భగవద్ గీత (10)
రెండవ అధ్యాయము
సాంఖ్య యోగము
భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి మూడు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం. నాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, 'నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని' అన్న మాటలను విశదంగా పరిశీలించి ఆకళింపు చేసుకున్నాం.
అయిదు నుండి తొమ్మిదివ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి, దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము చూస్తూ వచ్చాము. ఇప్పుడు, పదవ వ్యాసంలో శ్రీకృష్ణుడు, సాంఖ్య యోగపు 20, 21 శ్లోకాల్లో ఏం చెప్పబోతున్నాడో చూద్దాం.
అయిదు నుండి తొమ్మిదివ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి, దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము చూస్తూ వచ్చాము. ఇప్పుడు, పదవ వ్యాసంలో శ్రీకృష్ణుడు, సాంఖ్య యోగపు 20, 21 శ్లోకాల్లో ఏం చెప్పబోతున్నాడో చూద్దాం.
శ్రీకృష్ణుడి మాట :
"న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయహ్ |
అజో నిత్యహ్ శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే || (2. 20)
న = కాదు/లేదు; జాయతే = పుట్టునది; మ్రియతే = మరణించునది ; వా = లేదంటే ; కదాచిత్ = ఎప్పుడైనా ; న = కాదు/లేదు ; అయం = యిది (నిజమైన నేను, దేహి, ఆత్మ) ; భూత్వా = భూతకాలమందున్న ; భవితా = భవిష్యత్తులో నుండు ; వా = లేదంటే; న = లేదు / కాదు; భూయహ్ = (ఏదైనా) అగుట; అజహ్ = పుట్టనిది; నిత్యహ్ = ఎల్లప్పుడూ వుండేది; శాశ్వతః = మార్పు లేనిది; పురాణః = చాలా పూర్వకాలం నుండి ; న = లేదు/కాదు; హన్యతే = చచ్చునది; హన్యమానే = చంపబడునది; శరీరే = దేహి (దేహములో నున్న వాడు);
"ఓ
అర్జునా ! దేహి (ఆత్మ) పుట్టుకా, చావూ రెండూ లేనిది. ఆత్మస్వరూపుడికి ఈ భూమిపైన పుట్టడమూ, చావడం రెండూ కూడా ఎప్పుడూ జరుగదు. తనకు పుట్టుకాలేదు, మార్పూ లేదు. ఎల్లప్పుడూ ఒకే లాగా వుంటూ అత్యంత పురాతనమైనది అయిన ఈ ఆత్మస్వరూపుడికి, దేహం చంపబడినప్పుడు తాను చచ్చిపోవడము జరగనే జరుగదు. "
ఇప్పటి వరకు ఆత్మస్వరూపుడిని దేహం లో వున్నవాడు, శరీరం లో వున్న వాడు, దేహి, శరీరి అనే చెబుతున్నాడు శ్రీకృష్ణుడు. రమణ మహర్షి కూడా దాదాపు యిలాగే చెప్పే వాడు. నేను - అనే పలుకుకు, నీ లోలోపల ఎవడు నేనే అని బదులు చెప్పగలడో, 'కనిపించే నీలో' ఏదేది అసలైన నువ్వు కాదో తెలుసుకుంటే, నిన్ను నువ్వు తెలుసుకున్నట్టే.
దేహి నీ శరీరంలోనే వున్నాడు. నీ పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను వుపయోగించి ప్రపంచాన్ని చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. కానీ దేహి వుపయోగించేవేవీ దేహి కాదు. అంటే - దేహంలో వున్న వాడే , కానీ దేహం కాదు. మనసులో, బుద్ధిలో వున్న వాడు, కానీ అవీ దేహి కాదు.
అంత కంటే లోలోపల, వాటికంటే భిన్నమైన వాడుగా వున్న ఆ ఆత్మ స్వరూపుడిని, శ్రీకృష్ణుడు - దేహి, శరీరి అనే పిలుస్తున్నాడు ఇప్పటి వరకు. అర్జునుడికి ఆత్మ జ్ఞానం ఇప్పటి వరకు లేదు. స్వర్గానికి కూడా అర్జునుడు వెళ్ళాడు, కానీ, శరీరంతో బాటుగానే వెళ్ళాడు. తానూ ఆ శరీరమనే అనుకుంటున్నాడు.
అర్జునుడు ధర్మాత్ముడే, కానీ, కామము, క్రోధము, శోకం అన్నీ వున్న వాడే. అది అర్జున విషాద యోగం లో చూశాం. అత్యంత ధైర్యశాలి అయినా, తన శరీరం పైన మాత్రం అమితమైన మమకారం వున్న వాడే. కౌరవ యోధులందరినీ తానొక్కడే చంపేయగలనని వీరావేశంతో వున్న వాడే. కానీ, భీష్మ,ద్రోణులను మాత్రం నేను చంప లేను, వాళ్ళు నాకు పూజ్యులు అంటున్న వాడే. అంటే - నేను చంప గలను, వాళ్ళు నా చేతిలో, నా ఆయుధాల వలన చచ్చిపోతారే, అయ్యో పాపం, అని శోకం తో వున్న వాడే.
మొదట కృష్ణుడు - "నువ్వు దేహము అని నీవనుకుంటుంటే, వాళ్ళూ దేహాలని నీవనుకుంటుంటే, నువ్వు చంపక పోయినా వాళ్ళు చావక మానరు. పుట్టినదేదీ, చావకా మానదు, మళ్ళీ పుట్టకా మానదు. నీ క్షత్రియ ధర్మం ధర్మయుద్ధం చెయ్యాలి, అందులో, శత్రునాశనం చెయ్యాలి అనే చెబుతుంది. యుద్ధం చెయ్యక పోతే, నువ్వు ధర్మ రహితుడవు అవుతావు, స్వర్గానికి అనర్హుడవుతావు " అని,యిలా ఎన్నో చెప్పాడు.
ఆ తరువాత - "నువ్వు దేహం కాదు. దేహంలో వున్న, అజరామరమైన, అవ్యయమైన, శాశ్వతమైన, నిత్యమైన దేహివి, నీలాగే వారూ అజరామరమైన వాళ్ళే " అని అంటున్నాడు.
నీకు పుట్టుకా లేదు. చావూ లేదు. ఒకప్పుడు రావడము, మరొకప్పుడు వెళ్లిపోవడము నీకు ఎప్పుడూ లేదు. నీకు చావు పుట్టుకలు మాత్రమే కాదు, ఎటువంటి మార్పు, తరుగుదల కూడా లేవు. అత్యంత పురాతనమైన వాడివి నువ్వు. అందరూ అంతే. దేహం చంప బడినప్పుడు దేహి చావడం జరుగదు అంటున్నాడు ఈ శ్లోకంలో . తరువాతి శ్లోకం చూద్దాం యిప్పుడు.
శ్రీకృష్ణుడి మాట :
"వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయం |
కథం స పురుషహ్ పార్థ కం ఘాతయతి హన్తి కం || (2. 21)
వేద = తెలిసిన ; అవినాశినం = నాశనము లేనిది ; నిత్యం = ఎల్లప్పుడూ వుండునది ;
యః = ఎవరైతే ; ఏనం = యిది (ఆత్మ) ; అజమ్ = పుట్టుక లేనిది ; అవ్యయం = తరిగి పోనిది ; కథం =
ఏ విధంగా ; సః = అతడు ; పురుషహ = పురుషుడు, మనిషి ; పార్థ = అర్జునుడు ; కం = ఎవరిని ; ఘాతయతి = చంపించుట ; హన్తి = చంపుట ; కం = ఎవరిని ;
"ఓ అర్జునా ! జ్ఞాని అయిన వాడు, ఆత్మ స్వరూప లక్షణాలు తెలిసిన వాడు - 'అది' ఎటువంటి నాశనమూ లేనిది, శాశ్వతమైనది, మార్పు లేనిది, ఏ తరుగుదలా లేనిది, పుట్టుక, చావు రెండూ లేనిది - అని తెలిసిన వాడు, తానెలా చంప గలడు, లేదా, మరొకరిచే ఎలా చంపించ గలడు."
నువ్వు జ్ఞానివైతే, నీకిది తెలిసి ఉండాలి కదా, పార్థా! నేను యింత సేపు చెప్పిన దేహి (ఆత్మ) లక్షణాలు నువ్వు విన్నావు కదా! యిప్పుడు చెప్పు నువ్వు యివన్నీ నిజంగా తెలుసుకున్న వాడివైతే, అర్థం చేసుకున్న వాడివైతే, నువ్వు ఎవరినైనా చంపగలవా, లేదా, నీ యోధుల చేత చంపించ గలవా . అలాగే, వాళ్ళు చచ్చిపోగలరా, లేదా మిమ్మల్ని చంప గలరా. నువ్వు దేహినా, దేహమా, ఏది అని నువ్వు అనుకుంటున్నావు చెప్పు.
ఎందుకని ఈ ధర్మ యుద్ధం చెయ్యకూడదని అంటున్నావో చెప్పు. పోయిన జన్మలో నువ్వెవరు, ఈ భీష్ముడెవరు? అవన్నీ నీకు తెలీదు. అప్పుడు వీళ్ళందరూ యెలా, ఎందుకు, ఎవరివలన చనిపోయారు ? - ఈ ప్రశ్నలు అర్జునుడి మనసులో వచ్చేటట్టు, వాటికి సమాధానాలు తన వుపదేశంలో వెదికేటట్టు, చేస్తున్నాడు శ్రీకృష్ణుడు.
కొంత మంది మన చుట్టూ కూడా వివిధ కారణాల వలన చనిపోతున్నారు. ఇది ప్రతి రోజూ జరుగుతున్నదే. ఈ దేహం పడిపోయింది. ఈ దేహి ఏమయ్యాడు? ఎక్కడికెళ్ళాడు? మనం ఎందుకు ఏడుస్తున్నాము? మళ్ళీ ఎందుకు మరిచిపోతున్నాము? స్మశాన వైరాగ్యం అని అంటూ వుంటాము. మన వాళ్ళు ఎవరైనా చనిపోతే, శోకిస్తాము, కొన్ని గంటలు , లేదా ఒక రోజు. తరువాత మళ్ళీ అన్నీ మామూలే.
అదే పాకిస్తానీ సైనికులనో, టెర్రరిస్టులనో, మన జవాన్లు చంపేస్తే - చాలా మంచి పని చేశారు, వాళ్లకు ఆ శాస్తి కావలసిందే, అని సంతోష పడతాము. అది సబబేనా? అవును అంటాడు, శ్రీకృష్ణుడు. అధర్మ మార్గంలో పొయ్యే వాళ్లకు, శిక్ష పడాల్సిందే.
మనమంతా అర్జునులమే. లోకంలో ధర్మ మార్గాన్ని నెలకొల్పడం మన పని. మన అందరి పని. ఈ అధర్మము చేసేది దేహినా? దేహమా? అది తెలియాలి.
మనకు స్థూల,సూక్ష్మ, కారణ శరీరాలున్నాయి. అవి ప్రకృతితో నిర్మింపబడ్డవి. ప్రకృతిమాయలో కొట్టుకుపోతున్నవి. దేహి, తనకు యే మార్పూ లేకున్నా, తాను, బాహ్య ప్రకృతిని తన దేహం, మనసు ద్వారానే చూడాలి. వేరే మార్గం లేదు. ఈ దేహం ద్వారానే ప్రకృతిని అర్థం చేసుకోవాలి, అనుభవించాలి. బంధానికి, మోక్షానికి రెండింటికీ ఈ దేహమూ, మనసే కారణమవుతున్నాయి - దేహికి. దేహము, మనసు అనే కారణాల వలన, దేహి ప్రకృతి మాయలో కొట్టుకు పోతూ వుంటాడు. ఎప్పుడు జ్ఞానం వస్తుందో, అప్పుడు మాయ తొలిగి పోతుంది. అప్పుడు జనన మరణాల వలయం నుండి, సంసారం అని పిలువబడే శోక గహ్వరం నుండి బయటపడతాడు.
మీకింకా ఎన్నో సందేహాలున్నాయి కదా. అవన్నీ అర్జునుడికీ వున్నాయి. ఈ దేహి, దేహము అనే వాటిని గురించి మనకు మరింత స్పష్టత కావాలి.
ఈ విషయాన్నే, యింకా విశదంగా, స్పష్టంగా చెప్పబోతున్నాడు ముందు వచ్చే శ్లోకాలలో . అవి మరో వ్యాసంలో చూద్దాం.
ఈ వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ జేస్తూ వుంటే చాలా బాగుంటుంది.
సర్వే జనాః సుఖినో భవంతు
= మీ
ఉప్పలధడియం విజయమోహన్
వజ్రాసనం |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి