కష్టాలు పంచుకుంటే కరిగిపోతాయి. కష్టం పంచుకుంటే, అందులోనూ, సుఖం కనిపిస్తుంది.... చాలా,చాలా.
మరి సుఖాలో? పంచుకుంటే పెరిగి పొతాయి. అది కూడా.... చాలా,చాలా.
యివి రెండూ వొక దాని తర్వాత వొకటి రంగుల రాట్నంలా రావడమే జీవితం గా పెట్టాడు దేవుడు.
కానీ కష్టాలు కరిగి పోవడానికి, సుఖాలు పెరిగి పోవడానికీ కూడా మంచి టెక్నిక్ యిచ్చాడు కదా. అదే - పంచు కోవడం అనేది - అది వాడాలి. అప్పుడు - కష్టమూ సుఖమే; సుఖమూ సుఖమే. ప్రతిదీ - మరపు రానివిగా మిగుల్చుకోవచ్చు .
కష్టాలు పంచుకోవాలంటే - మంచి స్నేహితుడు కావాలి. అది మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, అక్కో,చెల్లెలో, అమ్మో, నాన్నో, మరెవరైనా కావచ్చు . మీ కష్టాలు మీరు మరొకరితో పంచుకోవాలంటే - మొదట, మరొకరి కష్టాలు, మీరు పంచుకోవడానికీ సిద్ధంగా వుండాలి.
ఈ లోకంలో, కష్టాల్లో వున్న వారు, ఎంతో మంది వున్నారు. మీ చుట్టూ కూడా వున్నారు. మీ వాళ్లలోనే , మీ యింట్లోనే కూడా వున్నారు. దీనికి ముందటి వ్యాసంలో, మా చెల్లెలికి, నేను చేసిన కాస్త సహాయం గూర్చి చెప్పాను కదా. అందులో నేను పెద్దగా చేసిందేమీ లేదు. అంతే కాదు. దీన్ని సహాయం అనడానికి కూడా లేదు అది వొక , ముందు విస్మరించిన కర్తవ్యం మాత్రమే. చాలా సహాయాలు - నిజంగా మన కర్తవ్యాలే .
అయితే, ఆ తరువాత, రానున్న కాలంలో , మా చెల్లెలు నాకు చేసిన సహాయం, అదీ, నేను అడగ కుండానే, అది మరువ లేనిది. దానికి తర్వాత వస్తాను. ఈ సంకలన మంతా యిలా ముందు వెనుకలు గానే నడుస్తుంది - దానికీ వొక కారణం వుంది లెండి .
మా యింట్లో - అప్పట్లో కాలేజీ చదువు చదివేటంత -స్తోమతు లేదు. అసలు దేనికీ ఆర్ధిక స్తోమతు లేదు . అసలు స్కూలు చదువే - ఏదో మెరిట్ స్కాలర్షిప్ వలన - జరిగింది కానీ - లేకుంటే - ఏమో? ఎప్పుడు నిలిచి పోయేదో ?
అప్పట్లో, పోస్టల్ విభాగంలో, ఉద్యోగాలు, మార్కులు వుంటే చాలు, సులభంగా దొరికేవి. నాకు కూడా, 18 నిండీ నిండక ముందే,పోస్టల్ లోని ఆర్.యం.యస్ విభాగంలో దొరికింది. ఆ విభాగంలో క్లర్క్ ను సార్టర్ అనేవారు అప్పట్లో.
నేను ఆంధ్ర ప్రదేశ్కే చేరిన, చెన్నై లో వున్న వొక ఆఫీసు లో వేయ బడ్డాను. కానీ, పని ఆఫీసు లో కాదు. అప్పట్లో మద్రాసు - బొంబాయి మెయిల్ ట్రైన్ లో వొక పెద్ద సార్టింగ్ కంపార్ట్మెంట్ వుండేది. ఆటువంటివి యిప్పుడు లేవు. దాన్లో, దక్షిణ ప్రాంతాలనుండి (కేరళ, తమిళ నాడు ) నుండి వచ్చే కార్డ్లు, కవర్లు, ఇన్లాండ్ లెటర్లు, న్యూస్ పేపర్లు, రిజిస్టర్డ్ కవర్లు - ఇలాంటివన్నీ మద్రాసు-బొంబాయి రూట్ లో వున్న ప్రాంతాలకు సార్టింగ్ చేసి - వాటిని వేరు వేరు సంచులలో వేసి, వొక్కొక్క రైల్వే స్టేషన్ లోనూ - అక్కడి పోస్ట్ ఆఫీసు కో, RMS ఆఫీసు కో యిచ్చెయ్యాలి. వారు వెంటనే, వాటిని, ఆయా ఊర్లలో, ఎవరెవరికి చెందాలో, వారికి బట్వాడా చేసే వారు. ఆ పని నిజంగా చాలా గొప్ప పనే. మద్రాసు లెటర్లు - తిరుపతి, కడప, గుంతకల్లు లాంటి ప్రాంతాలకు వొక్క రోజులో చేరి పోయేవి . యిప్పుడు చేరడం లేదు - ఆ సర్వీసు తీసేసిన తర్వాత .
సరే. నా విషయానికొద్దాం. వొక్క రాత్రి మద్రాసు నుండి గుంతకల్లు వరకు ప్రయాణం. రాత్రి పూర్తిగా మేలుకొని సార్టింగ్ చేయాలి. గుంతకల్లు లో వొక రెస్ట్ హౌస్ లో పగలు వుండి, మళ్ళీ సాయంత్రం ఆరుగంటలకు - బొంబాయి నుండి మద్రాసుకు తిరిగి వెళ్ళే రైల్ లో మళ్ళీ అదే సార్టింగ్ పని. ఈ సారి, ఉత్తర ప్రాంతాల నుండి దక్షిణానికి పొయ్యే పోస్టల్ కవర్లు లాంటివన్నీ - మళ్ళీ సార్టింగ్ చేసి సంచులలో వేసి, ప్రతి స్టేషన్ లోనూ దింపాలి . అంటే - రెండు రాత్రులు - మేలుకుని పని చెయ్యాలి . పగలు గుంతకల్లులో, రెస్ట్ హౌస్ లో కూడా, ఏవేవో పనులు వుండేవి . యిలా రెండు రాత్రులు, మధ్య వచ్చే పగలు, మేలుకోవడం, మొదట 4-5 నెలలు నాకు చాలా కష్టంగా వుండేది . అదే కాక, ఊర్ల పేర్లు, అవి ఎక్కడ వున్నాయో, వాటికి చేరవలసిన లెటర్లు ఎక్కడ, ఏ సార్టింగ్ అర లో వేయాలో తెలియక తికమక పడే వాడిని.
ఆ సార్టింగ్ అరలను పీజియన్ హోల్స్ అంటారు. యిప్పుడు కూడా పోస్ట్ ఆఫీసుల్లో చూడవచ్చు- అలాంటి వాటిని. కానీ - ఈ ట్రైన్ లో దేశం అంతటికీ సంబంధించిన మెయిల్స్ వచ్చేవి. అది ఎలా సార్ట్ చెయ్యాలో - అ మొదటి 4=5 నెలలు నాకైతే తెలిసేది కాదు. ఆ కంపార్ట్మెంట్ లో 10 మందికి పైగా సార్తర్లు, వొక హెడ్ సార్తర్ (హెడ్ క్లర్క్), కొంత మంది సంచులు కట్టే వారు (ప్యూన్లు ) పని చేసే వారు. మామూలు ప్రయాణీకులు ఆ కంపార్ట్మెంట్ లోకి యెక్క రాదు .
యిలా దాదాపు, అయోమయంలో, నాకు కొన్ని నెలలు గడిచాయి . వొక రోజు, రాత్రి, మా హెడ్ సార్టర్ గారు , మరొక సీనియర్ సార్టర్ తో - నన్ను గురించి బాగా గేలిగా మాట్లాడాడు - ఎమండీ , మీవూరి వాడంటారు . అసలేం ప్రయోజనం లేదు చూడండి. నిద్రా మేలుకోలేడు; సార్టింగూ చాలా మెల్లగా చేస్తున్నాడు. ఏమేం తప్పులు చేస్తున్నాడో తెలీదు; మీరైనా అతనికి కాస్త బుద్ధి చెప్పండి - యిలా, ఏదేదో అనేశాడు . నాకైతే చాలా అవమానం అనిపించింది. మరి ఆ రెండు రోజులూ అసలు నిద్ర రాలేదు .
నా పని - యింకా బాగా నేర్చుకోవాలి ; కానీ యెలా ? ఎన్ని రకాల యోచనలు చేసానో - నాకే ఆశ్చర్యం వేస్తుంది, యిప్పుడు తలుచుకుంటే. ట్రైన్ దిగిన రోజు మా మద్రాసు ఆఫీసుకు వెళ్లాను. అక్కడ, మావూరాయన ఆ రోజు వున్నాడు . ఆయన్నడిగాను. ఈ ఊర్ల పేర్లు, వాటి సబ్ ఆఫీసులు, హెడ్ ఆఫీసులు, జిల్లాలు, రాష్ట్రాలు పేర్లు - యివన్నీ ఎక్కడుంటాయని. ఆఫీసులో వొక పుస్తకం వుంది. అది చూపించాడు. ఆ తరువాత కొన్ని రోజులు ఆఫీసులోనే కూర్చున్నాను. నిజానికి, నేను పోనక్కర లేదు. వొక్క ట్రిప్ ట్రైన్ లో వెళ్లి వస్తే - మూడు రోజులు యింట్లో రెస్టు వుండేది . ఆ మూడు రోజులూ ఆఫీసుకు వెళ్ళేది ఆరంభం చేశాను .
దక్షిణరాష్ట్రాలు, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాల్ లాంటి రాష్ట్రాలకు సంబంధించిన హెడ్ ఆఫీసులు, సబ్ ఆఫీసులు, బ్రాంచ్ ఆఫీసులతో సహా, అన్నీ కంఠతా నేర్చుకున్నాను. ఆ వయసులో - అలా బట్టీ పెట్టడం మాత్రం నాకు బాగా వచ్చు. నా అభిప్రాయంలో, అలా అంత పూర్తిగా, మరెవరూ నేర్చుకున్నట్టు - నేను మా డివిజన్ లో చూడ లేదు. మరెక్కడా కూడా అల్లా నేర్చుకోవడం కష్టమే.
మనసులో నాటుకున్న అవమానం అనే పెనుభూతం నన్ను ఆ పని చేయించింది .
కానీ - అది చాలదు. రాత్రిళ్ళు మేలుకోవాలి. చాలా వేగంగా సార్ట్ చెయ్యడం నేర్చుకోవాలి. మరి యివి ఎలా చెయ్యడం? మా అన్న - కెన్నెమరా లైబ్రరీ నుండి, ఆంగ్ల నవలలు తెచ్చే వాడు. అవి రాత్రి దీపం ముందు కూర్చుని చదవడం ప్రారంభించాను. లైట్లు ఆఫ్ చేసేసి చిన్న దీపం ముందు కూర్చుని చదివే వాడిని. చాలా, చాలా గొప్ప నవలలు అనబడేవి - చాలా చదివాను. అవి అర్థం కావడం లేదు. అయితే, మా యింట్లో, వొక చిన్న డిక్షనరీ వుంది. అర్థం కాని పదాలకు, అందులో వెదికి అర్థాలు, వొక చిన్న పుస్తకం లో రాసుకునే వాడిని. అది నా పాకెట్ లో పట్టే లాంటి చిన్న పుస్తకం . నేను కుట్టిందే. ఆ అర్థాలకు కూడా వొక్కొక్క సారి అర్థాలు తెలిసేవి కావు . తరువాత, వాటికి అర్థాలు ఆ డిక్షనరీ లోనే వెదికి రాసుకునే వాడిని. యివన్నీ రాత్రి పూటే. రాత్రుళ్ళు మేలుకోవాలిగా - అందుకని . యిలా రాత్రుళ్ళు మేలుకోవడం అలవాటైంది .
మరి - త్వరగా సార్ట్ చెయ్యడం ఎలా? దీనికి వొక మార్గం వెదికాను. అప్పట్లో, రోడ్లపై ఎక్కడ చూసినా పొగ త్రాగే వారు పారేసే సిగరెట్ పాకెట్లు పడి వుండేవి. వాటినన్నిటినీ, ఏరుకుని వచ్చే వాడిని. వాటి పై భాగం (దీర్ఘ చతురస్రం), క్రింది భాగం, రెండూ శుభ్రంగా కట్ చేసి , వాటి క్రింది భాగాలు తెల్లగా వుంటాయి కదా - అక్కడ, వొక వూరి పేరు, సబ్ ఆఫీసు పేరు, హెడ్ ఆఫీసు పేరు, జిల్లా, రాష్ట్రం పేరు - అన్నీ రాసే వాడిని . యిలా కొన్ని వేల కార్డులు (సిగరెట్ పాకెట్లు) తయారు చేసి, మా యింట్లోనే - నేలపై , అచ్చంగా, ట్రైన్లో ఎలా వుంటుందో అలా పీజియన్ హోల్స్ లాగా గీచుకుని, సార్ట్ చేసే వాడిని.
నేను చేసేది చూసి,నా తమ్ముళ్ళు , చెల్లెళ్ళు కూడా నాకు సిగరెట్ పాకెట్లు ఏరుకుని వచ్చి యిచ్చే వాళ్ళు .
వాటిపై - యింకా అడ్రస్సులు రాసుకుని సార్ట్ చేసే వాడిని .
యిలా యింట్లో వుండే సమయమంతా సార్టింగ్ లో గడిపే వాడిని . దీని వలన - నాకు ట్రైన్ లో సార్టింగ్ చెయ్యడం - రాను రాను చాలా సులభంగా మారింది. అప్పుడు - యింకా ఏమేం విషయాల్లో అభివృద్ది సాధించ వచ్చునో యోచన చేసే వాడిని. వొక్కొక్క వూరికి వెళ్ళే లెటర్లు అడ్రస్సులు చూస్తే - ఆ ఊర్లలో, ఏమేం వృత్తులు, పరిశ్రమలు, కాలేజీలు, స్కూళ్ళు , సంస్థలు వున్నాయో - తెలిసేవి. అయితే కొంత మంది వూరి పేరు రాసి, జిల్లా లాంటివి రాసే వారు కాదు. అవి కూడా, ఎక్కడికి పోవాలో, నాకు సులభంగా తెలిసి పోయేవి .వొకే పేరుతో, రెండు మూడు వూర్లు వున్నాయి, చాలా చోట్ల . అవికూడా, వూరి పేరు వుంటే చాలు - సులభంగా కనిపెట్టే వాడిని, మూడిట్లో ఏ వూరో !
కొన్ని నెలల తరువాత వొక విచిత్ర సంఘటన జరిగింది. వొక రోజు, మా ట్రైన్ బయలు దేరుతూ వుంది . నేను వెళ్లి తలుపు మూసి గొళ్ళెం వెయ్యాలని వెళ్లాను . సాధారణం గా నేను చేస్తాను - ఆ పని . ఏదో ఇంటరెస్ట్ .
తలుపులు మూస్తూ వుంటే - ప్లాట్ ఫామ్ నుండి, మా కంపార్ట్మెంట్ లోకి, ముగ్గురు వ్యక్తులు రావడానికి ప్రయత్నం చేశారు . నేను వాళ్లకు చెప్పాను, యిది RMS కంపార్ట్మెంట్; యిందులోకి మీరు రాకూడదు. మరో కంపార్ట్మెంట్ కు వెళ్ళండి అని .
లోపలి నుండి, మా హెడ్ సార్టర్ గారు పెద్దగా కేక వేశారు - విజయమోహన్! బుద్ధుందా లేదా. వాళ్లెవరనుకున్నావు? మొదట దారి విడు . నీ పని చూసుకో - అని .
వాళ్లెవరో హెడ్ సార్టర్ గారికి బాగా కావలసిన వాళ్ళేమో - అనుకున్నా . ఆ తరువాత - ఎవరో వచ్చి నా చెవిలో చెప్పారు - వాళ్ళెవరో తెలుసా. డైరెక్టర్ గారు, సుపరింటెండెంట్ గారు, ఇన్స్పెక్టర్ గారు అని . నాకేమీ పెద్దగా అర్థం కాలేదు . ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళే అనుకున్నా .
సరే . నా పని ప్రారంభం చేశా . నేను సాధారణం గా ప్యూన్లు సంచులు తెరిచి లెటర్లు నాకిచ్చే వరకు చూస్తూ కూర్చోను. నేనే సంచులను తెరిచి - నా పనికి కావాల్సిన లెటర్ల కట్టలు అన్నీ తీసుకుని నా పని ప్రారంభించేస్తాను . ఆ రాత్రీ అలాగే చేశాను. మద్రాసులో సంచులను తెరిచి, తరువాత స్టేషన్ వచ్చే లోపు నా పని ఎప్పుడో పూర్తి చేసేశాను. ఆ తరువాత స్టేషన్ లో వచ్చినవి, స్టేషన్ దాటక ముందే అయిపోయాయి. ఆ తరువాత, రేణిగుంట - అక్కడ ఎక్కువ లెటర్ల కట్టలు వచ్చేవి. ఆదీ అంతే . స్టేషన్ దాటక ముందే నా సార్టింగ్ అయిపోయింది .
అప్పుడు మొదలయింది.... తలుపు దగ్గర కూర్చుని వున్న డైరెక్టర్ గారు పెద్దగా ఆంగ్లం లో కేకలెయ్యడం మొదలు పెట్టారు. నేను, అందరూ వింటూ వున్నాము. కానీ - ఆయన నన్ను ఉద్దేశించి, అంటూ వున్నారని మాత్రం , నా బుర్రలోకి యెక్క లేదు .
ఆయన అంటూ వున్న మాటల సారాంశం - మీరెవరూ, ఇవేవీ అసలు చూడరా, పట్టించుకోరా ; యిలా అయితే మన డిపార్ట్ మెంటు ప్రతిష్ట ప్రజలలో నాశనం అయిపోతుంది . అటు చూడండి . ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడో ? తన యిష్టం వచ్చినట్టు, టక టక టక టక మని - ఏ అడ్రెస్సూ చదవకుండా, ఏదో వొక చోట పారేస్తున్నాడు లెటర్లన్నీ- చూడండి ? ఇదేదీ చూడకుండా, మీరేం సుపరింటెండెంట్, ఆయనేం ఇన్స్పెక్టర్. అసలా హెడ్ సార్టర్ యివన్నీ పట్టించు కోవడమే లేదు . యిదేం బాగు లేదు. ఇన్స్పెక్టర్ గారూ, వెళ్ళండి . ముందు ఆ అబ్బాయిని నిలపండి. నేనూ వస్తాను - అని వారందరూ, నా దగ్గరికి వచ్చారు . పక్కన లేచి నుంచో మన్నారు . అప్పటికీ నాకు అర్థం కాలేదు - వాళ్ళెం చెయ్య బోతున్నారో !
పక్కన నుంచున్నాను . ఇన్స్పెక్టర్ గారు - నా వొక్కొక్క పీజియన్ హోల్ లోని లెటర్లు తీసి చెక్ చేస్తున్నారు . దాదాపు అన్నిటి లోని లెటర్లూ చెక్ చేశారు. మధ్య మధ్యలో సుపరింటెండెంట్ గారూ, డైరెక్టర్ గారు కూడా చెక్ చెయ్య సాగారు. వారికేదీ పొరపాటు దొరక లేదు - వొక్కటి కూడా . మధ్య మధ్యలో, ఏదో వొక తప్పు కనిపెడదామని, ఇన్స్పెక్టర్ గారు, యది యిక్కడ ఎందుకు వేశావ్. జిల్లా పేరే లేదు . యిలా చేస్తే ఎలా అన్నాడు. నేను చిన్న పిల్లల ఉత్సాహంతో చెప్పుకొచ్చాను - అది అక్కడే ఎందుకుండాలో; ఆ వృత్తి వారు ఆ జిల్లాలోనే వున్నారు . ముఖ్యంగా - ఈయన ఆ వృత్తి సంఘానికి ప్రెసిడెంటు - యిలా . డైరెక్టర్ గారు వొప్పుకున్నారు . నిజమే అన్నారు .
అప్పుడు ఆయన మాటలు - మరోలా మారి పోయాయి . అవునూ , నువ్వు, నిజంగా మనిషివా , యంత్రానివా ? నేనెక్కడా చూళ్ళేదు , యింత వేగంగా సార్ట్ చెయ్యడం. ఎప్పుడు పేరు చూస్తున్నావు, ఎప్పుడు వూరు చూస్తున్నావు , ఎప్పుడు జిల్లా చూస్తున్నావు ? ఎప్పుడు కట్ట నుండి, దాన్ని వెలుపలికి తీసి , ఎలా సరైన హోల్ లోకి వేస్తున్నావు? యిది ఎలా సాధ్యం ? నేను నమ్మ లేక పోతున్నాను . సరే . ఇన్స్పెక్టర్ గారూ ! యివన్నీ పీజియన్ హొల్సు నుండి బయటికి తీసేసేయ్యండి - అన్నారు. వారు అన్నీ తీసి కుప్పగా పోశారు . దాన్ని బాగా కలిపెయ్యండి - అన్నారు. ఆయనా కలిపేసారు . యిప్పుడు మళ్ళీ - నా దగ్గరిచ్చి , మళ్ళీ సార్ట్ చెయ్యమన్నారు . నాకు యిదేదో ఆటలా వుందే కాని, లోపల భయం కానీ, మరే భావనా లేదు . ఏదో , వొలింపిక్ చాలెంజ్ లాగా - మళ్ళీ ఆరంభించి - మరో స్టేషన్ వచ్చే లోపు ఎప్పుడో పూర్తి చేసేశాను. అది మళ్ళీ చెక్ చేశారు . మళ్ళీ అందులో ఏమీ పొరబాట్లు కనిపించ లేదు . అంతే . ఆయనకు మాటలే రాలేదు . గుంతకల్లు లో దిగేటప్పుడు - హెడ్ సార్టర్ గారిని, ఇన్స్పెక్షన్ రిజిస్టర్ ఏదో తెమ్మన్నారు. వొక పేజీ ఏదేదో రాశారు. సూపరింటెండెంట్ గారు కూడా ఏదో రాశారు . దగ్గరికొచ్చి భుజం తట్టి, మళ్ళీ సుపరింటెండెంట్ ఆఫీసులో వొక సారి అందరికీ నువ్వెలా సార్ట్ చేస్తావో చూపించాలి ; బాగా చెస్తున్నావు. శభాష్ - అని వెళ్లి పొయ్యారు .
అంతే . మా హెడ్ సార్టర్ గారు వచ్చి నన్ను చెయ్యి పట్టుకుని ఏదేదో చెప్ప సాగారు - విజయమోహన్, నిజంగా ఈ పని నీకు తగినది కాదయ్యా . ఆ ఇన్స్పెక్టర్ స్థానం లో నువ్వుండాలయ్యా . అతనికేం తెలుసు . నీకు తెలిసినవేవీ - అతనికి తెలీదాయె . నువ్వు. బాగా చదువు ; ఇన్స్పెక్టర్ అయిపో . వొక రోజు నువ్వు సూపరింటెండెంట్ అవుతావు . సూపరింటెండెంట్ ఏమిటి కర్మ . నువ్వు డైరెక్టర్ కూడా కావాలయ్యా. ఈ రోజు నుండి, నువ్వు బాగా చదువు . పుస్తకాలు నేను తెప్పిచ్చి యిస్తాను -అంటూ, చాలా, చాలా, చెప్పాడు. ఆ తరువాత - మా ఆఫీసు లో నన్ను ప్రోత్సాహ పరచని వారు లేరు. కాల క్రమం లో - టెలికాం విభాగం - లో పోస్టల్ డైరెక్టర్ పదవికి సమమైన డిప్యూటీ జనరల్ మేనేజర్ కావడం , ఆ పదవిలో పది సంవత్సరాల పాటు ఎన్నో సాధనలతో పాటు వుండడం జరిగింది .
చెప్పొచ్చేదేమిటంటే - జీవితంలో వచ్చే సమస్యలకు - అన్నింటికీ , సమాధానాలు వుంటాయి . ప్రతి అడ్డంకీ వొక మెట్టు లాటిది . మన పురోభివృద్ధి కి వొక మంచి అవకాశం లాంటిది. అడ్డంకిగా భావిస్తే - భయ పడితే , నిరుత్సాహ పడితే , అక్కడే నిలిచి పోతాము . లేదా, వెనక్కు మళ్ళి , వెళ్లి పోయే ప్రమాదం కూడా వుంది. సమస్యలకు అది సమాధానం కాదు.
మళ్ళీ చెప్పాలంటే - ప్రతి అడ్డంకీ వొక మెట్టు లాటిది . మన పురోభివృద్ధి కి వొక మంచి అవకాశం లాంటిది. వున్న సమస్య కు అత్యుత్తమ సమాధానాలు వెదకాలి . ముందుకు సాగాలి . అంతే కాని వెనక్కు మళ్ళ కూడదు . ఎంతో మంది డాక్టర్ అబ్దుల్ కలాం లాంటి వారు ప్రెసిడెంట్ పదవి వరకు వెళ్ళారు కదా . వారూ మనలా- బీద కుటుంబాల్లో , పుట్టిన వారే కదా . కానీ - మన దేశంలో, యిప్పుడు కూడా నిరుత్సాహ పరిచే వారే ఎక్కువ . యింటా , బయటా. యిది తగ్గాలి. మనమందరూ, వొకరికొకరు ఊపు నిస్తూ , ముందుకు సాగాలి . మా కాలం లో, మాకు యిది చెప్పిన వారు చాలా తక్కువ . నిరుత్సాహ పరచిన వారు చాలా ఎక్కువ .
ఇప్పుడు, 64 ఏళ్ళ వయసు తర్వాత - నేను ఏం చెయ్యాలి? వొక పదేళ్ళు పైగా యోగా ప్రాక్టీసు చేస్తున్నాను . కొంత మంది గొప్ప గురువుల దగ్గర ట్రైనింగ్ కూడా అయ్యాను. ఆ తరువాత - దాన్ని గురించి ఎంతో అధ్యయనం చెయ్యడం కూడా జరిగింది. పతంజలి యోగ సూత్రాల గురించి, గీత లోని ధ్యాన యోగం గురించి విశదం గా - ఆంగ్లంలో - నా బ్లాగ్ లో రాయడం జరిగింది . అదంతా తీసి - దానికి ఎన్నో మార్పులు, కూర్పులు , మరెన్నో - చేసి పుస్తక రూపంలో దాన్ని తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నాను. యింతకు ముందు ఎంతో మంది రాసారు కదా. వివేకానందు లంతటి వారు రాసారు. ఓషో గారు రాసారు. శివానందుల వారు రాసారు. మరి నేనెందుకు మళ్ళీ రాయాలి ?
నిజమే. వారందరూ - నాకు గురు తుల్యులే. నేను వారందిరికీ ఏకలవ్య శిష్యరికం చేసిన వాడినే . అంతే కాదు . ఇప్పుడున్న ప్రసిద్ధ గురువులు, చాలా మంది వద్ద కూడా కొంత ప్రత్యక్ష శిష్యరికం చేసిన వాడినే. 10 ఏళ్ళ వయసులో, వొక గొప్ప గురువు వద్ద, ప్రాణాయామాలు , ఆసనాలు ఎన్నో నేర్చుకున్న వాడినే. నా అనుభవాలు ఈ మార్గంలో ఎన్నో వున్నాయి . అంతే కాదు. యోగ సూత్రాలకు - ఎంతో వివరణ - యింకా, అవసరం వుంది . అది సామాన్య ప్రజలకు చేరనే లేదనే - నా నమ్మకం .అదీ వారు నేర్చుకునే విధంగా చేరలేదనే - నా నమ్మకం .
పాశ్చాత్య దేశాలకు చేరినంత కూడా - మన దేశం లో ప్రజల మధ్యకు యింకా రాలేదనే చెప్ప వచ్చు. అందుకే - నా ఈ ప్రయత్నం. సఫలమౌతుం దనే నా - విశ్వాసం .
యిక్కడ చెప్పొచ్చేది చాలా సరళమైన విషయం - అడ్డంకులేవీ , అడ్డంకులు కావు . అన్నీ సోపానాలే . అన్నిటికీ - మనసుంటే మార్గం వుండనే వుంది. కాకపోతే, మన దేశంలో - నా పరిస్థితి కి నేను కాదు కారణం . మరెవరో - అన్న భావం చాలా ఎక్కువ . మరెవరో - అనుకుంటే - అదో తృప్తి . కానీ అందులో - మీ పరాజయం వుందే కాని - విజయం కాదు . నా పరిస్థితికి , నా భవిష్యత్తుకు కారణం - నేనే అనుకుంటే - మీ జీవితం లో మీరు ఎన్నో సాధిస్తారు .
శ్రీకృష్ణుడి గీతా ప్రబోధం అంతా యిదే .
-యిప్పుడు వున్న మీ సమస్యలకు యిలా కాస్త యోచన చేసి చూడండి . యింకా బాగా మార్గాలు వెదకండి . మీరు సఫలీకృతులు అవుతారు . తప్పకుండా .
= మీ
వుప్పలధడియం విజయమోహన్
This should be in text books so that students can learn how to get rid of obstacles and get some inspiration....
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు , ప్రోత్సాహానికి చాలా సంతోషం. ఈ స్వగతం సీరీస్ యిప్పటికి మూడు వ్యాసాలు అయ్యాయి . మీ అభిప్రాయాలు తెలుపుతూ వుండండి
తొలగించండిసార్టింగ్ పనిలో మీరు నైపుణ్యం సాధించినది చూస్తుంటే యోగ: కర్మసు కౌశలమ్ అన్న గీతా వాక్యం గుర్తొస్తోంది. మంచి మాటలు చెబుతున్నారండి. మీరు హైదరాబాద్‌లో ఉంటే మిమ్ములను వ్యక్తిగతంగా కలిసేవాడిని. ధ్యానం గురించిన సిరీస్ కొనసాగించగలరు. శుభాభినందనలు.
రిప్లయితొలగించండితేజస్వి గారూ , మీ వ్యాఖ్యకు , ప్రోత్సాహానికి చాలా సంతోషం. స్వగతం సీరీస్ , యోగ సూత్రాలు సీరీస్ రెండింటినీ యింకా ఎంతో రాయాల్సి వుంది. మీ అభిప్రాయాలు తప్పక తెలుపుతూ వుండండి. మీరు చెప్పిన గీతా వాక్యం నాకు చాలా, చాలా నచ్చిన వాక్యం. ఆంగ్లం లో ఎక్సెలెన్స్ - అంటారు కదా. అది సాధించడానికి ఎన్నో మార్గాలు చెబుతారు . కానీ, శ్రీకృష్ణుడు చెప్పిన మార్గాలు కానీ , అర్జునుడు లాంటి వారు అనుసరించిన మార్గాలు కానీ , ఈ అధునాతన మార్గాల కంటే, ఎంతో విశిష్టమైనవి . అధునాతన మార్గాలు వద్దు, అనడం లేదు; కానీ, అంతకు ముందు మన గీతా వాక్యాలు రావాలి అర్జునుడు, ఏకలవ్యుడు లాంటి వారు అనుసరించిన విశిష్ట పద్ధతులు కూడా మనం పాటించాలి. నిజానికి - మన ప్రస్తుత "అవధానాలకు" మించిన ధారణా పద్ధతులు ప్రపంచంలో మరెక్కడా లేవు .
తొలగించండి