20, ఫిబ్రవరి 2017, సోమవారం

భగవద్ గీత (9) - సాంఖ్య యోగము - 2.18,19 - దేహి, దేహము ,వీటిలో మీ కేంద్రం యిప్పుడు ఎక్కడ - ఎందుకు యుద్ధం ?



 

భగవద్ గీత (9)


  

 రెండవ అధ్యాయము

 

  సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి మూడు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం. నాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, 'నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని' అన్న మాటలను విశదంగా పరిశీలించి ఆకళింపు చేసుకున్నాం

యిదవ వ్యాసంలో శ్రీకృష్ణుడి మొదటి ఉపదేశ శ్లోకం చూశాం.  పోయిన  వారి కోసమైనా, వున్న వారి కోసమైనా జ్ఞాని అయిన వాడు దుఃఖించ రాదని శ్రీకృష్ణుడు చెప్పాడు.  శ్రేయస్ అంటే శాశ్వతమైన సుఖాలు, ప్రేయస్ అంటే అశాశ్వతమైన, భౌతిక సుఖాలు అన్నది తెలుసుకున్నాం. అలాగే, మనిషి కోరదగిన రెండు వరాలు  ఏమిటో కూడా తెలుసుకున్నాం.

ఆరవ వ్యాసంలో - మనకెవరికీ ఎప్పుడూ మరణం లేదు, మనం లేని సమయమంటూ  ఎప్పుడూ లేదు - అని శ్రీకృష్ణుడు అన్నాడు. మన దేహాలు మాత్రం, సమయానుసారం, మరణించి, పంచ భూతాలలో కలిసిపోతాయి. మనం అప్పుడు మరో శరీరాన్ని వెదుక్కుంటూ వెళ్లి శరీరాన్ని  ధరిస్తాము  - అని చెప్పాడు. 

ఏడవ వ్యాసంలో - యింద్రియాలు తమ తమ సంబంధిత వస్తువుల స్పర్శ వలన, మనకు శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు కలిగిస్తున్నాయి.వన్నీ వస్తూ, పోతూ వుండే, అశాశ్వతమైన విషయాలు. వీటిని నువ్వు భరించక తప్పదు. వచ్చే సుఖాన్నీ, దుఃఖాన్నీ, రెండింటినీ  సమానంగా  తీసుకుంటూ వుండే వాడికి, అవి ఎవరినైతే బాధించవో అటువంటి వాడికి - చావు, పుట్టుకలు లేని అమృతత్వానికి  అర్హత వస్తుంది- అన్నాడు శ్రీకృష్ణుడు

ఎనిమిదవ వ్యాసంలో "సత్యం కానిది ఎప్పుడూ వుండింది లేదు. సత్య మైనది ఎప్పుడూ లేకుండా లేదు. అది విశ్వమంతటా  వ్యాపించి వున్నది. దాన్ని   నాశనం చేయగల సమర్థులు ఈ విశ్వములో ఎవరూ లేరు" అని శ్రీకృష్ణుడు అన్నాడు


ప్పుడు, సత్యమైన దానికీ(దేహికీ), అనిత్యమైన దేహాలకూ  గల సంబంధాన్ని వివరిస్తున్నాడు. 

 శ్రీకృష్ణుడి మాట :

"అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః  | 
నాసినోప్రమేయస్య తస్మాద్ యుధ్యస్వ  భారత  ||  (2. 18)

అంతవంతః = అంతం/నాశనము వున్నవి; ఇమే  దేహాహ్ = ఈ శరీరాలు ; నిత్యస్య = శాశ్వతమని; ఉక్తాహ్ = చెప్పబడిన; శరీరిణః =  శరీరములో నివసించి యున్న దేహి ; నాసినః = నాశనము లేనటువంటి ;  అప్రమేయస్య = కొలవలేనటువంటి(కొలతలే లేనటువంటి) ; తస్మాత్ = అందువలన ; యుద్ధస్వ = యుద్ధం చెయ్యి ; భారత = ఓ అర్జున!

"ఓ అర్జునా ! దేహాలలో నివసించియున్న దేహి (ఆత్మ) ఆద్యంతాలు లేనిది, వినాశమే లేనటువంటిది, కొలవలేనటువంటిది, విశ్వమంతా వ్యాపించి యున్నది. కానీ దేహి నివసించి వున్న అన్ని దేహాలూ అంతం వున్నవే సుమా.  కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి."

ప్పుడు శ్రీకృష్ణుడు దేహానికి, దేహంలో నివసించి యున్న దేహికీ, అంటే - ఆత్మ స్వరూపుడైన నిజమైన నీకు వున్న సంబంధము, వ్యత్యాసము రెండింటినీ వివరిస్తున్నాడు. 

ఈ యోధులందరూ, దేహాలని నీవనుకుంటూ వుంటే , ఈ దేహాలు ఎలాగైనా నాశనమయ్యేవే, చనిపోయేవే - అని తెలుసుకో. ఇంతకు ముందే చెప్పను కదా - చనిపోయిన దేహాలను వదిలి, దేహి మరో క్రొత్త శరీరాన్ని  వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడున్న దేహం యొక్క చావూ తథ్యమే. క్రొత్త దేహంతో మళ్ళీ పుట్టడమూ తథ్యమే.  

దేహానికి చావు తథ్యం. దేహికి చావు ఎప్పుడూ లేదు. నువ్వు చంపక పోయినా, ఈ దేహాలు చావక తప్పదు. కాబట్టి నీ క్షత్రియ ధర్మమైన యీ ధర్మ యుద్ధం చెయ్యి. 

మరణించిన దేహంలో వున్న దేహి, ఎలాగూ దేహాన్ని వదలి, మరో దేహాన్ని వెదుక్కుంటూ  వెళ్ళిపోతాడు. అవినాశి అయిన,  మరణమే లేనటువంటి దేహిని గురించి నువ్వు చింత పడాల్సిన అవసరం ఏ మాత్రమూ లేదు. 

పుట్టుక, పెరుగుదల, చావు, కోరికలు, ధర్మాధర్మాలు అన్నీ ఈ దేహానికే. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ధర్మ యుద్ధం గనుక, అది నీ ధర్మం గనుక, నువ్వు యుద్ధం చెయ్యాలి.   మరి దేహిని నువ్వు చంపగలవా? ఎలాగూ చంప లేవు - అంటున్నాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడి మాట : 

 "య యేనం వేత్తి హన్తారం  యశ్చైనం మన్యతే హతం | 
ఉభౌ  తౌ  న విజానీతో నాయం హంతి న హన్యతే      || (2. 19) 

యః = ఎవరైతే ; ఏనం = దీన్ని (దేహిని / ఆత్మను) ; వేత్తి = తెలిసిన వాడు;  హన్తారం = చంపెడి వాడు;  యః - ఎవరైతే ; చ = మరియు ; ఏనం = దీన్ని ; మన్యతే = అనుకుంటున్నాడో ; హతం = చంపబడ్డదని; ఉభౌ = వారిరువురూ ; తౌ = వాళ్ళు;  న = కాదు / లేదు ; విజానీతః = తెలిసివుండుట ; న = కాదు / లేదు ; అయం = యిది ; హంతి = చంపుట;  న = కాదు / లేదు ; హన్యతే = చంపబడుట ; 

"ఎవరైతే దేహి/ఆత్మ చంపుతుందనుకుంటాడో, లేదా, చనిపోతుంద నుకుంటాడో వారిద్దరూ మూర్ఖులే, అజ్ఞానులే. దేహి / ఆత్మ చావదు, చంపదు, చంపబడదు."

ఆత్మనే దేహి అన్నాడు శ్రీకృష్ణుడు. అది చావదు, చంపదు. చంపబడదు. అది చస్తుందనో, చంపబడుతుందనో అనుకునే వారు అజ్ఞానులు. దానికి చావు లేదు. అది చంపనూ లేదు. చావు పుట్టుకలకు  అతీతమైనది అది. శ్రీకృష్ణుడు దీని స్వరూపాన్ని మరింత చక్కగా వివరించబోతున్నాడు   ముందు, ముందు.  ఒక్క మాటలో చెబితే చాలదా ? చాలదు. ఇదే ఆత్మదర్శన విజ్ఞానము. ఇది పూర్తిగా, సందేహాతీతంగా, సుస్పష్టంగా,  మనసు లోతులకు దిగిపోవాలి. అక్కడినుండే అంతర్దృష్టి  ఆరంభమవుతుంది, కావాలి.  అవుతుందా? చూద్దాం 
  
 ఆట కదరా శివా, ఆట కద కేశవా -  అనే అద్భుతమైన పాట  మీరు వినే  వుంటారు. అంతర్దృష్టి లేనంత వరకు, యీ  ఆట మనకర్థం కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, భయాలతో సతమతమై పోతూ జీవితమనే సుడిగుండంలో   మునుగుతూ,తేలుతూ వుంటాము.  

అంతర్దృష్టి  వుంటే, మన కేంద్రం బాహ్య ప్రపంచం నుండి మన శరీరానికి, శరీరం నుండి మనస్సుకు, మనస్సు నుండి బుద్ధికి, బుద్ధి నుండి నిజమైన మనకు, దేన్నైతే శ్రీకృష్ణుడు 'దేహి' అన్నాడో ఆ ఆత్మస్వరూపుడికి, వెళ్లి స్థిరపడి పోతుంది. మన కేంద్రం 'దేహి' అయితే, బాహ్య ప్రపంచంలో మనం ఏ ఆట ఆడినా బాగానే ఆడుతాము. అందులో, మనకు ఏ సమస్యా రాదు. కామమూ, క్రోధము, భయము  లాంటి అంతః శత్రువులు మనలను ఏమీ చెయ్యలేవు.  కానీ చాలా మందికి యిప్పుడు, వారి కేంద్రం బాహ్య ప్రపంచం గా  వుంది. కొందరికి తమ శరీరం గానూ , కొందరికి  మనస్సు గానూ, కొందరికి బుద్ధిగానూ వుంది. పూర్తిగా - నేను 'దేహి'ని, చిదానంద స్వరూపుడిని అని చెప్పగలిగేవారు ఎవరో ?

 ఈ విషయాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు  ముందు వచ్చే శ్లోకాలలో . అవి మరో వ్యాసంలో చూద్దాం. 
 
వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది

సర్వే  జనాః సుఖినో భవంతు
  
= మీ   
    
ఉప్పలధడియం   విజయమోహన్ 
పద్మాసనం




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి