మనిషి జీవితము - అడ్డంకులతో కూడిన ఆట (హర్డిల్స్ రేసు) లాంటిది.
సాఫీ గా, అడ్డంకులు లేకుండా పది రోజులు జరిగితే - ఎక్కడినుండో - వొక అడ్డంకి ఊడి పడుతుంది. యిక మీరు అ అడ్డంకిని వదుల్చు కుంటే గాని - మళ్ళీ జీవితం ముందుకు జరగదు.
ఎవరో వొక అదృశ్య వ్యక్తి - లేదా అదృశ్య శక్తి - మీ మీద కక్షతో , పిల్లి ఎలుకతో ఆడుకున్నట్టు, అడుగడుక్కూ మీ ముందు, ఏదో వొక అవరోధాన్ని ఎంపిక చేసి వుంచుతున్నట్టే వుంటుంది. మీరు దాన్ని దాటి వెళ్ళాలి. తప్పదు. అది దాటండి. మరోటి సిద్ధమవుతుంది. జీవితమంతా యిలాగే సాగుతుంది.
కథల్లోనూ, సినిమాల్లోనూ, టి వి సీరియల్సు లోను - "వాళ్ళు ఆ తరువాత హాయిగా జీవితం గడిపారు" - అని చెప్పచ్చు - కాని, నిజ జీవితంలో - అది తుది శ్వాస వరకు కుదరదు.
అవరోధాలు, అడ్డంకులు, కష్టాలు, నష్టాలు, రోగాలు, శోకాలు, బాధలు ఏవీ లేని జీవితం సృష్ట్యాది నుండి యిప్పటి వరకు లేదు. వీటన్నిటినీ చేర్చి "సమస్యలు" అని కూడా చెప్పుకోవచ్చు.
క్రీస్తు కూ తప్ప లేదు. బుద్ధుడికీ తప్పలేదు. కృష్ణుడికీ తప్ప లేదు. శివుడికీ తప్ప లేదు. మహా విష్ణువుకూ తప్ప లేదు - ఈ సమస్యలు.
కాబట్టి - జీవితానికి సమస్యలు, అవరోధాలు వస్తాయని, వుంటాయని - "ఎదురుచూడలేనివి కూడా, ఎదురుపడతాయని మనం ఎదురు చూడడమే" తార్కికమైన దృష్టి.
ప్రపంచ యుద్ధాలు వస్తాయని, వాటికి వొక్క సంవత్సరం ముందైనా - ఎవరూ ఎదురు చూడలేదు. కానీ వచ్చాయి.
యు యస్ యస్ ఆర్ ఇన్ని చిన్న చిన్న దేశాలుగా విడి పోతుందని - ఎవరు కల గన్నారు? అయినా - అది జరిగిపోయింది. అమెరికా వారి సి ఐ ఏ. యొక్క ప్రముఖ వైఫల్యాల్లో ఈ విభజనను అణుమాత్రం కూడా పసిగట్ట లేక పోవడం, వొకటిగా చెప్పుకుంటారు. .
జపాన్ లో జరిగిన ప్రకృతి విపరీతాన్ని గాని, అమెరికాలో వచ్చే టార్నేడో లను గాని, 9 /11 లనుగాని - దేన్ని మనం ఎదురుచూడగలిగాం? అయినా, అవన్నీ వచ్చాయి. మరెన్నో రాబోతున్నాయి. రేపేం వస్తుందో - మనకు తెలీదు , కానీ ఏదో వస్తుంది. అంత మాత్రం తెలుసు.
ఎందుకంటే - ఘటనాఘటన పూరితమయిందే జీవితం. అవి లేనిది జీవితమే లేదు. కాబట్టి, ఎదురుచూడలేనివి, ఏవేవో ఎదురు వస్తాయని - తప్పకుండా ఎదురు చూడండి.
మీ యింట్లో కూడా వస్తాయి.మీ వొంట్లో కూడా వస్తాయి.
ఈ 2011 సంవత్సరంలో -యిక మిగిలిన 7 నెలల్లో -మనకే సంఘటనలు ఎదురౌతాయో , మన పిల్లల ఆరోగ్యాలు, చదువులు, పెద్దల ఆరోగ్యాలు, మనము, మన భార్య (/భర్త) కు ఏమేం ఎదురౌతాయో, మనం చెప్పలేం కదా.
కానీ ఏదో, ఏదేదో వస్తాయని మాత్రం ఎదురు చూడాలి. చేసుకోగలిగిన ముందు జాగ్రత్తలూ చేసుకోవాలి.
యిది ముఖ్యం. చేసుకోగల ముందు జాగ్రత్తలు చేసుకోవాలి.
మానవ జీవితాన్ని శాసించే - ముఖ్య ధర్మాలలో వొకటి - ఈ సమస్యలూ, కష్టాలూ, రోగాలూ, ఎగుడుదిగుడులూ - వస్తూనే వుంటాయి. తగినంత ముందు జాగ్రత్తలు తీసుకుంటే - వచ్చే కష్టాలూ, రోగాలూ, పోతూనూ వుంటాయి.
ముందు జాగ్రత్తలు - దీర్ఘ దర్శి లక్షణం.
సమస్యలు (అంటే - కష్టాలు, రోగాలూ, ఎగుడుదిగుడులూ లాంటివన్నీ )-వస్తూనే వుంటాయి - అన్నాము.
ప్రతి కష్టంలోనూ - నిజంగా - రెండు కష్టాలు దాగి వున్నాయి.
(1 ) వొకటి - మనకు, బయటివారికి, అందరికీ కనిపించే కష్టం. ఉదాహరణకు - మీది లక్ష రూపాయలు ఎవడో దొంగ ఎత్తు కెళ్ళాడనుకోండి . అది మీకు ఏ పెళ్ళికో, అవసరంగా కావాల్సి వుంది. యిది మీకూ, అందరికీ తెలిసే, అర్థమయ్యే కష్టం.
(2 ) అయితే - దీనికి - మీ మనసులో, మీరు ఎటువంటి బాధ పడతారో (లేదా పడరో) - అది మీకు మాత్రం తెలిసిన కష్టం. కొంత మందికి హార్ట్ అట్టాక్ రావచ్చు. కొంత మంది ఈగ వాలినంత కూడా కష్ట పడక పోవచ్చు. యిది - కేవలం డబ్బు ఎక్కువ వుండడం, తక్కువ వుండడం పైన మాత్రం ఆధార పడి వుండదు.
ముఖ్యంగా - మీ మనస్తత్వం పైన ఆధార పడి వుంటుంది. నేనిది మళ్ళీ సంపాదించుకోగలను, పెద్ద విషయం కాదు - అని అనుకోవచ్చు. పెండ్లి జరక్క పోతే - పెద్ద మునిగిపోయిందేమీ లేదు -అని అనుకోవచ్చు. అవతలి వారికి సర్ది చెప్పొచ్చు-అని మన మనసులో ధైర్యం గా అనుకోవచ్చు.
యిట్లా ,. ఎన్నో రకాల మానసిక ప్రతిచర్యలు, ప్రతిక్రియలు - మన మనోబలాన్ని బట్టి మనలో జరుగుతాయి.
లక్ష రూపాయలకే కొంప మునిగిపోయిందనుకుంటే, జీవితమే అంధకారమయిపోయిందనుకుం టే - ఆత్మ హత్య చేసుకునే వారూ వున్నారు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే వారున్నారు.పెద్ద పెద్ద రోగాలు తెచ్చుకునే వారూ వున్నారు .
ఏదో వొకటి చేసి, ఈ సమస్యలో నుండి , ఈ కష్టంలో నుండి బయటికి రావాలి - అని క్రియాశీలతకు ప్రాముఖ్యమిచ్చే వాళ్ళూ వున్నారు.
ఏది జరిగినా, జరక్క పోయినా - నాకేం పోయింది - ఎవరో యింట్లో కష్టపడి , ఏదో చేస్తారులే, అని నిమ్మకు నీరెత్తినట్లు వుండే వాళ్ళూ వున్నారు.
అంటే - ప్రతి కష్టం లోనూ - మన మానసిక చర్యే మొదట జరుగుతుంది. తరువాత బాహ్య (శారీరక) చర్య అందరికీ తెలిసేటట్లు జరుగుతుంది.
కష్టాన్ని - నేను ధైర్యం గా ఎదుర్కొంటాను - అనే మనస్తత్వం మీ మానసిక బలానికి ప్రతీక.
కష్టానికి భయపడి పారిపోతాను లేదా, జీవితం నుండే పారిపోతాను - అనే మనస్తత్వం మీ మానసిక దుర్బలత్వానికి చిహ్నం.
ఈ రెండు మనస్తత్వాల మధ్య - ఎన్నో రకాల మానసిక ప్రవృత్తులుంటాయి .
మానసిక దుర్బలత్వం వలన - వెంటనే - మానసిక వొత్తిడి పెరిగి పోతుంది.
మన సమస్యను, కష్టాన్ని చూడడానికే భయపడతాము. దానికి ప్రత్యామ్నాయాలు వెదకడానికే సాహసించము.
అదే కాకుండా - వున్న సమస్యను అనేక రకాలుగా జటిలం చేసుకుంటాము.
(1 ) దాన్ని భూతద్దంలో చూసినట్లు, వున్న దానికంటే పలు రెట్లు పెద్దదిగా చూస్తాము.
(2 ) సమస్య పరిష్కారానికి మనలో వున్న శక్తులు, నైపుణ్యాలు, ప్రవీణతలు అన్నీ మర్చి పోతాము.
(3 ) మనతో వున్న బంధు మిత్ర వర్గాల సహకారాన్ని మరిచి పోతాము.
(4 ) అనవసర సందేహాలు, భయాలు ఎక్కువ చేసుకుంటాము.
(5 ) దీని వలన, మానసిక వొత్తిడి అస్సలు అవసరమే లేకున్నా, మనమే పెంచుకుని రోగాల పాలవడం, చిన్న సమస్య మరీ జటిలం కావడం జరుగుతుంది.
రోడ్డు దాటాలంటే - అప్పుడే ఏ లారీ క్రిందనో వారు పడిపోయినట్లు, ముచ్చెమటలు పోసుకునే వారెందరో వున్నారు. అదే విధంగా - లారీలు పైకి వచ్చేస్తుంటే - ఏమీ పట్టనట్టు - తమ చేయి అడ్డు చూపిస్తూ (వారే ట్రాఫిక్ పోలీసు మాదిరి) హాయిగా మాట్లాడుకుంటూ రోడ్డు దాటే వారూ వున్నారు. రెండో వారి నిర్లక్ష్యం అక్కర లేకున్నా - మొదటి వారి భయాలు అస్సలు వుండకూడదు!
నిజానికి - భయాలకు, సందేహాలకు - మనలను, వాటికనుగుణమైన విపత్కర పరిస్థితి లోకి తీసుకెళ్ళే సామర్థ్యం వుంది. జీవితంలో భయపడే వాడు, ఏదీ సాధించ లేడు.
ధైర్యే, సాహసే లక్ష్మీ - అన్నారు పెద్దలు. ధైర్యం వుండాలి. పిరికితనం అస్సలు వుండకూడదు.
భగవద్గీతలో, శ్రీకృష్ణుడు - "క్షుద్రం హృదయ దౌర్బల్యం" అని - అర్జునున్ని తిడతాడు. ధైర్యం లేని వాడు ఎందుకూ పనికి రాడు. వాడికి మొదట కావాల్సిన వైద్యం - ధైర్యమే.
ధైర్యం వున్న చోట - మానసిక వొత్తిడి వుండనే వుండదు. రోగాలు రావడం చాలా తక్కువ. వచ్చినా వాటి వలన బాధ పడడమూ తక్కువే.
ధైర్యం ఎలా వస్తుంది ? చాలా, చాలా సులభం. మనసులో మీరొక చిన్న నిర్ణయం తీసుకోవాలి - నేనిక భయ పడను - అని. అంతే.
ఆ చిన్న నిర్ణయం తీసుకోవాలంటే - మీరేం చెయ్య నక్కర లేదు. ఆ చిన్న నిర్ణయం తీసేసుకోవడమే చెయ్యాలి.
మరి వెంటనే - ధైర్యం వచ్చేస్తుందా? అది మీకున్న భయాల్ని బట్టి వుంటుంది.
మీకు - పామును చూస్తే భయం అనుకోండి. డిస్కవరీ చానెల్ లాంటి వాటిలో - పని గట్టుకుని - మరీ పాములను చూడండి. వాటితో - ఎలా ఆడుతారో చూడండి. స్క్రీను లోని పాములు మిమ్మల్నేమీ చేయదని మీకూ తెలుసు కదా. స్నేక్ పార్క్ లాంటివి వుంటే - అక్కడికెళ్ళి - పాముల్ని బాగా చూడండి. ఎక్కడైనా పాములు చచ్చి పడి వుంటే- వాటిని అలా కాస్సేపు చూడండి. మెల్ల మెల్లగా - మీలో, పాములను గురించిన భయం పోతుంది. అలాగని, విషపూరిత పాములతో మీరూ ఆట్లాడమని నేను చెప్పడం లేదు. ధైర్యం వేరు. జాగ్రత్తలు వేరు. రెండూ కావాలి మనకు. వొక వేళ - ఏదైనా పాము మీ యింట్లోకి రావడమో, మీరు వెళ్ళే దారిలో, మీ వైపు రావడమో జరిగిం డనుకోండి . - అప్పుడు జాగ్రత్తగా, ధైర్యంగా, సమయస్ఫూర్తితో వాటిని ఎదుర్కొనడమే. దీన్ని (పాముల్ని) గురింఛి - నా మరో బ్లాగు - వైస్ లివింగ్ ఐడియాస్ లో మీరు చూడొచ్చు.
చావడమంటూ వస్తే - అదే చావాలి, మనం కాదు. అక్కడే ధైర్యమూ కావాలి. జాగ్రత్తా కావాలి. రౌడీలకు మనకు సంబంధం లేదు. కానీ - వారిని - ఎదుర్కొనవలసిన పరిస్థితి వచ్చినా - అంతే. మొదట ధైర్యం. దాని వెనుక జాగ్రత్తలు. శ్రీకృష్ణుడు చెప్పిన - "క్షుద్రం హృదయ దౌర్బల్యం" గుర్తుం చుకోండి.
అన్ని రోగాలలోకి - అతి పెద్ద రోగం హృదయ దౌర్బల్యం - అంటే భయం .
భయ పడేవాడు - తనకు తానే అతి పెద్ద శత్రువు గా వుంటాడు. భయం విడిచిపెట్టిన వాడు -తనకు తానే అతి పెద్ద మిత్రుడుగా వుంటాడు.
జీవితంలో - మీకు రాగలిగే సాధారణ కష్టాలకు, రోగాలకు, తగిన ముందు జాగ్రత్తలూ తీసుకోండి. ధైర్యం వున్న చోట, జాగ్రత్తలూ, నైపుణ్యాలూ చేరితే - విజయం మీ పక్కనే.
మీరు మూడు నిజాలు మానసికంగా, పూర్తిగా స్వీకరించాలి.
(1 ) సమస్యలు ( అంటే - కష్టాలు, రోగాలు లాంటివి) జీవితంలో - విడదీయలేని అంతర్భాగం. అవి - ప్రతి వొక్కరి జీవితంలోనూ తప్పకుండా వుంటాయి. ప్రెసిడెంట్ వొబామా జీవితం లోనూ వుంటాయి. ప్రై మినిస్టర్ మన్మోహన్ సింగ్ జీవితంలోనూ వుంటాయి. మీ జీవితంలోనూ వుంటాయి. వస్తాయి; యిది మీరు పూర్తి మనసుతో వొప్పుకోవాలి.
(2 ) కష్టాలను మీకిచ్చిన వాడు - ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి కూడా మీకిచ్చాడనే నమ్మకం మీకుండాలి. కష్టాలు వస్తే రానీ - నేను వాటికి భయపడను - అనే మానసిక బలం మీలో వుండాలి.యిది కూడా మీరు పూర్తి మనసుతో వొప్పుకోవాలి.
(3 ) ఎటువంటి సమస్యకూ సమాధానం వుంది. దేన్ని చూసీ భయపడనవసరం లేదు. ముఖ్యంగా - చావుకు భయపడవలసిన అవసరం అసలే లేదు. పుట్టుక కానీ, చావు కానీ - కష్టం లేని సంఘటనలు. రోగాలలో నొప్పి వుండొచ్చు - కానీ చావులో, ఏ బాధా లేదని ఈ మధ్య జరిగిన శాస్త్రీయ పరిశోధనలలో కూడా తెలిసిన సత్యం. వేదాంతం లో కూడా చెప్ప బడిన సత్యం.
మీకు తెలుసా - మోక్షానికి వొక అర్థం - సకల భయ విమోచనం అని. మీ భయాలు మిమ్మల్ని వదిలిపోతూ వుంటే , మీరు అత్యానంద దాయకమైన మోక్షానికి, చేరువౌతూ వుంటారు. వొక్కొక్క భయం మిమ్మల్ని విడిచిపెట్టినపుడు - మీలో ఆనందం పెరుగుతూ పోతుంది. ఇది కూడా మీరు పూర్తి మనసుతో వొప్పుకొవాల్సిన నిజం.
ఈ మూడు నిజాల్ని వొప్పుకోండి. మీలో వున్న భయాల్ని వొక్కొక్కటి గానో , అన్నిటినీ వొక్క సారో - వదిలి పెట్టండి.
ఆనంద మయమైన జీవితం మీకే స్వంతమవుతుంది.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి