29, ఏప్రిల్ 2011, శుక్రవారం

నల్ల చుక్క పెద్ద దెలా అయ్యింది? =



తెల, తెల్లటి గోడ మీద  - అతి చిన్న,... నల, నల్లటి ...., నక్షత్రము లాంటి  చుక్క- కనిపిస్తూ వుంది.

నల్ల చుక్క చాలా చిన్నది.

మరి, నల్ల చుక్క పెద్ద దెలా అయ్యింది?

తెల, తెల్లటి గోడ మీద  వెయ్యిలో వొక వంతు కూడా లేని , లక్ష లో వొక వంతు కూడా లేని -

నల్ల చుక్క పెద్ద దెలా అయ్యింది?


దాన్ని, కొంత మంది , కన్నుల్లో, వత్తులు వేసుకుని మరీ చూసారు.

చిన్నటి చుక్క పెద్దదయింది .  .  .  .    వారి కంటి చూపులో!

సహజమే అది. 

తెల్లటి గోడ మీద  నల్ల చుక్క వుంటే, చాలా మంది అలవాటు - తెల్ల గోడను చూడలేరు.

నల్లచుక్కను మాత్రమే చూస్తారు, చూడ గలరు.

అందులో కొందరు - భూతద్దం వేసుకుని మరీ చూస్తారు.

తెల్ల గోడను భూతద్దం వేసుకుని ఎవరయినా చూస్తారా? లేదు.

నల్ల చుక్కను మాత్రమే భూతద్దం వేసుకుని చూస్తారు.

అది పెద్దదియితే - అందులో మరీ చిన్న, నల్ల, నల్ల  చుక్కలు ఎన్నో  వుంటాయి గదా. 

చిన్న నల్ల చుక్క - వేలకొద్దీ - మరీ చిన్న,  నల్ల చుక్కల సముదాయమే గదా.

మీ - భూతద్దం శక్తి - ఎంత ఎక్కువయితే - మీ కం టికి , అన్ని "పెద్ద" ,చిన్న, నల్ల చుక్కలు - 

మీ తెల్ల గోడ పై నున్న చిన్న నల్ల చుక్క లో కనిపిస్తాయి.

మీ  భూతద్దం శక్తి పెర్రిగే కొద్దీ - చిన్న నల్ల చుక్క  ఆకాశమంతగా  మీ కళ్ళకు కనుపిస్తుంది.

అందులో, వేల కొద్దీ, "పెద్ద" నల్ల చుక్కలు మీకు కనిపిస్తాయి. 

యిప్పుడు - తెల్ల గోడ మీకు కనిపించదు.

మీ ప్రపంచం - యిప్పుడు  నల్ల చుక్కల ప్రపంచం.


తెల్ల గోడ మీది చిన్న నల్ల మచ్చ -

యింతింతై, వటుడింతై - మీ ప్రపంచాన్నంతా - యిప్పుడు పరిపాలిస్తూ    వుంది.

-మంచి వారిలో - చెడ్డను వెదికే వారికి యిలాగే అవుతుంది. 

వారెంత మంచి వారైనా , వారిలో, వీరికి మాత్రం , చెడ్డ మాత్రమే కనిపిస్తుంది.

చెడును భూతద్దం లో చూస్తే అంతే మరి.

తెల్ల గోడనూ చూడండి. నల్ల మచ్చనూ చూడండి.

నల్ల మచ్చ, తెల్ల గోడ లో, లక్షలో, వొక వంతు మాత్రమే వుందన్న నిజాన్ని గుర్తించండి.

నల్ల మచ్చలో ఉన్న నిజం యింత చిన్నది. దాన్నే - భూతద్దంలో చూసారంటే - 

అదే సర్వ ప్రపంచంగా కనిపిస్తుంది.

 వొక ఆంగ్ల కవి అంటారు -

ప్రేమ వున్న చోట,  నల్ల చుక్క కూడా , మహా అందంగా కనిపిస్తుందట.

A pimple looks like a Dimple – where love Rules.

సరే.  మన తెలుగు కవులేమన్నారు?

తప్పులెన్ను వారు, తమ తప్పులెరుగరు...అన్నారు.

గురివింద గింజకు తన క్రింద నున్న నలుపు కనిపించదట.

మరి క్రీస్తు అన్నారు.  - తప్పేచేయని వాడు - మొదటి రాయి వేయండని.

అదండీ కథ.

=మీ
వుప్పలధడియం విజయమోహన్

శ తాయుష్మాన్ భవ = తాగితే తప్పేమిరా తమ్ముడూ? = తాగిన వాడిని, ఎవడిని నమ్మొచ్చు? దేనికి నమ్మొచ్చు? ఎప్పుడు నమ్మొచ్చు?



తాగితే తప్పేమిరా తమ్ముడూ?

తప్పు లేదు. 

మంచి నీళ్ళు తాగితే తప్పులేదు. మజ్జిగ తాగితే తప్పులేదు.

కొబ్బరినీళ్ళు తాగితే తప్పు లేదు.

మన శరీరానికి, మనసుకు, కొద్దో, గొప్పో  మేలు చేసేదేదయినా తాగచ్చు. 

కనీసం, మనకు  ఏ విధమయిన కీడు కలిగించనిదయినా  పరవాలేదేమో.

కాని, అమృతమనుకొని, కాస్త ఆలస్యంగా పనిచేసే విషాన్ని తాగితే?

సరే - మన జీవితం - మన యిష్టం.


మనపై ఆధార పడిన వాళ్ళ మాటో?


ఉదాహరణకి - 

(1 )  మీ కారు డ్రైవరు కోసం మీరు ఎదురు చూస్తున్నారు. మీ వారందరితో కలిసి  తిరుపతి కొండల పైకి,  మీరు వెళ్ళాలి. లేదా, ఊటీ కొండలపైకి; లేదా, అటువంటి మరో అందమైన  స్థలానికి మీరు వెళ్ళాలి. 

మీ డ్రైవరు తాగొచ్చాడు ..  .. మీరేం చేస్తారు?    తాగొచ్చిన  డ్రైవరును,  మీరు, మీ వారు, నమ్మి - మీకారు స్టీరింగును - అంటే, మీ  జీవితాల్ని - వొప్పగిస్తారా?  

                                తాగొచ్చిన  డ్రైవరును - మీరు నమ్ముతారా? 

(2) మీరు విమానం లో వెళ్ళాలి. బాగా  తాగొచ్చిన పైలెట్ ను చూసాక, అతన్ని నమ్మి, ఆ  విమానం మీరు ఎక్కుతారా? 
                             తాగొచ్చిన  పైలెట్ను - మీరు నమ్ముతారా? 

(౩) ఈ రోజు, మీకు చాల ముఖ్యమయిన వారికి, వొక ముఖ్యమయిన ఆపరేషను జరగాలి. డాక్టరు గారు బాగా, తాగొచ్చారు.
                            తాగొచ్చిన  డాక్టరును  - మీరు నమ్ముతారా?  

(4 )  మీరు ఏ తప్పూ చెయ్య లేదు. ఏ అపరాధమూ చెయ్య లేదు. అయినా మీ పై కేసు మోపబడింది.  జడ్జిగారు  బాగా తాగొచ్చారు. (వొక వేల తాగొస్తే! యిధి మాత్రం జరగడం లేదనుకుంటాను)

                           తాగొచ్చిన  జడ్జిగారిని   - మీరు నమ్ముతారా?


(5 ) తాగొచ్చిన క్లర్కు గారిని నమ్ముతారా?    తాగొచ్చిన ఆఫీసరు  గారిని నమ్ముతారా? 


(6 ) తాగొచ్చిన మినిస్టరు గారిని మీరు నమ్ముతారా? తాగొచ్చిన సెక్రెటరీ గారిని   గారిని నమ్ముతారా? 


(7 ) తాగొచ్చిన టీచరు  గారిని మీరు నమ్ముతారా? తాగేసి, మీ సమాధానాలకు మార్కులు వేసే వారి ని మీరు  నమ్ముతారా?

తాగిన వాడిని, ఎవడిని నమ్మొచ్చు? దేనికి నమ్మొచ్చు?  ఎప్పుడు నమ్మొచ్చు? 


     తాగిన మిమ్మల్ని, మరెవరయినా  నమ్మ గలరా? 


     తాగిన మిమ్మల్ని, మీరు నమ్మ గలరా? 

ఈ ప్రశ్న హాస్యాస్పదం.

ఎందుకంటే - తాగిన తరువాత, "మీరు"  లేరు!  తాగుడు మైకం మాత్రమే వుంది.

ఈ ప్రపంచం లో - వారు, "వారు" గానే వున్న వారు, ఎవరూ, మిమ్మల్ని నమ్మ లేరు. నమ్మరాదు.

మరో త్రాగుబోతు మాత్రమే మిమ్మల్ని నమ్మ గలడు. కాని,  అది నమ్మకం కాదు. నమ్మకానికి ఆధారమైన బుద్ధి యిప్పుడు  లేదు.  త్రాగుడు మైకంలో ఏదైనా నమ్ముతారు. 

వొక సమాజపు పురోభివృద్ధి - ఆ సమాజములో - వొకరిపై, వొకరికి - ఏంత నమ్మకము వుందో - ఆ నమ్మకము పైనే - ఆధార పది వుంటుంది. 

మరి - త్రాగుబోతుల  పై  - సమాజములో - ఆ నమ్మకము ఎంత వుంటుందంటారు?


తాగే వారిని గురించి చెప్పే నిజమైన కథలూ, జోకులు  ఎన్నో వున్నాయి.

వొకాయన త్రాగుడు మైకం లో - తన భార్య చనిపోయిందని భోరిన ఏడుస్తూ, హోటలు పై ఫ్లోరు నుండి దూకేసాడట. ఆయనకు పెళ్ళే కాలేదు. 

పెళ్లాన్నో, మొగున్నో, ప్రేమికుడినో,   మిత్రుడినో, శత్రువు నో  - ఎవరినైనా చంపాలనుకున్నా వాడికి / ఆమెకు   త్రాగుడు అవసరం చాలా కావలసి వస్తోంది.  

మనసును, పాతేయ్యాలంటే -  త్రాగుడు కావాల్సి వస్తోంది.

త్రాగిన వాడికి కళ్ళు సరిగ్గా కనిపించవు. చెవులు సరిగ్గా వినిపించవు.  మెదడు స్వాధీనములో వుండదు.. 

త్రాగిన వాడు నిజం మాత్రమే  మాట్లాడతాడన్నది   అబద్ధం. 

ఏదైనా మాట్లాడొచ్చు అన్నది నిజం.మాట్లాడ రానివన్నీ మాట్లాడతాడన్నది  కూడా చాలా నిజం.

త్రాగిన తర్వాత - ఏ వస్తువును గాని, ఏ మనిషిని గాని తాకడానికే - మనకు  అర్హత ఉంటుందా అని అనుమానం వస్తుంది. ఏ వస్తువైనా, ఏ మనిషైనా - దానికి / వారికి మనము  చాలా అన్యాయం చేసే ప్రమాదం, ఛాలా వుంది.

మంచి వారిని గానీ; చెడ్డ వారిని గానీ - త్రాగుడు చెడ్డ వారి గానే మార్చ గలదు. కానీ, మంచి వారిగా మార్చ  లేదు. 


మంచి, చెడులు వొక ప్రక్కన వుంచండి .
నాకు తెలిసి, త్రాగుడు తో - ఎన్నో రోగాల బారిన పడిన వాళ్ళూ , అర్ధాంతరం గా చని పోయిన వాళ్ళూ చాలా  మంది వున్నారు.  మీరందరూ అటువంటివి చూసే వుంటారు. త్రాగుతూ వున్న వాడిని - నిండు నూరేళ్ళు వుండు - మని ఎవరైనా మనస్ఫూర్తిగా  దీవించ గలరా? 

ఇదేదీ కొత్త విషయం కాదు - చాలా పాతదే.

అందరికీ తెలుసు. తెలిసీ ఈ దురలవాటుకు బలై పోతున్నారు. 

అయితే యిప్పుడు "త్రాగడం గొప్ప"  అనుకునే వారి సంఖ్య  ఎక్కువై పోతూ వుంది.

త్రాగక పోవడం నాగరికత కాదనే వాళ్ళు  ఎక్కువవుతున్నారు.

వారి కళ్ళద్దాలతో  వారు చూస్తున్నారు .వారికి  తెలిసింది, తెలియనిదీ నిజమనుకుంటున్నారు.

నా కళ్ళద్దాలతో నేను వారిని  చూస్తున్నాను; నాకు తెలిసింది నిజమను కుంటున్నాను.  

కాకపోతే - నా మనసు నా అధీనంలో వుంది. వారి మనసు వారు అధీనంలో లేదు. త్రాగుడు అధీనం లో వుంది. 

-అంటే, త్రాగిన వాడి కంటే - త్రాగుడు అలవాటు చాలా, చాలా, చెడ్డదని తెలుస్తూ వుంది కదా.  

వాళ్ళను మార్చొచ్చు.

వాళ్ళు మారడం కొంత - వారి చేతుల్లో వుంది.

కొంత వారి భార్య , పిల్లల చేతుల్లో వుంది.

కొంత - ఆ వూరి స్కూలు టీచర్ల చేతిలో వుంది.

కొంత - వారి స్నేహితుల చేతుల్లో వుంది. ప్రభుత్య్వం వారి చేతుల్లో కొంత..


వారు - మారాలంటే - అందరి నుండి - వారికి, వారిలో మంచి మార్పుకు ప్రోత్సాహము లభించాలి.

త్రాగుడుకు ప్రోత్సాహము లభింఛ కూడదు.



వారి సంగతి తరువాత - ; తాగని వారి సంగతి ఏమిటి? 

ఏ దురలవాటు కయినా సరే !

"మొదటి సారి  - నో.

ప్రతి సారీ - నో."

యిలా వుంటేనే - మీరు / మనము ఏ దురలవాటుకూ లోను కాకుండా వుంటాము.

యిది ముఖ్యమండి.  

పిల్లలికి చెప్పండి. పెద్దలకీ చెప్పండి. ఎవరెవరికి చెప్పా గలరో - అందరికీ చెప్పండి.

మొదట,  త్రాగని వాడిని - మనం  కాపాడితే, పుణ్యమూ, పురుషార్థమూ రెండూ వస్తాయి .

అమ్మాయిలకు మంచి మొగుడొచ్చే చాన్సు పెరుగుతుంది. 

అబ్బాయిలను "శ తాయుష్మాన్ భవ" అని నిర్భయంగా దీవించొచ్చు

ఎవరింటికయినా - అతిథిగా వెళ్ళవచ్చు.

మీ యింటికి ఎవరినయినా అతిథి గా పిలువవచ్చు. 

సమాజం  ముందుకు  పోవడానికి  మార్గము వెయ్య వచ్చు.  

=మీ

వుప్పలధడియం విజయమోహన్ 


27, ఏప్రిల్ 2011, బుధవారం

జన గణ మన = అమార్ సోనార్ బంగ్లా = పదండి ముందుకు, పదండి ముందుకు




జన గణ మన  - మన జాతీయ గీతము.

దాన్ని రాసిన కవి - నోబెల్ గృహీత -రవీంద్ర నాథ్ టాగోర్ 

యిది బెంగాలీ భాష లో రాయ బడినా - దాదాపు అన్ని భారతీయ భాషల వారికీ చాలా వరకు  అర్థమవుతుంది.

ఎందుకంటే - యిందులో - సంస్కృత పదాలు -లేదా తత్సమాలు - ఎక్కువగా వాడబడ్డాయి. 

అందరికీ తొందరగా అర్థమవుతుంది కాబట్టే - అందరికీ ప్రీతి పాత్రమయింది.

దీని ఆంగ్ల అనువాదం - టాగోర్ గారిచే - మదనపల్లె లో రాయబడింది.

చిత్రమేమంటే - భారత దేశానికి దేశీయ గీతం రాసిన టాగోర్ గారే - 

బంగ్లాదేశ్ యొక్క దేశీయ గీతం కూడా రాయడం.

బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత - టాగోర్ గారు, ఎప్పుడో రాసిన "అమార్ సోనార్ బంగ్లా" అన్న గీతాన్ని 

వారు, తమ జాతీయ గీతంగా చేసు కున్నారు.

ఆ గీతం కూడా చాలా మధురమయిన  గీతం.

మన భారత జాతీయ గీతం లో మాత్రమే - దేశాన్ని గురించిన యిన్ని వివరణలు  చూడగలమని నా 

విశ్వాసం. 

మరే దేశీయ గీతం లోనూ ఇన్ని ప్రాంతాలను గురించి గానీ, పర్వతాలగురించి గానీ, నదుల గురించి గానీ,

సముద్రాన్ని   గురించి గానీ - మనకు కనిపించదు.

మొదట మన మన భాగ్య విధాతను ప్రస్తావించిన ఈ గీతంలో  - చివర  అందమైన "జయ,జయ" కారాలతో,

ముగింపు ఎంత బాగుంది!

యిది మొట్ట మొదట - కోలకాతా లో 1911 , డిసెంబరు, 27 వ తేదీ నాడు యిండియన్ నేషనల్ కాంగ్రెసు

వారి సభ లో  పాడబడింది.  

తరువాత, మన జాతీయ గీతంగా ఎన్నుకో బడింది.

ప్రతి దేశానికీ - వారి దేశీయ గీతం పై మక్కువ వుండటం సహజమే అయినా -

మన గీతం గొప్పతనం, మాధుర్యం  చాల, చాల ఎక్కువని - నాకనిపిస్తుంది. 

అప్పుడప్పుడూ అనిపిస్తుంది -

మళ్ళీ వొక టాగోర్, వొక వివేకానందుడు , వొక రామ కృష్ణుడు వొక బోసు బాబు -అదే బెంగాల్ నుండి ఎందుకు 

రావడం లేదని. 

ఏ సంస్కృతి గొప్ప ధనమయినా  - ఆ సంస్కృతిలో పుట్టే - కొద్ది  మంది  గొప్ప మహనీయుల -వర ప్రసాదం గానే వుంటోంది. 

ఈ సారి - అటువంటి - మహనీయులు అంధ్ర దేశములో పుట్టాలని, పుడతారని నా  కోరిక, ఆకాంక్ష..

మనుషుల్ని, మనసుల్ని కలిపే వాళ్ళు , ప్రగతి పథంలో నడిపించే వాళ్ళు మళ్ళీ  రావాలి.

వచ్చి, ప్రతి రంగంలోనూ మనల్ని, ముందుకు తీసుకు వెళ్ళాలి.

పదండి ముందుకు, పదండి ముందుకు, 

పదండి పోదాం పై పైకి.


= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

అన్ని రహదారులూ ప్రశాంతి నిలయం వైపే.= సత్య సాయి బాబా వైపే - భాష్పాంజలులతో



అన్ని రహదారులూ రోము నగరానికే వెళ్ళుతాయి.

యిది ఆ దేశపు సామెత. ఆ కాలపు సామెత.


ఈ రెండు, మూడు  రోజులుగా -

మన దేశం లో  -

అన్ని రహదారులూ ప్రశాంతి నిలయం వైపే. 

కోట్ల ప్రజానీకం మనసులంతా  - సత్య సాయి బాబా వైపే.

వొక మహనీయుడు  మరి లేదంటే - గుండె లోతుల్లో - ఎక్కడో-
ప్రతి వొక్కరికీ , వొక వెలితి  తెలియడం అతి సహజంగా కలుగుతుంది.
కంట తడి పెట్టడం తమకు తెలియకుండానే జరుగుతుంది.

రాజకీయ నాయకులను వొక పక్క పెట్టండి.

వొక గవాస్కరు, వొక  టెన్డుల్కరు - కంట తడి పెట్టడం మీరు ముందు చూశారా. 

వారు వోడినప్పుడు కూడా  లేదు.

మరి ఈ రోజు!!

వారూ, మీరూ కంట తడి పెట్టారు కదా. 

వచ్చిన లక్షలాది మంది కంట తడి మనం మరి చూడ గలమా.

వారి గుండె ఆరాటాన్ని మరి విన గలమా!

ఆ కంట తడే సత్య సాయికి మన మౌన, శ్రద్దాంజలి.  


అందరి భాష్పాంజ లులతో - 

ఆ మహనీయుడికి 

మన నివాళులర్పిద్దాం 


= మీ

వుప్పలధడియం విజయమోహన్ 

25, ఏప్రిల్ 2011, సోమవారం

కాకినాడ = గిన్నెస్స్ రికార్డు ప్రయత్నం =వొక గంట లో =- 12 లక్షల చెట్లు నాటాలని = శుభం

కాకినాడలో గిన్నెస్స్ రికార్డు నెలకొల్పాలని ప్రయత్నం జరుగుతోంది.

జూలై తొమ్మిదవ తేదీ నాడు - వొక గంట లో - 12 లక్షల చెట్లు నాటాలని - ఉద్దేశం. 

గిన్నెస్స్ రికార్డు వొక ప్రక్కన పెడితే  - వొక్క కాకినాడ చుట్టూ -  12 లక్షల చెట్లు నాటడము,   కాకినాడకూ, పరిసరాలకూ ,మొత్తం పర్యావరనానికీ    ఎంతో మేలు కలిగించే విషయం.

కాకినాడ జవహర్ లాల్ టెక్నలాజికాల్   యూనివర్సిటీ వారు ఆ ప్రయత్నానికి దోహదముగా  వొక మోటారు సైకిలు ర్యాలీ నిర్వహించారట.

రిలయన్సు సంస్థ అధికారులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారట.

కాకినాడప్రజలారా!  తరలి రండి. ఈ ఆదర్శ వంతమైన ప్రయత్నాన్ని జయప్రదం చేయండి.

వొక్క రోజు, ఒక గంట లో కాకినాడ మారిపోగలదు. రండి మరి.

తరువాత - ఆ తరువులు పెరగడానికి కాస్త శ్రద్ధ తీసుకుంటే - మీ వూరు నందన వనం కాగలదు.

మీకు - మా శుభాభినందనలు.

విజయవాడ వారు వింటున్నారా.

చిత్తూరు వారు వింటున్నారా.

కర్నూలు వారు, మెదక్ వారు, వరంగ ల్ వారు,  నెల్లూరు వారు - మరి ఆంధ్రులందరూ   వింటున్నారా.

ప్రముఖులు విన్నారా. అధికారులు విన్నారా. నటులు, గాయకులూ విన్నారా.

అయ్యా! కాకినాడ వారికి దక్క బోతున్న ఆ  గౌరవం  - మీకూ రావాలి.

గౌరవం మాత్రమే కాదు. మన రాష్ట్రమంతా సస్యశ్యామలం గా ,కనులకు కమనీయం గా, అందముగా , హుందా గా,
ఆరోగ్యము గా  కనిపించాలి.


యిది ఆరంభం. అంతం లేని ఆరంభం.

శుభారంభం.

జరిగే మంచి పనులకు పూర్తి చేయూత నిద్దాం

= మీ

వుప్పలధడియం విజయమోహన్
 . 

24, ఏప్రిల్ 2011, ఆదివారం

సత్య సాయి బాబా - దివంగతులైనారు - కానీ - ప్రశాంతి నిలయము గా ఉన్న మనస్సులో - వారు - ఎప్పటి లాగే , ఎప్పుడూ వుంటారు

సత్య సాయి బాబా 85 ఏళ్ళ వయసులో - 

దివంగతులైనారు.

వారు అప్పుడున్నదీ అనంతపురమే. 

వారు, యిప్పుడున్నదీ "అనంత" పురమే.

వారి నివాసము అప్పుడూ ప్రశాంతి నిలయమే. 

యిప్పుడూ - ప్రశాంతి నిలయమే.


వారు చేసిన -ప్రజోపయోగ కార్యాలు - అన్నీ, యిన్నీ కావు.

వారు చెప్పిన మంచి మాటలు అన్నీ, యిన్నీ  కావు.

వారు  భక్తుల మనసులలో - 

మొలకెత్తించిన  భక్తి భావనలు అన్నీ యిన్నీ కావు.

"సంభవామి యుగే, యుగే" - అన్నట్టు మళ్ళీ వారొస్తారు.

భక్తుల కోసం - అందరి కోసం -  మళ్ళీ వారొస్తారు.

అంత వరకు - భక్తుల మనస్సులో - ఎప్పటి లాగే వుంటారు.

మనస్సు - ప్రశాంతి నిలయము గా ఉన్నంత వరకు - వారందులో - ఎప్పుడూ వుంటారు .

వారి లాగా ప్రశాంత మైన ముఖాలతో,  వారి లాగా చిరునవ్వుతో - వున్న   వారందరిలో - వారు - ఎప్పుడూ వుంటారు 

= నమస్సుమామ్జలులతో

వుప్పలధడియం విజయమోహన్  
 

Anna Hazare= అన్నా హజారే = లోక్ పాల్ బిల్లు డ్రాఫ్టింగు కమిటీ = సభ్యులపై దుమ్ము / బురద చల్లేవారిని ఆపాలి = ఎలా ఆపాలి?


శ్రీకృష్ణ దేవ రాయల వారి కాలం లో - 
ఒక సారి - 
పెద్ద గిన్నె  లోకి  ప్రజలనంతా పాలు పోయ్యమంటే -
వొకరికి తెలియకుండా వొకరు - యిలా ప్రతి వొక్కరు -
గిన్నె లోకి - నీళ్ళు మాత్రమే పోసారట.


ఆంగ్లము  లో  కరప్షన్ అన్న పదానికి కల్మషము అని ముఖ్యమైన  అర్థము చెప్పు కో వచ్చు.

పాలు పొయ్య వలసిన చోట నీళ్ళు పొయ్యడము - మనస్సులో వున్న కరప్షనా కాదా? 

కానీ - అది ఆ కాలము.నీళ్ళు పోసారు. వొట్టి చెంబు పొయ్య లేదు.  బురద పొయ్య లేదు. విషం కలప లేదు.

అయినా  - ఈ కల్మషము చాల (లేదా  కొద్ది ) మంది మనుషుల్లో - కొద్ది, కొద్ది గా అప్పటినుండే వుందని మనకు తెలుస్తూ వుంది. 

ఈ కాలములో - ఈ కల్మషము - లంచగొండి తనము గా మారి - మూడు పువ్వులు, ఆరు కాయలుగా దిన దిన ప్రవర్ధమానమవుతున్న సంగతి  మన కందరికీ తెలుసు.

వందల నుండి, వేలు, వేల నుండి లక్షలు, లక్షల నుండి కోట్లు, కోట్ల నుండి వేల కోట్లు, మరి యిప్పుడు లక్షల కోట్లకు - ఈ లంచగొండి తనము ఎదుగుతున్న విషయము - మన కందరికీ తెలుసు.

లంచము తీసుకునే వారికి సిగ్గు, భయమూ రెండూ లేకుండా పోతున్న దన్న సంగతి కూడా మనకు తెలుస్తూ  వుంది.

ఈ ముళ్ళ చెట్టు పెరుగుదలను ఆపాలి - ఆపక పోతే ప్రమాదము చాలా, చాలా ధగ్గరికొచ్చేసిన్దన్న - మాట కూడా మనకందరికీ తెలుస్తూనే వుంది.

అన్నా హజారే గారి ఉద్యమము అందుకే.

ఈ సమయములో అన్నా హజారే గారి ఉద్యమానికి - చేయూత నివ్వ కుండా - 

సభ్యులందరిపైన- దుమ్ము , బురద చల్లడము - పాలు పొయ్య వలసిన చోట నీళ్ళు పొయ్యడము కాదా?

పోసే వారి ఉద్దేశము  ఏమిటి?

భారత దేశములో- కరప్షన్ మూడు పువ్వులూ, ఆరు కాయలు గా వుండాలనేనా?

ఆ చట్టము 42 ఏళ్ళు గా, మన పార్లమెంటు లో మగ్గుతూ వుంది. బయట లంచగొండి తనము పెరుగుతూ వుంది.

అయినా - ఆ కమిటీ వారిపై - అదీ యిప్పుడే - ఎప్పటి విషయానో లేవ దీసి బురదల్లే వారి అసలు ఉద్దేశము - తేట తెల్లమే గదా!  

మరి - వీరినెలా ఆపడము?

వొక్కటి.

గౌరవనీయులైన  మన ప్రధాన మం త్రి గారు -  ఈ సభ్యులందరికీ  కాబినెట్ మంత్రి ప్రతి పత్తి ని, హోదాని కలిగించి,  ఈ  సమయంలో, వారికి, మంత్రులకున్న - ఇమ్మ్యునిటీ  కలిగించాలి. వారిపై - చిల్లర కేసులు పెట్ట  గలిగే  పరిస్థితి తీసేయ్యాలి. 

అంతే కాదు. రెండవది ఏమిటంటే -

ఈ బురద చాల్లే వారు ఎప్పుడు ఆపుతారు? 

వారిపై కూడా - దేశము లోని ప్రతి వొక్కరు బురద చల్లాలి. అప్పుడే ఆపుతారు.

ఈ చట్టం వచ్చే వరకూ - సభ్యుల పై ఏ వొక్కరూ బురద చల్ల కుండా ఆపాల్సిన బాధ్యత అందరిపైనా వుంది.

తిట్ట వలసిన వాడిని, తిట్ట వలసిన సమయము లో  తిట్టక పోతే - కొట్టడానికి వస్తాడు. 

అర్జునా, గాండీవం ధరించు. అమ్ములను సంధించు. 

మిగతా పని నేనే చేసేస్తాను .  నువ్వు నిమిత్త మాత్రుడివే. అన్నాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడు యిప్పుడూ ఎక్కడో, సిద్ధం గానే వుంటాడు. ప్రతి అర్జునుడూ తన  గాండీవాన్ని  ధరించాలి  మరి.

అహింసా పోరాటమయినా - అహింస గానే అయినా   -   పోరాటము జరగాలి కదా?


లంచగొండి తనము పైన పోరాడే వాళ్ళను కాపాడక పోతే -

లంచగొండి తనము పై పోరాటము వుండదు.

యిందులో - మీ వంతు మీరు చేస్తున్నారా? ....  చేస్తున్నారా? ... చేయండి సార్.

 అదండీకథ .

= మీ

వుప్పలధడియం   విజయమోహన్   

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

భూమి దినం - Earth day 2011 = 22nd, ఏప్రిల్, 2011 = (Telugu) : భూమి కేమీ ప్రమాదము లేదు= ప్రమాదం మనిషికే= Munchukosthonna Paramaadham Manake = yemi cheyyaali?

22 , ఏప్రిల్ నెల, 2011
 =రెండు రకాలుగా ప్రాముఖ్యం కలిగింది.
జీసస్ క్రీస్తు   గారు శిలువ వేయబడిన రోజు - 

వారిని - ప్రపంచమంతటా తలుచుకొనే రోజు.

జీసస్ క్రీస్తుచెప్పిన మంచి మాటలు మరో సారి మననం చేసుకునే రోజు.

రెండవది - 22 , ఏప్రిల్ ఎర్త్ దినము గా (భూమి దినం - అందాము) ప్రపంచమంతటా పిలువ బడుతూ వుంది.

భూమికి రక రకాలయిన ప్రమాదాలు ముంచుకొస్తున్నట్టు - వాటినుండి, భూమిని మనం కాపాడవలసిన బాధ్యత మనపై వున్నట్టు, మనం అనుకుంటున్నాము.

అందుకే ఈ భూమి దినాన్ని గురించి అనుకుంటున్నాము.

నిజానికి - భూమి కేమీ ప్రమాదము లేదు. నమ్మండి.

భూమి - సూర్యుని చుట్టూ , తన చుట్టూ తిరుగుతున్నంత కాలం; తన భాద్యత తను చేస్తున్నంత కాలం, భూమి కేమీ ప్రమాదం లేదు.

ప్రమాదం మనిషికే. 

బుద్ధి వున్నా ఉపయోగించకుండా వున్న చెట్ల నన్నిటినీ నరికేయడము,   కొత్త చెట్లు నాటక పోవడము లాంటి పనులు చేస్తూ, తన పై, తానే, మన్ను పోసుకుంటున్న మనిషికే ప్రమాదం ముంచుకొస్తున్నది.

మనం విడిచే గాలిని చెట్లు పీల్చుకుంటాయి. దాన్ని, మళ్ళీ , మనకోసం, ఆక్సిజన్ తో నింపి, మనకందిస్తుంది. అంటే

-  మన వొక ఊపిరి తిత్తి ఆ చెట్టన్న మాట. నిజానికి, సగం ఊపిరి తిత్తే మనలో వుంది.

అంతేనా. చెట్లు మనకు, ఆహారాన్నిస్తుంది. మనకోసం వర్షాన్ని తెప్పిస్తుంది.

వర్షాన్నిస్తుంది. నీళ్ళు తెప్పిస్తుంది.

యింతెందుకు. చెట్లు లేకుండా - మనిషి లేడు. 

మనిషి లేకున్నా - చెట్ల కేమీ ప్రమాదం లేదు.

మన వొక ఊపిరి తిత్తి, మన వొక (అర్ధ  భాగం) గుండె, మన మెదడులో అర్ధ భాగం - ఆ చెట్టు - అన్న విషయం మనకు అర్థమవుతున్నదా.

అర్థమయితే చెట్లు వివక్షత లేకుండా నరికేస్తామా?


మీ వొక ఊపిరి తిత్తి, వొక (అర్ధ  భాగం)  గుండె, మెదడులో అర్ధ భాగం - మీరే నరికేస్తారా?

2012 వ సంవత్సరం, భూమి దినం వచ్చే లోగా, వొక పది చెట్లైనా, మనం ప్రతి వొక్కరూ -  నాటుదామా!

మన కోసం - 

భూమాత సంతృప్తి పడితే - మనం బాగుంటాము.

లేదంటే - భూమి బాగానే వుంటుంది - మనమే భాగుండము.

అదండీ విషయము.

= మీ
వుప్పలధడియం విజయమోహన్
 


21, ఏప్రిల్ 2011, గురువారం

FIGHTING CORRUPTION = DR.JAYA PRAKASH NARAYAN = ANNA HAZARE = RAM DEV JI = MODI = UNITY OF THE ORDINARY PEOPLE = (TELUGU BLOG)

లంచ గొండి తనం పూర్తిగా పోవాలి - అని మన ఉద్యమం.

మనదంటే -  మన అన్నా హజారే గారి దన్న మాట.

ఆయనకు డెబ్భై ఏళ్ళు పైబడింది. ఎన్ని రోజులైనా  అన్నము తినకుండా వుండగలరు.

గాంధేయ  వాదులంతా  అంతే.

ఆయనకు గుజరాతు ముఖ్య మంత్రి మోడీ గారి పాలన నచ్చింది. 


కానీ, ఆయన చుట్టూ వున్నా వారిలో మోడీ గారు కొంత మందికి నచ్చ లేదు.

కాబట్టి - మోడీ గారు ఏమి చేసినా - ఏమి చేసినా సరే - వీరికి నచ్చదు.

గుజరాతు ప్రజలంద రికీ  నచ్చినా - వీరికి నచ్చదు.

అయితే - అన్నా గారికి నచ్చినా - నచ్చినట్టు - చెప్పకూడదు.

సరే =  వీరికి, నక్సలై ట్లు  ఎందుకనో నచ్చారు. మోడీ గారు నచ్చ లేదు.

అన్నా గారికి మోడీ గారు నచ్చారు. నక్సలై ట్లు నచ్చారో, లేదో మనకు తెలీదు.

ఎవరికి, ఎవరైనా , ఏదైనా  నచ్చొచ్చు. పక్కనున్న వాళ్లకు కూడా వారే నచ్చాలి, అవే నచ్చాలి - అంటే ఎలా?

అదే - నక్సలైట్ల వాదం. వారికి నచ్చింది - మనకూ నచ్చాల్సిందే. అంతే మరి.

మన చాలా మంది రాజకీయ నాయకుల మనసులోని, వారి వాదము కూడా ఇదే.

వీరూ, వారూ - పెద్ద తేడా లేదు - డబ్బు విషయం తప్పితే.

మన జయప్రకాశ్ నారాయణ గారు కూడా - దాదాపు వొంటరిగా - లంచ గొండి తనం ను - ఎదిరించి పోరాడుతున్నారు.  వారు మనకు (నాకు) నచ్చారు. మంచి వాడని, మన లాంటి వాడని. 

అయితే - మంచి వాళ్ళ వెనుక పోవాలంటే - మనలో, చాలా మందికి భయంగానే వుంటుంది.

మంచి తనమంటే మాటలా?
మీకు రేషన్ కార్డు కూడా రాధు. ఆసుపత్రి లో  మందులివ్వరు. పాసు పోర్ట్ రాధు. 

స్కూలు లో మీ వాడికి అడ్మిషన్ దొరకదు.

మీరు సగటు మనిషి.

సగటు మనిషులు  లంచ గొండి కాదు;  నక్సలై ట్లు కాదు. రాజకీయ నాయకులు కానే కాదు.

సాధారణంగా బ్రతికేస్తే చాలనుకునే వాడు.

సగటు మనిషికి ధైర్యాన్నివ్వ గల విద్య, నాయకులు, పరిస్థితులూ  మనకు కావాలి.

అందుకు తత్క్షణ మందు వొక్కటే! సగటు మనుషులందరూ - వొకటి కావాలి.

వారానికి వొక సారి - ఎక్కడైనా కలిసి, కాస్సేపు మాట్లాడుకోండి. 
అంతా కలిసి - వొక చిన్న మీటింగు పెట్టండి - మేమంతా (మనమంతా) వొక్కటే - అనండి  - చూదాము.

వెయ్యి మంది వొక ఆఫీసరు ముందు నిలవండి - ఆయన లంచము అడుగుతారేమో చూద్దాం.

రామ్దేవ్జీ  గారు చెప్పేదీ అదే. అన్నా హజారే గారు చెప్పేదీ అదే. గాంధీ గారు ఎప్పుడో చెప్పిందీ అదే.

సగటు మనుషులు కలిస్తే - పెద్ద మనుషులవుతారు.

అదండీ కథ,

= మీ వుప్పలధడియం  విజయమోహన్

ఆవు పేడ vs బిరియాని = ఏది మంచిది? = COW DUNG vs BIRIYAANI = = (TELUGU)



ఆవు పేడ  మంచిదా, బిరియాని మంచిదా - అంటే, ఎ వైధ్యుడైనా ఆవు పేడే మంఛిది  - అని సమాధానము చెబుతారు.

మీరు ఇంటర్నెట్ గూగుల్ లో  కౌడంగ్ ప్రాపర్టీస్ అని అడిగి చూడండి -మీ జన్మ ధన్యమయి పోతుంది.

ఈ భూ ప్రపంచము లో ఆవు పేడంత  మంచి వస్తువు మరేదీ లేదని తెలిసి పోతుంది.

కానీ కొన్నికొన్ని బిరియానీలు  ఆవు పేడ లాగా వున్నాయని - ఆ మధ్య వొకాయన సెలవిచ్చారట 

అంత గొప్ప మాట అనాలంటే - మాటా?

అనుభవ శాలి కాక పోతే - . అన గలరా?

అయినా - ప్రపంచం లో ఎవరి అభిప్రాయాలు  వాళ్ళవి.
మీరు గద్వాల్ చీరలు , పంచలు ధరించి అలంకార ప్రియులు గానూ ఉండొచ్చు . వేంకటగిరి చీరలు, పంచలు  ధరించి  సీదా సాదా గానూ ఉండొచ్చు..
.
మీ ఇష్టాలు మీవి. నా ఇష్టాలు నావి. ఎక్కడి వారైనా ఎలాగైనా ఉండొచ్చు.

ఎవరో చెప్పారని - మీ ఇష్టాలు, మీ పద్ధతులు మీరు మార్చుకోవాలని లేదు.

అయినా - కొన్ని ఇష్టాలు - మన చేతిలో లేవు.  మనం చెయ్యాలనుకున్నా చెయ్య లేము.

విశ్వామిత్రుడు త్రిశంకుడిని దేహముతో బాటుగా  స్వర్గానికి పంపించాలని చూసాడట. కుదరలేదు.  అయినా -

విశ్వామిత్రుడు త్రిశంకుడిని దేహముతో బాటు "శాశ్వత బ్రహ్మ లోక నివాస సిద్ధి రస్తు"  అని అనలేదు.

 అందుకు కావలసిన "తతంగమూ" చెయ్య లేదు.

ఎందుకంటే - ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో, నిర్ణయించే వాడు వేరే వున్నాడు. మనం కాదు.

మనము చేయ గలిగింది వొక్కటే. 

సర్వే జనాః సుఖినో భవంతు - అనగలం. అంతే! 


= మీ

వుప్పలధడియం  విజయమోహన్

19, ఏప్రిల్ 2011, మంగళవారం

అన్యాయం సహించొద్దు ! = జయ ప్రకాష్ నారాయణ గారు = నాలుగు ఎద్దులు = వొక్క సిం హము =ఏది ఎలా గెలుస్తుంది?



"అన్యాయము చేయను.
అన్యాయానికి బలి కాను.
నా ఎదురుగా అన్యాయము జరిగితే సహించను."

అన్నారు జయ ప్రకాష్ నారాయణ గారు ఏదో వొక  టి వి  ప్రోగ్రాము లో.
బాగుంది. 

కానీ, అన్యాయాన్ని సహించని వారందరూ - ఏకమై వొకటిగా పోరాడితే ఫలితము బాగుంటుంది.



నాలుగు ఎద్దులు వొక్కటైతేనే అన్యాయమనే  సిం హాన్ని జయించొచ్చు.  

వొక్కటి గా కాకుండా, విడి విడి గా వుంటే - అన్యాయమనే సిం హము - మన లాంటి  ఎద్దుల నందరినీ కబళిం చేస్తుంది.

అదే జరుగుతోంది -    మన పవిత్ర భారత దేశములో.

అన్యాయాన్ని  సహించని వాళ్ళం తా వొక్క త్రాటి పైన నిలవాలి.

అలా నిలిస్తే, అన్యాయము సమసి పోవడం ఖాయం.

 అలా నిలవనంత కాలం - మనం సమసి పోవడమూ అంతే ఖాయం.

మరేం చేద్దాం - చెప్పండి.

= మీ

వుప్పలధడియం విజయమోహన్  

16, ఏప్రిల్ 2011, శనివారం

NAA MAATA NENU VINAALI (TELUGU) = MY ADVICE, I MUST LISTEN

మన మాట అందరూ వినడం లేదు.
నిజమే.
కాని, మనమూ వాళ్ళందరి మాట వినడం లేదు కదా!
లోకం అలాగే వుంటుంది.
ఎవరి మాట వారిదే.
ఎవరి గోల వారిదే.
కాక పోతే, వచ్చిన చిక్కల్లా - నా మాట నేనే వినడం లేదు.
నాకు కావలిసిన్దేదో నాకే తెలీదు.
నేను బాగా చదివితే బాగు పడతాను.
నేను మంచి ఆహారం మాత్రమే తింటే ఆరోగ్యముగా వుంటాను.
కోపాలు, తాపాలు లేకుండా వుంటే సంతోషముగా వుంటాను.
కానీ, అలా వుండటం లేదు?
ఎందుకు?
ఎందుకు, నా మాట నేనే వినడం లేదు?
నేను ఒక్కరు కాదు.
నాలో వొద్దనే వాడొకడు; కావాలనే వాడు ఇంకొకడు వున్నారు.
వొద్దో,కావాలో తెలీని మహానుభావుడు యింకోకడున్నాడు.

ఎవడు నేను?
నేను ఎవడో తెలుసుకుంటే ఈ సమస్య సమసి పోతుంది.

మీ = 
వుప్పలధడియం విజయమోహన్









ఎన్నో ముఖ్య విషయాలలో ఎంపిక మీదే! = మీ ఇల్లు నందన వనం కావడమో, చప్పగా వుండడమో - మీ ఎంపికే.


జీవితం లో చాలా విషయాలలో మనకు  ఎంపిక సామర్థ్యము యివ్వ బడ లేదు.
నిజమే.

మీ  పుట్టుక విషయములో  - మీ పాత్ర ఏమీ లేదు. ఏవేవో జరుగుతాయి. మీరు పుడతారు.

అంతే.

మీ అభిప్రాయాల్ని అడిగే వారెవరూ లేరప్పుడు. 

మీకు పుట్టే వారి విషయం లోను - మీకు పెద్దగా ఎంపిక లేదు. 

ఎంపికుంటే - మీ కొడుకో, కూతురో - ఎలా వుం డాలనుకుంటున్నారో  -  అలా మీరు పుట్టించే వారు కారా?

మీరనుకుంటున్నట్టు - వాళ్ళు పెరగడమూ లేదు. చదవడమూ లేదు. 

మీ మనసులో - ఎన్నో రకాల అసంతృప్తి. 

చాలా విషయాల్లో - మీకు   ఎంపిక సామర్థ్యము లేదు.   ఆ అధికారము మీకు యివ్వ బడ లేదు.

కానీ-

ఎన్నో ముఖ్య విషయాలలో మీకు ఎంపిక వుంధి.
ఈ క్షణంలో సంతోషంగా ఉండాలా? ఆ ఎంపిక మీదే!
ఈ క్షణంలో ప్రతి వొక్కరి తోనూ స్నేహంగా ఉండాలనుకోవడం - అధి  మీరు ఎన్నుకోవాల్సిందే!


 ఈ క్షణంలో - మీరేం మాట్లాడాలో -  అధి కూడా మీరు ఎన్నుకోవాల్సిందే!


మీ భార్య తోనో, భర్త తోనో - ప్రేమ పూర్వకం గా రెండు మాటలు మాట్లాడాలని ఎవరు అనుకోవాలి?

మీరే!  ఆ ఎంపిక మీదే!

అదే ఎంపిక - వారూ చేసుకుంటే -   మీ యింట్లో - ఆనందం - వెల్లి విరియదా!


మీరు వారి కేం చేస్తారో - ఏమేం చేస్తారో - అది మీ ఎంపిక - వారు దానికెలా ప్రతి స్పందిస్తారో -  అది వారి ఎన్నిక.

అదే విధంగా -వారు మీకేం చేస్తారో,  ఏమేం చేస్తారో - అది వారి ఎంపిక - మీరు   దానికెలా ప్రతి స్పందిస్తారో -  అది మీ  ఎన్నిక.

మీ ఇల్లు నందన వనం కావడమో, చప్పగా వుండడమో,  నరకంగా మారడమో - మీ (యిద్దరి) ఎంపికే.


= మీ


వుప్పలధడియం విజయమోహన్

7, ఏప్రిల్ 2011, గురువారం

భయము = నిర్భయము = సంతోషం = = TELUGU BLOG



మనిషి కున్న అతి పెద్ద జబ్బు ఏమిటి?
కాన్సరా? ఎయిడ్సా?  హృద్రోగామా?

ఇవేవీ కాదు.

మనిషిని పట్టి అతిగా బాధించే అతి పెద్ద జబ్బు పేరు "భయం".

భయం లేని వాణ్ణి ఏ జబ్బూ ఏమీ చేయ లేదు.

భయపడే వాడికి ఏ జబ్బైనా విపరీతంగా బాధ పెట్టేదే!

శరీరానికి జబ్బులు వస్తాయి. రాకుండా వుండవు.

భయం మాత్రం మీకు రాకుండా చూసుకుంటే  మీ జీవితం హాయిగా  గడిచి పోతుంది.

మనిషి కున్న మహా భయం చావును గురించి, అట. మనిషికే గాదు, ప్రతి ప్రాణికీ చావంటే - భయం. కానీ - చాలా ప్రయోగాల ద్వారా తెలిసింది ఏమిటంటే - భయం లేని వాడికి, చావు చాలా సులభం, కష్టం లేనిదీ అని.

పతంజలి మహర్షి యోగ సూత్రాల ద్వారా - తెలిసేది ఏమిటంటే - చావు అంటే భయమూ,  బ్రతుకు  పై తీపి - ఈ రెండింటిని     "అభినివేశం" అంటారు ఆయన - వీటికి కారణం - అజ్ఞానం లేదా అవిద్య  అని చెప్పారు.

ఎప్పుడో, రాబోయే దాన్ని గురించి యిప్పుడు భయపడడం, దుహ్ఖించడం - చాలా అవివేకం అంటారు ఆయన.  ఈ భయానికి విరుగుడు - ధ్యానం అంటారు ఆయన.

ధైర్యమున్న చోట భయముండదు. భయమున్న చోట ధైర్యముండదు. భయానికి కారణం అజ్ఞానమే.

మీకు ఏది కావాలో - మీరే నిర్ణయం చేసుకోవాలి. ధైర్యమా? భయమా?

హిమాలయాల్లో, వొంటరిగా వున్న వారికి  లేని భయం - మీ యింట్లో - మీకు  ఎందుకు ?

మనిషికున్న గొప్ప వరం - ఈ క్షణం.

ఈ క్షణం లో మనం వున్నాం. మరో క్షణంలో మనమే కాదు - ఎవరుంటారో ఎవరికీ తెలీదు.

ఈ క్షణంలో - మీరు సుఖంగా వుండ గలిగే, సంతోషంగా వుండ గలిగే అవకాశం పూర్తిగా వుంది.

మీ రోగాలను పక్కన పెట్టండి.మీ సమస్యల నన్నిటినీ  పక్కన పెట్టండి.

ముఖ్యంగా మీ అన్ని భయాలనూ మూట కట్టి పక్కన పెట్టండి - లేదా సముద్రంలో వేసెయ్యండి.

అవి ఏవీ మీకు అక్ఖర లేదు.

ఈ క్షణం మీది. దీన్ని మీ నుండి ఎవరూ తీసేయ్య లేరు.

ఈ క్షణం  లో ఆనందంగా వుండండి.

పాట పాడండి. డాన్సు చెయ్యండి. ఈల వెయ్యండి. నవ్వండి. ఆడండి. హాయిగా మాట్లాడండి.

సంతోషంగా వుండే మరే పని అయినా చెయ్యండి.

భయాన్ని మాత్రం దగ్గరికి రానివ్వకండి. అది పనికిరాని అలవాటు మాత్రమే.

ధైర్యం గా వుండే వాడే సంతోషంగా వుండగలడు.


సంతోషంగా వుండడం అలవాటుగా మార్చుకోండి.

రోగాలు మనల్ని ఏమీ చెయ్య లేవు.

ఒక్క జీవిత కాలం మనం సంతోషంగా ఉందాం.

= మీ

వుప్పలధడియం  విజయమోహన్
  





3, ఏప్రిల్ 2011, ఆదివారం

UGADHI = KHARA NAAMA SAMVATHSARAM = HEARTIEST GREETINGS

రెండు వేల పదకొండు, ఏప్రిల్ నెల నాలుగవ తేదీ.
ఈ  రోజు  ఖర నామ సంవత్సర ఉగాది.
అందరికీ నా శుభాకాంక్షలు.
ప్రతి సంవత్సరమూ మంచిదే.
కొంత మంచి జరుగుతుంది. కొంత చెడ్డ.
మన మనసు మంచిదయితే ప్రకృతి కూడా మంచి గానే స్పందిస్తుంది.
మంచి నాయకులను ఎన్నుకుంటే మంచి జరుగుతుంది.
ఏది ఏమైనా మనం చేయ గలిగిన మంచి కొంత ఎక్కువగానే చేద్దాం.
సంవత్సరం మంచి గానే వుంటుంది.
ఏప్రిల్ ఒకటవ తేదీ నాడు - పలమనేరు (చిత్తూర్ జిల్లా) లో, ధ్యానం గురించి ఒక సత్సంగాన్ని - నన్ను నిర్వహించమని అడిగారు. 
దాదాపు తొంభై  మంది  ధ్యాన సాధకులు వచ్చారు, ఆ సంత్సంగానికి.
ఆ సత్సంగాన్ని గురించి మీరు వయ్స్ స్పిరిచువాల్ఐడియాస్ .బ్లాగ్స్పోట్.కం  లో చదవచ్చు.

చిన్న ఊర్లలో యింత  మార్పు ఇంత సులభంగా వస్తుందని -చాలా సంతోషంగా వుంది.

మంచి చేసే వాళ్ళు  చాలా మంది వున్నారని మనం  గ్రహించ వచ్చు.

మీ-
వుప్పలధడియం విజయమోహన్