పంచ మహా యజ్ఞాలు - 5 వ వ్యాసము
భూత యజ్ఞము
సర్వ ప్రాణులనూ - మనం భూతములనే పిలుస్తాము. భూతమంటే - పుట్టినదని అర్థం.
సంభూతము - అంటే - బాగా పుట్టినదని - ఏదో వొక మాతృక నుండి పుట్టిందని చెప్ప వచ్చు.
పుట్టిన ప్రతి దానికి - మరణం తథ్యము!
మరి పంచ మహా భూతాలంటాము గదా?భూమి, జలము, తేజస్సు (అగ్ని), వాయువు, ఆకాశము -
మరి వాటి సంగతేమిటి ? అవి కూడా - సృష్ట్యాదిలో - పుడతాయి. సృష్ట్యంతములో వెళ్ళిపోతాయి.
మళ్ళీ సృష్ట్యాదిలో - పుడతాయి. సృష్ట్యంతములో వెళ్ళిపోతాయి. యిది వేదాంతము.
ఈ వేదాంతము జోలికి యిప్పుడు మనం వెళ్ల నవసరం లేదు. వెళితే - అది వొక బ్లాక్ హోల్ - లాంటిది. అందులోనుండి - ఇప్పుడప్పుడే, బయటికి రాలేము.
యిప్పుడు, భూత యజ్ఞం అంటే - మొదటి నాలుగు యజ్ఞాల తెగలలో - మనం చూడని ప్రాణులన్న మాట. వాటి కొరకు మనం చేసే నిస్స్వార్థ సేవనే - భూత యజ్ఞం అంటారు.
అంటే - దేవతలు (పంచ భూతాలతో సహా) , ఋషులు, పితృ దేవతలు, మనుష్యులు - కాక, మిగతా ప్రాణులన్నీ కూడా , ఏదో వొక సృష్టి ప్రయోజనం కోసం పుట్టినవే. వాటి ప్రయోజనం నెరవేరడానికి - మానవులుగా, మనం అందించే సహాయమే భూత యజ్ఞము.
యిది కాక - అవి మనకు అందించే సహాయమూ - చాలా వుంది. వాటికి మనం కృతజ్ఞత తెలుపవలసిన అవసరమూ చాలా వుంది. యివన్నీ - భూత యజ్ఞం కోవ లోకే వస్తాయి.
సరే. ఈ భూతాలలో,అంటే, ఈ ప్రాణులలో -మొట్ట మొదటగా - మనం గౌరవించ వలసిన ప్రాణి - గోమాత.
ఆవును - మాతృ సమానురాలన్నాము. గోవు మనకు యిచ్చేట టువం టి - గోమూత్రం, గోమయం, క్షీరం, దధి, ఘ్రుతం - అన్నిటినీ కలిపి పంచ కవ్యం - అని అంటారు.
ఈ పంచ కవ్యం లో - వొక్కొ క్కటికీ, తన తన , ప్రత్యేక, ఔషధ గుణాలున్నప్పటికీ - అన్నిటినీ - తగు పాళ్ళలో కలిపిన పంచ కవ్యానికి - మరెన్నో, ఔషధ గుణాలున్నాయని చెబుతారు.
ఇదిలా వుంచితే - యివన్నీ - మనిషికి ఉత్తమోత్తమమైన "సత్వ" గుణాన్ని కలిగించేవిగా కూడా మనం తెలుసుకోవాలి.
ఆవు పాలూ పాలే. గేదె పాలూ పాలే.
విటమిన్లూ , ప్రోటీన్లూ వొక ప్రక్కన వుంచితే - మనిషికి "ప్రశాంతతనూ, సంతోషాన్నీ జ్ఞానాన్నీ" - ఎక్కువగా యివ్వ గలిగేది - ఆవు పాలే నని చెప్పొచ్చు.అందుకే - మహర్షులు , గురువులు, దేవతలు కూడా - ఆవులను ఎక్కువగా చేరదీసారు. ఆవు పాలకు వొక ముఖ్యత్వాన్ని - ఆపాదిం చారు.
మీరూ చూడండి. ఆవు మోహంలో కనిపించే ప్రశాంతత - మరే ప్రాణి మొహంలో నైనా తెలుస్తుందేమోనని.
మీకు - ఆ ప్రశాంతత, ఆ సంతోషము కావాలంటే - ఆవు నాశ్రయించండి. ఆవిను, అన్ని విధాలుగా కాపాడండి.
ఏ ముఖ్యత్వమూ లేకుంటే - మన వారు, దేవుడి పూజకు ముందు ఆవుకు పూజ చేస్తారటండీ? భూత యజ్ఞం లో ప్రథమ స్థానం ఆవుకే.
సరే. సంక్రాంతి తరువాతి రోజు - మనం పశువుల పండగ జరుపుతాం గదా. అందులో - మన పెంపుడు పశువులన్నీ చేరుతాయి. వాటన్నిటికీ - పూజ చేస్తాం గదా. అదీ భూత యజ్ఞమే .
ఎన్నో జంతు స్వరూపాలకు - మనం దైవత్వాన్ని ఆపాదిం చి పూజిస్తాము. మత్స్య , కూర్మ, వరాహ, నాగ, గరుడ, భైరవ, నెమలి, ఏనుగు, సింహము, పులి లాంటి చాలా జంతువులకు దైవత్వాన్ని ఆపాదించి పూజిస్తాము.
వాటిని - బలమైన, కారణము లేకుండా, చంపాలని అనుకోము. యివన్నీ, వున్న అడవులను - నాశనం చేసే వుద్దేశమెప్పుడూ - భారత దేశం లో లేదు. కానీ - అడవులను వదలి, మనుషులపై బడి, చంపేటటువంటి క్రూర మృగాలను - మాత్రము, వేట ఆడి - క్షత్రియులు సంహరించేవారు.
వొక్కొక్క పెంపుడు జం తువుకూ - వొక్కొక్క ప్రయోజనం వుండేది. గుర్రాలను స్వారీకి ఉపయోగిస్తే - గాడిదలను, చాకలి బట్టలకు వుపయోగించారు. ఎద్దును, దున్నడానికి, కుక్కను - యింటి బయట కావలికి ఉపయోగించారు. కుక్క విశ్వాసాన్ని, యింటి బయటనే వుపయోగిం చుకున్నారు. - లోపల కాదు - ఈ నాటి లాగా.
విశ్వాసము లేని జంతువులను ( పిల్లి ??), క్రూర మృగాలను - మన వాళ్ళు పెంచ లేదు. కానీ, అనవసరంగా చంపనూ లేదు. చీమల్లో కూడా - సాధు చీమలను, దేవుడి చీమలన్నారు. వాటి కోసం , ప్రతి రోజూ - యింటి ముందు, ముగ్గులు వేసే సమయంలో - బియ్యపు పిండి ( చాక్ పీసు కాదు) ఉపయోగించే వారు. ఇది - అవి తినటానికే..
మరి, కుట్టే చీమలు, కీటకాలు లోపలి రాకుండా, పేడ లాంటివి వాడేవారు.
అన్నం తినే ముందు - యింటి ముందు, లేదా యింటి పైన, కాస్తా ఎత్తయిన ప్రదేశంలో, కాకులకు, యితర పక్షులకు వండిన అన్నం పెట్టే వారు. యిందుకు, ఎన్నో కారణాలు చెబుతారు. ఈ కాకులు, మిగతా పక్షులోచ్చే చోట - పాములు రావు. యిదొక ముఖ్య కారణం. కాకుల వల్ల, మనకొచ్చే పెద్ద ప్రమాదం లేదు కానీ - పాముల వల్ల వుంది కదా.
యిలాం టి పద్ధతులు - ఎన్నో వున్నాయి. అయితే - మిమ్మల్ని కరవగలిగే పాము మీ మీదికి వస్తుంటే - చంపొద్దని మన వాళ్ళు ఎప్పుడూ చెప్ప లేదు. మిమ్మల్ని చంపి తినడానికి, పులి మీ మీద పడితే - చంపొద్దని మన వాళ్ళు ఎప్పుడూ చెప్ప లేదు. మిమ్మల్ని - మీరు రక్షించుకోవడం కూడా ముఖమైన యజ్ఞమే.
నిజానికి - ధ్యానానికి - జింక చర్మము గాని, పులి చర్మము గాని (దర్భ పైన) వేసుకుని, దానిపై తెల్లని గుడ్డ వేసుకోవడం శ్రేష్టమని - గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. అది యోగులకు ఉపయోగకారి అన్నాడు.అంటే - అహింస ఎంత వరకు, ఎప్పుడు , ఎంత హింస వాడవచ్చుననేది - మన వారు - ఈ పంచ మహా యజ్ఞాలద్వారా - చాలా నిర్దిష్టంగా చెప్పారు.
ముఖ్యమైనది - మీ మనస్సులో - అమాయక ప్రాణుల పట్ల - దయ వుందా. మీరు వాటి రక్షణకై ఏమైనా చేస్తున్నారా?
అంతే. అందుకని, మరీ అతిగా చేయనవసరం లేదు - మీరు మహా యోగులైతే తప్ప. వొక సారి, వొక యోగి, శిష్యులతో నది వొడ్డున వెళుతూ వున్నాడు. నదిలో, వొక తేలు మునిగి పోతూ కనిపించింది. యోగి గారు - ఆ తేలును, చేతితో పట్టి బయట పెట్టారు. తేలు బ్రతికింది - కాని, బ్రతికించిన యోగి చేయిని కుట్టింది. యోగికి చేయి బాగా నొప్పి పెట్టింది. శిష్యులు - ఎందుకండీ, గురువుగారూ, తేలును బ్రతికించారు? దాని బుద్ధి అది మానలేదు చూడండి. బ్రతికించిన మిమ్మల్నే కుట్టింది - అన్నారు.
గురువుగారు - అవును. కుట్టే దాని బుద్ధి, అది మాన లేదు. బ్రదికించే నా బుద్ధి నేను మాన లేను - అన్నారు.
అదండీ భూత యజ్ఞం లో పారాకాష్ఠ. మీరు మాత్రం - మీ చేత ఐనటువంటి భూత యజ్ఞం చేయండి.
మన సంస్కృతిలో - చెట్లకు, నీటి ప్రవాహాలకు, కొండలకు చాలా ప్రముఖ స్థానం వుంది. వీటన్నిటికీ ప్రాణముందనీ - వొక విలక్షణమైన - వ్యక్తిత్వము కూడా వుందనీ - మన నమ్మకం. హిమాలయాలు లేని భారత దేశమే లేదు. అలాగే, వింధ్య పర్వతాలు. మరెన్నో పర్వతాలు.
గంగ మన తల్లి అంటాము. గోదావరి మన తల్లి అంటాము. స్వచ్చమైన, గంగా జలాన్ని , కల్మషం చేసి - ఆ నీటిని శుభ్రపరిచి, 10 -15 రూపాయలకు చిన్న బాటిల్సు లో కొనుక్కునే స్థితి వచ్చేసింది .
అడుసు త్రొక్క నేల - కాలు కడుగనేల - అంటారు. శుభ్రమైన గంగనీళ్ళను - కల్మషం చేయనేల. కల్మషం నీళ్ళను మళ్ళీ శుభ్రము చేయ నేల - అనే స్థితికి వచ్చేశాము.
కొన్ని దశాబ్దాల క్రితము - వీర బ్రహ్మము లాంటి యోగులు - చెప్పారట - ముందు, ముందు , నీళ్ళను కొనుక్కునే దుస్థితి వస్తుందని. మన స్వార్థము వలన ఆ దుస్థితి వచ్చేసింది.
యిప్పుడు, గాలిని కూడా - విపరీతంగా కల్మషం చేస్తున్నాము. గాలి కూడా - మళ్ళీ శుభ్ర పరిచి , మనమే కొనుక్కో వలసిన పరిస్థితి- మనమే తెస్తున్నాము.
దేవుడిచ్చిన శుభ్రమైన నీళ్ళను, గాలిని - కొందరు చేరి కల్మష పరిచి, దాన్ని కొందరు శుభ్రపరిచి, మళ్ళీ, అందరూ, కొనుక్కోవడం - హాస్యాస్పదం కాదా?
చెట్లు మనకు ఎలా ఉపయోగ పడతాయో - మరో వ్యాసంలో- రాసాను. మనం పీల్చే ఆక్సిజను చెట్లే మనకు యివ్వ గలవు. కాంక్రీటు రోడ్డు యివ్వలేదు. మనం విడిచే కార్బను డై ఆక్సైడును విడగొట్టి - కార్బనును వేరుగా చేసి, ఆక్సిజను వేరుగా చేసి - వాతావరణ కాలుష్యాన్ని నివారించి - మన ప్రాణాన్ని నిలుపగల శక్తి, చెట్లకు మాత్రమే వుంది. మన 8 అంతస్తుల భవనాలకు లేదు. వర్షాలు తెప్పించ గల శక్తి చెట్లకే వుంది. వైద్యానికి కావలసిన అన్ని మూలికలనూ యివ్వగల శక్తి చెట్లకే వుంది.
మీకు తెలుసా - ప్రకృతి ద్వారా వచ్చిన ఏ వ్యాధి కైనా - మందు, ప్రకృతి లోనే వుంది - ముఖ్యంగా చెట్లలోనే వుంది.
మందు లేని వ్యాధి ప్రకృతిలో లేదు. చెట్లకూ ప్రాణం వుందన్న సంగతి మన వారికెప్పుడూ తెలుసు. తులసికీ, రాగిచేట్టుకూ, బిల్వానికీ, మరెన్నో చెట్లకు - మనం దేవుడి స్థానం కల్పిస్తాము.
చాలా చెట్లు - గుళ్ళలో - తప్పకుండా వుండాలంటాము. చెట్లనే - గుళ్ళుగా మార్చి, దాని చుట్టూ మనం తిరగడం కూడా వుంది.
మీ మాటలను, మీ చేతలను - యింతెందుకు , మీ ఆలోచనలను కూడా - చెట్లు గ్రహించ గలవు. చెట్లను ప్రేమించం డి. చెట్ల నూ గౌరవించండి. చెట్లు మీకు ఎంతో మేలు చేస్తాయి.
కాని - అవి మనకు చేయగలిగే మేలు - మనం వాటికి చేయ గలిగే మేలు - మనం మరిచి పోతున్నాము.
అందుకే మనకు - భూత యజ్ఞం తప్పక కావాలి.
ఈ రోజు నుండి -
(1 ) ఏదో వొక చెట్టుకు మీరు నీళ్ళు పోయడము, ఎరువు వేయడము చేయండి.
(2 ) ఆ చెట్టుతో మాట్లాడడానికి ప్రయత్నించండి.
(3 ) ఆ చెట్టుకు - మీ ప్రేమ, ఆదరణ తెలియ చేయండి.
(4 ) మీకు తెలుసా- యిదొక యోగ శాస్త్ర ప్రక్రియ అని.
(5 ) కాకికి ప్రతి రోజూ, కొద్దిగా అన్నం పెట్టి చూడండి.
(6 ) మరెవరికీ హాని చేయని - జంతువుతో స్నేహం చేసి చూడండి. ఆ జంతువుతోనూ - మాట్లాడండి.
(7 ) ఆవులను పెంచే ఏ గుడికైనా, ఆశ్రమానికైనా - ఆవులను పెంచడానికి - విరాళాలివ్వండి. ఆవులను పెం చ గలిగితే - చాలా మంచిది. లేదంటే - పెంచే వ్యక్తికి - ప్రోత్సాహమివ్వండి.
భూత యజ్ఞంలో - మరేమేం చేయ గలరో - యోచన చేసి - చేయండి. మీ జీవితం చాలా మారుతుంది.
మరో చిట్టా చివరి - చిన్న వ్యాసం కూడా వుంటుంది . అదీ చదవండి - ఆ అంశం పైనే.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి