11, మే 2011, బుధవారం

మీ సుఖానికి కారణం ఎవరు? = మీ విజయానికి ఎన్ని మెట్లు?




మీరు  ఏ  పని చేసినా  - దానికి - దృష్ట ఫలము;. అదృష్ట ఫలము - అని - రెండు రకాల ఫలితాలు వుంటాయి.

దృష్ట ఫలం మీరు వెంటనే చూడగలిగేది, లేదా, ఏదో విధంగా , త్వరగా అనుభవించ గలిగేది. 

మీరు, వొక మంచి పాట విన్నారు.  చాలా హాయిగా అనిపించింది.  యిది దృష్ట ఫలము. మీకు వెంటనే తెలిసి పోయింది. 

తరువాత - ఆ పాట అర్థానికో, మాదుర్యానికో  -  మీ మనస్సులో - వొక ముద్ర పడ వచ్చు. మీలో, కొద్దో, గొప్పో, వొక మౌలికమైన మార్పు రావచ్చు. అయితే - అది ఈ పాట వలన వచ్చిందని మీకు తెలియక పోవచ్చు. ఈ మార్పు - అదృష్ట ఫలం గా చెప్ప వచ్చు. యిలా - మనం చేసే పనులలో, ఎన్నిటికో - రెండు రకాల ఫలితాలూ వుంటున్నాయి.

దృష్ట ఫలము   - చాలా వరకు - వెంటనే తెలిసి పోయేటటువంటి ఫలితము. అదృష్ట ఫలం - ఎప్పుడో గానీ తెలీదు. ఫలం తప్ప కుండా వస్తుంది - గానీ,  మన పనికీ, ఫలానికీ - ఏ రకమైన లింకు  మనకు కనిపించదు, చాలా గమనికతో చూస్తే తప్ప.
 
ఉదాహరణకు - మత్తు పదార్థాల వాడకం లో - యిప్పుడే వచ్చేది మత్తు. తరువాత వచ్చేవి  - రోగాలు, ధుహ్ఖాలు.పదుగురి మధ్య అవమానాలు, కోపాలు, కొట్లాటలు  యిత్యాది.

యిలా - ప్రతి పని లోనూ వున్న - దృష్ట, అదృష్ట ఫలాల్ని అన్నిటినీ, బేరీజు వేసి, రెండు ఫలితాలూ, అనుకూల ఫలితాలుగా వుండేటట్టు - పని చేసే వాడు - దీర్ఘ దర్శి, దూర దృష్టి గలవాడు, అని చెప్పుకోవచ్చు. 

ఆటువం టి వారికి - భాగ్య రేఖ కూడా అనుకూలిస్తూ వుంటుంది. 

అంటే - అదృష్టఫలం కానీయండి; దృస్ట ఫలం కానీయండి  -  రెండింటినీ - కొంత వరకూ, మనం ముందుగానే, వూహించ వచ్చు.  ఊహించాలి కూడా.

విజయానికి ఎన్ని మెట్లు?  అని యండమూరి గారిని అడిగితే - ఏమంటారు?

నేను - నేషనల్ అకాడెమి ఆఫ్ టెలికాం (హైదరాబాదు) లో వున్నప్పుడు - దాదాపు 4 - 5  సంవత్సరాలు -  యండమూరి గారిని, బి,వి. పట్టాభిరాం గారిని - వొక్కొక్క వారమూ మా అకాడెమీకి - ఆహ్వానించే వాడిని. దేశంలోని - ప్రతి రాష్ట్రం నుండీ  వచ్చిన వారు - మన ఈ యిద్దరు  ప్రముఖ రచయితల - ఉపన్యాసాలను  - ఎంతో ఇష్టంగా వినే వారు. వారు వెళ్లి - వొక్కొక్కరు, మరో ముగ్గురిని, తమ రాష్ట్రాల నుండి,  పంపించే వారు.  

యండమూరి గారు తమకు యిష్టమైనది, అందరికీ వెంటనే ఉపయోగ పడే -  విజయానికి ఐదు మెట్లు - లాంటి అంశం పైననే మాట్లాడే వారు.పట్టాభిరాం గారు - మనస్తత్వ శాస్త్రం నుండి, అనేక అంశాల పైన మాట్లాడే వారు. 

ఈ ఆసక్తి కరమైన ఉపన్యాసాల గురించి -మరో సారి చెబుతాను.

విజయానికి మెట్లు వున్నాయంటేనే - మన  మనస్తత్వాన్ని - మనం మలుచుకోగలం  - అంటేనే - దృష్ట, అదృష్ట ఫలాల్ని అన్నిటినీ, ఏదో కొంత వరకైనా, చెప్పొచ్చుననే గదా.

అది ముఖ్యం.

కొన్ని రకాల పనులకు - దృష్టాదృష్ట   ఫలాలు మరో రకంగా వుంటాయి.

ఉదాహరణకు - మీరు ఎవరైనా - వొక అనాథ బాలుడికి, విద్యాసౌకర్యం కలిగించారనుకోండి. దాని దృష్టాదృష్ట ఫలాలు ఎలా వుంటాయి.

  • ఆ బాలుడికి విద్య వస్తుంది. (దృష్టం)
  • అతడికి - సంఘం లో వొక సముచిత స్థానం ఏర్పడుతుంది.(దృష్టం)
  • మీ డబ్బు కాస్తా ఖర్చవుతుంది.(దృష్టం).
  • మీ మనసులో వొక మంచి పని చేశామనే సంతృప్తి, వెంటనే కలుగుతుంది (దృష్టం).

  • భగవంతుడి దగ్గర - మీ పుణ్యం అనే ఖాతాలో - వొక పెద్ద మొత్తం చేరుతుంది. దాని నుండి, ఆ కర్మ ఫల దాత ఈ జన్మ లోనే మీకు  - ఏదో వొక మంచి ఫలితాన్ని ఈవచ్చు. (అదృష్టం).
  • ఆ బాలుడు, పెరిగి పెద్ద వాడై, మీకు, అనుకోని రీతుల్లో, సహాయ పడవచ్చు.(అదృష్టం).
  • మీరు చేస్తున్న మంచి పనులు, - మీరు, ఎవరికీ చెప్పక పోయినా - పది మందికి తెలిసి   సంఘంలో, అనుకోని రీతుల్లో, మీ గౌరవం పెరగవచ్చు.(అదృష్టం).
మీరు చేస్తున్న నిస్స్వార్థ పనుల అదృష్ట ఫలాన్నే - పుణ్యం అంటారు.

వీటి ఫలం, ఎక్కువైతే - అవి మీ తరువాతి జన్మకు కూడా, మీతో బాటు వస్తాయి.   మీరు, మంచి కుటుంబంలో పుట్టడము, సంతోషమైన జీవితం గడపడమూ జరుగుతుంది.(అదృష్టం). ఈ విషయం - శ్రీ కృష్ణ పరమాత్మ స్వయానా భగవద్ గీత లో కూడా అన్నారు.

పుణ్య కార్యాల అదృష్ట ఫలాలను -  వొక పండులో వుండే గింజతో పోల్చవచ్చు. గింజ చిన్నదే. కానీ - ఆ వొక్క  గింజ నాటి పోషించిన వాడికి  -  ఆ గింజ నుండి వొక మహా (ఫల)వృక్షము పుట్టి, వేల కొద్ది పండ్లను , సంవత్సరాల తరబడి - తర తరాలకూ - యిస్తుంది.  పుణ్య ఫలం ఇలాంటిదే. చిన్న పుణ్యానికి పెద్ద ఫలితం రావచ్చు.

పాప ఫలమూ ఇలాంటిదే. కాక పోతే - అది చెడు ఫలితాలను, ముళ్ళ చెట్టు లాగా, యిస్తుంది.

మీరు చేస్తున్న కీడు / చెడ్డ పనుల అదృష్ట ఫలాన్నే పాపం అంటారు.

ఉదాహరణకు - మీరు ఎవరి భూమినో అక్రమంగా - ఆక్రమించారనుకుందాం. వారికి శక్తి లేక, వూరికే శాపనార్థాలు మాత్రమే పెట్టగాలిగారనుకుందాం. దాని ఫలితాలేమిటి?

  • మీకు భూమి స్వంతం అయ్యింది (దృష్టం)
  • మీరు,లేదా, యితరులు, ఈ శాపనార్థాలు విన్నారు (దృష్టం).
  • అందరూ - మిమ్మల్ని గురిం ఛి - రౌడీ అనుకున్నారు (దృష్టం).
  • కర్మఫలదాత ఖాతాలో - మీ పేరు క్రింద, వొక పెద్ద పాపం నమోదు అయింది (అదృష్టం).
  • దీని కర్మ ఫలంగా - మీకు, ఎప్పుడైనా ఆక్సిడెంటు కావచ్చు.రోగాలు రావచ్చు. ముందుగా చనిపోవచ్చు. (అదృష్టం).
  •  వచ్చే జన్మలో - మీరు ఆ భూమిలోనే, పాముగానో, ఎలుకగానో పుట్టి, మీ  వారి చేతిలోనే - దెబ్బలు తిన వచ్చు. (అదృష్టం).
  • వొక వేళ మనిషిగా పుట్టినా - నీచుల కుటుంబంలో పుట్టి -  నానా కష్టాలు అనుభవించ వచ్చు.(అదృష్టం).

అయితే - ఈ కష్టాలన్నిటినీ, మానసికంగా అధిగమించి - యీ జన్మలో - మళ్ళీ మంచి పనులు చేయ గలిగే వారు - త్వరగా - కష్టాల నుండి బయటపడ వచ్చు.

నిన్నటి కర్మ యొక్క అదృష్ట ఫలం మీకు ఈ రోజు వస్తుంది; లేదా, రేపో, మాపో, వచ్చే జన్మ లోనో వస్తుంది.. అది  మీ చేతుల్లో  లేదు.

ఈ రోజు కర్మ మీచేతులలో వుంది.   అందుకనే అన్నారు - "కర్మణ్యేవ అధికారస్తే, మా ఫలేషు కదాచన" అని.
 
కర్మ మీ చేతుల్లో వుంది. మీ "చేతల్లో" వుంది. మీరు ఎటువంటి కర్మ అయినా  - చేయ వచ్చు. కాని, వాటి ఫలితాల పైన - ముఖ్యంగా అదృష్ట ఫలితాల పైన -  అధికారం వున్నది, ఆ కర్మ ఫల ధాతకు మాత్రమే. అది, ఎప్పుడు, ఎలా మీకు ఇవ్వాలో మీ   కర్మ ఫల ధాత మాత్రమే నిర్ణయిస్తాడు.

అందుకనే - మన సంస్కృతిలో - నాలుగు పురుషార్థాలు చెప్పారు.

అందులో మొదటిది - ధర్మం - అంటే - పుణ్యము మరియు, పాపము.

యివి - మన భవిష్యత్తుకు , మనం వేసే బాట. మన భవిష్యత్తును, వీటి ద్వారా, మనం, నిర్ణయించుకోవచ్చు. ఇవి, మనకు, తిరుగులేని, ఇన్స్యూరన్సు గా చెప్పుకోవచ్చు.వీటిలో - దృష్ట ఫలం పోగా, మిగిలింది, మనతో బాటు వస్తుంది.మన భవిష్యతును శాసిస్తుంది  .

అర్థము, కామము - మన వర్తమానం కోసం, మనం చేసే కృషి, వాటి  ఫలితాలు, యివి.
ధనం సంపాదించడం, అన్ని రకాల కోరికలు తీర్చుకోవడం - యివి చాలా వరకు వర్తమానానికి, లేదా, ఈ జన్మకు మాత్రం సంబంధించినవి.

కామము - అంటే , అన్ని రకాలయిన కోరికలు. అర్థాన్ని (ధనాన్ని), కోరికలను , ధర్మ మార్గంలో  పొందాలనే, మొదటి పురుషార్థముగా , "ధర్మాన్ని "  చెప్పారు.

చివరిది మోక్షం - ధర్మ, అర్థ, కామాలు మూడూ - ప్రతి మనిషిని తమలో బందిస్తాయి. మూడిటినీ, బంధ హేతువులని  - అంటారు.  మోక్షమనేది - అన్ని బంధాలనుండి బయట పడడం.
 
మనిషి కే  కాదు.  దేశాలకు కూడా ఈ పురుషార్థాలు వర్తిస్తాయి.

ధర్మం ఎక్కువగా వున్నా దేశాలలో, అర్థము, కామము అనుభవించ గలగడం  కూడా ఎక్కువగా వుండడం మనం చూస్తూనే ఉన్నాము.

ధర్మ బుద్ధి తక్కువగా వున్నా దేశాలలో - అర్థము, కామము ,- అన్నీ తక్కువవడం;  నేరాలు, దొమ్మీలు లాంటివి ఎక్కువవడం, అందరూ, అశాంతిలో  వుండడము  - మనం చూడవచ్చు.

కొన్ని దేశాలలో - ఎప్పుడు చూసినా - అశాంతే! దీనికి - ముఖ్య కారణం - ఎక్కడో వెదకాల్సిన పని లేదు.

మనిషి మనసులో - దయ, కరుణ, వాత్సల్య భావన, ఉదారత, లాంటి ధర్మ గుణాలు లోపించడమే.


మనం ,  చేసే ప్రతి పని యొక్క "అదృష్ట ఫలం" తెలుసుకొని చేస్తే చాలు - 

మన అందరి మనసులూ  పెద్దదవుతుంది. ప్రతి మనిషీ  పెద్ద వాడవుతాడు.దేశమూ గొప్పదవుతుంది.

చిన్న మాటల్లో చెప్పాలంటే -

- మీ సుఖానికి కారణం నేను కావాలి.

- నా సుఖానికి కారణం మీరు కావాలి.

ఈ చిన్న పాటి సూత్రం తెలిస్తే - ఎకనామిక్సు అక్కరలేదు. పాలిటిక్సు అక్కర లేదు. మరేం అక్కర లేదు.

 ఇదండీ మన సంస్కృతి, సైన్సు .

=  మీ

వుప్పలధడియం విజయమోహన్

  .

1 కామెంట్‌:

  1. chaala bagundi mee vyasam. karmaphala siddhantam gurinchi marosaari alochinchela chesindi. manam rojoo chese manchi panule manaku srirama raksha ani marosari nirdharinchukonetatlu vundi idantaa chadivaka.
    Ilaanti manchi blog posts marinni mee nunchi eduru choosthunaamu.
    all the best!

    రిప్లయితొలగించండి