మీ ఏ విజయానికైనా - మీరు, దానికి, తీసుకున్న బాధ్యతలే మఖ్య కారణం.
బాధ్యత తీసుకోకుండా ఏ విజయమూ రాదు.
మరి - మీ బాధ్యతలేమిటి?
విజయం మొదట మీ బుద్ధిలో పుడుతుంది. పుట్టాలి.
మీకు ఏదో కావాలి. కావాలి అనిపించడం - అది బలంగా మనసులో నాటుకొవడం - మీ మొదటి విజయం.
దీనికి కారణం - మీ "యిచ్చా శక్తి".
కావలసిన వస్తువు, చేర వలసిన గమ్యము - ఎలా పొందాలి, ఎలా చేరాలి, అన్న తీవ్ర ఆలోచన మీ మనసులో రావాలి. ఇది మీ "జ్ఞాన శక్తి."
మీకూ , మీ గమ్యానికీ మధ్య - మార్గం - మీరు వేసేదే.
మరో మార్గం లేదు. మీరు వేసేదే మార్గం.
మీ మనసులో వుండే భావ తీవ్రతకు - ప్రకృతి శక్తులూ, తలూపుతాయి. మీ గమ్యం - మరెవరికీ బాధాకరం కానిదయితే, అవీ మీకు చేయూతనిస్తాయి.
మీ గమ్యం, పదిమందికి ఉపయోగ కరమైన దైతే - ప్రకృతి శక్తులు కూడా - మిమ్మల్ని గమ్యం వైపు తీసుకెడతాయి; గమ్యాన్ని కూడా , మీవైపూ తీసుకొస్తాయి.
నిస్స్వార్థ గమ్యానికి - మీతో బాటు - అవీ రావడానికి, ఎంతో యిష్ట పడతాయి.
అయితే - బాధ్యత మీదే. గమ్యం చేరే వరకు - మీరు చేయవలసిన పనులు మీరు చేయాల్సిందే..
ఇది మీ "క్రియా శక్తి".
మీ ఇచ్చా శక్తి, మీ జ్ఞాన శక్తి, మీ క్రియా శక్తి - మీరు సరి ఐన గమ్యం కోసం వాడండి.
ప్రకృతి శక్తులు మీకు తోడుంటాయి.
గమ్యమే లేని వాడికి - ఎవరు తోడుండగలరు? కాబట్టి - మీకు గమ్యం వుండాలి. గమ్యం చేరడమే విజయం. మీ మొట్ట మొదటి బాధ్యత, మీ గమ్యం స్థిరపరచడమే.
స్వంత ఆలోచనే ఉపయోగించని వానికి - ఎవరు - ఆలోచన నీయ గలరు? కాబట్టి - మీ రెండవ బాధ్యత - మీ గమ్యానికి సరి ఐన బాట మీరు వేయాలి.
తన బాధ్యత తాను తీసుకొని వానికి - ఎవరు సహాయ పడ గలరు? మీ మూడవ బాధ్యత - మీరు వేసిన బాటలో - మీరు ప్రయాణం చేయాలి - గమ్యం వరకూ.
మరో సారి చూడండి :
మీ విజయానికి మొదటి మెట్టు - మీ ఇచ్చా శక్తి. దీనితో - మీ గమ్యాన్ని స్థిరం చేయండి.
రెండవ మెట్టు - మీ జ్ఞాన శక్తి. దీనితో మీ మార్గాన్ని స్థిరం చేయండి.
మూడవ మెట్టు - మీ క్రియా శక్తి - మీ మార్గంలో, మీ గమ్యం వైపు, ప్రయాణం మొదలు పెట్టండి. మీరు గమ్యం వైపు, గమ్యం మీ వైపు రావడం గమనించండి.
గమ్యం వచ్చే వరకు నిలవకండి; నిలపకండి.
విజయం మీదే.
- మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి