29, ఏప్రిల్ 2011, శుక్రవారం

శ తాయుష్మాన్ భవ = తాగితే తప్పేమిరా తమ్ముడూ? = తాగిన వాడిని, ఎవడిని నమ్మొచ్చు? దేనికి నమ్మొచ్చు? ఎప్పుడు నమ్మొచ్చు?



తాగితే తప్పేమిరా తమ్ముడూ?

తప్పు లేదు. 

మంచి నీళ్ళు తాగితే తప్పులేదు. మజ్జిగ తాగితే తప్పులేదు.

కొబ్బరినీళ్ళు తాగితే తప్పు లేదు.

మన శరీరానికి, మనసుకు, కొద్దో, గొప్పో  మేలు చేసేదేదయినా తాగచ్చు. 

కనీసం, మనకు  ఏ విధమయిన కీడు కలిగించనిదయినా  పరవాలేదేమో.

కాని, అమృతమనుకొని, కాస్త ఆలస్యంగా పనిచేసే విషాన్ని తాగితే?

సరే - మన జీవితం - మన యిష్టం.


మనపై ఆధార పడిన వాళ్ళ మాటో?


ఉదాహరణకి - 

(1 )  మీ కారు డ్రైవరు కోసం మీరు ఎదురు చూస్తున్నారు. మీ వారందరితో కలిసి  తిరుపతి కొండల పైకి,  మీరు వెళ్ళాలి. లేదా, ఊటీ కొండలపైకి; లేదా, అటువంటి మరో అందమైన  స్థలానికి మీరు వెళ్ళాలి. 

మీ డ్రైవరు తాగొచ్చాడు ..  .. మీరేం చేస్తారు?    తాగొచ్చిన  డ్రైవరును,  మీరు, మీ వారు, నమ్మి - మీకారు స్టీరింగును - అంటే, మీ  జీవితాల్ని - వొప్పగిస్తారా?  

                                తాగొచ్చిన  డ్రైవరును - మీరు నమ్ముతారా? 

(2) మీరు విమానం లో వెళ్ళాలి. బాగా  తాగొచ్చిన పైలెట్ ను చూసాక, అతన్ని నమ్మి, ఆ  విమానం మీరు ఎక్కుతారా? 
                             తాగొచ్చిన  పైలెట్ను - మీరు నమ్ముతారా? 

(౩) ఈ రోజు, మీకు చాల ముఖ్యమయిన వారికి, వొక ముఖ్యమయిన ఆపరేషను జరగాలి. డాక్టరు గారు బాగా, తాగొచ్చారు.
                            తాగొచ్చిన  డాక్టరును  - మీరు నమ్ముతారా?  

(4 )  మీరు ఏ తప్పూ చెయ్య లేదు. ఏ అపరాధమూ చెయ్య లేదు. అయినా మీ పై కేసు మోపబడింది.  జడ్జిగారు  బాగా తాగొచ్చారు. (వొక వేల తాగొస్తే! యిధి మాత్రం జరగడం లేదనుకుంటాను)

                           తాగొచ్చిన  జడ్జిగారిని   - మీరు నమ్ముతారా?


(5 ) తాగొచ్చిన క్లర్కు గారిని నమ్ముతారా?    తాగొచ్చిన ఆఫీసరు  గారిని నమ్ముతారా? 


(6 ) తాగొచ్చిన మినిస్టరు గారిని మీరు నమ్ముతారా? తాగొచ్చిన సెక్రెటరీ గారిని   గారిని నమ్ముతారా? 


(7 ) తాగొచ్చిన టీచరు  గారిని మీరు నమ్ముతారా? తాగేసి, మీ సమాధానాలకు మార్కులు వేసే వారి ని మీరు  నమ్ముతారా?

తాగిన వాడిని, ఎవడిని నమ్మొచ్చు? దేనికి నమ్మొచ్చు?  ఎప్పుడు నమ్మొచ్చు? 


     తాగిన మిమ్మల్ని, మరెవరయినా  నమ్మ గలరా? 


     తాగిన మిమ్మల్ని, మీరు నమ్మ గలరా? 

ఈ ప్రశ్న హాస్యాస్పదం.

ఎందుకంటే - తాగిన తరువాత, "మీరు"  లేరు!  తాగుడు మైకం మాత్రమే వుంది.

ఈ ప్రపంచం లో - వారు, "వారు" గానే వున్న వారు, ఎవరూ, మిమ్మల్ని నమ్మ లేరు. నమ్మరాదు.

మరో త్రాగుబోతు మాత్రమే మిమ్మల్ని నమ్మ గలడు. కాని,  అది నమ్మకం కాదు. నమ్మకానికి ఆధారమైన బుద్ధి యిప్పుడు  లేదు.  త్రాగుడు మైకంలో ఏదైనా నమ్ముతారు. 

వొక సమాజపు పురోభివృద్ధి - ఆ సమాజములో - వొకరిపై, వొకరికి - ఏంత నమ్మకము వుందో - ఆ నమ్మకము పైనే - ఆధార పది వుంటుంది. 

మరి - త్రాగుబోతుల  పై  - సమాజములో - ఆ నమ్మకము ఎంత వుంటుందంటారు?


తాగే వారిని గురించి చెప్పే నిజమైన కథలూ, జోకులు  ఎన్నో వున్నాయి.

వొకాయన త్రాగుడు మైకం లో - తన భార్య చనిపోయిందని భోరిన ఏడుస్తూ, హోటలు పై ఫ్లోరు నుండి దూకేసాడట. ఆయనకు పెళ్ళే కాలేదు. 

పెళ్లాన్నో, మొగున్నో, ప్రేమికుడినో,   మిత్రుడినో, శత్రువు నో  - ఎవరినైనా చంపాలనుకున్నా వాడికి / ఆమెకు   త్రాగుడు అవసరం చాలా కావలసి వస్తోంది.  

మనసును, పాతేయ్యాలంటే -  త్రాగుడు కావాల్సి వస్తోంది.

త్రాగిన వాడికి కళ్ళు సరిగ్గా కనిపించవు. చెవులు సరిగ్గా వినిపించవు.  మెదడు స్వాధీనములో వుండదు.. 

త్రాగిన వాడు నిజం మాత్రమే  మాట్లాడతాడన్నది   అబద్ధం. 

ఏదైనా మాట్లాడొచ్చు అన్నది నిజం.మాట్లాడ రానివన్నీ మాట్లాడతాడన్నది  కూడా చాలా నిజం.

త్రాగిన తర్వాత - ఏ వస్తువును గాని, ఏ మనిషిని గాని తాకడానికే - మనకు  అర్హత ఉంటుందా అని అనుమానం వస్తుంది. ఏ వస్తువైనా, ఏ మనిషైనా - దానికి / వారికి మనము  చాలా అన్యాయం చేసే ప్రమాదం, ఛాలా వుంది.

మంచి వారిని గానీ; చెడ్డ వారిని గానీ - త్రాగుడు చెడ్డ వారి గానే మార్చ గలదు. కానీ, మంచి వారిగా మార్చ  లేదు. 


మంచి, చెడులు వొక ప్రక్కన వుంచండి .
నాకు తెలిసి, త్రాగుడు తో - ఎన్నో రోగాల బారిన పడిన వాళ్ళూ , అర్ధాంతరం గా చని పోయిన వాళ్ళూ చాలా  మంది వున్నారు.  మీరందరూ అటువంటివి చూసే వుంటారు. త్రాగుతూ వున్న వాడిని - నిండు నూరేళ్ళు వుండు - మని ఎవరైనా మనస్ఫూర్తిగా  దీవించ గలరా? 

ఇదేదీ కొత్త విషయం కాదు - చాలా పాతదే.

అందరికీ తెలుసు. తెలిసీ ఈ దురలవాటుకు బలై పోతున్నారు. 

అయితే యిప్పుడు "త్రాగడం గొప్ప"  అనుకునే వారి సంఖ్య  ఎక్కువై పోతూ వుంది.

త్రాగక పోవడం నాగరికత కాదనే వాళ్ళు  ఎక్కువవుతున్నారు.

వారి కళ్ళద్దాలతో  వారు చూస్తున్నారు .వారికి  తెలిసింది, తెలియనిదీ నిజమనుకుంటున్నారు.

నా కళ్ళద్దాలతో నేను వారిని  చూస్తున్నాను; నాకు తెలిసింది నిజమను కుంటున్నాను.  

కాకపోతే - నా మనసు నా అధీనంలో వుంది. వారి మనసు వారు అధీనంలో లేదు. త్రాగుడు అధీనం లో వుంది. 

-అంటే, త్రాగిన వాడి కంటే - త్రాగుడు అలవాటు చాలా, చాలా, చెడ్డదని తెలుస్తూ వుంది కదా.  

వాళ్ళను మార్చొచ్చు.

వాళ్ళు మారడం కొంత - వారి చేతుల్లో వుంది.

కొంత వారి భార్య , పిల్లల చేతుల్లో వుంది.

కొంత - ఆ వూరి స్కూలు టీచర్ల చేతిలో వుంది.

కొంత - వారి స్నేహితుల చేతుల్లో వుంది. ప్రభుత్య్వం వారి చేతుల్లో కొంత..


వారు - మారాలంటే - అందరి నుండి - వారికి, వారిలో మంచి మార్పుకు ప్రోత్సాహము లభించాలి.

త్రాగుడుకు ప్రోత్సాహము లభింఛ కూడదు.



వారి సంగతి తరువాత - ; తాగని వారి సంగతి ఏమిటి? 

ఏ దురలవాటు కయినా సరే !

"మొదటి సారి  - నో.

ప్రతి సారీ - నో."

యిలా వుంటేనే - మీరు / మనము ఏ దురలవాటుకూ లోను కాకుండా వుంటాము.

యిది ముఖ్యమండి.  

పిల్లలికి చెప్పండి. పెద్దలకీ చెప్పండి. ఎవరెవరికి చెప్పా గలరో - అందరికీ చెప్పండి.

మొదట,  త్రాగని వాడిని - మనం  కాపాడితే, పుణ్యమూ, పురుషార్థమూ రెండూ వస్తాయి .

అమ్మాయిలకు మంచి మొగుడొచ్చే చాన్సు పెరుగుతుంది. 

అబ్బాయిలను "శ తాయుష్మాన్ భవ" అని నిర్భయంగా దీవించొచ్చు

ఎవరింటికయినా - అతిథిగా వెళ్ళవచ్చు.

మీ యింటికి ఎవరినయినా అతిథి గా పిలువవచ్చు. 

సమాజం  ముందుకు  పోవడానికి  మార్గము వెయ్య వచ్చు.  

=మీ

వుప్పలధడియం విజయమోహన్ 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి