25, నవంబర్ 2013, సోమవారం

పతంజలి యోగ సూత్రాలు 4 వ వ్యాసం సమాధి పాదం 3 వ సూత్రం 4 వ ప్రయోగం ద్రష్ట కావడానికి మొదటి మెట్టు

  

పతంజలి యోగ సూత్రాలు 
4 వ వ్యాసం 
 
పతంజలి  సూత్రాల పై  రాస్తున్న ఈ  వ్యాస మాలికకు - మీకందరికీ పునః స్వాగతం.  మీరు - మొదటి వ్యాసంలో  నల్ల గొరిల్లాను  2 నిమిషాలు మరిచి పోయే ప్రయోగం ; రెండవ వ్యాసంలో రిలాక్సేషన్; మూడవ వ్యాసం లో శ్వాస మీద ధ్యాస ప్రయోగం చేసారు కదా. చేసి వుంటే మీరు యోగ మార్గం లో ముందుకు వెడుతూ ఉన్నారన్న మాటే. ఇక నుండి, మీరూ యోగ సాధకులే. యోగ మార్గం లో వున్న వారే. వొక్కొక్క వ్యాసంతో, వొక్కొక్క అధ్యయనం తో - ముందుకు  వెళ్ళండి. 

సమాధి పాదం - సూత్రం -3

తదా ద్రష్టుహ్ స్వరూపేవస్థానం  

తదా  - అంటే, అప్పుడు అని అర్థం ; అప్పుడు అంటే ఎప్పుడు? సాధకుడైన మీరు - మీ చిత్త  వృత్తులను  నిరోధించినప్పుడు;  యిదే కదా, రెండవ సూత్రంలో యోగం అన్న శబ్దానికి నిర్వచనంగా , అర్థంగా చెప్పుకున్నాము . చిత్త  వృత్తులంటే ఏమిటో  క్రిందటి వ్యాసంలో కొద్దిగా చూశాము. మన మనసులో కదిలే వూహలు,ఆలోచనలు, భావనలు,  ప్రేమలు,దుఃఖాలు - అన్నీ చిత్త వృత్తులే.  సాధకుడైన మీరు వాటిని నిరోధించ గలిగితే , లోనికి రాకుండా ఆప గలిగితే - అప్పుడేమవుతుంది.   

మనసులో వృత్తులు కదులుతూ వుంటే - మీరు వాటి వెనుకనే వెళ్లి పోయే ప్రమాదం వుంది. అదే సాధారణంగా మీరు చేస్తూ, వాటి వెనుక వెడుతూ వున్నారు కూడా .

అది దుఃఖపడమంటే పడుతూ వున్నారు. కోపం చేసుకోమంటే, కోపం చేసుకుంటూ వున్నారు. అది పెట్టే కష్టాలన్నిటినీ అనుభవిస్తున్నారు.  మనసు గతి యింతే ; మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికీ , సుఖం లేదంతే - అని సరి గానే అన్నారు వొక సినిమా  కవి.

మనసు వొక కల్లు  త్రాగిన, ముల్లు గుచ్చుకున్న, తేలు కుట్టిన కోతి లాంటిది . కామ, క్రోధ , లోభ , మోహ, మద, మాత్సర్య , భయాలను - మన ఆనందాన్ని పూర్తిగా హరించే అంతః శత్రువులు  అన్నారు - ఆర్యులు .  వాటి నివాస స్థలము మనసు .

ఆర్యులు అంటే -  మన పూర్వీకులలో పూజింప దాగిన వాళ్ళు, అని అర్థం - అంతే కాని, ఏదో ఇరాన్, జర్మనీ నుండీ  వచ్చిన వారనో, లేదా, తమిళనాడులో అనుకునే లాగా వొక కులం వారనో కాదు. సరే . ఈ కామ క్రోధాదులన్నీ మనసులో వచ్చేవే .మనసులో పుట్టేవే . బుద్ధి మాట వింటే యివి రావు . 


మనసును నిరోధించే ఈ మార్గంలో మనం చేసే కృషినే - చిత్తవృత్తి   నిరోధః అన్నారు పతంజలి మహర్షి . ముందు ముందు,యిది పూర్తిగా విశదీకరించ నున్నారు పతంజలి . 

సరే . పతంజలి చెప్పినట్టు చిత్తవృత్తి  నిరోధం చేశామే అనుకోండి . దాన్నే యోగం అని ఆయన 2 వ సూత్రంలో అన్నారు కదా. అది చేసేస్తే , చెయ్య గలిగితే  ఏమవుతుంది?

అప్పుడు, ద్రష్ట అనబడే వాడు - తన నిజ రూపంలో ప్రతిష్టింప బడతాడు; ఆసీనుడవుతాడు; ఆవిష్కారమవుతాడు - అని అంటారు  పతంజలి .  ద్రష్ట అంటే - అన్నిటినీ చూసే వాడు, సాక్షిగా వుండే వాడు; వేటికీ లొంగక , వేటి వెనుకా, తానూ పరుగులెత్తక - తన స్థానంలో, తన స్వరూపంలో, తాను  వుండి అన్నిటినీ గమనించే వాడు.  ఎవరీ ద్రష్ట ? ఎవరీ సాక్షి? యిది  తెలుసుకోవడానికే  యిన్ని యోగ సూత్రాలు, యిన్ని ప్రయాసలు, యిన్ని ప్రయోగాలు . 

యిప్పుడు నేను చెప్పొచ్చు . ఆ ద్రష్ట  ఎవరో కాదు  - మీరే , అని . అందులో ప్రయోజనం ఏమీ లేదు . యోగం అనేది ఎవరో చెప్పి, ఏదో పుస్తకమో బ్లాగో చదివి తెలుసుకునే విషయం కానే కాదు . మీరే, ప్రత్యక్షంగా, అనుభవ పూర్వకంగా తెలుసుకునేది. 

సరే. ద్రష్ట మీరే అని చెబుతాను అనుకోండి . - మీరే అంటే ఏమిటో మీకు ఎలా తెలుస్తుంది . మీ స్వరూపము , మీ స్వస్థానము, అంటే - ఎలా అర్థమవుతుంది ? కాదు. అయితే - , ఎప్పుడు ఎలా యివన్నీ అర్థమవుతుంది? మీరు, నేను  చెప్పే ప్రయోగాలు, అన్నీ మీ పైనే, చేస్తూ వెళ్ళాలి .  ముందుకు వెళుతూ వుంటే - మొదట  ఏది మీరు కాదో , తెలిసిపోతుంది . తరువాత, ఏది మీరో తెలిసి పోతుంది - కనీసం అలా అనిపిస్తుంది . ఎప్పుడో , మీరు, నిజమైన  మీరై  పోతారు . అప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం వుండదు . అదండీ, సూక్ష్మం గా కథ.

యిప్పుడొక చిన్న ప్రయోగం చెయ్యండి : మొదట యిది రెండు సార్లు చదవండి . తరువాత  చెయ్యండి :

యోగ - ప్రయోగం - 4 ( ఆనందపు మూడవ మెట్టుకు - చిన్న ప్రయోగం ) 

హాయిగా  కూర్చోండి. నేల పై నైనా  సరే . కుర్చీ లో నైనా సరే. మంచం మీదైనా సరే . మీరు కాళ్లెలా పెట్టుకుంటారో , మీ యిష్టమే. 
మీ చేతులు,  మీ వొళ్ళో పెట్టుకోండి. ఎడమ చేతిలో కుడి చెయ్యి వేసి హాయిగా, శరీరం లో టెన్ షన్ లేకుండా, వీపు మాత్రం కాస్త నిటారుగా - హాయిగా, కూర్చోండి .   యిప్పుడు వొక చిన్న ప్రయోగం చెబుతాను . చదివేసి తరువాత చెయ్యండి .
ఈ  సారి, మీరు వొక శుభ్రమైన అద్దం ముందు కూర్చోండి. పెద్ద నిలువుటద్దమైనా మంచిదే. మీ ముఖం మాత్రం బాగా కనిపించేటంతటి  అద్దమైన పరవా లేదు . అది నిటారుగా వుండాలి . దాని ఎదురుగా,మీరు నిటారుగానే కూర్చుని -   వెంటనే, 'అద్దం చూడక ముందే' కళ్ళు మూసేసుకోండి.  యిప్పుడు, మీ మనసులో, మీ ముఖం ప్రతిబింబం ఎలా వుంటుందో  వూహించుకోండి. అద్దంలో కాదు - మీ మనసులో, మీ మూసిన కళ్ళ ముందు.    మీరు ఎంత మాత్రం, మీ ముఖాన్ని మీ మనసులో చూసుకో గలరో - అంత మాత్రం చూసుకోండి -వొక్క నిమిషం పాటు. ఇప్పుడు కళ్ళు తెరవండి . అద్దంలో మీ ముఖం చూడండి . 

 అందులో  హాయిగా మీ ముఖం చూస్తూ కూర్చోండి.  ముఖం మాత్రమే సుమా. జుట్టు నుండి , చుబుకం వరకు,  గడ్డం క్రింద వరకూ,  బాగా చూడండి . కానీ, ముఖాన్ని దాటి పోకండి. అయిదు నిమిషాలు చూడండి . రెప్పలార్పితే తప్పు లేదు. మామూలుగా, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎలా వుంటే, వున్నంతలో, మీ ముఖం బాగుంటుందో, అలా వుండండి. ముఖ కవళికలు, ఎక్కువగా మార్చ కండి. ఎలా వున్నా, మీరు బాగానే వున్నారు - అనే భావన మనసులో పెట్టుకోండి.  మధ్యలో, 30-50 సెకన్లు , కళ్ళు మూసుకున్నా ఫరవా లేదు. మళ్ళీ తెరిచి మీ ముఖమే చూడాలి . అంతే . యిప్పుడు కొంత సేపు మీ కళ్ళను మాత్రం చూడండి. ముఖమంతా కాదు. మీ కళ్ళు ఆనందంగా వున్నాయా - కనీసం మిమ్మలను మీ కళ్ళు ఆనందంతో చూస్తున్నాయా ? మిమ్మల్ని మీరు సంతోషంతో చూడాలి. యిదీ ఈ ప్రయోగం మొదటి వుద్దేశం. అంతకు మించి మరో ప్రయోజనం కూడా వుంది. 

మీకు తెలుసా ? ప్రపంచంలో, ఏ యుగం లోనూ, యిప్పటి వరకు , మీ లాంటి ముఖం, మీ కళ్ళు  లాంటి కళ్ళు  వున్న వారు ఎవరూ పుట్ట లేదని ? అంతే కాదు. యిక ముందు పుట్ట బోరని.   ఈ ప్రపంచంలో మీ లాంటి వారు మీరు మాత్రమే . మరో ఏడుగురు  వుంటారు,  అన్నదంతా - కథలే . అవన్నీ తప్పు . కాస్త దగ్గరి పోలికలు వుండవచ్చు కానీ , మీ లాంటి వారు ఎవరూ పుట్ట లేదు, పుట్టబోరు - మీరు తప్ప .

అంత కంటే  ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే -  యిప్పుడు మీ  వయస్సు 16 కావచ్చు, 26 కావచ్చు . 36 లేదా 46, 56, 66, 76 ఎంతైనా కావచ్చు . యిన్ని సంవత్సరాల జీవితంలో, మీ ముఖాన్ని గానీ , మీ కళ్ళను గానీ, మీరెప్పుడూ  నిశితంగా చూడనే లేదు . మీ ముఖంలో వచ్చే మార్పులు పూర్తిగా మీకు తెలియవు . ఏదో కొద్దిగా తెలుసు . అంతే . వొక అయిదు నిమిషాలు, తమ ముఖాన్ని తాము వొక్క సారి, పూర్తిగా, నిశితంగా  చూసుకున్న వారు - ఈ ప్రపంచం లో , చాలా తక్కువ మంది వున్నారు. యిప్పుడు - ఈ ప్రయోగం చేసి వుంటే - ఇలాంటి అతి కొద్ది మంది లో మీరు  వొకరైనారు . 

ఈ ప్రయోగం ఎందుకు . మీరు మీకే ద్రష్ట , లేదా, సాక్షి కావాలిగా; కనీసం మీ ముఖం మొదట మీకు తెలియనివ్వండి.

యిప్పుడు అద్దం  ముందే కూర్చుని కళ్ళు మూసుకోండి;  2-3 నిమిషాలు కనీసం . మీ మూసుకున్న కళ్ళ ముందు, మీ ముఖం మీకు స్పష్టంగా కనిపించాలి . కనిపించక పోతే , కళ్ళు తెరిచి, 30 సెకన్లు , అద్దంలో, మళ్ళీ మీ ముఖం చూడండి . మళ్ళీ కళ్ళు మూసుకోండి . యిప్పుడైనా మీ ముఖం స్పష్టంగా మీ మూసుకున్న కళ్ళ ముందు  కనిపించాలి. యిలా ఎన్ని సార్లు చేస్తే, మీ ముఖం, మీ కళ్ళు, మీకు బాగా తెలిసి  వస్తుందో, అన్ని సార్లు, ఈ ప్రయోగం చెయ్యండి . తరువాత, అద్దం  అక్కర లేదు. కళ్ళు మూసుకుంటే - మీకు, మీ ముఖం, మీ కళ్ళు బాగా తెలియాలి. 

మీకు - యిక చాలు అనిపిస్తే, మెల్లగా, మెల్లగా, కళ్ళు తెరవండి . మీరు ఎప్పుడు కళ్ళు మూసి తెరిచినా, మీ మొహం మీదకు వొక చిరునవ్వు రావాలి.  మీ పరిసరాలంతా , మీ చిరు నవ్వుతో బాటు - చూడాలి. 

ఆ తరువాత  మీరు   మీ పనులు చేసుకోవచ్చు .

- 4 వ  ప్రయోగం  పూర్తయ్యింది  

2 సార్లు యీ ప్రయోగం  పూర్తిగా చదివేయండి. అర్థం చేసుకోండి. ఇప్పుడు  కూర్చుని - ఈ ప్రయోగం చెయ్యండి.


ఈ ప్రయోగం మీరు ఎప్పుడైనా, కానీ మీ యింట్లోనే , ఎక్కడైనా చెయ్య వచ్చు. యిది చేస్తే, ద్రష్ట , అంటే , సాక్షి కావడానికి సన్నద్ధులవుతున్నారు. బహిర్ముఖులు గా వుండే మీరు, మెల్లగా, మెల్ల మెల్లగా కొంత అంతర్ముఖులవుతున్నారు. 

మీరు ఈ ప్రయోగం - సరిగ్గా, రిలాక్స్ గా, సులభంగా,  చేసి వుంటే - యిప్పటికే మీరు , ప్రపంచం లోని 99 శాతం మనుషుల కంటే , మూడు పెద్ద ఆనందపు మెట్లు ,  పైకి ఎక్కేశారు . మీకు నా అభినందనలు . 
అయిదో వ్యాసంలో , మరో ఐదో ప్రయోగంతో , మళ్ళీ కలుద్దాం . అంత వరకు - ఈ నాలుగో ప్రయోగం అప్పుడప్పుడూ చేస్తూ వుండండి . 
= మీ 
వుప్పలధడియం విజయమోహన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి