5, ఫిబ్రవరి 2017, ఆదివారం

భగవద్ గీత (5) - సాంఖ్య యోగము - కోర దగిన రెండు వరాలు - మీ శోకానికి సబబైన కారణం ఉందా? - లేదు అంటాడు శ్రీకృష్ణుడు



భగవద్ గీత (5)


  రెండవ అధ్యాయము

 

  సాంఖ్య యోగము 

 



భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం మొదటి మూడు వ్యాసాల్లో చూశాంనాలుగవ వ్యాసంలో అర్జునుడి సమర్పణ భావాన్ని, నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పు, నేను నీ శిష్యుడిని అన్న మాటలను విశదంగా చూసాము. యిప్పుడు అర్జునుడు ఆయుధాలు విడిచి, నిశ్శబ్దంగా కూర్చున్నాడుయింత  వరకు శ్రీకృష్ణుడు ఏమీ చెప్పకుండా  ఎందుకు కూర్చున్నాడో కూడా అర్థం చేసుకున్నాముకానీ, నీవే నాకు దిక్కు, నేను నీ శిష్యుడిని, అన్న తరువాత - భగవంతుడి గీతోపదేశం ప్రారంభం అవుతుంది యిప్పుడు .  

సంజయుని మాట:

మువాచ హృషీకేశహ్ ప్రహసన్నివ భారత  | 

సేనయోరుభయోర్మధ్యే  విషీదంతమిదం వచః  ||  (2.10)

"శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, ఇరు సేనల మధ్య నిరుత్సాహంతో కూలబడి వున్న అర్జునుడిని చూసి యిలా చెప్పడం ప్రారంభించాడు :"

అన్ని రకాల భౌతిక ఆకర్షణలను, కోరికలను కలిపి "ప్రేయస్" అని చెప్పుకోవచ్చు. అవి ఏవీ ఎక్కువకాలం ఉండేవి కావు. నిరంతరం వుండే సుఖాన్ని "శ్రేయస్" అని చెప్పవచ్చు.  

కోరికలు తీరవచ్చు, తీరకపోవచ్చు. అవి తీరినా, తీరకపోయినా,అవి కడపట మిగిల్చిపోయేది  మాత్రం అతృప్తి, అసంతోషము, రకరకాల వ్యథలు, బాధలు యివీ. వీటన్నిటినీ కలిపి 'సంసారము' అంటారు. ప్రేయస్  వెనుక పరుగెడితే 'సంసారం' వస్తుంది. శ్రేయస్ వెనుక  పరుగెడితే సంసారం నుండి విముక్తి లభిస్తుంది. శ్రేయస్  ఇచ్చేది శాశ్వతానందము. ప్రేయస్ యిచ్చేది  తాత్కాలికానందము, దాని తర్వాత అతృప్తి, వ్యథ, బాధ

శ్రీకృష్ణుడి వాక్కు ద్వారా అర్జునుడికి లభించేది  ఏది? అది శ్రేయస్ గానే వుండాలి కదా . చూద్దాం.   

శ్రీకృష్ణుడి మాట :

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే   | 

గతాసూనగతాసూన్శ్చ  నానుశోచంతి  పండితాః    || (2. 11)
 
అశోచ్యాన్ : ఎవరి కోసమైతే దుఃఖ పడకూడదో ;
ఆన్వశోచః : (వారికోసం) దుఃఖ పడుతున్నావు ;
త్వం : నువ్వు ;
ప్రజ్ఞావాదాన్ : ఏదో జ్ఞాని మాటల వలె ;
: మరియు ;     భాషసే : మాట్లాడుతున్నావు ;
గతాసూన్ : చనిపోయిన (వెళ్లిపోయినవారికోసం;
అగతాసూన్ : చని పోని (పోని)వాళ్లకోసం
:మరియు ; అనుశోచంతి : దుఃఖ పడరు ;
పండితాః : జ్ఞానులైన వారుతెలిసిన వారు  

"ఎవరి కోసమైతే దుఃఖ పడకూడదో వారికోసం దుఃఖ పడుతున్నావు నువ్వు. కానీ, గొప్ప జ్ఞాని మాట్లాడే మాటల లాగా మాట్లాడుతున్నావు. జ్ఞాని అయిన వాడు చనిపోయిన(వెళ్లిపోయినవారికోసమైనా గానీ , చనిపోని (పోని) వాళ్ళ కోసమైనా గానీ  దుఃఖ పడడు."

ఇది మొట్టమొదటి వేదాంత పరమైన, జ్ఞానపరమైన  ఉపదేశం శ్రీకృష్ణుడి నుండి అర్జునుడికి. ఇది   మీకూ, నాకూ, ప్రతి యొక్క మనిషికీ, అతి ముఖ్యంగా తెలియ వలసిన జీవిత సత్యం. దీన్ని మరింత స్పష్టంగా కూడా, ముందు ముందు, వివరించ బోతున్నాడు  శ్రీకృష్ణుడు

ప్రతి మనిషికీ పుట్టుక తేదీ వుంది. చనిపోయే తేదీ కూడా వుంది. సాధారణంగా 'శతమానం భవతి' అని చెబుతూ వుంటాము. అంటే నూరేళ్లు మనిషి ఆయుర్దాయం; అన్నాళ్ళు బ్రతుకాలి నువ్వు అని ఆశీర్వదిస్తూ వుంటారు పెద్దలు

అయితే, మనిషి చెయ్యకూడని తప్పులు చేస్తే, అకాల మరణం సంభవించ వచ్చు. 'యోగ' లాంటి మహత్తరమైన  విద్యల ద్వారా కొంత ఆయుర్దాయం పొడిగించుకోనూ  వచ్చు. కానీ, పుట్టుక వుంటే, మరణం కూడా తప్పకుండా వుంటుంది

వేలకొద్దీ సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా కృత, త్రేతా యుగాల్లో వున్నారు. అది ఒకటి, రెండు వందల సంవత్సరాలకు దిగిపోయింది ద్వాపరయుగంలో. కలియుగంలో కూడా నూరేళ్ళకు పైబడి బ్రతుకుతున్న వారు  కొంత మంది వున్నారు. అందుకే 'శతమానం భవతి' అన్న దీవెన యిప్పటికీ వుంది

ద్వాపర యుగంలో, మహా భారత యుద్ధంలో యుద్ధం చేసేవారికి చాలా మందికి 60 ఏళ్ళ వయస్సు పైనే  వుంటుంది, అంటారు. అర్జునుడు కూడా అప్పటికి 60 ఏళ్ళ పై వాడే అంటారు. భీష్ముడికి  వంద పైనే. యివన్నీ కొంత వూహాగానాలు. కొంత జ్యోతిష, గణిత శాస్త్రాలపై ఆధారపడి వేసిన లెక్కలుదీని జోలి మనకు వద్దు. దీనిలో మునిగితే మనం తేలలేం యిప్పట్లో

ప్రతి  మనిషికీ చావు పుట్టుకలు తప్పవు - అన్న నిజాన్ని మనం గుర్తిస్తే చాలు. శంతనుడు చనిపోయాడు. అతని కొడుకులు చిత్రామ్గదుడు, విచిత్రవీర్యుడు చని పోయారు. పాండురాజు చనిపోయాడు. ఇలా అప్పటికి కురువంశంలో చాలామంది చనిపోయిన వారే

భీష్ముడు వరం వలన, వ్యాసుడు తపశ్శక్తి వలన జీవించి వున్నారు. పొయ్యేవారు పోతూనే వున్నారు. పుట్టే వారు  పుట్టుతూనే వున్నారు. జననం, బాల్యం, యుక్త వయస్సు, మధ్య వయస్సు, వృద్ధాప్యం, మరణం - యివి జీవితంలో భాగాలు. జననం తరువాత, ఎప్పుడైనా పోవచ్చు

వృద్ధాప్యం తరువాత మరణిస్తే, సకాల మరణం. వృద్ధాప్యానికి ముందే మరణిస్తే అకాల మరణం. యుద్ధాలు, వ్యాధులు, ప్రమాదాలు, కక్షలు, చంపుకోవడాలుశిక్షలు - యిలా ఎన్నో కారణాలున్నాయి అకాల మరణానికి. ఇలాంటి అకాల మరణాలు లేకుంటే, అది రామరాజ్యమవుతుంది. రామరాజ్యంలో కూడా వృద్ధాప్యం తరువాత సహజ మరణం తప్పదు 

సంస్కృతంలో ఒక శ్లోకం వుంది :

అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం  | 

దేహిమే కృపయా శంభో త్వయి భక్తిమ్ అచంచలం  || 

దేవుడా, నాకు నీపై అచంచల భక్తి వుంది. నాకు రెండే రెండు వరాలు ప్రసాదించు తండ్రీకష్టం లేని మరణం, శోకం లేని జీవనం.   

మరణం వద్దని అడుగలేదు. అది ఆయన ఇచ్చేది కాదు. యివ్వడు, యివ్వలేడు. నువ్వు పుట్టావు. కనుక గిట్టక తప్పదు. కొంత కష్టం లేని మరణం! ఇది ఇవ్వగలడు. ఇది కోర దగిన వరం. అలాగే, జీవితంలో కొంత ఒడుదుడుకులు ఉంటాయి. లాభనష్టాలుంటాయి. సుఖాలు, కష్టాలు వుంటాయి. ఇవేవీ తప్పవు. కానీ శోకం ఒక్కటి మాత్రం తప్పించుకోవచ్చు, జ్ఞానం ద్వారా. కష్టాలలో కూడా నేను శోకం లేకుండా వుంటా - అని  అనుకుంటే, మీరు జ్ఞాన మార్గానికి వచ్చేసినట్టే .    


దేవుడు చేసిన మనిషికే కాదు. మనిషి చేసిన  మిషన్లకు కూడా యివన్నీ తప్పవు. ఒక మిషన్ చెడిపోతే దాన్ని రిపేర్ చేసుకోవాలి. కుదరకపోతే, అది పారేసి కొత్తది కొనుక్కోవాలి. అయ్యో. మిషను నాకు నచ్చిన మిషను. ఇది చెడిపోయినా, అరిగిపోయినా, విరిగిపోయినా, దీన్ని గురించే దుఃఖిస్తూ కూర్చుంటాను కానీ పారేయడమో, రిపేర్ చెయ్యడమో, కొత్తది కొనుక్కోవడమో చెయ్యను - అంటే అది బుద్ధిమంతుడు అనే మాట అవుతుందా? కాదుకదా

అలాగే మనుషుల విషయం లోనూ. రోగాలొస్తే మందులతో పోగొట్టుకోవాలి వృద్ధాప్యమొస్తే ఆనందంగా స్వీకరించాలి. మరణమొస్తే కూడా అంతే. మరణమొచ్చి వెళ్ళిపొయ్యిన వాళ్లను, యింట్లో పెట్టుకోము కదా. వాళ్ళు మరో జన్మను, మరో శరీరాన్ని వెదుక్కుని వెళ్లిపోయారు. వాళ్లకు విధిగా చెయ్యవలసింది చేసి, మన ప్రేమను, భక్తిని చాటుకోవాలే  తప్ప, శోకిస్తూ కూర్చొని  వుండకూడదు. అలాగే, యిప్పుడు వున్న వాళ్ళు  కూడా, ఎప్పుడో ఒకప్పుడు పొయ్యే వాళ్ళే. వాళ్ళకోసం కూడా శోకించడం  బుద్ధిమంతుడు  చేసే పని కాదు. మనమైనా అంతే  కదా. మరణానికి భయపడడము, శోకించడము బుద్ధిమంతుడి  లక్షణం కాదు. 

అర్జునా ! నువ్వు జ్ఞాని మాట్లాడినట్టు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ  నువ్వు చేస్తున్నది జ్ఞాని చేసే పని కాదు, నువ్వు మాట్లాడుతున్నది జ్ఞాని మాట్లాడే మాటలు కాదు - అంటున్నాడు శ్రీకృష్ణుడు. జ్ఞాని అయిన వాడు  పొయ్యిన వాళ్ళ కోసం గానీ, వున్న వాళ్ళ కోసం గానీ శోకించడు. ఇకపై వచ్చేశ్లోకాలన్నీ  జ్ఞాన మార్గాన్ని గురించి చేసే  ఉపదేశమే.  యిది చదవడమే కాదు. దీనిపై బాగా ఆలోచించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నలు వేసుకోండి . సమాధానాలు వెదకండి . అప్పుడే, భగవద్ గీత బాగా ఆకళింపు అవుతుంది. మన జీవితాలు కూడా సార్థకం అవుతుంది. 

వ్యాసాలపైన - మీ అభిప్రాయాలను, విమర్శలను, అనుభవాలను కూడా నాకు మీరు తెలియ  జేస్తూ వుంటే చాలా బాగుంటుంది

సర్వే  జనాః సుఖినో భవంతు 

= మీ     

ఉప్పలధడియం   విజయమోహన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి