1953, నవంబర్, వొకటవ తేదీ నాడు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం గా మొదట అవతరించి, తరువాత, 1956 , నవంబర్,వొకటవ తేదీ నాడు హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ గా మారిన మన రాష్ట్రం ఇప్పుడెలా వుంది? ఎందుకలా వుంది?
మొన్న,మొన్న జరిగిన అసెంబ్లీ ఎలెక్షన్లలో కూడా, ప్రజలందరూ - సమైక్యంగా వుండాలనే పార్టీలకే వోటు చేసారు. ఆ తరువాత వై.యస్.ఆర్. గారు పోవడమూ, మరో సరైన, సమర్థుడైన, అందరూ వొప్పుకో గలిగే నాయకుడు రాక పోవడమూ జరగడం తో - వేర్పాటు వాదం బలపడిందని అనిపిస్తుంది.
భారత దేశంలోనే - మొదటి నుండి - భిన్నత్వంలో ఏకత్వం - అని మనం అంటున్నా కూడా, ఏకత్వాని కంటే, భిన్నత్వానికే ప్రాముఖ్యమిచ్చే రాజకీయ వాదులు - అన్ని రాష్ట్రాల్లో బల పడుతుండడం మెల్ల మెల్లగా జరుగుతోంది.
ప్రతి రాష్ట్రంలోనూ యిదే కథ. భాషకు చాలా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాలలో తప్ప - భాష కూడా మనుషులను కలిపే ముఖ్యమైన సాధనంగా వుండడం లేదు.
అంటే - వేర్పాటు వాదాలకు - బలమైన కారణాలే లేవా? వుంటాయి. విడిపోవడానికి ఎన్నో బలమైన కారణాలు మనం చూడొచ్చు. అలాగే - కలిసి వుండాలంటే కూడా - ఎన్నో బలమైన కారణాలూ మనం చూడొచ్చు.
యిది పాత కథే. గ్లాసు అర్ధం నిండి వుందా? అర్ధం ఖాళీగా వుందా? అనేది - చూసేవారి దృక్పథం పైన ఆధార పడి వుంది. వారూ కరెక్టే. వీరూ కరెక్టే. నేను ఖాళీనే చూస్తాను -అనుకుంటే - ఖాళీనే చూడొచ్చు. నేను నిండి వున్న భాగాన్నే చూస్తాను - అంటే - నిండి వున్న భాగాన్నే చూడొచ్చు.
అమెరికాలో - యిప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళలో - యాభై శాతం పైన - చాలా త్వరగా, విడాకులలో, ముగిసిపోతూ వుందట. వీరంతా ఖాళీ భాగాన్ని ఎక్కువగా చూస్తారనిపిస్తుంది . మిగతా వారు కలిసే వున్నారు. వీరు నిండి వున్న భాగాన్నే ఎక్కువగా చూస్తూ వున్నారని అనుకోవచ్చు.
కొంత మంది లాయర్ల వద్దకు వెళితే - ఎంత అన్యోన్యమైన భార్యాభర్తలకు కూడా - ఖాళీ గ్లాసు భాగంలోని జీవితాన్నే చూపించి - సునాయాసంగా విడాకులు ఇప్పించేయగలరు. మరి కొంత మంది లాయర్ల దగ్గరికి వెళితే - విడాకులకోసం పోట్లాడుతూ వచ్చిన వారిని కూడా కలిపేయ గలరు.
వైవాహిక జీవితంలో - అసలు పోట్లాడని భార్యాభర్తలున్నారా? అలాటి జీవితంలో అస్సలు రుచి లేదని కూడా మనకు తెలుసు కదా. అలాగని - పోట్లాటలు మాత్రం జ్ఞాపకం వుంచుకొని - అందరూ విడిపొతున్నారా? రోజూ కొట్లాడే భార్యాభర్తలకు కొందరికి - వొకరినొకరు చూడకుంటే - క్షణమైనా గడవదు. వాళ్ళు కలిసే వున్నారు. ఎప్పుడో వొక రోజు కొట్లాడి, ఆ మాత్రానికి, విడాకుల వరకు పొయ్యే భార్యా భర్తలు కొందరు ఈ కాలంలో తయారవుతున్నారు.
ఇల్లైనా అంతే. జిల్లా అయినా అంతే. రాష్ట్రమైనా అంతే. దేశమైనా అంతే. యిప్పుడు మన దేశానికి కూడా, దేశమంతటా వొప్పుకో దగ్గ నాయకుడో, నాయకురాలో కావాలి. దేశ నాయకుడంటే - దేశమంతా నాది. దేశ ప్రజలందరూ - నా వాళ్ళు -వారందరి బాగు కోసం నేను కృషి చేస్తాను - అని మనసారా కోరుకునే వారు, ప్రతి ప్రాంతం లోని వారితో సులభంగా కలిసి పోయే వారూ నాయకులు గా రావాలి.
మొట్ట మొదట భారత దర్శనం అని - దేశమంతటా యాత్ర చేసిన గాంధీ గారు - దేశ నాయకుడయ్యారు. మరెంతో మంది స్వాతంత్ర్య యోధులున్నా - దేశమంతటా తిరిగిన నాయకుడుగా గాంధీ గారే మనకు మొదట కనిపిస్తారు. స్వాతంత్ర్యం తరువాత - నెహ్రూ గారు దేశమంతటా తిరిగి -తద్వారా -దేశప్రజల మనస్సులో - సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
ఎంతో మంది ప్రధాన మంత్రులయారు. కానీ - భారత దేశమంతటా తిరిగి, అందరితో కలిసిన ప్రధాన మంత్రులుగా - నాకు మాత్రం ముగ్గురే జ్ఞాపకం వస్తారు. నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు.
మిగతా ఎవరూ - దేశమంతటా తిరిగారా లేదా అని నాకు తెలీదు. వారు, వచ్చిందీ, పోయిందీ కూడా గుర్తు లేదు. యిప్పుడు యల్.కే. అద్వానీ గారు దేశంలోని కొన్ని ముఖ్య భాగాలలో రథ యాత్ర చేస్తున్నారు. నిజమే. కానీ - దక్షిణ భారతంలో కూడా - ఆయన హిందీ లోనే - మాట్లాడి వెళ్లి పోతే - ఆయన వచ్చిందీ, పోయిందీ ఎవరికీ గుర్తుండదు. అదే - యిందిరా గాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ వస్తే - ఆంధ్ర దేశంలో రెండు ముక్కలు తెలుగులోనూ, తమిళనాడులో తమిళంలోనూ కర్ణాటకా లో కన్నడంలోనూ తప్పక మాట్లాడుతారు. తరువాత ఆంగ్లంలో మాట్లాడుతారు. ప్రజల మనస్సులో నిలవాలనే ప్రయత్నం చేస్తారు. మిగతా వారిలో అది చాలా తక్కువ.
సరే. యిప్పుడు - దేశ నాయకులుగా వుండాలనే కోరిక వున్న వారు కూడా ఏ పార్టీ లోనూ వున్నట్టు అనిపించదు. రాష్ట్రం సంగతికి వస్తే - అదే సంగతి. రాష్ట్రంలోని అన్ని భాగాలలో నివసించిన వారికైతే - అన్ని భాగాలనూ వొకే రకంగా చూడాలనే కోరిక వుంటుంది. తాము పుట్టిన జిల్లానుండి కూడా బయటికి పోనీ వారికి - తాము తప్ప మిగతా అందరూ బాగున్నారు-అని అనిపించడం సాధారణంగా జరుగుతుం ది.
అదే విధంగా, వొకే రాష్ట్రంలో, పుట్టి పెరిగి, మరో రాష్ట్రం కూడా చూడని వారికి, జాతీయతా భావం రావడం కాస్త కష్టమవుతుంది. ఇప్పుడున్న ముఖ్య మంత్రులు కానీయండి, యం.యల్.ఏ.లు కానీయండి - ఏ వొకరిద్దరు తప్ప - దాదాపు అందరూ - తమ రాష్ట్రపు ఎల్లలు దాటని వారే. మరో రాష్ట్రంలో - రెండేళ్ళు వుండి వుంటే - వారి దృక్పథం మరోలా వుంటుంది.
మా నీళ్ళు మాదే. మా బొగ్గు మాదే. మా గాలి మాదే - అని రామారావు గారో, జయలలిత గారో అనరు. అలా అనే వారు - ఆ రాష్ట్రపు పొలిమేరలు దాటలేదని అర్థము చేసుకోవచ్చు.
పొరుగు రాష్ట్రం వారిపట్ల శివ సేన వారు వ్యవహరించేటట్లుగా - టెండుల్కర్ వ్యవహరించలేడు కదా.
నాయకులు మారాలి. కనీసం భారత దేశమంతా మనది - దేశమంతా అభివృద్ధి చెందాలి - అనే నాయకులు రావాలి. నిజమైన, హృదయపూర్వకమైన జాతీయ దృక్పథం రావాలి. ప్రతి మంత్రీ, ప్రతి యమ్.యల్.ఏ., ప్రతి యమ్.పీ. భారత దేశమంతా తిరిగీ, ప్రతి సంస్కృతినీ ఆకళింపు చేసుకున్న వారిగా - ప్రతి వోక్కరు నా వారే - అనుకునే వారు గా వుంటే - మన దేశం చాలా బాగు పడుతుంది.
తెలంగాణా రావాలా, వద్దా - అన్నది ప్రశ్నే కాదు. ప్రజలు కావాలనుకుంటే రావచ్చు. ప్రజలు వద్దనుకుంటే - రాకపోవచ్చు. చిన్న రాష్ట్రాలలో - మంచి నాయకులుంటే - అభివృద్ధి బాగానే వుంటుంది. అయితే- పెద్ద రాష్ట్రాలలో కూడా - అటువంటి అభివృద్ధి సాదించవచ్చు .మనసుంటే - మార్గం వుంటుంది.
కానీ - అభివృద్ధి అంటే - నేలకా, మనుషులకా - అన్నది మనం అర్థం చేసుకోవాలి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ - అన్న సత్యాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. కొన్ని, కొన్ని ప్రదేశాలలో - ప్రకృతి వనరులు వుండవు. కొన్ని ప్రదేశాలలో - ఎక్కువగా వుంటాయి. వొక జీవ నది డెల్టా ప్రాంతంలో పండే పంటలు - మనం ఏం చేసినా - కొన్ని ప్రాంతాలలో పండే అవకాశం లేదు. వొక చోట గాసు నిల్వలు వుండొచ్చు. మరొక చోట బొగ్గు గనులు వుండొచ్చు. వొక చోట రక రకాల ఖనిజాలు వుండవచ్చు. యిలా - ఎన్నో రకాల ప్రకృతి వనరులు - వివిధ ప్రదేశాలలో వుండ వచ్చు. నా గాసు, నా బొగ్గు అని అనుకుంటే - బొగ్గు వాడికి గాసు లేదు. గాసు వాడికి బొగ్గు లేదు. అందుకే అన్నారు - దేశమంటే మనుషులోయ్ - అని.
ముంబై లాంటి మహా పట్టణం - దేశంలో మరొకటి లేదు. శివ సేన అది మాదే అంటున్నారు. మరి డిల్లీ ఎవరిది? అలాగే - హైదరాబాద్ ఎవరిది? చెన్నై ఎవరిది? దేశమంటే మనుషులే కానీ ఆయా ప్రదేశాలు కావు. యివన్నీ భారతీయులందరిదీ .
మరి ముంబై లాగా చెన్నై ఎందుకు కాలేదు? చెన్నై లాగా హైదరాబాద్ ఎందుకు కాలేదు? హైదరాబాద్ లాగా చిత్తూరు, కర్నూలు ఎందుకు కాలేదు? చిత్తూరు లాగా, మావూరు ఎందుకు కాలేదు? అలా ఎప్పటికీ కావు.కాలేవు. కాకుంటే - అన్ని ప్రాంతాలలో - రోడ్లు బాగుండాలి . ఆ రోడ్లు బాగా వేయనివాడు ఖచ్చితంగా - మీ / మా వూరి వాడే అయివుంటాడు. ప్రతి ఊరికీ - మంచి నీటి సదుపాయం వుండాలి. అవి మన రాష్ట్రంలోని నదులు, చెరువుల నుండే రావాలి. లేదంటే - పక్క రాష్ట్రం నుండీ అయినా రావాలి.
భారతీయులందిరికీ వారి వారి వూర్లో రోడ్లు, నీళ్ళు, స్కూళ్ళు, దగ్గరలో కాలేజీలు, ప్రతి ప్రదేశంలోని ఉద్యోగాల్లో పాల్గొనే హక్కు - ఇవీ మనకు కావలసిన కనీస సౌకర్యాలు. మన ఊళ్లోనే - వొక స్టీలు ఫాక్టరీ, వొక బొగ్గు గని, వొక నది, వొక విమానాల కర్మాగారం వుండాలంటే - కాదు కదా.
యింతకు ముందు, నాయకులకు వుండ వలసిన మనస్తత్వం గురించి అనుకున్నాము. మనకు కూడా - ఉద్యోగాల కోసం, వేరే ఉపాధుల కోసం దేశంలో ఎక్కడికయినా వెళ్ళ గలిగే మనస్తత్వమూ, స్వాతంత్ర్యమూ రెండూ వుండాలి. వొక జోకు చెబుతారు. టెన్ సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి - అబ్బ, అంటూ కూర్చున్నారట. అంతలో - అక్కడికి - వొక మలయాళీ అతను - చాయ్, చాయ్ - అంటూ - టీ అమ్మ వచ్చాడట. అది మలయాళీల మనః స్వాతంత్ర్యానికి ఉదాహరణగా చెబుతారు.
తెలుగు వారు వొకప్పుడు వున్న వూరు కదిలి వెళ్ళే వారు కారు. యిప్పుడిప్పుడు వెళుతున్నారు. రైతు సమూహం తప్ప, మిగతా అందరూ - అన్ని ప్రదేశాలకూ వెళ్లి ఉండగలిగే మానసిక స్వాతంత్ర్యం కలిగి వుండాలి.భారత దేశానికి యిది చాలా ముఖ్యం. అలాగే - అందరూ, నా వారే - అనే మనస్తత్వమూ వుండాలి. ఎక్కడో పుట్టిన మదర్ థెరెసా కున్న భావం మనలో కూడా వుండాలి కదా.
తెలుగు వారు వొకప్పుడు వున్న వూరు కదిలి వెళ్ళే వారు కారు. యిప్పుడిప్పుడు వెళుతున్నారు. రైతు సమూహం తప్ప, మిగతా అందరూ - అన్ని ప్రదేశాలకూ వెళ్లి ఉండగలిగే మానసిక స్వాతంత్ర్యం కలిగి వుండాలి.భారత దేశానికి యిది చాలా ముఖ్యం. అలాగే - అందరూ, నా వారే - అనే మనస్తత్వమూ వుండాలి. ఎక్కడో పుట్టిన మదర్ థెరెసా కున్న భావం మనలో కూడా వుండాలి కదా.
పైనున్న మ్యాపు అలాగే వుంటుందా , మారిపోతుందా? ఎప్పుడు?
ఏమో. నాకు తెలీదు. కానీ - ఖమ్మం పక్కన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అలాగే వుంటాయి. నల్గొండ ప్రక్కన - కృష్ణా, గుంటూరు లు అలాగే వుంటాయి. మహబూబ్ నగర్ ప్రక్కన కర్నూలు, ప్రకాశంలు అలాగే వుంటాయి. దేవుడు పెట్టినవి, ఏవీ, ఎక్కడికీ మారవు. అక్కడి గాలి ఇక్కడికీ, యిక్కడి వానలు అక్కడికీ పోతూనే వుంటాయి. రాజకీయ వాదులు మరీ స్వార్థపరులు కాకుంటే - నదులు మహారాష్ట్రలో పుట్టినా, కర్నాటకాకు, అక్కడి నుండి తెలంగాణా ప్రాంతం ద్వారా కోస్తాకూ - అక్కడి నుండి బంగాళాఖాతానికీ వెళ్ళుతూనే వుంటాయి. కాళిదాసు గారు -మహా కవి కాక ముందు - తానున్న కొమ్మను తానే నరుకుతూ ఉన్నాడట. అలా మన నెత్తిన మనమే రాళ్ళు వేసుకునే పనులు ఎన్నైనా, ఏ రాష్ట్రం వారైనా చెయ్యొచ్చు - నదుల విషయంలో. లేదంటే - రాష్ట్రాలు ఎన్నైనా మనమంతా వొక్కటే.
నేను ఉద్యోగ రీత్యా - దేశంలోని - దాదాపు అన్ని ప్రాంతాలలో - నివసించవలసి వచ్చింది. బెంగాల్ ,అస్సాం, కోస్తా, హైదరాబాద్, తమిళనాడు లతో సహా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాలు గడిపాను. నాకు - ఆ అన్ని ప్రాంతాలూ నచ్చాయి. మనుషులూ నచ్చారు. భాషలూ నచ్చాయి. కానీ రాజకీయ వాదులు మాత్రం చాలావరకు స్వార్థ పరులు గానే వున్నారు.
యిప్పుడు నా రాష్ట్రం ఏది? నాకు తెలీదు. నాది భారత దేశం. అంతే.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి