24, మే 2011, మంగళవారం

మాటే మం త్రము = మీకు వొక వ్రతం = మాటల్లో ఆడ - మగ తేడా



మాటే మం త్రము   !

మరే ప్రాణికీ యివ్వక - మనిషికి మాత్రమే దేవుడిచ్చిన అతి గొప్ప వరం మాట.

దేవుడు శబ్ద బ్రహ్మ రూపంలో వున్నాడు- అని శబ్ద రూపకమైన  వేదాలు ఘోషిస్తూ వున్నాయి.. శబ్దం ద్వారా, మాట ద్వారా, మనం, ప్రతి మనిషి లోనూ  ఆ బ్రహ్మాన్ని దర్శించ వచ్చు.    శబ్దమే (మాటే)   దేవుడని బైబిల్ కూడా చెబుతూ వుంది  . 

మనిషిని, దేవుడితో కలపగలిగే శక్తి    వొక్క మాటకే వుంది. 

మనసు లోతుల్లో నుండీ వచ్చే మాటే,  దేవుడికి యిష్టమైన - మంత్రముగా మారిపోతుంది. 

అటువంటి మంత్రానికి -   ప్రకృతినంతటినీ శాసించ గల అపారమైన శక్తీ వుంది.  మన మనో,వాక్, కాయ, కర్మలనన్నిటినీ ఏకీకరించి,  పిలిస్తే - ఆ ఆమంత్ర శక్తికి - సూర్య, చంద్రాది ప్రక్రుతి శక్తులు కూడా - సంతోషించి మనల్ని, అనుగ్రహిస్తారని, అనుగ్రహించకుండా వుండలేరనీ - అన్ని పురాణాలూ ఘోషిస్తున్నాయి. అంతటి మహిమాన్వితమైనది - మంత్రము లాంటి మాట.

వారధి వేసినా, గోడ కట్టినా..

మనిషికీ మనిషికీ మధ్య వారధి వేసేది మాట.  మనిషికీ, మనిషికీ  మధ్య గోడ కట్టేది  కూడా మాటే. . 

మనుషుల్ని కలిపేదీ మాటే. విడదీసేదీ మాటే. 


  ఏది వివేకము    - ఏది అవివేకము

మనం మాట్లాడే మాటలకు చాలా శక్తి వుంది.అయితే - ఎక్కుపెట్టివిదిచిన  అంబు, నోటి నుండి  బయటికి వెళ్ళిన మాటా - తిరిగి  రావు.కాబట్టి  - మాట్లాడే ప్రతి మాటా జాగ్రత్తగా మాట్లాడాలి.

మాట్లాడవలసిన సమయం లో, మాట్లాడ వలసిన మాటలను, మాట్లాడ వలసిన విధంగా మాట్లాడే వాడే సమయోచిత ప్రజ్ఞుడు; వివేకి.  

మాట్లాడకూడని సమయంలో, మాట్లాడ కూడని  మాటలను, మాట్లాడ కూడని  విధంగా  మాట్లాడే వాడు - అవివేకి.
"ప్లేటో" గారంటారు - "జ్ఞానులు  (బుద్ధిమం తులు) చెప్పదగిన మాటలు వున్నాయి కాబట్టి (ఆ చెప్పదగిన మాటలే) మాట్లాడుతారు.   అవివేకి - ఏదో    వొకటి చెప్పాలనుకుంటాడు కాబట్టి (ఏదో వొకటి) మాట్లాడుతాడు.". 

వివేకి మాటలు మనుషులను కలుపుతాయి. అవివేకి మాటలు మనుషుల మధ్య ఉన్న సంబంధాలను   చెడుపుతాయి.

వీటన్నిటిని గుర్తులో పెట్టుకుని -   మాటల వుపయోగాల్ని గురించి యిలా అంటారు-

మాటల ఉపయోగాలు - మూడు రకాలు

మాటలు, మనసులోని ఆలోచనలను (భావాల్ని) వ్యక్తీకరించడానికి,ప్పి పెట్టడానికి, రెండింటికీ  ఉపయోగపడతాయి., . అలాగే - మనసులో - ఆలోచనల స్థానాన్ని - మాటలు పూర్తిగా ఆక్రమించనూ గలవు. బయటికి వెళ్ళే మాటలు తప్ప - లోపల ఆలోచనంటూ వుండదు కొందరి తలల్లో. .

యిలా మూడు ప్రయోజనాలు ( "నిష్-ప్రయోజనాలు" తో సహా ) మాటల వల్ల  కలుగుతాయి.  .


మాటల్లో రకాలు 

మనం వినే మాటలను - స్థూలంగా మూడు రకాలుగా మనం విభజించుకోవచ్చు : (1 ) సాధారణమైన మాటలు    (2 ) సంతోష పెట్టే  మాటలు    (3 )  బాధ పెట్టే  మాటలు 

ఇవి కాక, మనుషులను, ఉత్తేజ పరిచే మాటలు, మనుషుల్లో, కోపాన్నో, లోభాన్నో, ఈర్ష్యనో ,భయాన్నో పెంచే మాటలు - ఇలాంటివీ వున్నాయి.

సాధారణమైన మాటలు

ఇవి మనం చాల త్వరగా మర్చి పోతాము. వాటిలో - ఏదైనా ముఖ్య  సమాచారాలుంటే - అవి జ్ఞాపకం పెట్టుకోవాలని కృషి చేస్తాము.   అవి ముఖ్యమే అయినా, మనకి సంతోషమో, బాధనో, కలిగించేవి కావు. మనం మాట్లాడే మాటలలో ఎనభై శాతం మిం చి  సాధారణమైన మాటలే వుంటాయి.

సంతోషం కలిగించే మాటలు 

మనం కొన్ని మాటలను  విం టే - కొద్ది గానో, ఎక్కువగానో, మనలో సంతోషం కలగడం మనకు తెలుసు.

మీరు చాలా మంచి  వారు. మీరు చూడడానికి చాలా బాగున్నారు, మీ పని తీరు చాలా  అద్భుతం, మా అబ్బాయి / అమ్మాయి  ఎంత మంచి పేరు తెచ్చుకున్నారండీ. మీ వంట చాలా చాలా రుచిగా, చాలా బాగుంది.... యిటువంటి మాటలు - ఎదుటి వారు వాడితే  - మనమెవరైనా సంతోష పడతాము.  అలాగే, మనం వాడితే - ఎదుటివారెవరైనా సంతోష పడతారు.

చిన్న పాపల నుండి, పండు ముదుసలుల వరకు; బికారి నుండి చక్రవర్తుల వరకు, ఆడా, మగా తేడా లేకుండా , ప్రతి వొక్కరికీ -  తమను గురించి  పది మంచి మాటలు వినడం అంటే, చాలా ఆనందంగా వుంటుంది. ఇది మన మానసిక ధర్మం. ప్రతి వొక్కరూ - గుర్తుం చుకోవలసిన విషయం.

అంటే - మిమ్మల్ని సంతోష పెట్ట గలిగే వొక గొప్ప సమ్మోహనాస్త్రం,  నాదగ్గరుంది. నన్ను సంతోష పెట్ట గలిగే గొప్ప అస్త్రం మీ దగ్గరుంది.

ఈ అస్త్రాన్ని సమయోచితంగా వాడే వాళ్ళు సమాజం లోని, చాలా మంది వ్యక్తులను - వొక్క పైసా ఖర్చు లేకుండా, సంతోష పరచగలరు.

మీరు సంతోష పెట్టే మనుషుల మనసులలో - మీరు పదిలమైన స్థానం సంపాదించుకుంటారు. వారు కూడా, మిమ్మల్ని గురించి పది మంది దగ్గర ఉన్నతంగా మాట్లాడుతారు. మీరు మాట్లాడిన ప్రతి వొక మంచి మాటకూ -  మీకు పది మంచి మాటలు , పది మంది దగ్గరి నుండి  వినిపిస్తాయి. మీరిచ్చే ఆనందానికి పది రెట్లు ఎక్కువ ఆనందం మీకూ వస్తుంది.

కానీ - ఈ ప్రతి ఫలాన్ని ఎదురు చూసి  మీ మాటలు, పొగడ్తలు వాడకండి. నిజాయితీగా - హృదయపూర్వకంగా - నిజంగా పొగడ వలసిన వాళ్ళను, నిజంగా పొగడవలసిన విషయాలకే  పొగడండి.

ఒక దొంగను పొగిడారంటే - వాడు, మీ యింటికే  కన్నం వెయ్యగలడు. ఒక అవినీతి పరుడిని పొగిడారంటే -  వాడి  అవినీతి మన అందరినీ కాటు వేస్తుంది సుమా.

మంచి వాడిని, మంచి పనిని - పని గట్టుకుని, మరీ పది మంది ముందు పొగడండి. సమాజంలో మంచితనం పెరుగుతుంది.

ఇవి కాక - మనసుకు "ఊరట" నిచ్చే మాటలున్నాయి. ఎవరికి - ఏ వ్యాధి వున్నా- "మీకు తప్పకుండా నయమవుతుంది"  అన్న వొక్క వాక్యం , వైద్యుడు తప్పక చెప్పాలి. వూరికే మందులిస్తే చాలదు.

తుది శ్వాస వరకు, ప్రతి  వొక్కరికి, ఈ విశ్వాసం, ధైర్యం వుండేట్టు చేయాల్సిన అవసరం ఎంతో వుంది. మనలో  ఎవరైనా కూడా - యిటువంటి ఆత్మ విశ్వాసం, ధైర్యం వచ్చే మాటలు,  రోగ గ్రస్తులతోను, మరే  యితర బాధలలో వున్న వారితోను,  తప్పక చెప్పాలి.

వైద్యం తో నయము గాని వ్యాధులు కూడా, ధైర్యం  యిచ్చే ఇటువంటి మాటలతో నయమయిన సందర్భాలు అనేకం వున్నాయి.మన  మనసులలోను, శరీరాల్లోని  ప్రతి అణువు లోను  ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నింప గలిగింది మాటే.

పరీక్షలు రాసే వారికి, రాసిన వారికి, ఫెయిలయిన వారికీ,  జీవితంలో, రక రకాల కష్టాల్లో ఉన్న వారికి - పనిగట్టుకుని వెళ్లి, ఇలాంటి సాంత్వన వాక్యాలు చెప్పాలి.


యితరులకు  సంతోషం  కలిగించే  మాటలను  ప్రతి రోజూ -  కనీసం వొక్కరికైనా - ఏ వొక్కరికైనా - చెప్పాలని -  మీరు వొక వ్రతం లాగా  పెట్టుకుం టే  మీకే  చాలా మంచిది.   మీ జీవితంలో సంతోషం, ఆనందం  చాలా పెరుగుతుంది.

ఇలా చేసే వారు చాలా మంది ఇప్పటికే వున్నారు. కాని - ఇది ప్రతి వొక్కరూ చేస్తే కాని సమాజంలోని దుర్బలత్వం, నిరాశ, నిస్పృహ పోదు.


సరే.    ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు  పెద్దలు.

కాబట్టి - కనీసం మూడు రోజులకు వొక్క సారైనా - మీ భర్తను ( / భార్యను) తప్పకుండా, ఏదో వొక (నిజమైన) విషయానికి - మీరు (పని గట్టుకుని) అభినందించాలి; లేదా  ధైర్యం  చెప్పాలి; లేదా ఊరట కలిగించాలి.  యిది వారికి - ఆహారం ఎంత ముఖ్యమో, అంతకంటే ముఖ్యం.   అదే లాగ, మీ పిల్లలకు, మీ చిన్న జీవన ప్రపంచం లోని మిగతా ముఖ్య సభ్యులందరికీ యిది ముఖ్యమే. ఇది - ఆ కుటుంబ సభ్యుడిగా  - మీ బాధ్యత.

మనం మాట్లాడే మాటలలో - పరులను (మన వారిని కూడా) సంతోష పరిచే మాటలు  కనీసం పది శాతమైనా వుండాలి. ఇది మన జీవితంలో చాలా గొప్ప విజయంగా వుంటుంది. మనం చేసే ప్రతి పని లోను, విజయం సాధించడంలో దీని పాత్ర ప్రముఖంగా వుంటుంది.   

 
మనసును బాధ పెట్టే  మాటలు

  • మనం చాలా సార్లు అనాలోచితంగా, అనవసరంగా, ఎదుటివారిని మన మాటలతో బాధ పెడతాము. ఇది మనం బాగా గమనించాలి. ఏ మాటలు మనల్ని బాధ పెడతాయో ఆటువంటివి ఇతరులపై ఎప్పుడూ వాడకుం  డా  - బాగా జాగ్రత్త పడాలి. 
  • కొన్ని మాటలు బాధ పెడతాయనే విషయం కూడా మనకర్థం కాదు. ఒక తల్లి తోనో, తండ్రి తోనో,  వారి పిల్లల్ని పోల్చి చెప్పేటప్పుడు, అ పిల్లల్ని, మీరు ఎన్ని రకాలు గానో పొగుడుతూ  చెప్ప వచ్చు. చెప్పాలి.   అలా కాకుండా, మీ పిల్ల  మీ  స్టాంప్ అని  మీ కంటే బాగా రంగు తక్కువగా వున్న వారితో మీరు అంటే -  వారు చిన్న బుచ్చుకోవచ్చు.  "అప్రియమైనది"  సత్యమైనా వూరుకూరికే చెప్పాల్సిన పని లేదని,  అటువంటి సత్యం పనికి రాదని - మరో వ్యాసంలో ఇదివరకే చదివాము. 
  • అదే విధంగా - అశ్లీల పదాలు - చాల మందిని బాధిస్తాయి. వారెవరినీ బాధించే హక్కు మీకు లేదు. అవి వాడకండి. 
  • జాతి, మత, వర్గ, కుల, లింగ భేదాల కారణంగా - మీరు కాని, మీకు చెందని జాతి, మత, వర్గ, కుల, లింగము ల వారిని - ఎప్పుడూ ఆ ప్రాతిపదిక పైన తిట్టకండి. మీ, నా, వారి జన్మలేవీ - మన చేతుల్లో లేవు. వారి చేతుల్లో లేని విషయానికి - వారిని దూషించకండి. మన సంస్కృతి - "సర్వే జనాః  సుఖినో భవంతు"  అనే అంటుంది.   ఎవరి న్యాయమైన ఆనందాన్నీ  మన మాటలతో తగ్గించే  అధికారం మనకు లేదు. ఈ రోజు ప్రపంచంలో జరిగే కలహాలకన్నిటికీ ముఖ్య కారణం ఇదే.
  • కొంత మంది - కావాలనే , పని గట్టుకుని, యితరుల మనసులను గాయ పరిచే కార్యక్రమాలలో మునిగి వుంటారు. ఇటువంటి దైనందిన జీవిత విలన్లకు - వారి మందే వారికి  ప్రతి వొక్కరూ తినిపిస్తే గాని బుద్ధి రాదు. ఇటువంటి వారు చాలా మంది వున్నారు. వారికి - వారి బలహీనతను గురించి - కరుకు గానే, స్పష్టంగానే  చెప్పాలి.లేకుంటే - ఎంతో మంది, అమాయకుల, నోరులేని వారి,  సంతోషాలు, వీరి మాటలకు బలి ఐపోతూ వుంటుంది. వీరు కూడా సమాజంలో - వొక రకమైన నేరస్తులే - ఎన్ని నేరాలు చేసినా శిక్ష పడని నేరస్తులు వీరు. వీరిని అందరూ చేరే మార్చాలి.   

నిజానికి మనసును బాధ పెట్టే  మాటలు - చెప్పిన వారు త్వరగా మర్చిపోతారు. కాని, విన్న వారికి  చాలా కాలం గుర్తుంటాయి.  కొన్ని మాటలు జీవితాంతమూ  గుర్తుంటాయి. ఆ మాటలు చెప్పిన వారినీ, ఆ మాటలనూ - మర్చి పోవడం చాలా కష్టం.నోటితో మాట్లాడిన ఇలాంటి మాటలు మనస్సు పైన హత్తుకుపోయి వూడి రావడం చాలా కష్టమై పోతుంది.


మరి - ఇటువంటి మాటల శాతం ఎంత వుండాలి?  సున్నా శాతం!! మాటల విలన్లను సరి దిద్దడానికి  తప్ప  యింకెక్కడా  - యిటువంటి మాటలు వాడనే వాడ రాదు.


మాటల్లో ఆడ - మగ తేడా
 
మాట్లాడే విషయం లో - మగ వాళ్ళకూ, ఆడ వాళ్ళకూ మధ్య తేడాలున్నాయి.

సగటు మగవాడి కంటే - సగటు ఆడది మూడు రెట్లు ఎక్కువ మాటలూ మాట్లాడుతుంది; ఆ మాటలను, ఎదుటి వారికి బాగా తెలిసేటట్లు చెప్పడానికి శారీరక హావ భావాలను కూడా చాలా  ఎక్కువగా వాడుతుంది.

ఈ  విషయంలో,  ఆడవాళ్ళతో పోలిస్తే,  మగవాళ్ళు మాటలతో బాటు, శారీరక హావ భావాలను వాడటం చాలా తక్కువ. ఏ దేశాని కెళ్ళినా - యిది సర్వ సాధారణంగా, పుట్టుకతో వచ్చిన ప్రవృత్తి లాగా, మనకు తెలుస్తుంది. అందుకనే - చాల సంస్థలలో - కస్టమర్లకు, యితరులకు, సందేహ నివృత్తికి, సంస్థాగత విషయాలను చెప్పడానికి - ఆడవాళ్ళను ఎక్కువగా వాడతారు.

మగ వాడు ఏ చలనం  లేకుండా  "ఆరో కౌంటర్" అని నోటితో అనడానికీ, ఆడది నోటితో "ఆరో కౌంటర్" అని, తల (దాదాపు శరీరమంతా) ఆరో కౌంటర్ వైపు త్రిప్పి, చేయి ఆరోకౌంటర్ వైపు  చూపడానికి -  ఎంతో తేడా వుంది కదా!  
అయితే - యిది 'సగటు' ఆడ, మగ వారి స్వభావము. 

చాలా మంది మగ వారు కూడా - కొంత హావ భావాలను వాడడమూ, మనం చూడవచ్చు. 

అదే మాదిరి - కొన్ని సంస్థలలో, ఆడ వారు కూడా, శరీరం, తల, చేతులు ఏవీ కదల్చకుండా - "ఆరో కౌంటర్" అనడమూ మనం చూడవచ్చు.అంటే మగ వారిని అనుకరిస్తున్నారన్న మాట. యిందులో - ఏది సరి ఐనదో - తేట తెల్లమే కదా!

మగ వాళ్ళు, హావ భావాలు, మరీ ఎక్కువ వాడితే - బాగుండదు. కాని కొంతైనా వాడాలి.

అదే మాదిరి, ఆడ వాళ్ళు కూడా, తమ సహజ సిద్ధమైన హావ భావాలను, మృదువైన కంఠధ్వనిని (మగ వారిని, వారి స్వరాన్ని  అనుకరించ కుండా)  బాగా వాడితేనే బాగుంటుంది. నెలల పసి పాపతో మాట్లాడ  గలిగే నేర్పు, వోర్పు దేవుడి వరం. అది పోగొట్టుకో కూడదు.

ముందు చెప్పినట్లు - మనో, వాక్, కాయ, కర్మలన్నిటినీ మిళితం చేసి వాడితే - మాటే మంత్రము.

మంత్రానికి - మామిడికాయలూ రాలుతాయి. మనుషుల మనుషులూ మీ ముందు వాలుతాయి.

యిక - దేవుడిచ్చిన - ఈ గొప్ప వరాన్ని ఎలా వాడుతారో - మీ జీవితాన్ని  ఎంతగా ఆనందమయం చేసుకుంటారో - మీ యిష్టమే!!

= మీ

వుప్పలధడియం విజయమోహన్    


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి