8, నవంబర్ 2013, శుక్రవారం

పతంజలి యోగ సూత్రాలు - అద్భుతమైన -experimental , experiential - సైన్స్ - మొదటి ప్రయోగం చేసి చూడండి

పతంజలి యోగ సూత్రాలు 

అద్భుతమైన


సైన్స్  అండ్ టెక్నాలజీ


భారత దేశం లో పుట్టిన అద్భుత శాస్త్ర విజ్ఞానాల్లో పతంజలి యోగ సూత్రాలు చాలా, చాలా ముఖ్యమైనది. ఇదేదో, హిందూ ధర్మానికి, మతానికి  చెందినది అనుకుంటే చాలా పొరపాటు. ఇదొక అకల్మషమైన, ఆకలుషితమైన  శాస్త్ర పరిజ్ఞానమే కాని, కేవలం వొక్క మతానికి సంబంధించినది మాత్రం కానే కాదు.

కాక పోతే - సాధారణంగా, పాశ్చాత్య శాస్త్ర పరిజ్ఞానం - దేహాన్ని, కొంత వరకు మనసును, పరిసరాలను మాత్రం పరిశోధిస్తుంది. అదీ, మన పంచేద్రియాలకు అందినంత వరకు మాత్రమే. పంచేద్రియాలకు అందనిది  ఏదీ వారికి శాస్త్రం కాదు.  కాని, యోగ శాస్త్రము, ఈ హద్దులను దాటి ముందుకు వెడుతుంది. మనసును గురించిన పచ్చి నిజాలను, మన ముందుంచుతుంది. ఆ మనసును, శరీరాన్ని, ఎలా మన అధీనం లోకి తేవాలో వివరిస్తుంది. ఆ తరువాత - మనసుకావల ఏముందో - దాన్ని ఎలా చేరుకోవాలో చెబుతుంది.

ఇందులో- నమ్మకాలు, అప నమ్మకాలతో నిమిత్తం లేదు. యిది చేస్తే - అది అవుతుంది. కారణము-కార్యం (కాజ్ - ఎఫెక్ట్ ) సంబంధమే వుంది యోగం లో - సైన్స్ లాగా.

యోగా - హిందూ  చేసినా, క్రిస్టియన్  చేసినా , కమ్యూనిస్టు చేసినా, అసలే నమ్మకమూ లేని వాడు చేసినా - వచ్చే ఫలితం వొక్కటే .

పతంజలి ఈ యోగాన్ని కనిబెట్టిన వాడనడం తప్పు . యిది ఎప్పటి నుండో,   మన దేశం లో, మన మధ్య వుంది . వొక కాలం లో దీన్ని, పతంజలి మహర్షి  సూత్రాల లాగా రాశాడు . శ్రీకృష్ణుడు, తన భగవద్ గీతలో కూడా దీన్ని గురించి విపులంగా చెప్పాడు. ఆయనకు ముందు కూడా, వసిష్టుడు లాంటి వారు, దీన్ని గురించి ఎంతో రాసారు.

మన త్రిమూర్తులు ముగ్గురూ యోగ నిష్ణాతులే. వారు దేవతలూ అనవచ్చు; మహా యోగులూ అనవచ్చు.  ఈశ్వరుడిని  యోగీశ్వరుడని, విష్ణువును యోగేశ్వరుడని,  బ్రహ్మను యోగ బ్రహ్మ అని వర్ణిస్తూ అంటారు. వారు ముగ్గురూ, ఎప్పుడూ, యోగ ముద్రలో వున్నట్టు, ఆవిష్కరింప బడ్డారు.  కాబట్టి, యోగం ఎప్పుడు పుట్టింది  అన్న వాదన అనవసరం.   ఆద్యంతాలే లేని సైన్స్,  యోగం.

దీన్ని గురించి - ఆంగ్లంలో, నా బ్లాగ్ -   www.wisespiritualideas.com  లో విశదంగా, రాయడం జరిగింది .

మనిషికి - అంటే, మనకు, ఎల్లలే లేనటువంటి  ఆనందం  కావాలి. ఆ అనందం ఎప్పుడూ మనతో వుండాలి. అది మనందరి  కోరిక . అవునా!

మరి ఆ ఆనందం ఎక్కడ వుంది ? ఎలా మనకు వస్తుంది ? ఎలా ఎల్లప్పుడూ మనతో వుంటుంది ? యిటువంటి ప్రశ్నలకన్నిటికీ, యోగ శాస్త్రం లో సరైన సమాధానాలు దొరుకుతాయి .

అయితే, యిదొక ప్రాక్టికల్ సైన్స్. యిదొక experimental , experiential సైన్స్. అంటే, దీన్ని మనం పరిశోధించి, అనుభవ పూర్వకంగా తెలుసుకోవాల్సిన, అనుభవించ వలసిన పరిజ్ఞానం - అంతే కాని, మన అనుభవం లేకుండా, యిందులో  దేన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. యోగం లో ఉత్తి పాండిత్యం ఏ ఉపయోగమూ లేదు. ఇది మీరు చెయ్యాల్సిన, క్రియా పూర్వకమైన చదువు. ఇందులో, మీకు ఎంత వొచ్చో - అన్నది - మీ పాండిత్యం పైన ఆధార పడదు. మీ సాధన పైన ఆధార  పడి వుంటుంది. అయితే,యిదేదో చాలా కష్టమైనా విషయం - అనుకోవాల్సిన పని లేదు. చేస్తూ వస్తే, మనం చదివే ఏ సబ్జెక్టు కంటే కూడా - యిది సులభమే . ఇంతకు మించి, యిప్పుడు చెబితే , సాధారణ చదువరులకు అర్థం కాదు.  కాబట్టి  ముందు ముందు తెలుసుకొందాం.  ఆంగ్లం లో రాసిన దాన్ని కాస్త  క్లుప్తంగా, కాస్త విశదంగా - యిక నుండి చూద్దాం .

సూత్రం అంటే - రెండు, మూడు అర్థాలు వున్నాయి కదా. ముందు వాటితో, వెనుక వాటిని కలిపి ముడేసి వొకటిగా చేసేది సూత్రం. విషయాలను వొక దారంపై, వొక త్రాటిపై బంధించేది సూత్రం. వొక పెద్ద సమగ్ర విషయాన్ని,  సూక్ష్మంగా-అది యెక్కడైనా, ఎప్పుడైనా, అర్థమయ్యేటట్లు చెప్పడం కూడా సూత్రం యొక్క లక్షణం. పతంజలి గారు యోగ లక్షణాల్ని, విధానాన్ని, వుపయోగాల్ని, గమ్యాన్ని - అన్నింటినీ, ఇలాంటి సూత్రాల రూపంలో, సంక్షిప్తంగా, చెప్పారు . యిదంతా ఎప్పుడూ వున్నవే. సూత్రాల రూపంలో , చెప్ప బడటం, యిది మొదటి సారి . 

పంతజలి ఎవరు? ఎప్పుడు పుట్టాడు ? ఎవరి కొడుకు? ఇది ఎందుకు రాసాడు? ఆయన గురువెవరు ? ఇలాంటి  ప్రశ్నలకు అంత సులభంగా సమాధానాలు దొరకవు. మన అతి ప్రాచీన శివాలయాల్లో - పతంజలి మహర్షి  శిల్పం, వ్యాఘ్రపాదుడి శిల్పం గర్భ గృహం బయట ఇరువైపులా వుంటాయి. విష్ణు ఆలయాల్లో  జయ, విజయుల శిల్పాల లాగా. అంటే - రెండు వేల సంవత్సరాల ముందు వారికి, యిప్పుడు మనకు పతంజలి ని గురించి తెలియనివి,  మరెన్నో విషయాలు  తెలుసునని తెలుస్తుంది. నడుము నుండి పై భాగము రుషి ఆకారమూ,  క్రింద భాగము పాము ఆకారం తో వున్నాయి పతంజలి శిల్పాలన్నీ. అసలు పతంజలి అన్నది వొక వ్యక్తి  పేరు కాదని, వొక రుషి పరంపర యొక్క ఉప నామము - అని కూడా ప్రతీతి . శర్మ, శాస్త్రి, లాగా. 

అయినా, మన మహర్షులకు, తమ పేరు, ప్రఖ్యాతుల గురించి, ఎప్పుడూ ఆలోచన లేదు. పేరు, ప్రఖ్యాతుల వలన వారికి వొరిగేదేమీ లేదు.  దాన్ని గురించి వారు మాట్లాడ లేదు.  అలాగే, శాశ్వతానందం గురించి పరిశోధించే వారు కాబట్టి, మిగత విషయాల గురించి - యిందులో, పెద్దగా, మాట్లాడ లేదు.

పతంజలి  సూత్రాలు  చదివే వారికి, శ్రీకృష్ణుడు గీతలో రాసిన ధ్యాన యోగం లాంటివి మరికొన్ని కూడా తెలిసి వుండాలి. భగవాన్ బుద్ధుడు, మహావీరుడు లాంటి వారు కూడా ధ్యాన యోగాన్ని చాలా బాగా పాటించిన వారుగా మనకు తెలుసు. కానీ, పతంజలి యోగాన్ని పూర్తిగా, ఆకళించుకున్నారా అంటే - చెప్పడం కష్టం. వుండొచ్చు. వుండక పోవచ్చు. యిప్పుడు కూడా ఆ మతాలలో, గొప్ప ధ్యాన నిష్ణాతులు వున్నారు. మన మతం లోనూ వున్నారు . అంటే, వారు హైందవులని ముద్ర వెయ్య నక్కర లేదు . యోగ నిష్ణాతుడు, అన్ని కుల మతాలకు, అతీతుడుగా మారిపోతాడు. అలా కాని వాడు యోగ నిష్ణాతుడు కాలేడు.

చాలా మంది, యోగా అంటే ప్రాణాయామమనో, ఆసనాలనో, కొద్ది పాటి ధ్యానమనో అనుకుంటూ వుంటారు. యిందుకు కారణం - చాలా యోగా స్కూళ్ళలో - యివి మాత్రమే చెప్పడం. సరే. యివన్నీ కూడా యోగా లో వొక ముఖ్య భాగమే. కాక పొతే, యోగాలో పతంజలి ప్రకారం - యోగాలో ఎనిమిది అంగాలు వున్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార,  ధారణ, ధ్యాన, సమాధులు - ఈ 8 అంగాలు.  మళ్ళీ - సమాధి లో ఎన్నో రకాలు.

శ్రీ కృష్ణుడు దీని లో కొన్ని విషయాలు - కొంత క్లుప్తంగా, కొన్ని విషయాలను, బాగా విశదీకరించి గీతలో    చెప్పాడు. అంతకు ముందు కూడా, ఎంతో మంది ఋషులు, దీన్ని ఎన్నో రకాలుగా చెప్పారు. అంటే - పతంజలి రాసింది  క్రొత్త సైన్స్ కానే కాదు. అంతకు ముందు వున్నదే . ముఖాముఖి గా వస్తూ వున్న దాన్ని   క్రోడీకరించి సూత్ర రూపంలో  మన ముందు వుంచాడు. 

సూత్ర ప్రాయం గా వున్న వాటిని - కొంత విశదీకరించి, అందులో, సాధకుడు చెయ్య వలసినవి ఏమిటి, ఎలా చెయ్యాలి, ఏది (ఎందుకు) చెయ్య కూడదు - చెయ్య వలసిన వాటి వలన వచ్చే లాభాలేమిటి - అన్నవి యిక్కడ కొంత వివరిస్తాను.

కొంత మంది మనస్సులో - యిది ఎందుకు నేర్చు కోవాలి; వూరికే కళ్ళు మూసుకుని కూర్చుంటే టైం వృథా అవుతుంది కదా   అనుకుంటూ వుంటారు. కళ్ళు మూసుకుని, వూరికే కూర్చోవడం అంత కష్టమైనా పని, అంత లాభకరమైన పని మరొకటి లేదు. అదెలా తెలుస్తుంది  మీకు?

మీచేత వొక చిన్న ప్రయోగం చేయిస్తాను. మొదటి ప్రయోగం యిదే . నా వందలాది HR  క్లాసుల్లో యిది చేయించాను. తప్ప కుండా మీరూ చెయ్యండి .

ఆఫ్రికా లో వొక గొరిల్లా కోతి వుంది . దాని ఎత్తు 6 అడుగులు. నల్లటి శరీరం. శరీరమంతా నల్లటి బొచ్చు. దానికి వొక పెద్ద తోక . 5 అడుగుల పొడవు. తోక చివర, తెల్లటి వెంట్రుకల కుచ్చు. పెద్ద, గుండ్రటి, ఎర్రటి కళ్ళు . పెద్ద  తాటాకంత చెవులు. చెవుల చివర్లు కూడా తెల్లటి తెలుపు. కాళ్ళ కొనల్లో, పెద్ద వేళ్ళు; వేళ్ళ చివర పెద్ద గోళ్ళు . గీకితే, చర్మంతో బాటు, ఎముకలూ ఊడి వచ్చేస్తాయి. యింత భయంకరమైన గొరిల్లా వుంది  ఆఫ్రికాలో .

ఇది మరొక్క సారి గుర్తుంచుకోండి.  

ఆఫ్రికా లో వున్న గొరిల్లా. దాని ఎత్తు 6 అడుగులు. నల్లటి శరీరం. నల్లటి బొచ్చు . 5 అడుగుల పొడవున్న పెద్ద తోక, . తోక చివర, తెల్లటి వెంట్రుకల కుచ్చు. పెద్ద, గుండ్రటి , ఎర్రటి కళ్ళు.  తాటాకంత చెవులు. చెవుల చివర్లు తెల్లటి తెలుపు. కాళ్ళ కొనల్లో, వేళ్ళు, పెద్ద గోళ్ళు . గీకితే, ఎముకల కూడా ఊడి వచ్చేస్తాయి . యిదీ ఆఫ్రికా గొరిల్లా స్వరూపం .

ఇప్పుడు మీరు చెయ్యాల్సింది చాలా చిన్న పని . 2 నిముషాలు కళ్ళు మూసుకోండి . యిది తప్పకుండా చెయ్యండి. యోగా అనేది మనం చదవాల్సింది మాత్రమే కాదు; చెయ్యాలి. మనమే చెయ్యాలి .

కాబట్టి , యిప్పుడు - మీరు, మీ మనసులో ఏ విషయాన్ని గురించైనా  అనుకోవచ్చు. అసలేదీ అనుకోక పొతే - మరీ మంచిది . వొకే వొక విషయం - అదే, ఆ ఆఫ్రికాలోని  నల్ల గొరిల్లాను గురించి మాత్రం ఈ - 2 నిముషాలు - మీరు దయచేసి అనుకోకండి. మరే విషయమైనా ఫరవాలేదు.

ప్రపంచంలో ఎన్ని విషయాలున్నాయి? వాటిల్లో, ఏదైనా అనుకోండి - ఈ వొక్క గొరిల్లా గురించి తప్ప. అసలీ గొరిల్లా ను మీరు చూడనే లేదు కదా. దాంతో మీకే పనీ లేదు కదా.  దాన్ని గురించి అనుకోక , మరే విషయమైనా అనుకోండి.

యిక్కడ 2 నిమిషాలు చదవడం ఆపి - తప్పకుండా కళ్ళు  మూసుకోండి......  యిదే, మీకు యోగాలో ప్రప్రథమ పాఠం.  2 నిమిషాల తరువాత - మెల్లగా కళ్ళు తెరవండి . ఏమైంది ?

ఏదైనా సరే ..... తరువాత భాగంలో - 2 వ వ్యాసంలో చూడండి ... మీ కొన్ని ప్రశ్నలకు  సమాధానాలు దొరుకుతాయి , మీరు అడగాలనుకున్న ఏ ప్రశ్నైనా అడగండి. వాటికి, కొన్నింటికి వెంటనే, కొన్నింటికి,  ,కాస్త తరువాత సమాధానాలు యివ్వడం  జరుగుతుంది .

యిది చదివి, యిది చేసిన వారు యోగ సాధకులు గా మారారు. మారిపొయారు. అంతే.   మీ లక్ష్యం యిప్పటికి సాధ్యం అనబడుతుంది . మీరు చేసే ప్రయత్నాలను సాధన అంటారు. మీకు ఈ యోగ మార్గం లో వొక్కక్క సమయంలో (దాదాపు ప్రతి 2-3 నెలలకూ ), ఏదో వొక  ఆనంద జనకమైన మార్పు వస్తూ వుంటుంది. పతంజలి యోగ మార్గంలో - దీన్ని అష్టాంగ యోగము - క్రియా యోగము - అని కూడా అంటారు - దీన్లో, అడుగడుగునా, యోగ సాధకుడికి ఏదో వొక అనూహ్యమైన బెనిఫిట్   వుంటుంది.  అది యితరులకు తెలియక పోవచ్చు . నిశితంగా యోచించే సాధకుడికి తెలుస్తూనే వుంటుంది. కాబట్టి - ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడు యోగా నేర్చుకోవాలి. మీకు వున్న సంతోషాలేవీ పోవు ; అలా పోతే, వాటి స్థానంలో, అంతకు మించిన సంతోషం తప్పక వస్తుంది.  పతంజలి చెప్పినట్టు, శ్రీకృష్ణుడు చెప్పినట్టు, సులభంగా చేస్తూ పోవడమే  మన పని.

యిక తరువాతి వ్యాసం చూడండి .

సర్వే జనాః  సుఖినోభవంతు

మీ -

వుప్పలధడియం విజయమోహన్







4 కామెంట్‌లు: