స్వగతం లో
కొన్ని "టర్నింగ్ పాయింట్స్ "
Dr
A.P.J. అబ్దుల్ కలాం, నాకు చాలా, చాలా నచ్చిన భారత రాష్ట్రపతి. మత
వాదాలకు, రాజకీయాలకు , అతీతుడైన మహా మనీషి గా చెప్పుకోవచ్చు . ఆయన
రాసిన "టర్నింగ్ పాయింట్స్ " అనే పుస్తకం చదువుతూ వున్నాను . అకస్మాత్తుగా -
నాలో వొక వూహ ; ప్రతి వొక్కరి జీవితం లోనూ యేవో కొన్ని "టర్నింగ్
పాయింట్స్ " వుంటాయి కదా - అని. అవి బాగు పడటానికి కావచ్చు. చెడి
పోవడానికి కూడా కావచ్చు. ప్రతి టర్నింగ్ పాయింట్ లోనూ - మనం నేర్చు
కోవాల్సిన పాఠాలు ఎన్ని వుంటాయి కదా.
అయితే
, నా జీవితంలో "టర్నింగ్ పాయింట్స్" ఏమిటి - అన్న మథనం మనసులో కదిలింది .
వస్తున్నాయ్ ; వస్తున్నాయ్ ; జగన్నాథ రథ చక్రాల్ వస్తున్నాయ్ ; అనే లా
ఎన్నో సంఘటనలు మనసులో కదిలాయి . అన్నిటికీ జీవితంలో, నా భవిష్యత్తు ను
దిద్దడం లో ఎంతో కొంత మఖ్యత్వం కనిపించింది .
జరిగినవి
మంచీ, చెడూ రెండూ వుండనే వుంటాయి . గాంధీ గారైతే చెడును కూడా యథా తథం గా
రాసుకున్నారు. అలా రాయడానికి వొక్క గాంధీ గారే సమర్థులు . ఆయన జీవితంలో
అసత్యానికి గానీ, హింస కు గానీ తావు లేదు. పొగడ్తలకు ఆయన పొంగి పోలేదు .
విమర్శలకు క్రుంగి పోలేదు. అలా మనం వుండగలమా - అన్నది నాకు సందేహమే .
కానీ, అలా వుండాలి - అన్నది మాత్రం తెలుసు . అందుకే , ఆయన మహాత్ముడు ; మనం
కాదు . మనం - అంటే నేను . మీ సంగతి నాకు తెలీదు .
కానీ
మహాత్మా గాంధీ గారి ప్రభావం - మా చిన్న తనంలో మాపై చాలానే వుండేది . నేను
పుట్టిన అసలు తేదీ 26 - 01-1950 ఆట. కానీ, స్కూల్ రికార్డుల్లో
26-12-1948 గా నమోదయ్యింది. చిన్న తనంలో, యింట్లో నేను చేసే గోల భరించ లేక -
స్కూల్ లో చేర్చారట. వయసు చాలదు కాబట్టి - కొంత ఎక్కువ వేశారు. అందువలన,
పెద్ద నష్టం ఏమీ లేదు. కానీ, ఉద్యోగంలో చేరడం, ఉద్యోగ విరమణ - రెండూ, అర్హత
కంటే - వొక సంవత్సరం ముందుగా జరిగిపోయ్యాయి. కానీ, నా పుట్టిన రోజు
మాత్రం 26 జనవరి నాడే - అప్పుడూ, యిప్పుడూ యింట్లో జరుపుకుంటాం.
స్కూల్
లో, మాకు నచ్చిన హీరో లు - గాంధీ, నెహ్రు , సుభాస్ చంద్ర బోస్ .
వొక్కొక్కరు, వొక్కొక్క విధంగా నచ్చారు . కొంత వరకు పటేల్ గారు కూడా. ఆ
కాలంలో - వారందరి గురించి గొప్పగా పాఠాలుండేవి. మరి, యిప్పుడున్నాయో లేదో
- నాకు సందేహమే. తమిళ నాడులో అస్సలు వున్నాయా అంటే - నాకు తెలీదు .
మన
జాతీయ గీతం అంటే - మాకు చాలా యిష్టం . స్కూల్లో అది పాడేటప్పుడు,
గొంతెత్తి , బిగ్గరగా, పాడే వాళ్ళం . ఆ కాలంలో - సినిమాల కెడితే , సినిమా
చివర , జాతీయ గీతం రికార్డు పెట్టే వారు . మేము, పిల్లలు మాత్రం, ఠంచను
గా, నిలబడి, ప్రక్కనున్న వారు మమ్మల్ని తోసుకుని వెడుతూ వున్నా, మళ్ళీ
సర్దుకుని - జాతీయగీతం పూర్తి అయ్యే వరకు - అటెంషన్ పోజు లో నిలబడి వుండే
వాళ్ళం . జయహే, జయహే, జయహే, జయ,జయ,జయ, జయహే - అనేటప్పుడు, గొంతు పూర్తిగా
విప్పి పాడే వాళ్ళం .
మాలో
దేశ భక్తి - వుండేదా ? తప్పకుండా వుండేది. చదువు వలన , గురువు వలన దేశ
భక్తి తప్పకుండా వస్తుంది . మరి - అవన్నీ యిప్పుడేమై పొయ్యాయి . అప్పట్లో
కూడా - కొంత మంది జాతీయ గీతం వస్తూ వుంటే - నిలబడే వారు కాదు. నిజమే.
కానీ, నిలబడే పిల్లలు ఎంతో మంది. నాకు తెలిసి, ఆ నిలబడని వాళ్ళు - నిలబడడం
లేదని, జాతీయ గీతాన్ని అవమానిస్తున్నారని - సినిమాల్లో, చివర్న , అది వేసే
పద్దతి నిలిపి వేసినట్టు - అప్పట్లో చెప్పుకున్నారు . నిజమో కాదో, నాకు
తెలీదు. కానీ, అలా, నిలిపి వుండ కూడదనేది - మాత్రం, మా పసి మనసులకు -
అప్పుడే తెలుసు. కోకొల్లలుగా దేశ భక్తులు, సత్య వ్రతులు తయారవుతున్న
దేశంలో - లంచ గొండి తనం, దేశ భక్తి లేక పోవడం, వొకరిపై వొకరికి
సుహృద్భావం లేక పోవడం - యిప్పుడు చెప్పిన, యిటువంటి చిన్న, చిన్న తప్పుల
వల్లే జరిగాయి . ఇవి- మాలోనూ, దేశం లోనూ కూడా - వొక పెద్ద టర్నింగ్
పాయింట్, అనడం లో నాకు సందేహం లేదు . దేశం తప్పు దారి పట్టింది .
సరే . అప్పట్లో - గాంధీ గారి పాఠాల్లో వున్న - ఎన్నో అంశాలు - మా మనసుల్లో తిష్ట వేశాయి.
ఆయన
పాకీ పని తమ యింట్లోనే కాక, అందరి యింట్లో చేయడానికి కూడా ముందు నిలబడే
వారట. ఇల్లు శుభ్రం గా వుండాలంటే, మన మల మూత్రాలు మనమే శుభ్రం చేసెయ్యాలి -
కానీ, అది మరెవరి కోసమో, నిలుప కూడదు - అని ఆయన సిద్దాంతం. అది ఆయన ప్రతి
రోజూ చేసే వారని - మా పాఠాల్లో వుంది.
అప్పట్లో,
మా పిల్లలందరి యిళ్ళలో , సరైన శౌచ స్థలాలు లేనే లేవు. చాలా మంది మగ వాళ్ళు
- వూరి బయట, పొలాల మధ్య , చెట్ల వెనుక వెళ్ళే వారు . ఆడ వాళ్ళు, యింటి
వెనుక ఎక్కడో వెళ్ళే వారు . బయటకు వెళ్ళ లేని మగ వారు కూడా - యింటి వెనుకే
. ఏదో చిన్న గొయ్యి త్రవ్వినా - అది యిట్టే నిండి పొయ్యేది. దాన్ని మళ్ళీ
ఎవరు ఖాళీ చేస్తారు? చెయ్యరు. అలా, యింటి వెనుకంతా - అసహ్యంగా, దుర్గంధం
తో నిండి వుండేది .
గాంధీ
గారి కథ చదివిన, వినిన- మాకందరికీ, అందులో, చాలా ముఖ్యమైన ఆరోగ్య
సిద్దాంతం, వుందని తెలిసి పోయింది. మా పెద్దలు యిది విన లేదు కాబట్టి -
వారికి తెలీదు; మేం చెప్పినా, వారి మనసుకెక్కదు . చెప్ప గల వయసూ మాకు
లేదు. అందుకని, మా అందరి ఇళ్ళ లో, గాంధీ గారు చేసినట్టు, అసలింకా బాగా
చెయ్యాలని నిర్ణయించుకున్నాం .
అంతే
- పిల్లందరూ కలిసి , ప్రతి యింట్లోనూ, మట్టితో, దొరికిన రాళ్ళతో శౌచ
స్థలాలు తయారు చేశాం . ఆ చిన్న గోడలు ఏదో కాస్త అడ్డు. అలాగే - దాని వెనుక
నున్న మల మూత్రాలను మేమే చేటలతో - ఎత్తి, దూరంగా, పారబోశాం. ఆ స్థలాలు
కాస్త శుభ్ర పడ్డాయి. మా యింట్లో - ఈ పనులు చెయ్యడంలో - అందరు పిల్లలూ
పాల్గొన్నాం . మాకెప్పుడూ - అది తప్పని అనిపించ లేదు .
అమ్మలందరూ,
పిల్లల మల మూత్రాలు ప్రేమ తో ఎత్తి పోస్తున్నప్పుడు - అదే, మేం చేస్తే
తప్పెలా అవుతుంది . అందులోనూ గాంధీ గారు కూడా అది చేసి చూపారుగా. కాబట్టి,
అది మనం చెయ్యాల్సిన కార్యమే. మేం - ఈ పనులు చాలా ఏళ్ళ పాటు, మాకు
తోచినట్టు, మాకు తెలిసినట్టు చేశాం. మా పెద్దలు ఎవరూ, ఈ మా పనికి అడ్డు
చెప్ప లేదు. ఎందుకంటే, అంతకు ముందు వారు పడుతున్న , నానా అవస్థలు మా వలన -
కాస్త తీరాయి కదా. అలాగే - ఆడవాళ్ళకు, కాస్త మరుగు, శుభ్రమైన స్థలం
దొరికాయి . మరెందుకు అభ్యంతరం చెబుతారు ?
యిటువంటి కొన్ని సంఘటనలు మా జీవితాలపై , మనస్తత్వాలపై - చాలా, చాలా ప్రభావం చూపాయి.
వొక
ఆదర్శ నాయుకుడు - మన మధ్య వుంటే - వారి ప్రభావం మనపై, ముఖ్యంగా పిల్లలపై -
బలంగా వుంటుందనడానికి - యింత కంటే నిదర్శనం కావాలా ? భావి పౌరులకు -
అలాంటి ఆదర్శ నాయకుడు ఎప్పుడూ వొకడుండాలి .
యిప్పుడెవరున్నారు
చెప్పండి? పోనీ, నిస్వార్థంగా, అలా, దేశ సేవ కై ఎవడైనా, ముందుకు వస్తే ,
అతడిని, నాయకుడిగా - మీరు, నేను అంగీకరిద్దామా ?
అలాంటి వాళ్లకు - పట్టం కట్టి, కులాలకు , మతాలకు అతీతంగా - వారికి వోటు వేసి గెలిపిద్దామా?
ఉదాహరణకు
- Dr A.P.J. అబ్దుల్ కలాం; మన జయప్రకాష్ నారాయణ్ గారు, లాంటి వాళ్ళు.
యింకా ఎంతో మంది వుండొచ్చు . పదండి చూద్దాం . మన మనస్సులో - ఈ జగన్నాథ రథ
చక్రాలు సాగనియ్యండి. ఎక్కడో వొక చోట - ఆ జగన్నాథుడే ఎదురు రావచ్చు .
మరో స్వగతం లో - మరో టర్నింగ్ పాయింట్ చూద్దాం
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి