8, నవంబర్ 2013, శుక్రవారం

పతంజలి యోగ సూత్రాలు - 2 వ వ్యాసం - ఆనందపు మొదటి మెట్టుకు - వొక చిన్న ప్రయోగం - సమాధి పాదం - సూత్రం -1


పతంజలి యోగ సూత్రాలు 
2 వ వ్యాసం

పతంజలి  సూత్రాల పై  రాస్తున్న ఈ  వ్యాస మాలికకు - మీకందరికీ పునః స్వాగతం.  మీరు రెండు నిమిషాలు  ఆ నల్ల గొరిల్లాను తలుచుకోకుండా వుండ గలిగారా? లేదు. నాకు  తెలుసు . యోగ నిష్ణాతులు  కాని వారెవరూ - యిది చెయ్యలేరు. 

యోగ నిష్ణాతులు చెయ్య గలరా? చెయ్య గలరు. యోగ నిష్ణాతులు మాత్రమే - నిరంతరం  ఆనందంగా వుండ గలరు. యోగ నిష్ణాతులు మాత్రమే - తమ మనస్సును,  తమ ఆలోచనా ప్రవాహాన్ని, తమ అధీనంలో వుంచుకో గలరు.  యోగ నిష్ణాతులు మాత్రమే - తమ శరీరంలో  జరిగే ప్రతి మార్పును దర్శించ గలరు ; వాటిపై ఆధిపత్యమూ సాధించ గలరు. యోగ నిష్ణాతులు మాత్రమే - పంచ భూతాలపై కూడా తమ ప్రభావాన్ని చూపగలరు. 

ఇవన్నీ నేను  చెప్పేవి కావు. పతంజలి మహర్షి చెప్పినవే. శ్రీకృష్ణుడు చెప్పినవే. మహాదేవుడైన శివుడు చెప్పినవే . యోగ మార్గంలోని ప్రతి వొక్కరూ - ఎంతో కొంత చేస్తూ వున్నవే - వారి వారి యోగాధ్యయన శక్తి ని బట్టి.  

ఇక నుండి, మీరూ యోగ సాధకులే. యోగ మార్గం లో వున్న వారే. వొక్కొక్క వ్యాసంతో, వొక్కొక్క అధ్యయనం తో - ముందు  వెళ్ళండి.

పతంజలి మహర్షి ఈ యోగ సూత్రాలను 4 అధ్యాయాలు, లేదా, పాదాలుగా విభజించారు . మొదటిది - సమాధి పాదంయిక్కడి  నుండీ , యోగ సూత్రాలను - వొక్కటొక్కటిగా చూద్దాం

సమాధి పాదం - సూత్రం -1

అథ యోగానుశాసనం 


అథ - అంటే, యిప్పుడు. ఇప్పుడు అనే పదానికి, ఎంతో మంది వ్యాఖ్యాతలు, ఎన్నో రకాలుగా అర్థాలు చెప్పుకున్నారుఇప్పుడు - అంటే, నిన్న కాదు. రేపు కాదు. అంటే - భూత కాలమూ కాదు; భవిష్యత్కాలమూ కాదు

సాధకుడా, యిన్నాళ్ళూ నీకు తెలీని గొప్ప విషయం, రేపటికి వదిలి పెట్టకుండా, యిప్పుడే - తెలుసుకుందాం, రా - అని వొక అర్థం

సాధకుడా, నీవు, యిప్పుడే, విషయం గ్రహించడానికి అర్హుడయ్యావు. అందువలన, యోగాన్ని యిప్పుడు తెలియ జేస్తాను అని మరో అర్థం. యోగ విద్య నేర్చుకోవడానికి, అదీ గురు ముఖంగానే నేర్చుకోవడానికి కొన్ని అర్హతలున్నాయి. ముందు, ముందు - అవి మరింత విశదంగా వివరిస్తాను. ఇప్పటికి, యిది తెలుసుకోవాలనే ఆకాంక్ష, యీ విద్య పట్ల గౌరవం, గురువు పట్ల గౌరవం వుండడం ముఖ్యం అని మాత్రం అర్థం చేసుకోండి .  

అయితే యివి చాలవు. మీ జీవితంలో - మీరు ఎన్నో విద్యలు నేర్చుకొని వుండవచ్చు. ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి వుండ వచ్చు. ఎన్నో గొప్ప పదవులు , బిరుదులూ పొంది వుండ వచ్చు. కానీ, అవి - మీకు  మాత్రం ఆనందం, ఎంత కాలం యిచ్చింది - అన్న విషయం మీరు పరిశోధించి వుండాలి. జీవితంలో, ఆనందాలేవీ - ఎక్కువ కాలం వుండలేవు. రాజుకైనాబిచ్చ గాడి కైనా, ధనికుడికైనా , ధన   హీనుడికైనా ,గొప్ప బుద్దిమంతుడికైనా, మంద మతి కైనా - ఆనందము, అనే జీవన లక్ష్యం వొకే దూరం లో వుంటుంది.  

నిజానికి, ముకేష్ అంబానీ గారి కంటే, డాక్టర్ మాన్ మోహన్ సింగు గారి కంటే, నరేంద్ర మోడీ గారి కంటే, మీలో ఎంతో మంది - ఆనందం గా వుంటూ వుండొచ్చు ; లేదా, లేకనూ పోవచ్చు. అది మీ సంపద పై గానీ, మీ బుద్ధి కుశలత పై గానీ, శారీరక బలం పై గానీ, పదవులు, ప్రఖ్యాతుల పై గానీ ఆధార పడి లేదు. ఇది మీరు తెలుసు కున్న రోజు - నాకు, నిజంగా, నా జీవిత లక్ష్యమైన, నిరంతరమైన ఆనందం కావాలి - అని మీరు అనుకున్న రోజు - మీకు యోగా వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం వస్తుంది

యోగా వొక్కటే - మీకు అత్యధికమైన, నిరంతరమైన, సంతృప్తి ఇవ్వగలదు. మీరు పెద్ద కారు కొన్నా, బంగాళా కొన్నా, యం.పీ. అయినా, మినిస్టర్ అయినా - యోగా యిచ్చే లాంటి ఆనందం, ఆ అనందం  యిచ్చే సంతృప్తి మీరు  పొందలేరు. ఏదో కొంత ఆనందం మిగతా వాటిలో కలిగినా అది ఎక్కువ రోజులు మీ వద్ద వుండదుఏ వస్తువు యిచ్చే ఆనందమైనా మీనుండిఅతి కొద్ది రోజుల్లోనే, దూరం గా వెళ్లి పోతుంది.  మళ్ళీ, మరొకటి కావాలి . దాని తర్వాత మరొకటి కావాలి. ఏదీ, పూర్తి  సంతృప్తీ యివ్వదు; నిరంతర సంతృప్తీ యివ్వదు . ఏ వస్తువైనా, మనిషైనా - ఎంత సంతృప్తి యిస్తారో, అంత అసంతృప్తినీ యిస్తారు. మీ జీవితంలోనే, యిప్పటికే - మీకు యిది అనుభవమై వుండాలి. ఇది అనుభవ పూర్వకంగా మీరు అర్థం చేసుకున్న రోజు, తెలుసుకున్న రోజు - మీరు యోగా కు దగ్గర కావాలి

మీరు చూడొచ్చు - చాలా మంది గొప్ప యోగా గురువుల దగ్గర, ఎంతో మంది విద్యా వంతులైన, మంచి పదవులలో వున్న యువకులు, యువతులు   లక్షల సంఖ్యలో చేరి పోతూ వున్నారు. బయట వున్న వారు, ఏమిటీ  వీరి మూర్ఖత్వం  అనుకుంటూ వుంటారు. రాజకీయాలు, మీడియాఇలాంటి వాటిలో వున్న వారికి, యిది అసలు బోధ పడదు . గురువులు వీరినేదో పాడు చేస్తున్నట్టు, వారి వద్దకు పోయిన వారికి అసలు బుద్ధి లేనట్టు - అనుకుంటూ వుంటారు. యోగా గురువులు - అంటేనే - వారికి వొక తేలిక భావము, చులకన భావమూ వున్నాయి. దానికి తగినట్టు, కొంత మంది - గురువులే లేని గురువులు, యోగా అంటే - ఏమిటో అసలు తెలీని గురువులు తయారయ్యారుఉత్త మాటకారి తనము, కాషాయ వస్త్రాలు, గడ్డాలు - వేష ధారణ తో మోసాలూ చేస్తున్నారు . యిటువంటి వారి గురించి ఆది శంకరుల వారి శిష్యులైన - తోటకాచార్యులు బాగా చెప్పారు. గడ్డాలు, శిఖలూ పెంచే వారు కొందరు, పూర్తిగా గొరిగే వారు కొందరు, కాషాయ వస్త్రాలు ధరించే వారు కొందరు - అన్నీ పొట్ట నింపడం కోసం వేసే వారు ఎందరో - అని. సరే . యిప్పుడు, పొట్ట కూటి కి మాత్రమే   కాక, డబ్బు కోసం, సెక్సు కోసం - ఇలాంటి వేష ధారణలు చేసే వారు ఎందరో.  

వారి ని పక్కన పెడితే - మన దేశంలో - ఎంతో మంది గొప్ప గురువులూ వున్నారు . 

వొక్కటి మాత్రం గుర్తుంచు కోవాలి. కనీసం - పతంజలి యోగ సూత్రాలు,  భగవద్ గీత చదివి అర్థం చేసుకోని వాడు, తానుగా, ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానాలు చెయ్యని వాడు - యోగా గురువు అని చెప్పుకుంటే , అతడి దగ్గరికి వెళ్ళ కండిఅలాగే - యోగా తప్ప - మరేదో మీకు (పదవులు, సంపదలు , శత్రు నాశనం లాంటివి) కలిగిస్తాననే వాడి దగ్గరికి అసలు వెళ్ళ  కండి.  

అథ - అంటే, యిప్పుడు . యిప్పుడు మీకు యోగ అనే అనుశాసనం కావాలి. అనుశాసనం అంటే క్రమ శిక్షణ , డిసిప్లిన్  అని చెప్ప వచ్చు. యిది కూడా, మీరు మీకై ఎంపిక చేసుకున్న క్రమ శిక్షణ. అంటే, వొక పధ్ధతి ప్రకారం   వుండాలని మీరు నిర్ణయించుకున్నారన్న మాట. యోగ అనేది వొక జీవన సరళి. అత్యుత్తమమైన  జీవన సరళి . అంటే - చాలా కఠినమైనది - అని కాదు  అర్థం. సులభమైనదే. ఇప్పుడు, మన - సాధారణ  జీవన శైలి ఉన్నదానికంటే - యోగా సులభమే. కాకపొతే - కొన్ని అలవాట్లు మార్చు కోవాలి. అదేమీ కష్టం కాదు. మనసుండాలి . మనసుంటే మార్గమూ వుంది. 

దుర్గంధం లో పొర్లుతూ - అదే సౌఖ్యం  అనుకునే పందికి , శుభ్రంగా స్నానం చెయ్యమంటే - కష్టంగా వుంటుంది. దానికి నచ్చదు.  కానీ, ఎన్నో జంతువులు శుభ్రంగా స్నానం చేస్తాయి.  దుర్గంధం లో పొర్లవు . 

అలా - శుభ్రం గా స్నానం చేసిన వాడు, దుర్గంధం పోగొట్టుకున్న వాడు , మళ్ళీ ఆ దుర్గంధం లో అడుగైనా పెడతాడా ? మనమూ అంతే. వొక్క సారి యోగా అనే సుగంధ భరితమైన, శుభ్రమైన నీటిలో స్నానం చేసిన తర్వాత, యిన్నాళ్ళూ, మనం వుంటూ వున్న దుర్గంధం ఏమిటో తెలిసి వస్తుంది. మళ్ళీ  అందులో - అడుగు పెట్టం గాక పెట్టం. 

యిదే - యోగ - అనే అనుశాసనం . 

యిప్పుడొక చిన్న ప్రయోగం చెయ్యండి : మొదట యిది రెండు సార్లు చదవండి . తరువాత  చెయ్యండి :

యోగ - ప్రయోగం - 2 ( ఆనందపు మొదటి మెట్టుకు - వొక చిన్న ప్రయోగం )


హాయిగా  కూర్చోండి. నేల పై నైనా  సరే . కుర్చీ లో నైనా సరే. మంచం మీదైనా సరే . మీరు కాళ్లెలా పెట్టుకుంటారో , చేతులెక్కడ పెట్టుకుంటారో మీ యిష్టమే. 

ఎక్కడ , ఎలా కూర్చున్నా , శరీరం లో టెన్ షన్ లేకుండా, హాయిగా కూర్చోండి . 

యిప్పుడు కళ్ళు మూసుకోండి. 

2 నిమిషాలు - ప్రపంచం  గురించి పెద్దగా పట్టించుకోకండి. మిమ్మల్ని గురించి  మాత్రమే, మీ మనసులో యోచన చేయండి. మీరు ఎక్కడ కూర్చో వున్నారు ; ఎలా కూర్చో వున్నారు; మీ చేతులు, కాళ్ళు, మీ క్రింద భాగం , నడుము, వీపు, పొట్ట, మెడ , తల యివన్నీ  వొత్తిడి లేకుండా, హాయిగా ఉన్నాయా ?  వొత్తిడి - అంటే టెన్ షన్,   వుంటే , బాగా రిలాక్స్  చేయండి. బాగా రిలాక్స్ గా, హాయిగా కూర్చోండి . 

ఇప్పుడు ,మీ తల లోపల, అంటే మెదడు లోపల, వొత్తిడి వుందా - గమనించండి ; అదీ రిలాక్స్ చెయ్యండి . మెదడులోపల  రిలాక్స్ చెయ్యడం ముఖ్యం. యిది చాలా సులభం కూడా . మీరు గమనిస్తే చాలు - అది రిలాక్స్ అయిపోతుంది.  అలాగే, రిలాక్స్ గా 2 నిమిషాలు కూర్చోండి . ఎక్కువ సేపు కూర్చోవాలనిపిస్తే - కూర్చోండి . మీ యిష్టం . 2, 5, 10 నిమిషాలైనా , ఎంత సేపు మీకు హాయిగా వుందనిపిస్తే , అంత సేపు కూర్చోండి. 

మీకు - యిక చాలు అనిపిస్తే, మెల్లగా, మెల్లగా, కళ్ళు తెరవండి . మీ మొహం మీదకు వొక చిరునవ్వు రావాలి యిప్పుడు .  మీ పరిసరాలంతా , మీ చిరు నవ్వుతో బాటు - వొక్క సారి చూడండి. 

ఆ తరువాత మీరు మీ పనులు చేసుకోవచ్చు .

- 2 వ ప్రయోగం  పూర్తయ్యింది

2 సార్లు యీ ప్రయోగం  పూర్తిగా చదివేయండి. అర్థం చేసుకోండి. ఇప్పుడు  కూర్చుని - ఈ ప్రయోగం చెయ్యండి.

అథ - అంటే యిప్పుడు , యోగ - యోగం అనే ; అనుశాసనం - అంటే శిక్షణ ప్రారంభమయ్యింది - ఈ మార్గంలోకి , మీరు వచ్చేశారు. యిది చెయ్యకండా, ముందుకు పోకండి . అది ప్రయోజనం లేదు . రెండు నిమిషాలే కదా . ఏం కష్టం చెప్పండి! యోగ అనేది, ముందే చెప్పినట్టు ప్రయోగ పూర్వకమైన , అనుభవ పూర్వకమైన  సైన్సు. వొక్కొక్కటీ చేస్తూ వెళ్ళండి. 

మీరు ఈ ప్రయోగం - సరిగ్గా, రిలాక్స్ గా, సులభంగా,  చేసి వుంటే - యిప్పుడే మీరు , ప్రపంచం లోని 99 శాతం మనుషుల కంటే , వొక పెద్ద మెట్టు , వొక పెద్ద ఆనందపు మెట్టు , పైకి ఎక్కేశారు . మీకు నా అభినందనలు . 

మూడో వ్యాసంలో , మళ్ళీ కలుద్దాం . అంత వరకు - ఈ రెండో ప్రయోగం అప్పుడప్పుడూ చేస్తూ వుండండి . 

= మీ 

వుప్పలధడియం విజయమోహన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి