23, అక్టోబర్ 2011, ఆదివారం

మనసే మిత్రుడు-మనసే శత్రువు - కోరికలు రెండు విధాలు - కోపమొస్తే - ధైర్యమూ, బుద్ధిబలమూ - వున్న చోటే సంతోషము, విజయము


క్రిందటి వ్యాసంలో మానసిక ఆరోగ్యాన్ని గురించి కొంత తెలుసుకున్నాము.

మన మనస్సు చేసే పని చాలా చిత్రమైన పని.
  • ఎప్పుడూ -వొకదానితో మరొకటి బేరీజు వేసి యిదా,అదా అని చూసుకొంటూ వుంటుంది. అందు వలన ఎక్కడా స్థిరంగా నిలవదు.
  • ఎక్కువ సమయం భూతకాలంలో గడపడానికే యిష్టపడుతుంది భూతకాలంలో లేదంటే - భవిష్యతు వైపు పరుగులెడుతుంది.వర్తమానం లో నిలవడం దానికి చాలా కష్టమైన పని.
  •  తన అలవాట్లకు చాలా సులభంగా బానిసై పోతుంది.అవి - మంచైనా సరే, చెడైనా సరే. వాటినుండి బయట పడడం మనసుకు చాలా కష్టమైన పని.
  • మనసుకు మంచి అలవాట్లు రావడానికి మనం కొంతైనా శ్రమ పడాలి. కొన్ని రోజుల పాటో, నెలల పాటో - పరిశ్రమించాలి . సాధారణంగా - మంచి అలవాట్లు మనసులో నాటుకోవాలంటే - మండలం రోజులు - అంటే 45   నుండి 48  రోజులు - అంతరాయాలు లేకుండా పాటించాలి.  తరువాత, వాటిని కాపాడడం - సులభమే.
  • కానీ - చెడు అలవాట్లను చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. వొక్క నిముషంలో - మీరు పొగ  త్రాగడానికో, మత్తు పదార్థాలు త్రాగడానికో, తినడానికో అలవాటు పడొచ్చు.
  • దురదృష్టమేమంటే   - మంచి అలవాట్లను విడిచిపెడ్డడం చాలా సులభం. యాభై ఏళ్ళ మంచి అలవాటును - వొక్క రోజులో విడిచి పెట్ట వచ్చు. కానీ - చెడు అలవాట్లను విడిచి పెట్టడం చాలా కష్టం.
  • మంచి అలవాట్లను మనం వుంచుకోవాలంటే   - సరైన పరిసరాలు, వాతావరణం ముఖ్యం. చెడు అలవాట్లు తమకు కావాల్సిన పరిస్థితులను తామే సృస్టిస్తాయి, లేదా, సులభంగా వెదుక్కుంటాయి . 
  • బుద్ధి మాట వినని మనసు - తాత్కాలికంగా - సంతోషాన్ని తెచ్చినా- పోను,పోనూ, దుఖాలనూ, కష్టాలనూ తప్పకుండా తెచ్చిపెడతాయి.
  • బుద్ధి మాట వినే మనసే - దుహ్ఖాలనూ, కష్టాలనూ తప్పించుకుంటూ -  ఎక్కువ కాలం సంతోషాన్ని, ఆనందాన్ని - తన స్వంతం చేసుకోగలదు.
అసలు మనసంటే ఏమిటి? మనలోని ఆలోచనల ప్రవాహము; వాటితో బాటు చేరిన భావ ప్రవాహము. ఈ రెండింటికి   నిలకడ లేదు. ఏ వొక్క ఆలోచన పైనా మీ మనస్సు అయిదు నిమిషాలు కూడా నిలువలేదు. ఆలోచనలూ, వాటితో బాటు, భావనలూ మారిపోతుంటాయి. ఈ నిమిషంలో - మీ బాసు జ్ఞాపకం వస్తే మనసు కోపంతోనో, భయంతోనో, ఏహ్యత తోనో - నిండచ్చు. అయిదు నిమిషాల తర్వాత మీ  భార్య జ్ఞాపకం వస్తే - మీరు ఆఫీసులోనే, ఆనందంగా ఈల వేయవచ్చు. సరే. మీ బాసు, మీ భార్య వీరి పట్ల మీ జ్ఞాపకాలను బట్టి - రివర్సు గానూ వుండచ్చు.ఆలోచనలూ, వాటితోబాటు తలెత్తే భావావేశాలూ - యివి రెండూ లేక పొతే మనసే లేదని చెప్ప వచ్చు. 

సంతోషమే సగము బలము -అన్నారు. నిజమే. మనసు సంతోషం గానూ, ప్రశాంతం గానూ, హాయి గానూ  - వుండడమే మానసిక ఆరోగ్యం. అలా లేకుంటే - మానసిక అనారోగ్యం. తమిళంలో - ఎప్పటిదో వొక మంచి పాట వుంది. దీనికి తెలుగులో అర్థం - కళ్ళు వెళ్ళే చోటికి, కళ్ళు వెళ్ళే విధంగా, కాళ్ళనూ పోనివ్వ వచ్చా? కాళ్ళు వెళ్ళాలీ,వెళ్ళాలీ అనే చోటికి, మనస్సును వెళ్ళనివ్వ వచ్చా?  మనస్సు వెళ్ళే చోటికి, మనస్సు వెళ్ళే విధంగా, మనిషి వెళ్ళ వచ్చా? - అని. నిజంగా,

యిందులో, ఎంతో మనస్తత్వ శాస్త్రం ఇమిడి వుందని చెప్పవచ్చు. కళ్ళకు అడ్డు లేదు. ఎక్కడికైనా వెడతాయి. పోరాని చోటుకు కళ్ళు పోకుండా మనం అడ్డు పెట్టాలి.  సరే. కళ్ళు చూసాయి. చూసినవన్నీ మనకు మంచి చేసేవి కావు. కానీ, మంచి చేయనివి ఎన్నో, మనను - రా,రా, అంటూ రెచ్చ గొడతాయి. మరి కళ్ళు చూసిన అటువంటి చోట్లకంతా, కాళ్ళు వెళ్ళ వచ్చా? ప్రమాదం, ప్రమాదం అని బుద్ధి హెచ్చరిస్తున్నా వినకుండా వొక్కో సారి కాళ్ళు అటువైపు దారి తీయ మంటాయి. అటువంటి చోటికి - మనసును వెళ్ళ నివ్వ వచ్చా? అటువంటి వెళ్ళ కూడని చోట్లకూ మనసు వెళ్లూ, వెళ్ళూ - అని తొందర పెడుతుంది. అట్టి చోట్లకు మనిషి వెళ్ళవచ్చా? వొద్దూ, వొద్దనే బుద్ధి మాట వినకుండా - మనసు చెప్పిన వైపు పరుగెత్తే వాళ్లకు ప్రమాదం ఎప్పుడూ పొంచి వుండనే వుంటుంది. బుద్ధి బలహీనంగా వుంటే - మంచి గురువుల మాట వినాలి. మంచి స్నేహితుల మాట వినాలి.

మానసిక ఆరోగ్యానికి కావాల్సింది యింతే. పంచేంద్రియాల పైన కాస్త నియంత్రణ.మనసుపైన కాస్త నియంత్రణ. యివి వుంటే - మానసిక ఆరోగ్యానికి కొరత  వుండదు.

దీన్ని గురించి - ఆధునిక మనస్తత్వ శాస్త్రము, మన ప్రాచీన మనస్తత్వ శాస్త్రము రెండూ ఏం చెబుతాయో - రెండింటికి గల వైవిధ్యమూ, వైరుధ్యమూ ఏమిటో మనం తెలుసుకోవాలి.

మనసే మన మిత్రుడు.మనసే మన శత్రువు అన్నాడు శ్రీకృష్ణుడు.

బుద్ధి మాట వినే మనసు మన మిత్రుడు. బుద్ధి మాట వినని మనసు మన శత్రువు.

మంచేదో చెడేదో తెలుసు.కానీ చెడే చేయమని నా మనసు చెబుతూ వుంటుంది - దాని మాటే వింటూ వచ్చాను.మంచి  తెలిసీ, చెడే చేసాను - అంటాడు దుర్యోధనుడు. దాని ఫలితం అనుభవించాడు.

భగవద్గీత  దాదాపు అంతా మనస్తత్వ శాస్త్రమే అని చెప్పవచ్చు. నా మనస్సు చాలా బలవత్తరంగా వుంది - అది నేను నా బుద్ధి అధీనం లోకి తీసుకు రాగాలనా - అని అర్జునుడు అడుగుతాడు. 

శ్రీ కృష్ణుడు  కూడా - ఔను. నిజమే. మనసును మన బుద్ధి అధీనం లోకి తీసుకు రావడం  కష్టమైన పనే. కాని నిరంతర సాధనతో చెయ్యాలి - అని అంటాడు.  మనసు మన బుద్ధి అధీనం లోకి రావాలి - అన్న జ్ఞానం మనకు పుట్టడమే  మొదటి సోపానం.

మరి ఈ కాలంలో - మనసు ఎలాచెబితే అలా నడుచుకోవాలనుకునే సమయంలో - యిది మరీ కష్టమైన పనే. మనసును తప్పు మార్గంలోకి తీసుకెళ్ల గల మార్గాలు, సాధనాలు ఎన్నో! టీ.వీలు, సినిమాలు, బార్లు,మనసును విచ్చల విడిగా విడిచే షికార్లు,   కంప్యూటర్లు , యింటర్ నెట్ లు -యిలా ఎన్నెన్నో . యివి కాక -మత్తు పదార్థాలు, రక రకాల దురలవాట్లు చేసుకోగల అవకాశాలు అందరికీ ప్రక్కనే వున్నాయి.

మనసును గురించి వొక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి.  మనసుకు ఏది  మనం అలవాటు చేస్తామో - దానికి అది బానిసగా మారుతుంది. అదే మళ్ళీ మళ్ళీ కావాలంటుంది. బుద్ధి అలా కాదు. ఏది మంచో, ఏది చెడో యోచన చేసి చెబుతుంది.  కానీ - ప్రతి సారీ - మనసు మార్గానికే ప్రాధాన్యత యిస్తే - తరువాత మనసు బుద్ధి మాట వినదు . బుద్ధి కూడా తన పని మానుకుంటుంది .యింక అధో మార్గమే నన్న మాట. 

అందుకే - చెడు అలవాట్లకు మొదటి సారీ "నో" అని చెప్పాలి. ప్రతి సారీ "నో" అని చెప్పాలి. లేదంటే - ప్రమాదమే. యివి అలవాట్ల సంగతి.
సరిగ్గా తెలుసుకుంటే - యిది  నిజంగా చిన్న విషయమే.  చెడు అలవాట్లను, మానసిక రోగాలను రాకుండా చేసుకోవడం అంత కష్టమైన విషయం కాదు. మీ  మనసులో, ఎక్కువగా కలిగే భావ ప్రకంపనలు ఎలాంటివి? లేదా - ఎక్కువ కాలం, మీ మనసులో -ఎలాంటి భావాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలు.

మీలో సాధారణంగా కోపం ఎక్కువా; కామం ఎక్కువా, మోహం  ఎక్కువా, గర్వం (మదం) ఎక్కువా -లోభం ఎక్కువా - యివన్నీ - చాలా సులభంగా మనమే తెలుసుకో గలిగే విషయాలు.  మనకు తెలియక పొతే - మన మిత్రులను అడగ వచ్చు. ఏ గుణం ఎక్కువో -అది,తనకు కావాల్సిన అలవాట్లు  తెచ్చుకుంటుంది. మిమ్మల్ని అటువైపు పరుగులు  తీయిస్తుంది. యిప్పుడు కళ్ళేలు మీ బుద్ధి చేతిలో లేవు కాబట్టి పరుగు పతనం వైపే వుంటుం ది.    

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, భయాలు - ఇవీ మీ నిజమైన మానసిక శత్రువులు. అంతః శత్రువులు. ఇవీ మీ నిజమైన మానసిక రోగాలు. వీటినే నకారాత్మక గుణాలు అంటారు.యివి మీ మనసులో ఎక్కువగా వుంటే -మీ మనసే మీ శత్రువని  మీరు నిర్ధారించ వచ్చు. మీకు మానసిక ఆరోగ్యం లేనట్టే లెక్క.

యివి కాక -ప్రేమ, దయ, వాత్సల్యము, కరుణ, ఆర్ద్రత, దానగుణము, ధైర్యము, శాంతము  లాంటి సకారాత్మక గుణాలు ఎక్కువగా వుంటే - మీ మనసు మీ బుద్ధి మాట కొద్దో, గొప్పో వింటూ వుందన్న మాట. యిక్కడ  మరొక మాట చెప్పుకోవాలి. ధైర్యము సకారాత్మకమా కాదా అన్నది - మన ధైర్యం దేనికి అన్న దానిపై  కూడా ఆధారపడి వుంది. దుర్యోధనుడి ధైర్యములో కామ, క్రోధ,లోభాదులన్నీ వున్నాయి. అప్పుడు - ఆ ధైర్యము కూడా నకారాత్మకమే అవుతుంది.

ఏ మనసులో - నకారాత్మక గుణాలున్నాయో - అది రోగ గ్రస్త మైన మనస్సు.

పైన చెప్పిన - కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, భయాలు  లేని మనస్సులో రోగాలు లేవు.


వీటన్నిటికీ - మూలమైన, ముఖ్యమైన మొదటి రోగము - కామము - అంటాడు శ్రీకృష్ణుడు. ఈ కామం - స్త్రీ పురుషుల మధ్య వున్న ఆకర్షణ కాదు. కామము అంటే కోరిక - ధర్మానికి లోబడని కోరిక. ధర్మానికి లోబడిన కోరిక ఏదీ నకారాత్మకం కాదు. మానసిక రోగం కాదు.

యుదిష్టిరుడు, పాండవులు కౌరవులతో చేసిన యుద్ధంలో   - ధర్మ బద్ధమైన కోరిక వుంది. కామము లేదు. దుర్యోధనుడి యుద్ధంలో కామము నిండి వుంది.

రావణుడి నాశనానికి కారణం పర స్త్రీ అయిన సీత పై మనసులో బలంగా నాటుకున్న   కామము. రాముడిలో సీతపై వున్న ప్రేమ ధర్మానికి కట్టుబడ్డ కోరిక.

సరే. ఈ కామము   లేదా అధార్మికమైన  కోరిక ఎక్కడినుండి పుడుతుంది? దీనికీ మరొక మూలం వుందా?

దీనికి సమాధానం - గీత లోని  మొట్ట మొదటి శ్లోకం లోనే   మనకు లభిస్తుంది. అధార్మికమైన కోరికలకు మూలం - అహంకారము, మమకారము.

ధృతరాష్ట్రుడు చెప్పే వొకే వొక గీతా శ్లోకంలో - మానవుల అతి ముఖ్యమైన, పతన కారణమైన రెండు గుణాలు - మహా భారత యుద్ధానికి మూలమైన రెండు మానసిక రోగాలు - అహంకారము, మమకారము గా - ధృత రాష్ట్రుని ముఖ్య గుణాలుగా యిక్కడ మనకు తెలుస్తుంది. అహంకారమంటే - నేను, అన్నీ నాకే కావాలి. నేనే గొప్ప అన్న తత్త్వం. మమకారం అంటే - అన్నీ నా వారికే కావాలి అన్న తత్త్వం. యివి రెండూ వున్న వారికి - నేనూ, నా వారూ - మేం బాగుండాలి. మిగతా వారు ఎలా పోయినా పరవాలేదు. అనేదే న్యాయము, ధర్మమూ.  యివి మానసిక రోగాలే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.

మనస్సు యొక్క ఆరోగ్యం ఏమిటి - మనస్సు యొక్క అనారోగ్యం ఏమిటి -ఇది  పైన  చెప్పిన విధంగా నిర్ధారితంగా తెలియనంత కాలం మనం మానసిక రోగాలకు యిచ్చే పేర్లు వేరుగా వుంటాయి.

ఉదాహరణకు - ఆధునిక మానసిక వైద్య శాస్త్రము మానసిక రోగాలకు ఇచ్చే పేర్లు చూడండి.

అక్యూట్ స్ట్రెస్  డిజార్డర్  
అంక్సైటీ     డిజార్డర్
డిప్రెషన్
ఇన్సోమ్నియా
మేగాలోమానియా
శిజోఫ్రేనియా
హిస్టీరియా  

-ఇలాంటి మానసిక వ్యాధుల పెద్ద లిస్టు మీరు క్రింద చూపిన వెబ్ సైటులో చూడొచ్చు:

http://en.wikipedia.org/wiki/List_of_mental_disorders 

యివి కాక - మానసిక వొత్తిడి -స్ట్రెస్ - అనేది పెద్ద వ్యాధిగా వుంది ఈ రోజుల్లో. అంతేనా? నిజానికి - దాదాపు ప్రతి భౌతిక వ్యాధికీ - మనసులోని ఏదో బలహీనత కారణం అంటున్నారు. అంటే - దాదాపు ప్రతి వ్యాధీ - సైకో సోమాటిక్ వ్యాధి (మానసిక-భౌతిక వ్యాధి) అని చెబుతున్నారు. మీకు వచ్చే పడిశం, జ్వరాలు, చర్మ వ్యాధుల నుండీ, కాన్సర్ వరకూ గల అన్ని వ్యాధుల వరకు  సైకో సోమాటిక్ వ్యాధులని చెబుతున్నారు.

కానీ - నిజమైన మానసిక వ్యాధులు యివి కావు. యివి వ్యాధి లక్షణాలు, వాటి ప్రభావాలు మాత్రమే. నిజమైన వ్యాధులు మొదట చెప్పిన ఏడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, భయాలు.వీటికి మూలమైన అహంకార, మమకారాలు.

వీటిలో-ఏదున్నా మరో పది రోగాలు తెచ్చి పెడతాయి. యిది అర్థం కానంత కాలం వైద్యులు ప్రతి లక్షణానికీ - వొక పేరు పెట్టి - అదే వ్యాధి అని -దాన్ని, మత్తు మందు, నిద్ర మందు, మెదడును మొద్దు పరిచే మందు లాంటి వాటితో వైద్యం చేస్తారు. సంవత్సరాల తరబడి వైద్యం చేసినా మానసిక వ్యాధులు తగ్గడం లేదన్నది - అందరికీ తెలుసు. తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తూ వుంది. మందుల వలన - రక రకాల శారీరక వ్యాధులూ పుట్టుకొస్తున్నాయి.

అసలు రోగాలైన కామ, క్రోధాదులు  పొతే కానీ -  మానసిక రోగం పోనే పోదని - ఘంటా పథంగా చెప్పొచ్చు.
యివి లేక పోతే - మానసిక రోగాలు దాదాపు లేవని, రావని  చెప్ప వచ్చు.

అయితే - ఇవి కాక, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు కొన్ని వున్నాయి. అవి భౌతిక వ్యాధులే అయినా - మెదడును , అందులోని నరాలను బలహీన పరిచేవి అయి వుండడం వలన - మానసిక వ్యాధులుగా పరిగణించ బడతాయి.  ఉదాహరణకు - అల్జీమర్స్, డెమెంషియా, పార్కిన్సంస్ లాంటివి. యివి కూడా - మొదటి నుండీ - మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకునే వారికి - చాలా వరకు రావని చెప్ప వచ్చు.

సరే. ఈ మానసిక రోగాలు -రాకుండా ఎలా చేసుకోవాలి?

 బాల్యంలో - మనకు చెప్పిన చిన్న చిన్న నీతి పద్యాలు - పాటిస్తే చాలు.

ఉదాహరణకు - "తన కోపమె   తన శత్రువు, తన శాంతమె   తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమె   స్వర్గము, తన దుహ్ఖమె  నరకమండ్రు తథ్యము సమతీ" అన్నారు."

మీ కోపము మీ శత్రువు - అనేది మీకు పూర్తిగా అర్థమయిందా? లేదా - అదేదో - మీకు చాలా ముఖ్యమైన  ఆయుధం, మీ మిత్రుడు   అనుకుంటున్నారా?

మీకు కోపం వస్తే మీలో ఏమవుతుందో కొద్దిగా తెలుసా?

మీ రక్తపు పోటు చాలా  ఎక్కువవుతుంది.

పళ్ళు కొరుకుతారు. ముష్టి బిగిస్తారు. చెమట ఎక్కువగా పడుతుంది. శరీరమంతా -పాలిపోవచ్చు.  మీలో అడ్రినాలిన్ అనే హార్మోను ప్రసారం ఎక్కువవుతుంది. వెంటనే - ఏదైనా చేసేయాలని ఆత్రుత వుంటుంది.
మీ మెదడులోని అమిగ్డాలా భాగం రకరకాలుగా పనిచేస్తుంది.ఏదో ప్రతీకార చర్య చేసేయాలని పరుగెడుతూ వుంటుంది.
మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీ శ్వాస వేగంగా జరుగుతుంది. మీకు తల నొప్పి రావచ్చు  నిద్ర రాకపోవచ్చు.  చర్మరోగాలు ( ఎక్జేమా లాంటివి) రావచ్చు. యింకా ఎన్నో అవాంఛనీయ మార్పులు మనలో జరుగుతాయి.  

నిజానికి ఎన్నో రకాల మానసిక, మరియూ భౌతిక రోగాలకు మూల కారణం మీలోని కోపం; కోపానికి మూల కారణం అధార్మికమైన కోరికలు (కామము). మనిషి లోని  కోరికలు రెండు విధాలు.

ఏదో లేనిది -కావాలని.

ఏదో వున్నది - పోవాలని.

లేనిది కావాలి; వున్నది పోవాలి. యివి రెండు తప్ప మరేదైనా కోరికలున్నాయా - ఏవీ లేవు.

ఈ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. ఉదాహరణకు - పొగడ్త కావాలి.తిట్టడం పోవాలి. మిమ్మల్ని గురించి తిట్టడం అలవాటుగా వున్న వారికి - ఆ అలవాటు పోవాలని మీరు కోరుకుంటారు. మిమ్మల్ని తిట్టడం వున్నది. అది ఆ తిట్టే వారికి పోవాలి. పొగడడం లేనిది. అది వారికి రావాలి. అదే మీ శత్రువులను తిడుతూ, మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారనుకోండి. సరే. యిదేదో బాగానే వుందనుకొంటారు.  బంగారం కావాలి.  ధనం కావాలి. బలం కావాలి. రోగం పోవాలి. దుహ్ఖం పోవాలి. శత్రువులు పోవాలి. మిత్రులు కావాలి.

ఇలాంటి కోరికల ప్రవాహమే - మనస్సు. వీటిని - సక్రమ మార్గంలో పెట్టేదే బుద్ధి. బుద్ధి మాట వినని మనస్సు ఎలా వుంటుంది?

మనసుకు పగ్గాలు లేకుండా  విడిస్తే  అదేం చేస్తుంది?

రావణుడు మొదట పార్వతీ దేవిని కూడా మోహించినట్టు;  శివుడి  దగ్గర బాగా శిక్ష పడి, ప్రాయశ్చిత్తమైనట్టు;  తరువాతనే నిజమైన శివ భక్తుడైనట్టు - కథ. శివుడు తనకంటే మహా బలవంతుడని గ్రహించిన తర్వాత  బుద్ధి వచ్చింది. మళ్ళీ నలకూబరుడి భార్య అయిన రంభను చెరుస్తాడు. అక్కడ మళ్ళీ పగ్గాలు లేని, కోరికల ప్రకోపమే.బల గర్వమే.  ఎన్ని శాపాలు వచ్చినా యిది మాత్రం పోలేదు.  మళ్ళీ రాముడేం చేయగలడని ధీమాతో సీతమ్మను ఎత్తుకు వెడతాడు. అంతే. లంకతో బాటు  తానూ నాశనమౌతాడు. అధార్మికమైన కోరిక వల్ల ఎవరైనా నాశనమౌతారని  చెప్పడమే - రామాయణం. భారతమూ - అంతే. రావణుడిపై రాముడి విజయం - మనసుపై బుద్ధి విజయం. కౌరవులపై పాండవుల విజయం - మనసుపై బుద్ధి విజయం.

అన్ని సమస్యలకూ మూల కారణం - మనసులో - అతిగా వున్న, అధార్మికమైన కోరికలే.

కోరికలు తీరితే లోభము, మోహము, మదము మన మనస్సులో చోటు చేసుకుంటాయి. కోరికలు తీరకపోతే, క్రోధము, మాత్సర్యమూ , భయమూ  వస్తాయి.

అందుకనే శ్రీ కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, ఆది శంకరుడు-అందరు మహానుభావులూ - కోరికలను, ధర్మ మార్గంలో పెట్టుకోమన్నారు.ధర్మ మార్గంలో తీర్చుకోమన్నారు.

సరే. ధర్మ మార్గంలో కోరిక -ఎంత వుండొచ్చు? అతి సర్వత్ర వర్జయేత్. ఏదీ అతిగా వుండకూడదు. మీరు ఎంత  పని చేస్తారో - అంత లాభం వుంటుంది. సంతోషం కోరికలో లేదు. కోరిక వలన వచ్చిన లాభంలోనూ లేదు. మీరు ఆ లాభాన్ని అనుభవించే విధానంలో వుంది. నిజానికి - మీ లోనే ఆనందం వుంది.  బయటి నుండి వచ్చిన వాటిలో కాదు.

పది మంది భార్యలో, భర్తలో వున్న వారికి - భౌతిక కామం పది రెట్లు తీరుతుందన్న మాట ఏమీ  లేదు.అనురాగవతి(వంతుడు) అయిన భార్య (భర్త),  వుంటే చాలు.

మీకు తెలుసా. వసిష్టుడు, అరుంధతి - లకు నూరుగురు కొడుకులని. వారు - అరణ్యం లో తమ ఆశ్రమంలో - తపస్సులో వున్న వారు. వసిష్టుడి తపస్సు వొక రకం. అరుంధతి తపస్సు వొక రకం. ధర్మేచ, అర్థే చ,   కామేచ నాతిచరామి - అన్న సిద్దాంతం పాటించిన వారు ఎంత ఆనందాన్ని అనుభవించ గలరో -ఈ దంపతులే సాక్ష్యం. సంతోషంగా వుండడం ఎలా - అన్న దానిపై మన వారు చేసినంత  రీసెర్చి -మరే దేశంలోనూ, ఈ కాలం లోనూ జరగలేదని -చెప్పవచ్చు. అది - భౌతికమైనా సరే, మానసికమైన సరే - ఆనందానికి మూలం నిర్దిష్టంగా తెలుసుకున్న వారు మన వారు.

అందుకే - మనసు బుద్ధి మాట విని, బుద్ధి  మార్గంలో నడవాలి కానీ - తనలో లేచే కోరికల ప్రవాహంతో బాటు పొతే -  దుర్గతే నని మళ్ళీ మళ్ళీ చెప్పారు.

భౌతిక కామానికి - వొక కామ శాస్త్రం రచింప బడినది - మన దేశంలో మాత్రమే నని మరిచి పోకూడదు. అర్థ శాస్త్రమూ వుంది. ధర్మ శాస్త్రమూ వుంది. మోక్ష శాస్త్రమూ వుంది మన దేశంలో. ఏ చెట్టు ఆకులలో, బెరడులో, వేరులో, కాయలో, పూవులో, పండులో - ఏ రోగానికి ఔషధం దాగి వుందో - యిప్పటికీ మన వారికి తెలిసినట్టు - ప్రపంచంలో - మరెక్కడా తెలీదు.

మరి పాశ్చాత్యులకు - మన కామ శాస్త్రం మాత్రం కావలసి వచ్చింది కానీ - అంత కన్నా ముఖ్యమైన ధర్మ, అర్థ, మోక్ష, ఆయుర్వేద శాస్త్రాల లాంటివి కావాల్సి రాలేదు. అందుకే - ప్రతి వొక్కరూ -మానసిక వైద్యుల వద్దకు వెళ్లి వస్తుంటారు.   మనసుకు పగ్గాలు వేయనంట కాలం ఈ పరిస్థితి యింకా ఎక్కువవుతుంది - కానీ తగ్గే అవకాశం లేదు.  

సరే. కోపానికి మూలమైన కోరికను గురించి - ఆధునిక శాస్త్రాలకు తెలియనే తెలియదు.

కోపమెలా తగ్గడం - అని రీసెర్చి  చేస్తున్నారు. అవన్నీ తప్పని అనడం లేదు. కోపమొస్తే - ఆ స్థలం నుండీ - దూరంగా వెళ్ళమన్నారు.చల్లటినీళ్ళలోముఖం కడుక్కోవడమో, స్నానం చేయడమో చెయ్య వచ్చు. కళ్ళు మూసుకుని వొకటి నుండి పది వరకు లెక్క పెట్ట వచ్చు.

చాల, చాలా ముఖ్యమైనది - ప్రతి మానసిక రోగానికీ - యిప్పుడు "యోగ" చేయమంటున్నారు. అందులో మంచి జరుగుతూ వుందన్న విషయం పాశ్చాత్యులకూ అర్థమైంది. కానీ -ఎలా అన్నది యింకా అర్థం కాలేదు వారికి .

యోగ - అంటేనే పతంజలి చెప్పిన నిర్వచనం - "యోగః చిత్త వృత్తి నిరోధః" అని. అంటే - మనసును అదుపులో ఉంచడమే యోగ - అని  అర్థము.  యోగ  శాస్త్రాన్ని  గురించి  మీరు  పూర్తిగా ,  వివరంగా  తెలుసు కోవాలనుకుంటే - ఆంగ్లంలో వున్న నా బ్లాగు "వై స్ స్పిరిచువల్  ఐడియాస్.బ్లాగ్ స్పాట్ . కాం" లో చదవ వచ్చు.

కోపమొస్తే - రెండు రకాల  రీయాక్షన్లు మనలో జరగ వచ్చు.     వొకటి - ఎదుటి వాడితో కొట్లాడుతాము. రెండవది - అక్కడి నుండి వెళ్లిపోతాము. ఆంగ్లంలో - ఫైట్ మరియు ఫ్లైట్ అంటారు వీటిని. మనకు బలం వుందనిపిస్తే   మొదటి పధ్ధతి. లేదనిపిస్తే - రెండవది. బలం లేకున్నా కొట్లాడమన్నారు కొన్ని పరిస్తితులలో - పరాయి మగ వాడు ఎంత బలవంతుడైనా - భార్యనుకానీ, తల్లిని కానీ, కూతురిని గానీ అవమానపరిస్తే, మానహరణ చేయాలనుకుంటే - ఫైట్  - కొట్లాడడమే  కానీ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు మగ వాడికి. ప్రాణం పోయినా పరవాలేదు.

రెండు కుక్కలు కొట్లాడుతుంటే -వాటిల్లో ఏది గెలుస్తుందో  చెప్పమని వొక పెద్దాయనను అడిగారట.పెద్దదా, చిన్నదా.  తెల్లదా, నల్లదా?  అవేవీ కాదు. ఏ కుక్కలో ధైర్యం ఎక్కువో - అదే గెలుస్తుందన్నాడట   ఆయన. ఎంత పెద్ద కుక్కైనా - ధైర్యం చాల ఎక్కువగా వున్న చిన్న కుక్క దగ్గర ఎక్కువ సేపు నిలువ లేదు. 

మీలో కోపం ఎక్కువగా వుందా - అన్నది ప్రశ్న కాదు.  మీలో బలం ఎక్కువగా వుందా అన్నది కూడా ప్రశ్న కాదు. మీలో ధైర్యం వుందా? సాహసం వుందా? మీ ఆదర్శం కోసం ప్రాణాలు కూడా అర్పించే నిరతి వుందా? యిది చాలా ముఖ్యం. ధైర్యమూ, బుద్ధి బలమూ - వున్న చోట, విజయమూ, సంతోషమూ ఎల్లప్పుడూ వుంటుందన్నది  గీతా వచనం. "యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర  పార్ధో ధనుర్ధరః  తత్రశ్రీర్విజయో భూతిహ్  ధృవా నీతిర్ మతిర్ మమ" . గీతా శాస్త్రం అంతా మనం భూమ్మీద సంతోషంగా వుండడం ఎలాగో తెలిపే శాస్త్రమే.

యిక్కడ బుద్ధిబలం శ్రీకృష్ణుడు. ధైర్యమూ మనోబలము - అర్జునుడు. యివి రెండూ వున్న చోట - శ్రీ (అంటే, ఐశ్వర్యమూ, సంతోషమూ) మరియూ విజయోహ్    (అంటే - సదా విజయమే అన్న మాట) -రెండూ ఎప్పుడూ వుంటాయని చెబుతూ - గీతను సమాప్తం చేస్తారు.

ఇదండీ   - మానసిక ఆరోగ్యానికి వొక ముఖ్య మూల సూత్రము - ధైర్యమూ, బుద్ధిబలమూ.  యివి రెండూ - అలవరుచుకోండి. మాటిమాటికీ బుద్ధి మాట వినండీ - అని చెబుతున్నాము. ఎందుకంటే - మనసే సంతోషాన్ని యివ్వ గలిగేది - కానీ నిరంతర సంతోషానికి మార్గం చూపేది బుద్ధి మాత్రమే.

అయినా - మానసిక రోగాలూ, ఆరోగ్యాలూ - గురించి మరి కాస్త చాలా ముఖ్య విషయాలు మనం తెలుసుకో వలసి వుంది. అవి మరో వ్యాసంలో.


= మీ

వుప్పలధడియం విజయమోహన్  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి