ప్రాణ మయ కోశము
ప్రాణాయామాల ఉపయోగాలు
క్రిందటి వ్యాసంలో ఆరోగ్యాన్ని గురించి ప్రముఖుల అభిప్రాయాల్ని చదివాము.
ముఖ్యంగా - మానసిక దార్ధ్యాన్ని గురించి వారు పలు రకాలుగా చెప్పారు.మనిషిలో - మనోబలం వుంటే - చాలా వరకు రోగాలు రావు. వచ్చినా త్వరగా పోవడానికి అవకాశాలు ఎక్కువున్నాయి - అన్న విషయం నిర్వివాదాంశం.
ఇంకొక విధంగా చెప్పాలంటే - రోగం యొక్క బలం చాలా వరకు - మనను మానసికంగా భయ గ్రస్తులను చేయడం, క్రుంగదీయడం లోనే వుంటుంది. మీరు భయపడలేదనుకోండి. అంత పరిధి వరకు - రోగం యొక్క బలం కూడా తగ్గి పోతుంది. యిది చాలా, చాలా ముఖ్యమైన విషయం. వైద్యులు కూడా ముఖ్యంగా జ్ఞాపకం వుంచుకోవలసిన విషయం. మీరు మూడు నెలలలో పోతారు,. రెండు సంవత్సరాలలో పోతారు - అన్న మాటలు - దాదాపు అనవసరం అనుకోవచ్చు. కడపటి క్షణం వరకు - ధైర్యంగా, సంతోషంగా వుంటే - దేవుడు యిచ్చిన ఆయుస్సు పూర్తిగా, హాయిగా గడిపేస్తాం.
చాలా పెద్ద వ్యాధులు అనుకున్నవి - యిక మరణం తప్ప వేరే మార్గం లేదన్నవి - అద్భుతంగా తగ్గి పోవడం చాలా మంది విషయంలో జరిగింది. వీటిని "మెడికల్ మిరాకుల్స్" అన్నారు. ఈ అద్భుతాలలో - అందరికీ కనిపించే ముఖ్య విషయం - ఈ రోగాన్ని నేను ఖాతరు చెయ్యను. ఉన్నంత వరకు సంతోషంగా వుంటాను - భయమన్నది యిక నాలో వుండదు అన్న దృఢమైన మనో భావన.
ధైర్యమేరా జీవితం, ధైర్యమేరా శాశ్వతం.
మన భారతీయ విజ్ఞానం ప్రకారం - మనలో అయిదు భాగాలున్నాయి. (1 ) అన్న మయ కోశము (2 ) ప్రాణమయ కోశము (3 ) మనోమయ కోశము (4 ) విజ్ఞాన మయ కోశము (5 ) ఆనంద మయ కోశము .ప్రస్తుతానికి - మన ధ్యేయానికి -మొదటి మూడు కోశాలూ చాలు. మిగతా రెండూ మరెప్పుడైనా చూద్దాము .
యిందులో ప్రాణ మయ కోశము - అంటే మనలో జరిగే ప్రాణ శక్తి ప్రవాహాల సముదాయము. ప్రాణ శక్తి గాలి ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది. ఈ గాలి కూడా ఆధునిక విజ్ఞానం ప్రకారం ఊపిరితిత్తుల లోకి వెళ్ళుతుందని, గుండెకు ప్రాణ వాయువు లేదా ఆక్సిజన్ ను అందించి మలిన వాయువులను తాను గ్రహించి మళ్ళీ - ముక్కు ద్వారా బయటకు వెళ్లి పోతుందని మనం చదివాము.
కానీ, మన ప్రాచీన విజ్ఞానం ప్రకారం - శరీరంలోని అనేక స్థలాలలో ఈ ప్రాణ శక్తి, అనేక రకాలుగా పని చేస్తుందని తెలుసుకోవచ్చు. వొక్కొక్క చోట దానికి వొక్కొక్క పేరు పెట్టారు. ఉదాహరణకు - ప్రాణ, అపాన, ఉదాన, సమాన, త్రాణ వాయువులు మనలో అయిదు చోట్ల వేవ్వేరు రకాలుగా పని చేస్తుంటాయి. యింకా అనేక వాయువులు మన శరీరంలో - ఎన్నో పనులు చేస్తూ వున్నాయి. యివన్నీ ప్రాణ శక్తితో కూడినవే. ఊపిరితిత్తులలోకి మాత్రం పోయే గాలి - మిగతా చోట్లలో - ఎలా వచ్చిందండీ? అక్కడ అది వూరికే కూర్చోలేదు. చాలా ముఖ్యమైన పని చేస్తూ వుంది. యిదీ - మన ప్రాచీన విజ్ఞానము.
మంచి గాలి, చెట్లు, వున్న చోట వుండమన్నారు మన వారు. మన లాగా - వారు, గాలిని కలుషితం చేయ లేదు.చెట్లను నరికెయ్య లేదు. చెట్లను పూజించారు. చెట్ల క్రింద అరుగులు కట్టుకుని పడుకున్నారు. చెట్ల క్రిందనే పంచాయితీలు నిర్వహించారు.
ధ్యానం చేసే వారు, కొన్ని రకాల చెట్ల క్రింద చిన్న అరుగులు కట్టుకుని ధ్యానం చేయడం మనందరికీ తెలిసిన విషయమే - అయినా, గంటల కొద్దీ ధ్యానంలో కూర్చోవాలంటే - అటువంటి ప్రాణ శక్తి కావాలనేది - మనం తెలుసుకోవాల్సిన విషయం. మీ యింటి చుట్టూ చెట్లు పెట్టుకోండి. మీ ప్రాణ మయ కోశము కూడా ఆరోగ్యం గా వుంటుంది.
యిది కాకుండా - మనకు తెలిసిన మరో విషయం - గాలి పీల్చడం, విడవడం, మన ప్రమేయం లేకుండా పుట్టిన క్షణం నుండీ చివరి క్షణం వరకూ - మరేదో శక్తి అధీనంలో వుంటూ జరగుతూ వుండడం. అది మన అధీనంలో లేదు - అన్నది మనకూ తెలుసు. మనం ఎంత గాఢ నిద్రలో వున్నా అది మాత్రం ఆగదు. అయితే యిందులో - మనం బాగా గమనించాల్సిన ఆశ్చర్యాలూ వున్నాయి. గాఢ నిద్రలో - జరిగే శ్వాస క్రమం - దీర్ఘంగా, నిండుగా, చాలా ఆరోగ్యకరంగా జరుగుతుంది. అటువంటి శ్వాస క్రమాన్నే - మనం - సాధారణంగా, "ప్రాణాయామ" పద్ధతుల్లో కూడా అవలంబిస్తాము. అంటే - తనకు తానుగా జరిగే ఈ శ్వాస క్రియను, కొంత వరకు, మన మనసు, తన అధీనంలో కూడా జరప గలదని తెలుసుకోవచ్చు.
మన శరీరం గానీ, మనస్సు గానీ కాస్తో, కూస్తో శాంతంగా లేని పరిస్థితి లో వుంటే - శ్వాస క్రమం కూడా, సరిగ్గా జరగదు. సరే. వ్యాయామం లాంటివి చేస్తే - ఎక్కువ గాలి కావాల్సి వస్తుంది.
అయితే - ప్రాణాయామం ద్వారా మనసును మళ్ళీ ప్రశాంత స్థితికి తీసుకురావచ్చు.
కొన్ని,కొన్ని రకాల ప్రాణాయామ పద్ధతుల ద్వారా - శరీరం లోలోపల వున్న భాగాలకు కూడా - తగినంత ప్రాణ శక్తినీ, ఆరోగ్యాన్నీ అందించ వచ్చునన్నది - యోగుల ద్వారా - మనకు తెలుస్తుంది.
మీరు - అన్నీ చేయక పోయినా బాబా రాం దేవ్ జీ గారు చెప్పే, చేసి చూపే అయిదారు ప్రాణాయామాలు -సులభంగా, కష్టపడకుండా - మరీ శక్తికి మించి చేయకుండా - హాయిగా చేయండి.
ఇవి - ఆరోగ్యానికి -చాలా, చాలా మంచిది. మరీ కష్టపడి చేయ వలసినవి వద్దు. అవే గురువు దగ్గరే నేర్చుకోండి.
మీరు సులభంగా చేయ గలిగేవి - అనులోమ విలోమ, భ్రామరి, భస్త్రిక, కపాల భాతి, వంటివి. యివి కూడా, కష్ట పడకుండా, భోజనానికి ముందు - అంటే తెల్లవారి వొక సారి, సాయంకాలం వొక సారి, కడుపు కాస్త ఖాళీగా వున్నప్పుడు చెయ్యండి. కళ్ళు మూసుకుని, రేడియోలు, టీ వీలు ఆఫ్ చేసేసి -ప్రశాంతంగా చెయ్యండి. యింటిలో నున్న వారంతా కలిసి చేస్తే మరీ మంచిది. కాకపోతే - అందులో - వొకరితో వొకరు ఎప్పుడూ పోటీ పడవద్దు. వొక్కొక్క ప్రాణాయామము - అయిదు నిమిషాలు మించి అక్కర లేదు. వొకటి, రెండు నెలల తర్వాత - సమయం పెంచుకోవచ్చు.
వారి వారి శక్తి ప్రకారం, వారు వారు చెయ్యండి. సుఖంగా, సంతోషంగా చెయ్యండి. ఇవేవీ కష్టపడుతూ చేయాల్సినవి కావు. మొదట, ప్రతి ప్రాణాయామము మందగతి లో - అంటే మెల్లగా చెయ్యండి. రెండు వారాల తర్వాత - మధ్యమ గతి లో చెయ్యండి. ఏదైనా దీర్ఘ కాలిక రోగాలు వుంటే - మధ్యమ గతి వరకే చాలు.వేగంగా చెయ్య నవసరం లేదు.
వీటిలో - బంధాలు వగైరాలున్నాయి. అవి గురువు దగ్గరే నేర్చుకోండి. లేదంటే - అవి అక్కర లేదు. పైన చెప్పిన నాలుగు ప్రాణాయామాలు చేయండి చాలు. ఈ నాలుగు - మీరు - బాబా రాం దేవ్ జీ గారి వీడియో సి.డీ. చూసి గాని, టీ.వీ.లో వారి ప్రదర్శన చూసి గాని సులభంగా నేర్చుకోవచ్చు. చెయ్య వచ్చు.
నేను ఆయన యోగ శిబిరంలోనే - వారం రోజులు నేర్చుకున్నాను.మరి కొందరు గురువుల దగ్గర కూడా (సద్గురు జగ్గి వాసుదేవ్; ఆర్ట్ ఆఫ్ లివింగ్; స్వామి సుఖబోధానంద వంటి గురువులు ....) ప్రాణాయామాల గురించీ, యోగ విద్య గురించీ చాలా నేర్చుకున్నాను. వొక్కొక్క ప్రాణాయామానికీ - కొన్ని ప్రయోజనాలు వున్నాయి. పైన చెప్పిన నాలుగు - సులభంగా నేర్చుకుని, చెయ్య గలిగేవి. మన ఆరోగ్యానికి చాలా, చాలా దోహద కారులు.
మీకు - ఏ ప్రాణాయామమూ రాకున్నా - కళ్ళు మూసుకుని,ప్రశాంతంగా కూర్చొని - మీ శ్వాస, నిశ్వాస ప్రక్రియలను - హాయిగా గమనిస్తూ కూర్చోండి. యిది చాలా గొప్ప ప్రక్రియ. చాలా ఉపయోగాలున్న ప్రక్రియ. వొక్కొక్క సారి, మనసు శ్వాస మీద నిలువదు. ఎక్కడికో వెళ్లి, ఏదో, యోచనలు పెట్టుకు కూర్చుంటుంది. ఫరవాలేదు. మళ్ళీ శ్వాస మీద ధ్యాస ప్రారంభించండి. యిందులో, హాయిగా వుండడం, శ్వాసను గమనించడం - రెండూ ముఖ్యమే.
ఈ మధ్య మీరు ప్రహ్లాద్ జానీ - అనే ఆయనను గూర్చి చదివే వుంటారు. ఆయన చాలా దశాబ్దాలుగా - తిండీ, నీరూ, మల మూత్ర విసర్జనాలూ - ఏవీ లేకుండా - వున్నారు. ఆరోగ్యంగానే వున్నారు. యిది కూడా వొక యోగ ప్రక్రియనే.
సూర్యోదయాత్పూర్వము,సూర్యాస్తమయానంతరమూ - భూమి పై పడే సూర్య కిరణాలు మన శరీరానికి కావలసినంత ప్రాణ శక్తిని యివ్వగలవంటారు. అందుకనే - ధ్యాన సాధన కూడా ఆ సమయంలో ఎక్కువ ఫలితాన్నిస్తుంది. ఉదయం - బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం ప్రారంభించి - సూర్య కిరణాల దర్శన సమయంలో - సూర్య నమస్కారాలు చేసి ధ్యాన సాధకులు మిగతా సాధనాలు ఆరంభిస్తారు. అయితే - మరీ తీక్షణంగా సూర్య కిరణాలు వున్న సమయంలో - ఈ ప్రయోజనాలు సిద్ధించవు .అవి ఆరోగ్యాన్ని చెడప గలవు కూడా. అప్పుడివన్నీ చేయకండి.
మీకు ధ్యానం తెలియకున్నా, ప్రాణాయామం తెలియకున్నా ఫరవాలేదు. పైన చెప్పిన సమయాల్లో, సూర్యునికెదురుగా, ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకునే కూర్చోండి. అప్పుడప్పుడూ, వొక సెకను కళ్ళు తెరిచి, ఆ లేత కిరణాలను చూసి, కళ్ళు మూసేసుకోవచ్చు. ఆ సమయంలో, కళ్ళు మూసుకుని, శ్వాస మీద ధ్యాస కూడా సాధన చెయ్య వచ్చు.
ఈ ప్రాణమయకోశము - మనలో వొక భాగమే. బయటి గాలి - మనలో వొక భాగం - అంటే - ఆధునిక శాస్త్రానికి - అర్థం కూడా కాదు.అది లేకుండా - మనం అయిదు నిమిషాలు కూడా ప్రాణంతో వుండలేమంటే - అది మనలో వొక భాగం కాదా?
నిజానికి - గాలి కానీ, ఆహారం కానీ, నీరు కానీ - మన శరీరంలో - వుండేది కొద్ది నిమిషాలో, గంటలో, దినాలో మాత్రమే. అన్నే లోపలి వెడతాయి. అలాగే బయటకూ వెళ్లి పోతాయి. నిరంతరంగా వుండేది ఏదో - మనమింకా మాట్లాడుకోలేదు. లోపల ఉన్నంత వరకు - ప్రాణమయ కోశము మనలో వొక భాగమే.
స్థలాభావం వల్ల ప్రాణాయామము మరింత వివరంగా ఎలా చేయాలో చెప్ప లేదు. రాం దేవ్ జీ గారి సి.డీ.లు అన్ని చోట్లా దొరుకుతున్నాయి.ఆస్థా టీ.వీ. చానెల్ లోనూ ప్రతి దినం చూడొచ్చు. అదీ కాక - యు ట్యూబు వెబ్ సైటు లో కూడా వారి వీడియోలు చాలా వున్నాయి.అవీ చూడొచ్చు. వీలైతే వారి యోగ శిబిరాలకూ వెళ్ళొచ్చు.
పుట్టిన బిడ్డ మొట్ట మొదట చేసే పని లోపలికి గాలి తీసుకోవడం - అంటే ఉచ్చ్వాస .అప్పుడే ఆ బిడ్డ ఏడుస్తుంది. ఆ తరువాత, ఈ శ్వాస, నిశ్వాసల ప్రక్రియ జీవితాంతమూ జరిగిపోతూ వుంటుంది. మనం కట్ట కడపట - చేసే పని ఏమిటి? నిశ్వాస! చిట్టా చివరి సారి గాలి విడుస్తారు - మళ్ళీ లోపలికి తీసుకోలేరు. జగన్నాటకంలో - మన ప్రస్తుత పాత్ర అంతటితో ముగిసిపోయినట్టే.
ఈ మధ్య జరిగే జీవన యాత్రలో - మనం - ఆరోగ్యంగా, సంతోషంగా ఎలా ఉండాలో - దానికి, ఈ వ్యాసంలో చెప్పిన పద్ధతులన్నీ ఉపకరిస్తాయి. మన శారీరక ఆరోగ్యం గురించి - అన్న మయ కోశం గురించి తరువాత వ్యాసం లో చూద్దాం.
ఈ మధ్య జరిగే జీవన యాత్రలో - మనం - ఆరోగ్యంగా, సంతోషంగా ఎలా ఉండాలో - దానికి, ఈ వ్యాసంలో చెప్పిన పద్ధతులన్నీ ఉపకరిస్తాయి. మన శారీరక ఆరోగ్యం గురించి - అన్న మయ కోశం గురించి తరువాత వ్యాసం లో చూద్దాం.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి