8, అక్టోబర్ 2011, శనివారం

శారీరక ఆరోగ్యం - మానసిక ఆరోగ్యం - సమీకృతాహారం - వాత, పిత్త, కప్హ దోషాలు - సత్వ, రజస్, తమస్ గుణాలు


శారీరక  ఆరోగ్యం - మానసిక  ఆరోగ్యం
ఈ బ్లాగు పేరు దీర్ఘ దర్శి . మనం జీవితంలో ఎలాంటి సంఘటనలను సంధిస్తామో, వాటినెలా ఎదుర్కొంటామో - మన జీవిత లక్ష్యమేమిటో -అదెలా సాధిస్తామో - ఇలాంటివన్నీ కూలంకషంగా చర్చించడమే - ఈ బ్లాగు లక్ష్యం.

గౌతమ బుద్ధుడి కథలు మీరు చదివే వుంటారు. యశోధనుడు కొడుకైన సిద్దార్థుడిని   చాలా అపురూపంగా, కష్టాలేవీ తెలీకుండా పెంచాడు. అతనికి - చాలా సౌందర్యవతి, గుణవంతురాలు అయిన  యశోధర తో వివాహం చేయడం, రాహులుడనే  కొడుకు  పుట్టడమూ   కూడా జరిగింది. 

సరే. వొక రోజు, వొకే వొక రోజు, సిద్ధార్థుడు, నగర వీధులలో, రథంలో వెడుతూ - మూడు రకాల సంఘటనలు చూస్తాడు. మనమంతా అప్పుడప్పుడూ చూసేదే. 

చనిపోయిన శవాన్నెత్తుకుని  బంధువులంతా  ఏడుస్తూ వెళ్ళడం చూసాడు. సారథిని - అదేమిటి - అని అడిగాడు. సారథి వివరంగా చెప్పాడు.  నేనూ చనిపోతానా - అని అడిగాడు. అవును అని సమాధానం వచ్చింది. మరి - యశోధర? ఆమె కూడా. తండ్రి యశోధనుడు?    ఆయనే ముందుగా పోతాడు. రాహులుడు? మీ తరువాత పోతాడు. అందరూ కాస్త ముందుగానో, వెనుకనో -  పోవలసిన వాళ్ళమే -అని సమాధానం వచ్చింది. ఎక్కడికి పోతాము ?  ఏమో,తెలీదు - కానీ, శరీరాన్ని మాత్రం కాల్చడమో, పూడ్చడమో చేస్తాము. మళ్ళీ రావడం జరగదు.

కాస్త వెనుకగా - వొక ముసలాయన , వంగిన, ముడుతలు పడ్డ  శరీరంతో, చేతిలో కట్టెను పట్టుకుని,   మెల్ల, మెల్లగా అడుగులు వేస్తూ - నడుస్తుండడం గమనించాడు -సిద్ధార్థుడు. తన తండ్రి శరీరానికీ, యితనికీ -కాస్త  ఏదో - పోలికలు కనిపించాయి. సారథిని అడిగాడు. సారథి - ముసలితనాన్ని గూర్చి విశదంగా చెప్పాడు. మళ్ళీ అదే ప్రశ్నలు. నేనూ ముసలి వాడినవుతానా? నువ్వే కాదు - ప్రతి వొక్కరు ముసలి వాళ్ళవుతారు. తరువాత చని పోతారు - అని సారథి చెప్పాడు. సిద్ధార్థుడికి మనసులో - గుబులు బయల్దేరింది. నేనూ యిలా ముసలి వాడినయి, చని పోయి, శవంగా మారి - కాలిపోతానా? యిదా నిజం?ఈ నిజం తొందరగా మనసులో - జీర్ణం కావడం లేదు.

అంతలో - రహదారి కొసలో - వొక కుష్టు రోగి కుంటుతూ వెడుతూ కనిపించాడు.అతని చేతులు కాళ్ళు సరిగా లేక పోవడం చూసాడు. మళ్ళీ సారథిని అడిగాడు. సారథి వోపికగా -విశదంగా - రకరకాల రోగాలు, అవి ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, వాటికి ఏం చెయ్యాలి - అన్నీ చెప్పాడు. కానీ, సిద్ధార్థుడి మనసులో - మళ్ళీ పాత ప్రశ్నలు పైకి రేగాయి. రోగాలు అందరికీ వొస్తాయా? అవును. అందరికీ వొస్తాయి. కానీ- ఎవరికి, ఏ రోగం ఎప్పుడు వస్తుందో చెప్ప లేము. ప్రతి వొక్కరికీ - ఎప్పుడో వొకప్పుడు, ఏదో వొక రోగం రాక మానదు. కొన్నిటికి మందులు వున్నాయి. కొన్నిటికి మందులూ లేవు.

పుట్టిన ప్రతి పాపా - యౌవనవంతులవడం -ఎంత సహజమో - రోగాలూ, ముసలి తనమూ, చావూ - అంతే సహజమని - ఆ వొక్క రథ యాత్రలో - సిద్దార్థుడికి తెలిసి పోయింది.

ఏదేది సుఖమనుకున్నాడో - అవన్నీ - చివరికి - దుహ్ఖాలకు దారి తీస్తాయని - యిది తప్పకుండా జరిగి తీరుతుందని తెలిసి పోయింది. మరి ఎందుకీ జీవితం? దీని పరమార్థం ఏమిటి? దీని లక్ష్యం ఏమిటి? 

ఈ రోగాలు, ముసలితనాలు , కష్టాలూ, శోకాలూ - యివి లేకుండా, ఆనందంగా వుండ గలగడం సాధ్యమా?

యిది తెలుసుకోవాలన్న తపన - మనకెవరికీ కలుగనంత బలవత్తరంగా -   సిద్ధార్థుడి మనసులో కలిగింది.

రాజ భవనానికి వచ్చాడే కాని - తన తండ్రి  మొహంలో యిప్పుడు  ముసలి తనం  స్పష్టంగా కనిపిస్తూ వుంది. రాత్రి పక్కనే వున్న యశోధర మొహంలో - ఏ మాత్రం ఆకర్షణా కనిపించలేదు. రాహులుడి  మొహంలో - పసితనం, అమాయకత్వం కనిపించ లేదు. ముందు ముందు జరగబోయేది కనిపిస్తూ వుంది. 

ప్రతి వొక్కరు, వారి వారి ప్రయాణంలో - వారు వున్నట్టు కనిపిస్తూ వుంది. దీనికి అర్థమేమిటి? ఈ జీవన ప్రయాణం ఏ గమ్యానికి? యిది తెలియకుండా - యిక  నిద్ర పట్టనంటుంది.

అంతే. అక్కడి నుండి, రాచ నగరు విడిచి వొంటరిగా బయల్దేరాడు.మరెన్ని ఏండ్లకో, ఎన్నో ప్రయత్నాల తరువాత, ఎంతో మంది గురువుల దగ్గర  శుశ్రూష తరువాత  -  బోధి వృక్షం క్రింద - జ్ఞానో దోయం అయ్యింది.   గౌతమ బుద్దుడయ్యాడు.  

బుద్ధుడికి జ్ఞానోదయం అయినప్పుడు  - ఆయన దగ్గర ఎవరూ లేరు.వొంటరి వాడే. ఆ సమయంలో - చాలా సేపు నవ్వుకున్నాడట. జీవిత మర్మం యింత సరళ మైనదా ; యింత సులభమైనదా, యిది కూడా నాకెందుకు అర్థం కాలేదు? అని చాలా సేపు నవ్వుకున్నట్టుగా   వొక కథ చెబుతారు. అదే - లాఫింగ్ బుద్దా విగ్రహాలుగా మనం చూస్తుంటాము. యిది ఎంత నిజమో మనకు తెలీదు కానీ -  జీవిత మర్మం చాలా సరళమేనని -  చాలా సార్లు బుద్ధుడనడం మనం చదవవొచ్చు.

మీరు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాల్సిన పని లేదు. మీకు మీరు అర్థమయితే - చాలునన్నది - వొక ముఖ్యమైన సిద్దాంతం. బుద్ధుడు చెప్పిందీ అదే. మన వేదాంతంలో - వుపనిషిత్తుల్లో -  చెప్ప బడిందీ  అదే.

మీకు మీరు అర్థం అయ్యారా?

మీరంటే - మీకు పూర్తిగా, యిష్టముందా? 

మిమ్మల్ని   మీరు  వొక్క సారి తనివి తీరా అద్దంలో చూసుకోండి. కనీసం మీ శరీరాన్ని , ముఖ్యంగా మీ ముఖాన్ని, మీరు వొక్క సారి పూర్తిగా చూడండి. మీలో - మీకు నచ్చినవి ఏమిటి? నచ్చనివి ఏమిటి? వొక్క సారి రాయండి.

నచ్చనివి - ఎందుకు నచ్చలేదో కూడా రాయండి. 

యిప్పుడు మీ వయసు యిరవై వుండొచ్చు. నలభై వుండొచ్చు. అరవై వుండొచ్చు. యిన్ని ఏళ్ళలో - ఎప్పుడైనా - మీ శరీరాన్ని వొక్క సారైనా, పూర్తిగా చూసారా?  లేదు. లేదని నాకు తెలుసు.కనిపించే తమ శరీరాన్ని (అంటే శరీరపు పై చర్మపు పొర మాత్రమే) కూడా ఎవరూ పూర్తిగా చూడనూ లేదు. తెలుసుకోనూ లేదు. ఈ శరీరానికి నిజంగా, ఎప్పుడెప్పుడు, ఏదేది అవసరమో - కూడా మనకు తెలీదు.

ఇప్పుడున్న, మీకు తెలిసిన వాళ్ళందరి యిళ్ళలో -  అసలు- రోగాలే లేని వాళ్ళున్న ఇల్లు ఏదైనా వుందా - అని కాస్త వెతకండి. ఏదీ వుండదు. ఎవరికో వొకరికి ఏదో వొక రోగం వుండనే వుంటుంది. వయసుతో నిమిత్తం లేకుండా.  

బాగా వయసయిన వాళ్ళుంటే  -  రోగాల సంఖ్య కాస్త ఎక్కువగా వుంటుంది. వయసు తక్కువగా వుంటే - రోగాలు తక్కువగా వుండొచ్చు.నలుగురున్న యింట్లో - కనీసం వొక్కరికైనా - ఏదో వొక రోగం  - ఈ రోజు, యిప్పుడు కూడా - వుండనే వుంటుంది. అంటే - ఎప్పుడూ, ఎవరికో వొకరికి వుంటుందన్న మాటేగా. మీరు, ఏ దేశానికి వెళ్ళినా - యిది మాత్రం తప్పక గమనించ వచ్చు. అంటే - మీరున్న యింట్లో - ఎవరున్న యింట్లో అయినా - రోగాలకు - స్థిర నివాసం వుందన్న మాట. మనమంతా - వొకే త్రాటి పైన నడుస్తున్నాము. జ్ఞాని అయిన బుద్దుడికీ రోగాలు వచ్చాయి. రమణ మహర్షికీ వచ్చాయి. రామకృష్ణ పరమ హంసకూ వచ్చాయి. స్వామి వివేకానందుడికీ   వచ్చాయి.మహా బలశాలులకూ వచ్చాయి. మనం పుట్టిన మొదటి రెండు సంవత్సరాల్లోనే - మనకు ఎన్నో రోగాలు వస్తాయి. అవి తగ్గడానికి - మన తల్లిదండ్రులు పడే శ్రమ మనకు తెలుసు. రోగం రాని వాడెవడూ -  భూమ్మీద పుట్ట లేదు.

సరే. కనిపించే శరీరానికి యిన్ని రోగాలు.  మరి కనిపించని మనసుకో? 

మన పూర్వీకులు అన్నారు కదా - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, భయము - యివి  మనసుకు పట్టే ముఖ్యమైన రోగాలు. యివి అందరికీ వస్తాయి.
 వొక్క సారి మిమ్మల్ని గురించి మాత్రం మీరు అనుకోండి. దాదాపు యివన్నీ మీకూ వున్నాయి కదా. అప్పుడప్పుడూ వస్తూ వుంటాయి. పోతూ వుంటాయి. యివి వచ్చినప్పుడు - మీరెప్పుడైనా - చాలా సంతోష పడ్డారా? లేదు కదా? 

అంటే - దాదాపు - అందరూ - మానసిక రోగ గ్రస్తులే. యివి, మన ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో - రోగాలుగా చెప్ప బడలేదు. కానీ - మనం చేసే ప్రతి నేరానికీ కారణం - యివే. యివి మనసులో లేక పోతే - శారీరకంగా ఏ నేరమూ జరుగదు.

యివి కాక - చదివినవి మరిచిపోవడం, అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సంస్ వ్యాధి,  పిచ్చి, లాంటి మానసిక వ్యాదులెన్నో వున్నాయి.  వాటిని గురించి మనం యిప్పుడు మాట్లాడడం లేదు. 

పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో - యోగానికి కూడా ప్రతిబంధకాలుగా - మనం పైన చెప్పిన శారీరక రోగాలు, మానసిక రోగాలనే చెబుతాడు. ముసలి తనం గానీ, చావు గానీ - తప్పించుకోలేం. కానీ - రోగాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. 

మరి యివి ఎలా తగ్గించుకోవడం? పోగొట్టుకోవడం కూడా సాధ్యమా?

వీటిని గురించి కొన్ని వ్యాసాలలో చెప్పుకుందాం.

మొదట శారీరక రోగాలను తగ్గించుకోవడం గురించి  - క్లుప్తంగా యిక్కడ చూద్దాం.

ఆధునిక  భౌతిక శాస్త్రం ప్రకారం - మనకు - సమీకృతాహారం  కావాలి. కార్బో హైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, క్రొవ్వుపదార్థాలూ - అన్నీ వున్న ఆహారం కావాలి.

యిందులో - ఏది తక్కువైనా, ఏది ఎక్కువైనా - కష్టమే. యింత వరకూ మనకు తెలుసు.అయినా - సమీకృతాహారం కాని వాటినన్నిటినీ -మనం తింటున్నాము .

సమీకృతాహారం వుంటే చాలా? చాలదు.  మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం - శరీరంలో - వాత, పిత్త, కప్హ దోషాల ప్రమాణం సమానంగా వుండాలి. దేహంలో వచ్చే చాలా రోగాలకు - వీటి సమానత్వం చెదరడమే కారణంగా చెబుతారు. ఈ దోషాలలో ఏది ఎక్కువైనా దానికి తగ్గ రోగాలు వస్తాయి. దానికి తగ్గ ఆహారమూ, మూలికా వైద్యమూ తీసుకుంటే - సరిపోతుంది.

కానీ - రోగాలు రాకుండా వుండాలంటే - యిదీ చాలదు.

శరీరంలో మూడు దోషాలు సమతుల్యంగా వుండాలన్నది నిజమే అయినా - శరీరం చేయబడింది మూడు గుణాలతో అన్నది - అంతకు ముందు నుండే వున్న శాస్త్రము. వీటిని సత్వ, రజస్, తమస్ - అని అంటారు.

సత్వ గుణం ప్రధానంగా వున్న వారికి - దాదాపుగా - మానసిక రోగాలేవీ రావు. అన్ని మానసిక వృత్తులూ, వారి అధీనంలో వుంటాయి. శారీరక రోగాలూ వీరికి తక్కువే. వీరిలో - శాంతము, సంతోషము, దయ లాంటి గుణాలు ఎక్కువగా మనం చూడొచ్చు. కామము వుండదని కాదు. అది ధర్మ మార్గంలోనే పొందుతారు.

రజో గుణం ప్రధానంగా వున్న వారికి కోపము, ద్వేషము, కామము, మదము  - లాంటివి ఎక్కువగా వుంటాయి. యివి 24  గంటలూ వుంటాయని కాదు. వీరి ప్రవృత్తిలో - యివి  ఎక్కువ అని తెలుసుకోవాలి. తొందరపాటు, కక్షలూ, కొట్లాటలు, యివి సత్వ గుణ ప్రధానుల కంటే - వీరి జీవితాల్లో చాలా ఎక్కువ.

తమో గుణం ప్రధానంగా వున్న వారికి- లోభం, మాత్సర్యము, అలసత్వము, సోమరితనము, నిద్ర -యిటువంటివి ఎక్కువగా వుంటాయి.

అంటే - ప్రతి మనిషిలోనూ- అన్ని గుణాలూ - కొద్దో, గొప్పో వుండనే వుంటాయి. ఏ గుణం ప్రధానం గా వుందన్నదే   ముఖ్యం. సత్వ గుణ ప్రధానులకూ నిద్ర కావాలి కదా. కొద్దో గొప్పో కోరికలూ వుంటాయి కదా.  

అయితే - గుణాలలో - విశిష్ట గుణం అంటే - సత్వమని, దాని తరువాత రజస్ అనీ, చివరిది తమస్ అని -  తప్పకుండా చెప్పాలి.

మరి - ఈ గుణాలు మనకెలా వస్తాయి - అని శ్రీకృష్ణుడు భగవద్ గీతా శాస్త్రంలో - గుణ త్రయ విభాగ యోగం లోను, యితర యోగాల్లోనూ  - కొంత వరకు చెప్పాడు.   ఎందరో రుషులో కూడా   దీన్ని గురించి చెప్పారు.

అంటే - మనకు - ఆధునిక శాస్త్రాల్లో చెప్ప బడ్డ సమీకృతాహారము కావాలి.  అది మన దేహం లోని దోష త్రయాన్ని సమన్వయ పరిచేలా వుండాలి. అందులోనూ - సత్వ గుణ ప్రధానంగానూ - తగినంత రజోగుణ,తమోగుణాలు కూడా  వుండే   లాగానూ వుండాలి. ఈ రెండవ, మూడవ విషయాల్ని గురించి - ఆధునిక శాస్త్రాలకు అస్సలేమీ తెలీదు.

యివి రాబోయే వ్యాసాల్లో - విశదంగా చూద్దాము.
యివి చాలా మన ఆరోగ్యానికి?

చాలదు.

మనకు తెలుసు. మంచి నీళ్లుండాలి. మంచి గాలి వుండాలి. "ఎప్పుడు ఎడతెగక పారు యేరు" వున్న చోటే వుండ  మన్నాడు సుమతి శతక కారుడు. మంచి వైద్యుడు కూడా వున్న చోట వుండ మన్నాడు.

యిదీ చాలదు. మనకు మంచి చెప్పే స్నేహితులో,గురువులో - వున్న చోట వుండమన్నారు - అది శంకరాచార్యులు, చాలా మంది శతక  కారులూ.

యివన్నీ వుంటే -   మన శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండూ - బాగుంటాయి.

వీటిని గురించి మరింత విశదంగా - వచ్చే వ్యాసాల్లో చెప్పుకుందాం.

= మీ
వుప్పలధడియం విజయమోహన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి