10, మే 2011, మంగళవారం

సత్యం వద = సత్యమేవ జయతే = ఏది నిజం?


"సత్యం వద" అన్నారు పెద్దలు.            

"సత్యమేవ జయతే" అని కూడా అన్నారు.


యిది  కాకుండా  -  యింకా యిలా అన్నారు. 


"సత్యం    బ్రూయాత్,  ప్రియం  బ్రూయాత్,  


న  బ్రూయాత్  సత్యం  అప్రియం 



ప్రియం చ  నానృతం బ్రూయాత్ 

ఏషా  ధర్మః సనాతనః "


యిలా - మన పూర్వీకులు, మహర్షులు సత్యాన్ని గురించి ఎన్నో చెప్పారు. వారు చెప్పినవి - ఈ కొన్ని మాత్రం, వొక్క సారి - సమీక్షించు కుందాం.

  • నిజమే చెప్పాలి. 
  • నిజమే  జయిస్తుంది; 
  • నిజమే చెప్పాలి. కాని నిజాన్ని, ప్రియంగా వుండేటట్టు చెప్పాలి. 
  • నిజమే అయినా -  ప్రియం కానిది  - చెప్పకండి.
  • ప్రియమైనటువంటి దైనా - అబద్ధాన్ని చెప్పకండి.
  • యిదే మన సనాతన ధర్మం.

నిజంగా - నిజమే జయిస్తుందని మనం మనసారా నమ్మితే ; నమ్మ గలిగే పరిస్థితులు, మన మధ్య వుంటే -

మనలో, అబద్ధాలు మాట్లాడే వారు వుండరు. వున్నా - చాలా తక్కువ మంది వుంటారు.

దేవుడి సృష్టిలో - అబద్ధం అస్సలు జయించధం టే - ఆ పరిస్థితి  చాలా, చాలా  బాగుంటుంది.  అప్పుడు, అందరూ - నిజమే మాట్లాడుతారు.

కానీ - మనకందరికీ తెలిసిన  నిజం - అబద్ధం కూడా, చాలా చాలా సార్లు, జయిస్తూ వుందని;


నిజానికీ, అబద్ధానికీ మధ్య - ఎప్పుడూ, యుద్ధం జరుగుతూనే వుంది. వొక్కో సారి, నిజం జయిస్తూ వుంది. వొక్కో సారి అబద్ధం జయిస్తూ వుంది. ఔనా, కాదా??
పగలు, రాత్రి వున్నట్టుగా , ప్రకృతిలో - నిజం, అబద్ధం ఎప్పుడూ వుండనే వుంది.

నిజం  వొక్కటే.

నిజంగా - జరిగింది వొక్కటే.  సంఘటన వొక్కటే.

కానీ - దాన్ని, ప్రతి వొక్కరూ  - వొక్కొక్క విధంగా చెప్పచ్చు.

నిజమే  చెప్పాలనుకునే వాళ్లకు కూడా -  జరిగింది జరిగినట్టుగా,.- యదాతథం గా , చెప్పడం చాలా, చాలా కష్టం.

కళ్ళతో చూసిందీ  అబద్ధం. చెవులతో వినిందీ అబద్ధం, పూర్తిగా, విచారించి తెలుసుకొన్నదే నిజం -  అని తమిళం లో వొక గొప్ప సామెత వుంది.చూసినంతనే, వినినంతనే  , తొందర పడక, ప్రశాంతమైన  మనస్సుతో, అన్ని విషయాలూ తెలుసుకొన్న తరువాతనే -మనం, నిజం  ఇది అని తెలుసుకోగలం. చెప్పగలం.

మన కళ్ళు మనను మోసం చేస్తాయి. మన చెవులు, మన మనస్సు అన్నీ, మనల్ని, మోసం చేసి, అబద్దాల్ని, నిజమని నమ్మేట్టు చేస్తాయి. తొందరపాటు వుంటే - యిది చాలా సార్లు జరుగుతుంది.

మన ఋషులు - నిజాన్ని మూడు రకాలుగా మన ముందుంచారు.

(1 ) పారమార్థిక సత్యం  : ఇది, ఎప్పుడూ సత్యమే. మారదు. నిన్న ఎంత సత్యమో, ఈనాడూ అంతే సత్యం. రేపూ అంతే సత్యం. ఉదాహరణకు  - మీరెవరు? అన్న ప్రశ్నకు సమాధానం - "సత్-చిత్-ఆనంద" స్వరూపం. దీన్ని, యిప్పుడు మనం, విశ్లేషించ బోవడం లేదు.  మీకెప్పుడైనా - చాలా బోరు కొడితే - ఈ"ప్రశ్నయొక్క సమాధానాల" వెనుక వెళ్ళండి. మీరెవరో తెలుసుకోండి. అదే పెర్మనెంటు ట్రూత్, లేదా,  పారమార్థిక సత్యం. కానీ -పారమార్థిక సత్యం, ఎంత సత్యమైనా - ఈ ప్రపంచ వ్యవహారాలకు, ఏ మాత్రమూ ఉపయోగ పడదు.

(2 ) ప్రాతిభాసిక సత్యం : కొన్ని, నిజం మాదిరి అనిపిస్తుంది. కాని, నిజం కాదు. ఎండమావులు  దూరం నుండి - జలాశయాల మాదిరి అనిపిస్తుంది. కాని, కావు.  
                               దూరం నుండి వొక రకంగా కనిపించేవి, వినిపించేవి, అనిపించేవి - నిజానికి, అవి కావు;  మరొకటి అని తెలుస్తున్నాయి కదా. 
                                    అయినా - మన పంచేంద్రియాలకు , దూరం  నుండి, మళ్ళీ, మళ్ళీ, ఎన్ని సార్లు చూసినా, అవే అనే భ్రాంతి కలిగిస్తూనే  వుంటాయి.  
                                   దాన్లో సుఖం వుంది, దీన్లో సుఖం వుంది - అని మనం వెదికి, వెదికి, వేసారి, కట్ట, కడపట, చిట్ట చివర - పారమార్థిక సత్యం వెనుక పడతాం. ప్రాతిభాసిక సత్యాల వెనుక పరుగువేట - కడ వరకు విడువలేం.

 (3 ) వ్యావహారిక సత్యం :  వ్యావహారిక సత్యం  అనేది - పంచేంద్రియాల ఆట. మనస్సు ఆట.
                               నేనెవరు - అన్న ప్రశ్నకు, మనం చెప్పే సమాధానం, మన శరీరం, మన మనస్సు, వాటికి మనం పెట్టుకొన్న పేరు, మన చదువు, మనం పుట్టిన రాష్ట్రం, మన భాష యిత్యాదులు. 
                               వ్యావహారికం గా - ఈ రోజుకు, యివన్నీ కరెక్టే. కాని - కొన్ని రోజులకు - ఇవేవీ చెప్పరు, మనల్ని  గురించి. "బాడీ" అంటారు.
                                       యిరవై, ముప్ఫై  ఏళ్ళ క్రితం వున్న మీరు , యిప్పటి మీరు, వొక్కటేనా?
                                  కానే కాదు. అప్పటి మీలో వున్న, వొక్క అణువు కూడా,  యిప్పుడు మీలో లేదు తెలుసా. అయినా- మనలోని, ఏదో చైతన్య "రూపం" , అదీ నేనే, ఇదీ నేనే అనే భావం కలిగిస్తూ వుంది. దీన్నే మనం వ్యావహారిక సత్యం అని అంటూ  ఉన్నాము.

"నిజం చెప్పండి" - అని మనం అంటే - ఈ వ్యావహారిక సత్యం గురించే. పారమార్థికం కాదు. ప్రాతిభాసికం కాదు.
ఈ వ్యావహారిక సత్యం పూర్తిగా -భూత కాలానికి సంబంధించినదే

ఈ వ్యావహారిక సత్యము భవిష్యతులోనిది  కాదు. -  వర్తమానము లోనిదీ కాదు. 


సత్యం వద - అంటే, మన పంచేంద్రియాలతో చూసిన, వినిన, ఘ్రాణించిన, తాకిన, రుచి చూసిన వాటి గురించి,   భూత కాలం లో  ఎలా గ్రహించామో - అలాగే, యధా తథంగా చెప్పడం.

మరో విధంగా చెబితే - అది అబద్ధమవుతుంది.

దీన్లో కూడా - నిజం వొక్కటే. జరిగింది వొక్కటే.

మీరు రెండు నిజాలు చూడలేదు. రెండు వినలేదు. నిజం వొక్కటే. కాని - పది మంది, పది రకాలుగా చెప్ప వచ్చు.

యిం దులో - మీరు ఐదు మంది - నిజమే చెప్పాలనుకునే వాళ్ళు  కూడా - జరిగిందాన్ని , ఐదు రకాలుగా చెప్ప వచ్చు. మీ కళ్ళతో వాళ్ళు  చూడలేరు.   వాళ్ళ కళ్ళతో మీరు చూడలేరు. మీ మనస్సు విశ్లేషించినట్టు వాళ్ళ మనస్సు విశ్లేషించదు.  వాళ్ళ మనస్సు విశ్లేషించినట్టు మీ మనస్సు విశ్లేషించదు.వొకే సంఘటనకు - యిప్పుడు ఐదు నిజాలున్నాయి.

ఏ వొక్కరూ   - పూర్తి నిజాన్ని పూర్తిగా చూసి, పూర్తిగా, నిజంగా చెప్పలేరు.

యిది కేవలం, మన సృష్టిలోనే  వున్న,  మన అసంపూర్ణత, శక్తీ హీనత ల కారణంగా జరుగుతూ వుంది.

పూర్తి నిజాన్ని గ్రహించ గలిగే శక్తి - మనిషికి యివ్వ బడ లేదు. ఏ విషయం లో నైనా సరే.

అందుకే అన్నారు - కళ్ళతో చూసిందీ  అబద్ధం; చెవులతో వినిందీ అబద్ధం; పూర్తిగా, విచారించి తెలుసుకొన్నదే నిజం - అని.

కాని, యిది , నిజంగా, నిజమే - చెప్పాలనుకునే  వాళ్ళ సంగతి.

మిగతా ఐదు మంది సంగతేమిటి ? వాళ్ళు చూడక్కర లేదు. వినక్కర లేదు. సంఘటనా స్థలం లో వాళ్ళు లేకపోయినా - వున్న వారికంటే బాగా, వర్ణించి మరీ చెప్ప గలరు. యిప్పటి సమాజంలో - వీరి సంఖ్య బాగా పెరిగిం ది.

నిజం వొక్కటే. 

అది - మన అసంపూర్ణత కారణం వల్ల - కాస్త, అటూ, యిటూ రూపాంతరాలు చెందడం సహజం. దాన్ని, మనం, చాలా వరకు సరిదిద్దుకోవచ్చు .

కాని - మన "సనాతన సంస్కార" హీనత వల్ల వొచ్చే రూపాంతరాలను - మనం అబద్దాలని చెప్పొచ్చు.

నిజమే చెప్పాలి - అన్న భావనే మనలో లేకపోతే - అబద్ధాలు ఎన్నైనా చెప్పొచ్చు.

నిజం చెప్పాలంటే - మీరేం చూసారో, విన్నారో  , మీరు  బాగా జ్ఞాపకం చేసుకోవాలి. కాని, మీ మనస్సు అంత  గొప్ప  జ్ఞాపక శక్తి కలిగిం దేమీ కాదు. మరిచి పోతుంది.

కాబట్టి  - రెండో సారో, మూడో సారో,   . జ్ఞాపకం చేసుకోవడంలో, జ్ఞాపకం మాత్రమే గాక - మీ ఊహాగానాలు, అంటే అబద్ధాలు, చాలా వుంటాయి.

మొన్న ఎం తిన్నాడో జ్ఞాపకం రాని మనిషిని -  సంవత్సరం క్రితం జరిగిన, ఆ సంఘటనను , మళ్ళీ  యిప్పుడు కరెక్టు గా  చెప్పు - అన్నది నా దృష్టిలో, చాలా, చాలా, చాలా అర్థ రహితమైన విషయం.

నా అభిప్రాయంలో - అటువంటి వాడు - ఈ రోజు చెప్పేవన్నీ, కట్టుకథలే.  నిజానికి,అతని  పెళ్లి రోజును గురించి  కూడా - అతను  కరెక్టు గా చెప్ప లేడు.

సరే.   మరి నిజమే చెప్పాలి - అంటే మన మహర్షుల అభిప్రాయం ఏమిటి? మీకు నిజంగా జ్ఞాపకం  వున్న, నిజంగా తెలిసిన, వ్యావహారిక సత్యం మాత్రమే చెప్పాలని.

దాన్ని గురించి ఊహాగానాలు చేయక, తెలిసింది, తెలిసినంత వరకు, వున్నది వున్నట్టు  చెప్పాలి.

అందరూ - యిలా తమకు నిజంగా తెలిసింది మాత్రం చెబితే - "సత్యమేవ జయతే" - అంటే, సత్యమే జయిస్తుంది. లేకపోతే, అబద్ధం జయిస్తుంది.

ఉదాహరణకు - వొక భార్య, భర్త మధ్య నిజాలు మాత్రమే వుందనుకోండి. వారు - వొకరినొకరు పూర్తిగా నమ్మొచ్చు.

నమ్మకం వున్న చోటనే - ప్రేమ కూడా వుంటుంది.   .

ప్రేమ వున్న చోట, సత్యం వున్న చోట - జన్మ జన్మల అనుబంధం  సాగిపోతుంది.

అంటే - సత్యం వున్న చోటే ప్రేమ వుంటుంది.  సత్యం లేని చోట ప్రేమ వుండే ఆస్కారమే లేదు - అన్న నిజాన్ని మనం అర్థం చేసుకోవాలి..

కొన్ని దేశాలలో, జరిగే వివాహాలలో, 54 శాతం పైగా  , మొదటి  రెండు సంవత్సరాలలోనే - వివాహ రద్దు జరిగిపోతూ వుందని, లెక్కలు (స్టాటిస్టిక్సు )  చెబుతున్నాయి. అవన్నీ - పేరుకు, ప్రేమ వివాహాలే కావడం విశేషం. సత్యం లేని   చోట ప్రేమ వుండనే వుండదు. ప్రేమ వుండని చోట - జన్మానుబంధం వుండే ఆస్కారమే లేదు. ఆటువం టి వాటికీ - ప్రేమ అనే పేరు పెడుతున్నారు మరి!

కొన్ని దేశాలలో - దేశానికి ముఖ్యమైన విషయాలలో చాలావరకు నిజం చెప్పాలని పాటిస్తారు. మరి కొన్ని దేశాలలో, దేశ వ్యవహారాలన్నీ -ఎక్కువగా  అబద్దాలతో నిండి  వుండటం మనం గమనించ వచ్చు.  అటువంటి దేశాలు, అడుగడుగునా, చాలా విషయాల్లో,  విఫలాన్ని, వోటమిని, చవి చూడటమూ మనం గమనించ వచ్చు. సత్యమేవ జయతే - అన్న విషయం ఇక్కడకూడా మనకు బాగా తెలుస్తుంది.

ప్రేమ వివాహాలు విఫలమైనా, దేశం సఫలం కావడం కూడా కొన్ని చోట్ల మనం చూడొచ్చు. ఎక్కడ సత్యం వుందో - ఆ విషయం విజయం వైపు పయనిస్తుంది. ఎక్కడ అబద్ధం వుందో - ఆ విషయం వోటమి వైపు పయనిస్తుంది.  కొన్ని దేశాలలో, వైవాహిక సంబంధాలలో - లేని నిజాయితీ దేశం విషయంలో కనిపిస్తుంది. అక్కడ అది సఫలం కావచ్చు.

ఒక సంఘము , వొక సంస్కృతి - సఫలం, విజయవంతం కావాలంటే - వ్యక్తిత్వ సంబంధాలలోనూ-   నిజాయితీ వుండాలి. సాంఘిక సంబంధాలలోనూ నిజాయితీ వుండాలి. అప్పుడు - సత్యమేవ జయతే - అన్నది - ఆ దేశము, లేదా, సంఘము విషయం లో సార్థకమవుతుంది.

లేదంటే - ఆ యా దేశాలలో - చాలా సార్లు అబద్ధానికి విజయం సంప్రాప్తించినా  -  దేశం మొత్తానికి - ఆ అబద్ధాల పుట్ట, చేటు తెచ్చి  పెడుతుంది. దేశం విఫలమవడానికి కారణమవుతుంది.

సరే. నిజమే చెప్పాలి. కాని ప్రియంగా చెప్పాలి అని మహర్షులు అన్నారు.

అప్రియం కాని నిజాల్ని చెప్పరాదనీ అన్నారు. ప్రియమైన అబద్ధాలనీ - చెప్పరాదన్నారు.

నీ ముక్కు అస్సలు బాగాలేదని - మీరు, మీ భార్య తోనో, స్నేహితుడితోనో చెబితే - మీరేదో చాల గొప్ప నిజాన్ని, చాలా ఫ్రాంకు గా చెప్పినట్టు కాదు. అది - మీ సనాతన సంస్కార హీనతను మాత్రమే చాటుతుంది. మీరు నిజాలనుకునే అటువంటి, అప్రియ  వాక్యాల్ని చెప్పే హక్కు  మీకు లేదు.

ఏ నిజాన్ని చెప్పినా -మీరు ఎంత ప్రియంగా , ఎంత అందంగా , ఆనందం కలిగించే విధంగా, సమయోచితం గా (ఎప్పుడు చెప్పాలో అప్పుడు), ఎవరి మధ్య చెప్పాలో అప్పుడు (సభోచితముగా), చెబితే - అదే నిజమనిపించుకుంటుంది. అలాకాకుండా చెప్ప బడేది - నిజమనిపించుకోదు.

సనాతన సంస్కారానికి    - మరో ముఖ్య లక్షణం వుంది.

మీరు   -   ఎంత ప్రియంగా , ఎంత అందంగా , ఎంత ఆనందం కలిగించే విధంగా , మరెంత సమయోచితంగా , మరెంత సభోచితముగా  చెప్పినా -  అబద్ధాలు  చెబితే అది సనాతన  ధర్మము, సంస్కారము, నిజము - అని అనిపించుకోదు

అబద్ధం ఎంత బాగున్నా - నిజం అనిపించుకోదు.

కాని - నిజం నిజం అనిపించుకోవాలంటే - దానికి, ఎన్నో అర్హతలు వుండాలి..

అదండీ నిజం. 

= మీ

వుప్పలధడియం విజయమోహన్

1 కామెంట్‌: