16, మే 2011, సోమవారం

ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు? వై మీ ?

యిలా నాకే ఎందుకు జరిగింది?

ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు?

ఈ రోగాలన్నీ  నాకే  ఎందుకు?

నాకే ఎందుకు ? వై మీ  ?


ఈ ప్రశ్నలు దాదాపు ప్రతి వొక్కరి మనస్సులో - ఎప్పుడో వొకప్పుడు - తలెత్తు తూనే వుంటాయి. 

కానీ - జరిగిన మంచివన్నీ - "యివన్నీ, నాకే ఎందుకు జరిగిందని" - అనుకోము; అడగము; బాధ పడము.

ఏ చిన్న కష్టం వచ్చినా, రోగం వచ్చినా, నష్టం వచ్చినా - "నాకే ఎందుకు" - అని అనుకుంటాము; అడుగుతాము; బాధ పడతాము.

యిది సగటు మనిషి మనస్తత్వము.

గోడంతా తెల్లగా మెరిసిపోతున్నా - దాన్ని గమనించక, గోడమీద వున్న చిన్న నల్ల చుక్క ను, చూస్తూ కూర్చునే మనస్తత్వం  మనది.

మీకున్న, మీకు వస్తున్న, మీ సుఖాలను, మీ ఆరోగ్యాన్ని, మీ ఆస్తి పాస్తులను, మీ  కుటుంబం యొక్క బలాన్ని, అది మీకిస్తున్న రక్షణను  - యిటువంటి,  మీకున్న, మీరు సంతోష పడ దగిన ఎన్నో అంశాలు - మీ మనసులో వుండనే వుండవు.  మనలో చాలా మంది అంతే.   గోడను చూడలేరు. నల్లచుక్కను మాత్రమే చూస్తారు.

ఇది మారాలి.

రోగాలనుండి ,నష్టాల నుండి ,  కష్టాల నుండి, చావు నుండి, తప్పించుకున్న వ్యక్తి ఈ రోజు వరకు ఎవరూ లేరు. ఏ దేశం లోనూ లేరు.

 "నేను" మాత్రం రోగాలు, కష్టాలు రాని వ్యక్తి గా  వుండ గలనా?  కాదు కదా!

చాలా, చాలా అభివృద్ధి చెందిన (అమెరికా లాంటి ) దేశాలలో కూడా - ప్రతి రోగానికీ - మందుల అమ్మకం, మన దేశం కంటే చాలా ఎక్కువ .మన ఫార్మా కంపెనీల లాభాలలో ఎక్కువ శాతం లాభం అమెరికా నుండి రావాలని - .   మన కంపెనీలు ప్రయత్నం చేస్తాయి. 

కష్టాలు, నష్టాలు, రోగాలు, అన్నీ - అక్కడా ఎక్కువే.

రోగాలు, కష్టాలు - డబ్బుండే  వాడికీ  ఎక్కువే;  పదవి వుండే వాడికీ ఎక్కువే;  బలం వుండే వాడికీ ఎక్కువే.

 అయితే - ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా - చలించని వ్యక్తులు ,సంతోషాన్ని  పోగొట్టు కోని  వ్యక్తులు మన దేశంలో,  చాలా, చాలా మంది వున్నారు తెలుసా. 

ఏదొచ్చినా ఏడిచే వాళ్ళూ వున్నారు. ఏదొచ్చినా ఏడవని వాళ్ళూ వున్నారు మన దేశంలో.

అయితే - ఎప్పుడూ, సంతోషంగా ఉండగలిగే వారిలో -కనీసం    అలా వుండాలని ప్రయత్నించే వారిలో - నాలుగు రకాల తేడాలను మనం చూడొచ్చు.


1 . కొంతమంది జ్ఞానులున్నారు.  వీరిని గురించి శ్రీ కృష్ణుడు, సాంఖ్య యోగం లో చెబుతాడు. ఉపనిషత్తులలో వుండే దంతా  - వీరిని గురించే. 

"ఈ  దేహం నేను కాదు; ఈ దేహం నా ది   కాదు.  ఈ  మనస్సు నేను కాదు; ఈ మనసు నాది కాదు" - అని ,

నిస్సందేహంగా తెలుసుకున్న వారిని జ్ఞానులంటారు. 

కష్టాలు, రోగాలు, బాధలు - మనసుకో, దేహానికో గదా. నేను కాని దానికి, నాది కాని దానికి, వచ్చే వాటికి - నేనెందుకు బాధ పడాలి? యిదీ వీరి తత్వం. నేను ఆనంద స్వరూపుడిని - నాకేం కష్టాలు - అంటారు వీరు. 

రమణ మహర్షి ఇటీవలి కాలం లో పుట్టి పెరిగి, చని పోయిన మహా జ్ఞాని. ఆ మార్గానికి ముఖ్యమైన మెట్టు  - "నేనెవరు?" అన్న ప్రశ్నకు నిస్సంశయంగా  బదులు తెలుసుకోవడమే.  తెలుసుకున్న వారికి - ఏ కష్టాలూ లేవు. 


2 . రెండవది కర్మ యోగ మార్గం


మీకే  కష్టమొచ్చినా, సుఖమొచ్చినా, రోగాలొచ్చినా, ఆనందమొచ్చినా , ఆరోగ్య మొచ్చినా, అన్నిటికీ కారణం - మీరు చేసిన పనుల (కర్మల) ఫలితమే. 


అయితే - ఈ క్షణం నుండి - సత్-కర్మలు చేయడం ద్వారా - వీటి బాధల నుండి, భవిష్యతు లో  తప్పించుకోవచ్చు. 

మనం - మన పనులను, వాటి ఫలాలైన కష్టాలను, రోగాలను, సుఖాలను  ఎలా తీసుకోవాలని కూడా - కర్మ యోగం మనకు చెబుతుంది.  

పనులను (కర్మలను), దేవుడికి (కర్మఫలదాతకు) "అర్పణ" భావంతో చెయ్యాలి. అంటే - ఈ పనులను నా వెనుకనుండి, చేయిస్తున్నది - నీవే - అన్న భావం తో - చేయాలి.  


గీతలో - కృష్ణుడు - అర్జునునితో - వీళ్ళందరినీ  చంపే వాడిని నేను. విల్లు నీవు సంధిస్తే చాలు అంటాడు! కర్మ లో భగవదార్పణం వుండాలి  - వుంటే - అది మామూలు కర్మ(పని) నుండి - కర్మ యోగం గా మారిపోతుంది. అంటాడు కృష్ణుడు.

కర్మ చేయడంలో మన భావం యిలా వుంటే - కర్మ ఫలం వచ్చేటప్ఫుడు, మన పనికి ఫలితం వచ్చేటప్ఫుడు,  మనలో  ఎలాంటి  భావం వుండాలి?

అన్నీ కర్మ ఫల దాత ఇచ్చే ప్రసాదమే. అందువలన, ఫలితం ఏదైనా - నువ్విచ్చే ప్రసాదమే గనుక -  నీ ప్రసాదాన్ని సంతోషంగా స్వీకరిస్తాను, అనే భావన వుండాలి. 

లాభమైనా, నష్టమైనా - ఆరోగ్యమైనా, రోగమైనా - ఏదైనా -  నీ ప్రసాదంగా స్వీకరిష్టాను - అని,  అన గలగాలి. కర్మలో "అర్పణ భావం" , కర్మఫల స్వీకరణలో - "ప్రసాద భావం" వున్న వాడు కర్మ యోగి. కర్మ యోగిని, ఎటువంటి కష్టాలూ, నష్టాలూ అంటవు.

3 . . మూడవది భక్తి  మార్గం. ఎక్కడ చూసినా దేవుడే, ఏదిచ్చినా దేవుడే; మన దగ్గరున్నదంతా - దేవుడికే - యిలా, తనను తాను, పూర్తిగా భగవదార్పణం కావించుకోగలవారు  - భక్తులు. 

ఏదొచ్చినా- దేవుడే తమను పరీక్షిస్తున్నాడని, తద్వారా, దేవుడు తమకు ధగ్గరౌతున్నాడని నమ్మగలిగే వారు. ఏ కష్టాన్నీ, లెక్క చేయరు.


4 . నాలుగవ మార్గం ధ్యాన మార్గం.  


పతంజలి దీన్ని - క్రియా యోగం అని కూడా అంటారు. ధ్యానము, సమాధి లాంటి ప్రక్రియల ద్వారా, వీరు తమ నిజమైన "స్వ" రూపాన్ని తాము తెలుసుకొన్న వారు అవుతారు. తమ మనస్సులపై పూర్తి ఆధిపత్యం సంపాదించ గలుగుతారు. 

ఈ ఆధిపత్యాన్ని (చిత్త వృత్తి నిరోధాన్ని)   - యోగము, క్రియా యోగం, ధ్యాన యోగం అని వెవ్వేరు పేర్లతో పిలుస్తారు. మనస్సు పై, పూర్తి ఆధిపత్యం సంపాదించిన యిటువంటి వారికి -  కష్టాలు, రోగాలొస్తే  అస్సలు లెక్క లేదు. చాలా వరకు - రానే రావు.

మన మనసుల్లో వచ్చే - "నాకే ఈ కష్టాలెందుకు, రోగాలెందుకు", "అయ్యో దేవుడా, యివి ఎలా భరించేది?"  -లాంటి ప్రశ్నలు  - పైన చెప్పిన నలుగురికీ రావు. 

యిందులో - ఈ కాలపు వాళ్లకు - కాస్త సులభ మార్గము అని చెప్పాలంటే - కర్మ యోగాన్ని  చెప్పచ్చు.

నాకే ఎందుకు - అన్న ప్రశ్నకి - నేను చేసాను కాబట్టి, ఫలితం నాకే వచ్చింది, నాకే వస్తుంది -  అన్నది, కర్మ యోగం సమాధానం.

ఈ రోజు చేసే పనికి - రేపో, మాపో, ఎప్పుడో  ఫలితం వస్తుంది - మీకే వస్తుంది.

కాబట్టి,  ఈ రోజు ఎలాంటి పని చేయాలో, దానిపై దృష్టి సారించండి. రేపటి మీ భవిష్యత్తు బాగుంటుంది.

యిప్పుడు - వచ్చిందానికి  నేనేమి చేయడం? 

"ఏదొచ్చినా - అన్నీ నీ ప్రసాదమే - సంతోషంగా స్వీకరిస్తాననే, ప్రసాద భావం మనసులో పెట్టుకోవడమే.  

ఏదొచ్చినా- ఏదీ- మనతో, ఎప్పుడూ వుండి పోదు.  ఈ కష్టమూ పోతుంది. ఈ రోగమూ పోతుంది. వున్నా దాన్ని నేను ఖాతరు చెయ్యను. -అని అనుకోగలగడం గొప్ప వరం.

దీన్ని మించి - మనం చేయాల్సింది మరొకటుంది.

దేవుడు - కష్టాలు మాత్రం ఈలేదు. సుఖాలనూ ఇచ్చాడు. ఆ లిస్టు చాలా పెద్దది.  మీరు రాయరు. కానీ, రాసే వారు, మహా సంతోష పడతారు. 

దేవుడు రోగాలను మాత్రం యివ్వ లేదు. ఆరోగ్యం కూడా యిచ్చాడు. కానీ - ఆరోగ్యంగా వున్న రోజులు, హాయిగా వున్న రోజులు - ఎంత ఎక్కువగా వున్నా - మీరు అవి జ్ఞాపకం పెట్టుకోరు.

తెల్ల గోడ పైన తెలుపు చూడరు. నల్ల మచ్చను మాత్రము చూస్తారు.
  .

అందుకే మన వాళ్ళు, ప్రతి రోజూ,  తెల్ల వారి లేచిన వెంటనే - దేవుడికి - దేవుడు తమకిచ్చిన వరాలన్నిటికీ  చేర్చి - మొట్ట మొదట కృతజ్ఞత తెలిపేవారు. యిన్ని వరాలిచ్చిన దేవుడు - ఏదో చిన్న కష్టం, లేదా రోగం యిస్తే - అదీ ప్రసాధమే అన్న భావన వెంటనే వస్తుంది. 

అప్పుడు రోగం కూడా త్వరగా పోతుంది. ఈ  నాటి - పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్  - యింత కంటే - గొప్పదేమీ  కాదు. వైద్యుడిదగ్గరికి పోవద్దని కాదు. నమ్మకం తో వెళ్ళండి. మీ వైద్యుడికీ ఇలాంటి నమ్మకమే వుండాలి. ఏ రోగమైనా పోతుంది.


యిప్పుడు చెప్పండి!

కష్టాలు - మీకు మాత్రమే -  వస్తున్నాయా?
మీకు - కష్టాలు మాత్రమే -  వస్తున్నాయా?

                     సుఖాలు కూడా వస్తున్నాయా, లేదా?

రోగాలు - మీకు మాత్రమే -  వస్తున్నాయా?
మీకు - రోగాలు  మాత్రమే -  వస్తున్నాయా?

                       మీకు ఆరోగ్యమూ, వుంది కదా?

మీ కష్టాలూ, మీ రోగాలు - యిచ్చిన వాడు, యిచ్చినట్టే - తీసుకెళ్ళుతాడు. యిది నమ్మండి.

ఈ క్షణంలో - సంతోషంగా వుండండి. 

= మీ

వుప్పలధడియం విజయమోహన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి