'కారణము' - అంటే, 'ఆంగ్లం' లో 'కాస్' అంటారు.
'కార్యం' - అంటే - ఆంగ్లం లో 'ఎఫెక్ట్' అంటారు. తెలుగులో - దీన్ని' ఫలితం' అని సాధారణంగా అంటూ వుంటాము. ఏ ఫలితమైనా - 'కారణము' వలన జరిగిన 'కార్యమే'.
తెలుగులోను , సంస్కృతము లోను - 'కారణ-కార్య సంబంధము' అనేది ఆంగ్లం లో 'కాస్ - అండ్ - ఎఫెక్ట్ థియరీ' అంటారు.
కారణము (1 ) మీరే కావచ్చు. లేదా (2 ) మరెవరైనా కావచ్చు; లేదా ప్రకృతి శక్తులూ కావచ్చు.
(1 ) 'కారణం' మీరే అయితే - మీరు చేసే పని, ఏదైనా వొక లక్ష్య సిద్ధి కోసం అయినపుడు - మిమ్మల్ని 'సాధకుడు' అని, మీరు చేసే పనిని 'సాధన' (ఎఫర్ట్)అని, మీ లక్ష్యాన్ని "సాధ్యము' అని అంటారు.
మీరు మీ లక్ష్యాన్ని , మీ సాధన ద్వారా - పొందితే - మీ లక్ష్య సాధనను లక్ష్య 'సిద్ధి' అని, మిమ్మల్ను లక్ష్య 'సిద్ధుడు' అని అంటారు. మీరు ఏ గొప్ప పని చేయాలన్నా - మీ ప్రయత్నం మాత్రమే చాలదు. ప్రకృతి శక్తుల తోడ్పాటు కూడా కావాలి. అందుకే, మన వారు - ఏ పని చేయాలన్నా ముందు ప్రకృతి శక్తులును పూజించి వాటి తోడ్పాటు కోరేవారు.ప్రతి గొప్ప పనికీ - సరైన సమయము, సందర్భము, మరి కొందరి (సంబంధించిన ) వ్యక్తుల , జంతువుల తోడ్పాటు అవసరం అయితే - అదీ తీసుకోవాలి.
శ్రీకృష్ణుడు - యోగః కర్మసు కౌశలం - అంటాడు భగవద్ గీతలో. యోగానికి ఇది కూడా కృష్ణుడిచే యివ్వబడిన గొప్ప నిర్వచనము (డెఫనిషన్).
అంటే - మీరు ఏ పని చేసినా - అందులో - మీ నైపుణ్యాన్ని పూర్తిగా వాడండి. ఆ పనిని ఎంత బాగా చేయ గలరో - అంత బాగా చేయండి - అంటాడు శ్రీకృష్ణుడు. చేయాల్సిన యుద్ధంలో (పనిలో) - వెనుకంజ వేయబోయిన అర్జునునికి - భగవద్ గీతనే ఉపదేశించి - యుద్ధం చేయమని ప్రబోధిస్తాడు.
పని చెయ్యడం నీ వంతు - ఫలితాన్నివ్వడం నా వంతు - అంటాడు, ప్రకృతి శక్తులకే అధిపతి ఐన శ్రీ కృష్ణుడు.
పని చెయ్యకుండా ఫలితం లేనే లేదు. కారణం నువ్వు కావాలి. సాధన నువ్వే చేయాలి. లక్ష్యం నీదే. కానీ - నీకు 'సిద్ధి' లేదా ఫలితం - లభిస్తుందా, లేదా - ఎప్పుడు, ఎలా, అన్నది నా వంతు అంటాడు.
ప్రతి సారీ - నువ్వు అనుకున్నది, అనుకున్నట్టు జరగదు.
చాలా విషయాల్లో, మీ పనుల వలన , జరిగేది - మీరు అనుకున్న దానికంటే - భిన్నంగా జరగొచ్చు. మీరు అనుకున్న ఫలితం కంటే , ఎక్కువ రావచ్చు; తక్కువ రావచ్చు. అసలేమీ రాకపోవచ్చు. అంతే కాదు. మీరు అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగానో , అనూహ్యమైన ఫలితం గానో కూడా రావచ్చు.
ఎందుకు ?
దీనికి - రెండు కారణాలు చెప్పచ్చు.
ఒకటి మీ ప్రారబ్ధ కర్మ. ఇది కూడా 'కారణ-కార్య సంబంధము' అంటే - 'కాస్ - అండ్ - ఎఫెక్ట్ థియరీ' యొక్క జన్మాంతర పరిణామమే. మీ కర్మల (పనుల) ఫలితం వొక జన్మలో తీరిపోదు. ఎంతో కొంత మిగులు వుండనే వుంటుంది . ఆ మిగులు ఫలితం - మీ యిప్పటి పనుల ఫలితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
మీ ప్రారబ్ధ కర్మ ఖాతా లో పుణ్యం ఎక్కువ వుందనుకోండి. మీరు యిప్పుడు చేసే ప్రతి పనికి - మీరు అనుకున్న దానికంటే - ఎక్కువ మంచి ఫలితం రావచ్చు. పాపం ఎక్కువుందనుకోండి. మీరు అనుకోని, ఎదురుచూడని దుష్ఫలితాలు సంభవించ వచ్చు
రెండవది - యితరుల, మరియు ప్రకృతి శక్తుల ప్రభావం.
ఈ ప్రపంచం లో , ఏ పని అయినా - ఏకంగా, (ఐసొలేటెడ్ గా) మిగతా వాటితో సంబంధమే లేకుండా జరగనే జరగదు.
మీ పని పైన, సూర్య, చంద్ర, ఆకాశ, మేఘ, భూమి,వాయు, అగ్ని లాంటి ప్రతి శక్తి యొక్క ప్రభావం వుండనే వుంటుంది.
ఉదాహరణకు - మీరు పిక్నిక్ కు పోవచ్చు. పోయిన చోట (అమెరికా అయితే) టార్నడో రావచ్చు. (ఇండియా అయితే) బందులు, రోడ్డు రోకోలు, కరెంటు పోవడాలు - ఎన్నో రావచ్చు. ఆక్సిడెంటులూ కావచ్చు.
లేదా - చాలా బాగా కూడా జరగవచ్చు.
మీ పని ఈ 'ప్రపంచం' లోనే జరుగుతూ వుంది. అయితే - ప్రక్కనే - ఇదే ప్రపంచంలోనే - మరెన్నో పనులు ఇతరులూ చేస్తున్నారు, ప్రకృతీ చేస్తూ వుంది. మీ పని ఫలితం వీటన్నిటి సమన్వయ ఫలం పైన ఆధార పడి వుంటుంది. ఏ పని కైనా - మీకు వచ్చేది, మీ పని పైన అన్ని యితర పనుల ప్రభావాలతో కూడిన సమన్వయ ఫలమే.
దీనికీ మించి - ప్రారబ్ధ కర్మ ఫల శేషము కూడా వుంటుంది. కాబట్టే - అర్జునా - కర్మ (పని) నువ్వు చేయాల్సిందే. కానీ, ఫలితాన్ని ఇచ్చేది నేను - ఏ ఫలితాన్ని, ఎప్పుడు, ఎలా ఇస్తానన్నది - నా ప్రకారం జరుగుతుంది - అంటాడు కర్మ ఫల దాత ఐన శ్రీకృష్ణుడు.
మీరు పిక్నిక్ వెళ్లారు - అనుకోండి . వర్షం వచ్చింది. అంటే ఈ పిక్నిక్ పనిని మీరు సరిగ్గా అనుకోలేదు, చేయ లేదు. -దానికీ, ప్రారబ్ధ ఫలానికీ సంబంధము లేక పోవచ్చు.
అయితే - మీరు పిక్నిక్ కు వెళ్ళారు. కానీ- ఎదురు చూడలేని -సంఘటన జరిగిందనుకోండి. అది ప్రారబ్ధ ఫలంగా కూడా వుండచ్చు . దీన్నే - "అదృష్ట ఫలం" అని కూడా అంటారు. యిలా ఎందుకు జరిగింది అని యోచన చేస్తే - జవాబు దొరకని ఫలితాలు ఈ కోవ లోకి వస్తాయి.
సరే. మీరొక మంచి పని చేసారనుకోండి. యిప్పుడు మీకు వచ్చిన ఫలం - చాలా చెడ్డది గా వుందనుకోండి. ఇది మొట్ట మొదట మీ + సర్వ శక్తుల పనుల సమన్వయ ఫలంగా చూడాలి. దాన్లోనే మీకు సమాధానం దొరకొచ్చు. దాన్లో సమాధానం దొరకలేదంటే , తరువాత ప్రారబ్ధ ఫలంగా కూడా చూడాలి.
మరి - మంచి పనికి (పుణ్య కార్యానికి) మంచి ఫలితం వుందా, లేదా? తప్పకుండా వుంది. అది మీకే వస్తుంది. కానీ - అది, మీకు ఎప్పుడు, ఎలా ఇవ్వాలో, నిర్ణయించేవాడు - వేరే వున్నాడు.
మన కర్తవ్యం ఏమిటి?
చాల సింపుల్ . కామన్ సెన్స్ ; మామూలు విజ్ఞత.
సకాలంలో పంటలు పండించాలి.
సకాలంలో, తిన వలసినవి, తినవలసిన విధంగా, తిన వలసినంత మాత్రం తినాలి.
సకాలంలో మేల్కొనడము , నిద్రించడము, చదవడము, శరీర పరిశ్రమ చేయడము, లాంటివి చేయాలి.
మనసులో మంచి ఆలోచనలే పెట్టుకోవాలి. పది మందికి పనికొచ్చే పనులు చేయాలి. పది మందితో కలిసి వుండాలి. హాయిగా వుండాలి.
మీకు తెలుసా - సకాలము, సరి ఐన పనులు, సరి ఐన ఆలోచనలు, పాటిస్తే - వీటికన్నిటికి - మీకు రావలసిన - సత్ఫలితం మీకు వచ్చే తీరుతుంది. దీన్నే శ్రీకృష్ణుడు, పతంజలి మహర్షి యిద్దరూ - యోగం అన్నారు.
అంతే కాదు. మీ యిప్పటి ఆస్తులు, సంబంధాలేవీ - మీతో జన్మాంతరానికి రావు. మీతో తప్పకుండా వచ్చేవి - మీ పుణ్య పాపాలే.
అంటే - 'కాస్ - అండ్ - ఎఫెక్ట్ థియరీ' ఈ జన్మతో సరిపోయిందనుకుంటే - చాలా తప్పు.
మీరు చేసిన హత్యలు, రేపులు, గూండాఇజం మేమ్మల్నేం చేయలేదనుకుంటే అది పెద్ద పొరపాటే. కాస్ వున్న చోట ఎఫెక్ట్ ఉండి తీరుతుంది. ఎఫెక్ట్ వచ్చేంత వరకు కాస్ మీ నెత్తినే, మీరు చేసిన పాపంగా వుంటుంది. మీరు అనుకోని సమయంలో, అనుకోని విధంగా వస్తుంది.
అదే విధంగా - మీరు చేసిన పుణ్య ఫలం - మీతో బాటే వస్తుంది.
ఉదాహరణకు - బిల్ గేట్స్ గారితో బాటు (నిండు నూరేళ్ళ తరువాత!) వెళ్ళేవి మైక్రోసాఫ్ట్ లోని వారి ప్రస్తుత ఆస్తులు కాదు. అవి వారి ఈ జన్మ కృషి ఫలం జన్మాంతర ప్రారబ్ధ కర్మ ఫలం. రెండూ. కాని వారు వివిధ రోగుల కొరకు చేసిన, చేస్తున్న సహాయం వారి వెనుకనే ఎల్లప్పుడూ వుంటుంది. మంచి ఫలితాన్నీ ఇస్తుంది.
మీకైనా, నాకైనా అంతే.
ఎందుకిలా జరిగింది?
అని మనలను - వేధించే అన్ని ప్రశ్నలకు ఈ 'కాస్ - అండ్ - ఎఫెక్ట్ థియరీ' చక్కటి సమాధానం.
అయితే - లాభమొచ్చినా, నష్టమొచ్చినా, కష్టమొచ్చినా, ఏమొచ్చినా - నేను సంతోషంగానే వుంటాను - అనే స్థిత ప్రజ్ఞుడికి - ఈ పుణ్య పాప ఫలాల ప్రభావం అంటదు. ఎందుకంటే - కర్మ ఫల దాత యిచ్చేవన్నీ కూడా- బాహ్య ప్రభావాలే.
అయితే - మనకొక స్వతంత్రం పెట్టనే పెట్టాడు ఆయన . అది మనిషి ఈ 'కాస్ - అండ్ - ఎఫెక్ట్ థియరీ' ని దాటి, దైవత్వాన్నే అనుభవించగల శక్తి. దాని పేరే 'స్థిత ప్రజ్ఞత్వం'.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి