ఈ అదృష్టం ఎందుకొచ్చింది?
యింతకు ముందు పోస్టు లో దృష్టాదృష్ట ఫలాలను గురించి కొంత తెలుసుకున్నాం.
అదృష్టం - అంటే మనకొక అపోహ వుంది.
ఏదో గొప్ప మంచి జరిగితే, అది మన కొక వరం లాగా మనం భావిస్తే - అది మన అదృష్టం అని అంటుంటాము .
అదృష్టం - అంటే - జరిగిన దానికి, కారణం, మూలము మనకు, కనిపించడం లేదని మాత్రమే అర్థం.
ఎందుకొచ్చిందిది, ఏ కారణము వలన - అంటే, మనకు సరి అయిన జవాబు దొరకడం లేదు - అందుకని దాన్ని అదృష్టమని అంటున్నాము. అంతే కాని - అది చాలా మంచిది కాబట్టి అదృష్టం అని కాదు. మంచో, చెడో - మనకు కారణము తెలీకండా వచ్చింది. అంతే.
నువ్వు - నా భార్య (లేదా భర్త) గా దొరకడం నా అదృష్టం - అని మీరు ఏ అర్థం తో నైనా అన వచ్చు.
అసలు విషయం తెలీక వారూ పొంగి పోవచ్చు.
నిజానికి - మనకొచ్చే చాలా సంగతులకు - మనకు మూల కారణం తెలీదు. అవన్నీ మన అదృష్టాలే.
మీ భార్య (లేదా భర్త) మీకు దొరకడం నిజంగా మీ అదృష్టమే!
మీ అత్త గారు మీకు అత్త గారిగా దొరకడం మీ అదృష్టమే! ఎటువంటి అత్త గారైనా - వారే మీరు చేసిన పుణ్య పాపాలకు - మీకు తగిన వారు. మీరూ, వారికి తగిన వారే.
మీ కొడుకు / లేదా కూతురు - మీకు పుట్టడం మీ అదృష్టమూ - వారి అదృష్టమూ కూడా!
మనకు జరిగే చాలా విషయాలు మన అదృష్టాలే.
మీకు యివ్వ బడిన శరీరము, ఆరోగ్యము, రోగాలు, కష్టాలు, డబ్బు,విరోధాలు, వినోదాలు - అన్నీ మీ అదృష్టాలే.
మీ పనులకు మెచ్చి - మీకు యివ్వ బడిన పారితోషికములు.
కాకపోతే - మీ - ఎప్పటి, ఏ పనికి, ఫలానా, ఫలానా పారితోషికం, అదృష్టం గా యివ్వబడిందని - మీకు తెలీదు.
కష్టాలెవరూ కొని తెచ్చుకోరు. రోగాలెవరూ అడిగి తీసుకొచ్చుకోరు. కాని - అవి మీకు యివ్వ బడ్డాయి. మీ పనులకు ప్రతిఫలంగా. వాటిని - మీరు వద్దనే ప్రసక్తే లేదు మరి.
పనులంటే - ఉత్త పాప పుణ్యాలా? మరేమైన ఉన్నాయా?
మీరు తిన కూడని వస్తువు తిన్నా, త్రాగ కూడని పదార్ధం త్రాగినా - ఎప్పుడో, మీ శరీరానికి, దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. అది కూడా - మీరు, మీ శరీరానికి చేసిన "పాపమే" అని చెప్పుకోవచ్చు.
సుఖాలూ - కష్టాలూ
అంటే - అదృష్టమనేది - సుఖాన్నివ్వచ్చు. దుహ్ఖాన్నివ్వచ్చు .ఏదైనా - ఆ కర్మ ఫల దాత మన పనులకు, మనకిచ్చిన ప్రతిఫలమే.
కష్టాలొస్తే - రోగాలొస్తే - దేవుడా, కాపాడు నాయనా - అంటాము. తప్పులేదు. అనొచ్చు. ఈ వినమ్రత, సమర్పణా భావము కూడా వొక పనే; వొక పుణ్యమే. దాని ఫలితమూ మనకు వస్తుంది.
అయితే - దేవుడిని మరొక రకంగా కూడా - మనం తలుచుకోవచ్చు. చిన్న కస్టాలు వచ్చినపుడు - ఏదైనా - నీవిచ్చిన ప్రసాదమే - సంతోషంగా తీసుకుంటాను - అన్నారనుకోండి . ఆ కష్టాలే సుఖాలుగా మారిపోవచ్చు.
మనకు కష్టాలు అని అనిపించే ఎన్నిటినో - సుఖంగా గడిపిన వారెందరో వున్నారు.
ఎలా?
ఎన్నో రకాలుగా - కష్టాలను, సుఖాలుగా గడపొచ్చు.
తోడుగా - నీడగా, ప్రేమిం చే, భార్యో, భర్తో, వుంటే - ఎన్నో కష్టాలు, సుఖాలుగా మారిపోతాయి. మీరు - వెంటనే అలాంటి భార్యగానో, భర్తగానో, మారండి. ..... మీ వారు / మీ భార్య - మీ ఉదాహరణతో - కొన్ని రోజుల్లోనో, నెలల్లోనో - మిమ్మల్ని అమితంగా ప్రేమిం చే వ్యక్తిగా మారిపోతారు. ప్రేమలో భగవంతుడున్నాడు. ప్రేమకు అమితమైన శక్తి వుంది.
మంచి స్నేహితులు ఇద్దరో, ముగ్గురో, నలుగురో వుంటే - ఎన్నో కష్టాలు, సుఖాలుగా మారిపోతాయి. మీరు - వెంటనే వొక మంచి వాడికి - అలాంటి స్నేహితుడిగా మారండి.అతనూ మీకు మంచి స్నేహితుడిగా మారతాడు.
మంచి వాత్సల్య పూరితులైన తండ్రిగా, తల్లిగా, ప్రేమమయులైన పుత్రులుగా, పుత్రికలుగా మారండి. ఎన్నో కష్టాలు సుఖాలుగా మారిపోతాయి.
అంటే - పక్కనున్న వారి - కష్టాన్ని పంచుకోండి. వారి శరీర, ఆర్ధిక, మనో భారాల్ని తగ్గించండి.
అందు వల్ల మీకూ మంచే జరుగుతుంది. వారికీమంచే జరుగుతుంది.
అన్నిటినీ మంచి - ఏదొచ్చినా - నీ ప్రసాదమే - నీ ప్రసాదమేదైనా, సం తోషంగా స్వీకరిస్తానన్న భావన మీలో వుంటే - కష్టాలను, చాలా సులభం గా సుఖాలుగా స్వీకరించ వచ్చు.
మీ మనసుకు -కష్టాన్ని - సుఖంగా మార్చుకునే అపారమైన శక్తి వుంది.
ఉదాహరణకు - మీరు వొక కిలో మీటరు నడవాలని కష్ట పడుతూ, బాధ పడుతూ నడుస్తున్నారు. చేతిలో, 10 రూపాయలుంటే - రిక్షా లో వెళ్లి వుందును గదా - అని మీ మనుసు లో బాధ.
కాస్త ధన వంతుడుగా వుంటే - కార్లో వెళ్ళే వాడిని గదా - అనుకుంటున్నారు.
కాస్త మనుషులను గమనిం చండి.
కొంత మంది - మా ఆరోగ్యం బాగుండాలి - కాబట్టి మేము నడుస్తామని , కార్లున్నా, డబ్బు వున్నా, ఏదీ లేక పోయినా, వొక కాలే లేకున్నా - ఎన్నో కిలోమీటర్లను, సంతోషం గా నడిచే వాళ్ళను మీరు చూడగలుగుతారు. మీకూ, వారికీ తేడా ఎక్కడ? మీ మనసులోనే. కష్టం కాదనుకునేదేదీ కష్టంగా వుండదు. కష్టం అనుకునేదేదైనా - సుఖంగా వుండదు. కారులో వెళ్ళడం కష్టంగా అనుకునే వాళ్ళెంతో మంది వున్నారు.
ముఖ్య మంత్రి పదవి వద్దు బాబోయ్ అన్న వారూ వున్నారు. కావాలని కొట్టుకునే వారూ వున్నారు. అన్నిటికీ మనసే కారణం.
పనులూ - ప్రతిఫలాలూ
యిక్కడ మీరు కర్మ సిద్దాంతం యొక్క విశిష్టతను బాగా అర్థం చేసుకోవాలి.
యిప్పుడు - మీకివ్వబడుతున్న ప్రతి ప్రతిఫలమూ - మీరు గతంలో - చేసుకున్న పుణ్య, పాప ఫలితాలే. మళ్ళీ - పాపమంటే - సరిగ్గా అర్థం చేసుకోవాలి. దారిలో, చూడకుండా, రాయిని తన్నారనుకోండి . మీకు తగులుతుంది. నొప్పి పెడుతుంది. రక్తమూ రావచ్చు. యిది పాపమా? మీకు మీరు చేసుకున్న పాపము. ప్రతి పనీ - పాపమైనా, పుణ్యమైనా, రెండూ కాక పోయినా - దానికి, ప్రతి ఫలం మాత్రం తప్పక వుంటుంది.
మీకు వచ్చిన ఏదో ప్రతిఫలం - ఏదో చెడు జరగడం అనుకోండి. ఏదో రోగం వచ్చిందనుకొండి .
యిది ఏదో పాపానికి మీకొచ్చిన ప్రతిఫలం అనుకుందాం. "మా ఫలేషు కదాచన" అన్నట్టు, ఈ ప్రతిఫలం రావడంలో - మీ ఎంపిక లేదా ఛాయిస్ చాలా తక్కువ. ఇది వస్తుందని -మీరు అనుకోలేదు. అయినా వచ్చింది. మనం చెడ్డ చేసేటప్పుడు - ఎప్పుడో, మనకూ చెడ్డ తప్పకుండా జరుగుతుందని మనం అనుకుని చేస్తున్నామా? కాని - అటువంటి ప్రతిఫలం - రాక మానదు. ఎప్పుడో తెలీదు. ఎలాగో తెలీదు. కానీ వస్తుంది.
మీలో వున్న శక్తులు
కాని - "కర్మణ్యేవ అధికారస్తే" అన్నట్టు - ఈ వచ్చే, ప్రతిఫలాన్ని, మీ జీవితం లో , మీ మనసులో, మీరు ఎలా తీసుకుంటారో - అది, మళ్ళీ మీ "పనే" , అది మీ "కర్మ"నే . అది - మీరే నిర్ణయించుకోగలరు.
కష్టాన్ని - సంతోషంగా తీసుకోగల సామర్థ్యం దేవుడు మీకు యిచ్చాడు. అది మీలో వుంది.
రేపటి సుఖాలను, ఈ రోజు కర్మలతో మలుచుకో గల సామర్థ్యమూ మీకు దేవుడు యిచ్చాడు.అదీ మీలో వుంది.
ప్రక్క వాడి కష్టాలను తగ్గించగల సామర్థ్యమూ మీకు దేవుడు ఇచ్చాడు.
ప్రేమలో, జ్ఞానంలో, ధ్యానంలో, నిస్స్వార్థ కర్మలలో - దేవుడినే మీలో చూడగల, మీలో బంధించుకోగల సామర్థ్యమూ మీకు దేవుడు ఇచ్చాడు.
యిన్నిఅపార శక్తులను పక్కన బెట్టి - నోట్ల కట్టలలో, అధికారాలలో - పదవులలో - మట్టిలో - సంతోషం వెదికితే - అవి ఎండమావులే అవుతాయి. వాటి ప్రతిఫలాలు - వెంటనే - మన వెన్నంటుతాయి. అవి ఎప్పుడు ,ఏ రూపంలో మీ జీవితంలో ప్రవేశిస్తాయో మాత్రం తెలియదు.
కర్మ సిద్దాంతం -కొన్ని వేల, లక్షల సంవత్సరాల నాటిది. నిజానికి, సృష్టిలో - అది వొక మౌలికమైన ధర్మం. ఎప్పుడూ ఉన్నదే.
ఇంగ్లీషులో - కాస్ - అండ్ - ఎఫెక్టు - థియరీ అని పేరు పెట్టాము. అంతే.
సంతోషం మీ జన్మ హక్కు. అది "ఎఫెక్టు" అయితే - "కాస్" ఏమిటో, ఎవరో తెలుసా?
మీరే!
=మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి