనం చూడొచ్చు.
మనకు ఎన్నో సామెతలు వున్నాయి.
కష్టాలు చెప్పి రావు. వస్తే వొక్కటిగా రావు. నిండా మునిగిన వాడికి చలేమిటి. ఇలాంటివి.
చాలా మంది శతక కారులు కూడా ఈ విషయాలను అక్కడక్కడా విధ విధాలుగా చెప్పారు. "మోహరమున తానెక్కిన పారని గుఱ్ఱము" వెంటనే విడిచిపెట్టండని, సుమతి శతక కారుడు సలహా యిచ్చాడు. మీరు యుద్ధానికి వెళ్లారు. వెళ్లేంత వరకు బుద్ధిగా వున్న మీ గుఱ్ఱము - తరువాత ముందుకూ వెళ్ళడం లేదు. పోనీ, వెనక్కూ వెళ్ళడం లేదు. మీరేం చేస్తారు?
అయితే - సుమతి శతక కారుడు , ఏం చేయాలో సలహా యిస్తాడు. మర్ఫీ సూత్రాలలో - సలహా వుండదు. యిలా జరగవచ్చు. అలా జరగవచ్చు అని సూచన మాత్ర మే వుంటుంది.
అయితే - మర్ఫీ సూత్రం అని మొదట పిలువ బడ్డది - ఎవరు చెప్పారో, ఎవరు రాశారో, ఖచ్చితంగా ఎవరికీ తెలీదు. యిప్పుడు మాత్రం - ప్రతి మనిషి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలన్నీ - మర్ఫీ సూత్రాల్లోకి చేరిపోతున్నాయి. యిప్ఫుడవి వేల సంఖ్యలో వున్నాయి. మీరు కూడా, వాటికి - మరిన్ని సూత్రాలు చేరుస్తూ పోవచ్చు. అప్పుడు మీరూ మర్ఫీయే!
మర్ఫీ సూత్రాలు యిలా వుంటాయి :
- ఈ ప్రపంచంలో, ఏదీ - ఎప్పుడూ చెడిపోకుండా, ఎప్పుడూ వొకే లాగా వుండేలా - చెయ్య బడ లేదు. కాబట్టి - ప్రతి వొక్కటీ - ఎప్పుడో వొకప్పుడు - చెడిపోతుంది.
- ఏదైతే యిలా చెడి పోగలదో - అది మీరు ఎదురు చూడనప్పుడు చెడిపోతుంది.
- ఏదైతే తప్పుగా జరగవచ్చో - అది మీరు ఎదురు చూడనప్పుడు తప్పుగా జరుగుతుంది.
- యిలా జరిగేది - మీకు కష్టమూ, నష్టమూ, పరవు నష్టమూ లాంటివి (చాలా ఎక్కువగా) కలిగే సమయంలో - జరుగుతుంది .
- యిటువంటి సంఘటనలు - మీ తప్పు గా, అందరికీ కనిపించ గలిగే సమయాల్లో - జరుగుతుంది.(విరిగే స్థితిలో వున్నది, మీరు తాకినప్పుడు విరుగుతుంది)
- మీ చుట్టూ, చాలా విషయాలు, వస్తువులు, సంఘటనలు..చెడిపోయే ఆవకాశం వున్నవి - వాటిలో, మీకు బాగా నష్టం కలిగించేది, మీరు ఎదురు చూడని సమయం లో - చెడి పోతుంది.
- మీరు (ఇది యిప్పట్లో ) చెడి పోదు అనుకునేది, మీరు - అస్సలు ఎదురు చూడని సమయంలో - చెడి పోతుంది.
- మీరు ఏదైనా విషయం (వస్తువులు, సంఘటనలు...) - ఏదో నాలుగు రకా ల పరిస్థితులలో చెడి పోవచ్చు - అని క్షుణ్ణంగా తెలుసుకొని, వాటి పరిష్కారాలు కూడా సిద్ధంగా వుంచుకుంటే - మీకు తెలియని, ఐదో రకంగా చెడిపోవడానికి సిద్ధం అవుతుంది.
- ఏ విషయమైనా - మీ పర్యవేక్షణలో లేకుండా వుంటే - బాగున్నది కూడా త్వరగా చెడి పోతుంది. అలా చెడి పోయింది, త్వరగా కుళ్ళి పోతుంది. అలా కుళ్ళి పోయింది -మీరు భరించ లేకుండా అయి పోతుంది.అప్పుడే - మీకు తెలిసి వస్తుంది.
- మీ పర్యవేక్షణలో వున్నది - చెడి పోదన్న గ్యారంటీ ఏమీ లేదు.
- ఏది త్వరగా చెడి పోగలదో - అది - అన్నిటి కంటే క్రింద - మీ కంటికి కనిపించ కుండా వుంటుంది.
- మీ కంటికి కనిపించ కుండా వున్నది - మీకు తెలియ కుండా, తను చెడడమే కాకుండా - బాగున్న వాటిని కూడా చెడపడానికి - ప్రయత్నం చేస్తుంది.
- ఈ రోజు చాలా మంచి రోజు. ఎందుకంటే , రేపు చాలా విషయాలు చెడిపోతాయి. రేపు చెడ్డ రోజు. కాబట్టి, ఈ రోజు మంచి రోజు. ఈ రోజు నవ్వండి....ఎలాగైనా...
- మీరు మాత్రం నవ్వ లేని సమయంలో - ఎదురుగా వున్న వారు చాలా మంది నవ్వుతూ కనిపిస్తారు.
- చాలా సమస్యలలో - మీకు, అసలు సమస్య ఏమిటో తెలీదు. సమస్య తెలిసేటప్పటికి - సమాధానం పనికి రాకుండా పోతుంది.
- మీరు, చాలా రహస్యంగా వుంచాలనుకునే విషయాలు, ఎవరికి చెప్పకూడదో - వారి ముందే, పదే పదే జ్ఞాపకం వస్తుంది. ఎవరికో, వొకరికి చెప్పకుండా మీరు వుండడం చాలా కష్టం అని అనిపిస్తుంది.
- అందు వలన - మీరు, వేరే ఏదేదో విషయాలు, అసంబద్ధంగా వాళ్లకు చెబుతారు.
- మీరేదో దాస్తున్నట్టు - వారికి తెలిసిపోతుంది.
- ఏ సమస్యకైనా - మనం ఇచ్చే పరిష్కారాలవలన - వున్న సమస్య ఎంత పోతుందో కాని - కొన్ని క్రొత్త సమస్యలు రానే వస్తాయి.
- మీకు ఈ రోజు ఏ సమస్యా రాక పోతే - రేపు రెండు సమస్యలు వస్తాయి.
- మీకు బాగు లేకున్న రోజునే - మీ భార్య (లేదా భర్త) మిమ్మల్ని ఎక్కువగా విసిగిస్తారు.
- నెలాఖరునే - ఖర్చులెక్కు వొస్తాయి.
- నెలాఖరునే - బంధువు లెక్కువగా వొస్తారు.
- మీరు చెట్టు క్రింద కూర్చున్న చోటికి పైనే - కాకి కూర్చుంటుంది. (రెట్ట వేస్తుంది)
- మీకు ముఖ్యంగా కావలసిన వస్తువును, మీరు పెట్టిన చోట తప్ప - మిగతా అన్ని చోట్లలో వెదుకుతారు.
- మీ కళ్ళద్దాలు కనిపించక పోతే - ఇల్లంతా వెదుకుతారు . కడపట, మీ కళ్ళ ముందే చూస్తారు.
- మీ పెన్ దొరక్క పోతే - కొత్తడి కొనండి. తరువాత పాతది దొరుకుతుంది.
- మీరు నుంచున్న క్యూ కు, ప్రక్క నున్న క్యూ, శీఘ్రంగా ముందుకు వెళుతూ వుంటుంది .
- మూర్ఖుడితో - వాదులాడకండి. "చూసే వారికి" మీరెలా కనిపిస్తారో, ఎందుకో - మీకు మాత్రం అర్థం కాదు.
- మీ నాన్నకు జవాబు తెలీక పోతే - మిమ్మల్ని కొడతారు (చిన్న పిల్లలకు తెలిసిన సూత్రము)
- బాత్ రూమ్ లో ఎవరు కాలు జారి పడ్డా - అంతకు ముందు స్నానం చేసి, సోపునీళ్ళు బాత్ రూమంతా పోసిన వారు - మీరే అని - అందరూ అనుకుంటారు.
- మీరు పడితే మాత్రం - "అంత మాత్రం చూసుకుని పోరా, ఎవరైనా" - అని అంటారు.
- మీరు బస్సు కోసం క్యూలో నిలబడితే - టికెట్లు మీ ముందు వారి వరకు వచ్చి - బస్సు నిండి పోతుంది.
- మరో బస్సు రెండు గంటలు లేటుగా రావచ్చు.
- మీ బాసు పైన మీకు చాలా సార్లు కోపం వస్తుంది. కానీ ప్రయోజనం లేదు. అందు వలన - మీరు ఎవరెవరితోనో - కొట్లాడుతారు. అయినా కోపం తగ్గదు. ఎలా తగ్గుతుందో మీకు తెలీదు.
- మీరు భద్రంగా, రహస్యంగా దాచి పెట్టిన వస్తువులు ఎంత వెదికినా - మీకు కనిపించదు.
- ఏ.టీ.యం - లో మీ డెబిట్ కార్డు ను పెట్టి మీ పిన్ నంబరు కొడితే - రాంగు నంబర్ అంటుంది . మీకు తెలుసు - మీరు పిన్ నంబర్ కరెక్టు గానే కొట్టారని. వేరే మార్గం లేక బయటికి వచ్చేస్తారు. వచ్చేసాక గుర్తు వస్తుంది - మీరు పెట్టిన డెబిట్ కార్డు తప్పని.
- మీ ముఖ్యమైన పరీక్ష రోజునే - మీకు యిష్టమైన మంచి సినిమా వస్తుంది .చూస్తారు. లేదా, అర్ధ మనసుతో చదువుతారు. అలా కాకపోతే - ఆ రోజే క్రికెట్ మాచ్, టెండుల్కర్ బాగా ఆడుతుంటాడు. ఫలితం - మీకు పది శాతం మార్కులు తగ్గుతుంది.
- మీకు నచ్చనివన్నీ - మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. నచ్చినవి రావు. లేదా - మీ ఇంటరెస్టు పూర్తిగా పోయిన తర్వాత వస్తుంది.
- మీకు నచ్చిన సినిమాకు మీ ఆవిడ రాదు. ఆమెకు నచ్చే సినిమా మీకు పరమ బోరు.
- మీరు ఏదీ అనుభవించే లోగానే - మీకు వయస్సు అయిపోతుంది. లేదా - అయిపోయినట్టు అనిపిస్తుంది.
- మీరు చేసే గొప్ప పనులు, తెలివి గల పనులు - ఎవరూ చూడరు. మీరెప్పుడైనా - ఏ వొక్క మూర్ఖపు పని చేసినా - అది అందరూ చూస్తారు. మీరు చేసేవన్నీ అలాంటివే -అని అనుకొంటారు లేదా అంటారు.
- నవ వచ్చే చోట గోక కుండా - వుండలేరు. గోకిన చోటంతా నవలు పెద్దదవుతుంది. కొత్త చోట్లకూ ప్రాకుతుంది.
- మీకు జరిగే మంచి - చాలా త్వరగా వెళ్లి పోతుంది. చెడ్డ మాత్రం - మీరు వద్దు మొర్రో అన్నా పోదు.
- ఉన్నట్టుండి - యింటి నిండా చీమలు కనిపిస్తాయి. కానీ -ఈ చీమలు ఎక్కడ పుట్టలు పెట్టాయో ముందుగా కనుక్కోవడం మాత్రం చాలా కష్టం.
- టీ.వీ. యాడ్ చూసి బ్యూటీ క్రీమ్ రాస్తే - మీకు మాత్రం మొహమంతా గుల్లలు వస్తాయి.
- మీరు కట్టిన చీర కంటే - మీ పక్కింటావిడ కట్టిన చీర ఎప్ఫుడూ బాగుంటుంది.
- మీరు కొన్న చీర కంటే - మీరు షాపులో - వద్దని వదిలేసిన చీర బాగుంటుంది. అయినా,యిది - యింటికి వచ్చిన తర్వాతే - మీకు బాగా అర్థమవుతుంది. పూర్తిగా తెలిసి పోతుంది. షాపులో చెప్పనందుకు మీ వారిపై కోపం వస్తుంది.
- మీ ఆవిడ మాటలు (చాలా) - మీకు అర్థమయి చావవు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - అని తెలిసినా - ఆ అర్థాలు యేవో మీకు తెలియదు. మీ భర్తకు మీరు ఏం చెప్పినా సరిగ్గా అర్థం కాదు.
- ప్రపంచంలో - మీరు ఏం చేసినా, ఎంత సంపాదించినా -మీ కంటే - మీ ప్రక్కనింటాయన సుఖంగా వున్నట్టు - మీకు అనిపిస్తుంది. మీ ప్రక్కనింటావిడ సుఖంగా వున్నట్టు - మీ యావిడకూ అనిపిస్తుంది.
ఇదండీ మర్ఫీ సూత్రాల కథ. యిలా మనం ఎన్నైనా, రాసుకుంటూ పోవచ్చు. మీ - ఇలాంటి అనుభవాలన్నీ క్రోడీకరించి -మొదట వొక డయిరీ రాసి - మీ మనమడికో, మనమరాలికో మాత్రం చూపించేలా - విల్లు రాసేసుకోండి .
దీనికి వొక కారణం - మనం మంచి జరిగేది గుర్తు పెట్టుకోం. చెడు జరిగేది మర్చిపోం.
పది సంవత్సరాల తర్వాత కూడా - ఎప్పుడో జరిగిన చెడు గుర్తుంటుంది. మంచి వొక వారం తర్వాత కూడా గుర్తుండదు. యిందులో -ఆడవారికీ, మగ వారికీ కాస్త తేడా మనం గమనించొచ్చు. దాన్ని గురించి మరోసారి చూద్దాం. తెలిసుంటే - మీరే చెప్పండి.
మన అందరి జీవితాల్లో మంచీ - చెడూ -రెండూ - జరుగుతాయి. కొందరి జీవితాల్లో - మంచి ఎక్కువగా, చెడు తక్కువగా జరగొచ్చు. మరి కొందరి జీవితాల్లో - మంచి తక్కువగా, చెడు ఎక్కువగా జరగొచ్చు.
ఎందుకిలా? మీ జీవితం ముందు ముందు ఎలా వుండ బోతుంది ? మీ జీవితంలో, మంచి ఎక్కువగా జరగాలంటే మీరేం చెయ్యాలి?
యివన్నీ, కారణాల తో సహా - శ్రీకృష్ణుల వారు తన గీతోపదేశం లో విశదం గానే చెప్పారు. అది మరో వ్యాసంలో.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
Theres another corollary to Murphy's law. that is... "If Murphy's law can go wrong, it will." :-D
రిప్లయితొలగించండిమర్ఫీ సూత్రాలు - అన్ని సందర్భాల్లో తప్పకుండా జరిగే విషయాలు కావు. అవి మినహాయింపు సూత్రాలు మాత్రమే.(ఎక్సేప్ష న్ లాస్). కాబట్టి - మర్ఫీ సూత్రాలు జరగ వచ్చు. జరగక పోవచ్చు. యిది కూడా వొక మర్ఫీ సూత్రమే. మీరు చెప్పింది నిజమే.తరువాత వ్యాసం లో - దీనికి గల కారణ కార్యాలను చర్చిస్తాం. అదీ చదవండి.
రిప్లయితొలగించండి